వ్యక్తివాదంతోనే ఆగిపోదామా?

  • 784 Views
  • 9Likes
  • Like
  • Article Share

    కళ్యాణి ఎస్‌.జె

  • చెన్నై, sitakalyani88@gmail.com
కళ్యాణి ఎస్‌.జె

ప్రతి మనిషినీ ఒకేలా ఆదరిస్తూ, ప్రతి వ్యక్తి అస్తిత్వానికీ సమ గౌరవం ఇస్తూ, సమానత్వమనే పునాదుల మీద సంఘనిర్మాణం చేయడం సామాజిక న్యాయసూత్రాల లక్ష్యం. మరి తెలుగు సాహిత్యంలో వీటి చిత్రణ ఎలా సాగింది? ఈ విషయంలో మన కవులు, రచయితల అవగాహనకు పరిమితులున్నాయా? తరచిచూస్తే కనపడే చీకటివెలుగులేంటి?
విశ్వశ్రేయస్సు కోసమే సాహిత్య సృష్టి జరగాలంటుంది భారతీయ సంప్రదాయం. ‘ధర్మో రక్షతి రక్షితః’ అన్న వాల్మీకి వాక్యం న్యాయ పరిభాషకు క్లుప్తమైన వ్యక్తీకరణ. వ్యక్తులందరూ ఏ నియమ నిబంధనల్ని తు.చ. తప్పకుండా పాటిస్తే సమాజానికి శ్రేయస్కరమని పూర్వికులు భావించారో, వాటన్నింటినీ కలిపి ‘ధర్మం’ అన్నారు. కావ్యాల్లో ప్రచారం చేశారు. ఆ ధర్మం ప్రకారం అందరూ నడుచుకుంటే సమాజంలో అందరికీ న్యాయం జరుగుతుందని వాళ్లు నమ్మారు కాబోలు. అలాంటి సార్వకాలికమైన, సార్వజనీనమైన ధర్మం గురించి భారతం శాంతిపర్వంలో తిక్కన ఇలా చెబుతాడు.. ఒరులే యవి యొనరించిన/ నరవర అప్రియము తన మనంబునకగు, దా/ నొరులకు నవి సేయకునికి/ పరాయణము పరమ ధర్మ పథములకెల్లన్‌. ఇతరులు చేసిన ఏయే పనులవల్ల తనకు బాధ కలుగుతుందో ఆ పనులను చేసి వేరొకరికి బాధ కలిగించకూడదని దీని భావం.
      లోకంలో అందరూ ఎలా ప్రవర్తించాలని ఆశిస్తామో, ఆ సార్వజనీన, సార్వకాలిక సూత్రాన్ని ‘న్యాయం’, ‘కర్తవ్యం’ అని పిలిచారు పద్దెనిమిదో శతాబ్దపు తత్వవేత్త ఇమ్మాన్యుయేల్‌ కాంట్‌. అంతకుముందే బౌద్ధ, జైనమతాల్లోనూ, బైబిల్‌, కన్‌ఫ్యూషియస్‌ ప్రవచనాల్లోనూ ఈ ‘సర్వ సమభావన’ను ప్రబోధించారు. అనేక శతాబ్దాలనుంచీ మానవ సమాజానికి ‘న్యాయం’ గురించి ఉన్న అవగాహన కొద్దిపాటి తేడాలతో ఆయా భాషల్లో మనకు లభిస్తోంది. ‘అందరికీ ఒకటే న్యాయం’ అనే భావన ఏ జాతి వాఙ్మయంలోనైనా ఓ ఆదర్శంగా చిత్రించి ఉంటుంది.
