‘అక్షరాలా’ దేవుళ్లు

  • 123 Views
  • 0Likes
  • Like
  • Article Share

    జి.వి.వి.సత్యనారాయణరెడ్డి

  • విజయనగరం.
  • 8008705913
జి.వి.వి.సత్యనారాయణరెడ్డి

అక్షరాలను అర్చించే ప్రకృతి పూజారులు... వర్ణమాలనే వేలుపుగా కొలుచుకునే వనవాసీలు... సిక్కోలు సవరలు. అమ్మభాషకు ‘అక్షరబ్రహ్మ’ రూపాల్నిచ్చి ఆలయాన్ని నిర్మించుకుని ఆరాధిస్తున్న అడవితల్లి బిడ్డలు వారు. భాషలో భగవంతుడి సర్వమంగళ స్వరూపాన్ని దర్శించుకోవడం ప్రారంభించినప్పటి నుంచి వారి జీవితాలకంటిన దుర్వ్యసనాలు దూరమైపోయాయి. 
      ఓం నమశ్శివాయ... అల్లాహో అక్బర్‌... హలెలూయా... పరమాత్మను పిలుచుకునే పదాలెన్నో. కొన్ని మతాలకు జన్మనిచ్చి, మరికొన్ని మతాలను ఆదరించి అక్కునజేర్చుకున్న విశిష్ట భారతం మనది. ఆస్తికులతో పాటు చార్వాకాది నాస్తికులకూ నిలయమైన నేల మనది. అలాంటి ఈ గడ్డపై ఆ రెండు వర్గాలకూ భిన్నంగా... మనిషిని మనిషితో కలిపే మాటను మహిమాన్వితంగా భావించి పూజించే తెగ ఉంది. మాతృభాషకు మంగళహారతులిచ్చే ఆ సమూహ సంస్కృతి ఎంతో ముచ్చటగొల్పుతుంది.        
      శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి ఒడిశా, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్, బీహార్‌ల వరకూ వ్యాపించి ఉన్న గిరిజనులు సవరలు. దాదాపు మూడు లక్షలకు పైబడిన జనాభా వీరిది. సపస్రాబ్దాల చరిత్ర ఉన్నా కొన్ని దశాబ్దాల కిందటి వరకూ వీరి అమ్మభాష సవరకు (ఆస్ట్రోఏషియాటిక్‌ భాషా కుటుంబంలోని ‘ముండా’ వర్గానికి చెందిన దీని అసలు పేరు ‘సొర’, కాలక్రమంలో రూపం మారింది) లిపి లేదు. పలికే మాటకు అమరత్వం సిద్ధించాలంటే ‘రాత’ ఉండాలన్న కోరిక కూడా లేదు వీళ్లకు అప్పట్లో. కాలక్రమంలో క్రైస్తవ మత బోధకులు వచ్చారు. సవరలతో మమేకమయ్యారు. వారి భాషను లాటిన్‌ లిపిలో రాయడం ప్రారంభించారు. భౌగోళికంగా తెలుగు, ఒడియా భాషీయులకు సవరలు దగ్గరగా ఉండటంతో.. ఆ రెండు భాషల వాళ్లు సవర శబ్దాలకు తమ మాతృభాషల్లో అక్షరరూపం ఇవ్వడం ఆరంభించారు. క్రమంగా సవర చిన్నారులు తమ భాషను తెలుగు, ఒడియా, లాటిన్‌ లిపుల్లో నేర్చుకోవడం మొదలెట్టారు. 
      1930వ దశకం వచ్చింది. అప్పట్లో ఒడిశాలోని క్రైస్తవేతర సొర సమూహానికి ఓ శక్తిమంతమైన నేత ఉండే వారు. ఆయన పేరు మలియా గొమాంగో. తమ భాషకు అక్షరరూపమివ్వడానికి మూడు లిపులను వాడటం ఆయనకు అసమంజసంగా అనిపించింది. అప్పటికి వాడుతున్న లిపుల్లో తమ మాటకు సరిగ్గా సరిపోయే లిపి ఏంటో గుర్తించాలనుకున్నారు. తెలుగు, ఒడియా, ఆంగ్లాలపై పట్టు ఉన్న తన అల్లుడు మంగై గొమాంగోకు ఆ బాధ్యతను అప్పగించారు. ఆ మంగై... మామను మించిన మాతృభాషాభిమాని. ఇతర భాషల లిపులపై ఆధారపడటమెందుకున్నది ఆయన వాదన. అందుకే విస్తృత అధ్యయనం చేసి తమ తెగ భాషకు సొంతంగా 24 అక్షరాల లిపిని తయారు చేశారు. జూన్‌ 18, 1936న దాన్ని ప్రకటించారు. అదే... ‘సొరాంగ్‌ సంపెంగ్‌’.
