మట్టిమనిషిపై గట్టి చిత్రణ

  • 223 Views
  • 1Likes
  • Like
  • Article Share

    కె.యన్‌.మల్లీశ్వరి

  • విశాఖపట్నం
  • 9246616788
కె.యన్‌.మల్లీశ్వరి

వంద సంవత్సరాల కాలంలో నాలుగుతరాల నేపథ్యంతో పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల వ్యవసాయ కుటుంబాల్లో వచ్చిన మార్పులను సమగ్ర అవగాహనతో చిత్రించిన నవల మట్టిమనిషి. మానవ సంబంధాల దారపు కొసని గట్టిగా పట్టుకుని భూమి చుట్టూ ఆవరించుకుని ఉండే సమస్త రాజకీయాలనూ తన నవలాకాశంలో గాలిపటం వలె స్వేచ్ఛగా ఎగురవేసిన ధీశాలి వాసిరెడ్డి సీతాదేవి.
భూమిని నమ్మి, భూమిని ప్రేమించి భూమితోనే జీవించిన భూమిపుత్రుడు సాంబయ్య, నడుస్తుంటే మాగాటి గనెం జవజవలాడిపోయే పాదాల ధాటి కలిగిన మట్టిమనిషి సాంబయ్య, పాలేరు కొడుకునుంచి ఎనభై ఎకరాల సుక్షేత్రమయిన మాగాణి కల షావుకారుగా ఎదిగిన సాంబయ్య ఈ నవలలో కథానాయకుడిగా కనిపించవచ్చు. కానీ బలరామయ్య, వరూధిని, సాంబయ్య, వెంకటపతి, కనకయ్య, రామనాథబాబు, రవి పాత్రలు వేటికవి స్వతంత్రమై, ప్రత్యేకమై, నాయకుడు, నాయిక వంటి మూస లక్షణాలను అధిగమించి కనిపిస్తాయి.
      ఈ పాత్రల్ని సమన్వయం చేస్తూ కథాకథనాలను నడపడంలోనూ, నాటి వెనుక ఉన్న మార్పుల కాలపు కష్టనష్టాల్ని, సుఖదుఃఖాల్నీ, వాటి మూలాల్ని పట్టుకోవడం లోనూ రచయిత్రి ప్రతిభ అబ్బుర పరుస్తుంది. అనాదిగా మనిషికీ భూమికీ మధ్య ఉండే అనుబంధాన్ని చెప్తూ వచ్చిన భూమి, భూమి పుత్రిక లాంటి ప్రపంచస్థాయి నవలలకి దీటుగా నిలబడగలదు ‘మట్టిమనిషి’. ఈ నవల 1970లో ఆంధ్రప్రభ దినపత్రికలో రెండేళ్లు ధారావాహికగా వచ్చింది. దాదాపు 14 భాషల్లోకి అనువాదమయ్యింది. తెలుగు నవలల్లో కలికితురాయిగా నిలిచింది.
      భూస్వామిక, ధనికరైతు, దళారీ వ్యవస్థల మధ్యనుండే ఘర్షణని, పరస్పర అనివార్యతని కలనేతగా చెప్పడం వల్లనే ఈ నవల సర్వజన ప్రాసంగికతని పొందింది. విశాలమైన భూఖండాలు కలిగిన షావుకారు భద్రయ్య కొడుకు బలరామయ్య. అనువంశికంగా వచ్చే భూస్వామ్య లక్షణాలైన డాబూ, దర్పం, అహంభావం తప్ప, భూదాహంగానీ, భూమిని నిలబెట్టుకునే తాపత్రయంగానీ లేవు. అతనికి భూమి ఒక ఆస్తి మాత్రమే. అమ్ముకోవడాలు తప్ప కొనడాలు లేని జీవన విధానంలో, చెట్టుమీద కూర్చున్న స్థితి నుంచి విరిగిన కొమ్మ పట్టుకుని వేలాడే స్థితికి చేరుకుంటాడు బలరామయ్య.
