ఉసూరుమంటూ ఊహల్లో... 

  • 158 Views
  • 1Likes
  • Like
  • Article Share

    తెలుగు వెలుగు బృందం

‘‘జీవితం ప్రవాహం. ప్రచండ వేగంతో వెళ్లిపోతూ ఉంది. అందులో ఎవరెవరి సంస్కారాన్ని బట్టి వాళ్లు తమ సుఖం కోసం పోట్లాడుకుంటున్నారు. ఇదొక మహాసంగ్రామం. ఈ సంగ్రామంలో పిరికివాళ్లకు, అసమర్థులకు చోటులేదు.’’ ఇంతగొప్ప విషయాన్ని చెప్పడానికే గోపీచంద్‌ ‘అసమర్థుని జీవయాత్ర’ను మనోవైజ్ఞానిక నవలగా మలచారు. కేవలం 124 పేజీలు ఉన్న ఈ నవల మానవ మనస్తత్వాన్ని అణువణువునా కళ్లకు కడుతూ సాగుతుంది. 
      ఇందులో కథానాయకుడు సీతారామారావు (అసమర్థుడు) క్షీణిస్తున్న భూస్వామ్య వ్యవస్థకు ప్రతినిధి. అప్పుడప్పుడే ప్రారంభమవుతున్న పెట్టుబడిదారీ ధోరణులకు అనుగుణంగా స్పందించని సీతారామారావు పాత్ర జీవితాన్ని సమస్యాత్మకం చేసుకుని, తను బాధ పడుతూ, పాఠకులకు కూడా తనపై జాలి కలిగేలా చేస్తుంది. 
      తెలుగు నవలా రచయితల్లో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న గోపీచంద్‌ ప్రసిద్ధ సంఘసంస్కర్త, హేతువాది త్రిపురనేని రామస్వామి కుమారుడు. తండ్రి హేతువాది కావడం మూలాన చిన్నతనం నుంచే ప్రతీ అంశాన్ని ఎందుకు? అని ప్రశ్నించుకుని చూడటం అలవరుచుకున్నారు. ‘పరివర్తన’ గోపీచంద్‌ తొలి నవల. అసమర్థుని జీవయాత్ర, పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా ప్రసిద్ధ నవలలు. ఇవేకాక మరో పది నవలలు, దాదాపు నూటయాభై కథలు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఇరవైమంది వేదాంతుల జీవితాల గురించి తత్వవేత్తలు, చీకటిగదులు గ్రంథాలూ ఈయన కలం నుంచి జాలువారాయి. తన జీవితంలోనూ ఎంతో సంఘర్షణకు, వాద వివాదాలకు లోనైన గోపీచంద్‌ ‘అసమర్థుని జీవయాత్ర’ను సమర్థంగా మలచి తెలుగు వారికి అందజేశారు.
ఆరు ప్రకరణలున్న ఈ నవలలో ఇడ్‌ (జన్మతః వచ్చేవి- ఇందులో మార్టిడో అనే లైంగికేతర, లిబిడో అనే లైంగిక పొరలుంటాయి.), ఈగో, సూపర్‌ ఈగో లాంటి ఫ్రాయిడ్‌ చెప్పిన మనోవైజ్ఞానిక అంశాలు కనిపిస్తాయి. ఈ నవలను అనుసరిస్తూ బుచ్చిబాబు ‘చివరకు మిగిలేది’, రావిశాస్త్రి ‘అల్పజీవి’, జి.వి.కృష్ణారావు ‘యుగసంధి’, బలివాడ కాంతారావు ‘గోడమీదబొమ్మ’ లాంటి మనోవైజ్ఞానిక నవలలు వచ్చాయి. 
      సీతారామారావు ఓ జమీందారు కొడుకు. అంతర్ముఖుడు. చిన్న సమస్యను పెద్దగా ఊహించుకునే మనస్తత్వం కలిగినవాడు. మరణశయ్యపై ఉన్న తండ్రి, ‘‘బాబూ, మన వంశం పేరు నిలబెట్టు, అంతకంటే నే చెప్పేది ఏమీ లేదు’’ అని సలహా ఇవ్వడంతో నవల మొదలవుతుంది. ఈ మాటలతో చుట్టూ ఉన్న వాళ్లంతా చనిపోయేప్పుడు కూడా వంశగౌరవం నిలబెట్టమన్నాడే కానీ, ఆస్తి విషయం చెప్పలేదు. అదీ ఆయన గొప్పతనం అనుకున్నారు. ఇది కాలంతోపాటు మారని జమీందారీ వ్యవస్థకు ప్రతీక. ఆ వ్యవస్థ అవలక్షణాలు సీతారామారావుకు కూడా చిన్నతనం నుంచే ఒంటబట్టాయి. అందుకే ‘‘అంతరిస్తున్న జమీందారీ వ్యవస్థ, అప్పుడప్పుడే స్థిరపడుతున్న పెట్టుబడిదారీ వ్యవస్థ, ఈ రెండింటి సంఘర్షణలో ఒక అపురూపమైన సందిగ్ధ మనస్తత్వాన్ని సంతరించుకున్న పాత్ర సీతారామారావు’’ అని ఓ విమర్శకుడు అన్నారు.
