అక్షరమూర్తులు... చైతన్యదీప్తులు

  • 50 Views
  • 0Likes
  • Like
  • Article Share

    కాత్యాయనీ విద్మహే

  • వరంగల్ 
  • 9440550379
కాత్యాయనీ విద్మహే

పితృస్వామిక సమాజ సంస్కృతిలో పాతివ్రత్యం ఒక విలువ గల గుణం. ఆ గుణంతోనే గుర్తింపు. అయితే, ప్రజాస్వామిక సంస్కృతిలో స్త్రీ విశిష్టత పురుషుడితో సమానంగా, ఆత్మ గౌరవంతో జీవించటానికి పడే ఆరాటం నుంచి చేసే పోరాటం ద్వారా రూపొందుతుంది అని గుర్తించాలి. కనుక గుణం అంటే జీవితాన్ని ముందుకు నడిపించే మూలశక్తి. అది పాత వ్యవస్థలతో, విలువలతో సంఘర్షణగానూ, కొత్త వ్యవస్థల, విలువల నిర్మాణానికి సంసిద్ధతగానూ ఉంటుంది. ఈ విధమైన పురోగామి దృక్పథం గల స్త్రీ పాత్రలు తెలుగు సాహిత్యంలో ఇతిహాసమైన మహాభారతంలోని ద్రౌపది నుంచి ఆధునికేతిహాసమైన రాగో నవలలోని రాగో వరకు పద్దెనిమిది పాత్రల వరకు ఉన్నాయి.
      వీటిలో నాలుగు ప్రాచీన సాహిత్యంలోవి. మిగిలిన 14లో గురజాడ వారి పూర్ణమ్మ, శివసాడక చంద్రమ్మ కవిత్వ పాత్రలు కాగా మధురవాణితోపాటు కాళ్లకూరి వారి కాళింది, కమల కాటక పాత్రలు. ఇక మిగిలిన తొమ్మిది స్త్రీ పాత్రలు నవలా సాహిత్యానికి చెందినవి.
స్వతంత్ర వ్యక్తిత్వం
మహాభారత కథాగమనానికి అత్యంత కీలకమైన పాత్ర ద్రౌపది. స్వతంత్రంగా ఆలోచించడం, స్వేచ్ఛగామాట్లాడటం, ఆత్మగౌరవ చైతన్యంతో ప్రవర్తించడం ద్రౌపది వ్యక్తిత్వంలో ముఖ్యాంశాలు. కౌరవులు పాండవులకు చేసిన అపకారాలకు, తనకు చేసిన పరాభవాలకు తగిన ప్రతిక్రియను ఆమె ఆశించింది. ప్రతి క్రియకు కావాల్సిన ఉత్సాహశక్తి నిరంతరం పాండవుల్లో ప్రజ్వలించటానికి ఉత్ప్రేరకంగా పనిచేయటంలో పన్నెండేళ్ల అరణ్యవాస కాలాన్ని, ఒక ఏడాది అజ్ఞాతవాస కాలాన్ని వ్యూహాత్మకంగా ఉపయోగించుకొన్న ధీశాలి ద్రౌపది. కౌరవులపై పాండవుల విజయం వెనుకని ఉన్న శక్తి ద్రౌపది. సంఘర్షించడం, వాదించడం, ప్రతిఘటించడం, సహించడం- ఇంట్లోనే కాదు సభల్లోనూ ద్రౌపదిలోని సజీవ లక్షణాలు. అవే ఆమెను విశిష్ట వ్యక్తిగా నిలబెట్టాయి.
      తన భర్తను తానే ఎన్నుకొన్న స్వతంత్రురాలు రుక్మిణి. ఇంటికి వచ్చి వెళ్లే బంధు జనుల వల్ల కృష్ణుని రూపబలగుణాదులు విని పెళ్లి శిశుపాలునితో చేయాలని తలపెడితే దాన్ని భగ్నం చేసి తన నిర్ణయాన్ని అమలు చేయటానికి తనంతటతానే పథకం రచించింది. తనను కృష్ణుడు ఎక్కడ కలిసి ఎలా తీసుకెళ్లాలో ఒక బ్రాహ్మణుడి ద్వారా కబురు పంపింది. కుటుంబాధికారానికి, అన్న అధికారానికి తలవొగ్గి మనసు చంపుకొని జీవించడం కాక ధిక్కారంతో తన జీవితం మీద తన సాధికారతను నిశ్శబ్దంగా అమలు చేసుకొన్న స్త్రీ రుక్మిణి. ఈ విశిష్ట గుణం వల్లనే మన సంస్కృతిలో మధ్య తరగతి అక్షరాస్య మహిళా వర్గానికి రుక్మిణి ఆదర్శనమూనా అయింది. పెళ్లిళ్లకు ఎన్నో అవరోధాలు ఎదుర్కొంటున్న ఆడ పిల్లలకు ‘రుక్మిణీ కల్యాణం’ పాఠం అయింది ఆ క్రమంలోనే.
