హంసధ్వని

  • 2280 Views
  • 5Likes
  • Like
  • Article Share

    డా।। జొన్న‌ల‌గ‌డ్డ మార్కండేయుల

  • విశ్రాంత అధ్యాప‌కులు
  • పేర‌వ‌రం, తూ.గో.జిల్లా
  • 9440219338
డా।। జొన్న‌ల‌గ‌డ్డ మార్కండేయుల

పాలలో కలిసిన చుక్క నీటిబిందువును కూడా వేరుచేయగల అద్భుత పక్షి హంస. ‘హరాది గురుగుహ తోషిత బింబం హంసధ్వని భూషిత హేరంబం’ అంటూ వినాయకుణ్ని స్తుతించే ముత్తుస్వామి దీక్షితార్‌ సృష్టిగా సంగీత సామ్రాజ్య ఖ్యాతి హంసధ్వనిది. వాస్తవానికి హంస అంటే మగపక్షి. ఆడపక్షి పేరు హంసి. అయితే, వాడుకలో మాత్రం అన్నీ హంసలే! హంస చేసే ధ్వనికి కలకంఠమని పేరు. కలహంస ధ్వని కవీశ్వరులకు కవిసమయ ప్రయోగం. ‘అధూసరచ్ఛదం’ అనే మాధుర్య శబ్దార్థంగా అంగీకారం. హంస శబ్దం పక్షిజాతిగా స్త్రీలింగ విశేషణ ప్రయోగం. పురుషశ్రేష్ఠ వాచకం. హంస రుగ్వేదంలో కనిపిస్తుంది. అశ్వనీదేవతలు, వరుణుడు, బ్రహ్మ, సరస్వతిదేవిలకు ఇదే వాహనం. అయితే, వర్ణనలో తప్ప దీన్ని చూసినవారెవరూ లేరు. మానస సరోవరంలో ఉంటుందని ప్రతీతి.
      హంస అనేది కులవాచకంగానూ ఉంది. హంసధ్వని సంగీతరాగంగానూ, జన్యతాళాల్లో ఒకటిగా హంసనాదంగానూ సరే! హంసనడక మాత్రం వయ్యారి భామల నడకకు ఉపమానం. కాలియందె చప్పుడు హంసపలుకులా ఉంటుందని, ఆ ఆభరణాన్ని ‘హంసకం’ పేరుతో ధరిస్తారు. హంసతూలికా తల్పం కూడా ఉంది కానీ, హంసాకృతికి ముడిపెట్టలేం. ఇక రాజహంస (రాయంచ) అన్నది హంసకు పర్యాయపదం. ‘హంసరుతం’ పేరిట ఓ వృత్తజాతి పద్యం కనిపిస్తుంది. రాతలో మర్చిపోయిన పదాన్నో, వాక్యాన్నో చేర్చడానికి పంక్తిలోని నిర్దేశిత ప్రదేశంలో పూర్వం ఓ సంకేతం వేసేవారు. అదే ‘హంసపాదు’. ‘ఆదిలోనే హంసపాదు’ అన్నది లోకోక్తి. ఇక ఒకనాటి భక్ష్యవిశేషం ‘హంసకళీలు’. ఇవి ఏంటో! వేటితో తయారుచేస్తారో మరి.
      ధ్వని అంటే స్వరం. వ్యంగ్యప్రధానంగా, కావ్యస్వరూపంగా ధ్వనికి ప్రయోజనముంది. హంసకు శబ్దార్థపరం పక్షి. కానీ, పురాణకావ్య వేద ధ్వనిగా ‘హమ్‌-స’... నేను పరమాత్మను అనే యోగ సారార్థం ఉంది. ‘కాకిలా కలకాలం బతికేకంటే హంసలా ఆర్నెలు బతికితే చాలు’ అనే సాధారణ లోకోక్తిగా హంస ధ్వని జానపద ప్రియపద ప్రయోగం. హంస అంటే బ్రహ్మ అని కూడా ధ్వనిస్తుంది మరి. అందుకే యోగికి పర్యాయపదం కావాలని బ్రహ్మ హంసరూపం దాల్చాడు. పరమహంస అయ్యి విహరిస్తున్న బ్రహ్మ నుంచి సాధ్యదేవులు ‘హంసగీత’ విన్నారని భీష్ముడు శాంతిపర్వంలో ధర్మజుడికి చెబుతాడు. ఓం, హ్రీం, శ్రీం, హం, సం అన్న అయిదు బీజాక్షరాలను కలిపి ‘హంస పంచాక్షరి’ అంటారన్నది ‘పారిమార్థిక పదకోశం’ వివరణ.
