కవీ..రవీ...

  • 44 Views
  • 0Likes
  • Like
  • Article Share

    గణేశ్‌ బెహరా

  • వాటపాగు, శ్రీకాకుళం జిల్లా
  • 7732097027
గణేశ్‌ బెహరా

ఆకాశం నిప్పులు కక్కుతుంది. గాలి వేడెక్కుతుంది. భూమి బీటలు వారుతుంది. నీరంతా ఆవిరవుతుంది. అనలుడి ఆవేశానికి ఊళ్లూ, వనాలూ బూడిదకుప్పలవుతాయి. పంచ భూతాత్మకమైన ప్రకృతి అంతా ఆ సమయంలో కల్లోల భరితమవుతుంది. ఇంతటి భయంకర పరిస్థితులకు నెలవు... గ్రీష్మ రుతువు. కవితా పరవశంతో వసంతాన్ని ఆస్వాదించే మన కవులకు వేసవి వచ్చేసరికి రసభంగమైంది కాబోలు... కాలకాలుడి కిరణాలపైకి తమ అక్షర శరాలను సంధించారు.
రుతువుల
వంతెనపై పరిగెత్తే కాలానికి విరామముండదు. కానీ, ఆరు మజిలీలుంటాయి. ఒక్కో దాని దగ్గరకు వచ్చినప్పుడు ఒక్కో రూపాన్ని ధరించి ముందుకు సాగిపోతుంటుంది. ఆ క్రమంలోనే ఒకసారి జీవజాతులకు జలాభిషేకం చేస్తుంది. మరోసారి శీతల వాయువులతో వణికిస్తుంది. ఇంకోసారి చండ్ర నిప్పులతో చెమటలు కక్కిస్తుంది. కాల ప్రభావంతో ప్రకృతిలో వచ్చే మార్పులన్నింటినీ తట్టుకునే ప్రాణికోటి... గ్రీష్మంలో మాత్రం అల్లల్లాడిపోతుంది. సాంత్వన కోసం ఆరాటపడుతుంది. 
      ఈ వేసవి ఇక్కట్లను ‘కుమార సంభవం’లో కళ్లకు కట్టినట్లు వర్ణించాడు నన్నెచోడుడు. ‘నదుల్లో నీళ్లు ఇంకిపోతున్నాయి. ప్రజలను వడగాలులు భయపెడుతున్నాయి. ‘చూస్తే’ కళ్లు బైర్లుకమ్ముతున్నాయి. మాట్లాడితే నోరు పొక్కుతోంది. వడగాలికి ఏనుగుల తలలు పేలి పోయి కుంభస్థలంలోని ముత్యాలు పేలాల్లా చిట్లిపోయాయి. చెట్లు దాహాన్ని తట్టుకోలేక తమ నీడనే తాగుతున్నాయా అన్నట్లున్నా’యంటూ ఎండాకాలపు విలయాన్ని అక్షరబద్ధం చేశాడు.. 
      నరనారాయణులైన కృష్ణార్జునులు కూడా భానుడి ప్రతాపం నుంచి తప్పించుకోలేకపోయారట. ఆంధ్రమహాభారతం ఆదిపర్వంలో నన్నయ ఇదే విషయం చెబుతూ... ‘సూర్యకిరణాల ధాటికి ఎన్నో ప్రవాహాలు జీర్ణించుకుపోతున్నాయి. కాబట్టి ఆ వేడి సర్వజీవులకూ అసహ్యమైంది’. ఇక్కడ ‘అసహ్య’మంటే సహింపరానితనం.
      నృసింహపురాణంలోని ఎర్రన వేసవి వర్ణన ఆధునిక కవులు చేసేంత కొత్తగా ఉంటుంది.
అదరిపాటున వేసవి పొదవికొనిన
గలగి తలగి పోనేరక మలయపవను
డిందు దలదూర్చికొనియెనానింపొనర్చె
నమరు తాలవృంతముల మందానిలంబు

