ఏరువాక సాగారో!

  • 250 Views
  • 0Likes
  • Like
  • Article Share

    తెలుగు వెలుగు బృందం

పుడమిని పుత్తడిగా మార్చడానికి ఆరుగాలం శ్రమించే అన్నదాతల చెమట చుక్కలకు అద్దం పట్టే అక్షరాల కూర్పును చూడాలనుకుంటే... తెల్లారగట్టే లేచి చద్దన్నం చంకనబెట్టుకుని ఎడ్లను తోలుకుంటూ చేను దిక్కుకు సాగిపోయే సేద్యగాళ్ల గోసను వారి యాసలోనే వినాలంటే.. ఆ పాటకు మించిన ప్రత్యామ్నాయం లేదు. రైతు చల్లగా ఉంటేనే దేశం కడుపులో చల్ల కదలకుండా ఉంటుందన్న సత్యాన్ని సుందరమైన పల్లె పదాల్లోకి అనువదించి ‘రైతు జన విధేయ రాఘవయ్య’ అందించిన ఆ గీతం ‘ఏరువాక సాగారో’. 
      కొసరాజు రాఘవయ్య చౌదరి కలం... కర్షకుడి ప్రియనేస్తం. రైతు కుటుంబంలో పుట్టి, రైతుగా పొలం దున్ని, రైతు కూలీల ‘కడగండ్ల’కు అక్షరరూపం ఇచ్చిన వ్యక్తి కొసరాజు. మాండలిక పదాలకు, వ్యవసాయ పారిభాషిక పదాలకు సాహిత్యంలో స్థానం కల్పించిన జానపద పాటల మహారాజు ఆయన. ‘రోజులు మారాయి’ చిత్రం కోసం ఆయన రాసిన ‘ఏరువాక సాగారో’ పాట అప్పట్లో ఓ సంచలనం. మాస్టర్‌ వేణు స్వరరచనలో జిక్కి పాడిన ఆ గీతం ఇప్పటికీ ఎక్కడో ఒకచోట వినిపిస్తూనే ఉంటుంది. ఎండకు వడలిన శరీరానికి చల్లటి పైరుగాలి తగిలినప్పటి హాయిని చెవులకు అందిస్తుంటుంది. విశ్వజనీనమైన భావాల పరిమళాలను వెదజల్లే ఆ పాట... పల్లెతల్లి మెడలో పచ్చల పతకం. 
కల్లా కపటం కానని వాడా
లోకం పోకడ తెలియని వాడా
ఏరువాక సాగారోరన్నో చిన్నన్నా
నీ కష్టమంత తీరునురోరన్నో చిన్నన్నా
నవధాన్యాలను గంపకెత్తుకుని
చద్దియన్నము మూటగట్టుకుని
ముల్లుగర్రను చేతబట్టుకుని
ఇల్లాలును నీ వెంట బెట్టుకుని    
పడమట దిక్కున వరద గుడేసె
ఉరుముల మెరుపుల వానలుగురిసె
వాగులు వంకలు ఉరవడి జేసె
ఎండిన బీళ్ళు చిగుళ్ళు వేసె    
కోటేరును సరిజూసి పన్నుకో 
యెలపట దాపట యెడ్ల దోలుకో
సాలుతప్పక కొండ్ర వేసుకో
విత్తనమ్ము ఇసిరిసిరి చల్లుకో
పొలాలమ్ముకొని పోయేవారూ
టౌనులో మేడలు కట్టేవారూ
బాంకులో డబ్బు దాచేవారూ
నీశక్తిని గమనించరు వారూ...     
పల్లెటూళ్ళలో చెల్లనివాళ్ళు
పాలిటిక్సుతో బ్రతికే వాళ్ళు
ప్రజాసేవయని అరచే వాళ్ళు ఒళ్ళు వంచి చాకిరికి మళ్ళరు
పదవులు స్థిరమని భ్రమిసే వాళ్ళే
ఓట్లు గుంజి నిను మరచే వాళ్ళే
నీవే దిక్కని వత్తురు 
పదవోయ్‌