      తన వంశం అందరికంటే భిన్నమైందన్న తండ్రి భావనల్ని సీతారామారావు నరనరానా జీర్ణించుకున్నాడు. అందుకని అందరిలా పెళ్లి చేసుకోకుండా కుటుంబ వ్యవస్థ లంపటం నుంచి విముక్తి పొందాలనుకున్నాడు. అయినా ఇందిర అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తరువాతా భిన్నంగా జీవితం గడపగలననుకున్నాడు. కొంతకాలానికి కూతురు పుట్టింది. దీంతో జీవికకోసం సీతారామారావుకు ఉద్యోగం చేయక తప్పింది కాదు. పిల్లనిచ్చిన మామ ఉద్యోగం చూపించినా, తన వాలకంతో అదీ ఊడుతుంది. దీంతో ఇంట్లో సోమరిగా ఏవో ఊహల్లో గడుపుతుంటాడు. ఆ ఊళ్లో ఉన్న రామయ్య తాత ఏదో ఒక ఉద్యోగం చూసుకుని జీవితం గడపమని చెబుతాడు. కానీ ఒకరి సలహాలను వినని జమీందారీ మనస్తత్వంవల్ల దాన్ని పెడచెవిన పెడతాడు. అతని జీవితంలో మరింత గందరగోళం ప్రారంభమవుతుంది. 
      ఈ నవలలో మరో పాత్ర ఇందిర, అసమర్థుని భార్య. తను సగటు భారతీయ గృహిణిలా కనిపిస్తుంది. భర్త సహకారాన్ని ఆమె ఆశించినా సోమరితనానికి అలవాటుపడిన కథానాయకుడు అవేవీ పట్టించుకోడు. ‘ఇంట్లో ఈగలమోత’గా ఉన్నప్పుడూ బయటికి భేషజం ప్రదర్శిస్తూ సంసారాన్ని నెట్టుకొస్తుంటుంది.   
      మానసిక బలహీనతవల్ల సీతారామారావు జీవితం గురించి ఏవేవో ఆలోచిస్తూ, మరేవో ఊహించుకుంటూ ఉంటాడు. ‘‘ఇంతమంది మేధావులున్నారు గదా ప్రపంచంలో- వీళ్లలో ఒక్కరయినా అన్నం తేలిగ్గా దొరికే పద్ధతి ఎందుకు కనిపెట్టరు? ఏ వాసన చూట్టంవల్లో, ఏ గాలి పీలవడంవల్లో, ఏ నీళ్లు తాగడం వల్లో ప్రాణాలు నిలిచేట్టు ఎందుకు చెయ్యరు?
      ఈ యుద్ధాలూ, ఈ నాశనాలూ, బాధలూ, తాపత్రయాలు, అన్నీ తప్పుతాయిగా? అంతా సుఖంగా బతుకుతారుగా! వాళ్లీ విధంగా ఆలోచించరు’’ ఇలా దారీతెన్నూ లేకుండా ఆలోచనల్లో మునిగిపోయేవాడు. ఎవరితో సంభాషించినా అంతూపొంతూ ఉండేది కాదు. రోజురోజుకూ మానసికంగా దుర్బలుడవుతున్నాడు. 
      ఉద్యోగం లేకా డబ్బు గడించేందుకు వేరే ఆధారమూ లేక సీతారామారావు మేనమామను సహాయం అడుగుతాడు. మేనమామ జవాబు ఇవ్వడు. ఒళ్లు మండి మరో ఉత్తరం రాస్తాడు. జవాబుగా అతని మేనమామ వారి వంశ వైభవాన్నంతా ఉత్తరంలో వివరిస్తాడు. అతని తండ్రి ఆభిజాత్యం గురించి చెబుతాడు. గతంలో నలభై వేల అప్పుకు పది ఎకరాలే ఇచ్చిన విషయాన్ని ఘనంగా ప్రస్తావిస్తూ, ఆ మాత్రం ఇవ్వడమే ఎక్కువ అంటాడు. ఈ మేనమామ పాత్ర పచ్చి అవకాశవాదానికి నిదర్శనం. తండ్రి బతికున్నన్నాళ్లూ నోరు మెదపకుండా, తర్వాత తన అసమర్థతను ఆసరాగా తీసుకుని మేనమామ ఎలా మోసం చేసిందీ గ్రహించిన సీతారామారావుకు ప్రపంచంపై ఏహ్యభావం కలుగుతుంది.
