లోతైన అధ్యయనం విజయం వైపే పయనం

  • 238 Views
  • 0Likes
  • Like
  • Article Share

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ఆయా విభాగాల్లో ఖాళీగా ఉన్న 33,738 ఉద్యోగాల భర్తీకి ఉత్తర్వులు జారీ చేసింది. సుమారు 34 విభాగాల్లో ఆయా స్థాయి ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
      వీటిలో జూనియర్‌ లెక్చరర్‌ ఉద్యోగాలు 4,523. వీటిపాటు ఉన్నత విద్యాశాఖ పరిధిలోని కాలేజీయేట్‌ ఎడ్యుకేషన్‌ ద్వారా అధ్యాపకుల భర్తీకి కూడా ఆర్థికశాఖ అనుమతిచ్చింది. ఈ తరుణంలో అధ్యాపకత్వం వరించాలంటే సాగించాల్సిన అధ్యయనం తీరుతెన్నులివీ...
      జె.ఎల్‌./డి.ఎల్‌ అధ్యయనాంశాలు, పరీక్షా విధానం ఒకేలా ఉంటుంది. ఈ విశ్లేషణ రెండింటికీ ఉపకరిస్తుందని అభ్యర్థులు గమనించాలి.
జేఎల్‌/ డీఎల్‌ పరీక్షావిధానం
పేపర్‌                ప్రశ్నలు       మార్కులు
పేపర్‌-1 జనరల్‌ స్టడీస్‌      150          150
పేపర్‌-2 తెలుగు (ఐచ్ఛికాంశం) 150          300
ఇంటర్వ్యూ 1:2 చొప్పున ఇంటర్వ్యూకి పిలుస్తారు) 50
మొత్తం మార్కులు           500
గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే ఎంతో లోతుగా అధ్యయనం చేస్తేనే విజయం సిద్ధిస్తుందనేది స్పష్టంగా తెలుస్తోంది. బహుళైచ్ఛిక ప్రశ్నలంటే ప్రతి అంశంపై దృష్టి సారించాలి. తెలుగు ఆప్షనల్‌ సిలబస్‌కి సంబంధించి తొమ్మిది అధ్యాయాలున్నాయి.
1. ప్రాచీన సాహిత్య యుగం
నన్నయ యుగం నుంచి వేమన కాలం వరకు అధ్యయనం చేయాలి. అమరావతి స్థూపపు రాతి పలకపై ‘బ్రాహ్మిలిపి’లో కనిపిస్తున్న ‘నాగబు’ తొలి తెలుగు పదం. దీన్ని వేటూరి ప్రభాకరశాస్త్రి గుర్తించారు. భాషా సాహిత్యాల చారిత్రక నేపథ్యాన్ని అధ్యయనం చేయాలి. ప్రధానంగా ఈ విభాగంలో ప్రాచీన కవుల, కాల విశేషాలు, సమకాలీన కవుల ప్రత్యేకతలు, బిరుదులు, నామాలు, రచనా వైశిష్ట్యం, రచనలు-ప్రక్రియా విజ్ఞానం, సుప్రసిద్ధ పద్యాలు, అంకిత విశేషాలు, ప్రక్రియాపరంగా, కవిపరంగా యుగ వైశిష్ట్యం, జన్మస్థల విశేషాలు, పూర్వకవి స్తుతి, ఆస్థాన విశేషాలు, పాత్రలు-వాటి నేపథ్యం, ప్రారంభ పద్యాలు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలి. గత ప్రశ్న పత్రాలను పరిశీలిస్తే వీటి నుంచే అత్యధిక ప్రశ్నలు వచ్చాయి. గతంలో ఈ అధ్యాయం నుంచి అడిగిన ప్రశ్నలు...
