ఇదీ స్వతంత్ర భారత‘చిత్రం’!

  • 252 Views
  • 0Likes
  • Like
  • Article Share

    రావి కొండలరావు

  • హైదరాబాదు
  • 9848071175
రావి కొండలరావు

శతాబ్దాల చరిత్ర కలిగిన దేశం. పాడి పంటలు, రత్న రాశులతో వర్ధిల్లిన వైనం. వీర పౌరుషాగ్నికి నిలయం. అయినా  పరాయిపాలనలో దుర్భర జీవనం, ధన, మాన, ప్రాణాలు దోపిడీ. తెల్లవాడి చేతుల్లో బతుకులు తెల్లారిపోతున్నాయి. ఆ సమయంలో ఆసేతు హిమాచలం జన హృదయ స్పందన ఒక్కటే. విదేశీ ముష్కరుల కబంధహస్తాల నుంచి విముక్తి పొందాలన్న ఆకాంక్ష.
      మేము సైతం అంటూ చలనచిత్ర కళాకారులు కూడా ఆ స్వాతంత్య్ర సంగ్రామంలో కాలూనారు. తమ సృజనకు పదును పెడుతూ భరతమాత స్వేచ్ఛా పతాకాన్ని నింగికెగరేయడానికి నిశ్చయించుకున్నారు. ఆంగ్లేయుల ఆంక్షలను తట్టుకుంటూనే ఆశయ సిద్ధికి తపించారు. ‘‘పడవెక్కి పోతున్నాడు - ఇంగ్లీషు వాడు
పడవెక్కి పోతున్నాడు- 
పాడి పంటలతోటి పచ్చ పచ్చగా వున్న
బంగారు దేశాన్ని భాగాలుగా చీల్చి పడవెక్కిపోతున్నాడు’’
అని ప్రసిద్ధ రచయిత కొసరాజు రాఘవయ్య చౌదరి ఆగస్టు 15, 1947 స్వాతంత్య్ర దినం సందర్భంగా  రాసుకున్న పాట. అంతకుముందు, 1939లో వచ్చిన ‘రైతుబిడ్డ’లో పాటలు రాశారు; వేషమూ వేశారు. ‘రైతు బిడ్డ’లో జాతీయోద్యమ ప్రస్తావన లేకపోయినా, అంతకుముందు గూడవల్లి రామబ్రహ్మం తీసిన ‘మాలపిల్ల’ (1938)లో స్వతంత్ర దేశ కాంక్ష గురించి ఉంది. గాంధీ గారిని స్తుతిస్తూ, ఖద్దరు దుస్తులు, టోపీ ధరించిన చౌదరి అనే పాత్ర (పి.సూరిబాబు) ‘‘కొల్లాయి గట్టితేనేమి...’’ పాడతాడు. ‘స్వాతంత్య్రోద్యమం గురించి గానీ, బ్రిటిష్‌ వాళ్లకి వ్యతిరేకంగా గానీ చిత్రాల్లో ఏం ప్రవేశపెట్టినా, బ్రిటిష్‌ ప్రభుత్వం ఊరుకునేది కాదు. ఆ దృశ్యాలు కత్తిరించేయాలి. లేదా సినిమాని నిషేధించాలి. ఐనా, మనవాళ్లు తెలివిగా స్వాతంత్య్ర పోరాటాల ఆవశ్యకత గురించి, పరోక్షంగా చిత్రాల్లో చెబుతూనే వచ్చారు. అంతకుముందెప్పుడో, మహాభారతంలోని విదురుడి కథను తీసుకుని పురాణ కథయినా విదురుడి పాత్రకు గాంధీజీ సూక్తులు జోడించారు. గాంధీ పేరు స్ఫురించేలా, ‘మహాత్మా విదుర్‌’ అని, ఆ సినిమాకి పేరు పెట్టారు. ఇది ఉత్తరాది సినిమా. విదురుడు గాంధీటోపీ పెట్టుకుంటాడు. పరదేశీయులు దేశపాలన చెయ్యకూడదని, పాండవులతో చెబుతూ ఉంటాడు. తెల్లవాళ్లూరుకుంటారా? తెల్లవారేసరికల్లా ఆ చిత్రాన్ని నిషేధించారు. అంచేత, స్వాతంత్య్రం రాకముందు సినిమా ఏం చెబుతుందని ప్రభుత్వం డేగకన్ను వేసుకుని కూర్చునేది. ఎవరైనా ‘వందేమాతరం’ అంటే తప్పు. ‘‘కాదుబాబూ! మా తల్లికి మేం నమస్కారం పెట్టుకుంటున్నాం’’ అన్నా వినేవాళ్లు కాదు. నాటి నాయకులు సత్యాగ్రహం చేస్తున్నప్పుడు వాళ్లని లాఠీలతో కొట్టినప్పుడు ‘వందేమాతరం’ అని నినాదాలు చేసేవారు. అంటే, ‘బ్రిటిష్‌ వాళ్లు నశించాలి’ అని అర్థమని ఎవడో చెప్పాడట. ‘వందేమాతరం’ అంటే నిషేధమే. 1939లో బి.ఎన్‌.రెడ్డి ‘వందేమాతరం’ పేరుతో సినిమా తీశారు. ‘వందేమాతరం’ అంటే రాజకీయ సినిమా కాదని, అదొక లాటరీ కంపెనీ పేరని మార్చి తంటాలు పడ్డారు. అయితే అందులోనూ దేశానికి స్వాతంత్య్రం కావాలన్న మాట పరోక్షంగా చెబుతూనే వచ్చారు.
