మన తెలంగాణ కోటి పద్యాల వీణ

  • 42 Views
  • 0Likes
  • Like
  • Article Share

    కోవెల శ్రీలత

  • (కోవెల సుప్రసన్నాచార్య గారి కుమార్తె)
  • హన్మకొండ
  • 7702467650
కోవెల శ్రీలత

కావ్యకన్యల కంఠసీమలను అచ్చతెలుగు పద్యరత్నమాలలతో అలంకరించిన కావ్యకర్తల సాహితీక్షేత్రం తెలంగాణం. పల్లీయుల పలుకుబడులకు కావ్యగౌరవమిచ్చిన పాల్కురికి నుంచి మాండలిక శబ్ద మందారాలతో కవితామాలికలను గుదిగుచ్చిన సినారె వరకూ... ఇక్కడి కవులందరికీ అమ్మభాషంటే అలవిమాలిన అభిమానం. జనం భాషంటే తరగని మమకారం.
ఓయమ్మ! నీ కుమారుడు 
మా యిండ్లను పాలు పెరుగు మన నీడమ్మా
పోయెద మెక్కడికైనను 
మాయన్నుల సురభులాన మంజుల వాణీ (భాగవతం - పోతన)
      రెండువేల ఏళ్ల చరిత్ర తెలంగాణ తెలుగు సాహిత్యానిది. కొత్త ప్రయోగాలు, ప్రక్రియలు, సరికొత్త పరిశోధనలు, నిరంతర అన్వేషణలతో సాహిత్య సరస్వతికి నిత్య అక్షరాభిషేకాలు జరిపించిన గడ్డ ఇది. వృత్తులు, ప్రవృత్తులతో సంబంధం లేకుండా అచ్చమైన తెలుగులో అద్భుత కావ్యసృజన చేసిన మహానుభావులకు జన్మనిచ్చిన ప్రదేశమిది. 
      తెలంగాణలో అసలు కవులు లేరు, కావ్యాలే లేవు అన్న మాటలకు సమాధానంగా 1934లో ‘గోలుకొండ కవుల సంచిక’ను తీసుకొచ్చారు సురవరం ప్రతాపరెడ్డి. దాదాపు 300 మంది తెలంగాణ కవుల ముఖచిత్ర సహిత జీవిత విశేషాలతో, కావ్యాల వివరాలతో ఈ పుస్తకాన్ని రూపొందించారు. అచ్చ తెనుగు కావ్యాలు, నిరోష్ఠ్య రామాయణాలు, క్షేత్రమాహాత్మ్యాలు, శతకాలు, చిత్రబంధ కవిత్వాలు, యక్షగానాలు, హరికథలు ఇలా అనేక ప్రక్రియలను సృష్టించిన విశ్వామిత్రుల గురించి దీనిలో వివరించారు. 
      ఇక్కడి కావ్యాల్లో భాష చాలా స్వచ్ఛంగా ఉంటుంది. దీర్ఘ సమాసాలు, భారీ అలంకారాలు ఉండవు. అలాగని ఛందస్సుకు వ్యతిరేకంగా ఉండదు. అలంకార శాస్త్ర పద్ధతిని అనుసరించి విలక్షణంగా, అర్థవంతంగా ఉంటుంది ఇక్కడి కావ్యభాష. 
      తెలుగు సాహిత్య చరిత్రలోనే ఒక ఛందస్సును (ద్విపదను) ప్రయోగించి జాను తెలుగులో కవిత్వ సృష్టి చేసిన పాల్కురికి సోమనాథుడు ఇక్కడి వాడే. స్తుతులు, శతకాలు, గద్యాలు, పురాణాలు, అష్టకాలు, అనుభవాలు ఏవి రాసినా ప్రజల కోసం రాయాలనుకున్నాడు సోమన. ప్రజలకే చెందాలనుకున్నాడు. అందుకే దేశి ఛందస్సులో మౌఖిక సంప్రదాయానికి చెందిన ద్విపద, రగడ లాంటి వాటినే వాడాడు. జనుల నిత్య వ్యవహార భాషలో రచన చేసి, ప్రజలందరూ చదవడానికి యోగ్యంగా చేశాడు. 
      శిష్ఠసాహిత్యం చదవటానికి అనుకూలంగా ఉంటే, దేశి సాహిత్యం గానానికి అనుకూలంగా ఉంటుంది. సోమనాథుడి గ్రంథాల్లో దేశీ పదాలు ఎక్కువగా కనిపిస్తాయి. పండితారాధ్య చరిత్ర, బసవపురాణాల్లో ఆనాటి తెలంగాణ దేశీ పదాలు కనిపిస్తాయి. ఉదాహరణకు పండితారాధ్య చరిత్రలోని కొన్ని ప్రయోగాలు...
