తలంటి...!

  • 155 Views
  • 0Likes
  • Like
  • Article Share

మన తలంటే, అదే తెలుగువాడి తలంటే ఆషామాషీ కాదు. కానీ కొంతమంది తలని తలంటుకోడానికే వాడుతుంటారు. కొంతమంది తల మీద జుట్టు ఎలా మొలిపించాలో అని జుట్టు పీక్కుంటూ ఉంటారు. కొంతమంది తలను అస్సలు వాడరు. ఇంకొంతమంది తలని అలంకారప్రాయంగా అలా వొదిలేస్తూంటారు. మరికొంత మందికి తలకాయకి, ఆవకాయకి తేడా తెలీదు. ఎంత తెలుగు తలకాయైనా, ఒక్కోసారి తలకాయ మీద నాకే ఎన్నో అనుమానాలొస్తుంటాయి. ‘సినిమా ఎలా ఉందీ’ అంటేనో ‘అమ్మాయి బాగుందా’ అంటేనో, నీ తలకాయలా ఉంది అనేవారు. అమ్మాయి విషయంలో సరే ఎలా ఉన్నా బానే ఉందని సర్దేసుకునేవాడ్ని, కానీ సినిమా విషయంలో కొంచెం అనుమానంగా ఉండేది. ఇంతకీ బాగున్నట్టా లేక బాగులేనట్టా? ఈ విషయం కూలంకషంగా ఈ మధ్యే అర్థమయ్యింది. ‘బాబాయ్‌ ఈ గుర్రం బొమ్మెలా ఉంది’ అని మా వాడడిగితే, ‘నా తలకాయలా ఉంది’ అనే సరికి, వాడు మూతి ముడుచుకున్నాడు. ‘ఏరా?’ అంటే, ‘బాలేదన్నావుగా.’ అన్నాడు.
      తల బాగుండాలి అనే నియమం ఎక్కడా లేకపోయినా, బాగుంటే బాగుంటుంది కదా? ఒకడు ఓ సారి తలమాసిన వాడా అని మరొకడిని అన్నాడు. తల మాసిపోవటమేంటి, చొక్కా, లాగూ మాసిపోయినట్టు. అలా అయితే తలకో సబ్బుండేది కదా ఉతుక్కోటానికి? ఏమో ఎంత తలబద్దలు కొట్టుకుని ఆలోచించినా అర్థం కాలేదు. ఇక తల బద్దలైపోతే ప్రమాదం అని తలచి, తలొంచేశా. కానీ దానర్థం, అనర్థమని గురజాడ వారు చెబితే కానీ అర్థం కాలేదు. అబ్బే ఆయన ప్రత్యక్షంగా చెప్పలేదు. కన్యాశుల్కంలో గిరీశం బుచ్చమ్మని చూసి, వెంకటేశంతో ‘ఏమిటోయ్‌ నీ అక్క తల చెడినట్టుంది’ అంటాడు. తలకాయలేని వెంకటేశం ఏం చెప్పాలో తెలియక ‘మరే, మా అక్క జుత్తుకి నూనె రాసుకోదు’ అంటాడు. ‘హార్నీ, తలచెడ్డం అన్నా, తలమాయడం అన్నా మొగుడో పెళ్లామో బాల్చీ తన్నేయటం! అంటే మొగుడో పెళ్లామో బాల్చీ తన్నకుండా ఉండాలంటే, బాల్చీ అయినా అవతల పడేయ్యాలి, లేక తలకి నూనె అయినా రాసుకోవాలి. అందుకే, అప్పటి నుంచి, పెళ్లి కాకపోయినా తలకి నూనె రాయడం మొదలెట్టారు. అప్పట్నుంచే తల క్షవరం అవ్వడం మొదలైంది. అటు నూనెకి ఇటు క్షవరానికి.