      ఎండ బాధకి మలయ పర్వతం మీద ఉండే గాలే కలత చెందిందట! వెతను తప్పించుకోవడానికి ఎక్కడికి వెళ్లాలో తెలియక అలా అలా వచ్చి తాటాకు విసనకర్రల్లో దాగిపోయిందట. ఇది ఒక అసాధారణ భావం. గాలి పంకాలు లేని ఆనాటి కాలంలో ఉక్కపోత నుంచి ఉపశమనం పొందడానికి విసనకర్రలే ఆధారం. అందులోనూ తాటాకు విసనకర్రలుండేవి. వాటిని విసురుతున్నప్పుడు వచ్చే గాలి... మలయ పర్వత సమీరమన్నది కవి భావుకత. 
‘దినములంతంతకు దీర్ఘంబులైయుండె
      దిననాథుడుత్తరదిశ జరించె
నాటి నాటికి నెండ నవ్యమై ఖరమయ్యె
      వెచ్చని గాడ్పులు విసరజొచ్చె
మేదినీ రేణువుల్‌ మింట సంకుల మయ్యె
      నేఱులు గొలకులు నిగిరిపోయె
బానీయ శాలల బథిక సంఘమునిల్చె
      జప్పరంబుల భోగి చయముడాగె
దరుల గుసుమ చయము దళములతో వాడె
మిథున కోటికి రతిమెండు దోచె
నఖిల జంతు భీష్మమైన గ్రీష్మమురాక
గీలి యడవులందు గేలిసలిపె’ 

      పోతపోసిన శిల్పంలా పద్యాన్ని కూర్చే పోతన పలుకులివి. వేసవిలో పగళ్లు పెద్దవయ్యాయి. వెచ్చని గాలులు విసిరేస్తున్నాయి. నేలలోని మట్టిరేణువులన్నీ కలిసి సుడిగాలిలా మారుతున్నాయి.. ఏరులు ఇంకిపోయాయి. చలివేంద్రాల్లో బాటసారుల సమూహాలు నిలిచాయి. పూలు వాడిపోయాయి.... అంటూ ‘భాగవతం’లో రవి కిరణ ప్రతాపాన్ని అక్షరాల్లోకి కూర్చాడు. 
బెల్లం చలువ చేస్తుందని చెబుతారు. శ్రీకృష్ణదేవరాయల కాలం నాటికే ఈ అభిప్రాయం స్థిరపడింది కాబోలు... తన ‘ఆముక్తమాల్యద’లో రాయలు ఈ విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించాడు.
‘తోటబగలుండి మల్లెలు దుఱిమి కావు
లమర, మాపైన నిక్షుయంత్రముల కొయ్య
జేరు ప్రజవొల్చె, భావి వృష్టికిని గ్రుడ్డు 
తో మధురిమేచ్ఛడిగు నెఱ్టచీమలనగ’ 

      ఎండవేడి నుంచి తప్పించుకోవడానికి ప్రజలు పగలంతా తోటల్లో గడుపుతూ, సాయంత్రం చెరుకు గానుగ దగ్గరకు చేరుకుంటున్నారట. వీరందరినీ చూస్తే తీపి పదార్థాల వద్దకు వెళ్లిన ఎర్రచీమల బారు జ్ఞప్తికి వస్తోందంటున్నాడు సాహితీ సమరాంగణ సార్వభౌముడు. 
వసంతంలో పూచిన పూలు గ్రీష్మంలో కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తాడు పింగళి సూరన. వేసవిలో పూచే మోదుగ పువ్వులు నిప్పుకణికల్లా మండిపోతున్నాయంటాడు తన కళాపూర్ణోదయంలో.  
      మన కవులందరిలో తెనాలి రామకృష్ణుడి ప్రత్యేకతే వేరు. అందరి కంటే భిన్నమైన దృష్టికోణం ఆయనది. ‘పాండురంగ మాహాత్మ్యం’లోని ఈ సృజనను చూడండి. 
‘గంగ గాటుక కొండ గప్పు నొప్పిదము ద
ళ్కాత్త నావుల పాల నోలలార్చి
బలితంపు నురువు జొంపము దార్త 
రాష్ట్రంబు
జుట్టిన క్రియ దెల్లపట్టు గట్టి
ముదురువెన్నెల యొప్పు మున్నీటి 
గమిచి ప
ట్టిన లీలగ్రాల జందనము బూసి
వడగండ్లు పొదుపు శాద్వలమహి బొల్చుపొ
ల్పుగ మల్లె పువ్వుల బూజ చేసి
మండు వేసవి వాసవి మనుపు కాపు
విబుధ తతిపాలి వీడర వెల్ల మ్రాకు
భక్త సులభుని దెలచి పూర్వోక్త భూరి
భక్ష్య భోజ్యాదులర్పింప భద్రమొదవు’ 

