పదిహేను కథలే అయితేనేమి ప్రపంచమంతా ఉంది

  • 28 Views
  • 4Likes
  • Like
  • Article Share

    వి.రాజారామమోహనరావు

  • విశ్రాంత రైల్వే ఉద్యోగి,
  • హైదరాబాదు
  • 9394738805
వి.రాజారామమోహనరావు

జీవితం ఏంటి? ఎందుకు?... అన్నది సామాన్యుల నుంచి మేధావుల వరకూ చాలా మందిని, ఎప్పుడో అప్పుడు కలవరపెట్టే విషయం. త్రిపురను ఇది జీవితాంతం బాధ పెట్టింది. అందుకే ఆయన రాసింది కొద్ది కథలే అయినా అవి మనల్నీ కలవరపెడతాయి.
      సాధారణంగా అందరికీ కనిపించేవి, ఎవరికైనా వేరుగా కనపడితే, జీవితంలో కొత్త కోణాలు విస్తరిస్తాయి. త్రిపురకు చాలా, చాలా అలా వేరుగానే కనిపించాయి. ఈ కనిపించడం కేవలం భౌతికం కాదు. స్పర్శ, స్పందన, భావన... మనసు, ఎరుక... ఇలా అన్ని రకాలుగా వేరు. ఆయన అసంతృప్తి, కోపం, దిగులు అంతర్లీనంగా ఏదో అంతుచిక్కని తృప్తి కోసం తపన... సర్వమానవ సమ్మతమైన ఆనందం కోసం ఆరాటం... ఇవన్నీ కలిసిన ఏదో రుచి త్రిపురకే తెలిసింది. కొంతమంది రాస్తే వాళ్లలాగే రాయగలరు. మరోలా రాయలేరు. మో, అజంతా, ఇస్మాయిల్‌... ఇలా కొంతమంది. కేవలం అది వాళ్ల భాష, భావన, అనుభవమే కాదు... అదొక ప్రత్యేకమైన రచనా వ్యక్తిత్వం. దాని నిలువెత్తు రూపం త్రిపుర.
      నేలబారుగా, క్రిమికీటకాల్లా బతుకు గడపటం అంటే త్రిపురకు అయిష్టం. వేలు, లక్షల మంది అలాగే ఉన్నారే అన్న అసహనం, దిగులు. దీనికి సమాంతరంగా దేన్నీ లెక్కచెయ్యకుండా కొన్ని క్షణాలైనా జీవించటం మీద మోహం... మోసం చేసైనా, విలక్షణంగానైనా బతకటం కూడా ఆయన్ని ఆకట్టుకుంది. పాములోని అందం చూడగలిగిన అభిరుచి ఆయనది.
      మనిషిని ఓ రాటకి కట్టేసి, ఓ గాటకి పరిమితం చేసే బంధం, బాధ్యత అంటే భయం. అందనిదైనా భౌతిక, అలౌకిక స్వేచ్ఛ పట్ల తపన. మనిషిని భయపెట్టి, బాధించి నిలవనీయకుండా చేసే భావనల అస్థిరస్థితి త్రిపుర కథల రూపం. మనిషి ఇలానే కాకుండా, ఇంకా ఏదోలా, ఇంకా గొప్పగా బతకాలన్న స్వప్నం త్రిపురది.
      ప్రపంచంలోని కుళ్లుని చాలామంది రచయితలు పట్టుకుంటారు. కొద్దిమంది తమ లోపలి కుళ్లుని పట్టుకుంటారు. కానీ త్రిపుర ప్రత్యేకత, అలా లోపలికి చూస్తూ, ప్రశ్నిస్తూ, నిజమా? అబద్ధమా? అన్న విభిన్న శోధనని మనముందుంచటం. నిత్యం చుట్టూ ఉన్న చీకటిలోంచి, మనసులోని చీకటి గదుల్లోకి పయనించటం, మనిషి లోపల ఉన్న లౌల్యాన్ని, స్వార్థాన్ని, తనకి తనే ఒప్పుకోలేని సత్యాల్ని, భ్రమని, ప్రలోభాన్ని బైటికి లాగితే, మనిషి పారదర్శకంగా మంచులా మెరుస్తాడని, అలా అవ్వాలని ఆయన కాంక్ష.
      మంచివాడు- చెడ్డవాడు,  భగవంతుడు - రాక్షసుడు, కాముకుడు-చేతకాని వాడు లాంటి సామాన్యతల నుంచి, మనిషిని మరోలా అర్థం చేసుకోవటానికి దారి వెతుకుతూ వెళ్లాయి ఆయన కథలు. 