      వ్యక్తిగతమైన కుటుంబం స్త్రీ ప్రపంచం- అన్న హద్దును దాటి పురుషులది అయిన సామాజిక జీవితంలోకి ప్రవేశించిన పాత్రగా సత్యభామ విశిష్టత గమనించదగింది. ఆమె వివాహంలో పెద్ద విశేషం లేదు. శ్రీకృష్ణుడిని ప్రసన్నుడిని చేసుకోవడం కోసం ఆమె తండ్రి శమంతక మణితోపాటు కృష్ణుడికి సత్యభామను ఇచ్చి పెండ్లి చేశాడు అంతే. అయితే ఆ తరువాత సత్యభామ చొరవతో శ్రీకృష్ణుని దగ్గర చనువు సంపాదించిందని- శ్రీకృష్ణుడు నరకాసురునిపైకి యుద్ధానికి పోతున్నప్పుడు తాను వస్తాననటాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.
‘‘దేవా నీవు నిశాట సంఘములనుద్దీపించి చెండాడ నీ
ప్రావీణ్యంబుల సూడఁ గోరుదుఁ గదా’’- అని అతని ప్రజా ప్రపంచంలోనూ తనకు భాగస్వామ్యం ఉండాలని కోరుకుంది. ‘‘నేఁజూచి యేతెంచి నీ దేవీ సంహతికెల్లఁ జెప్పుదు భవద్దీప్త ప్రతాపోన్నతుల్‌’’ (భాగవతం- దశమస్కంధం, ఉత్తరభాగం, 151) అని తన రాక వల్ల ఉండే ప్రయోజనం గురించీ చెప్పింది. యుద్ధరంగంలో శ్రీకృష్ణుడికి బాసటగా నిలిచి ‘వీరనారి’గా స్వతంత్ర అస్తిత్వాన్ని ప్రకటించడం అనే అదనపు ప్రయోజనాన్ని సాధించుకొంది. పురుషులదిగా చెప్పబడే సామాజిక రాజకీయ రంగాల్లో భాగస్వామ్యం ద్వారానే స్త్రీ కుటుంబంలో గౌరవాన్ని పొందగలదని గ్రహించి తదిభిముఖంగా ఆచరణ కార్యక్రమాన్ని రూపొం దించుకోవటం సత్యభామ పాత్రలోని విశిష్టత.
      పెళ్లితో పుట్టింటికి పరాయివాళ్లుగా మారిన ఆడవాళ్లు దాన్నే సహజధర్మంగా భావించి బతికే శిక్షణను పొందుతారు. పెళ్లైన ఆడపిల్లకు పుట్టింటి బాధ్యత ఏ మాత్రం స్వీకరించదగింది కాదనే అభిప్రాయమే ఇంకా రాజ్యమేలుతుంది. అన్నదమ్ములున్న ఆడపిల్లల విషయంలో దాని ప్రభావం మరీ ఎక్కువ. దీనికి అపవాదుగా, ఆశాదీపంగా కనిపించే స్త్రీ పాత్ర నిగమశర్మ అక్క. పాండురంగ మాహాత్మ్యం తృతీయాశ్వాసంలో నిగమశర్మ కథ ఉంది. చెడిపోయిన బ్రాహ్మడు. చెడి తిరుగుతున్న తమ్ముని జీవితాన్ని, తమ్ముని దుష్ప్రవర్తన వల్ల చెడిపోయిన పుట్టింటి సంసారాన్ని చక్కదిద్దటానికి తనంతట తాను భర్తను బిడ్డలను తీసుకొని పుట్టింటికి వచ్చిన బాధ్యత తెలిసిన, అమలు చేసుకోగల వివేకం ఉన్న ఇల్లాలు నిగమశర్మ అక్క. దిగులుపడ్డ తల్లిదండ్రులను ఓదార్చటం, క్షీణించిన ఆర్థిక పరిస్థితులను చక్కబెట్టడం, భర్త నిరాదరణకు గురైన మరదలి కోసం బాధపడటం ఇవన్నీ ఆమెలోని సుగుణాలు. వేశ్యాలంపటుడై వైదిక కర్మ మార్గం తప్పి సంసారం శిథిలం చేసిన తమ్ముని ప్రవర్తనను చక్కదిద్దాలన్న ఆమె సంకల్పం జీవితాన్ని ఒకడుగు ముందుకు నడిపించేది. ఆక్రమంలో