చేతులారంగ శివపూజ చేయవలయు

  • 41 Views
  • 0Likes
  • Like
  • Article Share

    డా।। ముదిగొండ ఉమాదేవి

  • హైదరాబాద్‌, 040 27425668
డా।। ముదిగొండ ఉమాదేవి

సోషలిస్టుపార్టీ నాయకుడు రామమనోహర్‌ లోహియా 1950వ దశకంలో ఒక సందర్భంలో మాట్లాడుతూ భారతదేశమంటే ఏమిటి? అని ప్రశ్నించి ‘శివుడు- రాముడు- కృష్ణుడు’ అని తానే జవాబు చెప్పారు. అంటే మొత్తం భారతీయ సాహిత్యం, సంస్కృతి, నాగరికత తరతరాలుగా యుగయుగాలుగా ఈ మూడు కేంద్రాలతోనే ముడిపడి ఉందని అర్థం.
      శివుడు అన్నప్పుడు మొత్తం శివపరివారం తీసుకోవచ్చు. అంటే గణపతి, కుమారస్వామి, వీరభద్రుడు, దుర్గ, కాలభైరవుడు, నంది, భృంగి ఇట్లా ఇదొక పరివారం. వీటన్నింటికీ అధిపతి శివుడు. మహాశివరాత్రినాడు పరమశివుని జననం జరిగింది. అంటే మనకు తెలిసినంత వరకు సృష్టి ఆ రోజున ప్రారంభమైంది. సృష్టి కల్యాణమే శివకల్యాణం. అందుకే వివిధ దేవాలయాల్లో మాఘబహుళ చతుర్దశినాడు రాత్రి శివకల్యాణోత్సవం నిర్వహిస్తారు.
      సాహిత్యానికి సంబంధించినంత వరకు శివ ప్రసక్తి ఉన్న తొలిగ్రంథం ఋగ్వేదంలోనే కనిపిస్తుంది. అందులో శతక సదృశమైన మంత్రాలు ‘తన్మేమనః శివ సంకల్పమస్తు’ అంటూ మంత్రాలు ఉన్నాయి. అలాగే రుద్ర సూక్తం, దుర్గాసూక్తం ఉన్నాయి. తైత్తిరీయ సంహిత చతుర్ధ అష్టకంలో రుద్రాధ్యాయం ఉంది. దీనినే ‘శతరుద్రీయం’ అంటారు. భారతదేశంలో ఈ గ్రంథానికి ఉన్న ప్రాధాన్యం మరిదేనికీ లేదు. మెక్సికో, అజార్‌బైజాన్, న్యూజిలాండ్, చైనా వంటి ఎన్నో దేశాల్లో నేటికీ శివసంబంధమైన దేవాలయాలు కనిపిస్తాయి. రష్యాలోని అజార్‌బైజాన్‌లో పెద్ద నందీశ్వరుని దేవాలయం నేటికీ ఉంది. నంది శబ్దం ఆనంద దాయకం. ధర్మానికి నంది పాదాలు సంకేతం. గ్రంథస్థమైన ప్రాచీన, తెలుగు సాహిత్యం మనకు వెయ్యి సంవత్సరాలుగా స్పష్టంగా కనిపిస్తున్నా తత్పూర్వం శాసనాల్లో ప్రాకృత భాషా గ్రంథాల్లో కూడా తెలుగు జాడలున్నాయి. ఉదాహరణకు నేటికి రెండువేల సంవత్సరాల నాటి ప్రాకృత భాషా గ్రంథం గాథాసప్తశతిలో వందలాది తెలుగు పదాలున్నాయి. దీన్నే ఆ కాలంలో ‘దేశి’ అనే పేరుతో పిలిచేవారు. ఇంతకీ చెప్పేదేమంటే ఈ గ్రంథంలో గణేశుని ప్రసక్తి ఉంది. ఆ తర్వాత వచ్చిన అనేక తెలుగు శాసనాల్లో శివప్రసక్తి ఉంది. తొలి తెలుగు గ్రంథం నన్నెచోడుడు రాసిన కుమారసంభవం. ఇతడు రాయలసీమకు చెందిన రేనాటి చోళ వంశీయుడు. ఇందులో కథ దాదాపుగా సంస్కృత శివకవి కాళిదాస కావ్యంలోనిదే. అంటే శైవం 10వ శతాబ్దం నుంచే తొలి తెలుగు కావ్యంలోనే సాహిత్యంలో ప్రారంభమైందని అర్థం. ‘ఎండ’ అనే మాట ఉచ్చరించగానే గ్రీష్మతాపంతో నోరు పొక్కిపోయిందని అత్యాధునికంగా ఎండాకాలాన్ని నన్నెచోడుడు వర్ణించాడు. తర్వాత కవి నన్నయభట్టు. ఆయన రాజరాజ నరేంద్రుని కాలం నాటివాడు. అంటే క్రీ.