తెలుగుకు వెలుగు బ్రౌన్‌

  • 159 Views
  • 0Likes
  • Like
  • Article Share

    డా।। పి.ఎస్‌.ప్రకాశరావు,

  • తెలుగు ఉపాధ్యాయులు
  • కాకినాడ.
  • 9963743021
డా।। పి.ఎస్‌.ప్రకాశరావు,

అతనికది అమ్మభాష కాదు. అయినా పరాయి భాషలో పలుకుల తీయదనాన్ని పసిగట్టాడు. నుడి కడలి నిర్మాణానికి ప్రతిన బూనాడు. అయినవాళ్లే అటకెక్కించిన తాళపత్రాలకు జీవం పోశాడు. సంక్షిప్త పదాలకు సులువైన సంకేతాలను సూచించాడు. ఉద్యోగంతో పాటు తన ధనాన్నీ, సమయాన్నీ, ఇంకా చెప్పాలంటే తన జీవితాన్నే వినియోగించి తెలుగు సాహిత్యాన్ని సేవించిన అక్షర సేవకుడు చార్లెస్‌ ఫిలిప్‌ బ్రౌన్‌.

బ్రౌన్‌ 1849లో గుర్రం మీద నుంచి పడి కుడి చేతి బొటనవేలు విరగ్గొట్టుకున్నాడు. ఆయనకది చాలా కీలక సమయం. తెలుగు నేర్చుకునే ఆంగ్లేయుల కోసం ఇంగ్లిషు- తెలుగు నిఘంటువు, ఇంగ్లిషు నేర్చుకునే తెలుగు వారి కోసం తెలుగు-ఇంగ్లిషు నిఘంటువు సిద్ధం చేసి అచ్చు కోసం ఇచ్చాడు. ప్రూఫులు దిద్దుకోవాల్సిన సందర్భం. ఎవరైనా అయితే వాయిదా వేసి ఉందురు. కానీ మొండిఘటం అయిన బ్రౌన్‌ ఎడమచేత్తో రాత అలవాటు చేసుకుని ప్రూఫులు దిద్దుకున్నాడు. 1852లో నిఘంటువులు ప్రచురించాడు.
      మన రాష్ట్రం వాడు కాదు, అసలు మన దేశం వాడే కాదు. మరి తెలుగు భాషపై అంత శ్రద్ధ ఎలా వచ్చింది? ఏ పరిస్థితుల్లో ఇంగ్లండ్‌ నుంచి ఇక్కడికి వచ్చాడు? తెలుగు భాషా సాహిత్యాల అభివృద్ధి కోసం ఏయే కార్యక్రమాలు చేశాడు? ప్రతి తెలుగువాడూ తప్పని సరిగా తెలుసుకోవాలి.
ఈస్టిండియా కంపెనీ భారతదేశాన్ని పరిపాలించే రోజులవి. చాలామంది ఇంగ్లిషు వారు ఇంగ్లాండు నుంచి వచ్చి కంపెనీ కొలువులో ఉద్యోగాలు చేస్తుండేవారు. అలా ఉద్యోగం చేస్తూ ఎవరైనా చనిపోతే వారి సంతానంలోని చిన్న వాళ్లను సివిల్‌ సర్వీసులో చేర్చుకుని కంపెనీ ఉద్యోగాలిచ్చేవాళ్లు. బ్రౌన్‌ తండ్రి డేవిడ్‌బ్రౌన్‌ (1762-1812) కూడా అలాగే ఇంగ్లాండు నుంచి వచ్చి కలకత్తాలోని ఒక పాఠశాల పర్యవేక్షకుడిగా ఉద్యోగంలో చేరాడు. ఆయనకి ముగ్గురు కొడుకులు. రెండోవాడైన సి.పి.బ్రౌన్‌ 1798 నవంబరు 10వ తేదీన కలకత్తాలో పుట్టాడు. డేవిడ్‌బ్రౌన్‌ 27 సంవత్సరాలు ఉద్యోగం చేసి చనిపోయాడు. కంపెనీవాళ్లు సి.పి.బ్రౌన్‌ని మద్రాసు సర్వీసుకి, ఆయన సోదరుల్ని బెంగాలు సర్వీసుకి పంపించారు. నిబంధనల ప్రకారం సివిల్‌ సర్వీసులో చేరిన వారు రెండు భారతీయ భాషలు నేర్చుకోవాలి. బ్రౌన్‌ తెలుగు, మరాఠీ భాషలను ఎంచుకున్నాడు. కంపెనీ కొలువులో పనిచేసిన 34 ఏళ్లలో సుమారు 30 సంవత్సరాలు తెలుగు భాషా సాహిత్యాల సేవకే వినియోగించాడు.