      రుతువులకు అనుగుణంగా వేసవి పూజ చేయమంటున్నాడు రామలింగడు. ఇందులో అంతరార్థం... అన్నదాతలను ఉద్దేశించి ఉందేమోనని అనిపిస్తుంది. వేసవిలోనే జ్యేష్ఠమాసం వస్తుంది. ఆ సమయంలోనే ‘ఏరువాక పున్నమి’ని జరుపుకుంటారు రైతులు. దీని గురించే మన వికటకవి చెప్పి ఉండొచ్చు. 
      దాహార్తిని తట్టుకోలేక శ్రీనాథుడు చెప్పిన ‘సిరిగలవానికి చెల్లును...’ చాటు పద్యం లోకప్రసిద్ధం. ఏ ఎండాకాలంలోనో దేశ పర్యటనకు వెళ్లిన ఆ మహాకవికి దాహం తీర్చుకోవడానికి నీరు దొరకనప్పుడు ఇలా ఆవేదన వ్యక్తం చేసి ఉంటాడు. 
      రఘునాథ నాయకుడు... ఆంధ్ర సాహిత్యంలో అభినవ శ్రీకృష్ణదేవరాయలు. ఆయన రాసిన ‘వాల్మీకి చరిత్ర’లో ‘గ్రీష్మ రుతువు’ ప్రభావాన్ని భార్యాభర్తలను ఉటంకిస్తూ వివరిస్తాడు. 
‘రమణులెంతయు దమతమ రమణులకును 
దాపములుడ వాపి రొకకొంత తపనను డపుడు
తనదు పండ్రెండు మూర్తుల నెనసినట్లు
కొండ లవియంగ గందంపు టెండ గాయ’
 
      వేడిని భరించలేని పురుషులు తమ భార్యల కౌగిళ్లలో బందీలయ్యారట: తమ పైటకొంగులతో విసురుతూ వారికి ఊరట కలిగించారట కాంతామణులు. అలాగే, మరోచోట... కీకారణ్యంలో ప్రయాణించే మునులు వేసవి తాపానికి దారి తప్పి ఓ బోయపల్లెలో ప్రవేశించే తీరు అద్భుతంగా వర్ణించాడు. 
‘పటపట పటపగిలెం గుంభిని
తటపట పథికుల మనంబు తల్లడపడియెన్‌
చిటచిట నెగసెన్‌ దవశిఖి
కటకట గ్రీష్మం బొకింత కనబడునంతన్‌’ 