ఒచ్చెల్ల    -    నొచ్చెల్ల నాకిది యోగ్యమే జియ్య (సంతాపం, ఆశ్చర్యం తెలిపేది)
అఱికాళ్ళ    -    అఱికాళ్ళ దప్ససర్వాంగంబులంద (అరికాళ్లు)
లెక్కగొనని    -    ఘనుని ఘంటా కర్ణు గణనాధులెక్కగొనవి (లెక్కకు రానన్ని)
బొడ్డికన్నులు    -    బొడ్డుకన్నులు ముడిబామలు వ్రేల్సెవులు (లోతైన కన్నులు)
పెండెటక్లుగా    -    కలయజేతులు బెందెటకట్లుగా చూసి (అల్లుకున్నట్లుగా)
పంటింప    -    పంటింపకెదురగా బఱతెంచి కత్తయును (పట్టుదలగ)
చిలుకొయ్య    -    చిలుకొయ్య దగిల్చి చేతికత్తియును (నాగదంతకం)
బత్తురాలు    -    గ్రాలుచు ధరణి నిక్కపు బత్తురాలు (భక్తురాలు)
సోమనాథుడి రచనలో అచ్చ తెలుగు సామెతలు అందంగా ఇమిడిపోతాయి. కావాలంటే చూడండి...
వంటని దుర్వ్యసనంబుల - పెంటకుగా కీశుభక్తి పెంపునకుం గా
కుంట జెడు భక్తుడాసల - రెంటిని నెడతాకి చెడ్డ రేవని భంగిన్‌
      అభినవ పోతన బిరుదాంకితులు వానమామలై వరదాచార్యులు. ‘పోతన చరిత్రమ’నే 12 అశ్వాసాల మహాకావ్యాన్ని రాశారు. భాగవత సృష్టికర్త జీవిత విశేషాలతో పాటు ఆనాటి సాంఘిక ఆర్థిక పరిస్థితులు, పల్లెల సౌందర్యాన్ని కళ్లకు కట్టారు. వరదాచార్యులు రాసిన అనేక కావ్యాల్లో ‘విప్రలబ్ద’ కూడా ఒకటి. ఇందులోని భాష  పాఠకుని మనసును పూర్తిగా గ్రామీణ వాతావరణంలోకి తీసుకెళ్లిపోతుంది. ప్రకృతి వర్ణనలు అద్భుతంగా ఉంటాయి. దంపతుల సంయోగ వియోగ శృంగారములను, పునస్సమాగమాన్ని వర్ణిస్తూ జానపద జీవిత మాధుర్యాన్ని చవిచూపిస్తారు వరదాచార్యులు. ఈ కావ్యంలోని ‘‘వర్షాశీర్షిక’ లోని ఓ ఘట్టం...
వచ్చెను వచ్చెను వర్షాలు - మా
వసుధారాణికి తలంబ్రాలు
కత్తులు కత్తులు కలిసిన యట్టులు
ఉత్తర దిక్కున ఉరిమింది - 
కనుపాపల చెక్కని మెరిసింది
పాడుకరువులకు బాణాలు - మా
పంట చేలకవి ప్రాణాలు - మా
కాపుకన్నులకు ముత్యాలు - వరి
కఱ్రల నోళ్ళకు చనుబాలు.
      వరి కఱ్ఱలు అనేది తెలంగాణ మాండలికం. ఆనాటి తెలంగాణలో వాడుకలో ఉన్న పదాలెన్నో ఇప్పటి వారికి తెలియదు. వరదాచార్యుల రచనలో అచ్చతెలుగు పదాలు అడుగడుగునా కనిపిస్తాయి. చూడకే లక్ష్మి - ఆగమైపోతావు, వింటలేవా, అగపడుడలేవా, కూలిపడినవ్వులు, కబురు చేసేతుంటి, ‘గొట్టు - గోదా, గోదల్లు... ఇలాంటి పదాలు తెలంగాణ కావ్యభాషకు మరింత అందాన్ని చేకూర్చాయి.