      ఆ లిపికి ప్రాచుర్యం కల్పించడానికి ఒడిశాలోని రాయఘడ జిల్లా మిర్చిగూడలో ‘అక్షరబ్రహ్మ’ ఆలయాన్ని నిర్మించారు మంగై. అక్షరాలను చెక్కిన శిలనే గర్భగుడిలో దేవతగా ప్రతిష్ఠించారు. తర్వాత సవరలు నివసించే ప్రాంతాలన్నింటిలో పర్యటిస్తూ లిపిని వాడుకలోకి తెచ్చారు. అదే సమయంలో ఆయా ప్రాంతాల్లో అక్షరబ్రహ్మ దేవాలయాలనూ నెలకొల్పారు. అప్పటి వరకూ సవరలకు పోడు వ్యవసాయం, వేట తప్ప మరో బతుకుదెరువు తెలియదు. మద్యం, మాంసం లేనిదే వారికి ముద్ద దిగేది కాదు. నాటుసారా కాయడం, తాగడం, దేవతలకు జంతుబలులివ్వడం గూడేల్లో నిత్యకృత్యాలు. మూఢనమ్మకాల ప్రభావంతో ఎవరికి ఏ అనారోగ్యం వచ్చినా ఎజ్జులని పిలిచే మంత్రగాళ్ల దగ్గరికి పరిగెత్తే వాళ్లు. వారేం చెబితే అది చేసేవాళ్లు. ప్రాణాలు పోయినా కూడా మంత్రగాళ్ల మాటను జవదాటే వాళ్లు కారు. ‘అక్షరబ్రహ్మ’ ఆలయాల స్థాపనతో పరిస్థితుల్లో మార్పు రావడం ప్రారంభమైంది. అక్షరాలను కొలిచే వారు మందుకు, మాంసానికి దూరంగా ఉండాలన్న మంగై కట్టుబాటు పని చేసింది. దీనికి నిదర్శనం శ్రీకాకుళం జిల్లా మనుమకొండ.
      భామిని మండలంలో ఉందీ ఊరు. 1962లో మంగై అక్కడికి వచ్చారు. స్థానిక సవరలకు అక్షరాలయం గురించి వివరించారు. దాంతో తమ ప్రాంతంలోనూ అలాంటి గుడిని నిర్మించుకోవాలని గ్రామస్థులు నిర్ణయించుకున్నారు. మిర్చిగూడ కోవెలలోని ఒక ఏక శిలను తీసుకొచ్చి అక్కడి మాదిరిగానే అక్షరాల్ని చెక్కారు. మూడు దశాబ్దాల పాటు దాన్ని మనుమకొండలోని ఒక ఇంటిలో పెట్టి పూజించేవారు. స్థానిక భూస్వామి శాసనపురి రమణయ్య స్థలదానం చేయడంతో 1996లో విడిగా ఆలయాన్ని కట్టి, శిలను అందులో ప్రతిష్ఠించారు. అన్ని దేవాలయాల్లోలానే ఇక్కడ కూడా ముందు వినాయకుడికి తొలి పూజ చేస్తారు. తర్వాత అక్షరాలను అర్చిస్తారు.  ప్రతి గురువారం భక్తులు ఎక్కువ సంఖ్యలో ఆలయానికి వస్తారు. ఏటా అక్షయ తృతీయ సమయంలో మూడు రోజుల పాటు జాతర కూడా నిర్వహిస్తారు. దాంతోపాటు కార్తీక మాసంలో 15 రోజుల పాటు ఊరేగింపులు చేస్తారు. ఈ వేడుకలకు చుట్టుపక్కల జిల్లాల నుంచి భక్తులు అధికంగా వస్తారు. ఉత్సవాలప్పుడు ఈ ప్రాంత మగవారంతా పంచెలే ధరించడం మరో విశేషం.
      అక్షరాలయం స్థాపన తర్వాత మనుమకొండ సవరల జీవిత విధానమే మారిపోయింది. తాగుడుకు దూరమయ్యారు. జంతుబలులను నిలిపేశారు. వ్యవసాయాన్ని జీవనాధారంగా మార్చుకున్నారు. ఆర్థికంగా కూడా జీవితాల్లో వెలుగులు నిండాయి. దాంతో అక్షరబ్రహ్మ ఆలయానికి వెళ్తే ఏ సమస్య అయినా తీరిపోతుందన్న నమ్మకం ఇక్కడి వారిలో స్థిరపడింది. పిల్లలను చదివించడం ప్రారంభించారు. ప్రస్తుతం జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో ఉన్న 145 పాఠశాలల్లో సవర భాషను ఒక అంశంగా బోధిస్తున్నారు. మనమకొండతో పాటు అక్షరబ్రహ్మ ఆలయాలు ఉన్న జక్కరవలస, నౌగడ, కారెగూడ, అంటికొండ, ముత్యాలు, జోడిమానుగూడ, విజయనగరం జిల్లా కన్నయగూడల్లో అక్షరాస్యతా శాతం ఏటికేడాది పెరుగుతోంది. 
      అమ్మభాషకు ‘అక్షర’ సాయం చేయడమే కాకుండా తెగ జీవిత గమనాన్నే మలుపు తిప్పిన మంగై... 1980లో ఆఖరి శ్వాస విడిచే వరకూ సవర లిపిలో వివిధ రచనలు చేస్తూనే ఉన్నారు. ప్రచురణకర్తల అండ లేకపోవడంతో అవి వెలుగులోకి రాలేదు. సిక్కోలు ప్రాంత సవరల హృదయాల్లో మాత్రం చిరంజీవిగా మిగిలిపోయారు. స్థానికులు ఆయన్ను సదా స్మరిస్తూనే ఉంటారు. 
      అజ్ఞానాంధకారాన్ని తొలగించే అక్షరానికి గుడి కట్టి పూజించడం అద్వితీయం. ఆత్మగౌరవాన్ని ప్రసాదించే అమ్మభాషను అభిమానించడం సంస్కారం. తమ తెగకు అద్వితీయమైన సంస్కారాన్ని అలవరచిన ‘అక్షరబ్రహ్మ’ మంగైను మనమూ తలుద్దాం. అమ్మభాషను మనమూ మన హృదయాధిదేవతగా ప్రతిష్ఠించుకుందాం. 


వెనక్కి ...

మీ అభిప్రాయం