అచ్చమైన అభ్యుదయ కవి.. అందమైన తెలుగు కవి

  • 1084 Views
  • 1Likes
  • Like
  • Article Share

    ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి

  • కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత
  • అనంతపురం
  • 9440222117
ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి

దాస్యమనునది గాథ తమ ఆం
ధ్యమ్మువలె దేశమ్మును ప్రస
స్తమ్ము చేసిన వేళలో శం
ఖమ్ము నొత్తినవాడె వీరుడు

      - ‘దివ్వెల మువ్వలు’లో డా।। సి.నారాయణరెడ్డి  
తెలుగు
రచయితల్లో 85 ఏళ్లకు పైబడినవాళ్లు కొందరే ఉన్నారు... బాలాంత్రపు రజనీకాంతరావు (నూరేళ్లు దాటాయి), కాళీపట్నం రామారావు (1924), సి.వేణు (1926), సివి (1930), కపిలవాయి లింగమూర్తి (1928) లాంటివారు. వీళ్లలో పిన్నవయస్కులు 2017 జూన్‌ 12న కన్నుమూసిన డా।। సి.నారాయణరెడ్డి.
      1931లో జన్మించిన సినారె 86 ఏళ్లు పూర్తవుతున్న సమయంలో కన్నుమూశారు. 86 ఏళ్ల జీవితంలో ఆయనకి 65 ఏళ్ల సాహిత్య జీవితముంది. 1953లో 22 ఏళ్ల వయసులో ‘నవ్వనిపువ్వు’ ద్వారా ఆయన కవిత్వరంగ ప్రవేశం చేసినా, అంతకు ముందు కూడా ఆయనకు హనుమాజీపేటలో సాంస్కృతిక జీవితముంది.
      మల్లారెడ్డి, బుచ్చమ్మల కుమారుడుగా సినారె జన్మించే నాటికి భారతదేశం పరాయి పాలనలో ఉంది. పరాయి పాలకులకు వ్యతిరేకంగా భారతీయులు ఉద్యమిస్తున్న ఉద్వేగభరితమైన రోజుల్లో సినారె జన్మించారు. ఉప్పుసత్యాగ్రహ, శాసనోల్లంఘన సాహసోపేత దినాల్లో ఆయన జన్మించారు. ఆర్థికమాంద్యం ప్రపంచదేశాలను అతలాకుతలం చేస్తున్న రోజుల్లో జన్మించారు. రష్యాలో వచ్చిన అక్టోబర్‌ విప్లవం (1917) ప్రపంచదేశాలతోపాటు భారతదేశాన్ని కూడా ప్రభావితం చేస్తున్న తొలి దశలో పుట్టారు. తెలంగాణలో సాంస్కృతిక పరిరక్షణోద్యమం ప్రారంభ దశలో ఉండగా పుట్టారు. విశ్వనాథ వేయిపడగలు, కల్పవృక్ష రచనకు, గుర్రం జాషువ అనాథ, స్వప్న కథల రచనకు, శ్రీశ్రీ మహాప్రస్థాన కవితల రచనకు పూనుకుంటున్న సందర్భంలో సినారె జన్మించారు. తెలుగులో అభ్యుదయ కవిత్వం పురుడుపోసుకుంటున్న దశలో పుట్టుకొచ్చారు ఈ భావి అభ్యుదయ తెలుగుకవి.
స్వతంత్ర భారతంలో...