      ఉద్యోగం కోసం నేర్చుకున్న పరాయిభాష నచ్చితే చదివి ఆనందిస్తారు కానీ నెత్తిన పెట్టుకుని ఆరాధిస్తారా! ఎంత ఆరాధనా భావం లేకపోతే మహాభారతం శుద్ధ ప్రతిని తయారు చేయడానికి 12 తాళపత్ర గ్రంథాలను పరిశీలిస్తాడు! వేమన పద్యాలు చదివి మురిసిపోయే వారుంటారు కానీ వాటిని ఆంగ్లంలోకి అనువదించే క్రమంలో పాఠ నిర్ణయం చేయడానికీ, లేఖన దోషాలను పరిహరించడానికీ, మూడు వారాలపాటు తెలుగు ఛందస్సు నేర్చుకుని 1152 పద్యాలను పరిష్కరించి అనువదించడానికీ సి.పి.బ్రౌన్‌ తప్ప విదేశీయులెవరైనా పూనుకోగలరా? పఠనాసక్తి ఉన్నా కొన్ని కావ్యాలు పంటికింద రాళ్లలా ఇబ్బంది పెడుతున్నాయని గ్రహించాడు. అందుకే భాష కఠినమైనా సరళమైనా లాటిన్‌ భాషలో ఉన్నట్టు అన్ని కావ్యాలకూ వ్యాఖ్యానం ఉండాలని భావించాడు. మనుచరిత్ర, వసుచరిత్ర వంటి పదహారు కావ్యాలకు టీకలు రాయించాడు. ప్రతి సందర్భాన్నీ సాహిత్య సేవకే వినియోగించడం బ్రౌన్‌లోని సుగుణం. తాతాచార్యులు అనే సంస్కృత పండితుడు ప్రసంగవశాత్తూ చెప్పిన కథలను గ్రంథస్థం చేసి ‘తాతాచార్యుల కథలు’ అనే సంకలనాన్ని 1856లో ప్రచురించాడు. అంతేకాదు ఆ కథల్లో గ్రాంథిక వాసనలున్న వాటిని తొలగించిన సిసలైన వ్యావహారిక భాషావాది బ్రౌన్‌.
      అభిరుచి ఉన్న వాళ్లు తెలుగు సాహిత్యాన్ని చదవాల్సిన క్రమాన్ని కూడా బ్రౌన్‌ చెప్పాడు. మొదట వేమన పద్యాలు, తరువాత చక్రవర్తి రాఘవాచార్యులు రచించిన ‘నలచరిత్ర’ అనే ద్విపద కావ్యం. అనంతరం ‘రంగనాథ రామాయణం’, ‘ఆంధ్రమహాభారతం’, భాగవతంలోని అష్టమ దశమ స్కంధాలు, ‘సుభద్రా పరిణయం’, ‘మనుచరిత్ర’, ‘దశావతార చరిత్ర’, ‘నైషధం’, ‘విష్ణుచిత్తీయం’, చివరగా ‘వసుచరిత్ర’ శ్రద్ధగా చదవాలని అన్నాడు.
      చదవాల్సిన క్రమం తెలిస్తే సరిపోతుందా! అందుబాటులో ఉండాలి కదా! ఆ సౌకర్యం కూడా తనే కల్పించాడు. తను సేకరించిన 2,440 గ్రంథాలను మద్రాసు లిటరరీ సొసైటీలో ఉంచాడు. వాటిలో తెలుగు గ్రంథాలు 1116. వీటిని పాఠకులకు అందుబాటులో ఉండేలా సొసైటీకి ఒక ప్రతిపాదన చేశాడు. 35 రూపాయల విరాళం, నాలుగు నెలలకూ 22 రూపాయలు చందా కట్టిన సభ్యులు కొత్త పుస్తకాలూ పత్రికలతో సహా గ్రంథాలయ సౌకర్యాలు పొందవచ్చు. 15 రూపాయల విరాళం నాలుగు నెలలకి 10 రూపాయల చందా చెల్లిస్తే గ్రంథాలయంలో మాత్రమే చదువుకోడానికి అనుమతి ఉంటుంది. నెలకి రూపాయి మాత్రమే చందా కట్టిన సభ్యులు నచ్చిన పుస్తకాన్ని ఇంటికి తీసుకెళ్లాలంటే 20 రూపాయల ధరావత్తు కట్టాలి. బ్రౌన్‌ చేసిన తీర్మానాన్ని సొసైటీ ఆమోదించడంతో ఎంతోమంది పాఠకులు ప్రయోజనం పొందారు.
