తెలుగు కథల్లో ‘శ్రీ’పాదం

  • 138 Views
  • 0Likes
  • Like
  • Article Share

    పరుసవేది

‘‘తెనుగు దేశమే దేశం, తెనుగు భాషే భాష,
తెనుగు మనుషుల్‌ మనుష్యులు, తెనుగు వేషమే వేషం, ఏ జాతి యెదుటా, ఏ సందర్భంలోనూ ఎందుకున్నూ నా తెనుగు జాతి తీసిపోదు’’
      అని తెలుగు బావుటా ఎగరేసిన అచ్చ తెలుగు రచయిత శ్రీపాద సుబ్రహ్మణశాస్త్రి. తెలుగు వచనానికి, ముఖ్యంగా తెలుగు కథలో చిన్న కథలకు ఆయన జవజీవాలు కలిగించిన కథక చక్రవర్తి. గోదావరి తీరంలో సుక్షేత్రంగా ఆయన పండించిన సాహితీ ఫలసాయం తరతరాలకు తెలుగు వాళ్లకి వీనుల విందు చేస్తుంది. ఆంగ్లభాషలో అక్షరమూ చదవలేదాయన. పాశ్చాత్య సాహిత్య పోకడలు ఆకళింపు చేసుకోనూలేదు. కానీ తన నిశిత పరిశీలన, సరళ సహృదయాలతోనే అభ్యుదయ, ప్రగతిశీల భావాల్ని రాశారు. స్త్రీల అభ్యున్నతి, తెలుగుజాతి స్వయం నిర్ణయం, వ్యవహార భాషా ప్రయోగాల విస్తృతి వంటి వాటిపై ఆయన సాహిత్య ఉద్యమాలనే నడిపారు.
      1891లో కోనసీమలో వైదిక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన శ్రీపాద వారు వేదవిద్యలు, సంస్కృత భాష వంటివి సంప్రదాయం ప్రకారం నేర్చుకున్నారు. నిజానికి వారింట్లో తెలుగు భాష కంటే, సంస్కృత భాషకే రాజపూజ్యం రాజ్యమేలేది. వేదవేదాంగాలకి, జ్యోతిషానికి ఆటపట్టయిన ఆ పండితుల నిలయంలోనే తెనుగులో కవిత్వం చెయ్యకూడదని, అది అప్రతిష్ఠాకరమని, భావించేవారు. అలాంటి నిషేధాల్ని ఎదిరించి, తెలుగులో గొప్ప రచయితగా నిలిచారు.
      తిరుపతి వేంకట కవులకు సాహితీ శత్రువులైన పార్వతీశ్వర కవుల్ని ఆయన గురువులుగా స్వీకరించారు. మొదట్లో ఊరూరా తిరిగి అష్టావధానాలు చేసి సన్మాన సత్కారాలు పొందారు. ఆ క్రమంలోనే తిరుపతి వేంకటకవుల్లోని చెళ్లపిళ్ల వారితో సాహితీ శత్రుత్వాన్నీ సాధించారు. ఇక వాటన్నిటికీ స్వస్తి పలికి వచన రచనలోకి దిగారు. చిన్న కథలు, నవలలు, చారిత్రక కథలు, నాటకాలు, సంపాదకీయాలు, వైద్యశాస్త్ర గ్రంథాలు మొదలుకొని ఎన్నో ప్రక్రియల్లో రచనలు చేశారు. ‘ప్రబుద్ధాంధ్ర’ మాసపత్రిక సంపాదకునిగా వచన రచనలు ప్రోత్సహిస్తూ, వ్యావహారిక భాషోద్యమం, ఆంధ్రోద్యమం, హిందీ ప్రచార వ్యతిరేకోద్యమాలు నడిపారు.
      ఆయన రచనలన్నిటిలోకి అమితమైన పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చినవి ఆయన చిన్న కథలు. ప్రక్రియ పరంగా చిన్న కథలు, నిడివిపరంగా నవలికలు అనిపించే ఆ రచనలు తెలుగు కథారంగాన్ని అమితంగా ప్రభావితం చేశాయి.
