ఆ అయిదుగురు

  • 755 Views
  • 0Likes
  • Like
  • Article Share

ఆచితూచి మాట్లాడితే, చనిపోయిన ప్రతి ఒక్కరినీ కీర్తిశేషులనకూడదు. ఏ రంగంలోనైనా కావచ్చు.. పదికాలాలపాటు సమాజానికి శాశ్వతావసరాలైన పనులు చేసి, మన నడకబాటలకై తమ జాడల్ని మిగిల్చిన వారినే కీర్తిశేషులనాలి.  ఆధునిక కవిత్వంలో అద్దేపల్లి రామమోహనరావు.. సినీ నటుడిగా, సాహిత్యాభిమానిగా రంగనాథ్‌... సినీ, నాటక రచనల్లో కాశీవిశ్వనాథ్‌... నాటక రంగంలో చాట్ల శ్రీరాములు... పోచంపల్లి పట్టుచీరకు రూపాన్నిచ్చిన కర్నాటి అనంతరాములు ఇలాంటి జాడల్నే మిగిల్చివెళ్లారు. ‘కీర్తిశేషులైన’ ఆ అయిదుగురూ అగణిత ప్రతిభావంతులే. 
నిత్యసాహిత్య చైతన్య కేంద్రం

అద్దేపల్లి రామమోహనరావు... సముద్రతీరం బందరులో పుట్టారు. సముద్రతీరం కాకినాడలో నివసించారు. అధ్యయన సముద్రాన్ని తరచారు. ఎనభై ఏళ్ల నిండు జీవితంలో ఆయన సామాజిక సాహితీ జీవానికే షష్టిపూర్తి అయ్యింది. ఆయన తల్లి రాజరాజేశ్వరి, తండ్రి సుందర్రావు. భార్య అన్నపూర్ణ, నలుగురు కొడుకులు. అద్దేపల్లి బందరు హిందూ కళాశాల, నందిగామ ఎన్టీఆర్‌ కళాశాల, కాకినాడ ఎం.ఎస్‌.ఎన్‌. ఛారిటీస్‌ డిగ్రీ కళాశాలల్లో అధ్యాపకత్వం వహించారు. 1994లో పదవీ విరమణ చేశారు.
      అద్దేపల్లి తొలికవిత 1960లో కృష్ణా పత్రికలో ప్రచురితమైంది. మొదట్లో సాంప్రదాయిక భావానుసరణలో వచ్చిన ఆయన కవిత్వంలో తర్వాత హేతుభావాలు, అభ్యుదయ, విప్లవ, ప్రగతిశీల ఆలోచనలు పెరిగాయి. ఈయన రచనలు భావజ్వాలా తోరణాలు. ‘మధుజ్వాల’తో ప్రౌఢ పద్యకవిగా వెలుగులోకి వచ్చారు. తర్వాత అంతర్జ్వాల, రక్తసంధ్య, గోదావరి నా ప్రతిబింబం, మెరుపు పువ్వు, ఆకుపచ్చని సజీవ సముద్రం నా నేల, పొగచూరిన ఆకాశం వంటి కవితా సంపుటాలు ఆయన కవి స్థానాన్ని పెంపుదల చేశాయి. ‘శ్రీశ్రీ కవితా ప్రస్థానం’ విమర్శకుడిగా ఆయన స్థానాన్ని పదిలపరచింది. శ్రీశ్రీని ఆనందింపచేసింది. కుందుర్తిపై రాసిన రెండు మూడు గ్రంథాల్ని సాహిత్య సమాజం అక్కున చేర్చుకుంది. స్త్రీవాద కవిత్వంపై, జాషువాపై రాసిన పుస్తకాలు ఆయన విమర్శన స్థాయిని తెలిపాయి. ఎన్నో పత్రికా వ్యాసాలు, మరెన్నో సమీక్షలు అద్దేపల్లి కలం బలాన్ని నిరూపించాయి. సినారె అద్దేపల్లిని సద్విమర్శకుడని అంటారు.
      ‘అభ్యుదయ విప్లవ కవిత్వాలు, సిద్ధాంతాలు, శిల్పరీతులు’ అనే పరిశోధన గ్రంథం పరిశోధకుల్లో అద్దేపల్లిని పెద్దపీట మీద కూర్చోబెట్టింది. ఎంతోమంది యువకవులకు ఆయన ఒక ప్రోత్సాహక చైతన్యకేంద్రం. ఉద్యమాల నామకరణాల కన్నా వాటి భావజాలాల సాహిత్య కవిత్వాలు ప్రజల్లోకి చొచ్చుకుపోవాలన్నది అద్దేపల్లి ‘ఆత్మ’విశ్వాసంగా అనిపిస్తుంది. ఇందుకు అద్దంపట్టే రచనలు అద్దేపల్లి గ్రంథాల్లో అనేకం. ‘‘ఈ ధనమంత పోనీ/ యౌవనమంత పోనీ/ రాగాలు పోనీ/ సరాగాలు పోనీ/ ఈనాటి ఈజీవితమంత పోనీ/ ఆనాటి బాల్యాన్ని/ ఒకసారి రానీ’’ అని బాల్య మాధుర్యాన్ని ఆహ్వానించిన గజల్‌ గాయక కవి అద్దేపల్లి. ప్రపంచీకరణ దుష్ఫలితాలపై అవిశ్రాంత ప్రబోధకవి ఆయన. 