శ. 1023 ప్రాంతంవాడు. రాజరాజు ‘గిరీశ పాదాబ్జ నిరంతర ధ్యానాసక్తుడు’ అని నన్నయ తన అవతారికలో చెప్పాడు. ఈయన శివకవి. ఆ తర్వాత వచ్చిన పాల్కురికి సోమనాథుడు (12వ శతాబ్దం) వీరశైవ కవి. అంటే శివుణ్ని తప్ప అన్యదేవతారాధన చేయనివాడు. ఈయన రాసిన 40 గ్రంథాలు కేవలం శైవసంబంధ గ్రంథాలే. అందులో సోమనాథ భాష్యం సంస్కృతంలో ఉంది. బసవ పురాణం, పండితారాధ్య చరిత్ర తెలుగు ద్విపద కావ్యాలు. వీరి వృషాధిపశతకంలో జానుతెలుగు లేక అచ్చ తెలుగు నిర్వచనం ఉంది.
‘‘బలుపొడ తోలుసీరయును పాపసరుల్‌ గిలుపాడుకన్ను వె
న్నెలతల చేదుకుత్తుకయు నిండిన వేలుపు టేరుపల్గు పూ
సలుగల రేని లెంకవని జాను తెలుంగున విన్నవించెదన్‌
వలపు మదిన్‌ దలిర్ప బసవా బసవా!!! వృషాధిపా!’’
      అని పాల్కురికి సోమనాథుడు జాను తెలుగు నిర్వచనం చెప్పాడు. తర్వాత వచ్చిన తిక్కన, శంభుదాస బిరుదాంకితుడైన ఎర్రాప్రగడ తదితరులంతా శైవులే.
      14వ శతాబ్దంలో హరిశ్చంద్రోపాఖ్యానం రచించిన గౌరన శైవుడు. 15వ శతాబ్దంలో పోతనామాత్యుడు ‘వీరభద్ర విజయం’ రాశాడు. ‘చేతులారంగ శివుని పూజింపడేని, కలుగ నేటికి తల్లుల కడుపు చేటు’ అని శివపూజా ప్రాధాన్యాన్ని చాటిన కవి మూర్థన్యుడు పోతన. ఇక శ్రీనాథుని విషయానికొస్తే ఆయనకు ఈశ్వరార్చన కళాశీలుడనే బిరుదు ఉంది. కాశీఖండం, హరవిలాసం, శివరాత్రి మాహాత్మ్యం, భీమఖండం వంటి ఎన్నో గ్రంథాలు శివపరమైనవి ఈ మహాకవి సంతరించాడు. 
      16వ శతాబ్దానికి ప్రబంధ యుగం లేక స్వర్ణయుగం అని పేరు. ఇందులో తెనాలి రామకృష్ణుడు కాశ్మీరంలో జయాపీడుని ఆస్థాన గురువు ఉద్భటారాధ్యుని చరిత్రను ప్రబంధంగా తీర్చిదిద్దాడు. ఇతడు కాళీ వరప్రసాద లబ్దకవితా విశారదుడు. 
      తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎందరో కవులు, రాజులు శైవ సంబంధమైన కావ్యాలు, పద్య గద్యాత్మకమైనవి సంతరించారు. తెలంగాణ అనే శబ్దమే శైవ సంబంధి. ఇది త్రిలింగ శబ్దభవం. ఈ మూడు లింగాలు 
      ద్రాక్షారామ (తూ.గో.), కాళేశ్వర (కరీంనగర్‌), శ్రీశైలం (కర్నూలు)లో ఉన్నాయి. కాకతీయుల కాలంలో ఖడ్గాలు అనే సాహిత్య సృష్టి జరిగింది. దీనికి వీరశైవమే ప్రేరణ. నాటి శిల్పం, ఆలయ నృత్యాలంతా శివసంబంధమే. యథావాక్కుల అన్నమయ్య అనే శతక కవి ‘సర్వేశ్వర శతకం’ రాశాడు. ‘స్వామీ.. చెట్టుమీదే పువ్వు కాయగా, పండుగా మారుతుంది. కానీ నీ పాదాల వద్ద పుష్పం ఉంచితే అది గుర్రంగా, ఏనుగుగా, సంపదగా మారుతుంది’ అంటాడీ భక్తకవి.
