జ్ఞానపీఠాన్ని అధిష్ఠించిన భరద్వాజుడు

  • 198 Views
  • 0Likes
  • Like
  • Article Share

    వినయ్‌కుమార్‌

  • హైదరాబాదు.
  • 9959021493
వినయ్‌కుమార్‌

ఏప్రిల్‌ 17, 2013.. సాహితీ ప్రియుల గుండెలు సంతోషంతో నిండిపోయాయి. తెలుగు సాహిత్యంలో ఎన్నాళ్లో వేచిన కాంతి రేఖ విరిసింది. తెలుగువారికి ముచ్చటగా మూడోసారి జ్ఞానపీఠం దక్కింది. అది రావూరి భరద్వాజ రూపంలో! ఒకవైపు వెల్లువలా ముంచెత్తుతున్న ఫోన్లు, ఉక్కిరిబిక్కిరి చేస్తున్న సందర్శకుల మధ్య ‘తెలుగు వెలుగు’ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. తన జీవనసమరాన్నీ, ఆలోచనలనీ, అనుభూతులనీ పంచుకున్నారు. 
తెల్లని
ముతక నూలు వస్త్రాలతో గుబురు గడ్డంతో చూడగానే రుషిలా కనిపిస్తారు భరద్వాజ. నిజమే! జీవన సత్యాలను దర్శించేందుకు సాహిత్యమనే తపమాచరించిన రుషి కదా! ‘పాకుడు రాళ్ల’పై ప్రయాణించే జీవితాలని అక్షరబద్ధం చేసినా, అర్ధాంగికి అసమానమైన విలువనిస్తూ స్మృతికావ్యాలని రచించినా... మనసుని పుటలపై పలికించిన అద్భుత రస రచయిత రావూరి.
      ‘‘రాసిందంతా సాహిత్యం కాదు. చక్కటి భాషలో సత్యాన్ని వ్యక్తీకరిస్తూ, మనస్సుకు హత్తుకునేలా ప్రభావాన్ని కలిగించేదే సాహిత్యం. అలా వాస్తవికత, సహజత్వం ఉట్టిపడే రచనలే శతాబ్దాల పాటు మానవ హృదయాలను కదిల్చివేయగలవు’’ అని భరద్వాజ తరచూ చెబుతారు.
తన జీవితం గురించి చెప్పమంటే..
      ‘‘నా జీవితం గురించి ఇతరులు తెలుసుకోవాలనే విషయం నాకు కొద్దిగా ఇబ్బందిగానే ఉంది. ఎందుకంటే పది మంది విని ‘భరద్వాజ జీవితం ఇదా! అని అనిపించుకోవాలని లేదు. కానీ దీనివల్ల ఏ ఒక్కరిలోనైనా కొత్త ఆలోచనలకు నాంది పలికించి, కొంత మార్పును తీసుకురాగలిగితే అదే నాకు సంతృప్తి’’ అంటారాయన.
బాల్యారిష్టాలు
భరద్వాజ 1927 జూలై 5వ తేదీన కృష్ణాజిల్లా నందిగామ తాలుకా కంచికచర్లకు సమీపంలోని మొగులూరులో జన్మించారు. మల్లికాంబ, చిన్నకోటయ్య ఆయన తల్లిదండ్రులు. భరద్వాజ నాన్నగారి 20 ఎకరాల పొలంలో 17 ఎకరాలు నాటకాలు, భజనలు, సంఘసేవ, ఉద్యమాల కోసం కరిగిపోయాయి. మిగిలిన దానిలో వ్యవసాయం కలిసి రాలేదు. వ్యాపారంలో భాగస్వామి మోసం చేయడంతో అప్పులపాలయ్యారు. అలా దారిద్య్రం ఆ కుటుంబాన్ని చుట్టుముట్టింది. 
