పదం పద్యం పట్టి నిలిచెను...!

  • 33 Views
  • 0Likes
  • Like
  • Article Share

    పి.వి.బి.శ్రీరామమూర్తి

  • విజయనగరం
  • 9440059067
పి.వి.బి.శ్రీరామమూర్తి

పద్యం తెలుగువారికి వరం. ముద్రణా యంత్రాలు లేని రోజుల్లో తాళపత్ర గ్రంథాల్లోనూ, ఆ తరువాత ముద్రణా యంత్రాలు వచ్చిన తొలి రోజుల్లో లభించిన కవుల కావ్యాలు, పద్యాలు - శిలాశాసనాల్లో నాటి రాజుల, జమీందారుల కీర్తులూ, అపకీర్తులను మన కళ్లముందు నిలబెట్టిన నిలువెత్తు సత్యాలు. నాటి సమాజానికి ప్రతిబింబాలు. జరిగిన సంఘటనలకు సాక్ష్యాలు.
పదో శతాబ్దపు మలిభాగంలో జానపదుల వరకే ఉన్న తెలుగు పదాలను ఏరుకుని- ఒక కావ్య నిర్మాణానికి పునాది వేసిన ఘనత నన్నయభట్టుకు దక్కింది. అప్పటి చాళుక్య రాజైన రాజరాజనరేంద్రుడు పంచమవేదంగా వినుతికెక్కిన మహాభారతాన్ని తెలుగులో అనువదించమని అర్థించాడు.
‘‘జననుత కృష్ణద్వైపాయన ముని వృషభాభి హిత మహాభారత బద్ధ
నిరూపితార్థమేర్పడ తెనుగున రచియింపు మధిక ధీయుక్తి మెయిన్‌’’

      అని నన్నయ రాసిన ఈ పద్యం రాజరాజనరేంద్రుని కీర్తిప్రతిష్ఠలను గ్రంథస్తం చేసి చిరస్థాయిగా నిలిచేట్లు చేసింది.
      కారణాలేవైనా 200 సంవత్సరాల పాటు మహాభారత రచన అర్థాంతరంగా ఆగిపోయింది. వినిపిస్తోన్న సత్యం శైవవైష్ణవుల తగాదాలతో మహాభారత రచన క్లిష్టమైంది.
      ఆ పరిస్థితుల్లో శివకేశవులను ఒకటిగా చేసి మహాభారత రచన కొనసాగించిన కీర్తి తిక్కనకు దక్కింది. శివకేశవులకు మూలవిరాట్టయిన హరిహరనాథుడు
      నా కలలో కనిపించి మహాభారత రచన కొనసాగించమన్నట్టు తిక్కన చెప్పాడు.
      ఆ సందర్భంగా చెప్పిన శ్లోకం... తిక్కన స్థానాన్ని కవిగానే కాక - ఒక సంస్కరణవాదిగా సమున్నతస్థానంలో నిలబెట్టింది. తెలుగు పదాలతో, నాటకీయ శైలితో, రసాభ్యుచిత బంధంగా తిక్కన మహాభారతాన్ని రచించాడు. దాని నిర్మాణానికి ఆయన చూపిన చొరవ, చేసిన ప్రతిజ్ఞ ప్రశంసనీయం!
      రామాయణ, మహాభారతాలు రాసిన తిక్కనాదులు ‘మహాభాగవతాన్ని’ తనకు విడిచినందుకు ఎంతో సంతోషించాడు సహజ పండితుడు పోతన. ఈయన తెలుగు సాహిత్యంలో ఎంత నిరాడంబరుడో, ఎంత ధైర్యస్థైర్యాలు కలవాడో ఈ పద్యం తెలియజేస్తోంది.
‘ఇమ్మను జేశ్వరాధములకిచ్చి పురంబులు వాహనమ్ములున్‌
సొమ్ములు గొన్ని పుచ్చుకుని సొక్కి శరీరము బాసి కాలుచే
సమ్మెట పాటులం బడక సమ్మతి శ్రీహరికిచ్చి చెప్పెనీ
బమ్మెర పోత రాజొకడు భాగవతంబు జగద్ధితంబుగన్‌’