      వివేకి తన మీద రాళ్లు విసిరిన వారిని విమర్శిస్తూ కూర్చోకుండా ఆ రాళ్లతోనే చిన్నగూడు నిర్మించుకుంటాడనే సామెతని బ్రౌన్‌ రుజువు చేశాడు. ముక్కుసూటిగా పోవడం వల్ల కంపెనీకి ఆగ్రహం వచ్చి 1834లో బ్రౌన్‌ని ఉద్యోగం నుంచి తొలగించింది. మూడేళ్లపాటు ఇంగ్లండులో కూర్చుని తెలుగు నేర్చుకునే ఆంగ్లేయుల కోసం ‘ది గ్రామర్‌ ఆఫ్‌ తెలుగు లాంగ్వేజ్‌’ అనే పేరుతో ఇంగ్లిషులో తెలుగు వ్యాకరణం రాశాడు. తెలుగు-ఇంగ్లిషు నిఘంటువు పూర్తి చేశాడు. ఆ దేశంలో గుట్టలుగా పడి ఉన్న తెలుగు, కన్నడ గ్రంథాలకు కేటలాగు తయారు చేసి, వాటిని భారతదేశానికి పంపించాల్సిందిగా సిఫార్సు చేశాడు.
      ఎంత అభిరుచి ఉన్నా ఆర్థిక పరిస్థితి బాగుంటేనే అది సాఫల్యం అవుతుంది. బ్రౌన్‌ ధనవంతుడేమీ కాదు. అయినా తన లక్ష్య సాధన కోసం ఖర్చుకి వెనుకాడేవాడు కాదు. గ్రంథాలయాలు లేని కాలం అది. ఎవరి దగ్గరైనా గ్రంథాలున్నట్టు తెలిస్తే డబ్బులిచ్చి వాటిని తీసుకునేవాడు. రాతప్రతులు పుట్టించడానికీ, తీర్పు ప్రతులు సిద్ధం చేయడానికీ, పద సూచికలు రాయడానికీ పది నుంచి ఇరవై మంది దాకా పండితుల్ని జీతాలిచ్చి పోషిస్తుండేవాడు. ‘విష్ణుపురాణం’ అనే తెలుగు తాళపత్ర గ్రంథం లభిస్తే రూపాయికి 200 పద్యాల చొప్పున లేఖరికి కూలి ఇచ్చి ఆ కావ్యమంతా కాగితాల మీద రాయించాడు. అలా రాయడంలో లేఖకులు ఏమాత్రం తప్పులు రాసినా అర్ధరూపాయో, పావలానో జరిమానా విధించేవాడు. గ్రంథసేకరణపై బ్రౌన్‌ వ్యామోహాన్ని తెలిపే ఒక సంఘటన... సి.రంగనాయకులు అనే వ్యక్తి బ్రౌన్‌ ఆసక్తిని సొమ్ము చేసుకోవాలనుకున్నాడు. దేవుడు తనకు కలలో కనబడి ఫలానా పుస్తకం కాపీ చేసి దొరగారికి ఇవ్వమని చెప్పాడని ఉత్తరం రాసి ఒక పుస్తకాన్నీ, ఆ ఉత్తరాన్నీ బ్రౌన్‌కి పంపించాడట. అప్పటికే సాహిత్య గ్రంథాల్లో మునిగి తేలుతున్న బ్రౌన్‌ ‘‘పాపం! ఈ కావ్యం నేనెప్పుడో సంపాదించానని భగవంతుడికి తెలియదు’’ అని రాసి దాన్ని తిప్పి ఆ వ్యక్తికి పంపించాడట.