      ఆ ఆదర్శానికి విరుద్ధంగా ఉండే సమాజపు తీరుతెన్నులను తెలుగునాట ప్రజాసాహిత్యం, అందులోనూ ముఖ్యంగా శతక సాహిత్యం నమోదు చేసింది. సమాజంలో ఉండే హెచ్చు తగ్గులూ, దానికి అనుగుణంగా మారే మనుషుల నడవడికలనూ సూటిగా విమర్శించిన వేమన పద్యాలు అనేకానేకం ఉన్నాయి. కులము కలుగువారు, గోత్రము కలవారు/ విద్య చేత విర్రవీగువారు/ పసిడి కలుగు వాని బానిస కొడుకులే అంటూ మానవజాతిని విభజించే అన్ని వర్గీకరణల్లోకీ, కలిమీ లేముల భేదం అత్యంత మౌలికమైందని వేమన స్పష్టంగా తేల్చిచెప్పాడు. ‘పేదవాడి కోపం పెదవికి చేటు’ అని గమనించడానికి లోతైన సామాజిక పరిజ్ఞానం ఉండనక్కరలేదు. సామాన్యమైన అనుభవం చాలు. సామాజిక అంతరాలను పట్టిచూపే ఇలాంటి ఎన్నో ఉదాహరణలు మన జానపద సాహిత్యంలోనూ దొరుకుతాయి. అయితే, ఆ భేదాలు సృష్టి సహజం కావనీ, మనిషి సృష్టిస్తున్నవేననీ స్పష్టంగా గ్రహించడానికి మాత్రం సామాజిక శాస్త్రవేత్తలూ, ఆర్థిక శాస్త్రవేత్తలూ, ఇంకా చరిత్రకారుల కృషి తోడ్పడింది. సమాజంలో ‘న్యాయం’ అమలు జరగట్లేదని, దానికి కారణాలు కూడా మన సమాజంలోనే ఉన్నాయన్న ఎరుకా, తెలివిడీ మనకు ఈమధ్యకాలంలోనే కలిగాయి.
      ఈ నూతన భావాలు తెలుగు సాహిత్యంలో ప్రతిబింబించేందుకు ఓ బలమైన పునాది కందుకూరి, గురజాడల రచనల ద్వారా ఏర్పడింది. సంస్కరణోద్యమానికి సహాయకారిగా సాహిత్యాన్ని వాడుకున్నారు కందుకూరి.
      కథలూ, ఇతిహాసాలూ, ఉపాఖ్యానాలూ మొదలుగా గల మన ప్రాచీన సాహిత్యం గతంనుంచి గుణపాఠాన్ని నేర్చుకోమనేటట్లు ఉండేది. మంచి గతమున కొంచెమేనోయి/ మందగించక ముందు అడుగేయి అంటూ గురజాడ వర్తమానాన్ని విమర్శించడానికి, భవిష్యత్తుకు దిశానిర్దేశం చెయ్యడానికి సాహిత్యసృష్టి చేశారు. ఉండాల్సిన సమాజానికి, అమలులో ఉన్న సమాజానికీ మధ్యగల వైరుధ్యానికి అక్షరరూపమివ్వడమే సాహిత్యానికి కర్తవ్యం అనే కొత్త నిర్వచనం వెలుగులోకి వచ్చింది. సామాన్య మానవుడి దృష్టికి అర్థరహితంగా కనిపించే జీవితానికి సంబంధించిన చలనసూత్రాలను కనిపెట్టి వివరించాల్సిన బాధ్యత రచయితది.
వ్యక్తీ, సమాజమూ..
న్యాయం, ధర్మం అనే మాటలు వ్యక్తిపరంగా, సమాజపరంగా వేర్వేరు అర్థాలలో గోచరిస్తూంటాయి. వ్యక్తికి సమాజం పట్ల ఉండదగిన నిబద్ధతా, సమాజానికి వ్యక్తిపట్ల ఉండాల్సిన బాధ్యత... ఈ రెండింటినీ ఆశ్రయించుకుని సామాజిక న్యాయం ప్రతీ తరంలోనూ కొత్త అర్థాలను సమీకరించుకుంటుంది. సమాజం ఏర్పరచిన న్యాయసూత్రాలను పాటించమని వ్యక్తికి ఉద్బోధించే సాహిత్యం మనకు అనాదిగా ఉంది. దానికి మహోన్నతమైన కళారూపం ‘పంచతంత్రం’. ఆ కాలం వరకూ మానవజాతి సమీకరించుకున్న లోకజ్ఞానమూ, తప్పొప్పులను విడమర్చి చెప్పగల వివేకమూ... వీటన్నిటినీ ఏర్చి కూర్చి, జంతువులనూ, పక్షులనూ మానవులకు ప్రతీకలుగా ఏర్పరిచి భవిష్యత్‌ తరాలకు అందించిన గ్రంథం పంచతంత్రం.