 అని అన్నాడు.
      పోతనకు బావమరిదిగా చరిత్రపుటల కెక్కిన శ్రీనాథమహాకవి పద్యాలు... ఆయన  తన కావ్యాలను ప్రభువులకు అంకితమిచ్చి, సొమ్ములు తీసుకొని, విలాసవంతమైన జీవితాన్ని అనుభవించినట్టు సాక్ష్యమిస్తున్నాయి. తనను ఆదరించిన కవులు అంతరించాక - పోషించే నాథుడు లేక శ్రీనాథుడెన్నో అవస్థలు పడ్డాడు. తెలుగు దేశమంతా పర్యటించాడు. అలా పర్యటించిన సందర్భంలో పల్నాటిసీమకు వెళ్లిన శ్రీనాథుడు సుష్ఠుకరమైన భోజనానికీ ఇబ్బంది పడినట్లు - ఆయనవిగా చెబుతున్న చాటువులు తేటతెల్లం చేస్తున్నాయి.
‘‘చిన్నచిన్న రాళ్లు చిల్లర దేవుళ్లు
నాగులేటి నీళ్లు నాపరాళ్లు
సజ్జజొన్న కూళ్లు - సర్పంబులును తేళ్లు
పల్లనాటి సీమ పల్లెటూళ్లు’’
అని నాటి పల్నాటిసీమ దుస్థితిని కళ్లకు కట్టినట్లు వర్ణించాడు. ఇంకా ఆయన కోపం చల్లారలేదు.
‘‘రసికుడు పోవడు పల్నా
డెసగంగా రంభయైన యేకులెవడకున్‌
వసుధేశుడైన దున్నును
కుసుమాస్త్రుండైన జొన్నకూడే కుడుచున్‌’’ 

అన్నాడు. తాగటానికి నీళ్లు కూడా కరవైన స్థితిలో - 
సిరిగల వానికి చెల్లును
తరుణులు పదియారు వేల తగ పెండ్లాడన్‌
తిరిపముగ కిద్దరాండ్రా
పరమేశా! గంగ విడువు పార్వతి చాలున్‌!

అనగానే నీళ్లులేని ఆ నూతిలో నీళ్లు పడ్డాయట.. ఈ పద్యాలు శ్రీనాథుని కవితా శక్తిని నిరూపిస్తాయి. చివరి రోజుల్లో అష్టకష్టాలు పడి చనిపోతున్నపుడు కూడా - 
దివజకవివరు గుండియల్‌ దిగ్గురనగ
అరుగుచున్నాడు శ్రీనాథుడమరపురికి

ఈ పద్యం అతన్ని సమున్నత కీర్తి శిఖరం మీద నిలబెట్టింది!
      మనుమసిద్ధి ఆస్థానకవి తిక్కన. అతని సేనాని ఖడ్గతిక్కన. నిజానికి రణతిక్కన మహాశూరుడు. అయితే మనుమసిద్ధికి కాటమరాజుకూ జరిగిన యుద్ధంలో - సైన్యం కోల్పోయి ఒంటరైన ఖడ్గతిక్కన ఇంటికి రాగా - అతని ధర్మపత్నీ, వీరపత్నీ అయిన చానమ్మ పలికిన పలుకులు - 
‘‘పగఱకు వెన్నిచ్చినచో
నగరే నిను మగతనంపు నాయకులెల్లన్‌
ముగురాడు వారమైతిమి
వగపేటికి జలకమాడ వచ్చినచోటన్‌’’

అని యుద్ధం నుంచి వచ్చిన భర్తను నిరసించగా, తల్లి వడ్డన చేసింది. విరిగిన పెరుగు వేయగా, పెరుగు విరుగుటకు కారణమేమని ప్రశ్నించగా - 
అసదృశముగ నరివీరుల
పస మీఱగ గెలవలేక పందక్రియన్‌ నీ
వసివైచి తిరిగి వచ్చిన
పసులున్‌ విరిగినవి తిక్క! పాలున్‌ విరిగెన్‌!

