మాధవ ‘రామం’... వ్యాఖ్యాన ‘భద్రాచలం’

  • 427 Views
  • 5Likes
  • Like
  • Article Share

    జన్నాభట్ల వీరేశ్వరశాస్త్రి

  • విశ్రాంత ఆంధ్రోపన్యాసకులు, హిందూ కళాశాల
  • గుంటూరు
  • 9441693051
జన్నాభట్ల వీరేశ్వరశాస్త్రి

‘‘ఆకాశంలో నక్షత్రాలను లెక్కించడం, వేదశాస్త్రాల సారం తెలుసుకోవడం, నాట్య సరస్వతి అనే సముద్రాన్ని ఈదడం బ్రహ్మకు కూడా శక్యం కాదు. అలాంటిది నాట్యశాస్త్ర సాగరాన్ని ఈదడం అప్పుడు అభినవగుప్తునికి, మళ్లీ ఇప్పుడు నీకే సాధ్యమైంది అన్నా...’’ అని విశ్వనాథ సత్యనారాయణ ప్రశంసలు అందుకున్నారు జమ్ములమడక మాధవరామశర్మ. ఆయన అలంకారశాస్త్ర గ్రంథాలను తెలుగులో రాసి అభినవ ఆనందవర్ధనుడిగా పేరుగాంచారు. తెలుగునాట భువనవిజయ సభలకు నాంది పలికారు. భద్రాచల శ్రీసీతారామ కల్యాణం తొలి వ్యాఖ్యాతగా నిలిచిపోయారు.
‘మీ మహోపన్యాస తన్మయత్వంలో త్రిలింగదేశం మునిగిపోయింది’; ‘ఆ వైదుష్యం అపారం ఆ ప్రతిభ దివ్యం...’ అని మాధవరామశర్మ వక్తృత్వాన్ని కొనియాడారు కరుణశ్రీ. అప్పట్లో తెలుగునేల మీద జకారత్రయం ఉపన్యాస మూర్ధన్యులుగా ప్రసిద్ధులు. వాళ్లు జమ్ములమడక మాధవరామశర్మ, జటావల్లభుల పురుషోత్తం, జొన్నలగడ్డ సత్యనారాయణమూర్తి. అయితే శర్మను తెలుగిళ్లలో నిలిపింది మాత్రం భద్రాచల సీతారామ కల్యాణ వ్యాఖ్యానమే. ‘రామా! శ్రీరామా! సుకుమారమైన మా సీతమ్మ మెడలో మూడుముళ్లు వెయ్యి. ముడి, ముడిమీద ముడి, ముడిమీద ముడి మూడుముళ్లు వేశావుగదా!’; ‘సీతమ్మతల్లీ! రామయ్య వంక ఓరకన్నులతో చూస్తున్నావా?’ అంటూ లీనమైపోయి వ్యాఖ్యానం చేసేవారు. ఆ వ్యాఖ్యానం చెవులారా విన్నవారికే ఆ ఆనందం తెలుసు. అతి సాధారణ జనానికి కూడా అది వీనులవిందుగా ఉండేది. మాధవరామశర్మ ఓమారు భద్రాచలంలో వ్యాఖ్యానం చేసి రాత్రికి గుంటూరు చేరుకున్నారు. ఇంటికి వెళ్లడానికి రిక్షా మాట్లాడుకున్నారు. దిగాక అతనికి డబ్బు ఇవ్వబోతే.. ‘స్వామీ పొద్దుట మీరు చెపుతుంటే సీతారాముల కల్యాణం నా కళ్లముందు జరిగినట్లుగా అనిపించింది. అలాంటిది మీ దగ్గర డబ్బు తీసుకుంటే రామచంద్రస్వామికి కోపమొస్తుంది’ అన్నాడట. అంతలా ఆకట్టుకునేది ఆయన వ్యాఖ్యానం. అంతేకాదు తెలుగునాట ప్రత్యక్ష వ్యాఖ్యానానికి ఆయనే ఆదిగురువు.
సంస్కృతం నుంచి తెలుగులోకి
తెలుగు సంస్కృత భాషల్లో అపార పాండిత్యం సంపాదించుకున్న మాధవరామశర్మ 15 అలంకారశాస్త్ర గ్రంథాలను, 15 మంత్ర, వేదాంత గ్రంథాలను తెలుగులో రాశారు. జగన్నాథ పండితుడి సంస్కృత ‘రసగంగాధరమ్‌’ కావ్యానికి వివరణగా తెలుగులో ‘నవరస గంగాధరం’ రాశారు. విద్యానాథుని ప్రతాపరుద్ర యశోభూషణాన్ని కుమారస్వామి సోమపీథి వ్యాఖ్యా విశేషాలతో రాసిందే ‘ఆంధ్ర ప్రతాపరుద్రీయం’. ఇక ‘ధ్వనిసారం’ ఆనందవర్ధనుని ధ్వన్యాలోకానికి, అభినవగుప్తుని లోచన వ్యాఖ్యా విశేషాల సంగ్రహ గ్రంథం. ఈ పుస్తకంలో ధ్వన్యాలోక కారికల సారాంశం ఉంది.