‘‘స్వేచ్ఛా పథమూ చూపుము మాకూ
మాతా భారత భూమాతా’’
అని ఒక పాట, అక్కడక్కడా సంభాషణలూ ఉన్నాయి గానీ, సెన్సార్‌ వారు ఏమీ కత్తిరించలేదు. బంకించంద్రఛటర్జీ ‘ఆనంద్‌మఠ్‌’ నవలలో ‘వందేమాతరం... సుజలాం, సుఫలాం’ పాట రాశారు. ఈ పాటని శ్రీకృష్ణలీలలు (1935) సినిమాలో కొన్ని చరణాలతో పాడించడం విశేషం. ఇంద్రుడు మొదలైన దేవతలంతా, దేవిని స్తుతిస్తూ ‘వందేమాతరం’ పాట పాడతారు! ‘బాలయోగిని’ (1937) సినిమాలో ‘వందే వందే భారతమాతా, భారతమాతా భాగ్యోపేతా’ అని - దేశభక్తికి సంబంధించిన పాట ఉంది. ‘మదాలస’ (1948) అనే పౌరాణిక సినిమాలో, ‘‘స్వాతంత్య్రం కన్నా స్వర్గం లేదు, పారతంత్య్రము కన్నా నరకంబులేదు’’ అన్న పాట ఉంది. మదాలస సఖిని పాతాళలోకంలో బంధించినప్పుడు ఈ పాట వాడినట్టుగా సన్నివేశం కల్పించారు. అయితే, సినిమా 1948లో విడుదలైంది గనక, ఇబ్బంది కలగలేదు. ఇంకో పౌరాణిక చిత్రం ‘వాలి సుగ్రీవ’ (1950)లో నాటి సాంఘిక పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని ఒక పాట పెట్టారు. ‘‘ఇదేనా ఫలితమిదేనా? ప్రజాసేవకు ఫలితమిదేనా? పరాభవించెదరా? మహాత్ముని బంధించెదరా?’’ అని సాగుతుందీ పాట. 1938లో కన్నాంబ ఇచ్చిన గ్రామఫోన్‌ రికార్డుల్లో ‘‘భారతదేశము మనదే కానీ, ఫలితము మనకేదీ?’’ అన్న పాట ఉంది. ఈ పాట బాగా ప్రసిద్ధి పొందినా, ప్రభుత్వం నిషేధించలేదు. ప్రజలకి దగ్గరయ్యే సాధనం సినిమాయే అని, దాని ప్రభావం ప్రజల మీద పడుతుంది. అందుకే నిషేధాలుండేవి. గ్రామఫోన్‌ పాటలు అంత ప్రభావం చూపవనేమో వారి ఉద్దేశం. విదేశీయ పాలన ఉన్నంత కాలం ఏ సినిమా కూడా ప్రత్యక్షంగా స్వాతంత్య్రం గురించి గర్జించలేకపోయింది. పరోక్షంగా వీలైనంత వరకూ పాటుపడింది. ప్రసిద్ధ గీత రచయిత కొసరాజు ఖద్దరు ధరించి ఉద్యమంలో పాల్గొన్నారు గానీ, జైలుశిక్ష అనుభవించలేదు. నాటి నుంచి చివరి వరకూ ఖద్దరు దుస్తులే ధరించిన బి.ఎన్‌.