      తనకు స్త్రీ మీద అమిత ఇష్టం. దగ్గరవకుండా దూరంగానే ఉంటాడు. అపరిమితమైన డబ్బు వదిలేసి మురికి పాకలోకి చేరి బతుకుతాడు. ప్రపంచంలోని చాలా చాలా విషయాల మీద అవగాహన ఉంటుంది. ఏం చేతకాని వాడిలా ఉంటాడు. ఇలాంటి వాళ్లు త్రిపుర కథల్లో కనిపిస్తారు.
      కథలో ఆయనకి మనుషులు ముఖ్యం, వాళ్ల మనసులు ముఖ్యం. వీటిని మించి, వాటిని చూపించేందుకు ఆయన వాడే పదాలు ఇంకా ముఖ్యం. పదం అంటే, దాని జీవం అంటే ఆయనకి ఎంతో గౌరవం. ఒక్కొక్క పదం ఆయనకి కొన్ని సందర్భాల్లో మొత్తం జీవితం.
      తప్పు చెయ్యకుండా ఉండలేని మనిషి, ‘ఏది తప్పు?’ అన్న ప్రశ్న... ఈ రెండింటి ప్రయాణం, ఆయన్ని చాలా దూర ప్రయాణాల్లో విడవకుండా వెన్నంటి ఉంది. ఆయన తిరిగిన అనేక ప్రదేశాలు, వివిధ దేశాలు... రకరకాల జీవితం... ఎన్ని మారినా, ఆయన్ని నిరంతరం దిగులు ఓ సహజకవచంలా కమ్ముకుంది. ఆయనది వ్యక్తిగతమైన దిగులు కాదు... ఈ లోకం దిగులు. మనిషిని, జీవితాన్ని ఎక్కడ్నించో వేరేలా చూశాడాయన. బుద్ధుడి దిగులుకీ ఓ దారి ఉన్నట్లుగా, ఆయన దిగులుకి దారి దొరకలేదు.
      విశ్వరూప సందర్శనంలో, ఎవరికీ ఆ మొత్తం రూపాన్ని అవలోకించడం సాధ్యం కాదు. ఎంతో కొంతే... త్రిపుర కథలూ అలాగే ఉంటాయి. ఎవరి ప్రాప్తాన్ని బట్టి వారికి అంతు చిక్కుతుంది.
      భాష, భావం, బాధ, అన్వేషణ, తనకి తానే పూర్తిగా అర్థంకాని నిజాయితీ, ఎన్ని చూసినా ఎంత అనుభవించినా స్థిమితం లేని దాహం... ఇలాంటి ఎన్నో ముఖాలు ఆయన కథలకి. అందుకే ఏ ఒక్కరికీ పూర్తిగా అందవు. అలా అందటం వాటి తత్వం కాదు. నీళ్లు మెరుస్తున్నట్టు, చలి కొరుకుతున్నట్లు వాటి ప్రకృతి వాటిది. అవి పూర్తిగా ఏదీ చెయ్యవు. సుఖపెట్టవు. అర్థమవవు. దిగులు పెడతాయి. అలజడి పెడతాయి. దోబూచులాడతాయి. కొంతమందికి వాటి పొడ గిట్టదు... మరికొందరు వాటిని వదల్లేరు.
      ఆయన ప్రేమలు, ఆయన బెంగలు ఆయనకే ప్రత్యేకం... ఆయన వాక్యాల్లాగ. ‘కేసరి వలె కీడు’ కథలో, ‘జీప్‌ హెడ్‌లైట్లు చీకటిలో సొరంగం చేస్తుంటే...’ అన్న దృశ్యం ఉంది. కథలోకి ఆయన అలాగే వెడతారు. భయంకర యుద్ధ నీడలో, చావుబతుకుల నడక బతుకుతెరువుగా, శతఘ్నుల మధ్య సరిహద్దు అంచున, అమాయకంగా అటూఇటూ తిరిగే చిన్నారి కథ. రెండు దేశాల బోర్డర్‌ దగ్గర అటూ ఇటూ రవాణా- కోడిగుడ్లు, సిగరెట్‌ లైటర్లు, వీలైనప్పుడు బంగారం... అంతకుముందు సులభంగా ఉన్న రవాణా. ఇప్పుడు విచ్చుకత్తుల్లాగ పొంచి ఉన్న సైన్యాల మధ్య నుంచి... ప్రతి అడుగు అపాయమే. వెనుక ఉండి అది చేయిస్తున్నది వేరే మనిషి. చిన్నపిల్ల అన్న కరుణ లేని అమానుషం. ప్రమాదం నుంచి ఆ పిల్లని రక్షించడానికి టేక్‌ బహదూరు దేహంలో పదకొండు గుళ్లు దిగాయి. వీళ్లు తిరిగి వచ్చేస్తుంటే, తమ చిన్నారి జాలిగా వెలుగుతున్న హరికెన్‌ లాంతర్‌ దగ్గర నిలబడి ఉంది. అక్కడ త్రిపుర ‘చిన్నారి కనుపాపల ఆశీర్వాదం’ అంటారు. సైనిక సాహసానికి మానవత్వం ఇచ్చే మహదాశీర్వచనంలా. మొత్తం ఆయన రాసినవి పదిహేను కథలే. ఏ కథకి ఆ కథే ఇలా... ఏదో మానవత్వపు కొత్త వెలుగు చూపిస్తుంది.