      ఇక్కడ పట, తట, చిట, కట వంటి పదాలతో శబ్దార్థాలను చక్కగా ప్రయోగించాడు.
      సూర్యుడి ధాటికి మనుషులే కాదు దేవతలు కూడా అల్లాడిపోతున్నారని అంటాడు కొఱవి గోపరాజు. ‘ఎండ నుంచి తప్పించుకోవడానికి విష్ణువు అత్త వారింటికి(సముద్రానికి) వెళ్లాడు. పరమేశ్వరుడు గంగనీ, చంద్రుణ్నీ తన తలలో ఉంచుకున్నాడు. బ్రహ్మ పద్మగృహానికి చేరాడ’ంటూ తన ‘సింహాసన ద్వాత్రింశక’లో చమత్కరిస్తాడు.
      పూర్వ కవులందరికీ భిన్నంగా... సామాజిక రుగ్మతలపై ఎలుగెత్తడానికి ఎండను ఉపమానంగా ఉపయోగించుకున్నాడు అన్నమయ్య. ‘కడిగి యేనుగు మీద గాయు ఎండొకటే/ పుడమి శునకము పైన బొలయు నెండొకటే’ అంటూ ఆయన పలికిన మాటలను వినని తెలుగు వారుండరు. 
వర్తమానంలోనూ అదే వేడి
      విశ్వనాథ సూక్ష్మపరిశీలనకు చక్కటి ఉదాహరణ ‘రామాయణ కల్పవృక్షం’లో ఉంది. వేసవి ప్రభావానికి ఏరు ఇంకిపోయింది. పిచ్చుకలు ముక్కులు కూడా మునగనంత నీరు మాత్రమే మిగిలిందంటారాయన అక్కడ. 
      వసంతానికి వీడ్కోలిచ్చి... వృషభాల ఊపిరి సెగలా గ్రీష్మం ఉరుముకొస్తోందని వర్ణిస్తాడు శ్రీశ్రీ. 
‘... రుతువుల రాణీ వసంతకాలం
మంత్ర కవాటం తెరుచుకునీ 
కంచు వృషభముల అగ్నిశ్వాసం
క్రక్కే గ్రీష్మం కదలాడీ....’ అంటాడు ‘శైశవగీతి’లో.

      విరహంలా వేడి గాడ్పు వీస్తోంది... విచిత్రంగా మనస్సు భ్రమిస్తోంది... ఇవి గ్రీష్మ ప్రథమ దివసాలైనా... ఇంకా వసంతపు గడుసుతనం వేధిస్తోంది... అంటూ మనస్సు లోతులను ఆవిష్కరిస్తాడు దేవరకొండ బాలగంగాధర తిలక్‌.
      ఉగాది వేడుకలకు సిద్ధపడే వారికి ప్రజాకవి దాశరథి కృష్ణమాచార్యులు వేసిన ఈ చురకను (‘నేత్రపర్వం’ నుంచి) చూడండి. ఔరా అనిపిస్తుంది.  
‘గ్రీష్మ కిరీటం మెరిపిస్తూ 
వూష్మం ఎగజిమ్ముతూ
రక్తాక్షి భయంకరంగా వస్తే
రంభంగా భావించి స్వాగత 
కుంభాలతో ఎదురు రమ్మంటున్నారు
 ‘...మలమల మాడ్చేసే వేడిగాలిని
 జనులారా
మలయానిలంగా భావించి ఆనందించండి
వంటి నిండా చెమటను చందనం
 అనుకుని 
వసంతాన్ని ఊహించుకుని తృప్తిపడండి’ 
      సాహితీ సవ్యసాచి వేటూరి అయితే, ‘గ్రీష్మా’న్ని ఒడుపుగా ఉపయోగించుకున్నాడు. ‘వలపు కోయిలలు పాడే వసంతం నీ సొంతం... మల్లెల మంటలు రేగిన గ్రీష్మం నా సొంతం’ అంటూ అలౌకిక భావనలకు అక్షర రూపమిచ్చాడు. 
      ఇలా ఎందరో కవులు... అందరూ ఆ అర్కుడి విశ్వరూపాన్ని వివిధ కోణాల్లో ఆవిష్కరించిన వారే. భావుకతలో, పదప్రయోగం, ఉపమానాల ఎంపికలో ఎవరి శైలి వారిదే. తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేసిన ఈ సరస్వతీపుత్రులందరూ ప్రాతఃస్మరణీయులే.


వెనక్కి ...

మీ అభిప్రాయం