బడిలో పాఠాలు.. బయట రచనలు

  • 163 Views
  • 0Likes
  • Like
  • Article Share

    అమ్మిన శ్రీనివాసరాజు

  • తెలుగు ఉపన్యాసకులు, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల
  • ఖమ్మం జిల్లా
  • 9441317694
అమ్మిన శ్రీనివాసరాజు

మాటలతో మాయచేస్తారు... ఊహలకు ఊపిరిపోస్తారు... ఆలోచనలకు పదునుపెడతారు... విజయం సాధించే మార్గాల వైపు నడిపిస్తారు... మొత్తంగా మనలో స్ఫూర్తినింపుతారు. ఇంతకూ ఎవరు వారు?
ఉపాధ్యాయులు. ఖాళీ బుర్రతో తరగతి గదిలోకి అడుగుపెట్టే విద్యార్థికి విశ్వదర్శనం చేయిస్తారు. భవిష్యత్తులో లోకనాయకుల్లా ఎదిగేందుకు అవసరమైన ప్రేరణను పాదుకొల్పుతారు. 
కవులు, రచయితలు. ప్రభావాల పొడ సోకని మనసుతో మొదటి పుటలోకి తొంగిచూసే పాఠకులను క్రమంగా తమదైన భావ ప్రపంచంలోకి తీసుకెళ్తారు. లోకంపోకడలోని లోతును చవిచూపిస్తారు. నలుగురికీ నచ్చేలా, మరో నలుగురు మెచ్చేలా బతకడమెలాగో చెబుతారు. ఆశయసాధనకు ఆయువుపట్టు అయిన ఆత్మశక్తిని అందిస్తారు. 
      ఒక వ్యక్తిలో అక్షరాలు నేర్పే గురువుతో పాటు ఆ అక్షరాలతో అంతరంగాలను మథించే రచయిత కూడా ఉంటే... సమాజంపై ఆ వ్యక్తి ప్రభావం అపారం. ఆనాటి కందుకూరి వీరేశలింగం నుంచి ఈనాటి ‘అంపశయ్య’ నవీన్‌ వరకూ తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసి, తెలుగు వారి మనసులపై చెరగని ముద్ర వేసిన అక్షర హాలికులందరూ వృత్తిరీత్యా ఉపాధ్యాయులే. ‘జ్ఞానియైనవాని మానక పూజించ’మనే వేమన వాక్యాన్ని జ్ఞప్తికి తెచ్చే వారే.
      ఆధునిక తెలుగు సాహిత్యంలో అనేక ప్రక్రియలకు ఆద్యుడు కందుకూరి వీరేశలింగం. రచయితగానే కాదు సంఘ సంస్కర్తగానూ ఆయన ఖ్యాతి సుప్రసిద్ధం. ఆత్మాభిమానాన్ని చంపుకోకుండా జీవించే అవకాశమున్న ఉపాధ్యాయ వృత్తి అంటే కందుకూరికి వల్లమాలిన అభిమానం. అందుకే మెట్రిక్యులేషన్‌ ఉత్తీర్ణులవగానే 1872లో కోరంగిలో ఉపాధ్యాయుడిగా చేరారు. అప్పట్లో ఆయన వేతనం నెలకు రూ.25. తర్వాత రాజమండ్రి ప్రభుత్వ, మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలల్లో తెలుగు అధ్యాపకులుగా పని చేశారు. బోధనలో సరళత, సమకాలీన అంశాల జోడింపు కందుకూరి ప్రత్యేకత. చెప్పే అంశానికి చిరుహాస్యాన్ని జోడించి తరగతి గదిలో నవ్వులు పూయించే వారు. సందర్భాను సారంగా సంఘంలోని దురాచారాలను వివరించే వారు. మరోపక్క తన రచనలతో ప్రజల్లో ఆలోచనలూ రేకెత్తించారు. ఎందరో రచయితలు, ప్రజాసేవకుల ఆవిర్భావానికి ప్రేరణగా నిలిచారు. 