సినారె 1953లో కవిగా లోకానికి పరిచయమయ్యారు. అప్పటికి భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. తెలంగాణకూ స్వతంత్రం వచ్చింది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటమూ చరిత్రలో భాగమైపోయింది. ‘తెలుగువారికొక రాష్ట్రం కోరి ఆహుతి ఆయెను అమరజీవి’ అని ఆయనే అన్నట్లు పొట్టి శ్రీరాములు బలిదానంతో ఆంధ్రరాష్ట్రానికి పునాది పడుతున్న రోజుల్లో సినారె కవిగా పుట్టారు. భారత రాజ్యాంగం అమలులోకొచ్చి, 1952 నాటి తొలి సార్వత్రిక ఎన్నికలు జరిగి పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అమల్లోకి వచ్చిన కాలంలో కవిగా పుట్టారు. డా।। బి.ఆర్‌.అంబేడ్కర్‌ పోరాటాలు ఉద్ధృతమవుతున్న దశలో పుట్టారు. తెలుగులో అభ్యుదయ కవిత్వం పుట్టిన రెండు దశాబ్దాలకు, అభ్యుదయ రచయితల సంఘం ఏర్పడిన ఒక దశాబ్దానికి సినారె కవిగా దూసుకొచ్చారు. ఒకవైపు సామ్యవాద స్ఫూర్తి, మరోవైపు స్వాతంత్య్ర ఫలాల మీద విమర్శ జమిలిగా కొనసాగుతున్న కాలంలో పుట్టారు కవిగా సినారె. తెలుగు అభ్యుదయ సాహిత్యం ఒడిదొడుకులనెదుర్కొంటూ, కొందరు అభిప్రాయ పడినట్లు స్తబ్ధతాయుగంలోకి (ఇది ఇప్పటికీ వివాదాస్పదమే) అడుగు పెట్టబోతున్న కాలంలో ఈ కవి పుట్టారు.
      పరాయిపాలనలో జన్మించిన సినారె, స్వతంత్ర భారతంలో కవిగా పుట్టి పెరిగి విరాట్రూపం ధరించి దాదాపు పరాయి పాలన లాంటి ప్రపంచీకరణ యుగంలో మరణించారు. తెలంగాణ హైదరాబాద్‌ స్టేట్‌లో భాగంగా ఉన్న కాలంలో పుట్టి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక కన్నుమూశారు.  
భావకవిగా వచ్చి...
అభ్యుదయ కవిత్వ కాలంలో పుట్టిన కవి సినారె. దిగంబర, చేతనావర్త, విప్లవ, స్త్రీ, దళిత, బహుజన, ముస్లిం, ప్రాంతీయ అస్తిత్వ ఉద్యమాల వాదాల, ప్రపంచీకరణ వ్యతిరేక సాహిత్య కాలాల్లో కవిగా జీవించారాయన వీటిలో ఒకటీ అరా వాదాలతో ఆయన విభేదించినా, ఈ అన్ని ఉద్యమాల వాదాల సారం సినారె కవిత్వంలో కనిపిస్తుంది. ఆయన కాలంతో పాటు నడిచిన కవి. ప్రజల పక్షం వహించే ప్రజాతంత్ర ప్రజాస్వామిక వాదాలనన్నిటినీ సినారె సమన్వయం చేసుకున్నారు.
      సినారె భారత స్వాతంత్య్రానంతర చరిత్రలో తొలి తరం తెలుగు కవి. సోమసుందర్‌, సివి, తిలక్‌ లాంటి (ఈయన కొంత సీనియర్‌) వాళ్లతో కలిసి సినారె కవి అయ్యారు. కవులుగా దాశరథి, సినారె అన్నదమ్ముల్లాంటివారు. తెలంగాణ రచయితల సంఘ నిర్మాణంలో కీలకపాత్ర పోషించారు. స్వాతంత్య్రానంతర తొలి తరం కవులు ఏ భాషకు చెందిన వారైనా వాళ్ల మీద స్వాతంత్య్రోద్యమ ప్రభావం ఉంటుంది. స్వాతంత్య్రం, స్వాతంత్య్రోద్యమం, ఆ ఉద్యమ నాయకత్వం ఈ మూడింటి పట్ల ఈ కవులకు గౌరవం ఉంటుంది. అదే సమయంలో స్వాతంత్య్రానంతర భారత దేశ పరిణామాలపట్ల విమర్శనాత్మక దృష్టి కూడా ఉంటుంది. డా।। సి.నారాయణరెడ్డిలో ఈ రెండు లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి.