      పరమహంస అనే పదాన్ని యోగులకు గౌరవసూచకంగా వేమన వాడాడు. పరధనాన్ని ఆశపడేవాడు పరమహింస అవుతాడన్న వేమన సత్యశోధనలోని పరమహంసధ్వని ఖ్యాతిని కాదనలేం! సంస్కృత శబ్దంగా హంసకు ఆత్మ అనే అర్థముంది. శరీరం విడిచి పరమపదం చేరుకున్న ప్రాణానికి ‘హంస లేచిపోయింది’ అన్న తెలుగు మాట కూడా ఈ ఆధ్యాత్మిక హంసపదాన్ని అంగీకరించింది. ఆత్మ నిశ్చలమైన దీప ప్రకాశంతో శరీరంలో అనంతచక్ర, సహస్రార చక్రాల మధ్య వెలుగుతూ ఉందని చెప్పిన కుండలినీయోగ దర్శనసాధన నిపుణులైన పరమహంసలు... రామకృష్ణ పరమహంసలుగా, వివేకానందవాణిగా నిలిచారు. శరీరంలోని హంస జీవాత్మ. పరమాత్మకు పరమహంస అని పేరు. అందుకే భగవంతుడు పరమహంస రూపంలో చరిస్తాడని పురాణాలు చెబుతాయి. ఈజిప్టు దేవుడు Amon-Re హంసధ్వని చేస్తూ నీటిలో సంచరిస్తాడన్నది అక్కడి వాళ్ల నమ్మకం. గంగానది కృష్ణలో తీర్థమాడి తనలోని పాపరూపు పోగొట్టుకుని హంస రూపుదాల్చి, హంసలదీవికి ఖ్యాతి తెచ్చిందనే పుష్కర తీర్థస్నాన ప్రభావకథనం ఉంది.
      దేవతా వాహనంగానే కాదు, మానుష రూపంగా ప్రజాపతుల్లో ఒకరి పేరుగా హంస కనిపిస్తుంది. కృతయుగంలో విష్ణువు ఒక ప్రజాపతిగా జన్మించాడు. హంస నామధేయంతో శానకుడు వంటి రుషులకు యోగశాస్త్రం గురించి చెప్పాడు. గంధర్వ జాతికి చెందిన వ్యక్తిగా కశ్యపప్రజాపతి పక్షి సంతానజాతుల్లో ఒకడు తపస్సుచేసి హంస పేరుతో బ్రహ్మకు వాహన యోగ్యతను పొందాడని స్కాందపురాణ కథనం. ధృతరాష్ట్రుడు హంస అనే పేరుగల గంధర్వాంశ నుంచి జన్మించాడన్నది భారతకథనం. తిక్కన భారతంలో హంస పేరు లేదు కానీ, ధృతరాష్ట్రుణ్ని గంధర్వాంశగానే పేర్కొన్నాడు.
      హంస తెల్లదనం సాటిలేనిది. కొంగలు కూడా అంతే తెల్లగా ఉంటాయి. కానీ, హంస వివేకం ముందు అవి తెలతెలపోవాల్సిందేనని ఓ కవి భావన. ‘‘ఎవ్వడవీవు కాళ్లు మొగమెఱ్ఱన...’’ అంటూ వివేక- వివేకహీనుల పోలికగా ప్రసిద్ధ చాటువుంది. హంసకు కాళ్లు, ముఖం ఎర్రన. తామరతూడులు తింటుంది. కానీ, నత్తల గురించి తెలియని మానస సరోవర నివాసి. వివేకహీన కొంగల మధ్య అది ఉండలేదన్నది కవి చాటు ప్రశంస!
      కావ్యం నీతిని బోధించనక్కర్లేదు. కానీ, అవినీతిని బోధించకూడదు. అయ్యలరాజు నారాయణామాత్యుడి ‘హంసవింశతి’ కథల పరమార్థం ‘‘ఒకపురుషునిమనస్సు నన్యకాంతనుండి విముఖము చేయుటయే’’ అని కవులచరిత్ర చెబుతుంది. అయితే బొంకాడి తప్పించుకున్న ఉపాయాలు ఆమోదము కాకపోయినా జనమంచి శేషాద్రిశర్మ లాంటి ప్రముఖుల పీఠికతో ఆ కథలు విశ్వవిద్యాలయాల నుంచి పరిశోధనా గౌరవాన్ని పొందాయి. హంసవింశతి కథల్లో నాటి సమాజ విజ్ఞానాన్ని గురించిన విశేషాంశాలు హంసముఖతా వెలువడి సాహిత్యంలో నిలిచాయి.


వెనక్కి ...

మీ అభిప్రాయం