      తెలుగు కథానికకు అడుగుజాడ గురజాడ. విజయనగరం మహారాజా కళాశాలలో బీఏ పూర్తి చేసి అక్కడే అధ్యాపకునిగా చేరారు. ఎఫ్‌ఏ, బీఏ విద్యార్థులకు ఆంగ్లం, వ్యాకరణం, సంస్కృతం, అనువాదం, గ్రీక్, రోమన్‌ చరిత్రలు బోధించేవారు. చదువుకునే రోజుల్లోనే ఆయనలో అంకురించిన రచనాతృష్ణ అధ్యాపకునిగా ఉన్నప్పుడు మరింతగా పెరిగి పెద్దదైంది. తర్వాత కాలంలో ఆయన రచనలు సృష్టించిన సంచలనం గురించి అందరికీ తెలిసిందే. ఈ నవయుగ వైతాళికుడు అనారోగ్య కారణాల వల్ల ఎక్కువగా మాట్లాడాల్సిన బోధనా వృత్తికి దూరమయ్యారు. 
      వాడుక భాష కోసం ఉద్యమించిన గిడుగు రామ్మూర్తి పంతులు కూడా అధ్యాపకులే. చదువుకుంటూనే ఉద్యోగం చేశారు. మెట్రిక్‌ పూర్తయ్యాక 1880లో పర్లాకిమిడి రాజా వారి పాఠశాలలో రూ.30 వేతనంతో ఉపాధ్యాయునిగా చేరారు. పిల్లలకు పాఠాలు చెబుతూనే ప్రైవేటుగా ఎఫ్‌ఏ, బీఏ పరీక్షలు రాసి ఉత్తీర్ణులయ్యారు. 1895లో పర్లాకిమిడి పాఠశాల కళాశాల అయింది. గిడుగు ‘చరిత్ర’ ఉపన్యాసకు లయ్యారు. గ్రాంథిక భాషలో ఉన్న పాఠ్యాంశాలను వాడుక భాషలోకి మార్చి బోధించే వారాయన. తాపీ ధర్మారావు లాంటి శిష్యులను తయారు చేశారు. అలా 1911 వరకు అధ్యాపకత్వం చేసి ఉద్యోగాన్ని విరమించారు. విశ్రాంత జీవితాన్నంతా ‘వ్యావహారిక భాషోద్యమా’నికే అంకితమిచ్చారు. (‘గిడుగు’పై సమగ్ర వ్యాసం ‘తెలుగు వెలుగు’ ఆగస్టు సంచికలో ప్రచురితమైంది)
      కట్టమంచి రామలింగారెడ్డిది మరో ప్రత్యేకత. ఆంధ్ర విశ్వవిద్యాలయం తొలి ఉపకులపతి ఆయన. తొలి తెలుగు విమర్శా గ్రంథంగా పేరెన్నికగన్న ‘కవిత్వ తత్త్వ విచారం’ గ్రంథకర్త కూడా ఆయనే. వీరి ‘ముసలమ్మ మరణం’ కథ తెలియని వారు అరుదు. సాహిత్య, విద్యారంగాల్లోనే కాదు రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసిన ప్రతిభాశాలి కట్టమంచి. 
