ఇలా నేర్పించేద్దాం

  • 181 Views
  • 0Likes
  • Like
  • Article Share

    తెలుగు వెలుగు బృందం

నిమిషమైనను మది నిల్పి నిర్మలముగ
లింగ జీవావేశులను గాంచి భంగపడక
పూజ మదియందు జేరుట పూర్ణపదవి
పరము గోరిన నిదిచేయ బాగు వేమా

      పనులెన్ని ఉన్నా సరే, క్షణకాలమైనా తీరిక చేసుకుని నిర్మలమైన మనసుతో, నిశ్చలమైన బుద్ధితో పరమాత్మను పూజిస్తే మోక్షం సిద్ధిస్తుందనేది దీని అర్థం. పిల్లలకు చక్కటి తెలుగు నేర్పాలనుకునే తల్లిదండ్రులకు మార్గోపదేశం చేసే వేమన వాక్కు ఇది.
      కాలమాన పరిస్థితుల రీత్యా పిల్లలను ఆంగ్ల మాధ్యమంలో చదివించక తప్పట్లేదు... ఆ పాఠశాలలోనేమో తెలుగు నేర్పించట్లేదు...  అలాగే వదిలేస్తే పిల్లలకు మన భాష రాకుండా పోతుంది... మరేం చేయాలి... వాళ్లకు తెలుగు ఎలా నేర్పించాలి... అని ఆలోచిస్తున్నారా? అయితే... ఒక్కమాట!
      తెలుగు నేర్పాలన్న తపనలో... తెలుగు వాచకాలను తెచ్చి పిల్లల ముందేసి చదువు... చదువు... అంటూ ఒత్తిడి తేకండి. నాలుగు రోజుల్లో మొత్తం భాషంతా వచ్చేయాలన్న ఆదుర్దా ప్రదర్శించకండి. నిర్ణీత కాలంలో సాటివారితో తెలుగులో ధారాళంగా మాట్లాడగల, తప్పుల్లేకుండా చదవగల, రాయగల నేర్పు సాధించేలా చూడండి. అందుకు ఏం చేయాలంటే...  
      పిల్లలకు ఏం నేర్పాలన్న దానిపై మీకో స్పష్టత ఉండాలి. వ్యాకరణం, పద సంపద, వాక్య ప్రయోగాలు... ఇలా అనేక అంశాలపై దృష్టి పెట్టొదు. మీ లక్ష్య సాధనకు తగిన అంశాన్ని మాత్రమే తీసుకోవాలి. నిర్దేశించుకున్న కాలపరిమితిలో దానిపై చిన్నారులకు పట్టు వచ్చేలా ఉండాలి. ముప్ఫై రోజుల్లో లక్ష్యం సాధించాలని నిర్ణయించుకున్నారనుకోండి... ముందు పదసంపదపై దృష్టి సారించండి. ఏ భావనను ఏమంటారు, ఏ వస్తువును ఏమని పిలుస్తారు తదితరాలను నిత్య జీవిత ఉదాహరణలతో వివరించండి. రోజుకు ఓ అరగంట చదివించండి చాలు. అంతకంటే ఎక్కువ అయినా పిల్లలకు విసుగు పుడుతుంది. అంతేకాదు... చిన్నారికి పాఠాలు చెప్పే ప్రదేశాన్ని (గది/ హాలు) తెలుగుమయం చేయండి. అంటే, తెలుగు అక్షరాల ఛార్టులు అంటించడం, పదాలు - బొమ్మలతో ఉండే చిత్రాలను ఉంచడం తదితరాలన్న మాట. వాటిని చూస్తూ... మీరు చెప్పే మాటలు వింటూ చిన్నారులు భాష నేర్చుకుంటారు.
      అలా నేర్చుకున్న అంశాలను పాఠశాలకు వెళ్లి వస్తున్నప్పుడు, బయటకు వెళ్లినప్పుడు మననం చేసుకోమని చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. దాని వల్ల ‘విషయం’ గుర్తుండిపోతుంది. (స్నానం చేయిస్తున్నప్పుడు, నిద్ర పుచ్చుతున్నప్పుడు కూడా సాధన చేయిస్తుండవచ్చు) అంతేకాదు... ఆ రోజు బాబు చూసిన, చేసిన పనులను తెలుగులో చెప్పమనండి. మధ్యమధ్యలో మీరు ‘మాట’ సాయం చేయండి. చెప్పిన విషయాలను తనకొచ్చిన పద్ధతిలో రాయమనండి. తప్పొప్పులు సరిదిద్దండి. పిల్లల ముందు మీరెప్పుడూ తెలుగులోనే మాట్లాడండి. బంధువులు వచ్చినప్పుడు వారిని తెలుగు వరుసల్లోనే పరిచయం చేయండి. చివరగా... చుట్టుపక్కల వాళ్లతో, బంధువులతో తెలుగులోనే మాట్లాడమని చెప్పండి. వచ్చీ రానీ భాషలో మాట్లాడుతున్నా... నవ్వకండి. నవ్వొద్దని మిగిలిన వాళ్లకూ చెప్పండి. (నవ్వితే పిల్లలు చిన్నబుచ్చుకుంటారు) అలాగే, తెలుగు పత్రికలను బిగ్గరగా చదివించండి. కూడబలుక్కుని చదువుతున్నా... ఓపిగ్గా వింటూ ఉచ్చారణ దోషాలను సరిదిద్దండి. తెలుగు టీవీ కార్యక్రమాలను కూడా చూపించండి. బయటకు తీసుకెళ్లినప్పుడు దుకాణాల పేర్లు, ప్రకటనలను చదివించండి.  పరిసరాల్లో కనిపించే వస్తువులు, జంతువుల పేర్లను తెలుగులో చెప్పమనండి. రహదారిపై వెళ్తున్న వాహనాల సంఖ్యను కూడా ‘తెలుగు’లో లెక్కపెట్టించవచ్చు. అలా అలా సాధన చేయిస్తే... పిల్లలకు తెలుగు దానంతట అదే వస్తుంది. చలనచిత్రాలు, సంగీతం, అంతర్జాలం తదితరాలను కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ పద్ధతిలో నేర్చుకున్న భాష... జీవితాంతం తోడుగా ఉంటుంది. పుస్తకాలను బట్టీ పట్టిస్తే మాత్రం ‘విషయం’ మెదడు దాకా వెళ్లదు. ‘గొంతు’లోనే ఆగిపోతుంది. గుర్తుంచుకుంటారు కదా!


వెనక్కి ...

మీ అభిప్రాయం