ఆమె తీసుకొన్న పుట్టింటి బాధ్యత, తాను చేపట్టిన బాధ్యతలో గ్రంథాలయ సంరక్షణ భారం అప్పజెప్పటం ద్వారా భర్తను భాగస్వామిని చేసిన తీరు, గృహిణిగా స్త్రీ జీవితాన్ని పరిధుల నుంచి విముక్తం చేసి ముందుకు నడిపించినవే. స్వయం నిర్ణయశక్తి, ఆర్థిక వ్యవహారాలను సైతం చక్కబెట్టగలిగిన క్రియాశక్తి నిగమశర్మ అక్కను తెలుగు సాహిత్యంలో విశిష్టంగా నిలిపాయి.
చరిత్రను తిరగ రాసే శక్తి
ఆధునిక స్త్రీ అస్తిత్వంలో ఉన్న భూస్వామ్య సామాజిక శక్తులతో, విలువలతో సంఘర్షించిన తీరు సామాన్యమైంది కాదు. దీనిని బీజరూపంలోనే గుర్తించిన లోచూపు వల్ల, దాని పరిణామాలను దర్శించగల దూరదృష్టి వల్ల గురజాల అప్పారావు ఆధునిక మహిళ చరిత్రను తిరగ రాస్తుందని 1910 నాటికే నమ్మకంగా చెప్పగలిగాడు. ఆయన సృష్టించిన మధురవాణి, పూర్ణమ్మ ఆధునిక యుగ సాహిత్యంలో తొలి విశిష్ట స్త్రీ పాత్రలు. మధురవాణి కన్యాశుల్కం నాటకం మొత్తాన్ని తన చుట్టూ తిప్పుకొంటే ఆ కన్యాశుల్కం సమస్య పట్ల బాధిత స్త్రీ ఆంతర్యానికి అభివ్యక్త రూపం పూర్ణమ్మ.
      మధురవాణి వేశ్య. ఆ వర్గాన్ని సమాజం ఒక మూలకు నెట్టివేసింది. కనుకనే ప్రధాన స్రవంతిలో ఉన్న  సామాజిక వ్యవస్థల డొల్లతనం, విలువల క్షీణత ఆమెకు బాగా అర్థమయ్యాయి. తన వృత్తి నేర్పిన లౌకిక జ్ఞానం, వృత్తికి అవసరమైన మాట పదును మధురవాణి ఒక సామాజిక విమర్శకురాలిగా ఎదగటానికి ఉపకరించాయి. నిస్సహాయులైన స్త్రీల పక్షాన నిలబడటం, ఆ స్త్రీల ప్రయోజనాల కోసం పని చేయటం మధురవాణిలోని ప్రత్యేక గుణం.
      వేశ్య అని తనను చులకనగా చూసే చిన్నబుద్ధుల పెద్దమనుషులను సహించలేని- ఆత్మగౌరవ గుణం మధురవాణి పాత్రను సాహిత్య చరిత్రలో శాశ్వతం చేసింది. వేశ్యను సామాజిక చెడుగుకు కారణంగా నిందితురాలిగా నిలబెట్టిన సమకాలపు సంస్కరణోద్యమపు తీరుపై తిరుగుబాటు జెండా మధురవాణి. ‘సాని దానికి మాత్రం నీతి ఉండొద్దా’ అని నాటకం ప్రారంభంలో రామప్ప పంతులుతో అన్న మధురవాణి నాటకం చివరలో సౌజన్యారావు పంతులుతో ‘చెడనివారిని చెడగొట్టవద్దని మా తల్లి చెప్పింది’ అంటుంది. చెడని వారిని చెడగొట్టక పోవటమే ఆ నీతి. నిజానికి చెడిపోయిన వారే తన దగ్గరకు వస్తారు కానీ ఆమె గట్టుకొని పోయి ఎవరినీ చెడగొట్టదు. మగవాళ్లని చెడగొడుతున్నారని సమాజం ఏ వేశ్యలను దోషులుగా వేలుపెట్టి చూపిందో వారికి ప్రతినిధిగా మధురవాణి అసలు దోషులు పురుషులేనని చెప్పినట్లయింది. యాంటినాచి ఉద్యమం మీద ఆమెకు ఉన్న కోపం అంతా ‘శ్రీకృష్ణుడు ఆంటీనాచి కాడా అండి’ అన్న ప్రశ్నలో ధ్వనిస్తుంది.
