ఇలా చదివితే మీరే పండితులు!

  • 296 Views
  • 2Likes
  • Like
  • Article Share

రాష్ట్ర ప్రభుత్వం 2013 డీఎస్సీలో 20,508 పోస్టులు ఖాళీ ఉన్నట్లు ప్రకటించింది. వీటిలో సెకండరీ గ్రేడ్‌ టీచర్లు- 16287, స్కూల్‌ అసిస్టెంట్‌- 2530, వ్యాయామ ఉపాధ్యాయులు- 264, ఫిజికల్‌ డైరెక్టర్లు - 2, భాషా పండితులు- 1425 పోస్టులున్నాయి. తెలుగుపండిత అభ్యర్థులు అధ్యయనం చేయాల్సిన విశేషాంశాలివీ...
విమర్శ

తెలుగు సాహిత్యంలో ‘విమర్శ’కు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఈ నియామక పరీక్షలో విమర్శపై లోతైన విశ్లేషణతో అధ్యయనం చేస్తే తప్ప లక్ష్యం సాధించలేం.
      ‘వి’ పూర్వకమైన ‘మృశ్‌’ ధాతువు నుంచి విమర్శ అనే పదం నిష్పన్నమవుతుంది. ఆంగ్ల సాహిత్య ప్రభావం వల్ల ఆధునిక కాలంలో ‘క్రిటిసిజమ్‌’ పదానికి సమానార్థకంగా ‘విమర్శ’ అనే పదాన్ని వ్యవహరిస్తున్నాం. ఆధునిక కాలంలో మాత్రమే ‘విమర్శ’ ఉందా! ప్రాచీన కాలంలో లేదా! అంటే తప్పనిసరిగా ఉందనే చెప్పాలి. విమర్శకు బదులు ప్రాచీన కాలంలో వ్యాఖ్య, వివరణం, మీమాంస వంటి పదాలు వ్యాప్తిలో ఉండేవి. విమర్శకు ప్రథమ సోపానం ‘వ్యాఖ్యానం’గా భావించవచ్చు. వ్యాఖ్యానం అంటే కేవలం ప్రతిపదార్థ తాత్పర్యం మాత్రమే కాదు. అలంకారం, ధ్వని మొదలైన విశేషాలు అని కూడా గ్రహించాలి.
‘‘పదచ్ఛేదః పదార్థక్తిః విగ్రహో వాక్యయోజనా
ఆక్షేపశ్చ సమాధానం వ్యాఖ్యానం పంచలక్షణమ్‌’’

