స్త్రీ స్వేచ్ఛాపతాకం

  • 2308 Views
  • 10Likes
  • Like
  • Article Share

    - న.రా.చం,

  • ప్రొద్దుటూరు

గుడిపాటి వెంకటచలం నిర్మించిన మొట్టమొదటి నవల మైదానం 1927 నాటిది. ఆ సంవత్సరం ఆంధ్ర విశ్వవిద్యాలయం నిర్వహించిన నవలల పోటీలో పాల్గొంది. బహుమతిని మాత్రం విశ్వనాథ ‘వేయిపడగలు’, బాపిరాజు ‘నారాయణరావు’ నవలలు పంచుకున్నాయి. జీవితం ఎందుకు అని ప్రశ్నించుకొన్న చలానికి సమాధానం... జీవితం అంటే ఆనందానికి, సెక్స్‌ ద్వారా కలిగే ఆనందానికి, స్వేచ్ఛలో సెక్స్‌ ద్వారా కలిగే ఆనందానికి అని మూడు అంచెలుగా ఉంటోంది. ఈ దృష్టితో సమాజంలో స్త్రీల పరిస్థితుల్ని విశ్లేషించి భావ విప్లవానికి కారకులయ్యారు చలం.
      మైదానం స్వేచ్ఛకు సంకేతం. మై అంటే శరీరం, దానం అంటే ఇవ్వడం. నవలా నాయిక రాజేశ్వరి అమీర్‌కు, మీరాకు శరీరం దానం చేయటం వల్ల కూడా దీనికి మైదానం అన్న పేరు పొసగుతుంది. సంఘం కల్పించిన వివాహం, సంతానం, సంసారం, బాధ్యత, వ్యవస్థ మొదలైన సంకెళ్లను తెంచుకుని స్వేచ్ఛగా మైదానాలలో, సహజ వాతావరణంలో అనురాగానుభవం జరిగింది కనుక, మైదానం అన్న మాటను స్వేచ్ఛకు సంకేతంగా కూడా భావించవచ్చు. వివాహ విధిలో మోహ ప్రాధాన్యాన్ని సమాజం గుర్తించకపోగా, ప్రేమికులైన స్త్రీ పురుషులు కాల్పనిక దృక్పథంతో సమాజం నుంచి దూరం జరిగి, అనాగరిక స్థితికి దిగజారి కృత్రిమమైన జీవితాలను వెతుక్కుంటారని చెబుతుంది చలం మైదానం.
      ఇరవయ్యో శతాబ్ది తొలి యాభయ్యేళ్లలో కాల్పనికోద్యమ ప్రభావం ముమ్మరంగా వ్యాపించి తెలుగు సాహితీ వ్యాసంగంలో స్వేచ్ఛా భావాలు నెలకొన్నాయి. అలాంటి వాతావరణంలో కవిత్వం జోలికిపోని చలంలాంటి అభ్యుదయ దృష్టిగల రచయితలు తమ భావాలను నవలల్లో వ్యక్తీకరించారు. అలా నిర్మించిన మైదానం విపరీతమైన దూషణ భూషణలకు గురైంది.
ధర్మం కాదు సహజాతం
      మైదానం కథ రాజేశ్వరి ఉత్తమపురుషలో తన స్నేహితురాలికి ఉత్తరం రాస్తున్న ధోరణిలో సాగుతుంది. ‘ఇంటినే, బంధువుల్నే, భర్తనే మరిపింపగల అనుభవం ఎంత ఉన్నతమో, అద్భుతమో నువ్వే ఆలోచించు. అమీర్‌నీ, మీరానీ అనుభవించిన తరువాత, మనచుట్టూ బతికే ఈ ప్రజలందరూ మనుషులేనా అనిపిస్తుంది నాకు’ అంటుందామె. ఈ నవలలోని అంతస్తత్వం మొత్తం ఈ మాటల్లో నిక్షేపించారు చలం. ప్రేమ గాఢతను దైవత్వంతో, అమృతత్వంతో పోల్చారు. సుఖానుభవానికి వివాహం అవసరం లేదని, ప్రేమలేని స్త్రీ పురుషులను వివాహం పేరుతో కట్టివేయరాదని, మనసులో అసంతృప్తితో సాగుతూ, మోహాన్ని అణచుకొంటూ బతకడంకంటే స్వేచ్ఛగా ప్రేమను అనుభవించడం శ్రేయస్కరమని, ప్రేమకు వివాహంలాగానే కులం, వయసు, స్థలం ప్రధానం కావని ఈ నవల ద్వారా ప్రచారం చేశారు.