రోజులు మారాయ్‌ రోజులు మారాయ్‌
మారాయ్‌ మారాయ్‌ మారాయ్‌ రోజులు మారాయ్‌

      పొద్దు పొడిచినప్పటి నుంచి సందె వాలే వరకూ పొలంలో రెక్కలు ముక్కలు చేసుకోవటం తప్ప అన్నదాతకు మరేం తెలియదు. పండించిన పంటలో పక్కవాడికింత పెడదామన్న ఆలోచన తప్ప అవతలి వాడి కష్టాన్ని దోచుకుందామన్న యావ అతనికి ఉండదు. అందుకే, కొసరాజు వారి పల్లవి అలా ప్రారంభమైంది. 
      మెరుపు మెరిస్తే వాన కురిస్తే రైతన్న గుండెల్లో వేయి పున్నములు ఉదయిస్తాయి. ఏరువాక(దుక్కి దున్నడం ప్రారంభం) నుంచి పంట నూర్పిళ్ల వరకూ అతనికి అరక్షణం ఖాళీ ఉండదు. ఆ శ్రమే అతని కుటుంబానికి, సమాజానికి బువ్వ పెడుతుంది. అంటే... ఏరువాక సాగితే కష్టాలన్నీ తీరినట్లే కదా. కవి ఇక్కడ ఆ భరోసానే ఇస్తున్నారు. 
      సేద్యానికి దిగే ముందు పొలంలో నవధాన్యాలు (వడ్లు, గోధుమలు, కందులు, పెసలు, మినుములు, ఉలవలు, అనుములు, శనగలు, నువ్వులు) చల్లడం ఆనవాయితీ. చద్దన్నం ఒంటికి చలువ చేస్తుంది. కాడిని మోసే ఎడ్లు కదలకుండా మారాం చేస్తే అదిలించడానికి ముల్లుగర్ర ఉండాలి. అన్నింటికీ మించి శ్రీమతే శ్రీమహాలక్ష్మి. పాట మొదటి చరణంలోని గంపకెత్తుకోవడం, మూటగట్టుకోవడం, చేతబట్టుకోవడం, వెంటబెట్టుకుని వెళ్లడంలోని పరమార్థాలివే. 
      మట్టికి, మబ్బుకు మధ్య ముడిపడిన బంధమే...‘పడమట దిక్కున వరద గుడేసే’. మట్టి మనుషుల మాండలిక సొగసు ఇది. ‘వరదగుడి’ అంటే చంద్రుడి చుట్టూ ఉండే వలయం. ఈ వలయం పెద్దదిగా ఉంటే తొందర్లో వానలు కురుస్తాయని నమ్ముతారు రైతులు. పడమట దిక్కు... చంద్రుడు ఉదయించే చోటు. అక్కడ వరద గుడేసింది కాబట్టి... ఉరిమే ఉరుములు, మెరిసే మెరుపుల తోడుగా చినుకు నేలకు దిగింది. దానిని ఒడిసిపట్టుకున్న వాగులు, వంకల్లో ప్రవాహం అతివేగంగా (ఉరవడి జేసే) మారింది. నీటిచుక్కకు కరవై అప్పటి వరకూ అల్లాడిన బీళ్లన్నీ వాన రాకతో చిగుళ్లు వేసి చిరునవ్వులు చిందిస్తున్నాయి.   వ్యవసాయం మొదలెట్టడానికి అనుకూలమైన ఈ పరిస్థితులన్నింటినీ కొసరాజు పదిహేను చిన్న చిన్న పదాలతో చెప్పేశారు.
      మూడో చరణమంతా వ్యవసాయ వృత్తి సంబంధిత పదాల విందు. సన్నని సూదంటు రాయి లాంటి ముక్కును కోటేరు లాంటి ముక్కు అంటాం కదా. ఆ కోటేరుకు మూలం సేద్యమే. కాడి మీదగా కట్టిన నాగలిని కోటేరు అంటారు. ఇది కిందకు వంపు తిరిగి సూదిగా భూమిని దున్నడానికి అనువుగా ఉంటుంది. దీని కొన అరిగిపోకుండా ఇనుప ముక్కను (ఏడికోల రేకు) అతుకువేస్తారు. కోటేరు వేయడంలో ఇదీ కూడా భాగమే. ఇవన్నీ సరిగ్గా జరిగాయా లేదా అని ఒకసారి సరిచూసుకోమంటున్నారు కొసరాజు వారు. ‘కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్‌’ అని ఓ కవి అన్నాడు కానీ... దున్నడానికి వెళ్లేటప్పుడు అలా జరిగితే మాత్రం పెద్ద