గురువే చుక్కాని

  • 134 Views
  • 0Likes
  • Like
  • Article Share

    కె.పుష్పలత

  • విశ్రాంత ఉపాధ్యాయురాలు
  • బెంగళూరు
  • 7411258572
కె.పుష్పలత

తరగతిలో పాఠమో, పద్యమో చెప్పాం. పిల్లల అభ్యాసానికి ఏదో ఒక అంశమిచ్చేశాం. ఈరోజు ‘బడి పని’ అయిపోయింది. రేపటి సంగతి రేపు చూసుకుందాం... తెలుగు ఉపాధ్యాయులు ఈస్థాయికే పరిమితమైపోతే, తెలుగు పిల్లలు తెలుగు పరీక్షలో తప్పకుండా ఉంటారా! తెలుగు మాతృభాషగా ఉన్న విద్యార్థులే పదో తరగతి పరీక్షల్లో తెలుగులో తప్పుతున్నారని వార్తలు వచ్చినప్పుడల్లా భాషాభిమానుల మనస్సు చివుక్కుమంటుంది. ఎందుకు జరుగుతోంది అలా అంటే అతి సాధారణ బోధన పద్ధతుల వల్లే. ఉపాధ్యాయులు పాఠ్యాంశాల బోధనతో పాటు వినూత్నమైన కృత్యాలను పిల్లల చేత చేయిస్తే... వారికి భాష సులువుగా అబ్బుతుంది. ఆజన్మాంతం తోడుగా నిలుస్తుంది.
ప్రస్తుత
విద్యావిధానంలో విద్యార్థులకు తెలుగులో కంటే గణితం, సామాన్య శాస్త్రాల్లోనే మార్కులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. పై చదువులకు వెళ్లినప్పుడూ ఆ పాఠ్యాంశాలకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటోంది. దాంతో పిల్లలూ వాటిపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ఫలితంగా వారిలో తెలుగుపై ఆసక్తి, భాషా నైపుణ్యం తగ్గిపోతున్నాయి. భాషాబోధకులుగా ఉన్న ఉపాధ్యాయులు... మన భాష రుచిని చిన్నారులకు చూపించగలిగితే ఈ పరిస్థితి మారుతుంది. సృజనాత్మక పద్ధతులను తెలుగు ఉపాధ్యాయులు అనుసరిస్తేనే నవతరానికి తెలుగు దగ్గర అవుతుంది. అదే సమయంలో తెలుగుకూ కొత్త వెలుగు వస్తుంది. 
-    తరగతిలో పాఠ్యాంశ బోధనకంటే ముందు అంశానికి సంబంధించిన పూర్వాపరాలని వివరించాలి. సందర్భానికి తగిన ఉదాహరణలను క్రోడీకరించాలి. 
-    బోధించిన పాఠ్యాంశాన్ని మర్నాటి తరగతిలో పునశ్చరణ చేయించాకే కొత్త పాఠం చెప్పాలి. పద్యపాఠ్యాంశమైతే.. ఒక పద్యాన్ని సవివరంగా (పూర్వగాథతో సహా) బోధించి విద్యార్థులతో అర్థతాత్పర్యాలను చెప్పించాలి. దీంతో పిల్లలు పాఠాన్ని శ్రద్ధగా వినటానికి, చెప్పటానికి ఆసక్తి చూపిస్తారు. 
-    వారానికి ఒకరోజు పాఠాలను పక్కనపెట్టి చిన్నారుల ఊహాశక్తిని రేకెత్తిస్తూ చిన్న చిన్న కథలు, కవితలు చెప్పించాలి. సామెతలు తదితరాలను  సేకరించమనాలి. వారు తీసుకొచ్చిన వాటి పూర్వపరాలను ఉపాధ్యాయులు విశ్లేషించాలి. దీనివల్ల పిల్లల్లో భాషపై అనురక్తి పెరుగుతుంది.
-    వ్యాకరణ బోధన చేసేటప్పుడు నల్లబల్ల మీద రాసి బోధించాలి. ఆ తర్వాత విద్యార్థుల చేత రాయించాలి. 