కఱ్ణ నూలుగంటలేసి గంట జేన గొలుసు విడువ
మన్నే బంగారమనుచు మానవులకు తెలిసిరంగ
మాటల్లో చూపుల్లో మరుగు మందెట్టి
దొరవోలె వచ్చి ఎద దోచుకున్నాడు
రామచక్కని గుణము రాజంటి రూపు
ఆ మాటె నా మనసు నుయ్యేలలూపు
      దొర, రామచక్కని గుణము లాంటి పదాలతో చక్కటి కావ్యాలను సృష్టించడంలో ఇక్కడి కవులు వారికి వారే సాటి.
      దుక్కి దున్నుతున్న రైతు భావనలకు అభినవ పోతన అందించిన అక్షరాలను చూడండి.... 
దున్నవోయి దున్ను మడి దున్నవోయి దున్ను
వడి గల గిత్తల గట్టుక హడా! హై కహ్‌ - కెయ్యన’’
‘‘వంతల మిట్టలచాపి - అంతా సమమొనరించి
అందరకును సమజీవన మందుబాటులో నుండగ’’
‘‘కాపే తాకమునకంత కాపటించు కొలువసాగె
కఱ్ఱె ప్రాణులకు జీవగఱై యంచు తెలిసిరాగ
      వరదాచార్యుల సోదరులు వానమామలై జగన్నాథాచార్యులు రచించిన ‘రైతు రామాయణం’... తెలంగాణ గొప్ప కావ్యాలలో ఒకటి. ఇందులో తెలంగాణ మాండలికాన్ని కుప్పపోసినట్లుగా ప్రయోగించి అద్భుతమైన కావ్యభాషా నిర్మాణానికి మార్గనిర్దేశం చేశారు. 
      తెలుగు సాహిత్యంలో ‘విప్లవా’త్మకమైన మార్పులను తీసుకువచ్చి, రాజరికం, పెట్టుబడిదారీ వ్యవస్థపై తిరుగుబాటు చేసింది దాశరథి కృష్ణమాచార్య కవిత్వం.  దాశరథి మాట, పాట, కావ్యం అన్ని తెలంగాణానే. ఆయన కవిత్వంలో చాలా ప్రౌఢ పదజాలాన్ని వాడుతూనే తెలంగాణ మాండలికాన్ని సమున్నతంగా నిలబెట్టారు.
మజ్జిగ, పజ్ఞొనకూడు, కాకుంటే
సజ్జబువ్వ కోసరమై, లజ్జవిరిచి
చిరిగిన చీరలతో మజ్జగాలు తిరిగే పేదల
ఎంగిలి మెతుకులు దొంగిలించి
బంగారం పొంగించిన ధనికుల
మ్రింగాలని దొంగ చాటుగా కాలం
తొంగి చూచె నదుగదుగో!
      సి.నారాయణరెడ్డి ‘ఋతుచక్రం’లో రుతువుల వైశిష్ట్యాన్ని చెప్పారు. తెలంగాణ పల్లె జీవితం దీనిలో ఆవిష్కృతమైంది. ఇందులో ఆయన వాడిన అచ్చతెలుగు పదాల్లో కొన్ని...
      సవారి బండు, మిరప అండెము, అడ్డెము, ఏలపాట, గొల్కలు, మోటబావి, కాకగడ్డలు, ఉచ్చిలతము, ఇడుగు, ఎద,   పొంటెజాము, బహురూపుల వాడు, తుంటలు, ఆసామివ్యక్తి, ఉత్తకొంచెమువాడు, రుద్రాక్షపూలు, మాగబండు, బానిసను, బతుకమ్మపండుగ, కై చిప్పలు, గుంజుకొను, కొయ్యకాలు, తొలిచూరు, మట్టిబెడ్డలు, డప్పైయోగి.
      నారాయణ రెడ్డి కావ్యభాష ప్రౌఢమైనా... అలతి అలతి పదాల నిండుకుండ. 
మరునాటి వేకువను మా పెండ్లి వారల స
వారి బండ్లాగె మా ఊరి పార్శ్వమందు
ముందున్న బండిలో అందాలు చిదిమి పో
సిన మూర్తి నా వధూమణియు 
నేనున్నాము
ప్రొద్దు కర కర మండినపుడు
పొలము పొంతల తిరుగువారము
మోటబావులలోన బుడ బుడ
మునిగి యీంతల గొట్టువారము
      వరంగల్‌ జిల్లా మడికొండ... వానమామలై సోదరులు, ఆచార్య బిరుదురాజు రామరాజు లాంటి మహానుభావులు పుట్టిన నేల. ఇక్కడి నుంచే వచ్చిన ఉద్దండ కవులు పల్లా దుర్గయ్య, అనుముల కృష్ణమూర్తి. 1956లో ‘గంగిరెద్దు’ అనే పద్య కావ్యాన్ని ప్రచురించారు దుర్గయ్య. రైతు కుటుంబాల దుర్భర జీవన పరిస్థితులను సమర్థంగా చిత్రించిన రచన ఇది. 