      బ్రౌన్‌కి ఉద్యోగం ద్వారా వచ్చే జీతం ఆయన సాహిత్య సేవకి సరిపోయేది కాదు. మద్రాసులో ఉద్యోగం చేసేటప్పుడు అప్పుల పాలయ్యేవాడు. ఒక ఇంగ్లిషు వర్తకుడి దగ్గర ఆయన చేసిన అప్పు వడ్డీతో కలిపి అరవై వేల రూపాయలు అయింది. అష్టకష్టాలూ పడి ఆ బాకీ తీర్చగలిగాడు. అయినా తను నమ్మిన ఆదర్శాలను వీడలేదు. ‘‘తమ ఆర్జనలోని ప్రతి ఒక్క రూపాయిలో ఒక పైసాను దానధర్మాలకు కేటాయించారు. (ఆనాడు రూపాయికి 192 పైసలు ఉండేవి) ప్రతినెలా కుంటి, గుడ్డి, అవిటివాళ్లకు అయిదు వందల రూపాయల దాకా ధర్మం చేసేవారు’’ అని ఆరుద్ర, సమగ్రాంధ్ర సాహిత్యంలో రాశారు.
      ఛందస్సుకు సంబంధించి యతిస్థానంలో బ్రౌన్‌ ఏర్పరచిన నియమాలు పద్యకావ్యాల ముద్రణలో చాలాకాలం కొనసాగాయి. వృత్త పద్యాల్లో పాదాన్ని రెండు పంక్తులుగా విడదీసి యతి అక్షరాన్ని సూచించడానికి దానికి ముందు తారకం అనే పువ్వు గుర్తు (*) పెట్టేవారు. కొంతకాలానికి ముద్రాపకులు పద్యపాదాన్ని విడదీయకపోయినా యతిస్థానం దగ్గర తారకాన్ని సూచించడం అలవాటుగా మారింది. క్రమంగా ఈ తారకం చిన్న డైమండు (♦) గానూ మామిడిపిందె ( ) గుర్తుగానూ మారింది. ప్రాచీన పద్య కావ్యాల్లో మనం వీటిని చూడవచ్చు.
      తెలుగు ముద్రణలో ‘రావత్తు’ ఆంగ్లంలోని యు(U) ఆకారంలో ఉండేది. అచ్చుపనిలో దీనివల్ల కలిగే అసౌకర్యాన్ని గుర్తించిన బ్రౌన్‌ ‘c’ లాగా మార్చాడు. బ్రౌన్‌ రకారం అనే పేరుతో ఇప్పుడిదే వాడుకలో ఉంది.
      సజీవ భాషను నేర్చుకోవడం బ్రౌన్‌కి చాలా బాగా తెలుసు. అయ్యలరాజు నారాయణ ‘హంసవింశతి’ అనే కావ్యంలో వివిధ వృత్తులకు సంబంధించిన పదాలను వాడినట్టు తెలుసుకున్నాడు. ఆ వృత్తుల వారిని స్వయంగా కలుసుకొని ఆ పదాల అర్థాలను తెలుసుకుని వివరంగా రాసుకున్నాడు. అంతేకాదు రాజులూ, రైతులూ, పండితులూ, పామరులూ, వకీళ్లూ, వైద్యులూ, వేటగాళ్లూ, వర్తకులూ, ఓడ కళాసీలు ఒకరేమిటి అన్ని వర్గాల వారి భాషనూ అధ్యయనం చేశాడు. భారత తూర్పు సముద్ర ప్రాంతానికి ‘కోరమాండల్‌’ అనే పదం వాడుకలో ఉంది. అది ‘కర్రి మండలం’ అని తన ఇంగ్లిషు-తెలుగు నిఘంటువులో వివరంగా చెప్పాడు. సీమ దొరలంతా తెలుగు భాషనూ, తెలుగు వారినీ జెంతూ అని పిలిచేవారు. అన్యమతస్థుడు, క్రైస్తవేతరుడు అని ఈ మాటకర్థం. బ్రౌన్‌ ఈ పదాన్ని తన నిఘంటువులో చేర్చి ‘జెంతూ అనే మాటను వాడటం తప్పు’ అని సూచించాడు.