      కొంతమంది జంతికల్ని, చెక్కప్పడాలను తిన్నట్టు తలని ఇట్టే తినేస్తారట. ‘అబ్బా! మా ఆవిడ రోజూ పొద్దున్నా సాయంత్రం, పండక్కి పట్టు చీర కొనమని, నా తలని పీచు మిఠాయిలా తినేస్తోంది’ అంటూంటారు. పొద్దున్నే ఏ ఇడ్లీ కారప్పొడో, పెసరట్టుప్మానో తింటే తలకి బాగుంటుంది కానీ, ఇలా సరాసరి మరొకరి తలని తినేస్తే ఏం రుచిస్తుందో? అందులోనూ, సరుకేమీ లేని మొగుళ్ల తలలు? ఏమైనా అది వాళ్ల తలరాత.
      తల రాతంటే గుర్తొచ్చింది. తల వ్యాకులత ఎంత? విస్తీర్ణం ఎంత? దాని అధికారం ఎంత వరకు? బ్రహ్మ నుదుటి మీద ఏదో రాసి కిందకి తోసేస్తాడు. కిందకొచ్చేసరికి అది తలరాతగా ఎలా మారిపోయింది చెప్మా? బ్రిటీషు వాడు తన రాజ్యాన్ని విస్తరించుకుంటూ పక్కరాజ్యాలు కలిపేసుకున్నట్లు, చెన్నైలో ఒడ్డుని సముద్రంలో కలిపేసుకుపోతున్నట్టు, పల్లవ రాజులు కట్టిన గుళ్లు సముద్రం కబళించినట్టు, తల నుదుటిని కబ్జా చేయలేదు కదా? తల కొలతలు సాధారణంగా తొమ్మిది అంగుళాల పొడవు, ఆరు అంగుళాల వెడల్పు, ఇరవై మూడు అంగుళాల చుట్టుకొలత. మరి నుదురు ఇందులో కలవ లేదు కదా. అబ్బో ఆలోచిస్తే తల వాచిపోతోంది.
      ఆలోచిస్తే తల వాచిపోతుందా? తెలియదు. నాకు ఎప్పుడూ తల వాచిపోలేదు. (ఆలోచించలేదు అన్నా అభ్యంతరం లేదు). అసలే తలకిందులుగా తపస్సు చేస్తే ఈ తల బాపతు శరీరం వచ్చింది. ఇప్పుడు తల బాదుకుని, తల ఎలా వాచిపోతుంది అని ఆలోచించడం, తలకి మించిన భారం. మరే చెప్పలేదు కదూ. ఏదైనా మనం చేయలేనిది తలకి మించిన భారమే అవుతుందట. ఇంతా చేసి మన తల అయిదుకిలోల కన్నా ఎక్కువ బరువుండదు. అంటే మనం ఏ పనైనా చేసేటప్పుడు అది అయిదు కిలోలకన్నా ఎక్కువుందా లేదా అని తూచుకుని చేస్తే సరి. తలకి మించిన భారం అవ్వదు. నిజంగా. అందుకే తలకి నిత్యం తలంటు పోసి జాగ్రత్తగా చూసుకోవాలి.
      తలంటు అంటే ఏ నీళ్ల గదిలోనో పోసుకునేది. కానీ ఈ మధ్య కొంతమంది ఇంకొకరికి ఎక్కడ పడితే అక్కడ తలంటుతున్నారని వినికిడి. ప్రతిపక్షం వాళ్లు అధికార పార్టీ వాళ్లకి అసెంబ్లీలో తలంటు పోసేస్తున్నారట. ఆఫీసుల్లో అధికార్లు వాళ్ల కింది వాళ్లకి, కొంతమంది అత్తగార్లు అల్లుళ్లకి, అల్లుళ్లు మామగార్లకి, కోడళ్లు అత్తగార్లకి, ఏదో వంకన అస్తమానూ తలంటులు పోస్తూనే ఉంటారు. తలంటు బాధకి తాత్కాలిక రక్షణ టోపీ పెట్టుకోడమో, పెట్టించుకోడమో!