రెడ్డి కూడా ‘క్విట్‌ఇండియా’ ఉద్యమంలో పాల్గొన్నారు. విద్యార్థిగా ఉన్నప్పట్నుంచీ, ఆయనకు జాతీయ భావాలు మెండుగా ఉండేవి. ఘంటసాల వారిలో ఒక ఉత్తేజం ఉండేది. సినిమాలకి రాకముందు, నాయకుల ఉపన్యాసాలతో స్ఫూర్తి పొంది, తానూ ఉద్యమంలోకి వెళ్లారు. రైలు పట్టాలు తొలగించాలన్న పెద్దల తీర్మానంతో ఆయన ఏకీభవించారు. వెళ్లారు గానీ, ఏదో అవసరం కలిగి, వేరే ఊరు వెళ్లారు. అయినా ప్రభుత్వం ఆయన మీద అభియోగం మోపింది. వేదిక మీద బ్రిటిష్‌ ప్రభుత్వాన్ని నిరసిస్తూ పాటలు, పద్యాలు పాడేవారు. ఆయన మీద కేసులు బనాయించి, ఆరు పద్యాలు చదివాడని విని, ఆరు నెలల కారాగార శిక్ష విధించారు! ‘‘అదీ కాకుండా, విచారణ జరిగిన ఎనిమిది నెలలూ, గుడివాడ, బందరు సబ్‌జైల్లో ఉంచారు. ఆరు నెలల శిక్ష విధించిన తెల్లదొర ఆలీపూర్‌ సెంట్రల్‌ జైలుకి పంపించారు.’’ అని ఘంటసాల ఒక సందర్భంలో చెప్పారు. జైల్లో మిగతా నాయకులతో కలిసి ఉన్నప్పుడు రోజూ ఉదయం ‘‘ఝండా ఊంఛా రహే హమారా’’ పాడేవారట! ‘‘ఘంటసాల పాడిన దేశభక్తి గీతాలతో జైలు గోడలు ప్రతిధ్వనించేవి’’ అని బెజవాడ గోపాలరెడ్డి ఒక ఉపన్యాసంలో చెప్పారు. 
       ప్రసిద్ధ దర్శక నిర్మాత బి.విఠలాచార్య తన పందొమ్మిదో ఏట ఉద్యమంలోకి వెళ్లి, రైలు పట్టాలు తొలగించడానికి చేసిన ప్రయత్నంలో అరెస్టయి బెంగళూరు జైల్లో శిక్ష అనుభవించినట్లు రాసుకున్నారు. ఆయన ఇంకొక మిత్రుడు వార్డర్స్‌ని దగ్గరకి పిలిచి, కొట్టి వాళ్ల దుస్తులు వేసుకుని, జైలు నుంచి తప్పించుకుని పారిపోయినట్టూ, మళ్లీ ఉద్యమంలో పాల్గొనడంతో అరెస్టయి కఠిన కారాగార శిక్ష అనుభవించినట్టూ రాశారు.
      ప్రఖ్యాత హాస్యనటుడు అల్లు రామలింగయ్య కూడా స్వాతంత్య్రోద్యమంలో పాల్గొని, జైలుశిక్ష అనుభవించారు. ఆ సందర్భంలో శిక్ష కాకుండా ‘జరిమానా’ చెల్లించమందట కోర్టు. చెల్లించలేదని, పాలకొల్లులోని తమ ఆస్తిని జప్తు చేసిందట! మహానటుడు చిత్తూరు వి.నాగయ్య కూడా ఉద్యమంలో పాల్గొన్నారు. ఆయన మద్రాసులో బీఏ పాసయ్యారు కానీ, అదే సమయానికి ఉద్యమం తీవ్రం కావడంతో, ఇంగ్లిషు చదువులు వద్దనుకుని, స్నాతకోత్సవానికి వెళ్లనూ లేదు, పట్టా తీసుకోనూలేదు! ఇలా ఎందరో, సినిమా ప్రముఖులు దేశానికి స్వేచ్ఛ కల్పించే ఉద్యమంలో పాటుపడ్డారు.
