మాతృభాషలకు మరణశాసనం

  • 115 Views
  • 0Likes
  • Like
  • Article Share

ప్రవాసాంధ్రులకు తెలుగుపై మమకారం ఎక్కువ. మన రాష్ట్రంలో తెలుగుకు దక్కుతున్న ఆదరణ కంటే అమెరికా గడ్డపై దానికి అందుతున్న సత్కారాలధికం... ఈ మాటలను తరచూ వింటున్నాం. వినడమే కాదు అమెరికాలోని తెలుగు వారి మాతృభాషాభిమానాన్ని కళ్లారా చూస్తున్నాం. తమ పిల్లలకు తెలుగు నేర్పడానికి వారు చేస్తున్న కృషిని తెలుసుకుంటున్నాం. బాగుంది. మరి అమ్మభాషపై వారిలో ఈ స్థాయిలో అభిమానం ఉండటానికి కారణమేంటి? సొంతగడ్డకు దూరంగా ఉండటమేనా? లేదా అమెరికాలోని కాలమాన పరిస్థితులు ప్రవాసాంధ్రులను తమదైన భాష వైపు నడిపిస్తున్నాయా? భూతల స్వర్గంలా భావించే అమెరికాను భాషాపరంగా పరిశీలిస్తే ఎంతటి భయంకర వాస్తవాలు కనిపిస్తాయి?
     స్టాన్‌ఫోర్డ్‌ లా స్కూల్‌ (అమెరికా) విద్యార్థి రోహిత్‌ కుమార్‌... ‘ది హఫింగ్టన్‌ పోస్ట్‌’ పత్రికలో రాసిన ఈ వ్యాసాన్ని చదవండి. పై ప్రశ్నలన్నింటికీ సమాధానం లభిస్తుంది. ఎప్పుడో తాతల తండ్రుల కాలంలో అమెరికాలో స్థిరపడ్డ ఉత్తర భారతీయ కుటుంబానికి చెందిన రోహిత్‌ మాటల్లో అమెరికా అసలు రూపం దర్శనమిస్తుంది. 
ఊహ
తెలిసిన తర్వాత ఈ ప్రపంచానికి నన్ను నేను పరిచయం చేసుకుంది హిందీలో. అది ఉత్తర భారత దేశ భాష. కానీ, నేను ప్రాథమిక పాఠశాలలో చేరాక పరిస్థితి మారిపోయింది. అక్కడ నా భాషపై జాలిపడేవాళ్లు ఎక్కువయ్యారు. ఆ వాతావరణంలో ఎక్కువ సమయం గడపడం వల్ల నేను నా అమ్మభాషకు దూరమయ్యా. తరాల తరబడి మా జాతి నాలుకలపై నాట్యం చేస్తూ వస్తున్న అక్షరాలను మర్చిపోవడం మొదలుపెట్టా. క్రమంగా నా మాతృభాష మెదడులోని చీకటిపొరల్లోకి వెళ్లిపోయింది. చివరికి... అమెరికాలోని వలసదారుల పిల్లల మాదిరిగానే ఆంగ్లంలో మాత్రమే ధారాళంగా మాట్లాడగలిగే స్థితికి చేరుకున్నా.
      కలిసికట్టుగా పనిచేసే వివిధ శక్తుల కారణంగానే అమెరికాలోని వలస జాతులు తమ భాషలను పొగొట్టుకున్నాయి. ప్రసార మాధ్యమాలు, విద్యావ్యవస్థ, ఉద్యోగావకాశాలు... అన్నీ ఈ భాషా విధ్వంసంలో పాత్రధారులే. వీటన్నింటికీ మించి వలస జాతి ప్రజల సొంత గొంతులను కత్తిరించిన మారణాయుధం మరొకటుంది. అదే శతాబ్దాల తరబడి జుగుప్సాకరమైన వారసత్వ సంపదగా వస్తున్న సామ్రాజ్యవాదం. దీని వల్లే శ్వేత జాతేతర ప్రజలందరి మనస్సుల్లో సొంత సంస్కృతులు, భాషలపై తృణీకారభావం మొదలైంది. తమవైన కట్టు బొట్టు, మాటలు అనాగరికమైనవన్న విషభావనను వలసదారులందరిలోనూ నింపింది ఈ సామ్రాజ్యవాదం.