      స్కూలు ఇన్‌స్పెక్టరు తనిఖీకి వచ్చే రోజు కూడా చిరిగిన లాగు, నిక్కరు వేసుకుని వచ్చాడన్న కారణంగా ప్రధానోపాధ్యాయుడు పిల్లలందరి ముందు గొడ్డును బాదినట్లు బాదాడు. ఆ దెబ్బలకు తట్టుకోలేక భరద్వాజ బడి నుంచి పారిపోయారు. తరువాత చాలా కాలానికిగానీ ఇంటికి రాలేదు. అలా 8వ తరగతితోనే చదువు ఆగిపోయింది.
యవ్వనం- జీవనసమరం
బతుకు సమరంలో పిడికెడు మెతుకుల కోసం ఆయన చాలా అలమటించారు. పొగాకు బారన్‌లో బొగ్గు వేసే కూలీగా, కలప అడితిలో, కమ్మరి కొలిమిలో...ఇలా చాలా పనులు చేశారు. రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న రోజులవి (1943). భరద్వాజగారికి అప్పటికి 17 ఏళ్లు. 18 సంవత్సరాలు అని అబద్ధమాడి సైన్యంలో చేరారు. సంవత్సరం పాటు కూడు, గుడ్డ, గూడు సమస్య లేదు. యుద్ధం తరువాత కథ మళ్లీ మొదటికి వచ్చింది.
ఎగతాళులే ఎగుడుమెట్లు
ఒకసారి తనకన్నా చిన్నవాడు మనుచరిత్రలో పద్యాన్ని అప్పగించాడు. అది చూసి కోటయ్యగారి స్నేహితులొకరు భరద్వాజను అతనితో పోలుస్తూ తిట్టారు. భరద్వాజ హృదయం గాయపడింది. దీంతో పగలంతా కూలీపని చేసుకుని రాత్రిపూట ఊరి శివాలయంలోని ప్రమిద వెలుతురులో బాలభారతి గ్రంథాలయంలోని గ్రంథాలను తెచ్చుకుని చదువుకునేవారు. కొల్లూరి వెంకటేశ్వర్లు అనే దాత గ్రంథాలయానికి చందా కట్టి సాయం చేశారు. బిట్రా ఆంజనేయులు దగ్గర ఛందస్సు నేర్చుకుని పద్యాలు రాశారు.
      గుడిపాటి వెంకటచలం, కుటుంబరావు, కొమ్మూరి వారి రచనలు చదివిన తరవాత కథారచనకు ఉపక్రమించారు. అలా 1946 ఆగస్టు 26న ‘ప్రజామిత్ర’ వారపత్రికలో తొలికథ ‘విమల’ అచ్చయింది.
కాంతమ్మతో కల్యాణం
1948 మే 28న భరద్వాజకు కాంతమ్మతో వివాహమైంది. పెళ్లిపీటల మీదే వాళ్లిద్దరూ తొలిసారి చూసుకోవడం. భార్యను ఇంటి దగ్గరే ఉంచి ఉద్యోగం కోసం తెనాలి వెళ్లారు. అక్కడ ఆలపాటి రవీంద్రనాథ్‌ ‘జ్యోతి, రేరాణి, సినిమా’ పత్రికలు నడుపుతుండేవారు. వాటి సంపాదకత్వ బాధ్యతల్లో భరద్వాజ పాలుపంచుకున్నారు. మాట పట్టింపుతో ఆ ఉద్యోగం మానేశారు. శార్వరి ప్రయత్నం వల్ల ‘సమీక్ష’ పత్రికలో పని దొరికింది.
ముగ్గురు మహాతల్లులు
సమాజంలో జరుగుతున్న ఘోరకృత్యాలను చూసి చలించిపోయే వారు భరద్వాజ. ప్రెస్‌ పని అయిపోగానే తన మిత్రుని మిత్రుడైన వ్యభిచార గృహ యజమాని సాంబయ్య వద్దకు వెళ్లేవారు. అక్కడి నిర్భాగ్యురాళ్లకు ఏమైనా సహాయపడగలనా అని ఆలోచించేవారు. అలా పరిచయం అయ్యారు ‘లక్ష్మి, జైబూన్, చిత్ర’. వారి జీవితాలే ఇతివృత్తంగా కథలు రాసి, వారికి వినిపించిన తర్వాత పత్రికలకు పంపేవారు.
