మానవత్వమే గెలిచింది

  • 393 Views
  • 0Likes
  • Like
  • Article Share

    ఎ.కిశోర్‌బాబు

  • విజయవాడ
  • 8754995544
ఎ.కిశోర్‌బాబు

ఎవరువారు! ఎవరువారు! / ఈ తుపాను హోరులోన / చావుబ్రతుకు పోరులోన/  వెనుదిరగక మునుముందుకు/  దీక్షతోడ సాగువారు! / ఈ భీషణ ధ్వంసలీల/  లో నూతన వసంతాల / అంకురాలు చూచువారు!/ ప్రేమతోడ కాచువారు!/ 

- బైరాగి

‘విపదస్సంతు నః శశ్వత్‌ తత్ర తత్ర జగద్గురో’! అంటుంది కుంతి మహాభారతంలో. ‘నాకు ఎల్లప్పుడూ విపత్తులు కలుగునట్లు వరమివ్వు జనార్దనా’ అని దానర్థం. మానవాళికి ఒక్కొక్కప్పుడు విపత్తులు కూడా మేలు చేస్తాయేమో! మనిషిలో మాయమైపోయిన మనిషితనాన్ని మేల్కొలిపి వెళ్తుంటాయేమో!
      మానవుడిప్పుడు శ్రీమంతుడు. అతడికన్నీ ఉన్నాయి. డబ్బూ, కీర్తి, మేధ, హోదా... కాకుంటే మనిషితనమే మాయమైపోతోంది. జనోద్ధరుడవ్వాల్సిన మనిషి ధనార్జునుడైపోయి స్వార్థ పరాయణుడిగా పరిణామం చెందాడు. సాటి మనిషివైపు తిరిగి చూడలేనంత ‘సిరి’మంతుడై కొట్టుమిట్టాడుతున్నాడు. లోకంలో ఇప్పుడు ఎవరి స్వార్థం వాళ్లది, ఎవరి కష్టం వాళ్లది. పక్కవాణ్ని పట్టించుకోవాలన్న సామాజిక స్పృహ కరవౌతున్న కాలం ఇది. అందుకే అంటారు తిలక్‌ ‘స్వార్థం పిచ్చి కుక్కలా పరిగెడుతోంది’ అని. నగరీకరణ, నవ నాగరీకరణ అంటూ లోకం రోజుకో ‘స్మార్ట్‌’ వేషం వేస్తోంది. పైకి ఎంత నున్నగా కనిపించినా లోనంతా కృత్రిమ పరిమళమే. మనిషి నవ్వడం నుంచీ కరచాలనం వరకు, ఆలింగనాలు, అనుబంధాలు, అనురాగాలు అన్నీ యాంత్రికమే. ‘మా ఇంటికొస్తే ఏమి తెస్తావు, మీ ఇంటికొస్తే ఏమి ఇస్తావు’ అనేది ఇప్పటి మమతల పోకడ. ఇలాంటి రోజుల్లో మనుషుల్లో మానవత్వపు జాడలున్నాయా అనే అనుమానాలూ కలగడం సహజమే. మామూలు రోజుల్లో అయితే ఈ అనుమానాలు తీరవు. కానీ, వూహకందని విపత్తు విరుచుకుపడినప్పుడు మనిషికి మనిషే తోడవుతాడు. మనిషిలో ఇంకా మంచితనం అడుగంటిపోలేదనే విషయం అలాంటి సమయాల్లోనే మనకు అనుభవంలోకి వస్తుంది.
      అప్పుడప్పుడు ప్రకృతి ప్రకోపించి ఉపద్రవాలతో మానవాళిని ముంచెత్తి అపారనష్టం మిగిల్చి వెళ్తుంటుంది. అది చెడే కావొచ్చు కానీ, అందులోనూ కూసింత మేలునూ పోగేసి పోతుంటుంది. మనిషిలో ఏ మూలో నిద్రిస్తున్న మానవత్వాన్ని తట్టిలేపి వెళ్తుంటుంది. దీనికెన్నో తార్కాణాలు... నేపాల్‌ భూకంప విధ్వంసం కావచ్చు. ఆసియాపైన