పుస్తకాల వనంలో విహరించిన వేళ

  • 500 Views
  • 0Likes
  • Like
  • Article Share

పుస్తకం.. అక్షరాల కోవెల, అవని చరితకు ఆనవాలు, జ్ఞానానికి దివిటీ, జీవన గమనానికి మార్గదర్శి! బుద్దుడు నువ్వయితే, బోధివృక్షం నేనవుతా, జ్ఞాన సముపార్జన నీ లక్ష్యమైతే, నన్నాశ్రయించడం నీ కర్తవ్యం అంటుంది పుస్తకం. ఈ మహత్తర సత్యాన్ని చాటేవే పుస్తక మేళాలు. అక్షరమాల నుంచి అంతరిక్షం వరకు, స్థానికం నుంచి అంతర్జాతీయం వరకూ... నిన్నటినుంచి నేటివరకూ, నేటినుంచి రేపటి కొరకూ... మేధోమథనాలు, అనేక వాదాలు, కథలూ, ఆత్మకథలూ, వ్యక్తులూ, వ్యక్తిత్వాలూ, సిద్ధాంతాలు ఒకటా రెండా, లక్షల పుస్తకాలు కొలువైన వనాలు హైదరాబాద్‌, విజయవాడ పొత్తాల జాతరలు.
సాహిత్యంలోని సమస్త రూపకాలు కొలువైన హైదరాబాదు పొత్తాల జాతర పుస్తక ప్రియులకు పండగనే తలపించింది. ఈ పొత్తాల జాతర ఎప్పటిలాగే ఈ సారి కూడా అట్టహాసంగా మొదలైంది. 2015 చివరి మాసంలో 18నుంచి 27 వరకూ జరిగిన 29వ పొత్తాల జాతర చిన్నారుల నుంచి పెద్దవాళ్ల వరకూ అందరినీ అలరించింది. పది రోజులూ జాతరంటే ఇదే అనే రీతిలో నవతరం రాకతో అలరారింది. మేళాకు వేదికగా నిలిచిన ఎన్టీయార్‌ స్టేడియం. రోజుకో ఆప్‌ పుట్టుకొస్తున్న ఈ రోజుల్లో, చేతిలో పుస్తకం కన్నా, పుస్తకమంత సెల్‌ఫోన్‌ ఉండటమే గౌరవంగా భావించే తరంలో పుస్తకం విలువా తగ్గలేదని నిరూపించింది ఈ జాతర. జనజీవనం వేగంగా వెళుతుంటే పుస్తకం చదివే తీరికెక్కడుందని ప్రశ్నించేవారిని చూసి, కవులు, రచయితలు ప్రచురణకర్తలు పడుతున్న ఆవేదనకి మందే ఈ పుస్తక ప్రదర్శన. దీనికి తెలుగు రాష్ట్రాలనుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్రల నుంచి కూడా ఆయా భాషల పుస్తకాలు ఇక్కడ కొలువుదీరాయి. ఈసారి ప్రదర్శనలో 371 స్టాళ్లను ఏర్పాటుచేశారు. కిందటేడు కంటే డెబ్భై అదనం. దేశం నలుమూలల నుంచీ దాదాపు మూడువందలకు పైగా ప్రచురణ సంస్థలు ఇందులో పాల్గొన్నాయి. రచయితలు తమ పుస్తకాలు తామే స్వయంగా విక్రయించుకునేందుకు రెండువేల రూపాయల రుసుముతో అవకాశం కల్పించారు.
తెలుగుకే పట్టం
అనేక భాషల పుస్తకాలు ఉన్నా తెలుగుకే తొలి ప్రాధాన్యం ఇచ్చారు నిర్వాహకులు. 170 స్టాళ్లను తెలుగు పుస్తకాలకి కేటాయించారు. తెలుగు తర్వాత ఆంగ్ల పుస్తకాలకి ఎక్కువ స్టాళ్లు దక్కాయి. ఇవేకాక తమిళం, మలయాళం, హిందీ, ఉర్దూ, కన్నడ, మరాఠీ పుస్తకాలు మిగతా స్టాళ్లని అలంకరించాయి. క్రితంసారి ఆరు లక్షలమంది దాక వస్తే, ఈసారి సుమారు పదిలక్షల మంది వరకూ పుస్తక ప్రియులు సందర్శించారన్నది నిర్వాహకుల మాట.
తెలంగాణమే ప్రత్యేకత