      సంభాషణలపై విపరీతమైన పట్టు, ప్రజల జీవభాషకు పట్టం కట్టాలన్న పట్టుదల వల్ల ఆయన విశిష్టమైన శిల్పాన్ని ఎంచుకుని సాధించారు. సంభాషణలు ఎక్కువగానూ, కథనం తక్కువగానూ ఉండేవి కొన్ని కథలు, మరికొన్ని పూర్తిగా సంభాషణాత్మకాలు. పాత్ర పేరూ, ప్రాంతం వంటి వాటి జోలికి వెళ్లకుండా నేరుగా సంభాషణలతో ప్రారంభించి చివరికి ఏ పాత్ర ఆ సంభాషణ పలికిందో కూడా రాయక మన ఊహకే అది తట్టేలా చేసే ప్రత్యేక శైలి ఆయనది. సంభాషణలతోనే సంక్లిష్టమైన పాత్ర కథనాలు స్ఫురింపజేసే విచిత్రమైన ఆ శైలి నిండు గోదావరిలా సాగిపోతుంది. ఆ సంభాషణల్లో విరుపు, కాకువు పాత్ర ఏ కళనున్నదో, ఆ మాట వెనుక ఉద్దేశమేమిటో విడమర్చి చెప్తుంది. అనితరసాధ్యమైన ఈ శిల్పమే ఆయనను ‘కథక చక్రవర్తిగా నిలిపింది.
      ఆయన కథల్లో ప్రతిఫలించేవి ముఖ్యంగా నాటి మూఢాచార పరాయణుల మూర్ఖపోకడలు, బాలవితంతువుల ఘోరమైన కష్టనిష్టూరాలు, స్త్రీలపై అంతులేని అణచివేత, ఉద్యోగార్థుల మధ్య దారుణమైన పోటీ వంటి దుస్థితులు. అయినా అక్కడితో ఆగరు శాస్త్రి గారు. ఎంతటి దుస్థితిలో ఉన్న వారయినా సొంత రుచిని, సంస్కార జనితమైన సదాశయాల్నీ, ఆశించే ఉన్నత స్థాయిని అందుకునేందుకు దారులుంటాయన్నది వారి ఉద్బోధ. ఏ ఒక్కరికీ అందుకోరాని అంతస్తు ఉండదని, స్వయం నిర్ణయంతో సొంత ప్రతాపంతో భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలన్నది ఆయన దృక్పథం. అలా చేసే చేవ ఉన్నవారే ఆయన కథల్లో నాయికా నాయకులు. ఇతరులంతా ఆయన దృక్పథంలో వ్యర్థులు. 
      కటిక పేదరికంలోని శాస్త్రి వ్యాపారం చేసి ఐశ్వర్యాన్ని సాధించిన కథ ‘మార్గదర్శి’, అంతూ దరీ కనిపించని చాకిరీ, అవమానాలు దాటి సాహసంగా మరో పెళ్లి కోసం వీరేశలింగం గారి తోటకు పారిపోయే బాల్యవితంతువు కథ ‘అరికాళ్ల కింద మంటలు’, ఐశ్వర్యవంతుడైన న్యాయవాది కూతురు, బాలవితంతువు సుభద్రని కిందస్థాయి నుంచి వచ్చినా తన చురుకుదనంతో ఆకట్టుకుని పెళ్లాడే రామచంద్రం కథ ‘అనుకున్నంత పనీ జరిగింది’ ఇలా ఎన్నెన్నో కథలు ఆ ధోరణిలో వెళ్తాయి. ఈ దృష్టి కుటుంబ వ్యతిరేకతనీ, ఆర్థిక ఇబ్బందుల్నీ ఎదుర్కొని తాను ఇష్టపడ్డ తెలుగు రచన సాధించిన పట్టుదల నుంచి వచ్చింది.