విరుచుకుపడ్డ సునామీ అలల రాక్షస కేళి కావచ్చు. ఇప్పుడు చెన్నపురిని కకావికలం చేసిన వరద కల్లోలం కావచ్చు. మనిషి చేస్తున్న తప్పిదాలపై విసుగెత్తి ప్రకృతి ప్రకోపించి సర్వం శిథిలం చేసి ఉండొచ్చు. అదే సందర్భంలో ఆ శిథిలాల కింద మానవత్వం మొగ్గ తొడగడానికి ఒక చిన్న బీజం కూడా వేసి వెళ్తుంటుంది. చెన్నై వరదలు దానికో నవ దృష్టాంతం మాత్రమే.
ఏవీ అక్కరకు రాని వేళ...
అర్ధరాత్రి గాఢనిద్రలో ఉన్న వేళ చిల్లుపడ్డ ఆకాశం చెన్నపట్నంపైన చెలరేగిపోయింది. వాగులు పొంగి వూరి మీద విరుచుకుపడ్డాయి. అల‘జడి’కి, జలసడికి ఉలిక్కిపడ్డ జనం వణికిపోయారు. ఇల్లు నుంచీ వూరంతటినీ చుట్టుముట్టేసిన జలబంధంలో దిక్కుతోచక బిక్కుబిక్కుమని బతకాల్సిన పరిస్థితి. ధనార్జునులు, దరిద్ర నారాయణులు... ఎవరైతేనేం విపత్తు ముందు అంతా ఒక్కటే. అందరి ఇళ్లనూ ముంచేసి, ప్రాణాలు అరచేతపట్టుకున్న మనుషులను కట్టుబట్టలతో తరిమేసింది. కొంత మందిని మింగేసింది. తెల్లారితే వూరంతా విషాదం. మనిషి నిండా నిర్వేదం. తిండి లేదు, నీళ్లు లేవు. పసిగుడ్డుకు పట్టడానికి గరిటెడు పాలు కూడా దొరకని దైన్యం. వూరంతా చీకటి. డబ్బున్న షరాబూ, కాసు లేని గరీబూ ఇద్దర్నీ సమానంగా ముంచెత్తిన వరద తనమానాన తాను సాగరంలో కలిసిపోయింది. బ్యాంకు ఖాతాల నిండా మూలిగేంత లెక్క. బీరువాల్లో పేరుకుపోయిన నోట్ల కట్టలు. పర్సు నిండా ఏటీఎం, డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల బొత్తులు. బంగళాలు, బంగారాలు, కార్లు, కంప్యూటర్లు, ఐ ఫోన్‌ ఆడంబరాలు... ఇవన్నీ ఎందుకూ పనికిరాకుండాపోయిన క్షణమది. అప్పుడే... కన్నీటి కష్టంలో మనిషికి మనిషే అసలైన ఆసరా అని తెలుసుకున్న అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ఒకరి కష్టం వాడ కష్టమైంది. వాడ దుఃఖం వూరి బాధైంది. ఆ బాధల నుంచీ బయటపడటానికి చేయి చేయి కలిపి ఎదురీదాల్సిన అవసరాన్ని చాటింది.
ఉన్న ఇంటినీ, ఇంటిముందు వీధిని వరద చుట్టిముట్టినప్పుడు ఏమీ చేయలేక, కట్టుబట్టలతో రోడ్డుమీద సామాన్యుడిలా నిలుచున్న అపర కుబేరుడు ఏసీ ముత్తయ్యకు సామాన్యులు పడవ సాయం అందించి ఒడ్డుకు చేర్చిన తరుణమది. ముక్కూమొహం తెలీని ఎంతోమంది అపరిచితులకు, పదుల సంఖ్యలో హిందువుల కుటుంబాలకు ఆపత్కాలంలో తన ఇంట ఆశ్రయమిచ్చి అతిథి సత్కారాలు చేసిన ముస్లిం కుర్రాడు