      కన్యాశుల్కం నాటకంలో ఆ సమస్యకు బలైన బుచ్చమ్మ, మీనాక్షీ ఉన్నారుకానీ బాధితులుగా ఆ స్త్రీల అంతరంగం అంతగా అక్కడ బహిర్గతం కాలేదు. ఆ సమస్యను సమస్యగా వాళ్లు ఏ మేరకు గుర్తించారో కూడా తెలీదు. ఆ లోటును పూరించటానికి పుట్టిన పాత్ర పూర్ణమ్మ. నెనరూ, న్యాయం విడనాడి తల్లీ తండ్రి కన్యాశుల్కానికి ఆశపడి వృద్ధునికిచ్చి  చేసిన పెళ్లిని నిరాకరించగల వయసూ, అవకాశం లేకపోయినా ఆ పెళ్లికి దుఃఖించింది. ముసలి భర్తకు భార్యగా కాపురానికి పోవాల్సి వచ్చేసరికి ఈడూ జోడూ కానీ సంసారం చేయటం కంటే, అతను మరణిస్తే వితంతువుగా జీవించటం కంటే మరణించడమే మేలన్న నిర్ణయానికి వస్తుంది. పరిస్థితులను మార్చలేని నిస్సహాయ స్థితిలో తనకు పెళ్లి పేరు మీద జరిగిన అన్యాయంపై నిరసనగా ఆత్మహత్య చేసుకొంది. ‘‘నలుగురు కూచుని నవ్వే వేళల/ నాపేరొకతరి తలవండి/ మీమీ కన్నబిడ్డల నొకతెకు ప్రేమను నా పేరివ్వండి’’ అని అన్నదమ్ములకు చెప్పిన అంతిమ వాక్కులు ఆమెలోని గాఢమైన జీవితేచ్చకు నిదర్శనం. 
      1920 నాటికి కన్యాశుల్కం స్థానంలోకి వచ్చిన వరకట్నం సమస్య స్త్రీల జీవితాలకు ఒక సవాలైంది. స్త్రీలు ఆ సవాలును ఎలా ఎదుర్కొన్నారో చూపించే ‘వరవిక్రయం’ నాటకం కాళ్లకూరి నారాయణరావు రాశారు. అందులో కాళింది, కమల జీవితంపై ప్రభావం నెరపిన పాత్రలు. జాతీయోద్యమ నేపథ్యం, అందివచ్చిన చదువు వాళ్లిద్దరినీ ఆలోచనాపరులుగాను తమ జీవితానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోగల వారిగానూ తయారు చేసింది. ‘ప్రాణములనైన విడిచెదం గాని యడిగిన విత్తమిచ్చి/ వరుని గొని తెచ్చినట్టే వివాహమునకు సమ్మతింపనని ప్రతిజ్ఞ తీసుకోగలిగిన స్థిరసంకల్పం కాళిందిలోని గుణం. తన ఆత్మగౌరవానికి, వ్యక్తిత్వానికి భంగకరమైన సమస్యగా వరకట్నాన్ని చూడటం ఆమెలోని చైతన్య లక్షణం. ఆ చైతన్య  లక్షణం వల్లనే కట్నం తీసుకొనే గాడిదతో కాపురం చేయలేనని తన ప్రతిఘటనకు మరో దోవ లేక ఆత్మహత్య చేసుకుంది. జాతీయోద్యమ రాజకీయాలు కట్నం వంటి స్త్రీ సమస్యలను పట్టించుకోకపోవడం గురించి కాళింది విసిరిన సవాల్‌ దేశమాత విముక్తి కోరే స్త్రీవిముక్తి గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని గుర్తు చేసింది. ప్రతి రాజకీయ ఉద్యమ సందర్భంలోనూ కాళింది ప్రశ్న ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. కాళింది మరణం నుంచి చెల్లెలు కమల జీవిస్తూ పోరాడాలి అన్న గుణపాఠాన్ని నేర్చుకొంది. స్త్రీలకు అవమాన హేతువైన వరశుల్కాది దుచారాలున్న సమాజం పట్ల కాళిందికి ఉన్న ‘కసి’ని తన ఆయుధంగా మలచుకోవటం కమలలోని విశిష్టత. తమదైన వ్యూహంతో ఎవరికి వారు సమస్యలపై పోరాడటమే జీవితాన్ని అభివృద్ధికరంగా మలుస్తుంది.- అని తన ఆచరణ ద్వారా చూసిన కమల మధ్య తరగతి మహిళా చైతన్యాన్ని పెంచే ఒక ఉత్ప్రేరకం.