      సరిగ్గా ఇక్కడే... వీరి అనుత్పాదకత లోంచి, నిర్వ్యాపకత్వంలోంచి ఊరుబోయిన సాంబయ్యలు షావుకారు సాంబయ్యలుగా అలవిమాలిన స్నేహం చేస్తారు. దాని చుట్టూ అల్లుకున్న గొడ్డు, గోదా, మనుషులు, సంబంధాలన్నిటినీ భూమికి వారసులు కనుకనే కొడుకు వెంకటపతి, మనుమడు రవి పట్ల ఉండే మమకారం దీనికి మినహాయింపు.
      భూమిని ఇంతింతలుగా పెంచడం మీద తప్ప మరే విషయంలోనూ రాగద్వేషాలులేని సాంబయ్యకూడా ఒక తప్పు చేశాడు.. గాయపడిన అహాన్ని సరిచేసుకోవడానికో, కొత్త అహాన్ని సంతృప్తి పరచడానికో బలరామయ్యతో వియ్యమందాడు. అతని పతనానికి బీజం పడింది అక్కడే...
      ‘‘వూరుబోయిన వెంకయ్య మనవడా - షావుకారు వీరభద్రయ్యగారి మనవరాలి మెళ్లో పుస్తెకట్టు. అలగావాళ్ల కుర్రాడా - భూస్వామి బలరామయ్య కూతురు మెళ్లో మాంగల్యంకట్టు! పాలేరు సాంబయ్య కొడుకా - షావుకారు బలరామయ్య కూతురు మెళ్లో తాళి కట్టరా!’’ అంటూ ఏళ్లకేళ్లుగా తనలో గూడు కట్టుకున్న కసీ, అవమానాల్ని ఉద్వేగంతో వెలికి తీస్తాడు.
      కానీ వెంకటపతి వరూధిని రెండు భిన్న వ్యవస్థలకి ప్రతినిధులు. శ్రమని మాత్రమే తెలిసిన వెంకటపతి, శ్రమని అనుభవించడం మాత్రమే తెలిసిన వరూధినిల మధ్య అనివార్యంగా ఏర్పడిన వైరుధ్యాల్లో ఆధిపత్య స్వభావాల వారిదే పైచేయి అవుతుంది. నలుగురి  పెట్టు ఒక్కడే పనిచేసే వెంకటపతి, నిండుబస్తా అవలీలగా ఎత్తి బండి మీదకి విసిరేసే వెంకటపతి, అసమర్థుడై, తాగుడికి బానిసై పిచ్చిమొక్కని రెండు చేతులతో పట్టి గుంజినా పెకిలించలేని బలహీనుడిగా మారిపోవడం వెనుక చాలా పెద్ద పరిణామం ఉంది. ఇది సాంబయ్య అంచనాలకు అందనిది.
      భూమిని ఉత్పత్తి వనరు స్థాయి నుంచి వ్యాపార వనరుగా మార్చేసిన పట్టణీకరణ ప్రభావాన్ని వాటిని నమ్ముకున్న వ్యక్తుల ఎదుగుదల పతనాల్లో నుంచి సహజంగా చిత్రించారు వాసిరెడ్డి సీతాదేవి. 1930 - 70 మధ్య కాలంలో, గ్రామాల్లోంచి, ఏలూరు, బెజవాడ, గుడివాడ, బందరు, గుంటూరు, తెనాలి పట్టణాల్లోకి ప్రవహించిన పెట్టుబడులు కొత్త సంస్కృతిని సృష్టించాయి.
      వ్యవసాయం నుంచి పొందిన అదనపు ఉత్పత్తిని, మళ్లీ వ్యవసాయం మీదకాక పట్టణాల్లో లాభసాటి వ్యాపారాల మీద పెట్టడం మొదలైంది. అలాంటి కొత్త పెట్టుబడిదారులను మొదట ఆకర్షించింది సినిమా పరిశ్రమ. దీని నిర్మాణం, పంపిణీ, హాళ్లు, పత్రికలు, రవాణా రంగాల్లో ఇప్పటికీ కోస్తాంధ్ర ముద్ర బలంగా ఉండటానికి మూలం ఆ దశలోనే ఉంది.