      సంస్కృతంలో మమ్మటుడు రాసిన ‘కావ్య ప్రకాశం’ను తెలుగులోకి అనువదించారు. ఇందులోని ఉదాహరణలు రసస్ఫోరకంగా ఉంటాయి. కశ్మీరుకు చెందిన రాజానన రుయ్యకుడు రాసిన అలంకార సర్వస్వానికి సారాంశంగా ‘అలంకార సూత్రం’ రాశారు. రాజానన బిరుదు కాశ్మీర పండితులకు ప్రత్యేకం. ఇందులోనే ‘అలంకృతి’ శీర్షిక కింద భారతీయ ఆలంకారికుల సంగ్రహ చరిత్రనూ వెలార్చారు శర్మ. గ్రాంథికంలో సాగిన ఈ గ్రంథంలో ఆలంకారికుల చరిత్ర మాత్రం వ్యావహారికం. ‘రసగంగాధరమణి’ ... జగన్నాథ పండితుని రసగంగాధరాన్ని సుబోధకంగా చెప్పిన పుస్తకం ఇది. ఇందులోనే ‘స్వభావోక్తి’ శీర్షిక కింద పండితరాయల జీవిత సంగ్రహం రాశారు.
      మాధవరామశర్మ రచనల్లో ప్రసిద్ధిగాంచిన మరో గ్రంథం ‘నాట్యవేదం’. దీనికి సంగీత నాటక అకాడమీ బహుమతి లభించింది. గణపతిదేవ చక్రవర్తి గజసాహిణి జాయప్ప రాసిన ప్రసిద్ధ నాట్యశాస్త్ర గ్రంథం ‘నృత్త రత్నావళి’. భరతుని నాట్యశాస్త్రం, శార్‌జ్ఞదేవుడి సంగీత రత్నాకరాలను అనుసరించి రాసిన ఈ గ్రంథంలో సమకాలీన పేరిణి, గొండ్లి తదితర దేశీనృత్య విశేషాలనూ పొందుపరిచాడు జాయప్ప. డా॥రాఘవన్‌ నృత్తరత్నావళి శుద్ధప్రతి పరిశోధించి ముద్రించారు. దానిలో కొన్నిచోట్ల గ్రంథపాతాలు ఉన్నాయి. వాటిని సవరించినా ఇంకా లోపించాయి. అలాంటి చోట్ల శర్మ తన అనుభవంతో ఉండాల్సిన విషయాల్ని పూరించారు.
      మహారాజ భోజుడు 36 ప్రకాశాలతో ఒక విజ్ఞాన సర్వస్వాన్ని రచించాడు. వీటిలో కొన్ని మాత్రమే వెలుగులోకి వచ్చాయట. వాటిలో ఒకటి శృంగారప్రకాశం. ఇందులో కొన్ని ప్రకాశాలను వివరించి మిగిలిన ముద్రితమైన ప్రకాశాల విషయాలను ‘సాహిత్య ప్రకాశం’ పేరుతో 55 పేజీలలో సంగ్రహంగా రాశారు శర్మ. ఆయన రాసిన వ్యాఖ్యాన గ్రంథాలలో సమగ్రం, సంపూర్ణం ‘భావప్రకాశం’. దీన్ని రచించింది 12వ శతాబ్ది వాడైన శారదా తనయుడు. విద్యాధరుడు సంస్కృతంలో తన పోషకుడు నరసింహదేవుని పొగుడుతూ లక్ష శ్లోకాల్లో రాసిన గ్రంథం ‘ఏకావళి’. సంస్కృత పంచకావ్య వ్యాఖ్యాత మల్లినాథసూరి దీనికి ‘తరలం’ పేరుతో వ్యాఖ్యానం రాశాడు. మాధవరామశర్మ ఈ వ్యాఖ్యానాన్ని సవిమర్శగా ‘ఏకావళి’ పేరుతో తెలుగులో అందించారు. రాజానన మహిమభట్టు రచించిన ‘వ్యక్తి వివేకం’ సారాన్ని ‘వ్యక్తివివేచన సంగ్రహం’ పేరుతో తెలుగులోకి తెచ్చారు మాధవరామశర్మ. తెనాలి సంస్కృత కళాశాలలో విద్యాప్రవీణ విద్యార్థులకు దీన్ని బోధించారు. ఈ పుస్తకాన్ని అంకితం తీసుకున్న గోల్కొండరాజుల సత్యనారాయణ కొంత భూమిని శర్మ పేరుమీద రాసిచ్చారు. సొంత అవసరాలకు వాడకుండా, దాన్ని అమ్మగా వచ్చిన డబ్బును పుస్తక ప్రచురణకు వినియోగించారు.