పరిణత రూపాలు
1940 నుంచి 1990 వరకు 50 ఏళ్ల కాలం ఎగువ మధ్య తరగతి మహిళలు వ్యక్తిగత స్థాయిలో సంఘర్షణలకు దిగి తమ జీవితాలను గౌరవప్రదంగా ఉండేటట్లు తీర్చిదిద్దుకునే దిశగా తమ చైతన్యస్థాయిని వికసింపచేసుకోవటాన్ని చూస్తాం.  ఆ క్రమాన్ని ప్రతిఫలించే విధంగా తెలుగు నవలా సాహిత్యంలో విశిష్ట స్త్రీ పాత్రలు రూపొందాయి. సరోజ డైరీ (1944)లోని సరోజ, కొత్త కోడలు (1962)లోని సరోజిని ఒకరి కన్నా మరొకరు పరిణత రూపం. ఇద్దరూ పెళ్లి విషయంలో పెద్దల అధికారాన్ని తిరస్కరిస్తూ తమ జీవితాన్ని తాము నిర్మించుకొన్న వాళ్లు. సరోజ యుద్ధం తల్లితోనైతే సరోజిని యుద్ధం మొత్తంగా పూర్వకాలపు పద్ధతిపైన. కట్టుబొట్టు దగ్గర నుంచి మాటామంతీ వరకు అన్నింటిలో తన జీవితాన్ని శాసించే తల్లి దగ్గర ఊపిరాడని సరోజ తల్లి ప్రమేయం లేకుండా తాను ఒక యువకుడిని ఇష్టపడి పెళ్లాడిన తీరు, పెత్తనాల నుంచి విముక్తికి, స్వతంత్రంగా జీవితాన్ని నిర్మించుకోవటానికి చేసిన సరళ సుందర సహజయత్నం ఆ పాత్రను మనకు గుర్తుండిపోయేలా చేస్తాయి.
      ఇక సరోజిని- పిల్లవాడి తల్లిదండ్రులు, పిల్ల తల్లిదండ్రులు కలిసి పెళ్లి సంబంధాలు స్థిరపరిచే పూర్వకాలపు పద్ధతికి స్వస్తి చెప్పి తనదైన కొత్త పద్ధతిలో తన కాలపు పద్ధతిలో తన జీవితాన్ని తాను నిర్మించుకొంది. తానుగా వచ్చి వరుని ఇంట్లో వాళ్లను పరిచయం చేసుకొని వాళ్ల ప్రవర్తనలను పరిశీలించి వాళ్లు స్నేహం చేయదగినవాళ్లని నిర్ణయించుకొని తమ పెళ్లికి అధికారంతో, అనవసరపు అహంకారంతో అడ్డుగా ఉన్న అత్తగారిని విమర్శిస్తూ, ధిక్కరిస్తూ, లాలిస్తూ జయించిన తీరు సరోజినిని ఒక నిజమైన ఆధునిక యువతిగా గుర్తుండిపోయేలా చేస్తుంది.