      ఆకలిమంటల్ని మంచినీళ్లతో చల్లార్చడం వల్ల ఒకసారి ఆరోగ్యం పాడైంది. ఆ విషయం తెలిసిన లక్ష్మి తన మేడ మీద గదిలో ఉంచి మందులిప్పించి సపర్యలు చేసింది. మరి కొన్నాళ్లకు కంటి వ్యాధి వచ్చింది. ‘‘డబ్బుల్లేని ఆ నిస్సహాయ పరిస్థితుల్లో ‘లక్ష్మీ, జైబూన్, చిత్ర’ నాకు కళ్లజోడు కొనిపెట్టారు. ముగ్గురు మహాతల్లులు లేకపోయుంటే నేనొక అంధునిలా బతకాల్సి వచ్చేదేమో, ఏం చేసి ఆ మహా తల్లుల రుణం తీర్చుకోగలను?’’ అంటారు భరద్వాజ.
      1956 జనవరి నుంచి మద్రాసులో ‘జ్యోతి, అభిసారిక, చిత్రసీమ’ పత్రికల్లో పనిచేసేటపుడు దుర్భర పరిస్థితుల మధ్య గడిపారు. నెలకు రూ.100కు ఒక కలాల కంపెనీలో పనిచేసేవారు. 1959లో హైదరాబాద్‌ వచ్చి చక్రపాణిగారి యువ ప్రెస్‌లో చేరారు.
ఆకాశవాణి వినిపించింది
అయ్యదేవర కాళేశ్వరరావు, త్రిపురనేని సుబ్బారావు, గోపీచంద్‌ల సహాయంతో 1959లో ఆకాశవాణి హైద్రాబాద్‌ కేంద్రంలో స్క్రిప్టురైటర్‌గా చేరారు. ‘మహానుభావులను,  పరమ నికృష్టమైన వారినీ అక్కడే చూశాను. కానీ ఆకాశవాణి నాకు విశ్వవిద్యాలయం’ అంటారు. ఆకాశవాణిలో ఎన్నో కొత్త కార్యక్రమాలకు ఆయన ప్రాణం పోశారు. కొత్తవాళ్లకు అవకాశం కల్పించారు. తెనాలిలో ఉన్నప్పుడు ఆకాశవాణి విజయవాడ కేంద్రానికి భరద్వాజ స్వరపరీక్షకు వెళ్లారు. అక్కడ పనిచేస్తున్న ఒకాయన నీ స్వరం మైకుకు పనికి రాదన్నారట. తరువాత ఆయనే పట్టుపట్టి ఎన్నోమార్లు తన కార్యక్రమాలను ప్రసారం చేశారని భరద్వాజ నవ్వుతారు!
రచనా వ్యాసంగం
జీవన్‌ప్రభాత్‌ అనే రచయిత ద్వారా చలం సాహిత్యంతో పరిచయం కలిగాక, ఆయనలాగా రచనలు చేశారు. ఆ ప్రభావం నుంచి బయటపడటం కోసం కొన్నాళ్లు రచనా వ్యాసంగానికి దూరమయ్యారు.
      1950లో తొలి కథాసంపుటి ‘రాగిణి’ అచ్చయింది. కథ, నవల, నాటిక, బాలసాహిత్యం, వైజ్ఞానిక రచనలు, వ్యాసాలు, కవితలు, జీవితచరిత్రలు ఇలా అన్నీ కలిపి దాదాపు 150 దాకా పుస్తకాలు ప్రచురితం అయ్యాయి. 500కు పైగా కథలూ రాశారు. ప్రస్తుతం వీటిలో చాలా వరకూ దొరకడం లేదు. ఇంకా ప్రచురించాల్సినవీ ఉన్నాయి.