వ్యక్తి ప్రాధాన్యం
మొదటి ప్రపంచ యుద్ధానంతరం సాహిత్యంలో వ్యక్తివాదమూ, వ్యక్తి స్వాతంత్య్రమూ ప్రచారంలోకి వచ్చాయి. అప్పటికి అమలులో ఉన్న సంఘ నియమాలు శిథిలమవుతున్నాయి. కాబట్టి సాహిత్యకారులు సంఘాన్ని ధిక్కరించి కూడా మెప్పు సంపాదించారు.
      సమాజ ప్రభావం ప్రత్యేక వ్యక్తుల జీవితాలమీద ఎలా ఉండేదీ చిత్రించే సాహిత్యమూ, వ్యక్తి కోణంనుంచి సమాజాన్ని విశ్లేషించే సాహిత్యం మనకు పాశ్చాత్య నాగరికతనుంచి అందిందన్నది వల్లంపాటి వెంకటసుబ్బయ్య వంటి విమర్శకుల మాట. దానిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది నవలా సాహిత్యాన్ని. సామాజిక నవలల్లోని పాత్రలు సమకాలీన భావజాలంలోంచి ఉద్భవించినవిగా ఉంటాయి. వాటిలో అంతఃసంఘర్షణ, పరిస్థితుల ప్రభావమూ స్పష్టంగా కనపడతాయి. బుచ్చిబాబు ‘చివరకు మిగిలేది’లోని దయానిధి, రావిశాస్త్రి ‘అల్పజీవి’లోని సుబ్బయ్య పాత్రలు దీనికి ఉదాహరణ.
      సామాజిక న్యాయం సంగతి సాహిత్యానికి ఎందుకని ప్రశ్నించేవాళ్లని సామాజిక న్యాయానికి వ్యతిరేకులని భావించలేం. వారి ఉద్దేశంలో సాహిత్యం వ్యక్తి విశిష్టతనూ, అతని నిర్ణయాధికారాలనూ, అతని మానసిక విశ్లేషణనూ వివరించే ప్రయత్నం చేయాలి. ప్రతీ వ్యక్తీ ఒక ప్రత్యేక అస్తిత్వ స్వరూపం. వారిని సమూహాలుగా గుర్తించడం అసమగ్రం.
      సమాజమే మనిషి ప్రవర్తనను నిర్ణయిస్తుందని చెప్పే సమష్టి వాదాలు నియతివాదాలనీ, అవి న్యాయాన్యాయ విచారణ చేసే సమయంలో ‘వ్యక్తి’ పాత్రను పరిగణించవనే ఆరోపణ ఉంది. మనిషి ప్రవర్తనకు అతనిదే పూర్తి బాధ్యత అవుతుందని ఈ వ్యక్తి వాదుల సిద్ధాంతం. వ్యక్తిని కేంద్రంగా చేసుకుని వచ్చిన సాహిత్యం ఆ సిద్ధాంతానికి బలాన్నిచ్చింది. అయితే ఈ మార్పులు క్రమక్రమంగా సాహిత్యకారుల చూపును సమాజం నుంచి మరల్చి ‘వ్యక్తి’ వైపు కేంద్రీకరిస్తున్నాయి. అలాంటి వాళ్లందరూ తరచుగా అడిగే ప్రశ్న... ‘సమాజం వల్ల ప్రభావితం కాని వ్యక్తి గురించి రాయకూడదా?’ నిజానికి వ్యక్తి తనవి అని భావించే భావాలు కూడా సామాజిక భావజాలంలో భాగమే. అలా అని సమాజ చిత్రణ మాత్రమే సాహిత్యం కాబోదు. (వాటికి సామాజిక శాస్త్రాలు ఉండనే ఉన్నాయి) సాహిత్యంలోని పాత్రలకు భౌతిక జీవితమూ, మానసిక జీవితమూ రెండూ ఉంటాయి. బయటికి వ్యక్తమవుతున్న అతని ప్రవర్తన, అవ్యక్తమైన ఆలోచనలను మంచి రచయిత ఆవిష్కరిస్తాడు.