      అలాగే నారాయణరెడ్డి, తెలుగు అభ్యుదయ కవుల్లో రెండో తరానికి చెందిన కవి. శ్రీశ్రీ, నారాయణబాబు, రెంటాల, అనిసెట్టి, అబ్బూరి, శిష్ట్లా, ఆరుద్ర తదితరులు మొదటితరం వాళ్లు. దాశరథి, సినారె, ఆవంత్స, కుందుర్తి లాంటివాళ్లు రెండో తరంవాళ్లు. ఈ తరం అభ్యుదయ కవులు వచ్చేసరికి భారతీయ సమాజంలో వచ్చిన మార్పులు అభ్యుదయ సాహిత్యాన్ని ఒడిదొడుకులకు గురిచేశాయి. అప్పటి అభ్యుదయ సాహిత్యం విమర్శలకు గురయ్యింది. దిగంబర కవుల నుంచి ఈ విమర్శ మొదలయ్యింది. ఈ కాలంలోనే సినారె అభ్యుదయ కవిగా పరిణామం చెందారు.
అభ్యుదయ పథం
సినారెలో కవిగా ఒక పరిణామముంది. ‘నవ్వని పువ్వు’ రాసే నాటికి ఆయన భావకవి. నిజానికి అప్పటికి భావకవిత్వం కనుమరుగైపోయింది. కానీ దాశరథి, సోమసుందర్‌ లాంటి వారు భావకవిత్వ ఛాయలు వదులుకోకుండానే అభ్యుదయ కవిత్వం రాస్తున్నారు. సినారె భావకవిగా పుట్టుకొచ్చారు. అయితే రెండు మూడేళ్లలోనే ఆయన భావ కవిత్వంలోకి అభ్యుదయ కవిత్వం చొచ్చుకు వచ్చింది. ‘విశ్వగీతి’ లాంటి కావ్యాల్లో ఈ లక్షణం కనిపిస్తుంది. ‘నాగార్జునసాగరం, కర్పూర వసంతరాయలు’ లాంటి కావ్యాల్లో సినారె భావకవిత్వ ప్రీతి, సంగీతజ్ఞానం దర్శనమిస్తాయి. బహుశా 1965 నాటికి ఆయన అచ్చమైన అభ్యుదయకవిగా తననుతాను తీర్చిదిద్దుకున్నారు. ‘మంటలూ- మానవుడూ’ ఇందుకు తొలి ఆనవాలు. ఇక అక్కడి నుంచి ఆయన తిరిగి చూడకుండా అభ్యుదయ కవిత్వ ప్రయాణం సాగించారు. 
      అభ్యుదయ కవికి మనిషి వాస్తవం. మనిషే వాస్తవం. మనిషికి సంబంధించిన మానవత, ఇవే అభ్యుదయ పరిధులు. సురలకన్న కరుణాత్ముడు/ నరుడుగాక ఇంకెవ్వడు/ మందిర మెరుగని దేవుడు/ మనిషిగాక ఇంకెవ్వడు అన్న ‘మానవగీతి’ ఈ అభ్యుదయ కవిది. మనిషి, అతని చరిత్ర, మానవజాతి, దాని చరిత్ర వీటి పరిణామం సినారె కవితలో వేయి వెలుగులతో విస్తరించి కనిపిస్తుంది. జ్ఞానపీఠ పురస్కారం అందుకున్న ‘విశ్వంభర’ ఓ వైజ్ఞానిక కావ్యం. మానవజాతి పరిణామాన్ని అది అందంగా ఆవిష్కరించింది. దానికి కొనసాగింపు ‘మట్టీ మనిషీ ఆకాశం’ కావ్యం.
      అభ్యుదయ కవిది శ్రామిక దృక్పథం. సినారె కవిత్వంలో ‘మానవ శ్రమ’ అనేక రకాలుగా కవిత్వ వస్తువైంది. ‘‘ఎన్నెన్ని ప్రస్థానాలు మనిషికి’’ అని కవిగా ఆయన ఆశ్చర్యపోతారు. ‘‘నిరంతరాన్వేషి మనిషి’’ అని నిర్వచించారు. మానవజాతి సాధించిన విజయాన్నంతా రంగరించి ఒక్క మాటలో చెప్పారు..
ఈ యుగం సాధించిన గుణం- మనుషుల్లా నివసించే దేవుళ్లు
ఈ తరం సంపాదించిన వరం- దేవుళ్లను ధిక్కరించే మనుషులు