      టోపీ పెట్టుకుంటే తల కాస్తుందా? కానీ, చాలామంది నోరుంటే తల కాస్తుందంటారు. నోరుకి తలకి ఏంటి సంబంధం? నోరు లేకపోతే తలకి రక్షణ ఉండదా? నోరు విప్పి మాట్లాడితే తలకి ముప్పా? లేక నోరు విప్పకుండా ఉంటే తలకి ముప్పా? కానీ మహాభారతంలో జయద్రథుడి విషయంలో తన తండ్రి నోటితో ఇచ్చిన వరం వల్లే ఇద్దరూ చచ్చారు. అంటే ఒకరి నోటి వల్ల కూడా ఇంకొకరి తలకి ముప్పుంటుందన్న మాటే కదా? అందుకే ఇలా తల తిరిగే విషయాలు పక్కకి పెట్టి, తలలో నాలుకలా ఉంటే మంచిదనిపిస్తోంది. కానీ ఇది కొంచెం కష్టమే. మనకున్న ఒక్క నాలుకని లాక్కోలేక పీక్కోలేకా, దాన్ని రక్షించుకోలేక చస్తుంటే, మనం ఇంకొకరి తల్లో నాలుకలా పడుండమంటే పెద్ద తలనొప్పి.
      తలపోటు కొంతమందికి ఉత్తినే కూడా వస్తుంటుంది. పిల్లలు బడి ఎగ్గొట్టానికి, పెద్దాళ్లు ఆఫీసెగ్గొట్టానికి ఎక్కువగా వాడుతుంటారు. నిజంగా తలనొప్పి అనిపిస్తే ముందుగా సంతోషించాలి. ఎందుకంటే అది రావడం వల్లే కదా మనకి తల ఉందని తెలిసేది? ఇలా అప్పుడప్పుడూ వస్తూ ఉంటే మంచిదే! తల ఉందని గుర్తుకొస్తుంటుంది.
      తలనొప్పంటే, తలకొచ్చే నొప్పి ఒక్కటే కాదు. తల లేకపోయినా వచ్చేదట. కొన్ని తలనొప్పులు ఏ మందుకీ తగ్గవు. పోతే కొన్ని సందర్భాల్లో తల తీసేసినట్టు కూడా ఉంటుంది. అంటే మీరు అడగొచ్చు, తల తీసేస్తే ఎలా ఉంటుంది అని. నాకు అనుభవం లేదు, ఇలాగే నరసింగరాజు తల తీసేసిన అలనాటి బాలచంద్రుడ్ని అడిగితే బాగుండేది. ఇక్కడ పల్నాటి పౌరుషంతో, బాలచంద్రుడు నరసింగరాజు తల నరికేసరికి, చచ్చిపోయిన ఆయనకి పాపం తల తీసేసినట్టయ్యిదంటే నమ్మండి.
      తల తీసే వాడుంటే, వాడి తల తన్నేవాడుంటాడండోయ్‌. అదే, తాడిని తన్నే వాడుంటే వాడి తల తన్నే వాడుంటాడట. అసలు తాడిని ఎవరైనా ఎందుకు తన్నాలి? ఎంచక్కా చెట్టెక్కి, తాడికల్లు, తాటికాయలు తీసిచ్చే వాళ్లు కోకొల్లలుండగా. పైగా ఏ పనిలేనట్టు వాడి తల తన్నడం దేనికి? పనిలేని వాడు పిల్లి తల గొరిగినట్టు. ఏదేమైనా, నన్నడిగితే తలని తీసేయడం కంటే, తన్నడమే నయం. తన్నేశాక తలైనా మిగులుతుంది. కాకపోతే తల తీసి మొలేయకుండా చూసుకోవాలి.