పేద కాపున కున్నట్టి పెద్దయాస్తి
ఆవు మాత్రమే, అదియుగాదతని సొత్తు
కరణమున కప్పు క్రింద తాకట్టుపడియె
సాదకపు జీవమెప్పుడప్పేద గోవు
ఆవు కరణంబుదే, ముంతెడంత చల్ల
దినము నాతని యింట నందింపవలెను
పెరుగు పాలన్ని కాపువే, పెయ్యలన్ని
కరణమయ్యవి, మగ దూడ కాపుపాలు
‘ముంత, చల్ల, పెయ్య, అయ్య’ లాంటి పదాలు తెలంగాణ ప్రాంతంలో నిత్య వ్యవహారంలో ఉన్నవే.
      కవిత్వంలోని ప్రౌఢత్వాన్ని నాజూకుగా ప్రదర్శించటంలో గొప్పవారు అనుముల కృష్ణమూర్తి. 1967లో ‘సరస్వతీ సాక్షాత్కారం’ అనే రచనను ప్రచురించారు. 
ఇల ఆనంద రస ప్రవాహమున కంతే లేదు చిన్నారి దో
సిలితో ఎంతని త్రావ నోపుదము మా చిన్నారి కన్నాల రె
ప్పలలో నీ బహు కాంతి పుంజముల సంభాళింతు మేలాగు మా
మలినోద్యాన మనః కవాటముల నమ్మా ఎన్నడూ డ్పింతువే!
      అని ఆ చదువుల తల్లిని ప్రార్థిస్తాడు కవి. లోకంలో ఆనందం, దుఃఖం రెండూ ఉన్నాయి. ఈ రెండింటినీ సమానంగా అనుభవించే శక్తిని ఇమ్మని అమ్మవారిని వేడుకుంటాడు.
      తెలంగాణలో అధిక్షేప కవిగా పేరుపొందిన పేర్వారం జగన్నాథం కాకతీయ విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా పని చేశారు. చేతనావర్త కవుల్లో ఒకరాయన. సాగరతీరం, వృషభ పురాణం, గరుడపురాణం అనే కావ్యాలను  రాశారు. రైతుల వెతలపై బాగా అవగాహన ఉన్న కవి జగన్నాథం. రాజకీయ నాయకుల వాగ్దానాలు ఎండమావులవుతుంటే, రైతుల బతుకులు ఎలా మసిబారుతున్నాయో చక్కగా చెప్పారు..
పొద్దస్తమానం మోట కొట్టినా
దోనె ఆరదు దొయ్య బారదు.
      మనోహరమైన తెలంగాణ నుడికారం ఈ కావ్యంలో అడుగడుగునా కన్పిస్తుంది. ఇంకొక కవిత చూస్తే..
నత్తి నత్తిగా మాట్లాడకు
    అది పిరికివాని లక్షణం
వంగివంగి సలాములు కొట్టకు
    అది బానిస లక్షణం
అనవసరంగా గొంతు చించుకోకు
    అది పిచ్చివాని లక్షణం
కోటారు కొమ్మలపై గంతులు వేయకు
    అది కోతి లక్షణం
      తెలంగాణలో ఛందఃశిఖరం కోవెల సంపత్కుమారాచార్య. ఛందస్సుపై అపారమైన పరిశోధన చేశారు. వీరూ చేతనావర్త కవులలో ఒకరే. మొదట ఆచార్య కోవెల సుప్రసన్నాచార్యతో కలిసి జంట కవిత్వం చెప్పినా తర్వాత కాలంలో ఎవరి రచనలు వారే చేసుకున్నారు. వీరి ‘ఆముక్త’ అమూల్యమైంది. శ్రీకృష్ణుని లీలామానుష తత్త్వాన్ని తెలిపే కావ్యం.
ఎచ్చట స్వామి భావముదయించునో అచట ఆత్మవేదనల్‌
విచ్చుట తప్పదే చెలియ! వేణు విచిత్రామృత స్వనమ్ము, లా
యుచ్చులలో దగుల్కనుటయున్‌ మరి తప్పదికేమి సేత, నన్‌
మ్రుచ్చిలె కృష్ణదేవుని విమోహక సాధు కథా ప్రపంచముల్‌
      ఇంకొక చోట.