పాత వాదం(?):
మనిషి తన కష్టనష్టాలకు తన దురదృష్టం కారణం అనుకుని, మానవాతీతశక్తులే జీవితాన్ని నడిపిస్తాయని నమ్మటం పౌరాణిక భావన. ఆ భావనలో సామాజిక న్యాయం గురించి విమర్శలకూ, చర్చలకూ పెద్దగా తావుండదనిపిస్తుంది. అది భక్తి సాహిత్యమనీ, అది మన పరిధి కాదనీ విశ్లేషించకుండా వదిలెయ్యలేం. దీనికి ఒక ఉదాహరణ- వ్రతకథల్లోని ఫలశ్రుతి. పుత్రులు లేని వాళ్లకి పుత్రులూ, దీర్ఘాయుష్షూ, యశస్సూ, రోగాల నుంచి విముక్తి, అగ్ని, చోరబాధల నుంచి ఉపశమనం ఇవన్నీ ప్రజలకు కావాలని వాళ్లే చెప్తూ, అవి ఆ పూజలవల్ల సిద్ధిస్తాయని కూడా హామీ ఇస్తారు. ఈనాటికీ సమాజంలో ఆ భావాల ప్రభావం చాలా బలంగా ఉంది. ఆ నమ్మకాలతో ఉన్నవాళ్లు సాహిత్యంలో ‘సామాజిక న్యాయం’ ఉండాలనుకుంటారని ఆశించలేం. అలాగే మానవజీవితంలో కార్యకారణ సంబంధమే లేదూ, అంతా ఘటన - అని భావించడం కూడా అత్యాధునిక మెట్ట వేదాంతం. ఇలా వూహించే వాళ్ల సాహిత్యంలోనూ సామాజిక న్యాయం మృగ్యం.
నవ్య వాదాలు
మానసిక శాస్త్రవేత్తలైన ఆడ్లర్‌, యూంగ్‌ల ఆలోచనలు విశ్వవ్యాప్తంగా సాహిత్యరంగాన్ని ఎంతో ప్రభావితం చేశాయి. ఆడ్లర్‌ పేరు తెలియకపోయినా ఆయన కనిపెట్టిన కాంప్లెక్సులు- ఆధిక్యతా భావం, అల్పత్వ భావం ఆధునికులకు చిరపరిచితాలే. యూంగ్‌ చర్చించిన అచేతన, సుప్తచేతన వంటి పదాలూ సాహిత్యకారులను ఆకర్షించాయి. ఇక వీళ్లిద్దరికీ గురువూ, మానసిక శాస్త్రాన్నే ఓ మలుపు తిప్పిన ఫ్రాయిడ్‌ కారణంగా వ్యక్తి జీవిత విశ్లేషణలో బాల్యానికి అద్వితీయమైన ప్రాధాన్యం సమకూరింది. సమస్య పరిష్కారానికి సమాజ సహకారం ఆశించడం తగ్గి, ప్రతీ వ్యక్తి జీవిత సమస్యకూ అతని బాల్యంలో జరిగిన ఏదో సంఘటన కారణమని వెతికే మేధావులు ఎక్కువయ్యారు. వారు చేసే వృథా చర్చలకు సాహిత్యం ఒక రంగం కావడం ఓ పరిణామం.
      సమకాలీన వాదాలైన అస్తిత్వ వాదమూ, దళిత వాదమూ, స్త్రీ వాదమూ మొదలైన కొత్త భావాల సాయంతో చరిత్రనూ, సామాజిక శాస్త్రాలనూ విశ్లేషించడం అభిలషణీయం. అయితే సాహిత్యానికి వాటన్నిటి మూలాలను స్పృశించగల శక్తి ఉంది. ఎందుకంటే సామాజిక శాస్త్రాలు సమాజాన్ని గురించిన సిద్ధాంతపరమైన జ్ఞానాన్ని అందజేస్తే సాహిత్యం అనుభవ ప్రధానమైన, అనుభూతి ప్రధానమైన వివేకాన్ని అందజేస్తుంది. రూపం లేని భావాలకు రూపాన్నివ్వటమే సాహిత్యం. ‘వ్యక్తి ఆశ్రిత’మైన న్యాయానికీ, సామాజిక న్యాయానికీ సమతౌల్యం సాధించడంలో సాహిత్యం పాత్ర చాలా ఉంటుంది.