- సన్నిధానం నరసింహశర్మ, హైదరాబాదు


సాహితీ రంగనాథుడు
రంగనాథ్‌... కథానాయకుడిగా అందగాడు. ప్రతినాయకుడిగా యస్వీ రంగారావును గుర్తు చేసేంతటి కళాకారుడు. ప్రేమికుడిగా, భర్తగా, తండ్రిగా, పోలీస్‌ అధికారిగా ప్రేక్షకుల్ని అలరించారు. సినిమాల్లో విరహపాత్రలను అద్భుతంగా పోషించిన రంగనాథ్‌ నిజజీవితంలో భార్యలేని ఒంటరితనాన్ని భరించలేకపోవడం విధివైచిత్రి. నవ్వుతూ, నవ్విస్తూ, ఎంతో చలాకీగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా మాట్లాడే ఆయన కవి కూడా.
      ‘‘జీవితం ఒక ఆట!/ పట్టుమీదుం టాడు పరమ శత్రువైన!/ ప్రతి బౌలరు అంచనాలు తప్పి/ అడుగులు తప్పుగ వేసి స్టంప్‌ ఔట్‌ అవుతావో!/ అధిగమించిన ఆత్మవిశ్వాసంతో/ అనవసరంగా పెరుగెత్తి రనౌట్‌ అవుతావో!/ అంతా నీ నిబ్బరంలో ఉంది!/ నువ్వు పొందిన తర్ఫీదులో ఉంది!/ జీవితమైదానంలో బ్రతుకు పోరాటంలో/ పరిస్థితులే బౌలర్లు! సంఘటనలే బంతులు!’’ ఇవి జీవిత పోరాటం ఎలా ఉండాలన్న దానిమీద రంగనాథ్‌ రాసుకున్న మాటలు. ఆయన సమాజంలో, ముఖ్యంగా యువతలో వ్యక్తిత్వ వికాసం కలగాలని ఆకాంక్షించారు. సరైన సమయంలో సలహా లభించి, ఆ లభించిన దాన్ని అర్థం చేసుకుని, ఆచరణలో పెడితే... అధిక సంఖ్యాకుల జీవితం ఆనందమయమవుతుంది. రంగనాథ్‌ ‘నడత’ కవితా సంపుటి అలాంటి సలహాలను ఎన్నింటినో అందజేస్తుంది అన్నారు రావూరి భరద్వాజ. తన కవిత్వ పరమావధి మానవత్వమే అని చెప్పుకున్నారు రంగనాథ్‌. ‘మంచి పుస్తకము ఒకటి ఒనగూర్చుమేలు నూర్గురు మిత్రులైన సమకూర్చలేరు/ సన్మిత్రుడొక్కడు నిజముగ నీకున్న గ్రంథాలయమే నీకు చేకూరినట్లు!’ అని స్నేహాన్ని నిర్వచించిన రంగనాథ్‌ బంధువులకంటే ఆప్తులే భాగ్యమంటారు. 1949 జులై 17న చెన్నైలో జన్మించిన తిరుమల సుందర శ్రీరంగనాథ్‌... పంతులమ్మ, చందన, దేవతలారా దీవించండి, అమెరికా అమ్మాయి, ఇంటింటి రామాయణం, సెక్రటరీ, చదువు- సంస్కారం, రామచిలుక తదితర చిత్రాల్లో నటించారు. ఈ రంగంలో ఆయనది దాదాపు 4 దశాబ్దాల పరిశ్రమ. సుమారుగా 300 చిత్రాల్లో తన నటనా వైభవంతో తెలుగు ప్రేక్షక జనాన్ని మెప్పించారు.