      తెలుగు తల్లికి తొలిసారిగా జ్ఞానపీఠ కిరీటాన్ని అలంకరించిన సాహితీ దిగ్గజం విశ్వనాథ సత్యనారాయణ. బీఏ పట్టభద్రులయ్యాక బందరు జాతీయ కళాశాలలో అధ్యాపక వృత్తికి శ్రీకారం చుట్టారు. ఉద్యోగం చేస్తూనే మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి ప్రైవేటుగా తెలుగు ఎంఏ పూర్తి చేశారు. తర్వాత వివిధ కళాశాల విద్యార్థులకు పాఠాలు చెప్పారు. సంపూర్ణ తెలుగు మాటలతో బోధన చేయడం విశ్వనాథ విశిష్టత. పాఠ్యాంశంలో ఎక్కడ ఆంగ్ల పదం వచ్చినా... దానికి అందమైన, సరళమైన తెలుగు పదాన్ని సృజించి చెప్పేవారు. 1958లో రాష్ట్ర శాసనమండలి సభ్యులయ్యారు. తర్వాతి ఏడాది నుంచి రెండేళ్ల పాటు కరీంనగర్‌ ఎస్‌ఆర్‌ఆర్‌  కళాశాల ప్రధానాచార్యునిగా బాధ్యతలు నిర్వర్తించారు. విద్యారంగానికే అంకితమైన విశ్వనాథ శతాధిక గ్రంథాలు రచించారు. ‘రామాయణ కల్పవృక్షం’తో జాతీయస్థాయి గౌరవాన్ని అందుకున్నారు. 
      తెలుగు సాహిత్యంలో అభ్యుదయ కవిత్వానికి బలమైన ప్రతినిధి... ఆధునిక కవిత్వానికి ‘మహాప్రస్థాన’పు దారులు వేసిన మహాకవి... శ్రీశ్రీ. బతుకుదెరువు కోసం అనేక ఉద్యోగాలు చేశారు. కానీ, పూర్వాశ్రమంలో ఆయనా గురువే. స్వస్థలం(విశాఖ)లోని ఏవీఎన్‌ కళాశాలలో సహాయ అధ్యాపకుడుగా పని చేశారు. 
      తన అక్షరాలతో తెలుగు మహిళాలోకంలో చైతన్యం నింపిన మహనీయుడు గుడిపాటి వెంకట‘చలం’. కొన్నాళ్లు కరీంనగర్‌లో ఉపాధ్యాయునిగా ఉన్నారు. తర్వాత రాజమండ్రి పండిత శిక్షణ కళాశాలలో చేరారు. అనంతర కాలంలో పాఠశాలల తనిఖీ అధికారయ్యారు. 
      ‘మాలపల్లి’ నవలా రచయిత, ‘గుంటూరు వీరేశలింగం’గా పేరుగాంచిన ఉన్నవ లక్ష్మీనారాయణ 1900లో ఎఫ్‌ఏ ఉత్తీర్ణులయ్యారు. పేదరికం వల్ల పై చదువులకు వెళ్లలేక స్థానిక కళాశాలలో పాఠాలు చెప్పారు. అనంతరం 1903లో జిల్లా మునసబు న్యాయస్థానంలో న్యాయవాదిగా చేరారు. అక్కడి వాతావరణం సరిపడక కొద్దిరోజులకే మానేశారు. రచన, సంఘ సంస్కరణలకే అంకితమయ్యారు.   
      సంస్కృతాంధ్ర పండితునిగా, గొప్ప విమర్శక కవిగా దీపాల పిచ్చయ్యశాస్త్రి ప్రసిద్ధులు. 1930లో నెల్లూరు వీఆర్‌ ఉన్నత పాఠశాలలో తెలుగు పండితునిగా చేరి 1954లో పదవీ విరమణ చేశారు. జాషువా ఈయన సహాధ్యాయి. 
      నవయుగ కవిచక్రవర్తి గుర్రం జాషువా కూడా తెలుగు పండితునిగా ఉద్యోగ జీవితం ఆరంభించిన వారే. పాఠాన్ని పాటతో ఆరంభించడం జాషువా శైలి. పాఠ్యాంశాలతోనే పాటలను అల్లి విద్యార్థులను ఆకట్టుకునేవారాయన.  
      ‘శివభారతం’ కర్త గడియారం వేంకటశేషశాస్త్రి 1930లో ప్రొద్దుటూరు పురపాలక ఉన్నత పాఠశాలలో ప్రధాన పండితునిగా నియమితులయ్యారు. తదనంతర కాలంలో రాష్ట్ర పండిత పరిషత్‌ అధ్యక్షునిగా విశిష్ట సేవలు అందించారు.