      బ్రౌన్‌ కాలం నాటికి లేఖలలో సంక్షిప్త పదాలను రాసే అలవాటుండేది. ఈనాడవి తెరమరుగయ్యాయి. ఆయన ప్రచురించిన తెలుగు-ఇంగ్లిషు నిఘంటువులో వీటిని చూడవచ్చు. లేఖలో తేదీకి ముందు ‘ది’ అని రాసేవారు. ‘దివి (ఎ డే)’ అని దానర్థం. క్రీ.శ. అని రాయడానికి ‘ఆన।।’’ అని రాసేవారు. అనో డోమిని అని ఈ మాటకర్థం. 1840లో బ్రహ్మయ్య శాస్తుర్లు అనే పండితుడికి బ్రౌన్‌ రాసిన లేఖ ‘‘బ్రహ్మయ్య శాస్తుర్ల గారికి సల్లాం. త।।’’ అని ప్రారంభమైంది. నమస్కారం అనే అర్థంలో ప్రారంభంలోనూ చివరా కూడా ఆయన ఈ మాట వాడారు. ‘త।।’ అంటే ‘తరువాత’ అని అర్థం. ఒక హెడ్‌ పోలీసు బ్రౌన్‌కి రాసిన లేఖలో ‘‘సన్‌ 1242 ఫసలి 1833 సం।।’’ అని ఉంది. సన్‌ అంటే సంవత్సరం అనీ, ఫసలీ అంటే రెవెన్యూ ఇయర్‌ అనీ అర్థం. తమకంటే పెద్ద హోదాలో ఉన్న వారిని లేఖలో రా।। రా।। రా।। అని సంబోధించేవారు. ‘రాజమాన్య రాజ పూజితులైన రాజశ్రీ’ అని దీని పూర్తి పదం. ‘తా।।క’ అంటే తాజా కలం (పోస్ట్‌స్క్రిప్ట్‌) అని అర్థం. పెరవ శ్రీమన్నారాయణ అనే పండితుడు బ్రౌన్‌కి రాసిన లేఖలో ‘‘నా దగ్గర చదువుకుంటున్న భట్రాజు మా।। గ్రంథం యిచ్చి పంపిస్తిని’’ అని రాశాడు. ‘మా।।’ అంటే మారీఫత్‌ (ద్వారా) అని అర్థం. మనం ‘పర్యవేక్షణ’ అని వాడేచోట బ్రౌన్‌ ‘పైగస్తీ’ అని రాశాడు.
      తెలుగు వర్ణమాలలో అక్షరాలు ఎక్కువగా ఉంటాయని ఇంగ్లిషు వారు వేసే అపవాదును బ్రౌన్‌ అంగీకరించలేదు. ‘ఆంగ్లంలో రెండు మూడు వేరు వేరు ధ్వనులకు ఒకే అక్షరం వాడినట్టు కాక ఒక్కొక్క ధ్వనికీ ఒక్కొక్క ప్రత్యేక అక్షరం ఉండటమే దానిక్కారణం’ అని తెలుగును సమర్థించాడు. ఎంతో వ్యయ ప్రయాసల కోర్చి సిద్ధం చేసిన రాతప్రతులు కాలగర్భంలో కలిసిపోకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. ‘మెకంజీ రాతప్రతులు దేశవాళీ పేపరు మీద తొందరగా వెలిసిపోయే ఇంగ్లిషు సిరాతో రాసినవి. వాటిని క్రిములు నాశనం చేస్తున్నాయి. అందుకే నేను ఇంగ్లిషు పేపరు మీద దీపపు మసితో చేసిన సిరాతో రాయించాను. ఇవి చాలాకాలం పాటు చెక్కుచెదరకుండా ఉంటాయి’ అన్నాడు తెలుగు-ఇంగ్లిషు నిఘంటువులో.
      బ్రౌన్‌ గురించి చిన్న వ్యాసంలో చెప్పడం అంటే కొండను అద్దంలో చూపించడమే. 30 సంవత్సరాలపాటు తెలుగు భాషా సాహిత్యాలే ఊపిరిగా జీవించిన ఛార్లెస్‌ ఫిలిప్‌ బ్రౌన్‌ తెలుగు జాతికి చిరస్మరణీయుడు.
నూరార్లు లెక్కసేయక
పేర్లొందిన విబుధ జనుల బిలిపించుచు వే
నూర్లర్థమిచ్చు వితరణి
ఛార్లీసు ఫిలిప్పు బ్రౌను సాహెబు కరుణన్‌

- ములుపాక బుచ్చన్నశాస్త్రి


వెనక్కి ...

మీ అభిప్రాయం