బుజ్జి బుజ్జి మాటలు... బంగారు మూటలు

  • 128 Views
  • 0Likes
  • Like
  • Article Share

    తెలుగు వెలుగు బృందం

పిల్లలు భాష ఎలా నేర్చుకుంటారు? బాగా నేర్చుకోవాలంటే తల్లిదండ్రులేం చేయాలి? అదేం ప్రశ్న! అభిమన్యుడు అమ్మ కడుపులో నుంచే పద్మవ్యూహం గుట్టును గుర్తు పెట్టుకున్నాడు. ప్రహ్లాదుడు ఉమ్మనీటిలో ఉన్నప్పుడే ఉపేంద్రుడి భక్తుడయ్యాడు. బొడ్డుతాడుతో బంధం తెగకముందే బిడ్డకు భాష వచ్చేస్తుంది. మనమేం చేయక్కర్లేదని అంటారా! మీ వాదన కొంత వరకూ నిజం కానీ పూర్తిగా కాదు. గర్భంలో ఉన్నప్పుడు పిల్లాడికి భాషాస్పృహ కలుగుతుంది కానీ... మాట్లాడటం వచ్చేయదు. పుట్టినప్పటి నుంచి అయిదేళ్లు వచ్చే వరకూ వివిధ దశల్లో వివిధ రూపాల్లో తను భాషా జ్ఞానం పెంపొందించుకుంటాడు. ఏ జాతి చిన్నారులైనా ఏ భాషనైనా నేర్చుకునే సమయ సందర్భాలు సమానమే. సార్వజనీనమైన ఆ సమయపట్టిక ఇది...  
      పసిపిల్లలు వారంతట వారే మాట్లాడటం నేర్చుకుంటారు కదా... మనం ప్రత్యేకంగా ఏం నేర్పించాలని తల్లిదండ్రులు అనుకోకూడదు. చిన్నారులు... వినడం, చూడటం, ఆడటం, అనుకరించడం, అనుసరించడం తదితరాల ద్వారానే భాషను నేర్చుకుంటారని గుర్తుంచు కోవాలి. మన వంతుగా సులభమైన పద్ధతుల్లో మనవైన పదాలు నేర్పే ప్రయత్నం చేయాలి. ఎన్ని కార్యక్రమాలతో హడావుడిగా ఉన్నా... ఇంట్లో పిల్లలు ఉంటే వారికి కచ్చితంగా సమయం కేటాయించాలి. కింద చెప్పిన పదమూడు మార్గాల్లో ప్రయత్నించి చూడండి... ఈ పండంటి బాబుకి ఎంత తొందరగా మాటలు వచ్చేస్తాయో, మీ బుజ్జాయికి ఎంత మంచి భాష అలవడుతుందో మీరే చూడండి.
1. వానా వానా వల్లప్ప లాంటి గీతాలను పిల్లల ముందు గట్టిగా చదవండి. వారు ఆ గీతంలోని సంగీతంతో అనుసంధానం అవుతారు. భాషతో బంధం ఏర్పరచు కుంటారు.
2. చిన్న చిన్న పాటలను పాడండి. కథలు చెప్పండి. అయితే... మీరు ఏం చేసినా కూడా మీ తలను, భుజాలను కదిలిస్తూ, ఆడిస్తూ చేయండి. పిల్లలకు ఆసక్తికరంగా ఉంటుంది. మీ మాటలపై ఇష్టం పెరుగుతుంది.
3. తన చేతులు, కాళ్లు, ముక్కు వంటి వాటిని స్పృశిస్తూ వాటి పేర్లను చెప్పండి. తనతో చెప్పించడానికి ప్రయత్నించండి. అలాగే తన చుట్టూ ఉన్న వస్తువుల పేర్లు, వాటి రంగులు, ఆకారాల గురించి వివరించండి. ఆ తర్వాత వాటిని చూపిస్తూ ‘అవేంటని’ అడగండి. పిల్లలు ‘ఊహ’లను ఇష్టపడతారు. కాబట్టి తప్పో ఒప్పో ఆ వస్తువును చూసి, ఏదో ఊహించుకుని ఏదో చెబుతారు. అలా అలా చిన్నగా అలవాటు చేసేస్తే సరి.
4. కథలు చెప్పడం ద్వారా, కాగితాలను చూపించడం ద్వారా, బయటకు తీసుకెళ్లడం ద్వారా కొత్త కొత్త పదాలను పరిచయం చేయండి.
5. నేరుగా పిల్లాడితో సంభాషించండి.   పదాలను మీరు స్పష్టంగా పలకండి. పూర్తి వాక్యాలను మాట్లాడండి. 
6. వారి ఇష్టాయిష్టాల గురించి ఎప్పుడూ అడుగుతూ ఉండండి.
7. పిల్లలు మధ్యమధ్యలో స్పందించేలా ఉండే కథలను చెప్పండి. ఏ కథ చెప్పేటప్పుడు ఎక్కువ కేరింతలు కొడుతున్నారో చూడండి.
8. పిల్లాడికి ఇష్టమైన కథను మళ్లీ మళ్లీ చెప్పండి. తనను తిరిగి మీకు చెప్పమని అడగండి.
9. తనకు అలవాటు అయ్యాయనుకున్న వస్తువుల పేర్లు చెప్పి బొమ్మలు వేయమని చెప్పండి. 
10. నిరంతరం ప్రశ్నిస్తూ ఉండండి. (ఉదా.. ఆ బొమ్మ ఎలా వేశావు) మీ ప్రశ్నకు సమాధానం చెప్పడానికైనా తను మాట్లాడతాడు. కొత్త పదాలను వినియోగిస్తాడు.
11. ఇంట్లో, బయట వివిధ వస్తువులను ఉపయోగిస్తూ చిన్నారులతో ఆడండి. ఆడేటప్పుడు ఆ వస్తువుల గురించి చెప్పడం మర్చిపోకండేం!
12. తనకిష్టమైన పనులు చేస్తున్నప్పుడు ఉత్సాహపరచండి. ఎందుకు ఇష్టమో చెప్పించండి. ఆ పనుల గురించి తనకెలా తెలిసిందో అడగండి.
13. తను పదాలు పలికేటప్పుడు జాగ్రత్తగా గమనించండి. స్పష్టతలో ఏమైనా తేడా గమనిస్తే ఇలా కాదురా అంటూ మీరు పలికి వినిపించండి. నేర్చుకుంటారు. అమ్మభాషకు ఔపోసన పట్టిన వారే ఇతర విద్యల్లోనూ రాణిస్తారు.