      ‘తెలుగులెంక’ తుమ్మల సీతారామమూర్తి చౌదరి వీధిబడి చదువు పన్నెండో ఏటనే ఆగిపోయింది. రైతు కుటుంబ నేపథ్యంలో చదువుకునేందుకు ప్రోత్సాహమందలేదు. అయినా, అక్షరాల మీద మమకారాన్ని చంపుకోలేదాయన. నాలుగు మైళ్ల దూరంలో ఉన్న చందవోలుకు వెళ్లి తాడేపల్లి వెంకటప్పయ్య శాస్త్రి వద్ద పాఠాలు నేర్చుకున్నారు. పగలు పొలం పనులు చేస్తూ రాత్రి పూట పుస్తకాలతో కుస్తీ పట్టేవారు. తర్వాత ‘ఉభయభాషా ప్రవీణ’ పూర్తి చేసి తెలుగు పండితునిగా జీవనం సాగించారు. ‘రాష్ట్రగానం, మహాత్మ కథ’ వంటి రచనలతో తెలుగు సాహితీ క్షేత్రాన్ని ఫలవంతం చేశారు. 
      మధురకవి మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి కాకినాడ తాలూకా పల్లిపాడుకు చెందిన వారు. నన్నయపై  మమకారంతో 1947లో రాజమండ్రికి వచ్చేశారు. అక్కడే కందుకూరి వీరేశలింగం విద్యాసంస్థల్లో తెలుగు పండితునిగా చేరి 1974 వరకూ పని చేశారు.
      సహజ ప్రతిభావంతుడు, అద్వితీయ సాహితీమూర్తి పుట్టపర్తి నారాయణాచార్యులు. పన్నెండో ఏటే ‘పెనుగొండ లక్ష్మి’ని విరచించిన సరస్వతీపుత్రుడు. పద్నాలుగు భాషల్లో ప్రావీణ్యమున్న ఆయనకు అమ్మభాషన్నా, అందులోని సాహిత్యమన్నా అమితమైన అభిమానం. ఆయన రచనల్లో ‘శివతాండవం’ అజరామరమైంది. పుట్టపర్తి వారు కూడా ఉపాధ్యాయ ఉద్యోగం చేశారు. చివర్లో కేరళలో భాషా శాస్త్ర పరిశోధకునిగా సేవలందించారు.
      హాస్యబ్రహ్మ భమిడిపాటి కామేశ్వరరావు 1920లో మద్రాసు ఏజీ కార్యాలయంలో ఉద్యోగిగా చేరారు. మొదటి నుంచి తెలుగు సాహిత్యంపై ఉన్న మక్కువ ఆయన్ను ఆ ఉద్యోగంలో నిలబడనివ్వలేదు. ఏడాదికే రాజీనామా చేసి రాజమండ్రి వీటీ కళాశాలలో గణిత అధ్యాపకులయ్యారు. అనంతర కాలంలో ప్రధానోపాధ్యాయులుగా ఎదిగారు.  భమిడిపాటి రచనలు చదివిన వారెవరైనా ఆయన తెలుగు పండితుడు కాబోలనుకుంటారు. అది సహజం. ఎందుకంటే... ‘పలుకు’పై ఆయన పట్టు అలాంటిది. 
      మరో హాస్య చక్రవర్తి మునిమాణిక్యం నరసింహారావు కూడా వృత్తి రీత్యా అధ్యాపకులే. అనంతరం ఆకాశవాణి హైదరాబాద్‌ కేంద్రంలో కార్యక్రమ నిర్వహణాధికారి అయ్యారు. అలాగే, ఆంధ్ర సారస్వత పరిషత్‌ పండిత శిక్షణా కళాశాల ఆచార్యునిగా, ప్రధానాచార్యునిగా విద్యార్థులను తీర్చిదిద్దారు. 