      ఇలా సాహసించక తన న్యాయమైన, సహజమైన ఆశల్ని మోడువార్చుకుంటే ఏం జరుగుతుందన్న ఎరుక ‘ఇల్లు పట్టిన వెధవాడబడుచు’ కథలో తమ్ముడి సంసారానికి అడ్డులా తయారై, గొప్ప సాహసం లేక జీవితాన్ని మోడువార్చుకున్న వితంతువు బుచ్చమ్మ పాత్ర ద్వారా చూపుతారు. అలా కాక సాహసించినా ఫలం దక్కకుంటే, దానికీ ఓ ఉదాహరణ ‘పెళ్లాడ తగ్గా మొగుడేడీ?’ కథ ద్వారా చూపిస్తాడు. అయోగ్యుడైన వరుణ్ని ఎంచుకున్న బాలవితంతువు చివరకు తండ్రీ అన్నదమ్ముల చేత చావుదెబ్బలు తింటుంది. ఆ ప్రబుద్ధుడు ఆమెను వదిలి డొంకదారిన పారిపోతే ఓ క్రైస్తవ దంపతులు కాపాడారు.  చివరకు ఆమె ‘పెళ్లాడతగ్గ మొగుడేడీ?’ అంటూ సంఘసేవ చేసి నవాబుల్ని వదిలి నిఖార్సయిన రసహృదయం కోసం ఢిల్లీ నుంచి కోనసీమ సంస్థానానికి చేరతాడు అత్తరు తయారీ కళా నిపుణుడైన ఓ సాహెబు. తన అనుభవాన్నీ, కళాహృదయాన్నీ సమన్వయం చేసి, ఏళ్లకేళ్లు శ్రమించి సాధించిన అపురూపమైన గులాబీ అత్తరు రసజ్ఞుడైన రాజా వారికి అందించబోతే అడుగడుగునా అడ్డుకున్న ఉద్యోగుల ధాటికి విగిసిపోతాడు. చివరకు ఆ సుగంధం రాజా వారిని చేరేందుకు అమూల్యమైన ఆ అత్తరు సీసాని కోట గోడకేసి బద్దలు కొడతాడు. గుబాళింపుతోపాటు ఈ వైనమూ రాజా వారి దాకా వెళుతుంది. రాజావారి రసహృదయం నిలువునా నీరైపోతుంది. రసజగత్తు గురించి చెప్పే ఈ కథల కోవలో ‘వడ్లగింజలు’ వంటివీ చేరతాయి. వస్తువు పరంగా కుటుంబజీవనాన్ని సంస్థానాల్లో గుట్లని వివరించే కవులు, చక్కటి ప్రేమకథలు, వ్యంగ్య హాస్య కథలు రాశారు.
      ఆయన రచించిన 75 పైచిలుకు కథల్లో అనర్ఘ రత్నాల్లాంటి ఎన్నో కథలున్నాయి. ఆనాటి కోనసీమ జనజీవనాన్ని, మరీ ముఖ్యంగా బ్రాహ్మణాగ్రహారాల్లో జీవితాన్ని సమగ్రంగా చిత్రీకరించారు శ్రీపాద కథల్లో. 
      ఇక కథలకు ఎంచుకున్న పేర్లూ ఎంతో అపురూపమైనవే. కొన్ని కథలకు సంస్కృత భాష జాతీయాలు, మరికొన్నిటికి అచ్చ తెనుగు వ్యావహారికాలూ శీర్షికలు అయ్యాయి. ఆత్మగౌరవంతో తాపీ మేస్త్రిగా పని చేసే ఉన్నత విద్యావంతుడైన బ్రాహ్మణుడి కథకి ‘తాపీమేస్త్రి రామదీక్షితులు బి.ఏ.’, హిందీ భాషను తెలుగు వారిపై రుద్దే ధోరణిని అవహేళన చేసే కథకి ‘శుభికే శిరో ఆరోహ’ వంటి పేర్లు ఎంతగానోనప్పాయి. బయటకు చెప్పుకోలేని, భరించలేని చాకిరీ చేసే బాలవితంతువు కథకు ‘అరికాళ్ల కింద మంటలు’, ఉద్యోగార్థుల నడుమ అనర్థదాయకమైన అనారోగ్యకర పోటీ వివరించే కథకి ‘గుర్రప్పందాలు’, ‘జాగ్రత్త పడవలసిన ఘట్టాలు’, ‘అనుకున్నంత పనీ జరిగింది’, ‘ముళ్లచెట్టూ- కమ్మని పువ్వూను’ వంటి తియ్యని తెలుగు పదబంధాలూ పేర్లుగా పెట్టారు. ముసలితనంలో పెళ్లికి సిద్ధమైన వారిని పెళ్లి కొడుకులు అనడానికి వ్యావహారిక భాష ఆమోదించదని ‘పెళ్లితాత’లని ఘాటుగా వెక్కిరించారు. 
