ఇదీ తెలుగు కథాక్రమం

  • 165 Views
  • 0Likes
  • Like
  • Article Share

    తెలుగు వెలుగు బృందం

సాయంత్రం అయ్యిందంటే చాలు.. అమ్మమ్మా కథ చెప్పవా అంటూ మారాం చేస్తూనో, నానమ్మా కథ చెప్పు అంటూ గారాం చేస్తూనో పిల్లలందరూ పెద్దవాళ్ల చుట్టూ చేరి కథ చెప్పించుకోవటం గతకాలపు జ్ఞాపకంలా మిగిలిపోయిన ఒక అందమైన అనుభవం.
      అనగనగా అంటూ సాగదీస్తూ.. ‘ఒక ఊర్లో...’ అనగానే నిద్రలోకి జారుకునే పిల్లలు కొందరైతే, గంటలసేపూ కథలు ప్రవహిస్తున్నా ఇంకా చెప్పమని మారాం చేసేవాళ్లు మరికొందరు. అలా అమ్మమ్మలు, నాన్నమ్మలు చెప్పిన కథల స్వరూప స్వభావాలు వేరు. అవి ప్రధానంగా పురాణ, జానపద కథలు. ఇప్పుడు మనం వివిధ పత్రికల్లో చదువుకునే కథల స్వభావం వేరు. వాటిలో కొన్ని జీవన వాస్తవ చిత్రణలు, మరికొన్ని ఊహాకల్పనలు.
      ఏదేమైనా మన జీవితాల్లో కథలకున్న ప్రాధాన్యం గొప్పది. ఇప్పుడు మనం వివిధ వార, మాస పత్రికల్లోను, పుస్తకాల్లోనూ చదువుకునే కథల లోతుల్లోకి వెళ్తే ఎన్నో ఆసక్తికరమైన విషయాలు అవగతమౌతాయి. తెలుగులో కథలు ప్రచురించని పత్రికే లేదంటే అతిశయోక్తి కాదు. కథల ప్రచురణ కోసమే ‘విపుల’ వంటి పత్రికలు నిర్వహిస్తున్నారు. 
      ఒక సంవత్సర కాలంలో వివిధ పత్రికల్లో లేదా నేరుగా పుస్తకాల రూపంలో అచ్చయే కథలు సుమారు రెండు నుంచి మూడు వేల వరకు ఉంటాయని ఒక అంచనా. రాశిలోనే కాదు వాసిలోనూ తెలుగు కథ అత్యున్నత స్థాయినందుకుంది. ఎంతోమంది కథకులు తెలుగు కథను పరిపుష్టం చేశారు. శ్రీపాద రాసిన ‘వడ్లగింజలు,’ ‘గులాబీఅత్తరు’ కథలు, అంతర్జాతీయస్థాయిలో బహుమతి పొందిన పాలగుమ్మి పద్మరాజు ‘గాలివాన’, రాచకొండ విశ్వనాథశాస్త్రి ‘న్యాయం’ తెలుగు కథస్థాయిని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టాయి. కాళీపట్నం రామారావు రాసిన ‘యజ్ఞం’కథపై ఓ పెద్ద పుస్తకమే వచ్చింది. దాదాపు మూడు వందల పేజీల వ్యాస సంకలనం కథాయజ్ఞం.  ప్రముఖ హిందీ, ఉర్దూ రచయిత ప్రేమ్‌చంద్‌ రాసిన ‘కఫన్‌’ కథకు మాత్రమే దక్కిన స్థాయి అది. నాటి కొడవటిగంటి కుటుంబరావు, చలం, చా.సో. నుంచి నేటి ఓల్గా, సత్యవతి, అల్లం రాజయ్య వంటివారు రాసిన కథలు  పాఠకుల్ని అలరిస్తూనే ఉన్నాయి. వందలాది కథల సంపుటాలు, సంకలనాలను పాఠకులు ఆదరిస్తూనే ఉన్నారు. 
      మన జీవితంలోను, సాహిత్యంలోనూ ఇంతటి ప్రాధాన్యత కలిగిన కథ మనం చదువుతున్న రూపంలో పుట్టి ఎన్నేళ్లయి ఉంటుంది? 
      ఒక్క మాటలో... చెప్పాలంటే తెలుగులో అచ్చయిన మొట్టమొదటి కథ ఏది? 
      ఇది సాహిత్యంతో పరిచయమున్న, అవగాహన ఉన్న వారికి తెలిసిన సంగతే అయినా చాలామందికి తెలియకపోవచ్చు. ఈ ప్రశ్నకు సమాధానం అంత తేలిగ్గా దొరుకుతుందా..? ఓ ఇరవై సంవత్సరాల క్రితం వరకు అయితే వెంటనే సమాధానం దొరికేది. 
