అన్నమయ్య వేమన... అవే పదాలు

  • 887 Views
  • 0Likes
  • Like
  • Article Share

    జి.యానాది రాజు

  • విశ్రాంత వాణిజ్య పన్నుల అధికారి
  • షాద్‌నగర్‌, మహబూబ్‌నగర్‌ జిల్లా
  • 9701857260
జి.యానాది రాజు

ప్రజల భాషకు పట్టం కట్టి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసినవారు తాళ్లపాక అన్నమయ్య, వేమనలు. వేంకటేశ నామాన్ని తన మనసంతా నింపుకుని ముప్ఫైవేల కీర్తనలు అన్నమయ్య రాస్తే... విశ్వదాభిరామ వినర వేమ మకుటంతో ఆటవెలదులలో మనిషి సకల కోణాలనూ వివరించాడు వేమన. వైష్ణవ భక్తి ప్రచారానికి సంకీర్తన సాహిత్యాన్ని అన్నమయ్య ఆశ్రయిస్తే, సామాజిక పోకడను సమకాలం వారికి, భవిష్యత్‌ తరాలకు భద్రంగా అందించేందుకు పద్యాన్ని ఆశ్రయించాడు వేమన. ఇద్దరూ ప్రజాకవులే కావడం వల్లనేమో ఇద్దరి సాహిత్యంలో ఎంతో సారూప్యం కనిపిస్తుంది.
వేంకటేశుని కొలచినవాడే నిజమైన వైష్ణవుడని అన్నమయ్య అంటే, మతం లేకపోవడాన్ని ఆధ్యాత్మికతతో మేళవించి సమాజాన్ని జాగృతం చేశాడు వేమన. అయితే వేమన ప్రధానంగా ఏ భక్తి శాఖకు చెందినవాడన్నది తేల్చలేం. కానీ ‘చదివి బతకరో సర్వజనులు మీరు/ కదిసి నారాయణాష్టాక్షరమిదియే’ అని అందరికీ ఓం నమో నారాయణాయ అన్న ఎనిమిది అక్షరాలే శరణ్యం అన్న అన్నమయ్య మాటలకు... ‘ఎనిమిదక్షరముల నేర్పడ నెరిగియు/ వినియు గనక రాక వెలయువాని/ తనువు మరిచి తెలియ తత్వాత్ముడగునురా’ అన్న వేమన పద్యం సమానంగా భాసిస్తుంది.
భక్తి, శృంగార మాధుర్యంతో అన్నమయ్య పదాలు, సూక్తి సారళ్యంతో వేమన పద్యాలు తెలుగువారి హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సముపార్జించుకున్నాయి. అన్నమయ్య సుజ్ఞాన జ్యోతిని, వేమన ప్రబోధ జ్ఞానజ్యోతినీ ఎత్తి ప్రపంచానికి కాంతిని పంచారు. అలా తెలుగు వెలుగు కలకాలం నిలిచేలా సమకూర్చారు. ఈ ప్రజాకవుల జీవిత విధానంలో ఎంతో వైరుధ్యం ఉంది. ఆలోచన విధానంలోనూ స్పష్టమైన తేడాలు ఉన్నాయి. ఇదలా ఉంచితే కొంత సారూప్యమూ లేకపోలేదు. ఇద్దరు కూడా పాండిత్యం కంటే పరమార్థం గొప్పదని నమ్మిన సత్యాన్వేషకులు.
ఎవరు ఎలా తలిస్తే అలా
ఓ శ్రీ వేంకటేశా! నీ పాదాలకు నేను చేసిన కీర్తన రూపమైన పూల పూజలివి. వీటిని నీ భండారంలో భద్రంగా దాచుకో! నువ్వు మమ్మల్ని రక్షించేందుకు ఒక్క సంకీర్తన సరిపోతుంది అని తన కృతులను తిరుమలేశునికి అంకితమిచ్చాడు అన్నమయ్య. దాచుకో నీ పాదాలకు దగనేజేసిన పూజలివి/ పూచి నీకీరితి పుష్పము లివియయ్యా/ వొక్క సంకీర్తనే చాలు వొద్దికై మమ్ము రక్షించగ/ తక్కినవి భండారాన దాచి వుండనీ... అన్న మార్గం అన్నమయ్యది. మంచి మనసుతో చేసిన పుణ్యం, అది కొంచెమైనా సరే ఫలిస్తుంది. మర్రిచెట్టుతో పోలిస్తే మర్రి విత్తనమెంత? అలాగే అంతగా ప్రయోజనం కలిగించని తట్టెడన్ని తళుకు బెళుకు రాళ్లకంటే నిజమైన నీలం ఒక్కటి చాలు. పనికిరాని వెయ్యి మాటల కంటే ప్రపంచానికి చాటేందుకు రసవంతమైన మంచి పద్యం ఒక్కటి సరిపోతుందన్నది వేమన వాదం.
నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు
తళుకు బెళుకు రాలు తట్టెడేల
చాటు పద్యమిలను చాలదా యొక్కటి
విశ్వదాభిరామ వినురవేమ

బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే... అందరికీ ‘శ్రీహరే అంతరాత్మ’ అని గళమెత్తిన వాగ్గేయకారుడు అన్నమయ్య. ఆయనకు పరబ్రహ్మం ఒక్కడే. అదీ తిరుమలరాయడే. వేమనకేమో తనను తాను తెలుసుకుంటే అదే బ్రహ్మం. ‘లోకో భిన్నరుచిః’ అన్నట్లు జనం భగవంతుణ్ని ఎవరికి తోచిన రూపంలో పూజిస్తారు. దైవం కూడా వారివారి భక్తి ప్రమాణానికి తగ్గట్లు దర్శనమిస్తాడు. ఎంత మాత్రమున ఎవ్వరు దలచిన అంతమాత్రమే నీవు/ అంతరాంతరము లెంచి చూడ పిండంతే నిప్పటి యన్నట్లు... పిండి కొద్ది రొట్టె (నిప్పటి అంటే రొట్టె) అన్నట్లు ఎవరు ఎంత తలుచుకుంటే నువ్వు అంతే కనిపిస్తావు అని పదకవితా పితామహుడు ప్రకటిస్తే... లేడు లేడనినను లేడు లేనేలేడు/ కాడు కాడటన్న కానేకాడు/ తోడు తోడటన్న తోడనే తోడౌను.. అని తనకే ప్రత్యేకమైన అలతి అలతి పదాలతో పరమాత్మ తత్వాన్ని చమత్కారంగా చెప్పాడు వేమన.
సమాజం, సృష్టి, పరిణామ క్రియలు, మానవ సంబంధాల్ని గురించి కూడా ఇద్దరూ సాహిత్యం ద్వారా చక్కగా తెలియజేశారు. ఏ మనిషికైనా ఆహారం, ఇంద్రియభోగాలు, నిద్ర సహజాతాలు. ఎవరూ కూడా వీటికి అతీతంగా మనుగడ సాగించలేడు. అందుకే అన్నమయ్య... ఎక్కడి మానుష జన్మంబెత్తిన ఫలమేమున్నది/ నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను అంటాడు. మనిషి జన్మ ఎత్తినవాడు సద్గురువు దగ్గర వేదాంత రహస్యాలు, తత్వజ్ఞానాన్ని పొంది భక్తిరసంలో తన్మయం చెందాలంటాడు వేమన. అందుకే... జన్మము నెత్తిన మనుజుడు/ చిన్మయ పరిపూర్ణ మహిమ జిత్తము నెఱుగన్‌/ దన్మయత నొంద నేర్చును/ చిన్మయు బరమేశు మదిని జేర్చును వేమా! అంటాడు.
ప్రపంచంలో జీవుని స్వరూపాన్ని, ప్రకృతిలో దేవుని వైభవాన్ని తెలుసుకునేందుకు అన్నమయ్య కీర్తనల్లో వేదాంత రహస్యాలను నిక్షిప్తం చేశాడు. ముగ్గురు మూర్తులు, మూడు మాటల్లో ఉన్న రహస్యం మూడు మూళ్లు తొమ్మిది. అవే నవరంధ్రాలు. శరీరం ఆ తొమ్మిది రంధ్రాలతో కూడింది. దేహాన్ని ఆశ్రయించుకుని ఉన్నది దేహి. అందుకే పరమాత్మతో ఏకమై వేడుకుంటే ముక్తి లభిస్తుంది. మూడు మాటలు మూడు మూండ్లు తొమ్మిది/ వేడుకొని చదువరో వేదాంత రహస్యము అని అన్నమయ్య అంటే... మూలమెవ్వరనుచు ముగ్గురి లోపల/ మూలమెరుగలేని మూఢజనులు/ మూలము ముగ్గురికి ముఖ్యమై యుండదా అన్న పద్యం నుంచి ముగ్గురికి- అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకూ ఒక మూలం ఉంటుందన్నది వేమన భావన.