సశేషం
1976లో ఒకసారి, 1983లో మరొకసారి గుండెపోటుకు గురయ్యారు భరద్వాజ. కథా, కవితా ప్రక్రియలను సమ్మేళనం చేసి ఆ అనుభవాలను ‘సశేషం’గా ప్రచురించారు. ఇందులో మరణం, మరణానంతర జీవితం, పునర్జన్మ గురించి కొత్తకోణంలో పాఠకులకు అందించారు. ఈ పుస్తకం ఇంగ్లిషు, హిందీ భాషల్లోకి అనువాదమైంది. చిత్రాముద్గల్‌ అనే హిందీ రచయిత్రి కుమార్తె, అల్లుడు వివాహమైన నెలలోపే కారు ప్రమాదంలో చనిపోయారు. ‘సశేషం’ చదివిన తరవాత తాను గతం నుంచి కోలుకున్నానని, ఇలాంటి పుస్తకం ఇంత వరకు ఏ భారతీయ భాషలోనూ రాలేదని అంటారావిడ.
బతుకును పునీతం చేసిన దేవత
భరద్వాజ ధర్మపత్ని 1986 ఆగస్టు 1వ తేదీన ఈ లోకాన్ని, భరద్వాజను వీడిపోయారు. అప్పటి నుంచి ఆయన ఆలోచనాసరళి మారిపోయింది.
      ‘భగవంతుడు నాకు మూడు వరాలిచ్చాడు. ఒకటి అనంతమైన దరిద్రం. రెండోది అనంతమైన అవిద్య. మూడోది నా అర్ధాంగి. దరిద్రం నుంచి, అవిద్య నుంచి నేను చాలా నేర్చుకున్నాను... మానవ సహజమైన అప్యాయతతో, అనురాగంతో, ఓర్పుతో, నేర్పుతో నాలో ఇవన్నీ కలిగించిన అమృతమయి కాంతమ్మ. ఆమె పేరు ‘కాంతం’ మాత్రమే. అమ్మ అను రెండక్షరాలు నేను చేర్చాను. ఎందుకంటే ఆమె మంచితనాన్ని, సౌజన్యాన్ని బట్టి ఆమెలో ‘కాంతి’ మాత్రమే కాక ‘అమ్మతనం’ కూడా చూసినవాడిని కనుక’ అంటారు.
      సంపన్న కుటుంబం నుంచి వచ్చిన కాంతమ్మ ఉన్న బంగారమంతా కర్పూరంలా కరిగిపోతున్నా ఒక్కమాట కూడా అనని మహోన్నతురాలు. భరద్వాజ మద్రాసులో ఉద్యోగం చేస్తూ దుర్భర దారిద్య్రాన్ని అనుభవిస్తున్న కాలంలో కాంతమ్మ గర్భిణి. వేవిళ్లతో బాధపడుతున్న వారికి ఏదో ఒక కోరిక ఉంటుంది కదా. అది తీర్చాలనే పట్టుదలతో ఒక రోజు కాంతమ్మను ‘ఏమైనా కావాలా?’ అని అడిగారట. కష్టాలు తెలిసిన ఆమె ‘మరమరాలు’ తినాలనిపిస్తోంది అని చెప్పిందట!
స్మృతికావ్య రచన
కాంతమ్మ ఎడబాటును భరించలేని భరద్వాజ... ఆమె స్మృతిని దైనందినిలో అక్షరబద్ధం చేశారు. వాటిని ‘నాలోని నీవు, అంతరంగిణి, ఐతరేయం, అయినా ఒక ఏకాంతం, ఒకింత వేకువ కోసం’ పేర్లతో సాహితీలోకానికి అందించారు.
      ఈ స్మృతి సాహిత్యం హిందీ, ఆంగ్లాల్లోకి అనువాదమయ్యింది. వీటిపై పలువురు ఎంఫిల్, పీహెచ్‌డీలు చేశారు.