రెండు నెలలు - ‘ఊ..ఊ..’, ‘ఆ..ఆ..’, ‘ఈ...ఈ..’ అనే అజంత ధ్వనులతో మూలుగులు ప్రారంభిస్తారు.
ఆరు నెలలు - పసి పిల్లలు కొట్టే కేరింతలను జాగ్రత్తగా వింటే హలంతాలు స్పష్టంగా వినపడతాయి.
ఏడున్నర నెలలు - అమ్మానాన్న పేర్లను గుర్తుపెట్టుకుంటారు.
పది నెలలు - తమ చిట్టిచిట్టి డిమాండ్లను అమ్మానాన్నాలకు చెప్పడానికి తాము సొంతగా సృష్టించుకున్న వింత మాటలతో ప్రయత్నిస్తారు. (‘వాడేదో అంటున్నాడు కానీ అర్థం కావట్లేదు’ అని అనుకుంటూ ఉంటాం కదా)
పన్నెండు నెలలు - మొదటి సారిగా అత్త, తాతా అని మాటలొస్తాయి.
పద్నాలుగు నెలలు - చుట్టూ ఉండే వస్తువులను గుర్తుపట్టేస్తారు. వాటి పేర్లతో సహా
పద్దెనిమిది నెలలు - క్రియా పదాలను ఉపయోగిస్తూ (ఉదా: అదేంటి) 50 మాటల వరకూ మాట్లాడగలరు.
రెండేళ్లు - రెండు పదాలతో కూడిన వాక్యాలను మాట్లాడతారు (ఉదా: పాలు కావాలి) ‘నేను’, ‘నాది’, ‘వద్దు’ అన్న మాటలు, భావనలు ఇప్పుడే అలవాటు అవుతాయి.
మూడేళ్లు - దాదాపు 300 పదాలను ఉపయోగిస్తూ తమ ఆలోచనలను అమ్మానాన్నలతో చెప్పడానికి పెద్ద పెద్ద వాక్యాలను పలుకుతుంటారు. కథ చెబుతుంటే శ్రద్ధగా వింటారు. గుర్తుపెట్టుకుంటారు.
నాలుగేళ్లు - విశేషణాలను వాడుతూ పెద్దలతో చాలా చాలా మాట్లాడేస్తుంటారు. అన్నీ తెలుసుకోవాలన్న తపనతో ప్రశ్నలు అడుగుతుంటారు.
అయిదేళ్లు - 2500 పదాలను మాట్లాడగలరు. 14000 పదాలను అర్థం చేసుకోగలరు. భయం, కలలు వంటి అనుభవాలను వివరించగలుగుతారు.


వెనక్కి ...

మీ అభిప్రాయం