-    పండుగలు, జాతీయోత్సవాల సమయంలో పిల్లలచేత చిన్నచిన్న కవితలు, ఒక పేజీ కథలు వంటి వాటిని రాయించాలి. 
-    బడి గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలను విద్యార్థులకిచ్చి చదవమని చెప్పాలి. చదివిన వాటి గురించి వారి అభిప్రాయాలు తెలుసుకోవాలి. ఉపాధ్యాయులు కూడా పుస్తకాలను చదువుతూ, వాటిల్లోని ఆసక్తికరమైన, విజ్ఞానదాయకమైన విషయాలను విద్యార్థులతో పంచుకోవాలి. ఇది ఇద్దరికీ ఉపయోగపడుతుంది.
-    సెలవుల్లో ఇంటి పని (హోంవర్కు) పేరుతో పిల్లల్ని ఇబ్బంది 
    పెట్టకూడదు. సెలవుల్లో వారు వెళ్లిన ప్రదేశాల్లో చూసిన విశేషాలను రాసి తీసుకురమ్మనాలి. లేదా వాటిని గురించి మౌఖికంగా వివరించమనాలి. పిల్లల్లో భాషాజ్ఞానం పెరగడానికి ఇది ఉపయోగపడుతుంది. 
-    విద్యార్థులు రాతపుస్తకాల్లో పరీక్షల సమాధానపత్రాల్లో అక్షర, వ్యాకరణ దోషాలతో రాస్తుంటారు. ఉపాధ్యాయులు  వాటిని పరిశీలించి ఆ దోషాలను సరిచేసి అక్కడే సరైన మాటలు రాయాలి. దీంతో పిల్లలు మళ్లీ ఆ తప్పు రాసే అవకాశం ఉండదు. 
-    ఇంటి పని కూడా ఎక్కువగా ఇవ్వకపోవటం మంచి పద్ధతి. 
-    పాఠశాల స్థాయిలో విద్యార్థులను రచనలో ప్రోత్సహించడానికి వారి దస్తూరిలోనే రాతప్రతి మాసపత్రికను నిర్వహించవచ్చు. (దీనికి ఉదాహరణ.... తూర్పు గోదావరి జిల్లా పెదపూడి మండలం కుమారప్రియం మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో చిన్నారులతో ప్రారంభించిన ‘చిట్టి ఊహలు’ పత్రికే నిదర్శనం. వీరి గురించి ‘తెలుగు వెలుగు’ నవంబర్‌ సంచికలో ‘చిట్టి చేతులు మంచి రాతలు’ కథనాన్ని చదవండి )
-    విద్యార్థులను తరచుగా రేడియో కార్యక్రమాలకు పంపాలి.
-    పిల్లలచేతే నాటకాలు రాయించి... వారి నిర్వహణలోనే ప్రదర్శింపజేయాలి.
-    ప్రతి సంవత్సరం జరిగే పుస్తక ప్రదర్శనలకు విద్యార్థులను తీసుకెళ్లి మంచి పుస్తకాన్ని కొనిపించాలి. 
విద్యార్థుల్లో నైతిక విలువలు పెంచే అవకాశం మాతృభాషల ఉపాధ్యాయులకే ఎక్కువగా ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని బాధ్యతలు నిర్వర్తించాలి. అయితే... ప్రస్తుతం తెలుగు వాచకాల్లో ఉంటున్న పాఠ్యాంశాలు తగిన స్థాయిలో ఉండట్లేదు. విద్యార్థులకు వివరించి చెప్పటానికి అనువుగా ఉండట్లేదు. అంతేకాదు, విద్యార్థుల్లో భాషపై ఆసక్తి పెంచడానికీ అవి దోహదపడట్లేదు. వాటిని మార్చాలి. అచ్చతెలుగు సొగసును కొత్తతరానికి ప్రభావవంతంగా పరిచయం చేసే పాఠ్యాంశాలనే వాచకాల్లో గుదిగుచ్చాలి.
చివరగా, నేటి విద్యావ్యవస్థలోని భావ దారిద్య్రానికి ఒక ఉదాహరణ... 
‘స్ట్రీట్‌ చిల్డ్రన్‌’. 
తెలుగు వాచకంలో తెలుగు పాఠానికి ఆంగ్లంలో పేరు!!!


వెనక్కి ...

మీ అభిప్రాయం