      స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్న నాయకులు, ప్రజలూ చేసిన త్యాగాలు, వాళ్లు పడిన అవస్థలు తర్వాతి తరం వారికి తెలియాలని సినిమా కృషి చేసింది. బ్రిటిష్‌ పాలనలో అలాంటి కథలకు, చిత్రాలకు స్థానం ఉండదని స్వాతంత్య్రం వచ్చాక ఆ పని మొదలుపెట్టారు. స్వాతంత్య్రం వచ్చిన రెండేళ్లకే ‘మనదేశం’ (1949) చిత్రం వచ్చింది. ఇది ఎన్టీ రామారావు సినీ రంగానికి పరిచయమైన సినిమా. స్వరాజ్య సముపార్జన కోసం ఒక కుటుంబం పడిన ఇబ్బందుల్నీ, పట్టుదలనీ ‘మనదేశం’ చూపించింది. పూర్తిగా జాతీయోద్యమం స్ఫూర్తితోనే ఈ సినిమా నిర్మించారు.
‘‘వెడలిపో తెల్లదొరా మా దేశము
ఎల్లదాటి వెడలిపో’’
‘‘ఓహో భారత యువకా కదలిరా’’
లాంటి ఉత్తేజకరమైన పాటలున్నాయి. 
‘‘జయహో జయహో మహాత్మాగాంధీ’’ వంటి పాటలున్నాయి.
‘‘జయ జననీ పరమ పావనీ
జయ జయ భారత జననీ’’

      అని భారతమాతని కీర్తించే గీతంతో సినిమా ఆరంభం అవుతుంది. సినిమాలో పనిచేసినవారి పేర్లు కనపడుతుండగా వెనుక ఈ పాట వినిపిస్తుంది. ప్రజల పౌరుషం, పోలీసుల హింసలు, గాంధీజీ వంటి నాయకుల్ని అరెస్టు చేసి నిర్దాక్షిణ్యంగా శిక్షలు వేయడం వంటి ఘట్టాలతో ‘మనదేశం’ జనరంజకమైన చిత్రంగా నిలబడింది. ప్రసిద్ధ నటుడు జగ్గయ్య ‘పదండి ముందుకు’ (1962) నిర్మించారు.
      దేశంపై విధించిన శాసనాలను ఉల్లంఘించే దృశ్యాలతో నాటి రాజకీయ పరిస్థితుల్ని కళ్లముందు నిలబెట్టిందీ చిత్రం. 
‘‘పదండి ముందుకు పదండి తోసుకు 
కదం తొక్కుతూ కదలండి
స్వరాజ్యమే మన జన్మహక్కనీ
సమస్త జగతికి చాటండి’’
అని శ్రీశ్రీ రాసిన పాట...
‘‘పల్లెనకా పట్నమనకా అందరమూ కలిసి 
కులమనక మతమనకా మనం కలిసి మెలిసి
దేశాన్ని దోచుకునే తెల్లవాడిని తరిమి
జైళ్లలోని వీరులను నేడే విడిపించుకో’’
అని దాశరథి రాసిన పాట ఉత్తేజభరితం. ‘పదండి ముందుకు’ రష్యాలో జరిగిన చలన చిత్రోత్సవంలో ప్రదర్శిస్తే విశేష ఆదరణ చూరగొంది.
      ‘అసాధ్యుడు’ (1968)లో అల్లూరి సీతారామరాజు పాత్రలో ఆవేశపూరితమైన ఘట్టం ఉంది. అసాధ్యుడు నాయక పాత్రధారి కృష్ణ. ఆయన్ని సీతారామరాజు పాత్ర ఆకర్షించింది. ఆ స్ఫూర్తితోనే కృష్ణ ‘అల్లూరి సీతారామరాజు’ (1974) చిత్రాన్ని భారీగా నిర్మించి పేరు, పెన్నిధీ తెచ్చుకున్నారు. 
ఆరోజుల్లో సినిమాలకి స్ఫూర్తిదాయక గీతాలు రాయాల్సి వస్తే శ్రీశ్రీ చేతనే రాయించేవారు.
ఉదాహరణ.
‘‘పాడవోయి భారతీయుడా- ఆడి
పాడవోయి విజయగీతికా...