నాటక దిగ్గజం
చాట్ల శ్రీరాములు... ఆరున్నర దశాబ్దాల పాటు రంగస్థలమే జీవితంగా బతికిన వ్యక్తి. నాటకరంగంలో కొత్త ప్రక్రియలు ప్రవేశపెట్టిన నిత్య సాధకుడు, శోధకుడు, బోధకుడు, దర్శకుడు. కృష్ణాజిల్లా విజయవాడలో అచ్చమ్మ, అచ్చయ్యలకు 1931 డిసెంబరు 5న జన్మించారు. భార్య ఆదిలక్ష్మి. వాళ్లకు నలుగురు పిల్లలు.
      శ్రీరాములు చదువుకునే రోజుల్లోనే నాటకాల్లో వేషాలు వేశారు. డిగ్రీ అయ్యాక రైల్వేలో టిక్కెట్‌ కలెక్టర్‌గా చేరారు. తర్వాత ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఆంగ్లంలో ఎమ్మే చేశారు. 1976లో స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయ రంగస్థల కళల శాఖలో దర్శకుడిగా బాధ్యతలు చేపట్టారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలోనూ బోధించారు. హైదరాబాదు విశ్వవిద్యాలయం, తెలుగు విశ్వవిద్యాలయాల్లో గౌరవ అధ్యాపకులుగా పనిచేశారు. మధు ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో, అక్కినేని నట శిక్షణాలయంలో అతిథి అధ్యాపకులుగా బోధించారు. నాగార్జున, వెంకటేశ్‌లు ఆయన శిష్య బృందంలోనివారే!
      ‘మాస్టర్జీ’ శ్రీరాములును రంగస్థలం వైపు ప్రేరేపించిన నాటకం. చాట్ల దర్శకత్వంలో కాళరాత్రి, ఇదీలోకం, నా బాబు, నేటి న్యాయం, మావూరు నాటకాలు వచ్చాయి. శ్రీరామమూర్తి రచించిన ‘ఫణి’ చాట్లకు గొప్పపేరు తెచ్చింది. ఆయన నాటకరంగ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ నాటకం మరో మొహెంజోదారో. తెలుగు రాష్ట్రాలే కాదు దేశమంతటా సంచలనం సృష్టించి నాటకం ఇది. రచయిత యన్‌.ఆర్‌.నంది. దీనికి చాట్ల దర్శకత్వంతోపాటు శాస్త్రవేత్త పాత్ర పోషించారు. ఇది కమలాదేవి ఛటోపాధ్యాయ పురస్కారానికి ఎంపికైంది. గొల్లపూడి ‘లావాలో ఎర్రగులాబీ’, ఆత్రేయ ‘మనసు వయసు’, భమిడిపాటి రాధాకృష్ణ ‘దైవశాసనం’, ‘సత్యకామేష్ఠి’ నాటకాలు శ్రీరాములుకు బాగా పేరు తెచ్చాయి.
      చాట్లలోని దర్శకుడు నిరంతర అన్వేషి. ప్రతీ నాటకం, నాటికలో వైవిధ్యం ఉండాలని ఆశించారు. ఆయన ప్రతిభ ఇంటనే కాదు రచ్చలోనూ గెలిచింది. ఇంగ్లాండు, అమెరికా, పోలాండ్‌, స్విట్జర్లాండ్‌ తదితర దేశాల్లో పర్యటించి, అక్కడివాళ్లకు నటనలో శిక్షణ ఇచ్చారు. అక్కినేని నటించిన ‘సుడిగుండాలు’ చిత్రంతో సినీరంగానికి శ్రీకారం చుట్టిన చాట్ల శ్రీరాములు ‘స్వప్న’, ‘జేగంటలు’, ‘న్యాయం కావాలి’, ‘విక్రమ్‌’, ‘అగ్నిపుత్రుడు’, ‘శిశిర’ తదితర చిత్రాల్లో నటించారు. గౌతమ్‌ ఘోష్‌ దర్శకత్వంలో వచ్చిన ‘యాత్ర’ చిత్రంలో ‘ముస్లిం డాక్టర్‌’గా నటించారు. ‘సంగీత’ సినిమాలో పూర్తినిడివి పాత్ర పోషించారు. హైదరాబాదు దూరదర్శన్‌ మొదటి ధారావాహిక ‘మీరు ఆలోచించండి’లో ప్రధాన పాత్రధారి ఆయనే. ఆయన 150 రేడియో నాటికల్లోనూ నటించారు. 2009లో తెలుగు విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్‌ ఇచ్చింది. ఎన్టీఆర్‌ పురస్కారం, నార్త్‌ అమెరికా తెలుగు సొసైటీ సత్కారం, రాష్ట్ర నాటక అకాడమీ నుంచి ఉత్తమ దర్శకుడి పురస్కారాలు ఆయనకు లభించిన గౌరవాల్లో కొన్ని మాత్రమే!