      శ్రీపాద వారి విలక్షణ వ్యక్తిత్వాన్నీ, అద్భుతమైన సాహితీ సృష్టినీ తెలుగు సాహిత్యంలోని మహామహులు ఎందరో మెచ్చారు. మల్లాది రామకృష్ణ శాస్త్రి ‘‘తీయందనపు తీపికే చవులిచ్చిన శైలి’’ అన్నారు. వాకాటి పాండురంగారావు ‘‘తెలుగు వేళ్లున్న ప్రపంచ రచయిత’’ అని గుర్తించారు. యేటుకూరి బలరామమూర్తి ‘‘కథక చక్రవర్తి’’ అని బిరుదిచ్చారు. 1956లో ఆయన సాహిత్య కృషికి ఫలితంగా కనకాభిషేకం చేశారు. కనకాభిషేక గౌరవం పొందిన తొలి కథా రచయిత శ్రీపాదే. గోదావరి తీర వాసుల భాషను ఎంతగా ఆకళింపు చేసుకుని ఆవాహన చేసుకున్నారంటే ఈ సాహిత్యం అనువాదానికి లొంగదు. తెలుగు వచ్చిన వారికే ఆయన కథలు చదివే అదృష్టం అనిపించుకున్నారు. అయితే అనువాదానికి లొంగని ఆ శైలీశిల్పాలు ఆయన కథల్ని, ఆయనను తెలుగు సరిహద్దుల ఆవల పొందవలసినంత ప్రసిద్ధి పొందనీయలేదు. శ్రీపాద వారిలా కన్నడనాట కథానికా రచనలో ఒరవడి పెట్టిన మాస్తి వేంకటేశ అయ్యంగారికి దక్కిన విఖ్యాతి గమనిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది.
      ఒక్కో మాట-వివిధ సందర్భాల్లో, వేర్వేరు వ్యక్తుల నోట ఎలాంటి పోకడలు పోతుందో గమనించి ప్రయోగించిన శ్రీపాద కథలు తెలుగు వారికే తెలుగుదనాన్ని నేర్పుతాయి. ఆ కథల్లోని తెలుగు మధురిమ తెలుగు మరిచే ప్రబుద్ధాంధ్రులకు రుచి మప్పి మళ్లా మనలో పడేస్తుంది. వారి కథల్లో వినిపించే స్వయం నిర్ణయశక్తి, సాహసమూ ఎంత నీరసించిన వారినైనా ఉత్తేజపరిచి దారిలో పెడతాయి. ఆయన తన దేశకాలమాన స్థితిగతులు ప్రభావశీలంగా వ్యక్తీకరించి దేశ కాలాలకు అతీతమైన సాహిత్యాన్ని సిద్ధింపజేసుకున్న మహా రచయిత. గోదావరి తీరాన పుట్టి గోదారిపరవళ్లు చూడని కళ్లు, పుట్టతేనె తాగిస్తుంటే ఊసడించే నాలుక, అక్షరజ్ఞానం ఉండీ శ్రీపాద వారి కథలు చదవని తెలుగు జన్మమూ నిరర్థకమే అంటారు తెలుగు కథా ప్రియులు.


వెనక్కి ...

మీ అభిప్రాయం