      అని పిరికిపందవై తిరిగి వచ్చిన నిను చూసి - పశువుల మనసు విరగ్గా - పాలు విరిగినవి - విరిగిన పాలు తోడుపెట్టగా మజ్జిగ విరిగినదని చెప్పగా - పౌరుషంగా రణతిక్కన కదనరంగానికి తిరిగి వెళ్లాడట! ఈ పద్యాలు రణతిక్కన - ఆయన భార్య, తల్లికి గల దేశభక్తినీ, పౌరుషాన్నీ చాటి చెప్పాయి. 
      రాజుల కాలంపోయి, జమీందారుల పాలన వచ్చింది. జమీందారులు కవులను పోషించారు. ఆయా సందర్భాల్లో జమీందారుల ఔదార్యాన్నీ, విక్రమాన్నీ, దానగుణాల్నీ కవులు వర్ణించిన తీరు ఆ జమీందారుల కీర్తిప్రతిష్ఠలను చిరస్థాయిగా చరిత్రలో నిలిపాయి. విజయనగర సంస్థానాధీశుడు పూసపాటి విజయరామ గజపతి ఆస్థానకవి ఆడిదం సూరకవి. పెద్దాపురం సంస్థానాన్ని దర్శించిన సందర్భంలో -  అక్కడి ఆస్థానంలో తన రాజు గొప్పతనాన్ని వర్ణిస్తాడు. ఈ పద్యం ప్రసిద్ధమైంది. చమత్కార భరితమైంది.
‘‘రాజు కళంకమూర్తి రతిరాజు శరీర విహీను డంబికా
రాజు దిగంబరుండు మృగరాజు గుహంతర సీమ వర్తివి
భ్రాజిత పూసపాడ్విజయ రామనృపాలుడు రాజుగాక యీ
రాజులు రాజులా పెనుతరాజులుగాక ధరా తలంబునన్‌’’

      ఈ పద్యంలో కవి ‘రాజు’ శబ్దాన్ని అనేకార్థాల్లో వాడటం గమనార్హం. రాజు - చంద్రుడు, కళంకమూర్తి, రతిరాజు - మన్మథుడు, అంబికారాజు - శివుడు; మృగరాజు-సింహం; తరాజు-తూనిక వీళ్లంతా రాజులే అయినా ప్రతి వారిలోనూ ఏదో లోపం ఉంది ఒక్క విజయరామరాజు మాత్రం ఏ లోపం లేనివాడు అన్న కవి వాక్కుల్లో తన రాజుపట్ల గాఢాభిమానాన్ని తెలియజేస్తోంది. ఈ పద్యం వల్ల విజయరామరాజు కీర్తి దిగంతాలకు వ్యాపించింది.
      ఇక - కవి చౌడప్ప పేరు వినని తెలుగు సాహితీపరులుండరు. మాట కటువుగా ఉన్నా - అందరూ చదువుకోటానికి అవకాశం లేకపోయినా ఉన్నది ఉన్నట్టు చెప్పే సాహసం గలకవి చౌడప్ప.
‘పది నీతులు, పది బూతులు, పది శృంగారంబు
సభల చదివిన వాడే యధికుడు’ అంటాడు.
      పురాణాలూ, కావ్యాలూ, ప్రబంధాలూ, శతకాలూ - సహస్రాధికంగా వచ్చిన తర్వాత రోజుల్లో కొత్తగా చెప్పటానికేం మిగల్లేదు. ఆ సమయాల్లో రాజుల్ని మెప్పించడానికి - రాణులతో కులికే రాజుల మెప్పు పొందడానికి కొంతమంది శృంగారం చిందించే పద్యాలను వినిపించి రాజుల మెప్పులు, సత్కారాలూ పొందటం ఆనవాయితీగా మారింది. వీళ్లకి శాస్త్ర పాండిత్యాల్లో ప్రతిభ అంతగా లేకపోయినా శృంగారపద్యాలు చెప్పి జీవనోపాధి గావించేవారు. దానిని కప్పి పుచ్చుకొని - వారే పండితులుగా, అధికులుగా చెలామణీ అవుతున్నపుడు కోపంతో చౌడప్ప పై పద్యాన్ని చెప్పి - ఆనాటి సభ - వాతావరణాన్ని మన కళ్లముందుంచాడు.
      విజయనగర సంస్థానానికి చెందిన నీలాద్రిరాజు కోరిక మేరకు ‘చంద్రరేఖా విలాపం’ అనే ప్రబంధాన్ని కూచిమంచి జగ్గకవి  రాశాడు. నిరాదరణకు గురై కోపంతో ‘చంద్రరేఖా విలాపం’ అనే అశ్లీల కావ్యాన్ని రాసి, ఆ రాజు చరిత్రలో అవమానాల పాలైనట్లు చేశాడు. 
      18వ శతాబ్దిలో పిండిప్రోలు లక్ష్మణకవి ‘రావణ దమ్మీయం’ అనే ద్వ్యర్థి కావ్యం రాశాడు. ఈ కవి రామచంద్రపుర సమీపాన కుయ్యేరు నివాసి. ధర్మారాయుడనే వ్యక్తి ఈయన 24 ఎకరాల భూమిని హరించగా - కవి ధర్మారాయుని రావణునితో పోల్చి దూషిస్తూ రాసిన ఈ కావ్యంలో ఒక అర్థం స్వీయకథ - మరో అర్థం రామాయణాన్ని రమ్యంగా రాశారు. 
‘‘జ్యేష్ఠుడా! లక్ష్మణాగ్రజ క్షేత్రమీవు - వదలకుండెన మోసంబువచ్చు నింక!
చండ నిర్భీక వనచారి పిండిప్రోలి కవికుల వరుతో రిపుత ముఖ్యముగ వలదు!