      తాళ్లపాక అన్నమాచార్యుడు మొదట శైవుడు. స్మార్తుడు. తర్వాత వైష్ణవమతం పుచ్చుకున్నాడు. ధూర్జటి మహాకవి రాసిన శ్రీకాళహస్తీశ్వర శతకం, మాహాత్మ్యం అనే రెండు గ్రంథాలు సుప్రసిద్ధాలు. ‘దంతములు రాలకముందే తనువులో శక్తి ఉన్నప్పుడే స్త్రీ వాంఛలు నశింపనప్పుడే, శరీరం ముసలితనంలో ప్రవేశింపక ముందరే ఈశ్వర ధ్యానం చేయాలి’ అంటాడు ధూర్జటి. ‘పాము- సాలెపురుగు, ఏనుగు వేదాలు పురాణాలు చదవలేదు. అయినా వాటికి మోక్షపథం దక్కింది. నీ భక్తి ఏ జంతుజాతికి మోక్షమార్గం’ అని మరొక పద్యంలో ధూర్జటి వివరిస్తాడు.
      ఇలా తరతరాలుగా తెలుగు సాహిత్యంలో శివకవి పరంపర సాగుతూనే వచ్చింది.
      ఆధునిక యుగంలో మాధవపెద్ది బుచ్చి సుందరరామశాస్త్రి ‘మృత్యుంజయ శతకం’ రాశారు. అందులో
‘‘మెడనాగయ్యకు నెప్పుడున్‌ 
బుసబుసల్‌ మేనన్‌ సగంబైనయావిడ తో
నెప్పుడు నొక్కటే గుసగుసల్‌ - నీ 
నెత్తిపైనున్న గంగమ్మకు నెప్పుడున్‌ రుసరుసల్‌’’ - మరి మా మొర నీకేవిధంగా వినబడుతుంది? అని చమత్కరించారు. కవిసమ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణ ‘విశ్వేశ్వర శతకం’ రచించాడు. మల్లికార్జున మహాలింగ మకుటంతో మధ్యాక్కరలు సృష్టించాడు. ఈయన గొప్ప శివభక్తుడు. ‘పుననల్‌ చూచినకా జగద్రాలు’ అనే పద్యంలో మా పితృపాదులమ్మని పొలం చౌడీవు విశ్వేశ్వరా అని పొలాన్ని శివునితో పోల్చాడు. నిజమే భక్తునికి విశ్వమంతా శివమయంగానే కన్పిస్తుంది కదా!
‘‘ఉదయ గ్రావము పానవట్టమ భిషేకోద ప్రవాహంబువా
ర్ధిదరీ ధ్వాంతముదభాపధూమము జ్వలద్దీ పత్ర బ్రారా శికే
ముది తారానివహంబు లర్పిత సుమంబుల్‌ గాతమోదూర పే
బ్యాదీమై పోల్చు శీతగభస్తి బింబాశివ లింగం బొప్పె ప్రాచీదిశన్‌’’
      అంటే ఉదయించిన చంద్రుడు మహాకవికి శివునివలె కనపడ్డాడని సారాంశం.
      సాంప్రదాయక సాహిత్యంలోనే కాక జానపద సాహిత్యంలో కూడా శివుడు దర్శనమిస్తున్నాడు. తెలంగాణలో నేటికీ ఒక గీతం వినపిస్తోంది.
‘‘ఏమి చేతుర లింగా ఏమి చేతురా - 
గంగతీర్థం తీసుకొచ్చి లింగపూజ
చేతుమంటే - గంగలోని చేపకప్ప ఎంగిలంటున్నాయి 
లింగ- ఏమిచేతురా’’ అని 12వ శతాబ్దానికి చెందిన ఒక పాట బహుళ ప్రచారంలో ఉంది. ఈ గీతానికి మూలం కన్నడంలోని బసవేశ్వర వచనం. ఆ కన్నడ గీతం అనువాదం ఇది.
‘‘క్షీరములో అభిషేకించెదనన ముందే పొదుగున్‌
ముట్టెను వత్సము, ఘటాభిషేకము చేయదలంచిన,
జలమునెప్పుడో చేప నాకినది, పూజకు పుష్పమ్ముల
కైన దిగిన, భృంగమెప్పుడో ఎంగిలిన్‌ నెష
ఎంగిలి కాని పదార్థమ్మిలలో, ఎటనే తెత్తును
పూజా విధికై, నిర్మలమగు నా మనమును గొనుమిక స్వామి’’ కూడల సంగమేశ్వరరావు.
      ఏ మలినమూ సోకని మనస్సు కంటే కావలిసిందేముంటుంది. అంతేకాదు, దానికి వాక్కు, కాయాల్ని చేతులు జోడించి ఆ బోళాశంకరుణ్ని అర్చించుకుందాం. ముక్తిని పొందుదాం. చేతులారా శివుని పూజిద్దాం. నోరు నొవ్వంగ హర కీర్తి నుడువుదాం.


వెనక్కి ...

మీ అభిప్రాయం