స్వాతంత్య్ర వీరుడా... స్వరాజ్య భానుడా!!

  • 179 Views
  • 0Likes
  • Like
  • Article Share

    తెలుగు వెలుగు బృందం

గుండె గుండెను రగిల్చే స్ఫూర్తి మంత్రం... పౌరుషాగ్ని ప్రజ్వలించే అక్షరాలు నింపుకున్న నిప్పు కణం... ప్రతి పల్లె గొంతెత్తి పలికే అచ్చమైన తెలుగు రణన్నినాదం... జనహృదిలో కొలువైన జాగృతికి నిదర్శనం... ఆ గీతం. తెలుగువారి దేశభక్తికి సాక్ష్యంగా స్వాతంత్య్ర దినాన దశదిశలా మారుమోగే ఆ పాటే....‘తెలుగు వీర లేవరా’.
రత్నగర్భ నుదుటిన రుధిర సిందూరంగా మారి చరితార్థుడైన అల్లూరి సీతారామరాజు గాథను అత్యద్భుతంగా తెరకెక్కించారు ప్రముఖ కథానాయకుడు కృష్ణ. అల్లూరిగా అసమాన నటనా కౌశలాన్ని ప్రదర్శించి తెలుగు వారి మనోఫలకాలపై చెరగని ముద్ర వేశారు. ఆ చిత్రంలోని ‘తెలుగు వీర లేవరా’ గీతం నరాలను ఉప్పొంగిస్తుంది. అల్లూరి మాటే పాటగా మారి గిరిజనపు గండ్రగొడ్డళ్లకు పదునుపెడుతుంటే... వాటి వాడికి తెగిపడే రక్కసి మూకల శరీరాలు జ్ఞప్తికి వచ్చి ప్రేక్షకుల ఒళ్లు పులకరిస్తుంది. తెలుగు అక్షరానికి జాతీయ బహుమతిని సాధించి పెట్టిన ఆ పాటను వినని తెలుగు వారుండరు. మహాకవి శ్రీశ్రీ కలం నుంచి ఉరకలెత్తిన ఆ భావావేశంతో గొంతు కలపని వారు కనిపించరు.
తెలుగు వీర లేవరా... దీక్ష బూని సాగరా....
దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా
దారుణ మారణకాండకు తల్లడిల్లవద్దురా
నీతిలేని శాసనాలు నేటి నుండి రద్దురా
నిదురవద్దు... బెదరవద్దు.... నింగి నీకు హద్దురా...
ఎవడువాడు... ఎచటివాడు... ఇటువచ్చిన తెల్లవాడు
కండబలం కొండఫలం కబళించే దుండగీడు...
మానధనం ప్రాణధనం దోచుకునే దొంగవాడు
తగిన శాస్తి చెయ్యరా... తరిమి తరిమి కొట్టరా...
ఈ దేశం ఈ రాజ్యం నాదే అని చాటించి...
ప్రతిమనిషి తొడలుగొట్టి... శృంఖలాలు పగులగొట్టి
చురకత్తులు పదును పట్టి... తుది సమరం మొదలుపెట్టి
సింహాలై గర్జించాలీ... సంహారం సాగించాలీ
వందేమాతరం... వందేమాతరం
స్వాతంత్య్ర వీరుడా స్వరాజ్య భానుడా
అల్లూరి సీతారామరాజా...
అందుకో మా పూజలందుకో... రాజా...
అల్లూరి సీతారామరాజా...
తెల్లవాడి గుండెల్లో నిదురించిన వాడా
మా నిదురించిన పౌరుషాగ్నిని రగిలించిన వాడా
త్యాగాలే వరిస్తాం... కష్టాలే భరిస్తాం
నిశ్చయముగ నిర్భయముగా నీ వెంటే నడుస్తాం...