      ఇవి విభీషణుడు రావణునితో రామాయణార్థంలో - జ్యేష్ఠుడా! అన్నా, రావణా! లక్ష్మణాగ్రజ క్షేత్రము - సీతను;
      ఈవు, వదలకుండిన, మోసంబువచ్చు! ఇక మీద; చండనిర్భీక - యమదూతల్లా భయంలేని, పిండి - కోతిమూకకు, ప్రోలికి - లంకకు అవికులవరుతో (అవి-సూర్యుడు) సూర్యవంశ శ్రేష్ఠుడైన రామునితో, రిపుత- వైరం, ముఖ్యంగా వలదు అని పిండిప్రోలు లక్ష్మణకవి కథగా - జ్యేష్ఠుడా - అన్నా; లక్ష్మణాగ్రజ క్షేత్రము - బ్రాహ్మణుడైన లక్ష్మణకవి క్షేత్రం - ఈవు వదలకున్న మోసం వస్తోంది. చండ - నిర్భీకు - కవన (కవియ్యచారి), పిండిప్రోలు కవి కులవరునితో - శత్రుత్వం వస్తుంది.
      ఇలా ద్వంద్వార్థాలతో ధర్మానాయకుని చెడ్డపేరును గ్రంథస్థం చేశాడు లక్ష్మణకవి.
      ఇలాగే దుర్భాక వేంకటేశ్వరశాస్త్రి, విష్ణుభట్ల సుబ్రహ్మణ్యేశ్వర కవి, వేములవాడ భీమకవి, తిరుపతి వేంకటకవులు కూడా పలు సందర్భాల్లో అద్భుతమైన పద్యాలు చెప్పారు.
      గద్యంలో ఎంత తిట్టినా, ఎంత పొగిడినా నిలవని మాటలను ఛందోబద్ధం చేస్తే శాశ్వతంగా నిలుస్తాయి. అందుకే - బలవంతంగా నట్టనడి వీధిన బంధుగణం మధ్యలోనున్న కన్యను చేపట్టబోయిన రాజు కథను అక్షరరూపం చేస్తూ మహాకవి గురజాడ రాసిన - 
పట్టమేలే రాజుపోయెను
మట్టి కలిసెను కోట పేటలు
పదం పద్యం పట్టి నిలిచెను కీర్తులపకీర్తుల్‌

 వంటి వాక్యాలు చిరస్మరణీయాలు!


వెనక్కి ...

మీ అభిప్రాయం