బాలసాహిత్యం
మంచి ఇతివృత్తంతో, చక్కటి శైలితో ఉత్తమ బాలసాహిత్యం రాయడంలో భరద్వాజ దిట్ట. ఆకాశవాణిలో బాలల కార్యక్రమాలకు భిన్న కథనాలతో అపురూపంగా రూపకల్పన చేశారు. బాలల కోసం విజ్ఞానం, వినోదం, సైన్సు అంశాలను జోడించి చక్కటి కథలతో పుస్తకాలు వెలువరించారు. అలాంటిదే ‘విచిత్ర పుస్తకం’.
తెల్లని వ్యక్తిత్వం 
భరద్వాజ ఎక్కడికి వెళ్లినా ఒకటే వేషధారణ. తెల్లని నూలు వస్త్రాలు! మాట ఇస్తే తప్పని దృఢనిశ్చయం గలవారు. కాలాన్ని వృథా చేయరు. ఎదుర్కొన్న అవమానాలనే అధిరోహించి ఉన్నత శిఖరాలను చేరుకున్నవారు. దుర్భర దారిద్య్రం అనుభవిస్తూ జీవనం సాగిస్తున్న స్త్రీలకు చేయూతను ఇవ్వడానికి ‘శ్రీకాంతమ్మ భరద్వాజ ట్రస్టు’ను ఏర్పాటుచేశారు.
సార్వత్రిక విశ్వవిద్యాలయానికి ప్రేరణ
దేశంలో మొదటిసారిగా ఏర్పాటైన ‘ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం’ వెనుక ఆయన ప్రేరణ, ప్రోత్సాహం ఉన్నాయి. 1982 సెప్టెంబరు 1వ తేదీన ఆనాటి ముఖ్యమంత్రి భవనం వెంకట్రామ్‌కు విరాళం పంపిస్తూ ‘చిన్నతనంలో చదువుకోవడానికి వీలుపడని వారికి చదువుకునే అవకాశం కల్పించండి. దీనికి ఒక విశ్వవిద్యాలయాన్ని త్వరగా ప్రారంభించండి’ అని ఉత్తరం రాశారు. అలా పడ్డ బీజమే ‘బి.ఆర్‌.అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం’. దీంతో పాటు నాగార్జున, శ్రీకృష్ణదేవరాయ, జవహర్‌లాల్‌నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయాలకు కూడా విరాళాలను అందజేశారు. 
స్త్రీపాత్ర పక్షపాతి
స్త్రీ వంటి నిజమైన కర్మయోగి మరొకరు లేరంటారు భరద్వాజ. ‘‘నీ కళ్ల నిండా రక్తం. నీ వేళ్ల నిండా రక్తం. పాలిళ్ల నిండా రక్తం. అయినా మా చూపులన్నీ నీ అవయవాల చుట్టూనే తిరుగుతున్నాయి... నీలోని ఏయే భాగాలు ఎన్నెన్నిసార్లు చూపిస్తే మా సినిమాలు బాగా ఆడుతాయో, అవన్నీ మేం చూపిస్తాం. మేం తయారుచేసే చెత్త సరుకులు అమ్ముకోవడానికి వ్యాపార ప్రకటనల కోసం నువ్వే కావాలి. తల్లికడుపులో ఉండగానే ముందుగానే గుర్తించి, ఇంకో రకంగా హతమారుస్తాం...’’ అంటూ స్త్రీ ఎన్నిరకాలుగా దోపిడీకి గురవుతోందో నిష్కర్షగా విమర్శిస్తారు. అటువంటి నిజమైన స్త్రీ పక్షపాతికి, అట్టడుగు వర్గాల జీవన చిత్రాలకు సాహిత్య హోదాను తెచ్చిపెట్టిన ‘నిజమైన రచయిత’కు జ్ఞానపీఠం రావడం తెలుగువారందరినీ సంతోషంలో ముంచెత్తింది.

 


వెనక్కి ...

మీ అభిప్రాయం