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఇది రెండో ప్రదర్శన. ఈ ప్రాంగణానికి తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్‌ పేరుపెట్టారు. ఈసారి పుస్తకాల అమ్మకాలలో ఆసక్తికరమైన మార్పు చోటుచేసుకుంది. రాష్ట్ర ఏర్పాటు మూలంగా మారిన రాజకీయ సమీకరణాలు, పెరిగిన చారిత్రక అంశాలు, పోటీపరీక్షల నిమిత్తం యువత తెలంగాణ చరిత్ర, సామాజిక పరిస్థితులకు సంబంధించిన పుస్తకాలు ఎక్కువగా కొన్నారు. టీఎస్‌పీఎస్సీ వరసగా నియామకాలు చేపడుతున్న నేపథ్యంలో పోటీ పరీక్షల పుస్తకాలకు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. ముఖ్యంగా తెలంగాణ సాహిత్యం, చరిత్ర పుస్తకాలు ఎక్కువగా ఆదరణ పొందాయి.
మహిళా రచయితలు..
మరో ప్రత్యేకత మహిళల రచనలు. నేటి పరిస్థితుల్లో మహిళలు రాసిన సాహిత్యానికి ఆదరణ తగ్గుతోందని భావించిన కొంతమంది రచయిత్రులు దాన్ని నిలబెట్టుకోడానికి నడుం కట్టారు. దానికి నిదర్శనమే ప్రమదాక్షరి. గత సంవత్సరం నలభైమంది రచయిత్రులు ఫేస్‌బుక్‌లో ప్రమదాక్షరి బృందాన్ని ఏర్పరచారు. ఈ బృంద రచయిత్రులే స్వయంగా తమ రచనలు విక్రయించడంతో, పాఠకులకు వీరితో నేరుగా మాట్లాడే అవకాశం కలిగింది. రచయిత్రుల భావాలు. రచనల నేపథ్యాలు తెలుసుకునే అవకాశం దక్కింది. ఇక్కడ కథలు, నవలలు, కవిత్వం, విజ్ఞానం ఇలా అన్ని రకాల పుస్తకాలు విక్రయించారు.
యువలోకం...
యువత ఆధునిక పరికరాలని ఎంత ఆదరిస్తుందో, పుస్తకాలని కూడా అంతే ఆదరిస్తుందనడానికి సాక్ష్యం ఈ పొత్తాలజాతర. ఇంతకుముందు రోజుల్లో కాలక్షేప సాహిత్యం, నవలలు యువత ఎక్కువగా చదివేవారు. కానీ ఇప్పుడు సీరియస్‌ సాహిత్యానికే ఆదరణ పెరుగుతోందన్నది నిర్వాహకుల మాట. అందులో భాగంగానే ఆత్మకథలు, విజయగాథలు, వ్యక్తిత్వ వికాసం, పోటీపరీక్షల పుస్తకాలు అత్యధికంగా అమ్ముడయ్యాయి. వీటితోపాటు సంగీతం, జానపదాలు, కవితల సంకలనాలకు కూడా మంచి ఆదరణ లభించింది. నవతరం పుస్తకాలే కాక పాతతరం రచయితలు బుచ్చిబాబు, గోపీచంద్‌ వంటివారి రచనలకూ ఆదరణ ఉంది. పిల్లలకోసం ఏర్పాటుచేసిన స్టాళ్లు చిన్నారుల సందడితో మురిశాయి. ఉపాధ్యాయులు విద్యార్థులని బడినుంచి సరాసరి ఈ పొత్తపు గుడికి తీసుకొచ్చారు. బాలలు ఎక్కువగా ఆంగ్ల వర్ణమాల, బొమ్మల కథలు, పెద్దబాలశిక్ష, కంప్యూటర్‌ పుస్తకాలు కొనేందుకు ఆసక్తి చూపించారు. వీటితోపాటు ఫొటోషాప్‌, యానిమేషన్‌ కథల సీడీలు కొన్నారు. వాటిలోనూ తెలుగు గేయాలు చేత వెన్నముద్ద, చిట్టి చిలకమ్మ, వినాయక జననం యానిమేషన్‌లు ఎంతో ఉత్సాహంగా కొన్నారు.
ఒక్క పుస్తకం- ఒక స్టాల్‌
