రససంప్రదాయం

  • 248 Views
  • 1Likes
  • Like
  • Article Share

విశ్వ విద్యాలయ నిధుల సంఘం (యూజీసీ) నిర్వహించే నెట్‌ - జేఆర్‌ఎఫ్‌ పరీక్ష డిసెంబరు 29న జరగనుంది. ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహించే రాష్ట్రస్థాయి అర్హత పరీక్ష ఏపీసెట్‌ పరీక్ష, పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించే జూనియర్‌ లెక్చరర్స్, డిగ్రీ లెక్చరర్స్‌ పరీక్షల్లో అలంకారశాస్త్రం చాలా కీలకమైంది. క్లిష్టమైంది. అలంకార శాస్త్రంలో భాగంగా ‘రససంప్రదాయ’ విశేషాలను వివేచిద్దాం.
భారతీయుల కావ్యమీమాంసకు విశ్వసాహితీ జగత్తులో ప్రసాదించిన మొదటి విశిష్ట వివేచన రస సిద్ధాంతం. భారతీయ సంస్కృతికి, రస సిద్ధాంతానికి అవినాభావ సంబంధం ఉంది. వాక్యం రసాత్మకం కావ్యమ్‌ అని విశ్వనాథుడు కావ్యానికి నిర్వచనమిచ్చాడు. ‘రసవంతమైన వాక్యమే కావ్యమ’ని విశ్వనాథుని భావన. రసహీనమైన గ్రంథం కావ్యం కాజాలదని అర్థం.
      ‘రసం’ పదాన్ని మొదట ఋగ్వేదంలో సోమరసం, జలం, పాలు, సారం అనే అర్థాల్లో వాడారు. అథర్వణ వేదంలో ‘రుచి’ అనే అర్థంలో కనిపిస్తుంది. ఉపనిషత్కాలంలో ‘సారం’ అనే అర్థం ఏర్పడింది. ఈ లోకానికి ప్రధాన సారభూతమైన శాశ్వతానంద భరితమైన పరమాత్మ రసపదానికి అర్థం. రసానందం బ్రహ్మానంద సహోదరంగా భావించారు.
      రస సిద్ధాంత ప్రవక్త భరతముని. భరతుడు నందికేశ్వరుని ‘రసప్రవక్త’గా పేర్కొన్నాడు. ‘‘రసోవైసః’’ ‘అతడు రసస్వరూపుడు’ అన్నది వేదకాలం నాటి సూక్తి. ‘‘నహిరసాదృత్‌ కశ్చిదప్యర్థః ప్రవర్తతే’’ రసహీనమై ఏ అర్థం ప్రవర్తించదు. ఈ వాక్యాన్ని బట్టి భరతుడు రసానికిచ్చిన ప్రాధాన్యత అర్థమవుతుంది.
      విభావానుభావ వ్యభిచారి సంయోగాద్రసనిష్పత్తి విభావం, అనుభావం, వ్యభిచారీ భావాల సంయోగం వల్ల రస నిష్పత్తి జరుగుతుందని భరతుడు నిర్వచించి సంయోగం, నిష్పత్తి పదాలకు అర్థం చెప్పలేదు. 
      విభావం: విభావాలు చిత్తవృత్తి విశేషాలు కావు. అందుకే భరతుడు పేర్కొన్న 49 భావాలలో విభావాలు లేవు.
      భరతుడు చెప్పిన భావాలు 49. అవి- స్థాయీ భావాలు - 8; సాత్త్విక భావాలు - 8; వ్యభిచారీ భావాలు - 33
రసోత్పత్తికి కారణభూతమైన విభావం:
విభావ పదానికి ‘విజ్ఞానం’ అని అర్థం. విభావం, కారణం, నిమిత్తం, హేతువు అన్నవి పర్యాయపదాలు. విభావాలు రెండు రకాలు.
1. ఆలంబన విభావం (నాయికా నాయకులు) 2. ఉద్దీపన విభావం: ఇది నాలుగు రకాలు
అ. గుణాలు ఆ. చేష్టలు ఇ. అలంకృతులు ఈ. తటస్థములు
అనుభావం
రసోత్పత్తికి కార్యభూతమైనది అనుభావం. 
ఉద్బుద్ధం కారణైః స్వేర్బహిర్భావం ప్రకాశయన్‌
లోకేయ కార్యరూపః సో అనుభావః కావ్యనాట్యయోః
      తన తన కారణాలచే ఉద్బుద్ధమైన భావాన్ని, బయటకు వెల్లడిస్తూ లోకంలో ఏది కార్యరూపంలో ఉన్నదో అదే ‘అనుభావం’. ఇది మూడు రకాలు. అంగజాలు, స్వభావజాలు, సాత్త్వికాలు.
విభావైరనుభావైశ్చ సాత్త్వికైర్వ్యభిచారిభిః
ఆ నీయమాన స్సా్వదుత్వం స్థాయీభావో రసః స్మృతః