      కొడవటిగంటి కుటుంబరావు సృష్టించిన స్వరాజ్యం (సవతి తల్లి 1954) పాత్ర కూడా ఈ సందర్భంలో చెప్పుకోదగ్గది. ఒక పురుషుడికి రెండో సంబంధపు భార్యగా గృహప్రవేశం చేసిన ఆమె సవతి తల్లిగా అత్తను ఆడబిడ్డను ఎదుర్కొని తన స్థానాన్ని నిలబెట్టుకోవటానికి పిల్లల భవిష్యత్తును ఆరోగ్యకరంగా తీర్చిదిద్దటానికి చేసిన పోరాటం ఈ నవలకు వస్తువు. ‘సవతి తల్లి’ అన్న మాయను బద్దలుకొట్టే ప్రయత్నంలో స్వరాజ్యం సాధించిన విజయమే ఆమెను విశిష్ట పాత్రగా నిలబెడుతుంది. సరోజ, సరోజిని, స్వరాజ్యం మూడూ కొడవటిగంటి సృష్టించిన పాత్రలే అయినా ఆయన అభిమానం స్వరాజ్యంపై కంటే సరోజ/ సరోజినిల మీదే ఒక పాలు ఎక్కువ. స్వరాజ్యాన్ని ఆయన గౌరవిస్తాడు. శిథిలమౌతున్న సామాజిక దుర్మార్గాలతో సంఘర్షించినందుకు సరోజను కానీ, సరోజినీని కానీ జీవితాన్ని ప్రజాస్వామికీకరించుకొనేందుకు కొత్త పద్ధతులను అవలంబించినందుకు అభిమానిస్తాడు.
      1957లో పి.శ్రీదేవి రాసిన కాలాతీత వ్యక్తులు నవలలోని కల్యాణి, ఇందిర కొడవటిగంటి పాత్రలో సరోజ/ సరోజినిల కన్నా మరింత అభివృద్ధి రూపాలు. ఆర్థిక స్వాతంత్య్రాన్ని కోరుకొనే ఆధునిక స్త్రీలు వీళ్లు. అందువల్ల పోషణకు భర్త, పెళ్లి అని వాళ్లనుకోరు. అలాగే వాళ్లు తమకంటూ ఒక సాంఘిక స్థాయి కోసం ఇంటి బయటకు వచ్చిన స్త్రీలు. తమ జీవితానికి తాము బాధ్యత వహించే వ్యక్తిత్వం అభివృద్ధి పర్చుకొన్న వాళ్లు. ఆ క్రమంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొంటూ తమదైన పరిష్కారాలు ఎన్నుకొంటూ జీవిస్తున్న వాళ్లు. పెళ్లి వల్ల ఏదో సాంఘిక హోదా తమకు లభిస్తుందన్న భ్రమలు కూడా వాళ్లకు లేవు. తమ మీద తమకు తప్ప మరెవరికీ హక్కు లేదన్న స్వాభిమాన చింతన వాళ్లది. భర్త అన్న హోదా వెంట అధికారం అనుసరించి ఉంటుందని తెలిసిన వాళ్లు. తమను ఇష్టపడ్డ వాళ్లను తాము కూడా పరిశీలించి ఫరవా లేదనుకొనే వివాహానికి సిద్ధపడ్డా ఇద్దరూ తమ జీవిత భాగస్వాములకు ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యక్తిత్వాన్ని చంపుకోలేమని  సంకేతాలిచ్చారు. తమ అవసరాలను గౌరవించడం, తమ ఇష్టాలకు తమను వదిలితేనే చేస్తే పెళ్లి స్త్రీ, పురుషులిద్దరికీ సుఖం అవుతుందని చెప్పగలిగిన ఆధునిక స్త్రీలు కల్యాణి, ఇందిర. పూర్తిగా తమ జీవితాన్ని తమ చేతుల్లోకి తీసుకొని నిర్మించుకొన్న చొరవ, ఆత్మగౌరవ చైతన్యం వాళ్లను విశిష్ట పాత్రలుగా నిలబెట్టాయి.
      కాలాతీత వ్యక్తులు నవల వచ్చిన 30 ఏళ్లకు 1987లో ఓల్గా ‘స్వేచ్ఛ’ నవల వచ్చింది. కల్యాణి, ఇందిర వంటి వ్యక్తిత్వ చైతన్యం ఉన్న ఆధునిక స్త్రీల ఆకాంక్షలకు భర్తనుంచి ఆశించిన స్నేహానికి, కుటుంబంలో సమానత్వానికి విఘాతం కలిగినప్పుడు ఏమి చేసే అవకాశం ఉందో ఈ నవలలో అరుణ అదే చేసింది. తన జీవితం మీద తన హక్కు కోసం ఆ హక్కును నిరాకరించే కుటుంబాన్ని వదిలింది.