ఒకే ప్రచురణ కోసం ప్రత్యేకంగా స్టాల్స్‌ ఏర్పాటు కావడం ఈసారి విశేషం. వాటి సంఖ్య తక్కువైనా ప్రత్యేకంగా నిలిచాయి. సిద్ధాంత గ్రంథాల్లో మహాత్మ జ్యోతీరావ్‌ ఫూలే, అంబేడ్కర్‌ దినచర్య పుస్తకాలు ఎక్కువగా అమ్మకాలు జరిగాయి. మొత్తంమీద ఈసారి వ్యక్తిత్వ వికాస పుస్తకాలు ఎక్కువ అమ్ముడయ్యాయి. ఇతర పుస్తకాలకి వస్తే పురాణాలకి సంబంధించినవి, గ్రీకు పురాణాల పుస్తకాలూ, రైతులకు ఉపయోగపడేవి... రైతుల విజయ గాథలు, వ్యవసాయంలో కొత్త పద్ధతుల మీద వచ్చిన పుస్తకాలు కూడా బాగానే ఆదరణ పొందాయి. విరసం, అరసం బుక్‌ స్టాళ్లలో సామ్యవాద భావజాలంతో పాటు, ఇతర సిద్ధాంతపరమైన పుస్తకాలు యువతను ఆకర్షించాయి. దిల్లీ, ముంబైనుంచి వచ్చిన ప్రచురణ సంస్థలు అమ్మకాల ద్వారా సంతృప్తి చెంది ఏటా వస్తున్నామన్నారు. ఇకమీదట ఎన్టీయార్‌ స్టేడియాన్ని డిసెంబరు 10నుంచి 31 వరకు పుస్తక ప్రదర్శనకు శాశ్వత వేదికగా చేయాలని నిర్వాహకులు ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. కిందటేడాది లాగే ‘పుష్పగుచ్ఛం వద్దు- పుస్తకమే ముద్దు’ అన్న నినాదం ఆకట్టుకుంది.
తోపుడుబండి...
ఈసారి ప్రత్యేకత ఈ తోపుడుబండి స్టాలే. కవిత్వాన్ని ప్రజల చెంతకు చేర్చడానికి షేక్‌ సాదిక్‌ అలీ అనే పాత్రికేయుడు వినూత్నపంథా అనుసరించారు. తోపుడుబండిలో కవిత్వ పుస్తకాలను పెట్టి విక్రయించాడు. అతని ప్రయత్నాన్ని గురించి తెలుసుకున్న గవర్నర్‌ నరసింహన్‌ ఆ బండిని సందర్శించారు. సభలో తన ప్రసంగంలో సైతం ఈ సంగతిని ప్రస్తావించారు. కవులకూ, రచయితలకూ, కవిత్వాభిరుచిగల వాళ్లందరికీ తోపుడుబండి ఓ కూడలిగా మారింది. ఈ పుస్తక ప్రదర్శన కొత్త పుస్తకాల ఆవిష్కరణకూ వేదికగా నిలిచింది. నిర్వాహకులు పుస్తకావిష్కరణలకు తోడ్పాటునిచ్చారు. పుస్తక మేళా ప్రాంగణంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఎందరో ప్రముఖులు విచ్చేసి వివిధ అంశాలపై ప్రసంగించారు. దాదాపుగా అన్నిరోజులూ కవి సమ్మేళనాలు జరిగాయి. ఇదే వేదిక నుంచి రచయితలు పుస్తకాలు ఆవిష్కరణ చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఇలా ఈ సారి 200కి పైగా పుస్తకాలు ఆవిష్కరించారు.
ప్రముఖ నగరాలు, పట్టణాలకే పరిమితమైన పుస్తక మేళాలను జిల్లాలకు, తాలూకాలకూ విస్తరించాల్సిన అవసరం ఉంది. అప్పుడే మనవి విజ్ఞాన సమాజాలవుతాయి. ఈ విషయాన్నే బుక్‌ ఫెయిర్‌ అధ్యక్షులు జూలూరి గౌరీశంకర్‌... ‘‘విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు తాము పుట్టి పెరిగిన, చదువుకున్న గ్రామాల్లో మీ పేరిట ఒక గ్రంథాలయం ఏర్పాటుచేయండి. ఆ గ్రామాలకు ఎంతో మేలు చేసినవారవుతారు. పుస్తక ప్రదర్శనలు జిల్లా కేంద్రాలకు విస్తరించాలనే ఆలోచనతో ఉన్నాం’’ అని చెప్పారు. జ్ఞాన ప్రదాయిని గమనాన్ని కాపాడటం, తద్వారా జీవన వికాసాన్ని కలిగించుకోవడం మన బాధ్యత, పుస్తకం మరిన్ని ప్రాంతాలకు చేరువ కావాలని, అందరికీ అందాలని, జ్ఞానం సర్వాంతర్యామి కావాలని కోరుకుందాం!

- సహకారం: నర్సింగరావు, హైదరాబాదు

*  *  *

 


వెనక్కి ...

మీ అభిప్రాయం