వ్యాఖ్యకి ఐదు లక్షణాలున్నాయని పేర్కొన్నారు.
ప్రసిద్ధ వ్యాఖ్యానాలు
* కాళిదాస నాటకాలకు మల్లినాథ సూరి వ్యాఖ్యలు సుప్రసిద్ధం.
* నైషధీయ చరితంకు ‘నారాయణీయం’ పరమ ప్రామాణికమైన వ్యాఖ్య.
* భాగవత పురాణానికి ‘32’ వ్యాఖ్యలున్నాయి. ‘శ్రీధరీయం’ సుప్రసిద్ధం.
* వాల్మీకి రామాయణానికి గోవిందరాజకృత వ్యాఖ్య సుప్రసిద్ధం.
* భారతానికి ‘నీలకంఠీయం’ సుప్రసిద్ధ వ్యాఖ్య.
* భరతుని నాట్యశాస్త్రానికి అభినవగుప్తుని ‘అభినవ భారతి’ వ్యాఖ్య.
* ఆనందవర్ధనుని ధ్వన్యాలోకానికి అభినవ గుప్తుని ‘లోచన’ వ్యాఖ్య.
తెలుగు వ్యాఖ్యానాలు
* లభ్యమైన తెలుగు వ్యాఖ్యానాల్లో వసుచరిత్రకు సోమనాథ కవి రచించిన ‘వ్యాఖ్య’ మొదటిదని విమర్శకుల అభిప్రాయం.
* ‘శృంగార నైషధం’కు వేదం వేంకటరాయశాస్త్రి రాసిన ‘సర్వంకష’ వ్యాఖ్య.
* చేమకూర వేంకటకవి ‘విజయవిలాసం’కు తాపీ ధర్మారావు ‘హృదయోల్లాస’ వ్యాఖ్యకు కేంద్ర సాహిత్య అకాడమి పురస్కారం లభించింది.
విమర్శ నిర్వచనం
* ఒక గ్రంథాన్ని తీసుకొని అందులోని లోపాలను, ఔచిత్యానౌచిత్యాలను, భావ గంభీరతను, అలంకార రచనా పాటవాన్ని, ధ్వని విశేషాలను, శయ్యా సౌభాగ్యాన్ని, వస్తునిర్మాణ సౌష్ఠవాన్ని, పాత్రపోషణ, రసపోషణ, సన్నివేశకల్పన వంటి ఆ గ్రంథానికి సంబంధించిన సర్వ విషయాలను కూలంకషంగా చర్చించి, వాఙ్మయంలో ఆ గ్రంథానికి గల స్థానాన్ని నిరూపించటమే విమర్శ - హట్సన్‌ పండితుడు
* అనుభూతి విశేషాలను వివేచించి, వాటి విలువలను నిర్ణయించడానికి చేసే యత్నమే విమర్శ - ఐ.ఎ.రిచర్డ్స్‌
* సాహిత్యానికి ప్రామాణికమైన చక్కని పరిష్కారం విమర్శ - డ్రైడెన్
* కప్పి చెప్పేది కవిత్వం; విప్పి చెప్పేది విమర్శ - సి.నా.రె
* ‘‘హృదయం లాంటిది కవిత్వం; మెదడు లాంటిది విజ్ఞానం; సంస్కారం లాంటిది విమర్శ’’ - ఆచార్య జీవీ సుబ్రహ్మణ్యం
* విమర్శకు మొదట ఆ పేరు పెట్టినవాడు, ప్రప్రథమ నవలా విమర్శకుడు (వివేక చంద్రికా విమర్శనం) కాశీభట్ల బ్రహ్మయ్యశాస్త్రి.
* ప్రథమాంధ్ర విమర్శకుడు కందుకూరి వీరేశలింగం (విగ్రహతంత్ర విమర్శనం)
* తెలుగు సాహిత్యంలో తొలి నవల రాజశేఖర చరిత్ర. దీనికి మరో పేరు వివేక చంద్రిక.  ఈ నవలను ‘వివేక చంద్రికా విమర్శనం’ పేరుతో కాశీభట్ల బ్రహ్మయ్యశాస్త్రి నవలకి, విమర్శకి ఆ పేర్లు పెట్టి నవలా విమర్శకు శ్రీకారం చుట్టాడు.
ఆధునిక విమర్శలో ప్రధాన విమర్శా మార్గాలు అయిదు.
1. నైతిక విమర్శ   2. మనస్తత్వ విమర్శ   3. సాంఘిక విమర్శ   4. కళాత్మక విమర్శ    5. పౌరాణిక విమర్శ
నైతిక విమర్శ
నైతికమైన ఆదర్శాలను ఆధారంగా చేసుకొని సాహిత్యాన్ని విమర్శిస్తే అది నైతిక విమర్శ.
‘‘రామాదివ ద్వర్తితవ్యం నరావణాదివత్‌
పుణ్యశ్లోకస్య చరితముదాహరణ మర్హతి’’
అనే వాక్యాలు నైతిక దృష్టిని వ్యక్తీకరించేవి. ప్రాచీన కాలంలో ప్లేటో, హురేస్‌ వంటి గ్రీసు దేశ పండితులు, మధ్య యుగంలో సర్‌ ఫిలిప్‌ సిడ్నీ, రస్కిన్, మేచ్యుఆర్నాల్డ్, డా।। జాన్సన్‌ వంటి పండితులు, ఆధునిక యుగంలో టి.ఎస్‌.ఎలియట్, ఎడ్మండ్‌ పుల్లర్‌ వంటి వారు నైతిక విమర్శకు ప్రాధాన్యత ఇచ్చారు.
ఈ విభాగంలో అడిగే ప్రశ్నలు
ఎట్లు చెప్పెను అను దానికంటే ఏమి చెప్పెను అనే దానికి ప్రాధాన్యతనిచ్చిన విమర్శ? (అ)
అ. నైతిక విమర్శ    ఆ. మనస్తత్వ విమర్శ     
ఇ. సాంఘిక విమర్శ     ఈ. కళాత్మక విమర్శ
మనస్తత్వ విమర్శ