ప్రస్తుత పరిస్థితి
కానీ ఈనాటి సాహిత్య వాతావరణాన్ని గమనిస్తే, సామాజిక న్యాయం వంటి వాటి గురించి రాయడం తమ కళారాధనను కించపరుచుకోవడమే అనుకునే ప్రతిభావంతులు రోజురోజుకూ ఎక్కువ అవుతున్నారు. అలా కాకుండా సమాజంలోని అన్యాయాలకు స్పందించేవాళ్లు వాటిని దళితవాదమో, స్త్రీవాదమో, అస్తిత్వవాదమో మరేదైనా ప్రత్యేక సమస్యకు చెందిన అంశమో... వీటికి సంబంధించిన కోణాలనుంచి మాత్రమే విశ్లేషించగలుగుతున్నారు. దీని కారణంగా ఆ సమస్యలకు కళారూపం కల్పించడానికి అవసరమైన సార్వజనీనతా, విశ్వసనీయతా కొరవడి, అవి ఆ వాదాల ప్రచార సాహిత్యంగా మారిపోయే ప్రమాదం కలుగుతోంది. అన్ని వాదాల పరిజ్ఞానాన్నీ మేళవించుకుని, ప్రజాబాహుళ్యం ఇది మా కథే, ఇవి మా జీవితాలే అని స్పందించే విధంగా సాహిత్యసృష్టి జరగాలి. ఏ ఒక్క సమూహానికో మాత్రమే ఆ రచన పరిమితమై ఉండిపోకూడదు.
సమన్వయం
లింగ, కుల, వర్గ వివక్షలూ, అవే కాక జాతి, మత, ప్రాంత వివక్షలూ - వీటిని గుర్తించి - ఇవి, సామాజిక న్యాయాన్ని ప్రజలకు అందనీయడం లేదని, వీటికి వ్యతిరేకంగా గొంతెత్తిన రచయితలు ఉన్నారు. వీళ్లని ఆయా వాదాల పరిమితిలో బంధించడం సరి కాదు. వాళ్లు సమాజానికంతటికీ చెందినవాళ్లు. ఈ వాదాలన్నింటి ప్రయోజనం సమాజం బలహీనులుగానూ, బలవంతులుగానూ విడిపోయి ఉందనీ, అందరికీ ‘సామాజిక న్యాయం’ అందకపోడానికి అదే ఆటంకమవుతోందనీ ప్రజలందరికీ తెలిసేటట్టు చేయడం.
సామాజిక న్యాయం గురించి ఇన్ని విభిన్న వాదాల వెలుగులో, ఇంత విస్తృతంగా చర్చ జరగని కాలంలో, కేవలం తమ సంవేదనా శక్తినే చుక్కానిగా తీసుకుని సామాజిక బాధ్యతతో రచనలు చేసినవారు, 1940- 1970 కాలపరిధిలోని సమాజాన్ని చిత్రించిన కొంతమంది రచయితలు ఉన్నారు. ‘‘అణువును పరిశీలించి పదార్థ స్వభావాన్ని గ్రహించగలగడం, పదార్థ స్వభావాన్నీ, లక్షణాన్నీ అణువులో చూడగలగడం మంచి రచయితల రచనా రహస్యం’’ అంటారు కాళీపట్నం రామారావు. అలాంటి మౌలిక విలువలను ఆవిష్కరించడంలో ‘బాల్యం’ పారదర్శకమైన మాధ్యమంగా ఆ రచయితలకు విశేషంగా సాయపడింది.
బాల్యం విశిష్టత
సమాజ ప్రభావాలను రుజువు చేసే సమష్టివాదాన్నీ, నిగూఢమైన వ్యక్తిత్వాన్ని ప్రదర్శించే అవకాశమిచ్చే బాల్యావస్థనూ కలిపి ఆలోచిస్తే ‘సామాజిక న్యాయం’ ఓ కొత్తరూపుతో కనపడుతుంది.