      విభావాల చేత, అనుభావాల చేత, సాత్త్విక భావాల చేత, వ్యభిచారి భావాల చేత స్వాదువుగా చేయబడిన స్థాయీ భావమే రసం అని ధనుంజయుడు ‘దశరూపకం’లో పేర్కొన్నాడు. 
* విభావానుభావ సాత్త్విక వ్యభిచారి సామగ్రీ సముల్లసితః
     స్థాయీభావో రసః - విద్యానాథుని ప్రతాపరుద్రీయం
* విభావానుభావ  వ్యభిచారిభి రభివ్యక్తః స్థాయీ భావోరసః
    - హేమచంద్రుని కావ్యాను శాసనం
* విభావేనానుభావేన వ్యక్తః సంచారిణా తథా రసతామేతి రత్యాదిః
    స్థాయీభావః సచేతసామ్‌’’ - విశ్వనాథుని సాహిత్య దర్పణం.

రస నిర్వచనంలో భావపదం అనుగతంలో వినిపిస్తుంది. 
వాగంగసత్త్వపేతాన్‌ కావ్యార్థాన్‌ భావయంతీతి భావాః
వాచికాలను, ఆంగికాలను, సాత్త్వికాలు అయిన అభినయాలచే నివేదితాలగు కావ్యార్థాలను భావింపజేయునవి కావున భావాలంటారని భరతుడు పేర్కొన్నాడు. భావపదం భూధాతు నిష్పన్నరూపం. దీనికి ఉత్పాదనం, వ్యాపనం అనే రెండర్థాలు చెప్పవచ్చు. భావం అనగా చిత్తవృత్తి విశేషం. అది కావ్యార్థాన్ని సహృదయులచే ఆస్వాదింపజేస్తుంది. 
సాత్త్విక భావాలు
‘సత్త్వం’ అనగా మనఃప్రభావమైన ఒక విశేష స్థితి. మనస్సమాధిలోనే సత్త్వం జనిస్తుంది.
* రజోగుణం చేత, తమోగుణం చేత స్పృశింపని మనస్సు, సత్త్వమవుతుందని విశ్వనాథుడు సాహిత్య దర్పణంలో పేర్కొన్నాడు.
* స్వాత్శమందే విశ్రాంతి గల రసాధికాన్ని బోధించే ఒక అంతః ధర్మం సత్త్వం అని విశ్వనాథుడు పేర్కొన్నాడు.
* పరగత సుఖాది భావన చేత భావితమగు అంతఃకరణ ధర్మం సత్త్వం. సత్త్వం నుంచి జనించిన భావాలే సాత్త్విక భావాలు అని విద్యానాథుడు ప్రతాపరుద్రీయంలో పేర్కొన్నాడు.
సాత్త్విక భావాలు ఎనిమిది
1. స్తంభం:
భయహర్షరోగాదుల చేత చేష్టదక్కుట స్తంభం.
2. స్వేదం: రతి, ఉక్క, శ్రమము మున్నగు కారణాలచే దేహజలం
వెలికి వచ్చుట స్వేదం.
3. రోమాంచం: హర్షాద్భుత భయాదుల చేత వెంట్రుకలందు కల్గు
ప్రోద్గమం రోమాంచం.
4. స్వరభంగం: మదం, సమ్మదం, పీడ మున్నగు వానిచే కలుగు
గద్గద స్వరం స్వరభంగం.
5. కంపం: రాగద్వేష శ్రమాదులచే కలుగు దేహకంపం వే పథువు.
6. వైవర్ణ్యం: విషాదమద రోషాదులచే వర్ణం మారుట వైవర్ణ్యం.
7. అశ్రువు: క్రోధ, దుఃఖ ప్రహర్షాలచే కలుగు కన్నీరు అశ్రువు.
8. ప్రళయం: సుఖంచే గాని, దుఃఖంచే గాని చేష్టాజ్ఞాన నిరాకృతి ప్రళయం.
* భానుదత్తుడు జృంభ (ఆవులింత)ను కూడా తొమ్మిదో సాత్త్విక భావంగా పేర్కొన్నాడు.
వ్యభిచారీ భావాలు
సంచారి భావాలకే వ్యభిచారీ భావాలు అని పేరు. స్థాయీభావ సముద్రంపై నిరంతరం లేచి పడే కెరటాలు సంచారి భావాలు. శృంగార రసంలో సంచారి లేదా వ్యభిచారీ భావాలు 33.
1. నిర్వేదం 2. గ్లాని 3. శంక 4. అసూయ 5. మదం 6. శ్రమము 7. ఆలస్యం 8. దైన్యము 9. చింత 10. వ్యామోహం 11. స్మృతి 12. ధృతి 13. వ్రీడ 14. చాపల్యం 15. హర్షం 16. ఆవేగం 17. జాడ్యం 18. గర్వం 19. విషాదం 20. ఔత్సుక్యం 21. నిద్ర 22. అపస్మారం 23. సుప్తి 24. విబోధం 25. అమర్షం 26. అవహిత్థము 27. ఉగ్రత 28. మతి 29. వ్యాధి 30. ఉన్మాదం 31. మరణం 32. తాపం 33. వితర్కం.
స్థాయీభావాలు: రసోత్పత్తి జరిగే వరకు స్థిరంగా ఉండే భావం స్థాయీభావం.
విరుద్ధై రవిరుద్ధైర్వా భావైర్విచ్ఛి ద్యతేనయః
ఆత్మభావం నమత్యన్యాన్‌ స్థాయీవలవణాకరః