* తెలుగులో చిత్ర కవితకు ఆద్యుడు (ఆ)
అ. నన్నయ ఆ. నన్నెచోడుడు    ఇ. తిక్కన ఈ. నాచన సోమన
* పూర్వకవి ప్రశంసలో విశ్వనాథ పోతనను ఇలా కీర్తించాడు (ఈ)
అ. తెలుగులెంక    ఆ. తెలుగు భాషామేటి
ఇ. తెలుగు భక్తకవి    ఈ. తెలుగుల పుణ్యపేటి
2. సాహిత్య యుగాలు - వివిధ ప్రక్రియల అధ్యయనం - సంప్రదాయ, నవ్య సంప్రదాయ ధోరణులు
ప్రాచీన సాహిత్యంలో భాగంగా ఇతిహాసం, పురాణం, ప్రబంధం, శతకం, జానపద, యక్షగాన, సంకీర్తన సాహిత్యాలు, చారిత్రక కావ్యాలు అనే ప్రక్రియలను ఆధునిక సాహిత్యంలో భాగంగా నవల, కథానిక, వ్యాసం, ఏకాంకిక ప్రక్రియలను సంప్రదాయ, నవ్య సంప్రదాయ ధోరణులను ఈ అధ్యాయంలో అధ్యయనం చేయాలి.
      ప్రక్రియ నిర్వచనాలు, ప్రక్రియల్లో వెలువడిన రచనలు, యుగవిశేషాలు, ప్రక్రియా లక్షణాలు, మొదటి రచనా విశేషాలు, అంకిత విశేషాలు ఈ అధ్యాయంలో భాగంగా ప్రత్యేక దృష్టి సారించాలి. ఈ అధ్యాయంలో 15 నుంచి 25 ప్రశ్నల వరకు అడిగే అవకాశం ఉంది. గత ప్రశ్నపత్రాల్లో వచ్చిన ప్రశ్నలివి.
* కాశీఖండం, శివరాత్రి మాహాత్మ్యం - రెండిట్లో ఉన్న పద్యం? (ఇ)
అ. కమలనయన        ఆ.కంటికి నిద్రవచ్చునె    ఇ. అరుణ గభస్తిబింబము  ఈ. ఉన్న ఊరును కన్నతల్లియు
3. ఆధునిక కవులు - కవితా ధోరణులు - రచనల అధ్యయనం
కందుకూరి, గురజాడ నుంచి శ్రీశ్రీ వరకు సుప్రసిద్ధ ఆధునిక కవులు, వారి రచనలు, కలం పేర్లు, బిరుదులు, మేలుమాటలు (సూక్తులు), పాత్రలు, కవితా ధోరణులను ఈ విభాగంలో అధ్యయనం చేయాలి. దీన్నుంచి సుమారు 40 ప్రశ్నల దాకా వచ్చే అవకాశం ఉంది. గతంలో ఈ విభాగం నుంచి వచ్చిన ప్రశ్నలు...
* ధర్మారావు, అరుంధతి పాత్రలు ఈ నవలలోనివి? (ఇ)
అ. చెలియలికట్ట    ఆ. మాలపల్లి      ఇ. వేయిపడగలు    ఈ. స్వర్గానికి నిచ్చెనలు
* ‘విలోమ కథలు’ రచయిత? (అ)
అ. నగ్నముని    ఆ. చెరబండరాజు    ఇ. సింగమనేని నారాయణ    ఈ. చిలుకూరి దేవపుత్ర
4. తెలుగు వ్యాకరణాలు - బాల ప్రౌఢ వ్యాకరణాల అధ్యయనం
వ్యాకరణమంటే విశిష్టమైన ఆకృతి కల్గింది, భాష స్వరూప స్వభావాలను వివరించే శాస్త్రం, భాషలోని సాధు, అసాధు ప్రయోగాలను వివరించే శాస్త్రం. తెలుగు భాష తొలి వ్యాకరణం ‘ఆంధ్ర శబ్దచింతామణి’. దీన్ని నన్నయ సంస్కృతంలో రాశాడు. తొలితెలుగు వ్యాకరణం మూలఘటిక కేతన ‘ఆంధ్రభాషా భూషణం’. తెలుగు భాషకు ప్రామాణికమైన వ్యాకరణం చిన్నయసూరి రాసిన బాలవ్యాకరణం. ఇందులో పది పరిచ్ఛేదాలున్నాయి. చిన్నయసూరి శిష్యుడు బహుజనపల్లి సీతారామాచార్యులు ‘ప్రౌఢవ్యాకరణం’ రాశాడు. దీనికే మరో పేరు ‘త్రిలింగ లక్షణ శేషం’ ఈ వ్యాకరణంలో తొమ్మిది పరిచ్ఛేదాలున్నాయి. బాలప్రౌఢ వ్యాకరణాల్లో పరిచ్ఛేదాలవారీగా సూత్రాల సంఖ్యను, సూత్రాలు, ఉదాహరణలు, పారిభాషిక పదాలను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. ఈ విభాగంలో 5 నుంచి 10 ప్రశ్నల వరకూ రావచ్చు. గత ప్రశ్న పత్రాల్లోని ప్రశ్నలు...