ఇవి ప్రేలాపనలంచు వెంచకువె స్వామి! తిన్నగా చూడుతా
నివి యేవొ యొక రోగ లక్షణములం చెంచున్‌ ననున్‌ గూర్చిమా
ధవ! మా యమ్మ తపించు నామెకు నిదంతా మెట్లుగా చెప్పుదున్‌
శ్రవణాలంకృత పద్మరాగ సుషమా సంచాలిత స్మేరమా!
      ‘‘సంచాలిత స్మేరమా’’ అనే అందమైన పదబంధంతో ఈ పద్యాన్ని అందమైన శిల్పంగా మలిచారు.
      కవితామార్గంలో ఒక నిండుతనాన్ని, ప్రయోగ ప్రౌఢిని చూపించిన వారు ఆచార్య కోవెల సుప్రసన్నాచార్యులు. ఇప్పటి వరకు 18 కవితా సంపుటాలు వెలువరించారు. ఆయన  ‘శతాంకుర’లో ఇతిహాస కావ్య లక్షణాలతోపాటు కాల్పనిక కవిత్వ లక్షణాలు ఉన్నాయి. తన జీవితానుభవాలకు సమష్టి మానవ జీవితానుభవం జోడించి మానవజాతి పరిణామ చరిత్రను చెప్పారు. ఈ కవితను చూడండి...
ఈ నా రచించిన కావ్యం నా సంతానం
ఈ జగజ్జీవన చైతన్య ధోరణికి
నూతనావిష్కారం
ముందు యుగానికి ఆధార భూమిక
నా మూలం ఆధార బిందువు
నేను వికసిస్తే వేయంచుల గొడుగును
      తెలంగాణ స్వాతంత్య్ర కవులలో ఒకరైన ‘రాజేశ్వర కవి’ అసలు పేరు అల్లూరి రాజేశ్వరరావు. ఆయన బాల్యమంతా వరంగల్‌ జిల్లా ఆత్మకూరు మండలం పెంచికలపేటలో గడిచింది. వృత్తి రీత్యా న్యాయవాది. ప్రవృత్తి రచన. ఈయన సృజనలు ఎక్కువగా భక్తిభావ గర్భితమైన గేయ, పద్య, ఛందస్సులో ఉంటాయి. పద్య, గేయ కావ్యాలు, హరికథలు, నాటకాలు, శతకాలతో పాటు ఎన్నో గేయాలు రచించారు. ఆయన సృజనల్లో ఒకటి....
ఎటలయ మయ్యెడు నాసా
పుటముల బైల్వెడలు గాలి భూసా నీవ
చ్చట మనసు నిలిపి సేవిం
చుటె మేలీశ్వరుని యతని చొప్పు వచింతున్‌
      తెలుగు తల్లికి విశిష్ట సేవ చేసిన ఎందరో సరస్వతీపుత్రికల జన్మభూమి తెలంగాణ. జ్ఞానమాంబ (ఖమ్మం మెట్టు), డి.లక్ష్మీనరసమ్మ (రామాయంపేట), లక్ష్మీబాయి (హైదరాబాద్‌), రాణీ వెంకట లక్ష్మాయమ్మ సర్దేశాయి (పాపన్నపేట), రత్నమ్మ (ఇప్పటూరు), ఆండాళమ్మ (గద్వాల), పురిగోటి ఆనందమాంబ (కొడిమ్యాల) లాంటి ఎందరో కవయిత్రులు  తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేశారు. 
      తెలంగాణలో లోకం చూడని కవులు ఎందరో ఉన్నారు. వారి రచనలను వెలుగులోకి తీసుకురావాలి. ఈ కృషి జరిగితే తెలుగు సారస్వతం మరింత వెలుగులీనుతాయి. 
      లోక భాష క్రమ పరిణామం చెందుతూ శాస్త్రభాష అవుతుంది. అదే క్రమంలో కావ్యభాషగా అవతరిస్తుంది. అజరామరంగా నిలుస్తుంది. ప్రాచీన కవుల రచనల్లోని అచ్చ తెలుగు పదాలను గుర్తించి, తిరిగి వాడుకలోకి తెచ్చుకోగలిగితే మన పదసంపద ఇనుమడి స్తుంది. అన్యభాషా పదాలతో సంకరమవుతున్న అమ్మభాష జవసత్వాలను సంతరించుకుంటుంది. 


వెనక్కి ...

మీ అభిప్రాయం