నేడే స్వాతంత్య్ర దినం వీరుల త్యాగఫలం
నేడే నవోదయం నీదే ఆనందం’’

      అని సాగే పాట ‘వెలుగు నీడలు’ (1961) సినిమాలోది. తెల్లవాళ్లని ఎదిరించిన ‘కొమరం భీమ్‌’ చరిత్ర కూడా సినిమాగా వచ్చింది. సీతారామరాజులాగా కాకుండా, సంస్థానాధిపతి అయిన కట్టబొమ్మన్‌ (తమిళం) కథ ‘‘మాదేశం మా పంట, నీకెందుకు పన్నులు కట్టాలి?’’ అని తెల్లవాళ్లని ఎదిరిస్తాడు. చివరికి అతన్ని ఉరి తీస్తుంది బ్రిటిష్‌ ప్రభుత్వం. ఈ సినిమాని ‘వీరపాండ్య కట్ట బ్రహ్మన’ పేరుతో తెలుగులోకి అనువదిస్తే అదీ విజయం సాధించింది.
      స్వాతంత్య్ర సమరంలో పోరాడిన వీరులని స్మరిస్తూ చాలా సినిమాల్లో, సందర్భానుసారం పాటలు వచ్చాయి. టంగుటూరి ప్రకాశం పంతులు కథని ‘ఆంధ్రకేసరి’ పేరుతో చిత్రం తీశారు విజయచందర్‌. ఇందులో బ్రిటిష్‌ ప్రభుత్వం భారతీయుల్ని హింసించిన ఘట్టాలు, దేశం కోసం వీరులై గర్జించిన ఘట్టాలూ ఉన్నాయి.
      ‘కోడలు దిద్దిన కాపురం’ (1970)లో సి.నారాయణరెడ్డి రాసిన ‘‘నీధర్మం, నీ సంఘం, నీ దేశం నువ్వు మరవవద్దు, జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరవద్దు’’ అన్న పాట ప్రసిద్ధి చెందింది.
      ‘మేజర్‌ చంద్రకాంత్‌’లో ఎన్టీఆర్‌ జాతీయోద్యమ నాయకుల పాత్రల్లో కనిపించే గీతం ‘‘పుణ్యభూమి నా దేశం నమో నమామి’’ ఈ గీతాన్ని జాలాది రాశారు. వీలైనప్పుడల్లా అమరవీరుల్ని స్మరిస్తూ గీతాల రూపంలో దర్శింపజేసింది సినిమా.
      ఇంగ్లిషు, హిందీ భాషల్లో జాతీయ చలన చిత్ర సంస్థ సమర్పించిన ‘గాంధీ’ చిత్రం- అత్యంత విశేషంగా ఆకర్షించింది. ఆ చిత్రం చూసి స్ఫూర్తి పొందిన వారున్నారు. అలాగే బెంగాలీ, హిందీ భాషల్లోనూ స్వాతంత్య్ర సాధనకు సంబంధించిన కథలతో సినిమాలు వచ్చాయి. ఒక దశలో, దేశభక్తి గీతాల్ని ప్రవేశపెడుతూనే వచ్చింది సినిమా. అవసరం వచ్చినప్పుడు విమర్శలతో, నేటి సమాజాన్ని నిరసిస్తూ నాటి వారిని స్ఫురణకు తెస్తూ పాటలు రాయించారు సినిమా నిర్మాతలు. ‘‘గాంధి పుట్టిన దేశమా ఇది? నెహ్రు కోరిన సంఘమా ఇది?’’; ‘‘గాంధీ పుట్టిన దేశం’’ వంటివి స్ఫూర్తినిస్తాయి. ఘంటసాల విడిగా రికార్డుల్లో పాడిన ‘‘స్వాతంత్య్రమె మా జన్మ హక్కని చాటండి’’ పాట; ‘‘ఆ మొగల్‌ రణధీరులు తాంతియాతోపే’’- పద్యం ప్రజల్ని మేల్కొలిపే రీతిలో ఉంటాయి.
      స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత కూడా ఆ నాటి ఉద్యమ స్ఫూర్తిని వీలైనప్పుడల్లా  చలనచిత్రాలు జ్ఞప్తికి తెస్తూనే ఉన్నాయి. ఆ పోరాట స్ఫూర్తిని ప్రజ్వలింపచేస్తూనే ఉన్నాయి.


వెనక్కి ...

మీ అభిప్రాయం