* ‘మేలుకొను’ దేనికి ఉదాహరణం? (ఆ)
అ. క్రియ    ఆ. శబ్దపల్లవం
ఇ. ప్రాతిపదిక     ఈ. ధాతువు
* ‘పొలాలు’ ఏ సంధి సూత్రం వర్తిస్తుంది? (ఆ)
అ. స్వరదీర్ఘ    ఆ. లులనల
ఇ. సవర్ణదీర్ఘ     ఈ. అత్వ
5. తెలుగు భాషా చరిత్ర - ద్రావిడ భాషలు - మాండలిక విజ్ఞానం
భాష ‘భాష్‌’ అనే ధాతువు నుంచి ఆవిర్భవించింది. ‘‘ఒక సమాజంలోని సభ్యులు పరస్పరం సహకరించుకోవడానికి ఉపయోగించే నిర్వ్యాజ వాక్సంకేతాల ప్రక్రియే భాష.’’ ప్రపంచంలోని భాషలు 2796, భారత దేశంలోని భాషలు 1652. ద్రావిడ భాషలు 23. భారత రాజ్యాంగం గుర్తించిన భాషలు 22. ఆయా భాషల్లోని ప్రధాన అంతర్గత భేదాలనే మాండలికాలు అంటారు. తెలుగులో నాలుగు మాండలిక భేదాలను గుర్తించారు.
      భాషాశాస్త్రంలో భాష నిర్వచనాలు, భాషోత్పత్తి వాదాలు, ధ్వనులు, ఆంధ్రము - తెనుగు - తెలుగు పదాల విశ్లేషణ, ద్రావిడ భాషా విజ్ఞానం, ప్రపంచ భాషా కుటుంబాలు, భారతదేశ భాషా కుటుంబాలు, మాండలిక విజ్ఞానం, ఆదాన ప్రదానాలు, అన్యదేశ్యాలు, లిపి పుట్టు పూర్వోత్తరాలు, అర్థ విపరిణామం, ధ్వని విపరిణామం, భాషా గ్రంథాల రచయితలు వంటి అంశాలపై లోతైన అధ్యయనం చేయాలి. ఈ విభాగంలో 10 నుంచి 15 ప్రశ్నల వరకు అడగవచ్చు. గతంలో వచ్చిన ప్రశ్నలు...
* ‘తెలుగు వెర్బల్‌ బేసెస్‌’ రచయిత? (ఆ)
అ. జి.ఎన్‌.రెడ్డి     ఆ. భద్రిరాజు కృష్ణమూర్తి     ఇ. తూమాటి దోణప్ప     ఈ. చేకూరి రామారావు
* వలపల గిలక ( ్) కింది అక్షరాన్ని సూచిస్తుంది (అ)
అ. ర     ఆ. ఱ  ఇ. స     ఈ. త
6. గ్రాంథిక, వ్యావహారిక భాషోద్యమాలు
వ్యావహారిక భాషోద్యమం 1910వ సంవత్సరంలో మొదలైంది. వ్యావహారిక భాషా పితామహుడు గిడుగు రామమూర్తి.  ఆయన జయంతి(ఆగస్టు29)ని ‘తెలుగుభాషా దినోత్సవం’గా నిర్వహించు కుంటున్నాం. గ్రాంథిక, వ్యావహారిక భాషోద్యమ కాలం నాటి సామాజిక, రాజకీయ, చారిత్రక పరిస్థితులను అధ్యయనం చేయాలి. దీన్నుంచి ఒకటి, రెండు ప్రశ్నలు రావచ్చు.