      జీవితానుభవాలు మనిషి వ్యక్తిత్వాన్ని, బాల్యంలో ప్రభావితం చేసినంత తీవ్రంగా తర్వాతకాలంలో చేయవు. అలాగే సమాజ ప్రభావాలకు అతి చేరువలో ఉండేదీ బాల్యమే. సమాజంలోని లోటుపాట్లు పిల్లల అంతరంగాలమీద ఎలాంటి సంచలనాలను సృష్టిస్తాయో గుర్తించిన రచయితలు, ఆ వృత్తాంతాల్లో వారు దర్శించిన జీవిత సత్యాలను పొందుపరిచి, పిల్లలను ప్రధాన పాత్రలుగా మలిచి కథలు రాశారు. వాటికిముందే ‘కన్యాశుల్కం’ వచ్చింది. గర్భంలో ఉన్న పిల్లలకు సైతం బేరం కుదుర్చుకుంటున్న పరిస్థితులను చూసి, అలాంటి దురాచారాలను బట్టబయలు చేయడం, సంస్కారాన్ని పెంపొందించే భావాలను ప్రచారం చేయడం కంటే ఉత్కృష్టమైన లక్ష్యం సాహిత్యానికి లేదనీ, అందుకే ఈ నాటక రచనకు పూనుకున్నాననీ గురజాడ అన్నారు. నాటకంలో మన కళ్ల ముందుకురాని ‘సుబ్బి’ విషాదాన్ని ‘పూర్ణమ్మ’ గొంతులో మనం వినగలం. ఆత్మహత్య తప్ప మరి గత్యంతరం కనపడని బాలల దురవస్థ ఆ కవితలో గ్రంథస్థం అయింది. ఇక కథల్లో చూస్తే...
కుంకుడాకు (1943) - చాసో: పారమ్మ, గవిరి ఇద్దరూ ఎనిమిదేళ్ల పిల్లలు. పారమ్మ మోతుబరి కూతురు, గవిరి కూలీ కూతురు. ఆ భేదం వాళ్ల బట్టల్లో కనిపిస్తూనే ఉంటుంది. కానీ దాన్ని నిర్విచారంగా ఆమోదించడానికి గవిరికి వయసు చాలదు. అయితే, కథ చివర్లో బుగత చేసిన అన్యాయానికి నిరసన ప్రకటిస్తూ ‘లమిడీ కొడకా! నీ సింత కంప లెవిడికీ అక్కర నేదు’ అని చింత కంపలు వదిలేసి ‘కుంకుడాకు’లను మాత్రమే ఏరుకోడం గవిరిలో ఉన్న ఆత్మాభిమానానికి తార్కాణం.
ఎందుకు పారేస్తాను నాన్నా? (44) - చాసో: ‘బడి నాది’ అని కృష్ణుడు చేసిన తీర్మానం విశ్వవ్యాప్తంగా ‘విద్య’ బాలలందరి ప్రాథమిక హక్కు అని గుర్తుచేస్తుంది. తండ్రి తన చుట్టల వ్యసనాన్ని వదులుకుని, ఆ డబ్బుతో చదువు చెప్పిస్తానని మాట ఇస్తాడు. దానితో కృష్ణుడి ప్రాణాలతో పాటూ పాఠకుల ప్రాణాలు కూడా కుదుట పడతాయి.
ఆడబ్రతుకే మధురం (47) - కొ.కు.: సమాజంలో ఆడవారిపై ప్రచారమయ్యే చులకన భావాలు, అప్పుడొకటీ అప్పుడొకటీగా విన్న చిన్నపిల్లలు వాటినెలా అర్థం చేసుకుంటారో వర్ణిస్తూ చేసిన చిన్న రచన ఇది. స్త్రీ పురుషుల స్థానాలలో ఉన్న అసమానతలూ, వాటికి అనుగుణమైన భావజాలమూ పిల్లల మెదళ్లలోకి యథాతథంగా పంపిణీ అవుతాయి. క్రమేణా అవి వారిపాలిటి ‘శాశ్వత సత్యాలై’పోతాయి. ‘‘ఎంతో పాపం చేసుకుంటే గానీ ఆడవాళ్లై పుట్టరట, అమ్మమ్మ చెప్పింది. అందుకనే మొగవాళ్లాడవాళ్లని కొడతారు. తిడతారు’’. ‘‘ఆడవాళ్లంత చదువు చదువుకుంటే చెడిపోతారు’’. ఇలాంటి సమాజపు ప్రచారానికి, ‘‘ఆడబ్రతుకే మధురం’’ అనే రేడియో పాట ప్రతీకగా కొ.కు. చిత్రిస్తారు. అవన్నీ నిజమే అని నమ్మడానికి ఈ కథలోని పిల్ల ప్రయత్నిస్తుంది. కానీ ఆమె ఎరుకలో ఉన్న కృష్ణమూర్తి కుటుంబం లోకం చేసే ప్రచారానికి విరుద్ధంగా కనిపించడమూ, వాళ్లు ఆనందంగా ఉండటమూ ఆమెను ఆలోచనలో పడేస్తాయి. చివర్లో ఆ పిల్ల ఇలా నిశ్చయించుకుంటుంది... ‘‘నేను పెద్దదాన్నైతే కొట్టే మొగుణ్ణి మాత్రం చేసుకోను. పుణ్యం లేకపోతే పీడాపాయె, ఎవరు పడుతారమ్మా దెబ్బలూ, తిట్లూనూ? పెద్దదాన్నైతే ఎవరికీ తెలీకుండా కిష్టమూర్తి గార్ని చేసుకుంటాను!’’ ‘‘ఆడబ్రతుకే మధురం!’’ అనే పాట పాడటం మానేసింది రేడియో.