చిత్త వైపరీత్యానికి మూలకారణం అవ్యక్త చైతన్య ప్రభావమే అని మనస్తత్వ శాస్త్రవేత్తల అభిప్రాయం. ఫ్రాయిడ్‌ ప్రతిపాదించిన ఎడిపస్‌ కాంప్లెక్స్, ఆడ్లర్‌ పండితుని ‘ఇన్‌ఫీరియారిటీ కాంప్లెక్స్‌’, యూంగ్‌ పండితుని ‘కలెక్టివ్‌ అన్‌ కాన్షియస్‌నెస్‌’ అనే సిద్ధాంతాలు నవ్య సాహితీవేత్తలను అత్యధికంగా ప్రభావితులను గావించాయి. ఐ.ఎ.రిచర్డ్స్‌ ‘ప్రిన్సిపుల్స్‌ ఆఫ్‌ లిటరరీ క్రిటిసిజమ్‌’ గ్రంథంలో విమర్శలో మనస్తత్వ శాస్త్రానికి గల ప్రాధాన్యతను ఉగ్గడించాడు.
ఈ విభాగంలో అడిగిన ప్రశ్న
కవి జీవితానికి అతని గ్రంథానికి గల సంబంధం తెలిపే విమర్శ? (ఇ)
అ. కళాత్మక విమర్శ    ఆ. సాంఘిక విమర్శ 
ఇ. మనస్తత్వ విమర్శ     ఈ. నైతిక విమర్శ
సాంఘిక విమర్శ
కవిపై దేశకాల సాంఘిక పరిస్థితులకు గల ప్రభావాన్ని వివరింప యత్నించు విమర్శను సాంఘిక విమర్శ అంటారు. దీనికి ఆచార్యుడు ఫ్రాన్స్‌ దేశానికి చెందిన టెయిన్‌ పండితుడు. ‘‘కాలం, సంఘం, పరిసరాలు అనువాని ఫలమే వాఙ్మయం’’ - టెయిన్‌ పండితుడు 
టెయిన్‌ పండితుడి సిద్ధాంతానికి ‘ఉత్పత్తి విధానం’ చేర్చిందెవరు? (ఆ)
అ. ల్యూకాస్‌    ఆ. మార్క్స్, ఏంగిల్స్‌        ఇ. ఎల్‌మార్‌మోరో    ఈ. ఫ్రాయిడ్‌
కళావిమర్శ
దీన్ని ఈస్థటిక్‌ క్రిటిసిజమ్, ఓన్టలాజికల్‌ క్రిటిసిజమ్, టెక్స్చువల్‌ క్రిటిసిజమ్, న్యూ క్రిటిసిజమ్‌ అని కూడా అంటారు. కళను కళా దృష్టితోనే విమర్శించాలి గానీ దాన్ని మత సాంఘిక రాజకీయ నైతిక భావ వ్యక్తీకరణ సాధనంగా పరిగణించి విమర్శించరాదని కళా విమర్శకుల సిద్ధాంతసారం.
కవి ఆత్మీయతకు, కావ్యానికి గల సంబంధం గణనీయం కాదని ఎవరి సిద్ధాంతం? (ఇ)
అ. సాంఘిక విమర్శకులు    ఆ. మనస్తత్వ విమర్శకులు    ఇ. కళావిమర్శకులు    ఈ. నైతిక విమర్శకులు
కావ్య ప్రతిపాదిత జీవితం, యథార్థానుభవంపై ఆధారపడి పొందిక, పరిపక్వత కలిగి ఉండాలని అట్టి కావ్యాన్ని విమర్శకుడు సత్కావ్యంగా పరిగణించాలని ఏ మహాకవి ఆదేశం? (అ)
అ. ఎలియట్‌    ఆ. ఫ్రాయిడ్‌     ఇ. యూంగ్‌    ఈ. అరిస్టాటిల్‌
పౌరాణిక విమర్శ
ఈ విమర్శకి ఆర్కిటైపల్, టొటెమిక్, మైథలాజికల్, రిచువలిస్టిక్‌ అప్రోచ్‌ అని కూడా పేర్లున్నాయి. పౌరాణిక విమర్శ ఒక జాతి అవ్యక్త చేతనకు, అనగా సామూహిక అవ్యక్త చేతనకు సంబంధించి ఉంటుంది. సాంఘిక విమర్శలా ఈ విమర్శ కూడా మౌలిక సాంస్కృతిక రూపాలను కూడా చర్చిస్తుంది. సాంస్కృతికం గానీ సాంఘికంగానీ ఒక జాతి పూర్వస్థితి దీనిలో పరిశీలిస్తారు. 
      ‘ఆర్కిటైప్‌’ అనే ఆంగ్ల పదానికి మౌలిక రూపం లేదా నమూనా అని అర్థం. ఒక కళానిర్మాణంలో గల మౌలిక సాంస్కృతిక రూపం నిరూపించడానికి ఈ విమర్శ యత్నిస్తుంది. ఈ విమర్శకు మూలాధారం యూంగ్‌ అనే మనశ్శాస్త్రకారుడు స్థాపించిన ‘సామూహిక అవ్యక్త చేతన’ అనే సిద్ధాంతం. మానసిక విశ్లేషణను అనుసరించి చేతన మూడు రకాలుగా ఉంటుందని యాంగ్‌ పేర్కొన్నాడు.
1. (వ్యక్త)చేతన  2. పూర్వ చేతన 3. అవ్యక్త చేతన
మానవశాస్త్రంపై ఏ విద్వాంసుడు చేసిన పరిశోధన పౌరాణిక విమర్శపై ప్రభావం చూపించింది? (అ)
అ. ఫ్రేజర్‌  ఆ. యూంగ్‌  ఇ. అరిస్టాటిల్‌  ఈ. ప్లేటో
పై విమర్శలతోపాటు తులనాత్మక విమర్శ, రూపవిమర్శ, మార్క్సిస్టు విమర్శలు, శైలీ శాస్త్ర విమర్శలతోపాటు ప్రక్రియాపరమైన విమర్శ, కవిత్వపరంగా వచ్చిన విమర్శ, పరిశోధనలను కూడా లోతైన విశ్లేషణతో కూడిన అధ్యయనం చేస్తే విజయం మన సొంతమవుతుంది.

- సూర్యనారాయణ


వెనక్కి ...

మీ అభిప్రాయం