కోటి ప్రయత్నాలూ కూటి కొరకే అన్నది పెద్దలమాట! ఉదరబాధకు మానవుడు ఎందుకింత తహతహ పడతాడని ప్రశ్నించిన అన్నమయ్య, ఆకలి తీర్చుకునేందుకు మనిషి దుష్ప్రవర్తనను ఆశ్రయించవద్దంటాడు. కడుపెంత తాకుడుచు కుడుపెంత దీనికై/ పడని పాట్లనెల్ల పడి పొరల నేల! అన్న అన్నమయ్య పదానికి... కడుపుకేల నరులు కళవళపడెదరు/ కడుపు చల్ల వడగ గలదు భుక్తి/ కడకు రాతిలోని కప్పకు లేదొకో/ విశ్వదాభిరామ వినురవేమ... కడుపు కోసం మనుషులు ఎందుకు కళవళ పడతారు. మనిషికి ఆకలి తీర్చేందుకు కావాల్సిన ఆహారాన్ని భగవంతుడే ఏర్పాటు చేసి ఉంటాడు. చివరికి రాళ్లలో ఉన్న కప్పకు కూడా దేవుడు ఆహారం సమకూర్చి పెట్టాడని వేమన సామ్యం చూపుతాడు.
ఎండగాని, నీడగాని ఏది ఏమైనా మమ్మల్ని ఏలే దైవం ఆ వేంకటేశ్వరుడే అన్నది అన్నమయ్య వాక్కు. సుఖమైనా, దుఃఖమైనా, నష్టమైనా, లాభమైనా అన్నిటా అన్ని వేళలా భగవంతుని దర్శించి అనుభూతి పొందడమే దాని పరమార్థం. ‘ఎండగాని నీడగాని యేమైనగాని/ కొండలరాయడే మా కులదైవము’ అన్నది అన్నమాచార్యుల ఆధ్యాత్మిక సారమైతే... పరమాత్మను దర్శించిన యోగి దేహాన్ని అంతర్లీనం చేసుకొని ఏ ఆశలు లేక నిర్మలంగా ఉంటాడన్నది వేమన వేదాంతసారం. ఎండవేళ చీకటేకమై యున్నట్లు/ నిండుకుండ నీరు నిలిచినట్లు/ దండిని బరమాత్మ తత్వంబు దెలియరో!... వెలుగుతోపాటే చీకటీ ఉంటుంది. నిండుకుండలో నీళ్లు నిలిచినట్లు పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలంటాడు వేమన.
కులం కాదు గుణమే ప్రధానం
తొలితెలుగు వాగ్గేయకారుడు అన్నమయ్య. వేమన యోగి. ఇద్దరూ మనుషుల మధ్య తాత్వికంగా తరతమ భేదం లేదంటారు. కుల, వర్ణ భేదాలు మానవ కల్పితాలంటారు. మానవత్వాన్ని చంపే కులాన్ని నిందిస్తారు. ఎదుటివాళ్లను దూషించకూడదు. అన్ని ప్రాణుల్లోనూ ఉన్నది ఒకే ఆత్మ అన్న వాక్కును అనుసరించి ఎవ్వరైనా సరే, ఎదుటివాళ్లను కూడా తమలాగే భావించాలి. అప్పుడే వసుధైక కుటుంబ భావన సాకారమవుతుంది. ‘ఏ కులజుడైన నేమి ఎవ్వడైన నేమి/ ఆకడ నాతడె హరినెరిగిన వాడు’, ఎవరైనా సరే చివరికి విష్ణుపదాన్ని తెలుసుకోవాల్సిందే అంటాడు తాళ్లపాక ఆచార్యులు. బోయగా పుట్టినా రామనామ మహిమతో ఆదికావ్యం రచించాడు వాల్మీకి. అందుకే...
రామనామ పఠనచే మహి వాల్మీకి
పరగ బోయయయ్యు బాపడయ్యె
కులము ఘనము కాదు, గుణము ఘనంబురా
విశ్వదాభిరామ వినురవేమ!