పొరపాటే. కాడికి ఎడ్లను కట్టేటప్పుడు యెలపట (కుడి), దాపట (ఎడమ) చూసుకోవాలి. ఎద్దులు ఎప్పుడూ కాడికి ఒకవైపే అలవాటు పడతాయి. ఆయా స్థానాల్లో ఉన్నప్పుడే బరువును సమానంగా పంచుకుని మోస్తాయి. అటు ఎద్దు ఇటు వచ్చింది అంటే ఇక ముందుకు నడవవు. కాడిని వెనక్కి లాగుతాయి. వేర్వేరు ఎత్తులు, శరీర పరిమాణాలతో ఉండే ఎద్దులు రెండూ కలిసి కాడిని మోస్తూ దుక్కి దున్నుతున్నాయంటే కిటుకు ఇదే. సరే, సరే... తిరిగి పాట దగ్గరికి వద్దాం. వరస తప్పకుండా దున్నమని తర్వాతి వాక్యంలో చెబుతున్నారు కవి. అలా సిద్ధమైన చాళ్లలో విత్తనాలను విసిరి విసిరి జల్లాలి. ఎందుకంటే... విత్తులు దగ్గరగా పడితే మొలకలు రావు కదా. 
      పుట్టినప్పటి నుంచి సేద్యంతోనే సావాసం చేసే వారి కోసం చెప్పలేదు కొసరాజు వారు ఈ విషయాలన్నీ. మనం తినే మెతుకు వెనక అన్నదాతల శ్రమ ఇంత ఉంటుందని అందరికీ తెలియజేస్తున్నారిక్కడ. పట్నాల్లోని చలువరాతి మిద్దెల్లో జీవించే వారు ఈ మట్టి బిడ్డల కష్టాన్ని గుర్తించలేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాటలతో కోటలు కట్టే వారు నీలా నడుం వంచి పని చేయరని అన్నదాతను అభినందిస్తున్నారు. ఓట్ల కోసమే నీ గుమ్మం తొక్కే పెద్దలందరూ ఎప్పటికైనా నీ గొప్పతనం గుర్తిస్తారని, నీవే దిక్కంటూ నిజమైన రైతురాజ్యాన్ని స్థాపిస్తారని భుజం తడుతున్నారు. 
      టౌను, బాంకు, పాలిటిక్స్‌ లాంటి ఆంగ్ల పదాలు కూడా ఉన్నాయి ఈ పాటలో. పల్లెల్లో ఏముంది, పట్నాలన్నీ స్వర్గాలైతేనూ అంటూ ఓటిమాటలాడే వారు ఉండేవారు కొందరు అప్పట్లో. (ఇప్పటికీ ఉన్నారుకోండి!) వారు తమ గొప్పలను చాటుకోవడానికి మాటల్లో ఆంగ్ల పదాలను వాడేవారు (గిరీశంలాగన్న మాట) అలాంటి వారిని ఎద్దేవా చేయడానికే కొసరాజు ఆ పదాలను వాడారని అనుకోవచ్చు. మొత్తంగా పాట  అచ్చ తెలుగు తేనెల మూట. బాలీవుడ్‌ నటిగా కీర్తి ప్రతిష్ఠలందుకున్న వహీదా రెహమాన్‌ ఈ పాటతోనే తెరంగేట్రం చేశారు. అప్పట్లో దేశవ్యాప్తంగా ఈ పాట ప్రసిద్ధి చెందింది. దీని బాణీపై ప్రముఖ హిందీ దర్శకుడు ఎస్‌.డి.బర్మన్‌ మనసు పారేసుకున్నారు. తన ‘బొంబాయి కా బాబు’ (1960 - దేవానంద్‌ కథానాయకుడు) చిత్రంలో ఈ బాణీని ఉన్నది ఉన్నట్లుగా వాడుకున్నారు. ‘దేఖ్‌నే మే బోలా హై’ అంటూ సాగే ఆ గీతం పల్లవిలో చివర ‘చిన్నన్నా’ అని ఉండటం విశేషం.
      ‘రైతు జన విధేయ రాఘవయ్య’ మకుటంతో అన్నదాతలపై శతకం రాసిన కొసరాజుకు తెలుగంటే వల్లమాలిన అభిమానం. ‘సంస్కృతము కొరకు చలపట్టునొక్కండు... హిందీయనుచు గంతులిడు నొకండు... తెలుగుకొరకు నేడ్చు ధీరుండు కరవయ్యే’ అంటూ రాసిన భాషాభిమాని ఆయన. అందుకే ఆయన గీతాల్లో తెలుగుదనం కూచిపూడి నాట్యమాడుతుంది. మాటల్లో మాండలిక సుగంధం గుబాళిస్తుంది. 


వెనక్కి ...

మీ అభిప్రాయం