కాలానికి నిలిచే ‘కాలాతీత వ్యక్తులు’

  • 192 Views
  • 0Likes
  • Like
  • Article Share

    వి.ఎల్‌.సుజాత

  • gulabi98@gmail.com
  • అమెరికా
వి.ఎల్‌.సుజాత

చయిత్రులు సాహిత్యాన్ని కష్టాలు, కన్నీళ్లు, అసూయా ద్వేషాలు, ప్రేమలు అపార్థాలతో నింపేశారని ఫిర్యాదు చేసే వారికి తిరుగులేని సమాధానం చెప్పే నవల ఇది. జీవితం మీదా, సమాజం మీదా అద్భుతమైన అవగాహన, మేధో సంపత్తితో డా।। పి.శ్రీదేవి నిజంగానే ఒక కాలాతీతమైన నవలను అలవోకగా సృష్టించి తెలుగు సాహితీ లోకానికి బహూకరించారు.
సామాజిక దర్పణం
ఈ నవలలో చిత్రించింది 1950ల్లోని వాతావరణం! ఇందిర అనే పద్దెనిమిదేళ్ల యువతి తండ్రితో సహా విశాఖపట్నంలో ఒక ఇంటి కింది భాగంలో అద్దెకు దిగుతుంది. అదొక బ్రహ్మచారుల ఇల్లు! పైభాగంలో ప్రకాశం అనే మెడికో ఉంటాడు. చలాకీ ఇందిర ప్రకాశంతో ఇట్టే స్నేహం చేస్తుంది. ప్రకాశం స్నేహితుడు కృష్ణమూర్తితో కూడా!
      అద్దె పంచుకోడానికి వీలుగా ఉంటుందని ఒకరోజు కల్యాణి అనే స్నేహితురాలిని ఆ ఇంట్లో ఒక గదిలో ప్రవేశపెడుతుంది ఇందిర. కల్యాణిదో సినిమా దీనగాథ! తల్లి లేదు. తండ్రి రోగిష్టి. ఇంటిమీద అప్పు! ఎవరితోనూ కలవదు. ఎప్పుడూ తన దీనావస్థను తల్చుకుని కన్నీళ్లు పెట్టుకోవడం తప్ప ఆమెకు మరేమీ చేత కాదు.
      కల్యాణి వచ్చాక ప్రకాశం ఆమె పట్ల ఆకర్షితుడవటంతో ఇందిర కల్యాణితో నిరంకుశంగా ప్రవర్తిస్తుంది. ఆమె వెళ్లిపోవడానికి కారణమవుతుంది. తండ్రిని పోగొట్టుకున్న కల్యాణికి స్నేహితురాలు వసుంధర ఆశ్రయమిస్తుంది. మునసబు రామినాయుడుని ఆస్పత్రికి తీసుకువెళ్లిన సందర్భంలో డాక్టర్‌ చక్రవర్తి కల్యాణికి పరిచయమవుతాడు.
      ప్రకాశం మేనమామకు ఇందిరతో ప్రకాశం చనువుగా ఉంటున్నాడన్న సంగతి తెలిసి ఇందిరను హెచ్చరిస్తాడు. ప్రకాశాన్ని ఊరికి తీసుకుపోయి ఓ సంబంధం ఖాయం చేస్తాడు. భీరువైన ప్రకాశం మేనమామ మాట కాదనలేక, ఆ తర్వాత ఇందిర మీద వ్యామోహాన్ని వదులుకోలేక పారిపోయి వస్తాడు. ఇందిర అతడిని ఛీకొడుతుంది. తన కోసం మామయ్యను ఎదిరించి కాకుండా, పారిపోయి వచ్చినందుకు తిరస్కరిస్తుంది. అనుక్షణం మామయ్య నుంచి అతణ్ని రక్షించలేను వెళ్లమంటుంది!
      మరోపక్క వసుంధర కృష్ణమూర్తి వైపు ఆకర్షితురాలవుతుంది. కానీ ఇందిరతో అమిత సాన్నిహిత్యం వసుంధరను వద్దనుకునేలా చేస్తుంది కృష్ణమూర్తిని! కథ అనేక మలుపులు తిరిగి కృష్ణమూర్తి ఇందిరనూ, చక్రవర్తి కల్యాణినీ పెళ్లాడటంతో ముగుస్తుంది.
నిలువెత్తు ఆత్మస్థైర్యం
ఈ నవలకు హీరో - హీరోయిన్, ప్రాణం - జీవం... అన్నీ ఇందిరే! ‘కాలాతీత వ్యక్తులు’ పేరు వినగానే నిలువెత్తు ఆత్మవిశ్వాసంతో, సమాజాన్ని ధిక్కరిస్తూ ఆ పాత్ర కళ్లముందు సాక్షాత్కరిస్తుంది. అబ్బుర పరుస్తుంది. భయంగా కూడా ఉంటుంది. ఈ నవలలో కృష్ణమూర్తి, డాక్టర్‌ చక్రవర్తి, వసుంధర వంటి మంచి వాళ్లు; సెల్ఫ్‌ పిటీతో కుంగిపోతూ ఎప్పటికైనా దాన్లోంచి బయట పడుతుందో లేదో తెలీని కల్యాణి వంటి సాధారణమైన అమ్మాయిలూ; వైదేహి, ప్రకాశం వంటి భీరువులూ; ప్రకాశం మేనమామ వంటి స్వార్థపరులు; ఆనందరావు లాంటి పరాన్నజీవులూ - ఏ పాత్రకదే ప్రతిభావంతంగా తీర్చిదిద్దిందే అయినా వీళ్లందరినీ తోసిరాజని అంతటా తానై నిలబడుతుంది ఇందిర.