      మొలేయటానికి ఇదేమైనా విత్తనమా? మళ్లీ ఇంకో మనిషి మొలకెత్తడానికి. నిజానికి మనుషులు చెట్లకి కాస్తే ఇంకేముంది, జనాభా సమస్యే ఉండదు. వానాకాలం వస్తే అవసరం ఉన్నా లేకపోయినా మన కరెంటోళ్లు చెట్లని ఇట్టే నరికి పారేస్తూంటారు. ఇప్పుడిక మనుషులు మొలకెత్తే మాటే ఉండదు. ఏదేమైనా గానీ తలకి అస్సలు రక్షణ లేకుండా పోయింది.
      పోనీ ఓ పని చేస్తే? తలని ఎక్కడైనా దాచేస్తే? అప్పుడెప్పుడో, తలని శరీరంలోంచి వేరు చేసే ప్రక్రియ ఉండేదట. ఇటీవల కూడా తలని అతికించే ప్రక్రియలో కాస్త విజయం సాధించారు పరిశోధకులు అని వార్త వచ్చింది! బ్రహ్మగారు ముందు చేసిన మోడల్సులో తలని విడదీసే పద్ధతిలోనే తయారు చేశాడట. కానీ ఒకావిడ తలతీసి కుర్చీపీట మీద పెట్టి తలకి జడ వేసుకుంటూ, ఎసరులో బియ్యం పోయటానికి ఇటు తిరిగిందో లేదో, అటునించి ఓ కుక్క తలని నోట్లో కరచుకుని ఎంచక్కా పోయిందట. ఇకప్పుడు అలా లాభం లేదని బ్రహ్మ తలని మొండానికి అతికించి పారేశాడు. అందుకని తలని దాచటం కుదరదు. కానీ, తలని తాకట్టు పెట్టొచ్చట.
      ఎవరి దగ్గరైనా తలని తాకట్టు పెట్టామే అనుకోండి, మరి తల తాకట్టు పెట్టుకున్న వాడు ఆ తలని వాడుకుంటాడా, లేక మనమే వాడుకొనే సౌకర్యం ఏదైనా ఉంటుందా? నా ఉద్దేశంలో తాకట్టు విడిపించుకునే దాకా మన తల మీద మనకి హక్కుండదు. ఇందులో ఇంకో మతలబుంది. తల సరిగా పని చేస్తే, తాకట్టు ఎందుకు పెడతాం కనక. అవతల వాడికి తలకాయ ఉంటే, మన తల తాకట్టు పెట్టుకోడు.
      తలకి కూడా ఆకలి వేస్తుంది, తెలుసా? అప్పుడప్పుడు తల మొట్టికాయలు తింటూంటుంది. దీన్లో విడ్డూరం ఏంటంటే, మనకి తెలీకుండానే మన తలకి ఆకలి వేస్తోందని వేరొకరు కనిపెట్టేసి, గభాల్న ఓ మొట్టికాయ వేస్తుంటారు. మన తల కూడా కిక్కురుమనకుండా తినేసి ఊరుకుంటుంది. ఒక్కోసారి తలకి బొప్పి కడుతుంది! చూసుకోకుండా ఏదైనా తెలీని దాన్లో వేలెడితే, తలకి బొప్పి కడుతుంది. వేలు బానే ఉంటుంది. మరీ చోద్యం కాకపోతే, తుంటి మీద కొడితే పళ్లు రాలాయన్నట్టు.
      ఏమైనా చెప్పండి, మన తల తాలూకా తలంపులు, తలవంపులు కాకుండా చూసుకునే బాధ్యత మన తల మీదే ఉంది. తలకి మించిన భారం అని వదిలేస్తే, తల దించుకునే పరిస్థితి వచ్చి, తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియక తలనొప్పి తెచ్చుకుంటే తల వాచిపోయి అది బద్దలైనా ఆశ్చర్యపడక్కర్లేదు.
      తలకి ఖరీదు కట్టలేం. అందులోనూ, తెలుగు వాడి తలంటే, అస్సలు కట్టలేం!

- శిఖర్, హైదరాబాదు


వెనక్కి ...

మీ అభిప్రాయం