      అభ్యుదయ కవిది విమర్శనాత్మక గొంతుక. వర్తమాన సామాజిక జీవితంలో కనిపించే అసాంఘిక ధోరణులను ఎత్తి చూపి, మానవ జీవితం మరింత మెరుగుపడాలన్నది అభ్యుదయ కవి ఆకాంక్ష. సినారె రచించిన ‘మంటలూ- మానవుడు, మార్పు నా తీర్పు ఉదయం నా హృదయం, తేజస్సు నా తపస్సు, కవిత నా చిరునామా, ఇంటిపేరు చైతన్యం’ లాంటి అనేక కావ్యాలలో స్వాతంత్య్రానంతర భారతీయ సామాజిక పరిణామాలు విమర్శనాత్మకంగా ప్రతిబింబిస్తాయి. ‘లక్షరూపాయల బహుమతి, దేశం కనిపించింది, దేశం ముందడుగు వేయాలి’ లాంటి కవితలు సినారెలోని విమర్శనాత్మక వాస్తవికతలు ఉదాహరణలు. ఆయన కోరుకున్న భారతదేశం ఇది...
శ్రమ జీవుల చెమట బిందువులను
జాతి రత్నాలుగా తలచేది
మంచికి నిలబడ్డ మనిషిని 
మహర్షిగా కొలిచేది