      ప్రజలను విభజించి, వారికంటూ సొంత అస్తిత్వం లేకుండా చేసి, తమ అధికార చట్రంలోకి తెచ్చుకోవడానికి సామ్రాజ్యవాదులు అమలు చేసిన వ్యూహం... భాషా విధ్వంసం. ఒక జాతికి సొంత గొంతు అంటూ లేకుండా చేసి... తమ పలుకునే వారి మాటగా మార్చి తమలో ‘కలిపేసుకున్నారు’ సామ్రాజ్యవాదులు. ఇక్కడ కలిపేసుకోవడం అంటే... ఆ జాతి మూలాలను ఛిద్రం చేయడం. ఈ పద్ధతిలోనే అమెరికా భూమిపుత్రులను (నేటివ్‌ అమెరికన్స్‌) వారి తెగల నుంచి వేరు చేసి తెచ్చి ఆంగ్ల మాధ్యమ పాఠశాలల్లో పడేశారు. అక్కడ వారి అమ్మభాషలను మాట్లాడుకోనీయకుండా కట్టడి చేశారు. ప్రస్తుత తరం వలసదారుల వారసులు (నాతో సహా) తమ వారసత్వ సంపద(భాష)కు దూరమవ్వడానికి కారణం... ఇప్పటికీ అమెరికన్‌ పాఠశాలల్లో అమలవుతున్న భాషా సామ్రాజ్యవాద పద్ధతులే. అయితే, గతంలోలా ఇవి బహిరంగంగా కనపడటం లేదు.
      భాష అనేది మన ఆలోచనలకు ఒక రూపమిస్తుంది. మన మీద మనకు, ప్రపంచం మీద మనకు ఓ దృష్టిని ప్రసాదిస్తుంది. ఏ జాతికి సంబంధించిన భాష అయినా మానవ జీవితాన్ని తనదైన దృష్టికోణంలో ఆవిష్కరిస్తుంది. జాతికంటూ ఓ ప్రత్యేకతను తెచ్చిపెడుతుంది. నేను నా హిందీని కోల్పోయినప్పుడు... నా ప్రజలతో సంబంధాలను కూడా కోల్పోయాను. వారితో నన్ను అనుసంధానించుకునే అవకాశానికి దూరమయ్యా. మాతృభాషంటూ లేకపోతే ఏ జాతీయుల మధ్యా ఎలాంటి గాఢానుబంధమూ అభివృద్ధి చెందదు. భాషకు దూరమైతే మనదైన సమూహం నుంచి కూడా దూరమైపోతాం. కేవలం వ్యక్తులుగా మిగిలిపోతాం. అలాంటప్పుడు మనకు ఒక అమెరికన్‌తో ఉండే బంధమే సాటి హిందీ వ్యక్తితో కూడా ఉంటుంది. అది చివరికి ఒక జాతిగా మనల్ని బలహీనులను చేస్తుంది. అమెరికాలో ఇప్పటి వరకూ జరిగింది ఇదే. 