ఆదినారాయణరావు స్వరరచనలో ఘంటసాల, రామకృష్ణ, పి.సుశీల బృందం ఆలపించిన ఈ గీతంలో అక్షరమక్షరం స్ఫూర్తి మంత్రం. అప్పటి వరకూ తెల్లవాడి కొరడాలకు వీపులను అప్పగించిన గిరిజనుల్లో అల్లూరి ధైర్యం నూరిపోసి... సమరానికి వారిని సన్నద్ధం చేసే సన్నివేశంలో ఈ పాట వస్తుంది. గిరిపుత్రుల్ని బానిసల్లా చూస్తూ అడ్డమైన చాకిరీ చేయించుకుంటూ ఒళ్లును (కండబలం) హూనం చేయడమే కాకుండా తన ముద్దుబిడ్డలకు అడవితల్లి పెట్టే అన్నాన్ని (కొండఫలం) కూడా దోచుకుంటున్న దుర్మార్గులకు వ్యతిరేకంగా అల్లూరి పూరించే పాంచజన్యమే ఈ పాట. 
      సంస్కృత సమాసావేశాలకు లోను కాకుండా వీలైనంత అచ్చతెలుగులో చైతన్యస్ఫోరకంగా గీతరచన చేశారు శ్రీశ్రీ. తెలుగు వీర లేవరా అనడంలో... తెలుగు నేలపై పుట్టిన ప్రతివాడూ వీరుడే అన్న భావన ఉంది. అరాచకం రాజ్యమేలుతున్నప్పుడు వీరుడన్న వాడు చేతులు ముడుచుకుని కూర్చోడు. కాబట్టే తిరుగుబాటుకు కదలమంటున్నాడు కవి. గదిలో పెట్టి కొడితే పిల్లి కూడా పులవుతుంది. మరి మీరెందుకు దెబ్బలను ఓర్చుకుంటూ గుడ్ల నీరు కుక్కుకుంటున్నారు? కాటేస్తున్న కాలనాగుల కోరలనూడపెరకేందుకు కంకణధారులవ్వండని మొదటి చరణంలో ఉద్బోధించాడు. ఆ తెల్లవాళ్లెవరు మన మీద పెత్తనం చేయడానికి? ఈ నేల మనది. మనమే దీనికి మహారాజులం. కాదన్న వాడి కుత్తుకలో చురకత్తిని దించండంటూ ఒంట్లో విద్యుదావేశాన్ని రగిల్చాడు తర్వాత. వందేమాతరమంటూ నినదించి గుండె గుండెలో స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తిని నింపాడు.
      పాటలోని చివరి ఎనిమిది పంక్తులు... అల్లూరికి గిరిజనుల కృతజ్ఞతాభివందనాలు. నిద్రపోయిన తమ పౌరుషాన్ని తట్టిలేపిన మన్యంవీరుడికి వారు బాస చేస్తున్నారు. కష్టాలను ఇష్టాలుగా మార్చుకుని త్యాగాల వంతెనపై ముందుకు సాగుతామని ఒట్టు పెట్టుకుంటున్నారు. చైతన్య గీతానికి ఇంతకు మించిన ముగింపు ఏముంటుంది?
      ఇంతటి ప్రసిద్ధమైన ఈ పాటలో చిన్న వ్యాకరణదోషముంది. తన సినీ పాటల సంకలనం ‘పాడవోయి భారతీయుడా’లో ఆ దోషమేంటో చెప్పారు మహాకవి. ‘‘తెలుగు వీర లేవరా పాటతో ఈ సంపుటిని మొదలుపెట్టకపోవడానికో చిన్న కారణం ఉంది. అందులో - ‘ప్రతి మనిషి తొడలుగొట్టి... సింహాలై గర్జించాలి’ అనడంలో వ్యాకరణ దోషం ఉంది. ప్రతి మనిషి ఏకవచనం, సింహాలు బహువచనం. సింహంలా గర్జించాలి ఉంటే సరిపోతుంది, సాహిత్య రీత్యా మాత్రమే కాక సంగీతపరంగా కూడా’’ అని చెప్పారు శ్రీశ్రీ. అయితే... పాట రగిల్చే ఆవేశంలో ఉండే ప్రేక్షకుడికి ఈ చిన్న దోషం చెవినపడకపోవచ్చు. కానీ... తప్పును ఒప్పుకోవడం శ్రీశ్రీ సంస్కారం.
      అంత్యప్రాసలతో, అందరికీ అర్థమయ్యే చిన్న చిన్న పదాలతో గుదిగుచ్చిన ఈ రచన... నాటి, నేటి, ఏనాటి వారికైనా ఇష్టమైందే. ఎర్రకోటపై మువ్వన్నెల పతాకం రెపరెపలాడుతున్నంత కాలం తెలుగు నేలపై ఈ పాట వినిపిస్తూనే ఉంటుంది.


వెనక్కి ...

మీ అభిప్రాయం