      కుంతకుడి ‘వక్రోక్తి జీవితా’న్ని సంగ్రహంగా వక్రోక్తిసారంగా, క్షేమేంద్రుడు సంస్కృతంలో రాసిన ‘ఔచిత్య విచారచర్చ’ తదితర గ్రంథాలను తెలుగులోకి అనువదించారు. మాటల్లో చేతల్లో... అన్ని విషయాల్లో మనిషికి ఔచిత్యం అవసరం. అలాగే కావ్యంలో కూడా ఔచిత్యం అత్యావశ్యకం. భరతముని మొదలు జగన్నాథ పండితుని వరకు ఆలంకారికులు అందరూ ఔచిత్యాన్ని గురించి చెప్పినవారే. రసభంగానికి అనౌచిత్యాన్ని మించిన కారణం ఇంకొకటి లేదంటాడు ఆనందవర్ధనుడు. మాధవరామశర్మ కావ్యశాస్త్ర వైదుష్యం అంతా ఈ ‘ఔచిత్య విచారచర్చ’ అనువాదంలో ప్రత్యక్షమవుతుంది.
భువనవిజయ సభల ఆవిష్కర్త
సుబ్రహ్మణ్యశాస్త్రి, హనుమాయమ్మ దంపతులకు 13.4.1907న జన్మించారు మాధవరామశర్మ. వాళ్లది గుంటూరు జిల్లా తెనాలి తాలూకా కోడితాడిపర్రు అగ్రహారం. కాశీ పండితులైన సుబ్రహ్మణ్యశాస్త్రి గృహం ఓ విద్యాకేంద్రాన్ని తలపించేది. ఎంతోమంది విద్యార్థులు శాస్త్రి దగ్గర కావ్య నాటక అలంకార శాస్త్రాల్లో ప్రావీణ్యం సంపాదించారు. మాధవరామశర్మను విజయనగరం మహారాజా సంస్కృత కళాశాలలో చేర్పించారు. అక్కడే ‘సాహిత్య విద్యాప్రవీణ’ లో ఉత్తీర్ణులయ్యారు శర్మ. ఆ తర్వాత తాతా సుబ్బరాయశాస్త్రి శిష్యత్వంలో రాటుదేలారు.
      తెనాలి సంస్కృత కళాశాలలో 12 ఏళ్ల పాటు జీతం తీసుకోకుండా విద్యాబోధన చేసిన నిస్వార్థ హృదయం మాధవరామశర్మది. ఆ కళాశాలలో సాహిత్య విద్యా ప్రవీణ పాఠ్యపుస్తకాలైన ధ్వన్యాలోకం, కావ్యప్రకాశ, ప్రతాపరుద్రీయం లాంటి అలంకారశాస్త్ర గ్రంథాలను విద్యార్థుల మనస్సులలో నాటుకునేట్లు బోధించారాయన. తర్వాత నెల్లూరు వేద సంస్కృత కళాశాలలో, 1945 నుంచి గుంటూరు ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో, కేవీకే సంస్కృత కళాశాల, నాగార్జున విశ్వవిద్యాలయంలో అధ్యాపకత్వం చేపట్టిన మాధవరామశర్మ 1988 జులై 13న పరమపదించారు. భువనవిజయం స్ఫూర్తితో తొలిసారి మళ్లీ భువనవిజయ సమ్మేళనం నిర్వహించింది మాధవరామశర్మే. దీనికి గుంటూరు క్రైస్తవ కళాశాల వేదికగా నిలిచింది. అప్పటి సాహితీ ప్రసిద్ధులు విశ్వనాథ, పుట్టపర్తి, గడియారం మొదలైనవారు పాల్గొన్న ఈ భువనవిజయంలో శర్మ తిమ్మరుసు పాత్ర పోషించారు. సంస్కృతం నుంచి పదుల పుస్తకాలకు తెలుగు వివరణలు రాసి, అభినవ ఆనందవర్ధనుడిగా పేరుగాంచిన శర్మ రచనలు అంతగా ప్రజాదరణకు నోచుకోలేదు. దీనికి ఆయన వాడిన భాషే ప్రధాన కారణం. నవరస గంగాధరం, ప్రతాపరుద్రీయం రెండు గ్రంథాల్లో మాత్రమే వ్యావహారిక భాషను, మిగిలినవాటిలో గ్రాంథిక భాషను ఉపయోగించారు. ఈ విషయంలో సంస్కృత కవి భవభూతి అన్నట్లు... ‘నాతో సమానాభిప్రాయాలు కలవాడు ఎవడో ఒకడు జన్మించకపోడు. కాలం అనంతమైంది! భూమి విశాలమైంది!’ అన్న భావం ఆయనకు ఉండిందేమో!

*  *  *


వెనక్కి ...

మీ అభిప్రాయం