కులం కాదు, గుణమే ప్రధానం అంటాడు వేమన. అలా అన్నమయ్య భక్తి ద్వారా, వేమన హేతువాదం ద్వారా తెలుగు సమాజంలో కుల భేదాలను రూపుమాపే ప్రయత్నం చేశారు. సామాజిక దురాచారాలను ఖండించారు. అన్నమయ్య దృష్టిలో ప్రాణి, సముదాయంలో హెచ్చుతగ్గులు లేవు. ‘మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి యొకటే/ చండాలుండేటి సరిభూమి యొక్కటే’. తమ కులాలకు ఎన్ని పేర్లు పెట్టుకున్నా చివరికి అందరూ మరణించాల్సిందే. చావడంలో అందరూ సమానులైతే బతకడంలో కూడా అందరూ సమానమే, మనుషుల్లో ఎక్కువ, తక్కువలు లేవని వేమన వాదన.
బాపడనగ నేమి? భక్తుడనగ నేమి
జోగి యనగ నేమి? సొంపు లేక
ఎన్ని పేరులైన ఇనజుడు పని తీర్చు
విశ్వదాభిరామ వినురవేమ

మానవుల బాధలన్నిటికీ పరిష్కార మార్గం అన్ని విషయాల పట్ల సమదృష్టిని కలిగి ఉండటమే అన్నది అన్నమయ్య, వేమన ఇద్దరిలోనూ కనిపిస్తుంది. ‘సమబుద్ధే యిందరికి సర్వ వేదసారం/ ఘనుడందరికి హరిసాధనమో యయ్యా...’ సమబుద్ధే సర్వవేదాల సారమని అన్నమయ్య తేటతెల్లం చేయగా, అంతటా సమదృష్టి కలిగి ఉండి, బాహ్య సుఖాలను దరి చేరనీయక, ఇంద్రియ ప్రభావానికి లోనుకాకుండా ఉండేవాడికి ఆ సమధర్మ బుద్ధే బ్రహ్మం అంటాడు వేమన. సమస్త ప్రాణుల్లోనూ సమానంగా నెలకొన్న పరమాత్మను ఎవరు తెలుసుకుంటారో వాళ్లే విజ్ఞులు అంటుంది భగవద్గీత. ఇంకా మూఢనమ్మకాలు, కర్మకాండ పట్ల నిరసన ఇద్దరిలోనూ కనిపిస్తుంది. నరులకు నరులే పరలోక క్రియలు చేస్తారు, మరి జంతు వృక్ష సముదాయాలు నశిస్తే ఎవరు చేస్తారు? అని ప్రశ్నించి కర్మకాండ భ్రమ అంటాడు అన్నమయ్య. ఇదే వేమన పద్యంలో ఇంకొంచెం తీవ్రతను పొంది ‘పెంట దినెడు కాకి పెద్ద ఎలాగయ్యే?’గా పరివర్తన చెంది కనిపిస్తుంది.
అన్నమయ్య, వేమనలు ఇద్దరూ ప్రజాకవులే. ఒకరు వేంకటేశ్వరుని సాకార రూపాన్ని ఆరాధిస్తే, మరొకరు పరమాత్ముడి నిర్గుణరూపాన్ని ప్రచారంచేశారు. అయితే ఇద్దరి లక్ష్యం ఒకటే. అది సమసమాజ నిర్మాణం. అందుకే ఎన్నో అన్నమయ్య కీర్తనల్లో పల్లవులు- చరణాలు పరిశీలిస్తే, అవి తర్వాతి కాలపువాడైన వేమన పద్యపాదాల్లో సహజంగా ఇమిడిపోయినట్లు కనిపిస్తాయి. ఆచారాలు, రాజులపట్ల నిరసన, కుల భేదాలపట్ల నిరసన, పరమాత్మను తెలుసుకునే తత్వం లాంటి అంశాలను పరిశీలిస్తే అన్నమయ్య పదాలే వేమన పద్యాలుగా మారాయా అనిపిస్తుంది.


వెనక్కి ...

మీ అభిప్రాయం