7. తెలుగు సాహిత్య చరిత్ర
ప్రాఙ్నన్నయ యుగం నాటి శాసనాల్లోని భాషా స్వరూపం నుంచి నేటి వరకు గల సాహితీ స్రవంతిని అధ్యయనం చేయాలి. ఈ విభాగం దాదాపుగా 1, 2, 3 అధ్యాయాల్లో భాగమేనని అభ్యర్థులు గ్రహించాలి.
8. అలంకార శాస్త్రం - సాహిత్య విమర్శ (ప్రాచ్య పాశ్చాత్య దృష్టి)
ఈ అధ్యాయం చాలా కీలకమైంది. అర్థమైతే తప్ప, మెదడుకు అందని విభాగమిది. ప్రాచ్యుల, పాశ్చాత్యుల కావ్య నిర్వచనాలు, కావ్యాత్మ సంప్రదాయాలు, రసం, ధ్వని, రీతి, వక్రోక్తి, గుణం, అలంకారం, ఔచిత్యం, అనుమతి, సంప్రదాయ భేదాలు, దశరూపకాలు, అర్థోపక్షేపకాలు, పంచ సంధులు, పాశ్చాత్యుల నాటక దృష్టి, విమర్శ భేదాలు, విమర్శకులు - గ్రంథాలు వంటి వాటిపై దృష్టి సారించాలి. ఈ విభాగం నుంచి 20-25 ప్రశ్నలు రావచ్చు. గతంలో వచ్చిన ప్రశ్న. 
* ‘లోచన’ వ్యాఖ్యాన కర్త? (ఇ)
అ. ఆనంద వర్ధనుడు    ఆ. కుంతకుడు    ఇ. అభినవగుప్తుడు     ఈ. రుయ్యకుడు
9. సంస్కృత వ్యాకరణం - సంస్కృత ప్రసిద్ధ కవులు - రచనలు
ఈ విభాగంలో ప్రధానంగా శబ్దాలు, ధాతువులు, సంధులు, సమాసాలు, వర్ణోత్పత్తి స్థానాలు, సుప్రసిద్ధ సంస్కృత కవులు, కాళిదాసు, భారవి, మాఘుడు, భాసుడు వంటి వారి రచనలు, అవి ఏ ప్రక్రియకు చెందినవో క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. దీన్నుంచి పది ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. గత ప్రశ్నపత్రం నుంచి ఈ విభాగానికి చెందిన ప్రశ్నలు పరిశీలిద్దాం. 
* భవభూతి రచించిన నాటకం? (అ)
అ. ఉత్తర రామచరిత్ర     ఆ. రాఘవాభ్యుదయం    ఇ. సీతాపరిత్యాగం     ఈ. రామాభ్యుదయం
ఈ తొమ్మిది అధ్యాయాలకు ప్రణాళికాబద్ధంగా ప్రతిరోజూ సుమారు ఆరేడు గంటల సమయాన్ని కేటాయించాలి. సిలబస్‌పై పూర్తి పట్టు వచ్చేదాకా పునశ్చరణ చేయాలి. తర్వాత ప్రాక్టీస్‌ పేపర్లను చేసుకుంటూ ఒక తపస్సులా అధ్యయనం కొనసాగిస్తే విజయం మీ సొంతమవుతుంది.      

  - మనస్విని


వెనక్కి ...

మీ అభిప్రాయం