గ్రీకువీరుడు

  • 131 Views
  • 0Likes
  • Like
  • Article Share

    తెలుగు వెలుగు బృందం

అమ్మో! తెలుగులో మాట్లాడటమే! ఆంగ్లం రాకుండాపోదూ!!!
      కొందరి అభిప్రాయమిది. పిల్లల నోటివెంట తెలుగు మాట వస్తే చాలు... కంగారు పడిపోతారు. కోప్పడతారు. ‘ఇంకెప్పుడూ తెలుగులో మాట్లాడ’మంటూ చిన్నారుల చేత ప్రమాణాలూ చేయిస్తారు. ఆంగ్లం రావాలంటే తెలుగును మరచిపోవాలన్న భావన వట్టి భ్రమ. అమ్మభాషను సక్రమంగా నేర్చుకుంటే తర్వాత ఎన్ని భాషలనైనా ఔపోసన పట్టవచ్చు. ఆంగ్లమే కాదు ఫ్రెంచి, జర్మన్, చైనీస్, రష్యన్‌... ఇలా ఏ దేశ భాషలోనైనా గలగలా మాట్లాడవచ్చు. కావాలంటే.. ఇయోన్నిస్‌ ఐకనొమౌను చూడండి. యూరోపియన్‌ కమిషన్‌లో ప్రధాన అనువాదకుడిగా పని చేస్తున్న ఈ ‘గ్రీకు వీరుడు’ 32 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలడు.
      గ్రీస్‌లోని క్రీట్‌కు చెందిన ఐకనొమౌకు చిన్నప్పటి నుంచి ‘మాట’లంటే ఇష్టం. అందుకే చుట్టుపక్కల ఎవరేం మాట్లాడినా ఆసక్తిగా గమనించే వాడు. ఆరేళ్ల వయసుకే తన మాతృభాష గ్రీక్‌లో పట్టు సాధించాడు. అప్పట్లో క్రీట్‌కు ఎక్కువ సంఖ్యలో పర్యాటకులు వచ్చేవారు. స్వతస్సిద్ధ ఆసక్తితో వారి మాటలను వినడానికి ఐకనొమౌ ప్రయత్నించేవాడు. అయితే... శబ్దాలు తప్ప భావాలను పసిగట్టలేకపోయేవాడు. దాంతో వారి భాషను నేర్చుకోవడానికి సంసిద్ధుడయ్యాడు. క్రమంగా ఆ భాషలోనూ పట్టు సంపాదించాడు. ఆ భాష మరేంటో కాదు ఆంగ్లమే. అది నోటికి చిక్కాక ఇతర భాషల మీద మనసు పారేసుకున్నాడు. రెండేళ్లలో జర్మన్‌ నేర్చేసుకున్నాడు. పదో ఏడు పుట్టినరోజు జరుపుకోవడానికి కొద్ది రోజుల ముందు నాటికి ఇటాలియన్‌లో కూడా అనర్గళంగా మాట్లాడగల నేర్పును సాధించాడు. ఉన్నత పాఠశాల విద్యను అభ్యసిస్తూ రష్యన్, టర్కిష్, అరబిక్‌లలో ప్రావీణ్యం సంపాదించాడు. ఆ తర్వాత చైనీస్, పోలిష్, ప్రాచీన పర్షియన్, లాటిన్, అవెస్థన్, ఆర్మేనియన్, ఐరిష్‌ తదితర 32 భాషలను తన నాలుకపై నిలుపుకున్నాడు. ఇంకో మాటండోయ్‌! మనవాడు మన సంస్కృతంలో కూడా గొప్పగా మాట్లాడగలడు. అంతేకాదు... ‘సంస్కృతాన్ని నేర్చుకునేటప్పుడు దాంతో ప్రేమలో పడ్డా. అది చాలా ఏళ్లు కొనసాగింద’ని చెబుతాడు కూడా. మరో మాట... మనం మరచిపోయిన పాళీ భాష కూడా తనకు కరతలామలకమే.
      భాషాశాస్త్రంలో పట్టా పుచ్చుకున్న ఐకనొమౌ... కొలంబియా విశ్వవిద్యాలయం (అమెరికా)లో మధ్యప్రాచ్య భాషలపై స్నాతకోత్తర విద్యను చదివాడు. ఇండో యూరోపియన్‌ భాషాకుటుంబంపై హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ చేశాడు. 2002లో బ్రస్సెల్స్‌ (బెల్టియం)లోని యూరోపియన్‌ కమిషన్‌లో ఉద్యోగంలో చేరాడు. ప్రస్తుతం అక్కడ ఉన్న వాళ్లలో చైనీస్‌ పత్రాలను అనువదించగల ఏకైక వ్యక్తి మనవాడే. ఇంతకూ ఇన్ని భాషలు ఎలా నేర్చుకోగలిగావు అంటే... ‘ఏముంది మనం నేర్చుకోవాలనుకుంటున్న భాషను ప్రేమించాలి. ఆ భాషను మాట్లాడే ప్రజలను, వారి సంస్కృతులను ఇష్టపడాలి. అధ్యయనం చేయాలి. దాంతో పాటు నేను ఆ భాషలో వెలువడే పత్రికలను చదువుతా. టీవీ ఛానళ్లను చూస్తా’నని చెబుతాడు.
       ఐకనొమౌ లాంటి బహుభాషాకోవిదు లెందరో! మన దివంగత ప్రధాని పీవీ నరసింహారావుకు 14, హైదరాబాదు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన దివంగత బూర్గుల రామకృష్ణారావుకు 18 భాషల్లో  పాండిత్యం ఉన్న సంగతి తెలిసిందే. మధ్యప్రదేశ్‌లోని చిత్రకూట్‌కు చెందిన జగద్గురు రామభద్రాచార్య నాలుక మీద 22 భాషలు నాట్యమాడతాయి. గమనార్హం ఏంటంటే ఆయన రెండు నెలల పసిగుడ్డుగా ఉన్నప్పుడే కంటి చూపును కోల్పోయారు. బ్రెయిలీ లిపి సాయం కూడా లేకుండానే ఆయన అన్ని భాషలనూ ఔపోసన పట్టారు.    
అమ్మభాషను నిరాదరించే వారికి ఇతర భాషలేవీ సంపూర్ణంగా పట్టుబడవు. పచ్చని చెట్టంటూ ఉంటేనే కదా చిలకలు వచ్చి వాలేది. అమ్మభాష కూడా అంతే. జ్ఞాన సముపార్జనకు అవసరమైన ఆలోచనకు ఆది అదే.


వెనక్కి ...

మీ అభిప్రాయం