- ధనుంజయుడు (దశరూపకం)

      విరుద్ధమైన భావాలచే కాని, అవిరుద్ధాలైన భావాలచే కానీ విచ్ఛేదం పొందక, నదీనాదాల జలాన్ని లవణాకరం వలె, సమస్త భావాలను స్వస్వభావాలను పొందించునది స్థాయీభావం.
సజాతీయైర్వి జాతీయైర తిరస్కృత మూర్తిమాన్‌
యావద్రసం వర్తమానః స్థాయీభావ ఉదాహృతః

సజాతీయాలు, విజాతీయాలు అగు భావాలచే తిరస్కృతం కాక రస నిష్పత్తి పర్యంతం, సహృదయ హృదయాల్లో నిలిచి ఉండేది ‘స్థాయీభావం’.              - ధనుంజయుడు (దశరూపకం)
నీ చరమ సమయ పర్యంత స్థాయిత్వా దస్యస్థాయిత్వ వ్యపదేశ

- భానుదత్తుడు (రసతరంగిణి)

రసస్ఫూర్తి పర్యంతం నిలిచి ఉండేది స్థాయీభావం. 
రససంఖ్య
‘‘అనంతావైరసాః’’ రసాలు అనంతాలు. వాస్తవానికి ప్రతీ భావం రసమే. ప్రతి రసం ప్రాథమిక స్థాయిలో భావంగా ఉంటుంది. బీజం అంకురమై ఆకు తొడిగి మారాకు వేసి రెమ్మలతో, కొమ్మలతో మహావృక్షమవుతుంది. కావున బీజప్రాయమైన భావం రసంగా పరిణతి చెందుతుంది.
భరతుడు ఎనిమిది రసాలను మాత్రమే పేర్కొన్నాడు. శాంత రసాన్ని పేర్కొనలేదు. ఉద్భటుడు తొమ్మిదో రసమైన శాంత రసాన్ని పేర్కొన్నాడు. తొమ్మిదో రసంగా శాంతరసాన్ని అంగీకరించిన వారిలో ముఖ్యుడు అభినవగుప్తుడు. అంగీకరించని వారిలో ముఖ్యుడు ధనుంజయుడు.
మరికొన్ని రసాలు
రుద్రటుడు 10వ రసం ‘ప్రేమో’ రసం అని పేర్కొని స్థాయీభావం ‘స్నేహం’ అని పేర్కొన్నాడు.
      ఉజ్జ్వల నీలమణికర్త రూపగోస్వామి ‘భక్తి’ని రసంగా అంగీకరించాడు. దీనిని మధుసూదన సరస్వతి ఆమోదించాడు. ‘భగవదాకార చిత్తవృత్తి’ భక్తి రసానికి స్థాయీభావమని మధుసూదన సరస్వతి పేర్కొన్నాడు. విశ్వనాథుడు ‘వత్సల’ రసాన్ని పేర్కొన్ని ‘వత్సలతో స్నేహం’ స్థాయీభావమన్నాడు. భానుదత్తుడు ‘మాయా’రసాన్ని మిథ్యాâ్ఞ°నం’ స్థాయీభావంగా పేర్కొన్నాడు.
రసాభాసం
నాయికా నాయకులలో ఒక్కరికే అనురాగం కలిగి ఉండటం, అనురాగం తిర్యద్గతం గాని, మ్లేచ్ఛగతం గాని అయి ఉండటం, బహు నాయకానురాగం ఉన్నప్పటికీ రసాభాసం అవుతుంది.

- విజయ్‌


వెనక్కి ...

మీ అభిప్రాయం