      కాలాతీత వ్యక్తులు నవలకు, స్వేచ్ఛ నవలకు మధ్య వచ్చిన మరొక నవల రంగనాయకమ్మ రాసిన స్వీట్‌హోం (1965). ఈ నవలలో ‘విమల’ పాలగుమ్మి పద్మరాజు మాటల్లో చెప్పాలంటే స్త్రీత్వంలోని రంగు, రుచి, మెరుపు, తళుకు, చురుకు, మృదుత్వం, అన్నీ కలగలిపిన అపురూప సృష్టి. ‘స్త్రీత్వం’ సౌందర్యానికో, గృహిణీత్వానికో, మాతృత్వానికో సంబంధించిది కాదు. తాను స్త్రీని, ప్రత్యేక వ్యక్తిని అన్న నిరంతర చైతన్యంతో ప్రవర్తించగలగటం, తాను లోపల ఏమనుకొంటుందో అదే బయటకు అనగలగటం, తాను ఆశించేది ఆచరణ వాస్తవం చేసుకొనేందుకు ప్రయత్నించటం విమలను చైతన్యంతో ఉంచిన అంశాలు. స్త్రీ సహజ లక్షణాలుగా సమాజం నిర్దేశిస్తున్న విలువలను తిరస్కరించటంలోనే విమల ఉనికి. విమల భర్త పట్ల అనురక్త. కానీ స్వేచ్ఛా స్వాతంత్రాలు, ఆత్మగౌరవం కోల్పోయి భర్తకు నీడగా అధీన జీవితాన్ని దయాధర్మ భిక్షంగా అనుభవించే పతివ్రత మాత్రం కాదు. స్త్రీని భార్య అన్న చట్రంలో ఇమిడ్చి జీవచ్ఛవంగా చేసే విలువలన్నింటినీ ఆమె తిరస్కరిస్తుంది. స్వీయ వ్యక్తిత్వంతో సహజంగా తనకు తోచినట్లు జీవించటం ఆమె అలవర్చుకొన్న కళ. విమల న్యాయదృష్టి, వాగ్ధాటి, అందులోని చమత్కారం, తర్కం, వెక్కిరింత పాఠకులను ముగ్ధులను చేసి ఆమెకు అభిమానులుగా మార్చాయి. 70ల కాలంలో స్వీట్‌హోం విమల తిరుగుబాటుతత్వం గలిగిన స్త్రీలకు ఆదర్శపాత్ర. 
      విమలకు ప్రాగ్రూపంగా 1944లో మునిమాణిక్యం నరసింహారావు సృష్టించిన ‘కాంతం’ కనబడుతుంది. భావకవిత్వంలో ఎంకి, ఆధునిక వచన సాహిత్యంలో ‘కాంతం’ ప్రత్యేక గౌరవాన్ని గుర్తింపును పొందిన స్త్రీలు. విమలకు ముందు తరం స్త్రీ కాంతం. విమలకు తల్లి కాగలిగిన తరం. ఇల్లు చక్కదిద్దుకొనే అతి సాధారణ గృహిణే అయినా భర్తతోటి సంబంధంలో ఆమె చొరవ, చనువు, చమత్కారం అసాధారణ స్త్రీ పాత్రగా కాంతాన్ని నిలబెట్టాయి. కాంతానికైనా విమలకైనా జీవితం కుటుంబానికి పరిమితమైందే. అయితే ఆ జీవితాన్ని సహజ సుందరంగా జీవించటానికి అవసరమైన వ్యక్తిత్వ ప్రకర్ష వల్ల వాళ్లిద్దరూ పరమ ఆకర్షణీయంగా, ఆహ్లాదకరంగా దర్శనమిస్తారు.