      సౌకర్యాల వ్యామోహంతో, పట్టణంలోకి రామనాథబాబు మీది మోహంతో సినిమాహాలు నిర్మాణంలోకి ప్రవేశించిన వరూధినిలాంటి సంపన్న వర్గపు యువతుల జీవితాలు మాయాజలతారు వలలకి సులువుగా చిక్కే చిరు చేపలు. వరూధిని జీవితం అత్యంత విషాదకరంగా ముగిసింది. దీనిని వ్యక్తుల మంచి చెడు ప్రవర్తనల్లోంచి కాక వ్యవస్థ లోపాల్లోంచి చూసినప్పుడు పట్టణ సంస్కృతికి రెండోవైపు ఉండే మోసకారితనం అవగతమై నివ్వెరపోతాం.
      డబ్బు మాత్రమే ప్రధానమైన వ్యాపార రంగంలో అనేక నైతిక కట్టుబాట్లను అధిగమించింది వరూధిని. ఆమె చర్యల్ని పాఠకులు విశ్లేషించుకునేప్పుడు పాతివ్రత్య మీమాంస ఏ మాత్రమూ అడ్డుపడదు. స్త్రీ అయినందుకుగానూ, వ్యాపార రంగంలో అదనంగా ఎదురయ్యే లైంగిక దోపిడీకి గురవడం వలన వరూధినిపై సానుభూతి కలుగుతుంది.
      పై రెండు వర్గాల వ్యక్తులతో పాటు దళారీ వ్యవస్థకి ప్రతినిధిగా కనకయ్య, రామనాథబాబు కనపడతాడు. వీరిదికూడా విశ్రాంతి వర్గమే. ఉత్పత్తిలో ఎప్పుడూ భాగం కారు. వ్యవస్థ ఆనుపానుల మీద పట్టు సాధించి దళారీ తనపు లౌక్యంతో రైతులుగా, పెట్టుబడిదారులుగా ఎదిగి రాజకీయ అధికారపు లక్ష్యాన్ని చేజిక్కించుకుంటారు. అధికార వ్యవస్థలకి వివిధ వర్గాలకి మధ్య దళారీలుగా ఉంటూ అన్ని రంగాల్లోని ఉత్పత్తి సంపదల్ని కాజేయడం ద్వారా అక్రమ వ్యాపార వర్గంగా స్థిరపడతారు. ఆ సంపదల రక్షణ కోసం రాజకీయాలను ఆశ్రయిస్తారు.
      ముప్పైయ్యేళ్ల కిందట అంగవస్త్రంలో కాగితాలు చుట్టుకుని తిరిగిన కనకయ్య, ఎనభై ఎకరాల పొలాన్నీ, బలరామయ్య మేడనీ, శేషావతారం మిల్లులో వాటాని, చివరకి సమితి ప్రెసిడెంటు పదవిని కూడా పొందుతాడు.
ఒక గ్రామం, ఒక పట్టణం నేపథ్యంలో ఇన్ని వ్యవస్థల్లో వచ్చిన పరిణామాలను, వాటి సంక్లిష్టతల్ని చాలా సులువుగా, సరళంగా అర్థమయ్యేలా నవలని నడిపారు రచయిత్రి.
      మట్టిమనిషి అనితరసాధ్యమైన నవలగా రూపొందడం వెనుక ఇతివృత్తపు గొప్పదనంతో పాటు నవలని నిర్వహించిన విధానం కూడా ముఖ్యకారణం. పురాణ లక్షణాలని నవీకరిస్తే ‘మట్టిమనిషి’ ఆధునిక మహాపురాణమవుతుంది.