ఇద్దరు పిల్లలు (54) - రావి శాస్త్రి : సుబ్బడి ‘వ్యామోహం’ మీద వాడి ‘వివేకం’ గెలిచేలోగా జరగాల్సిన అనర్థం జరిగిపోతుంది. ఆ బస్సుతో ఆడుకోకుండానే గోపాలం తమ్ముడు కన్ను మూస్తాడు. ‘‘అచ్చంగా, అచ్చంగా తీసుకోరా! నా కొద్దురా ఇదీ’’ అంటూ చెయ్యి చాచి తీసుకోమని ఏడుస్తూ చెబుతాడు సుబ్బడు గోపాలంతో. కథలోని జీవితసత్యం ఈ వాక్యంలో ఇమిడి ఉంది. కొన్ని వస్తువులు మనుషుల్ని వేరు చేస్తాయి. కొన్ని పరిస్థితులు మనుషుల్ని దగ్గరగా తీసుకొస్తాయి.
తీర్పు (64) - కారా: ఓ మధ్య తరగతి కుటుంబంలో పిల్లలు అట్టలు తయారుచేసుకుని (తయారైన అట్టల్లో ఒకటి మెరుగైంది), వాటిని పంచుకోవడం ఇందులో కేంద్ర సంఘటన. అట్టల తయారీలో ప్రధానపాత్ర వహించిన రెండో కొడుకు, ‘పంపకం’ కూడా తనచేతిలోకి తీసుకోవడం, మేలు రకం అట్టను తానే తీసుకోవడం ఈ కథలో స్పష్టమౌతున్న సామాజిక న్యాయం. నాలుగు ఒకే రకం అట్టల మధ్య అయిదో అట్ట కాస్త మేలు రకానిది చేరితే ఎలాంటి ఆర్థిక, రాజకీయ సమస్య ఏర్పడేదీ ఈ కథ చిత్రిస్తుంది. ఆదర్శవంతమైన సమాజంలో, ఉత్పత్తి చేసేవారే సంపద పంపకం ఏ రీతిలో జరగాలో నిర్ణయిస్తారనీ ఈ కథ ప్రతీకాత్మకంగా చెబుతుంది. ఎవరెవరు అన్యాయానికి ఎలా సహకరించినదీ తెలిసిన రెండో కొడుకు పక్షపాత బుద్ధితో వ్యవహరించే మేనత్తతో ఇలా చెప్తాడు. ‘మొదట అన్నయ్యని పంచమన్నాం. వాడికి చేతులు రాలేదు. అమ్మకు పంచడం ఇష్టమే కానీ ఆమెకు చేతనయింది కాదు. చేతనయ్యీ ఎందుచేతో నాన్నగారు వెనకా ముందూ ఆలోచిస్తున్నారు. నువ్వైతే, అడక్కుండానే పంచడానికి వచ్చేవు’.
హింస (68) - కారా: పదేళ్ల సంగి లేత మనసుకు అయిన గాయం హింస కథ. ఇందులో సంగి బాల్యపు అమాయకత్వం, ఒక్కసారిగా ఆమెకు అవగతమైన సమాజపు క్రౌర్యమూ చిత్రితమవుతాయి. ఆమె స్థానంలో మనముండి ఆలోచిస్తే గానీ ఆమె మానసిక పరిస్థితిని మనం అర్థం చేసుకోలేమని రచయిత కథ ముగింపులో చెబుతారు.