      తన కోపాన్ని ఎవరి మీద ప్రదర్శించాలో తెలియక భార్యాబిడ్డలపై చూపిస్తాడు. భార్యతో ప్రేమగా మాట్లాడాలనుకుంటాడు, కానీ ఆవిడ చేతిలో నిరాదరణకు గురవుతాడు. చివరకు భార్యతో పోట్లాడి బయటకు వెళ్తాడు. ఇక్కడ సీతారామారావు భార్యతో ప్రేమగా ఉండాలనుకోవటం, భార్యతో పోట్లాడటం అతనిలో సూపర్‌ ఈగో, ఇడ్‌ల మధ్య జరిగే సంఘర్షణగా రచయిత చూపించే ప్రయత్నం చేశారు. ఇడ్‌ అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఏది చేసినా సరైందే అంటే, సూపర్‌ ఈగో అలా కాకుండా ఇంకా సత్ప్రవర్తనతో మెలగొచ్చునని చెపుతుంది. దీంతో మనసు అల్లకల్లోలం అవుతుంది.
      బయటకు వచ్చి గతాన్ని తలచుకొంటాడు. తాను కోరుకున్నది ఇలాంటి జీవితమా అని వ్యథ చెందుతాడు. దీనికంతటికీ తన స్నేహితులే కారణమనే అభిప్రాయానికి వస్తాడు. మళ్లీ తన వల్ల వారే అప్రయోజకులయ్యారేమో అని అనుకుంటాడు. అలా వెళ్తూ వెళ్తూ తననో బందిపోటుగా ఊహించుకుంటాడు. అడవిలో దారికాచి దోచుకున్నట్లు, పట్టుబడిన ఓ యువతిని బలాత్కారం చేయకుండా వదిలేసినట్లు ఊహించుకుంటాడు. ఇది అతనిలోని లిబిడో (లైంగిక) కోణాన్ని బయటపెడుతుంది. ఇవన్నీ మానసిక బలహీనతకు నిదర్శనాలు. తిరిగి తిరిగి ఒక సమావేశానికి వెళ్తాడు. అక్కడ రభస జరిగి జనం చేతిలో తన్నులు తింటాడు. ఇంతలో రామయ్య తాత సీతారామారావును పక్కకు తీసుకెళ్లి, ప్రపంచ గమనాన్ని వివరిస్తాడు.  
      పుస్తకాల్లో చదివిందే జ్ఞానం కాదనీ, కాలానుగుణంగా కొత్త విషయాలను నేర్చుకోవాలనీ, జీవితం విషయంలో సందిగ్ధతకు తావు ఉండకూడదనీ చెబుతాడు. ఇప్పటికైనా ఏదో ఒక మంచి పని చేసి భార్యా బిడ్డలతో ధైర్యంగా, సుఖంగా ఉండమని బోధిస్తాడు. అటు నుంచి సీతారామారావు శ్మశానానికి వెళ్తాడు. తన తల్లిదండ్రులతో మాట్లాడినట్లు భావించుకుంటాడు. ఈ క్రమంలో మారిన సీతారామారావుకు, అతని అంతరాత్మకు సంఘర్షణ జరుగుతుంది. చివరకు తనమీద తనకు విసుగు పుడుతుంది. ఆ మనఃస్థితి కారణంగా ఆత్మహత్య చేసుకుంటాడు. అక్కడితో అసమర్థుని జీవయాత్ర ముగుస్తుంది. ఇక్కడ నవల బీభత్స రస ప్రధానంగా సాగుతుంది. 
డార్విన్‌ జీవపరిణామమూ ఇదే చెబుతోంది. మార్పులకు అనుగుణంగా స్పందించనిది ఏదైనా కాలప్రవాహంలో కొట్టుకుపోతుంది. మానవ జీవితం గతిశీలం. నిరంతరం మార్పులకు గురవుతుంది. ప్రతి క్షణం మనల్ని మనం మెరుగుపరచుకోవాలి. ఈ ప్రయత్నంలో కొన్నిసార్లు వెనకపడే అవకాశం ఉంది. ఈ నవల్లో సీతారామారావు మారేందుకు సిద్ధంగా ఉండడు. పైగా సోమరిగా బతుకుతూ లేని గాంభీర్యాన్ని ప్రదర్శిస్తాడు, అంతా పోగొట్టుకుంటాడు. తనను అందరూ మోసం చేస్తున్నారని, తనకే ఇలా జరుగుతోందా? అందరికీ ఇలానే జరుగుతుందా అనే సంశయానికి లోనవుతాడు. తను ఉదారంగా ప్రవర్తించినందుకు ఇతరులూ అలాగే ఉండాలనుకుంటాడు. కానీ వాస్తవం భిన్నంగా ఉంటుంది. ఇలాంటిదే మేనమామ చేతిలో తిరస్కారం, మోసం. నవలంతా ఈ అంశంపైనే సాగుతుంది. 
      మనిషి మనస్తత్వంలోని సంక్లిష్టతలను, వైరుధ్యాల్ని, సంఘర్షణలను- సమకాలీనత, వాస్తవికతల కోణంలో అద్భుతంగా విశ్లేషిస్తూ సాగుతుందీ నవల. అందువల్లే ఇది తెలుగు సాహిత్యంలో తిరుగులేని స్థానాన్ని సంపాదించుకుంది. తెలుగు సాహిత్యంలో అత్యంత ప్రజాదరణ పొందిన పది నవలల్ని ఎంచితే వాటిలో అసమర్థుని జీవయాత్ర తప్పనిసరిగా ఉంటుంది. 


వెనక్కి ...

మీ అభిప్రాయం