      సిగ్గు, అణకువ, కన్నీరు, పాతివ్రత్యం- ఇలాంటి వాటికి ఆమె వద్ద చోటు లేదు. ప్రకాశం, కృష్ణమూర్తి ఇద్దరితోనూ చనువుగా ఉంటుంది. అవసరమైతే మొహం పగలగొట్టినట్లూ మాట్లాడుతుంది. జీవితాన్ని మహా తేలిగ్గా తీసేసుకుంటూ గొప్ప అనుభవజ్ఞురాలిలా, ఆరిందాలా ప్రతి సమస్యనూ పూచిక పుల్లలా తీసేసే ఇందిరను చూసి మనం భయపడాలి తప్ప ఆమె దేనికీ భయపడదు.
      ‘బతుకులో నాకు కావాల్సినదొకటి, దొరుకుతుంది ఇంకొకటి. అంచేత కసికొద్దీ లోకాన్ని ధిక్కరిస్తున్నాను. నాకూ ఓ ఇల్లూ, సంసారం, నాదీ అనిపించుకునే ఓ భర్తా పిల్లలు ఇవేవీ అక్కర్లేదనుకోను. కానీ నాకు లాటరీలో వచ్చినవి ఫైళ్లు, ఆఫీసు, నా మీద ఒరిగి బతికేసే నాన్న! నీ బరువులూ, సమస్యలూ నా మీద పడెయ్‌... అనగలిగి, నా కోసం సమస్తమూ ఒదులుకోగలిగే మగాడు నాకు కావాలి’ అనే ఇందిరను చూస్తే జాలి కలుగుతుంది.
      ప్రకాశం మీద మమకారాన్ని కూడా అతణ్ని జీవితాంతం మోయలేక తెంచుకుంటుంది. పైకి లెక్కలేనట్లు ప్రవర్తించినా ఆ ఘటన ఆమెను నొప్పిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఆమె అనుభవిస్తున్న ఒత్తిడి, దాన్ని కనిపించకుండా సమాజాన్ని కాల్తో తన్నేసి ధిక్కరించే ఆమె ధీరత్వాన్ని చూస్తే ఓదార్చాలని అనిపిస్తుంది. కానీ జాలి పడటాలు, ఓదార్చడాలు అంటే ఆమెకు ఒళ్లు మంట. దటీజ్‌ ఇందిర!
      ప్రకాశం విషయానికొస్తే దుర్బలత్వానికి మాత్రమే కాదు; అవకాశ వాదానికీ, ఆత్మ వంచనకూ ఫక్తు నిర్వచనం. అటు కల్యాణిని పోగొట్టుకునీ, ఇటు ఇందిర ఛీ కొట్టాక ఏమీ తోచక అల్లాడి ఆ తర్వాత స్థిమితంగా ‘ఇది మేలే కానీ కీడు కాదు’ అని అప్పటికప్పుడు ఆత్మవంచన చేసేసుకుంటాడు.
      ఈ నవల్లో మంచి వ్యక్తులు కృష్ణమూర్తి, వసుంధర. కుర్రతనపు జోరులో కృష్ణమూర్తి ఇందిర కోసం అర్రులు చాచినా, ఆమె అతనితో గడిపాక ఆమె సాహసానికి నివ్వెరపోతాడు. కల్యాణి, వసుంధర తనతో చనువుగా ఉంటే భయం వేస్తోందని వసుంధరతోనే చెప్పేంత స్వచ్ఛమైన మనిషి. చక్రవర్తి మాటల్లో ‘మధ్య తరగతి సంస్కారంలోని కుళ్లుకీ, మూర్ఖత్వానికీ అతని ప్రవర్తన ఒక దివ్యమైన విరుగుడు’.
      ‘ఇదొక పోటీ ప్రపంచం. నేను నిన్ను మింగడానికి ప్రయత్నించకపోతే నువ్వు నన్ను మింగుతావు. అందరం గొంగళ్లలోనే అన్నాలు తింటున్నాం! మనమంతా శుద్ధ నూనె మిఠాయి సరుకులం! రెక్కలు ఉన్నాయనుకుని ఎగరడానికి ప్రయత్నిస్తాం. రెక్కలు లేవు మనకు. ఉన్నా అవి తడిసిపోయాయి. నా రెక్కల్ని బీదరికం తడిపేసింది. నీ రెక్కల్ని మితిమీరిన డబ్బు తడిపేసింది’ అని ఇరవయ్యేళ్లయినా నిండని ఇందిర కఠోర జీవిత వాస్తవాల్ని కళ్ల ముందు ఆవిష్కరిస్తుంటే ముగ్ధుడవుతాడు.