      స్త్రీ పురుషులు ప్రేమించుకోవడం, శారీరకంగా సుఖాన్ని అనుభవించడం దోషంగాను, పాపంగాను పరిగణించే కాలంలో, వివాహితులు కూడా సృష్టికార్యాన్ని చీకటి, ఇరుకు గుయ్యారాల్లో రహస్యంగా తీర్చుకొని ఆనందాన్ని అనుభవిస్తున్నట్లుగా భావించుకొనే కాలంలో చలం ఈ నవల రాశారు. సుఖానుభవం కోసం స్త్రీ పురుషులు నాలుగు గోడల మధ్యనుంచి మైదానాల్లోకి, నక్షత్రాల మధ్యకు, నీలాకాశం కిందికి, సెలయేటి చలువలలోకి వెళ్లి ప్రకృతి దత్తమైన సౌందర్యాన్ని సంఘ విరుద్ధంగా, స్వేచ్ఛగా అనుభవిస్తారని విశదం చేశారు. లౌకికమైన దుర్బల కార్పణ్యాలతో స్త్రీ పురుషుల మధ్య లైంగికేచ్ఛ సహజాతంగా కాక ధర్మంగా భావించటాన్ని ఖండించారు చలం.
      స్త్రీ పురుషుల లైంగికేచ్ఛను క్రమబద్ధం చేయటానికి, సృష్టి మనుగడకు వివాహ వ్యవస్థ ఏర్పడింది. కానీ ఇందులో అనేకమైన అక్రమాలు, కాలదోషం పట్టిన సంప్రదాయాలు ప్రవేశించి దానిని వికృతం చేశాయి. వివాహం మోహం ఆధారంగాకాక, కట్టుబాట్ల ఆధారంగా జరగటంతో స్వేచ్ఛా విహంగాలైన స్త్రీ పురుషులు స్వేచ్ఛగా లైంగికేచ్ఛను సాధించుకోవటానికి ఆ వ్యవస్థనుంచి బయటపడటానికి ప్రయత్నిస్తారు. దీన్ని సంప్రదాయం ప్రతిఘటించింది. వివాహ సుస్థిరతకు ప్రాణభూతమైన ప్రణయాన్ని నిర్లక్ష్యం చేసి ప్రతిఘటిస్తే, స్త్రీ పురుషులు సమాజానికి ఎదురు తిరిగి విశృంఖల జీవితానికి ప్రయత్నిస్తారని నిరూపిస్తుంది మైదానం.
      రాజేశ్వరి శుద్ధ శ్రోత్రియ కుటుంబంలో పుట్టి, ఒక ఛాందసుని కట్టుకొని, సహజంగా ప్రవర్తిల్లే తన కోర్కెలను అణచుకొని బతుకుతుంటుంది. అలాంటిది అమీర్‌ దర్శనంతో ఆమెలో సుఖదాహం నోళ్లు తెరుచుకుంది. ఒక బ్రాహ్మణ స్త్రీ మహమ్మదీయుడితో వెళ్లిపోవటాన్ని కల్పించి మధ్యతరగతి బ్రాహ్మణ గృహస్థ జీవితాన్ని చలం దెబ్బతీశారు. ఇది ఆనాడు పెద్ద సంచలనాన్నే సృష్టించింది. వివాహ వ్యవస్థను ధిక్కరించిన రాజేశ్వరి అతివాది. కట్టుబాట్లు, నీతినియమాలు, కులమత భేదాలు, ఉచ్ఛనీచ భావాలు... అన్నింటినీ కాలరాచి సాహెబ్‌తో వెళ్లిపోయింది. వివాహ వ్యవస్థలో భర్త ద్వారా తానుగోరిన మోహం లభించక, తృష్ణతీరక నాగరక జీవితంలోని కృత్రిమత్వాన్ని రోసి మైదానాల్లోకి వెళ్లిపోయింది.
      వివాహవిధిలో ప్రేమ, పరస్పరాకర్షణ, ఆర్ద్రత, స్పందన- ఇత్యాది సున్నితమైన భావాలకు విఘాతం కలిగినప్పుడు సహజంగా స్వాతంత్య్రాన్ని, ప్రణయాన్ని ఆరాధించే స్త్రీ పురుషులు స్వేచ్ఛకు, అరాచకత్వానికి దారితీయటం కద్దు. అలాంటివాళ్లకు, తాము చేస్తున్న చర్యలకు ఎదురయ్యే ప్రతిఘటన గోచరం కాదు. మైదానంలో అమీర్‌తో రాజేశ్వరి అనుభవించిన జీవితం, ఆ తర్వాత అమీర్‌ రాజేశ్వరిని కాదని తోళ్లసాయబు కూతురిని కోరడం, రాజేశ్వరి మాతృత్వాన్ని దెబ్బతీయడం, మీరాను స్వార్థంతో చంపబూనటం మొదలైన అంశాలలో స్వేచ్ఛ ఘోరంగా వంచనకు గురైంది. ఇక్కడ సంభవాసంభవాలతో చలానికి నిమిత్తం లేదు. వ్యవస్థను బద్దలు చేయడం ఆయన ఉద్దేశించిన ప్రయోజనం.