      ఎన్నో దేశాలు, ప్రాంతాలు, చాలా మంది ఊహకి కూడా రాని సందర్భాలు, సమయాలూ... వీటిలో మనిషి, ప్రధానంగా ఆ మనిషి తనని తాను నిఖార్సుగా చీల్చుకుని దర్శనమిస్తాడు. అందుకే ఆయన కథల్లో కథ కన్నా, చాలామంది దృష్టికి రాని ఇతర అంశాల బలమే ఎక్కువ. ఓ సహజ వ్యక్తీకరణలా, ఆయనకి తోచింది ఆయన అలా చెప్పేసినట్టు ఉంటాయి. మొహమాటం, భయం, ఎక్కువ తక్కువలు లేని ఆ తీరు ఓ ఉరవడి.
      త్రిపురవి విడివిడి కథలు కావు. కథ కథకీ సంబంధం ఉన్న కథలు. సుశీల, విమల, ఓల్డ్‌ స్మగ్లర్, చీకటి, స్టేల్‌నెస్, లోపల ఏదో చచ్చిపోవడం, వంతెనలు... ఇలాంటివి కథల్ని కలుపుతాయి. కథలన్నింటా ఈ సంబంధం వదలదు. ఒకే వ్యక్తి జీవితంలోని విడివిడి చాప్టర్స్‌లా ఉంటాయి ఈ కథలు. కథా రచనలో ఇదో కొత్త కంటిన్యుటీ... కథలోని కథని అధిగమించిన నూతన ఆవిష్కరణ.
      మంచో చెడ్డో జీవితాన్ని ఎదిరించి ఉత్సాహంగా బతకటం పాము కథలో కనిపిస్తుంది. నిస్సార జీవనం మీద తిరుగుబాటు ఇది.
      హోటల్లాంటి ప్రపంచంలోకి ఎందరో వచ్చి, కాసేపు తమ సర్వకళలతో గడుపుతారు. ఈ హోటల్లో కథలో పని మనిషి రాములు ప్రత్యేకం.
      పాములాంటి శేషాచలపతి మళ్లీ చీకటి గదులు కథలో కనిపిస్తాడు. ఈసారి మరో రకం. చీకటి గదుల మనుషుల్ని మోహపడటం, మనిషి లోపలా బయటా ఉండే చీకటి వెలుగుల్ని తడిమి తడిమి పట్టుకోవడం, తనను తను పూర్తిగా సమర్థించుకోలేని విచిత్రస్థితి ఈ కథలో కనపడతాయి. చదివినకొద్దీ మనసులోకి ఇంకే, పూర్తిగా కొత్త రకం కథ.
      త్రిపుర కథలు ఓ ప్రయాణం. ఆసక్తి, మోహం, ప్రేమ, చీకటినే చూడగలిగిన నిజాయితీ, క్రౌర్యం, కోరికని అధిగమించే యాతన, తాత్వికంగా అనుభవాలకు వీడ్కోలు, వెళ్లి తిరిగిరాలేని వాళ్ల తాలూకు దుఃఖం... అంతా కలిసి కాదనుకోలేని అస్తిత్వపు దిగులు, మొండిధైర్యం. ఇలా వీటన్నిటి ప్రవాహం ఈ కథలు.
      అన్ని మతాలు కోరే సిసలైన మంచే త్రిపురకు కావాలి. ఈ విషయంలో దేముడు- దెయ్యం భేదం ఆయనకి లేదు. ఊరు-దేశం అన్న హద్దు లేదు. ఆడా-మగా, తన-పర అన్న తేడా లేదు. ఆ మంచి జరగనప్పుడు ఎందుకీ బతుకు? ఎందుకీ మనిషి అన్న నిరాశ. ఊహలోనైనా ద్రోహం జరగకూడదన్న నిజాయితీ. ఆ నిరాశనీ, నిజాయితీని ఎదుర్కోటానికి నిర్మించుకున్న లోకం ఆయన కథలు.
      ఎప్పుడైనా ఆయన పూర్తిగా మనతో ఉన్నారో లేదో తెలియదు. కానీ ఆయన కథలు ఉంటాయి.


వెనక్కి ...

మీ అభిప్రాయం