చింపిరి (70) - పెద్దిబొట్ల సుబ్బరామయ్య: ఈ కథలో మనకు కనిపించే కొన్ని దృశ్యాలు సమాజానికి ప్రతిబింబాల్లా ఉంటాయి. నిరాశ్రయులైన పిల్లలు ఏ దారీ తెన్నూ లేకుండా పరిభ్రమించడం, వారిలో ‘దేవుడు’ వంటివారు నేర ప్రపంచానికి ఆకర్షితులై, అతికొద్ది కాలంలోనే సమాజానికి దూరమైపోవడం మనముందు అతిసహజంగా జరిగిపోతూనే ఉంది. ఈ నేపథ్యంలో ‘చింపిరి’ వంటి పిల్లలకు, షాపు యజమాని వ్యాపార ప్రపంచం పులిబోను వంటిదనీ, నాలుగు డబ్బులు తక్కువ దొరికినా, తమ తోటి బీద బికారి పిల్లల మధ్యనే వారికి ‘రక్షణ’ ఉంటుందనీ, ‘న్యాయం’ దొరుకుతుందనీ రచయిత సూచించారనిపించింది. దిక్కూ మొక్కూ లేని ఆ పిల్లలకు మురికిని శుభ్రం చేసి, ముష్టి అడుక్కునే సదుపాయమే పెన్నిధిలాగా ఉండటం కథలోని అసలైన విషాదం.
మానవుడు తాను పొందిన అనుభవాన్ని జగత్తుకు అందించే ప్రయత్నాలే కళారూపాలయ్యాయి. ‘కరుణ’ సాహిత్యసృష్టికి కారణభూతమైన అనుభూతి. కరుణ రసాశ్రితమైన ఈ కథలు మానవజీవితాలను పిల్లల కోణంనుంచి విశ్లేషిస్తాయి. మనని ఆలోచించమంటాయి. సామాజిక న్యాయాన్ని కావాలంటాయి. ప్రతీ కథలోనూ సమాజంలో దాగి ఉన్న అన్యాయం, అది ఆ పసివారి మనసులో కలిగించిన సంఘర్షణా సామాన్య అంశంగా ఉంటుంది. ఈ కథలన్నిటిలోనూ సామాన్యాంశం అయిన పిల్లల మానసిక వేదన ముందు ముందు వాళ్లని ఎలాంటి వ్యక్తులుగా మారుస్తుందో వూహించగలమా! అయితే ‘బిడ్డల శిక్షణ’ (1925)లో చలం మాత్రం పిల్లల క్షేమాన్ని కాంక్షించి, వారి గురించి ప్రేమతో, దయతో, బాధ్యతతో చర్చించారు. ‘‘ఈ పిల్లలు ఎప్పుడూ సమ్మె కట్టలేరు. తెలివి తెచ్చుకోలేరు. ధిక్కరించలేరు. ప్రార్థించలేరు, నోరు లేదు, శక్తి లేదు. మీలో అపారమైన విశ్వాసం తప్ప’’ అని అంటారాయన. పిల్లలకి వేరెవ్వరి మీదా కాదు మన మీదే నమ్మకం వారి సంరక్షకులమని. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే మనిషితనం.
చివరగా...
మితిమీరిన వ్యక్తివాదం సామాజిక న్యాయ చర్చలను కుంటుపరుస్తోందేమో!. ‘పాపం, పుణ్యం, ప్రపంచమార్గం ఏమీ ఎరుగని’ వారని శ్రీశ్రీ శైశవ గీతిలో తలుచుకున్నట్టు, ప్రతికూల వాతావరణంలో సైతం మొక్కవోని ‘ఆత్మశక్తి’తో నిల్చున్న ఈ పిల్లల గాథలు ‘వ్యక్తి వాదుల’కు కూడా నచ్చేవే.
విభిన్న వాదాల నుంచి ఎంతో బలం పుంజుకున్న తెలుగు ఆధునిక సాహిత్యం ఈనాడు వాటిని తప్ప మరేదీ చూడలేకపోతోంది. ఆ వాదాలిచ్చిన పరిజ్ఞానంతో సమస్యల మూలాలను తాకే సాహిత్య సృష్టి జరగాలి. అందుకే అన్నిటినీ తనలో సమన్వయ పరుచుకునే అంశాలను వెలికితీయడం, వాటి వెలుగులో సామాజిక న్యాయానికి ‘పునర్మూల్యాంకనం’ చేసుకోవాలనే లక్ష్యాలే ‘పిల్లల మానసిక సంఘర్షణ’ మీద ఈ విశ్లేషణకు కారణాలు.

*   *  *


వెనక్కి ...

మీ అభిప్రాయం