      సమాజ నియమాలకు కట్టుబడని పర్యవసానాలతో నిమిత్తం లేని స్త్రీ ఒకరికంటే ఎక్కువ మందిని కోరే అవకాశం ఉంటుంది. అయితే అలాంటివాళ్లు సైతం తమ జీవితాలను సఫలం చేసుకోలేకపోవడాన్ని మైదానం నిరూపిస్తుంది. ఇంకా స్త్రీ పురుషుడి కోసం ఎంతటి త్యాగమైనా చేస్తుంది. కానీ, పురుషుడు స్త్రీ కోసం అలాంటి త్యాగం చేయడానికి సమర్థుడు కాడని పురుషాధిక్య దృక్పథాన్ని తేటతెల్లం చేశారు చలం. ‘ఎంత అసహ్యంగా ఉన్నా, సంఘ నిర్మితమైన సంసారంలో కొంత శాశ్వతత్వం కాలంవల్ల ఏర్పడి, భేదించడానికి సాధ్యంగాని బంధనాలున్నాయని’ రాజేశ్వరి గుర్తిస్తుంది. దీని ఆధారంగా తన సిద్ధాంతానికి తానే కట్టుబడలేకపోయాడు, చలం పలాయనవాది అని ఎద్దేవా చేశారు నాటి విమర్శకులు.
విశృంఖలం కాదు అమలినం
మైదానం కామదాహాన్ని ప్రకోపింపజేస్తుందని, నైతిక విలువలు త్యజించి యువతీ యువకులు ఉద్రేక స్వభావంతో పతనమవుతారని భావించారు విమర్శకులు. అయితే, అలాంటి ఘట్టాలు మైదానంలో ఒకటి రెండుకు మించి లేవు. పైగా అమలిన శృంగార ఛాయలు కూడా ఇందులో లభిస్తాయి. ‘అమీర్‌తో కామం తీర్చుకోటానికి కాదు, అతని ముఖం చూస్తో అతణ్ని పూజించటానికి, అమీర్‌ కళ్లలోని ఆరాధన చూసేందుకు, అతనితో మాట్లాడి, అతని వంక చూస్తో ఉండే అదృష్టానికి వెళ్లాను’ అంటుంది రాజేశ్వరి. ఇందులో ఇమిడి ఉన్న అమలిన శృంగారతత్త్వం స్పష్టం.
      నవల విషాదాంతమైనా, విషాద వాతావరణంలో పాఠకుడు భావక్షాళనం పొందడు. రాజేశ్వరి త్యాగం ముందు అమీర్‌ ప్రాణత్యాగం గొప్పదిగా చిత్రించలేదు చలం. శిష్ట సమాజంలో మైదానం గొప్ప అలజడినే సృష్టించింది. ‘మైదానం రాయటంలో మీ ముఖ్యోద్దేశం ఆనాటి మిడిల్‌క్లాస్‌ మోరల్‌ వాల్యూస్‌ని షాక్‌ చేయడం- అంటే మీరు ఒప్పుకుంటారా’ అన్న ప్రశ్నకు ‘షాక్‌ చెయ్యాలనే గుణం నా మొదటి పుస్తకాలన్నిటిలోనూ ఉంది. మైదానంలో షాకింగ్‌ గుణం సెకండరీ, నా దృష్టిలో అది ఒక ఆర్టిస్టిక్‌ పీస్‌’ అన్నారాయన.
      చలంపై ఇదివరకు జరిగిన, ఇప్పుడు జరుగుతూన్న చర్చలు, విమర్శలే- ఆయన సాహిత్యం అన్ని ప్రాంతాలవారి ఆమోదం పొంది, సార్వకాలిక బలం కలిగి సార్వజనీనతను సాధించుకున్నదనటానికి నిదర్శనం. సమాజం మీద రాజీలేని తిరుగుబాటు చేసిన చలం, మధ్యతరగతి ఛాందస బ్రాహ్మణ జీవన విధానం మీద మరకలు విదిల్చి సమకాలిక జీవనంలో పొందాల్సినంత గొప్పస్థానం పొంది కూడా వివాదాస్పదుడుగా మిగిలిపోయాడు. దానికి కారణాలు... వివాహ వ్యవస్థలో గుర్తించిన లోపాలకు సరైన ప్రత్యామ్నాయం సూచించకపోవడం, తొలి జీవితంలో తెచ్చిన విప్లవాత్మక భావజాలం, మలి జీవితం నాటికి మిగలకపోవడమే.

*  * *


వెనక్కి ...

మీ అభిప్రాయం