      మనం ఇప్పటికీ స్వచ్ఛమైన, సమానత్వపు వ్యవస్థకు దూరంగా బతుకుతున్నాం. వ్యవస్థతో పనిపడ్డ ప్రతిసారి శ్వేతజాతేతర ప్రజలకు పక్షపాతంతో కూడిన అనుభవాలే ఎదురవుతున్నాయి. ప్రతిసారి, ప్రతిచోటా ఇదే దుస్థితి. అర్థ, అధికార బలాలు మనకు తక్కువ. సామాజిక, రాజకీయ అధికారానికి మనం దూరంలో ఉన్నాం. స్వచ్ఛమైన తిండి మనకందదు. పట్టణాల్లోని కాలుష్యభరితమైన ప్రాంతాల్లో  మనం నివసించాలి. కలుషితమైన నీటితో దాహం తీర్చుకోవాలి. ఇవన్నీ మనం మనదైన అస్తిత్వాన్ని కోల్పోవడం వల్ల అనుభవిస్తున్న కష్టాలు. సొంత భాషను పోగొట్టుకోవడం వల్లే మనం విడిపోయాం. అమ్మభాషను కాపాడుకోవడం ద్వారా మాత్రమే మనం శక్తివంతమైన సమూహంగా ఎదగగలం. మన భాష మనల్ని ఒకే జట్టుగా కలిపి ఉంచుతుంది. మన వారితో మన భాషలో మాట్లాడటం ద్వారా మన సంస్కృతిని సజీవంగా ఉంచుకోగలం. ఇదే మనకు గర్వకారణం. ప్రస్తుతం అమెరికాలోని మన పరిస్థితి బాగుపడాలంటే భాషను బతికించుకోవడం ఒక్కటే మార్గం.
      నాలాంటి వలసదారుల పిల్లలందరినీ శ్వేత జాతి సంస్కృతిలోని అల్పసంఖ్యాక వర్గాల వారిగా జమకడుతున్నారు. చారిత్రకంగా చూసినా, ప్రస్తుత కాలమాన పరిస్థితుల దృష్ట్యా చూసినా... ఇక్కడి సమాజాన్ని యురోపియన్‌ అమెరికన్‌ సంస్కృతికి ఆలవాలంగా మార్చినట్లు కనిపిస్తోంది. మేం వెనకబడిన వారమని, మా సంస్కృతులు తక్కువ స్థాయివనే మాటలు తరచుగా వినిపిస్తున్నాయి.
      నేను బర్కిలీలో కళాశాల జీవితాన్ని ప్రారంభించినప్పుడు హిందీని తిరిగి నేర్చుకోవడం ప్రారంభించా. హిందీ తరగతులకు వెళ్లా. తర్వాత భారతదేశానికి ప్రయాణమయ్యా. అక్కడికి వెళ్లాక ఆర్నెల్ల పాటు వేరే ఆలోచనను దరిచేరనీయకుండా హిందీని మాత్రమే శ్వాసించా. ధ్యానించా. కలలో కూడా దాన్నే ఉచ్చరించా. దాంతో నా భాషలో నేను మళ్లీ ధారాళంగా మాట్లాడగలిగే స్థాయిని అందుకున్నా. మాతృభాషతో అనుబంధం ఉన్నప్పుడు మాత్రమే మన సంస్కృతిని సరిగ్గా అర్థం చేసుకోగలం. మనదైన సంస్కృతిలో దాగున్న విజ్ఞానమంతా భాషతోనే మనకందుతుంది. నేను హిందీని తిరిగి తెచ్చుకున్నాక నా జీవితం వర్ణరంజితమైంది. నా ఆలోచనలు మారాయి. అది ఎలా అంటే చిన్న ఉదాహరణ చెప్పుకోవాలి. హిందీలో నిన్న, రేపులను చెప్పడానికి ఒకే పదం వాడతారు. ‘కల్‌’ అని. అంటే, కాలమనేది ఆద్యంతాలకు అతీతంగా చక్రంలా పరిభ్రమిస్తూ ఉంటుందనేగా. ఆంగ్లం మాత్రమే వచ్చినవాడికి ఈ తత్వంలోని వాస్తవం బోధపడదు. ఎందుకంటే వారి సంస్కృతి రేఖామాత్రమైంది.
      పురాతనమైన, చారిత్రకమైన నా సంస్కృతితో తిరిగి నన్ను నేను అనుసంధానించుకున్నా. అది నాకు గొప్ప మానసిక బలాన్నిస్తోంది. ఏ వలసజాతి అమెరికన్‌ అయినా తన సంస్కృతితో, సమూహంతో బంధాన్ని కొనసాగించడానికి ఉపయోగపడే ఉత్ప్రేరకంగా అమ్మభాష పని చేస్తుందని అనుభవపూర్వకంగా తెలుసుకున్నా.


వెనక్కి ...

మీ అభిప్రాయం