భూతాపంతో భాషలకీ ప్రమాదమే

  • 470 Views
  • 0Likes
  • Like
  • Article Share

వాతావరణంలోని మార్పుల గురించి చర్చించేందుకు 2015 డిసెంబరులో ఐక్యరాజ్యసమితి పారిస్‌లో ఓ సదస్సుని నిర్వహించింది. ఇందులో వాతావరణ మార్పుల గురించీ, అందులో మన పాత్ర గురించీ, ఈ మార్పుల వల్ల రాబోయే ఉపద్రవాల గురించీ రకరకాల చర్చలు జరిగాయి. కానీ ఇదే సమయంలో వాతావరణ మార్పుల వల్ల భాషల మీద కూడా ప్రభావం పడుతుందన్న ఒక కొత్త వాదనని కొందరు లేవదీస్తున్నారు. బంగోర్‌ విశ్వవిద్యాలయానికి చెందిన ‘అనౌష్కా ఫోల్జ్‌’ ప్రకారం వాతావరణంలోని మార్పుల వల్ల ఏదన్నా ఉపద్రవం సంభవించినప్పుడు, అక్కడి ప్రజలంతా చెల్లాచెదురైపోతారు. అలా ఒకచోట ఉండి ఒక భాషని మాట్లాడుకుంటున్న ప్రజలు కాస్తా వేరుపడిపోవడం వల్ల, వారి భాష కూడా మరుగున పడిపోతుంది. కొత్తచోట తమ భాషని మాట్లాడేవారు లేకపోవడమో, జీవనం కోసం అక్కడి భాషను నేర్చుకోక తప్పని స్థితి రావడమో జరుగుతుంది. ఇక ప్రకృతి విపత్తుల వల్ల జరిగే ప్రాణనష్టం వల్ల కూడా అల్పసంఖ్యాకులు మాట్లాడుకునే భాషలు అంతరించిపోతుంటాయి. ముఖ్యంగా చిన్నచిన్న దీవులలో నివసించే ఆదిమజాతి ప్రజలకు వారికంటూ ప్రత్యేకమైన ఆచారాలు, భాష ఉంటాయి. సునామీ వంటి ఉపద్రవాలు సంభవించినప్పుడు ఇలాంటి దీవులు పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంటాయి. ఫలితంగా ప్రాణనష్టమే కాదు, అక్కడి సంస్కృతి కూడా విధ్వంసమైపోతుంది. వారి భాష సైతం నీటిపాలైపోతుంది. ఉదాహరణకు 2010లో ఇండోనేసియాను వరదలు ముంచెత్తాయి. ఆ విపత్తులో పపువా అనే ప్రదేశం పూర్తిగా దెబ్బతిన్నది. పుపువా ప్రదేశంలో వినిపించే ‘డస్నర్‌’ అనే భాష ఉనికి సైతం ఈ ఉపద్రవం వల్ల ప్రమాదంలో పడింది. వరదల తర్వాత డస్నర్‌ భాషను మాట్లాడేవారు కేవలం ముగ్గురంటే ముగ్గురే మిగిలారు. పసిఫిక్‌ మహాసముద్రంలో ఉన్న ‘వనువాటు’ అన్న దేశాన్ని చూస్తే భూతాపం వల్ల స్థానిక భాషలకి ఎంత ప్రమాదం ఏర్పడుతోందో స్పష్టంగా తెలిసిపోతుంది. భూతాపం వల్ల సముద్రపు మట్టం నానాటికీ పెరిగిపోవడంతో, వనువాటులోని తీర ప్రాంతాలు తరచూ ముంపునకి గురవడం మొదలైంది. దాంతో చరిత్రలోనే తొలిసారిగా ఐక్యరాజ్యసమితి వీళ్లని ‘వాతావరణ శరణార్థులుగా’ గుర్తించింది. ఈ దేశంలో 100కి పైగా స్థానిక భాషలు ఉన్నాయి. మరి వనువాటు మునిగిపోతే వీటి పరిస్థితి...?!