పదునైన కలం
‘దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది’ అని నూతనప్రసాద్‌ పలికిన డైలాగ్‌ తెలుగునాట బాగా ప్రజాదరణ పొందింది. దీన్ని రాసింది కాశీ విశ్వనాథ్‌. శిలుకోటి అప్పలస్వామి, బుచ్చమ్మలు ఆయన తల్లిదండ్రులు. స్వస్థలం విశాఖపట్నం. అసలు పేరు కాశీ విశ్వేశ్వరరావు. డిగ్రీ పూర్తయ్యాక 1966లో విశాఖపట్నం పోర్టు ట్రస్టులో అకౌంటెంట్‌గా చేరారు. భార్య మహాలక్ష్మి. ముగ్గురు పిల్లలు. పాఠశాల రోజుల్లోనే రెండు నాటకాల్లో నటించారు. వ్యాసాలు, కథలు, నాటకాలు, రేడియో నాటికలు రాశారు. 1980లో సినిమారంగం వైపు వచ్చారు. అటు సినిమాల్లో సంభాషణలు రాస్తూనే ఇటు కథలు, నవలల ద్వారా పాఠకుల్ని అలరించారు. మొత్తం 122 కథలు, 28 నవలలు, 43 నాటకాలు రాశారు. ‘సినిమా రచన కొన్ని మౌలిక అంశాలు’ అన్న రచన కాశీ విశ్వనాథ్‌కు నంది పురస్కారం తెచ్చిపెట్టింది. తన తొలికథ ‘ఓ వర్షం కురిసిన రాత్రి’కి రావిశాస్త్రి ప్రశంసలు అందుకున్నారాయన. తర్వాత కాలంలో తన కథలను నాటకాలుగా మలచడం మొదలుపెట్టారు. అలా ‘మార్పు’ కథను ‘ఒక దీపం వెలిగింది’ నాటకంగా మలచారు. ఇది 1979లో ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ పురస్కారం పొందింది.
      ఇంచుమించు కాశీ విశ్వనాథ్‌ నవలలన్నీ నాటకాలుగా వచ్చాయి. ‘మానవత్వానికి మరో కోణం’ దూరదర్శన్‌లో ప్రసారమైంది. ‘పంతులుగారి పట్నవాసం’ నవల ఆధారంగా రూపుదిద్దుకున్న ‘నవరాగం’ నాటకం అత్యంత జనాదరణ పొందింది. ‘జీవన సంధ్య’ నాటకం... కొడుకే కాలయముడై తమ కలల్ని కూల్చేసినప్పుడు కన్నవాళ్లకు మిగిలే ఆవేదనకు ప్రతిరూపం. అందమైన ఎండమావి’ మధ్య తరగతి కుటుంబాల విదేశీ మోజును పట్టిచూపే నాటకం. వర్తమాన సమాజంలో మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా రూపుదిద్దుకున్న వృత్తాంతంతో రాసిన ‘ట్రెండ్‌మారింది’ 2006 నంది నాటకోత్స వాల్లో ఉత్తమ రచనగా ఎంపికైంది.