పీడితస్త్రీల విముక్తి
ప్రాచీన సాహిత్య స్త్రీ పాత్రలైనా, ఆధునిక సాహిత్య స్త్రీ పాత్రలైనా- ఇప్పటి వరకు ప్రస్తావించబడిన వాళ్లంతా- ఉన్నత, మధ్య తరగతి, అగ్రవర్ణ స్త్రీలే ఒక్క మధురవాణి తప్ప. శ్రామికవర,్గ దళిత, ఆదివాసీ స్త్రీల జీవితానుభవాలు, ఆకాంక్షలు ఇంతకంటే భిన్నంగా ఉండే వీలుంది. తెలుగు సాహిత్యంలో అలాంటి స్త్రీలకు ప్రతినిధులుగా చంద్రమ్మ, సాధన నవలలోని రాగో చాలా బలమైన వ్యక్తిత్వంతో కనపడతారు. వ్యవసాయ కార్మికుని భార్య కావటం వల్ల భూస్వామి లైంగిక అత్యాచారానికి గురైన స్త్రీ చంద్రమ్మ. ఆ క్రమంలో భర్తను కోల్పోయింది. దీనికంతటికీ కారణమైన భూస్వామిని చంపి సమస్య అక్కడితో పరిష్కారం కాదని, భూస్వామ్య వ్యతిరేక విప్లవోద్యమాన్ని తన వంతుగా బలోపేతం చేయడానికి,  తనలాంటి పీడిత స్త్రీల విముక్తికి అదే సరైన మార్గంగా ఎంచుకొని వెళ్లింది. గురజాడ పూర్ణమ్మ గృహహింసను ఎదుర్కొంటే శివసాగర్‌ చంద్రమ్మ భూస్వామ్య హింసను ఎదుర్కొంది. వృద్ధుడిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చినందుకు బాధ పడుతూ అన్యోన్న దాంపత్యానికి అవకాశం లేని పూర్ణమ్మ కౌటుంబిక దుర్మార్గం పట్ల కసితో ఆత్మహత్య చేసుకుంది.  పూర్ణమ్మ నిరసన రూపమైతే చంద్రమ్మ ప్రతిఘటన సారం.
      పూర్ణమ్మకు లాగానే రాగోదీ ఇష్టం లేని పెళ్లి. ఆడవాళ్ల ఇష్టంతో సంబంధం లేని నిర్బంధ దాంపత్యాలను శాసించే ఆర్థిక సూత్రాలు ఆదివాసుల్లోనూ ఉన్నాయి. అవి పురుషుల చేతిలో ఉన్నాయి. కనుక కుటుంబంలో స్త్రీ ఒంటరి పోరాటం పూర్ణమ్మకు తప్పలేదు. రాగోకూ తప్పలేదు. పీడక వ్యవస్థగా మారిన కుటుంబం నుంచి వైవాహిక బంధనాల నుంచి విముక్తి, స్వేచ్ఛగా మానవ సంబంధాలను నిర్మించుకోటానికి ఉన్న సమస్త అడ్డంకులను కూలదోసి పంజరం పగులగొట్టిన చిలక లాగా జీవించటం కోసం అన్వేషణ రాగోది. సమస్య తన ఒక్కదానిదే కాదు, ఆదివాసీ స్త్రీలందరిది అన్నవిషయం ఆ అన్వేషణలో ఆమెకు అర్థమైంది. ఆ సమస్యకు పరిష్కారం విప్లవోద్యమం ఇస్తుందన్న విశ్వాసాన్ని సహజీవనానుభవం నుంచి పొంది ఉద్యమ నిర్మాణంలో, నిర్వహణలో భాగస్వామి కావటం రాగో పాత్రలోని విశిష్టత.
      మధురవాణి నుంచి రాగో దాకా స్త్రీలు విడిచి వచ్చిన మార్గమంతా కంటకాలను తొలగించుకొనే పని. స్వేచ్ఛా స్వాతంత్రాల్యకు, సమాన న్యాయం కోసం, ప్రజాస్వామిక విలువల జీవితమే పోరాటంగా జీవించిన స్త్రీలు, మరణమే పోరు మార్గంగా ఎంచుకొన్న స్త్రీలు, స్వీయ విముక్తి సామాజిక, రాజకీయ, ఆర్థిక పోరాటాల్లో భాగస్వామ్యం ద్వారానే సాధ్యమవుతుందని గ్రహించి స్త్రీలు - అందరూ ఒకలాగే ఒక ఊరేగింపు తీసినట్లుగా అనిపిస్తుంది తెలుగు సాహిత్యంలోని విశిష్ట స్త్రీ పాత్రలను స్మరించుకుంటే...


వెనక్కి ...

మీ అభిప్రాయం