      నవలకి నేపథ్యంగా ఎంచుకున్న ఒక భౌగోళిక ప్రాంతంలోని ప్రజల సామాజిక, ఆర్థిక రాజకీయ సాంస్కృతిక అంశాలపై పట్టు ఉండటమే కాక, భిన్నవర్గాల వారి సాంస్కృతిక చైతన్యపు స్థాయిపై వాసిరెడ్డి సీతాదేవికి చక్కని అవగాహన ఉంది. శ్రమకి దూరంగా ఉండే షావుకార్ల భేషజాలు, శ్రమించే రైతులని ఆవరించుకుని నడిపే విశ్వాసాలు, అటూ, ఇటూ పబ్బం గడుపుకుంటూ ఎదిగే కనకయ్యలు, పట్టణీకరణ వల్ల ప్రజల్లో పెరిగిన వ్యామోహాలు, వాటిని వ్యక్తీకరించే గుంటూరు జిల్లా మాండలికం, ప్రజల నుడికారం కలగలిసి 600 పేజీల నవలని అవలీలగా చదివించేస్తాయి.
      వెంకటపతి, వరూధిని పెళ్లి సందర్భంలో సాగిన వర్ణనలు కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని మోతుబరి కమ్మ రైతుల ఇళ్లలో జరిగే వివాహ వేడుకలకు అక్షరరూపం. రంగులూ, లతలూ నగిషీ పనితో ఉన్న చాటంత శుభలేఖలూ, వంద మోతలైట్లూ, బస్తీ నుంచి తెప్పించినకారు, ఊరేగింపుకి పూలరథం, మేజువాణి, బాండు, సన్నాయి. విస్తళ్లలో వేసిన లడ్లు, అరిసెల పరిమాణం... ‘సాంబయ్య కొడుకు పెళ్లి గురించి ప్రతిపందిట్లోనూ మూడేళ్లదాకా చెప్పుకున్నారు’ అంటారు రచయిత్రి.
ఒక సాంప్రదాయక ఘోషా కుటుంబంలో పుట్టి పెరిగి, పట్టుదలతో అంచెలంచెలుగా చదువుకున్న వాసిరెడ్డి సీతాదేవి నవల ముగింపులో చూపిన విప్లవ చైతన్యం ఒక చారిత్రక సందర్భానికి సూచన. నవల రాసిన 1972 నాటికి శ్రీకాకుళ గిరిజనోద్యమ పోరాటం చాలామందికి ఆకర్షించింది. నవలలో కూడా ఈ ప్రస్తావనా వస్తుంది. కోస్తాంధ్రలోని అనేకమంది కమ్యూనిస్టులను, కళాకారులను, మేధావులను ప్రభావితం చేసినట్లుగానే వాసిరెడ్డి సీతాదేవిని కూడా ఆ పోరాటం ఆశ్చర్యపరిచి ఉండొచ్చు. అందుకే ముగింపులో చిన్న కుర్రవాడయిన రవిచేత...‘‘వస్తాన్రా వస్తా - తెస్తా నీ కోసం - తుపాకి!’’ అన్న వాక్యాలను పలికిస్తారు. అంతేకాదు అదే ఆ తర్వాత కాలంలో ఆవిడ రాసిన ‘మరీచిక’ నవలలో ప్రధాన ఇతివృత్తం కూడా. దాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిషేధించింది.
మూడే వ్యవస్థల్ని ఆశ్రయించుకున్న మానవ సంబంధాలు ఒక దానితో ఒకటి సంక్లిష్టంగా ముడిపడుతూ, దేనికవే విడిపోతూ, నింగి నందుకుంటూ, నేల రాలిపోతూ.... అరవై నాలుగు గళ్లచదరంగంలో వైకుంఠపాళీని మిళితం చేసింది ఈ నవల. ఒక ఇష్టంతో, ప్రేమతో పదే పదే చదివింపజేస్తూ, చదివినపుడల్లా కొత్త ఎరుకని అందించే ఈ నవల కాలాతీతమైంది. విశ్వజనీనమైంది.


వెనక్కి ...

మీ అభిప్రాయం