      గురజాడ అప్పారావు రాసిన ‘దిద్దుబాటు’ తొలి తెలుగు కథగా దాదాపు అందరూ ఒప్పేసుకున్నారు. అంతేకాదు.. తొలి తెలుగు ఆధునిక నాటకం ‘కన్యాశుల్కం’ రాసింది కూడా ఆయనే. దిద్దుబాటు కథ 1910లో ‘ఆంధ్రభారతి’ ఫిబ్రవరి సంచికలో ప్రచురితమైంది. ఈ కథను అప్పారావు ‘కమలిని’ పేరుతో గ్రాంథిక భాషలో ముందుగా రాశారు. తరవాత దాన్ని దాదాపు పూర్తి వ్యావహారికంలోకి మార్చి ‘దిద్దుబాటు’ పేరుతో రాసిన కథ ‘ఆంధ్రభారతి’లో అచ్చయింది. వేశ్యాలోలుడైన భర్తను, తను నేర్చిన చదువుసంధ్యలవల్ల అబ్బిన సమయస్ఫూర్తితో చిన్న నాటకమాడి దారికి తెచ్చుకున్న భార్య కథ ఇది. ‘‘తలుపు...తలుపు’’ అంటూ మొదలయ్యే ఈ కథ తెలుగు కథకు ద్వారాలు తెరిచిందని సాహిత్యవిమర్శకులంతా అంటారు. 
      అయితే 1985 ప్రాంతాల్లో ప్రముఖ కవి, విమర్శకులు ఆరుద్ర తొలితెలుగు కథ దిద్దుబాటు కాదని, ఆచంట వేంకట సాంఖ్యాయన శర్మ రాసిన ‘లలిత‘ అని ఒక వ్యాసంలో పేర్కొన్నారు. ఈ కథ ‘కల్పలత’ పత్రికలో 1903 నవంబరులో అచ్చయింది. కానీ ఈ కథ మొత్తం గ్రాంథిక భాషలో ఉండటం వల్లా ఏ మాత్రం ఆధునిక ధోరణులు ప్రతిబింబించకపోవడం వల్లా దీనిని తొలి కథగా అంగీకరించలేమని ప్రముఖులు అనేకమంది వాదించారు. (1978లోనే పురిపండ అప్పలస్వామి ఈ కథ గురించి ఒక వ్యాసంలో తెలియజేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు) ఆయనదే మరోకథ 1903లో అదే సంచికలో వెలువడిన వైనాన్ని 2005 సెప్టెంబరు ‘విపుల’ మాసపత్రికలో ప్రముఖ పరిశోధకులు అక్కిరాజు రమాపతిరావు వివరించారు. 
      ఈ చరిత్ర ఇలా నడుస్తుండగానే ఇటీవల పరిశోధనల ఫలితంగా భండారు అచ్చమాంబ రాసిన ‘స్త్రీవిద్య’, (ఈ కథలో భాషను మాత్రం నవీకరించి ‘తెలుగు వెలుగు’ మార్చి, 2013 సంచికలో ప్రచురించాం) ‘ధనత్రయోదశి’ కథలను తొలి కథలుగా భావిస్తున్నారు. ఈ రెండు కథలు 1902లో ‘హిందూసుందరి’లో ప్రచురితమయ్యాయి. ఇలా పరిశోధనలు జరుగుతున్న కొద్దీ, కొత్తవిషయాలు వెలుగులోకి వస్తున్నకొద్దీ తొలి కథ నిర్ధరణలు మారిపోతున్నాయి. ఈ మధ్య కథారచయిత వివినమూర్తి రాసిన వ్యాసం ఆధారంగా 1902కు ముందే మరికొన్ని కథలున్నాయని అర్థమౌతుంది. ఇవి ఇంకా వెలుగులోకి రావల్సిఉంది. 
      ఏతా.. వాతా చెప్పొచ్చేదేమంటే ఇప్పటివరకు లభించిన సమాచారం, ఆధారాల మేరకు తెలుగులో అచ్చయిన తొలి కథ ‘స్త్రీవిద్య’ లేదా ‘ధనత్రయోదశి’ అనుకోవాలి. వీటి రచయిత భండారు అచ్చమాంబ (1874-1905) మహిళాభ్యుదయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న కార్యకర్త. స్త్రీల వ్యక్తిత్వాన్ని ప్రకాశపరిచే ఎన్నో వ్యాసాలు, కథలు; స్త్రీల చరిత్రలు రాశారు.
      తెలుగు సరే..! ఇతర భారతీయభాషల సంగతెలా ఉందో ఒకసారి చూద్దాం..
      1873లో పూర్ణచంద్ర ఛటర్జీ రాసిన ‘మధుమతి’ తొలి బెంగాలీ కథ. 1896లో హరినారాయణ ఆప్టే రాసిన ‘కాల్‌ కఠిన్‌ ఆలా’ తొలి మరాఠీ కథ. 1898లో ఫకీర్‌ మహమ్మద్‌ సేనాపతి రాసిన ‘రేబతి’ తొలి ఒరియా కథ. 1900లో పంజే మంగేష్‌రావ్‌ రాసిన ‘సన్నచిక్కతాయి’ తొలి కన్నడ కథ. వీరంతా పురుషులు. అయితే తొలి తెలుగుకథ రాసింది మాత్రం మహిళ. తెలుగు మహిళా జిందాబాద్‌. 


వెనక్కి ...

మీ అభిప్రాయం