మహ్మద్‌ యూనస్‌లో మానవత్వం పరిమళించిన వేడుకది. ఆ విపత్తు వేళ ఆ ఇంట తలదాచుకున్న నిండు చూలాలు చిత్ర, తన బిడ్డకు యూనస్‌ పేరే పెట్టి కృతజ్ఞత చాటుకున్న కమనీయ సన్నివేశమది. వాగులైన వీధుల్లో పైసా తీసుకోకుండా బాధితులను తన ఆటోలో రేయింబవళ్లూ ఆవలి తీరాలకు చేర్చడానికొచ్చిన ‘ఆటో’మేటిక్‌ మనిషి తిరునావుక్కరసు తారసపడ్డ తరుణమది. కటిక చీకటి, గొంతులోతు నీళ్లలో రేయింబవళ్లూ తన బైకు మీద ఒక్కోసారి ఇద్దరు ముగ్గుర్నీ ఎక్కించుకుని ఏరైన వీధికి ఎదురీదిన ‘ఖాకీ’ కారుణ్యమూర్తి షణ్ముగ సుందరం సందడి చేసిన సందర్భమది. తన వీధిలోని వాళ్లందరికీ తన ఇంట భోజనం వండి పెట్టిన ఇమ్మాన్యుయేల్‌, రహీం బిడ్డకోసం పీకల్లోతు నీళ్లలో అర కిలోమీటరు దూరం ఈదుకుంటూ వెళ్లి పాల పేకెట్లను మిద్దెపైకి విసిరేసి వస్తున్న సుబ్రమణ్యశాస్త్రి లాంటి మానవతా మూర్తులెందరో కనువిందు చేసిన కమనీయ క్షణాలవి.
      వాళ్లేనా... అదిగో అక్కడ నీరుంది ఇటు వెళ్లండి, ఇదిగో ఇక్కడ అన్నం పెడుతున్నాం రండి, ఆకలిగా ఉంటే మెసేజ్‌ ఇవ్వండి... వరదకు భయపడొద్దు, మా ఇంటికి రండి అంటూ మానవత్వానికి ద్వారాలు తెరిచి, సామాజిక మాధ్యమాల్లో ఆహ్వానాలు పంపి ఆదుకున్న ఆపన్న హస్తాలు, వాట్సప్‌లో మెరిసిన మానవతా చిహ్నాలు, ఫేస్‌బుక్‌లో పలకరించిన సేవా ముఖాలు ఎన్నెన్నో... ఎందరెందరో ఎదురైన కమనీయ దృశ్యాలవి. వూరంతా మంచై పరిమళించి, మనుషులంతా మానవతా మూర్తులై పలకరించిన అద్భుత క్షణాలవి. మతాల మట్టిగోడలు, కులాల పేకమేడలన్నీ మనుషుల్లో పెల్లుబికిన మానవత్వపు వరదల్లో కొట్టుకుపోయి ఏకతాసాగరంలో కలిసిపోతున్న సుందర దృశ్యమది. సాయం సంఘటితమైన వేళ కళ్ల నుంచి జారుతున్న ఆనందబాష్పాల్లో వరద విషాదం ఆవిరైపోతున్న చిత్రమది. మనిషి, మానవత్వం, మంచితనం కలిసిపోయి, కష్టాల వరదను అవలీలగా ఎదురీది లోకానికి సమైక్యరాగం వినిపించిన వేడుకది. విలయం ప్రళయమే కావచ్చు కానీ, తమలోని మంచితనపు సుగంధాన్ని తమ ముక్కుపుటాలకే అందించి వెళ్లిన వానదేవుడికి చెన్నపురి ప్రజలు చేతులెత్తి మొక్కిన మహత్తర సన్నివేశమది. చెన్నై వరదలు మానవాళికో ఉపనిషత్తులా నిలిచిన శుభ సమయమది. ‘ఈ విశాల ప్రపంచమే నా గృహం. మంచి చేయడమే నా మతం’ అంటారు స్వామి రామతీర్థ. చెన్నపట్నం విపత్తులు లోకానికి చాటింది కూడా ఇదే.

*  *  *


వెనక్కి ...

మీ అభిప్రాయం