      పెళ్లి జరిగినప్పుడు కూడా ఇందిర చెప్పే మాటలు కృష్ణమూర్తికే కాదు, మనకూ ఎంతో నచ్చుతాయి. ‘ఇది జీవితంలో ఒక భాగం మాత్రమే నాకు. నీతో ఎంత దూరం రమ్మన్నా వస్తాను కానీ ఏ ఘట్టంలోనూ నా వ్యక్తిత్వాన్ని చంపుకోలేను. ఇలా ఒకళ్ల కళ్లలోకి ఒకళ్లు చూస్తూ కూర్చునేందుకు కాదు ఇలా దగ్గరైంది. ఇద్దరం కలిసి ఒకే లక్ష్యం వైపు చూడగలిగితేనే సార్థకత’ అంటుంది ఆ అమ్మాయి.
      ఇహ కల్యాణిని మనలో చాలామంది ఎరుగుదురు. ఆమె పెరిగిన వాతావరణం అలాంటిది మరి. తండ్రిని కూడా పోగొట్టుకుని అనాథగా మారి వీలైనన్ని సార్లు కళ్లనీళ్లు పెట్టుకుంటూ, దురదృష్టాన్ని నిందించుకుంటూ, కష్టాలకు ఎదురీదాలని ప్రయత్నిస్తూ కోపం చూపాల్సిన చోట కూడా అసహాయతను చూపిస్తూ మంచి పిల్లగా పేరు తెచ్చుకుంటుంది. మనసారా నవ్వుతూ, అంతలోనే బెదిరిపోయి కళ్లలో శ్రావణ మేఘాలు కమ్మించుకుంటుంది. అందుకే అందరి సానుభూతీ ఇట్టే సంపాదించు కుంటుంది. కానీ చక్రవర్తి భావించినట్లు ఆమె దుఃఖం కోసమే దుఃఖాన్ని ప్రేమిస్తుందేమో అనిపిస్తుంది కూడా.
శ్రద్ధగా చెక్కిన శిల్పం
ఈ నవల ప్రత్యేకంగా ఏ సందేశమూ ఇవ్వదు. అలా ఇవ్వకపోవడమే ఈ నవల ప్రత్యేకత. ప్రతి పాత్రా అత్యంత శ్రద్ధగా చెక్కిన శిల్పంలా తోస్తున్నా, మరో పక్క రచయిత్రి మాత్రం వాటిని అలవోకగా, సునాయాసంగా సృష్టించారేమో అన్న భావన కలుగుతూనే ఉంటుంది. ప్రపంచంలో ఇన్ని రకాల స్వభావాలున్నాయా? రచయిత్రి వీటిని నిశితంగా పరిశీలించారా అని
ఆశ్చర్యం కలుగుతుంది. కొడుకు మీద పగ సాధించి అతడి జీవితాన్ని నాశనం చేసి విజయం సాధించాననుకునే డాక్టర్‌ చక్రవర్తి పెంపుడు తల్లి, ఆమె కళ్లతో భర్తను బేరీజు వేసి జీవితాంతం ద్వేషంతో బతికిన అతడి భార్య... వీళ్లంతా మనకు ఎక్కడో ఒకచోట తారసపడే ఉంటారు.
      ఆడపిల్లలు మగ పిల్లలతో స్నేహం చేయడాన్ని సహించలేని వసుంధర పిన్ని, నాకు సంబంధాలు చూడకండి మొర్రో అని చెప్పలేక పారిపోయి ఇందిర ఇంటికొచ్చే వైదేహి... కల్యాణిని ఓదార్చడానికి భుజం అందించడానికి పుట్టినట్లుండే మంచి డాక్టరు చక్రవర్తీ... వెరసి ప్రతి పాత్రా పరిశోధన చెయ్యదగ్గ పాత్రగా రూపుదిద్దుకుంది.
      ‘తెలుగు స్వతంత్ర’ వార పత్రికలో 1957-58 మధ్య 21 వారాలపాటు ధారావాహికగా ప్రచురితమై అప్పట్లోనే పాఠకులను ఉర్రూతలూగించింది. 1958లో వచ్చిన మొదటి ముద్రణ ప్రతులు మూడు నెలల్లోనే అయిపోయాయట. తరువాత చాలా ముద్రణలు పడింది.
      ఈ నవల ఆధారంగా 1963లో చదువుకున్న అమ్మాయిలు సినిమా వచ్చింది. దశాబ్దాలు గడచినా ఈనాటికీ మళ్లీ ముద్రణకు వస్తూ, అసంఖ్యాక పాఠకులు ‘తప్పక చదవాల్సిన నవల’గా ఎన్నుకుంటున్న క్లాసిక్‌ ‘కాలాతీత వ్యక్తులు’. పఠితలకు ఏదో అశాంతినీ, ఎన్నో ఆలోచనలనూ, కొంత హాయినీ ఒకేసారి కలిగించే విశిష్ట రచన!


వెనక్కి ...

మీ అభిప్రాయం