- కె.హరినాథ్‌, హైదరాబాదు


‘పట్టు’పట్టి... పోచంపల్లి చీరనేసి...
డిసెంబరు 26న మరణించిన కర్నాటి అనంతరాములు జీవితం పోచంపల్లి పట్టుచీర ప్రస్థానానికి, తెలుగు హస్తకళా వైభవానికి నిలువెత్తు దర్పణం. పోచంపల్లి చీరలకు ప్రపంచ గుర్తింపు రావడం వెనక ఎంతో పరిశ్రమ, దానితోపాటు ఒక కొత్తపద్ధతికి శ్రీకారం చుట్టాలన్న తపన, ఉత్సుకతలు కారణాలు. చిటికి పద్ధతి ప్రవేశించేకంటే ముందే పోచంపల్లిలో 1954 వరకు తేలియా రుమాళ్లు నేసేవారు. వీటినే కొత్త తరహాలో తయారు చేయాలన్న సంకల్పంతో లట్కం, లాయిదార్‌ నమూనాలకు రూపకల్పన చేయడంతో పోచంపల్లిలో చిటికి పరిశ్రమ ఆరంభమైంది. తేలియా రుమాళ్లతో అభివృద్ధి చెందిన చిటికి పద్ధతి చీరలకూ విస్తరించడంతో పోచంపల్లి చీరల చరిత్ర కొత్తమలుపు తిరిగింది. దీని వెనక కర్నాటి అనంతరాములు కృషి నిరుపమానం. దీనికోసం ఆయన పలకల మీద నమూనాలు రూపొందించుకుని వాటిని చిటికి మీద తయారు చేసేవారు. అంచులో నిలువు డిజైన్లు, అదే డిజైన్లను కొంగులో రూపొందించి సరికొత్త ఉరవడికి నాంది పలికారు. దాంతో పోచంపల్లి నూలుచీరలకు గిరాకీ పెరిగింది.
      పోచంపల్లి చేనేత చరిత్రలో కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టిన కర్నాటి అనంతరాములు 1931లో జన్మించారు. పదమూడో ఏటనుంచే మగ్గం పని నేర్చుకున్నారు. నేతకు సంబంధించిన విషయాలను ఆపోశన పట్టారు. 1955లో అఖిల భారత హస్తకళల బోర్డు అధ్యక్షురాలు కమలాదేవీ ఛటోపాధ్యాయ పోచంపల్లిని సందర్శించారు. నూలుచీరల మీదున్న డిజైన్లను చూసి ఆశ్చర్యపోయిన ఆమె... అనంతరాములుతో వాటిని పట్టుమీద కూడా ప్రయత్నిస్తే మంచిదన్నారట. దాంతో ఆయన ప్రభుత్వ సాయంతో వారణాసి వెళ్లి చేనేతలో మరిన్ని మెలకువలు నేర్చుకున్నారు. అక్కడినుంచి వచ్చాక ఆయన పట్టుదారాన్ని ముంబయి నుంచి తెప్పించుకున్నారు. పట్టుచీరల కోసం ప్రత్యేకమైన చిటికిని రూపొందించి మూడు చీరలు నేశారు. అయితే అప్పటికి ఇంకా పట్టు రంగుల అద్దకం నేర్చుకోనందువల్ల పట్టుబట్టలకూ కాటన్‌ రంగులనే అద్దారు. పట్టుమీద రంగుల అద్దకం గురించి తెలుసుకోవడానికి తంజావూరు వెళ్లారు. ఎనిమిది నెలలు శ్రమించి ఆ అద్దకం మీదా పట్టు సంపాదించారు. అంతేకాదు, అక్కడి కళాకారులకు పోచంపల్లి కళను పరిచయం చేశారు. తిరిగివచ్చాక పట్టుదారంతో, పట్టు రంగులతో పోచంపల్లి పట్టుచీరను ఆవిష్కరించారు. అలా 1956లో మొదటిసారి అనంతరాములు చేతుల మీదగా తయారైన పోచంపల్లి పట్టుచీర ఇన్నేళ్లలో కోట్లాది మహిళల అభిమానాన్ని సంపాదించుకుంది.
      అనంతరాములు కొత్త డిజైన్లు రూపొందించడం కోసం ఎప్పుడూ సృజనాత్మకంగా ఆలోచించేవారు. కొత్త డిజైన్లతో చీరలు నేసేవారిని ప్రోత్సహించి, వాళ్లకు ఎక్కువ గిట్టుబాటు ధర ఇప్పించేవారు. పోచంపల్లి పట్టుచీరకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన ఆయన సన్మానాలు, పురస్కారాలకు దూరంగా ఉండేవారు. రాష్ట్రపతి పురస్కార గ్రహీత గజం రాములు అనంతరాములు శిష్యుడే. ఇప్పుడైతే పోచంపల్లి చీరకు భౌగోళిక గుర్తింపు లభించింది. మనదేశంలోనే కాదు విదేశాల్లోనూ పోచంపల్లి చీరలకు పేరుంది. అందుకే ఇక్కడ తరచుగా విదేశీయుల సందడీ కనిపిస్తుంది. దీనికి తనను తాను నేత కార్మికుడిగా కాకుండా కళాకారుడిగా భావించిన అనంతరాములు తపస్సే కారణం.

- బెదరకోట శ్రవణ్‌కుమార్‌, భూదాన్‌పోచంపల్లి, నల్గొండ


*  *  *


వెనక్కి ...

మీ అభిప్రాయం