      ‘ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని’ అంటూ దేశభక్తిని నింపిన కవి రాయప్రోలు సుబ్బారావు. ‘గీతాంజలి’ ప్రేరణతో 1914లో ‘శాంతినికేతన్‌’కు వెళ్లారు. రెండేళ్ల పాటు అక్కడే ఉండి రవీంద్రునితో పాటు అనేకమంది అధ్యాపకుల్ని కలిసి సాహిత్య విద్యారహస్యాలను గ్రహించారు. తిరిగి తెలుగు గడ్డకు వచ్చి కరీంనగర్‌ జిల్లా మంథనిలో కొంతకాలం చిన్న పాఠశాలలో ప్రధానోపాధ్యాయునిగా పని చేశారు. 1918లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు ఆచార్యులయ్యారు. హన్మకొండ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలకు రాయప్రోలు వారే తొలి ప్రధానాచార్యులు. దివాకర్ల వేంకటావధాని, బిరుదురాజు రామరాజు, సి.నారాయణరెడ్డి తదితరులు రాయప్రోలు శిష్యులే. ఉద్యోగ విరమణ తర్వాత ఆయన వేెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆహ్వానం మేరకు 1956లో అక్కడకు వెళ్లారు. తెలుగు విభాగాన్ని ప్రారంభించి తొలి ఆచార్యులుగా నియమితులయ్యారు.
      కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి గుంటూరు జిల్లా అమరావతిలోని రామకృష్ణ ఉన్నత పాఠశాలలో నాలుగేళ్ల పాటు తెలుగు ఉపాధ్యాయునిగా పని చేశారు. అనంతరం గుంటూరు ఏసీ కళాశాలలో 22 సంవత్సరాలకుపైగా ఉపన్యాసకునిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన పాఠం చెబుతూ ఉంటే విద్యార్థులు తన్మయులయ్యేవారట! ఏసీ కళాశాలలో పాఠం చెబుతుంటే హిందూ కళాశాల విద్యార్థులంతా వచ్చి తరగతిలో కూర్చుని వినేవారట! పద్యాలు రాగయుక్తంగా పాడటంలో ఆయనది అందెవేసిన చేయి. కొద్దికాలం హిందూ కళాశాలలో కూడా పని చేశారు. అధ్యాపకత్వంతోపాటు  అనేక రచనలు చేసిన ఆయన ‘ఉదయశ్రీ, పుష్పవిలాపా’ల కర్తగా చరిత్రలో నిలిచిపోయారు.
      భావకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి బీఏ పూర్తయ్యాక కొంతకాలం ఉపాధ్యాయునిగా ఉద్యోగం చేశారు. మరికొంతకాలం కళాశాల శిక్షకుడిగా వ్యవహరించారు.
      ఆంధ్ర వ్యాస బిరుదాంకితుడైన ఏలూరిపాటి అనంతరామయ్య గుంటూరు సంస్కృత కళాశాల ప్రధానాచార్యులుగా పనిచేశారు. 1972లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ‘ఉత్తమ ఉపాధ్యాయ’ బహుమతిని అందుకున్నారు. ఆకాశవాణి వ్యాఖ్యాతగా కూడా సుపరిచితుడైన ఆయన అనేక పురాణాలను తెలుగులోకి తెచ్చారు. .
      తండ్రి బాటలోనే భాషకు సేవ చేసిన గిడుగు సీతాపతి... ‘భారతి’లో సంపాదకునిగా ఉంటూ బాలసాహిత్యానికి మెరుగులు దిద్దారు. ఈయన 1907లో రాజమండ్రిలో ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసుకున్నారు. 1908లో పర్లాకిమిడి పాఠశాలలో చరిత్ర అధ్యాపకునిగా నియమితులయ్యారు. అంచెలంచెలుగా ఎదిగి విద్యాశాఖలో వివిధ హోదాల్లో సేవలు అందించారు.
      ‘గాలివాన’తో తెలుగు కథానికకు అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిన పాలగుమ్మి పద్మరాజు రసాయన శాస్త్ర అధ్యాపకులు. కాకినాడ, భీమవరంలలో పని చేశారు. 
      ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అన్న దాశరథి కృష్ణమాచార్య ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏడో తరగతిలో ఉన్నప్పుడే   తోటి విద్యార్థులకు ట్యూషన్లు చెప్పారు. పోరాటాల్లో భాగస్వామై కొన్నాళ్లు చదువుకు విశ్రాంతి ఇచ్చారు. ఆపై 1949లో భోపాల్‌ విశ్వవిద్యాలయం నుంచి బీఏ పట్టా పొందారు. తెలుగు, సంస్కృతం, ఉర్దూ, ఆంగ్ల భాషల్లో పాండిత్యం సంపాదించిన దాశరథి కొంతకాలం గార్ల, కవికొండ గ్రామాల్లో ఉపాధ్యాయునిగా పాఠాలు బోధించారు. అనంతరం గ్రామ పంచాయతీల తనిఖీ అధికారిగా వ్యవహరించారు.  
      ‘యాది’తో అందరికీ గుర్తుండే సామల సదాశివ మాస్టారు కాగజ్‌నగర్‌ మిడిల్‌ స్కూల్లో ఉపాధ్యాయ వృత్తితో జీవితం ప్రారంభించారు. మూడున్నర దశాబ్దాలపాటు పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించారు. 
      సాహితీ వేత్తగానే కాక భాషా శాస్త్రంలోనూ ప్రసిద్ధి చెందిన కోవెల సంపత్కుమారాచార్య కృష్ణా జిల్లా చిట్టిగూడూరులో ‘భాషా ప్రవీణ’ పూర్తి చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి తెలుగు, హిందీల్లో స్నాతకోత్తర పట్టాలను అందుకున్నారు. ఉపాధ్యాయునిగా మహబూబాబాద్, నల్గొండ, భువనగిరి, జగిత్యాల, వరంగల్‌ జిల్లా వడ్డేపల్లిల్లో పని చేశారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో ఆచార్యునిగా సేవలందించారు. తెలుగు, సంస్కృతాల్లో అనేక రచనలు చేయడమే కాదు అలంకార శాస్త్రానికీ వన్నె తెచ్చారు.
      తన నవలనే ఇంటి పేరుగా మార్చుకున్న ‘అంపశయ్య’ నవీన్‌ కూడా విద్యా రంగానికి చెందినవారే. ఉపన్యాసకునిగా సేవలందించిన ఆయన 30 నవలలు, 80కిపైగా కథలు రాశారు. ఆయన నవల ‘కాలరేఖలు’కు 2004లో కేంద్ర సాహిత్య అకాడమి బహుమతి వచ్చింది. 
      విద్వాన్‌ విశ్వం, మధురాంతకం రాజారాం, తూమాటి దోణప్ప, నాగభైరవ లాంటి ఆచార్యులెందరో తెలుగు సాహిత్య వికాసానికి కృషి చేశారు. ఈనాటి ప్రముఖ సాహితీవేత్తల్లోనూ గురువులెందరో ఉన్నారు. 
      సాహితీవేత్తలందరూ సృజనశీలురే. అలాంటి వారి దగ్గర శిష్యరికం చేసిన వారందరూ తరగని జ్ఞాన సంపన్నులవుతారు. భావితరాలకు అలాంటి అదృష్టాన్ని అందిస్తున్న సాహితీ గురువుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నిరుత్సాహాన్ని జయించే శక్తినిచ్చే ఉపాధ్యాయుడి మాట, కవి రాత దేనికదే ప్రత్యేకం. ఆ రెండింటినీ ఏకకాలంలో  సంధించగల సవ్యసాచుల కార్యక్షేత్రం మన తెలుగు నేల. వారి అక్షర బాణాలకు అనంత శక్తిని అందిస్తూ జాతిని వెలుగు బాట పట్టిస్తున్న భాష తెలుగు. అది అతిమధురం. అజరామరం.


వెనక్కి ...

మీ అభిప్రాయం