ఇలాంటి మంచి దేశంగా మన దేశం పరివర్తన చెందడానికి అడ్డంకిగా ఉన్న సకలాంశాలను అవినీతి, లంచగొండితనం, అధికధరలు, కల్తీ, మోసం, వంచన లాంటి వాటిని సినారె విమర్శించారు. ‘పాతికేళ్ల కథ’ అనే కవితలో 1947- 72 మధ్య పాతికేళ్లలో భారతదేశ చరిత్రలోని వెలుగు చీకట్లను ఆవిష్కరించారు.
బువ్వపెట్టే అన్నపూర్ణను- బొరియల్లో దాచే వంచకుల నుంచి
ప్రాణాలు పోసే మందుల్లో- ప్రాణాలు తీసే కల్తీల నుంచి
పెట్రోలులా మండిపోతున్న- పేపరు ధరల నుంచి
ప్రపంచ అంగళ్లలో దేశలక్ష్మిని- పణమొడ్డి పాచికలాడే
బఖియాన్ల నుంచి మస్తాన్ల నుంచి....
దేశం ముందడుగు వేయాలి-
అన్నది కవి ప్రబోధం.
      సినారెకి స్వాతంత్య్ర దినోత్సవమన్నా, గాంధీ నెహ్రూలన్నా అపారమైన గౌరవం. ఆగష్టు 15 మీద ఆయన చాలా కవితలు రాశారు. అలాగే గాంధీజీ మీద, ‘జాతిరత్నం’ అనే కావ్యం రాశారు. నెహ్రూ మరణించినప్పుడు ‘‘జవహరుతోపాటు నన్ను చావనిమ్ము, చావనిమ్ము’’ అని విలపించారు సినారె. నెహ్రూ మరణంతో ‘‘గాంధీజీ స్వప్నఫలం గంగలో కలిసెనయ్యా’’ అని ఆక్రోశించారాయన. అణ్వాయుధ ప్రయోగాన్ని వ్యతిరేకించి, ప్రపంచశాంతిని కోరుకున్న సినారె భారతదేశానికి చైనాతో యుద్ధం వచ్చినప్పుడు పులిలా గాండ్రించడం విశేషం.
తెలుగు తేనియలు
సంక్రాంతి, ఉగాది లాంటి పండగల మీద సినారె అనేక కవితలు రాశారు. అయితే వాటిని మత దృష్టితో కాకుండా, మానవజాతి అభివృద్ధి దృష్టిలో రాశారు. సినారె కవిత్వంలో అనేక ప్రయోగాలు చేశారు. ‘జలపాతం, విశ్వగీతి, కర్పూర వసంతరాయలు, విశ్వంభర, మట్టీ మనిషీ ఆకాశం’ లాంటి సమగ్ర కావ్యాలు రాశారు. మినీ కవితలూ రాశారు. తనవంటూ గజళ్లు, ప్రపంచపదులూ రాశారు. ‘‘ఆత్మలను పలికించేదే అసలైన భాష/ ఆ విలువ కరవైపోతే అది కంఠశోష’’, ‘‘పరుల కోసం పాటుపడని నరుని బతుకు దేనికని/ మూగనేలకు నీరందివ్వని వాగు పరుగు దేనికని’’ లాంటి గజళ్లను రాసి, పాడి, సినారె తెలుగు సమాజాన్ని ఉర్రూతలూగించారు.
      తొలినాళ్లలో సినారె కవిత్వ వస్తువులోనూ, భాషలోనూ సంప్రదాయ వాసనలు గుబాళించాయి. కర్పూర వసంతరాయలు చక్కటి ఉదాహరణ. ఆయన అభ్యుదయ దృక్పథం ఏర్పరచుకున్న తర్వాత వర్తమాన సమాజం వస్తువయ్యాక, ఆయన భాష కూడా మారింది. ఇదొక పరిణామం. ‘నైశ్శబ్ద్య ధరాధరాల నాదనదాలు, నీలాషాఢపయోదం, అజంతా రమణీ కపోలాంచలచంచల హాసం’ లాంటి సమాసాలను తొలినాళ్లలో ఉపయోగించారు సినారె. క్రమంగా ఆయన అచ్చమైన తెలుగు భాషా కవిగా తనను తాను మార్చుకున్నారు. తన భాషను సరళతరం చేసుకున్నారు. ‘‘ఒక్క చినుకు చాలు మట్టి గుక్కను పలికించాలంటే’’, ‘‘అడుగు పడితె జారిపడక తప్పదు మెట్టు నుంచి’’, ‘‘ఒక్క నుదుటనీ పొద్దు పొడిస్తే ఎక్కడకెళుతుందీ లోకం’’... ఇలా సరళంగానే భావయుక్తమైన కవిత్వం రాశారు. 
      ఆదికవి నన్నయ్య నుంచి తన పూర్వ కవులు విశ్వనాథ, శ్రీశ్రీల దాకా అనేక మందిని సినారె కవిత్వంతో పూజించారు. ఆయన పలుకులో తెలుగు కవిత్వాభివ్యక్తి ఆలంకారికతను సంతరించుకుంది. ‘‘గడ్డి సుప్పల్లా పడి ఉన్నాయి గుడిసెలు’’, ‘‘కర్ఫ్యూ సూర్యుని సాక్షిగా జరిగే/ విచ్చు కత్తుల కసరత్తులు’’, ‘‘నిరుద్యోగం రాలుతోంది బొట్లు బొట్లుగా/ సర్టిఫికెట్ల నొసళ్ల నుంచి’’... లాంటివి దీనికి ఉదాహరణలు.
సినారెది ఒక సుదీర్ఘ కవిత్వ యాత్రం. ఆయన్ను విస్మరించి ఆధునిక తెలుగు కవిత్వ చరిత్రను ఊహించలేం. ఆయనకు ఎన్ని పరిమితులున్నా, ఆయనది అపరిమితమైన కవిత్వ యాత్ర. ఆయన చిరునామా కవిత. ఆయన కవిత్వం ‘ఇగిరిపోని గంధం’.
ఒక సుప్రభాతం ఉదయిస్తుంది
దగాతిన్న హృదయంలో నుంచి
                        - సినారె


వెనక్కి ...

మీ అభిప్రాయం