ఇలా మనం చేయలేమా!
అమెరికా అంటేనే అదో ఆంగ్ల ప్రపంచం. ఆంగ్ల భాషను మాట్లాడేవారు ఇంగ్లండులోకంటే అమెరికాలోనే ఎక్కువగా ఉంటారు. కానీ, ఆ దేశంలో చాలామంది మాతృభాష ఆంగ్లం కాదు. వేర్వేరు దేశాల నుంచి ఉపాధికోసం అక్కడికి వచ్చినవాళ్లు కోకొల్లలు. కానీ, ఆ దేశంలో పెరిగే పిల్లలు ఇటు ఆంగ్లాన్నీ, అటు మాతృభాషనీ నేర్చుకుంటూ పెరగడమంటే కష్టమే. ఆంగ్ల భాషలో నైపుణ్యాన్ని సాధించాలంటే మాతృభాష పట్ల మమకారాన్ని చంపుకోక తప్పని స్థితి. పోనీ ఎలాగోలా మాతృభాషలోనే విద్యను సాగిద్దామంటే, మిగతావారికంటే వెనకబడిపోయే పరిస్థితి. దీనికి ఓ మార్గాన్ని కనుగొన్నారు ఆరెగాన్‌ రాష్ట్రంలోని విద్యాధికులు. అదే ద్విభాషా విద్యావిధానం! ఆ రాష్ట్రంలోని ఉడ్‌బర్న్‌ నగరంలో హెరిటేజ్‌ ప్రాథమిక పాఠశాలలో ఈ విద్యావిధానాన్ని ఓ దశాబ్దకాలంగా విజయవంతంగా అమలుపరుస్తున్నారు.
      ఉడ్‌బర్న్‌ నగరంలో స్పానిష్‌, రష్యన్‌ ప్రజలు సంఖ్య ఎక్కువ. వీళ్లకి అటు మాతృభాషలోనూ, ఇటు ఆంగ్లంలోనూ కలిపి బోధిస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన వచ్చింది అక్కడి విద్యాధికారులకి. అనుకున్నదే తడవుగా ‘హెరిటేజ్‌ ప్రాథమిక పాఠశాల’ని నమూనాగా తీసుకుని తమ ఆలోచనలకు ఒక కార్యరూపాన్ని ఇచ్చారు. ఇందులో భాగంగా పిల్లలకి రెండు భాషల్లోనూ పాఠ్యాంశాలను బోధిస్తారు. తొలుత ఆంగ్లం జోలికి పోకుండా కేవలం మాతృభాషలోనే బోధన ఉంటుంది. ఆ తర్వాత నిదానంగా ఆంగ్లభాషను అలవాటు చేస్తారు. ఆపైన రెండు భాషల్లోనూ బోధన సాగుతుంది. ఇందుకోసం మాతృభాషతో పాటుగా, ఆంగ్లం మీద కూడా పట్టు ఉన్న ఉపాధ్యాయులని నియమించారు. పాఠ్యపుస్తకాలు కూడా రెండు భాషల్లోనూ ఉంటాయి. అయితే, రెండు భాషల్లోనూ పాఠాలను నేర్పడం కేవలం పుస్తకాల ద్వారానే సాధ్యమయ్యే పని కాదు. అందుకోసం ఎన్నో దృశ్యశ్రవణ మాధ్యమాలని రూపొందించారు. విద్యార్థులు ఉపాధ్యాయులని ప్రశ్నిస్తూ, తోటి విద్యార్థులతో విజ్ఞానాన్ని పంచుకుంటూ చదువుని సాగించేందుకు అనువైన వాతావరణాన్ని కల్పించారు.
      ఈ ద్విభాషా విధానంతో ప్రభావితమైన తల్లిదండ్రులు కూడా తమకు చేతనైనంత సాయం చేస్తున్నారు. కొందరు నలభై పాఠ్యపుస్తకాలను ఆంగ్లం నుంచి రష్యన్‌లోకి అనువదించారు. ఇలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యాధికారుల సమష్టి కృషితో ఈ ద్విభాషా విద్యావిధానం ఇప్పుడు తరచూ వార్తల్లోకి వస్తోంది. అయితే ఇది కేవలం ఒక ప్రయోగంగానే మిగిలిపోలేదు. ఇక్కడ చదువుకున్న విద్యార్థులు ఉన్నత విద్యలో సైతం తమ ప్రతిభను చూపించడం మొదలుపెట్టారు. ఒకప్పుడు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఉడ్‌బర్న్‌లో ఉత్తీర్ణతా శాతం చాలా తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. రాష్ట్రస్థాయిలోనే అత్యంత ప్రతిభను కనబరిచే పాఠశాలల్లోకి హెరిటేజ్‌ ప్రాథమిక పాఠశాల కూడా చేరిపోయింది. ఈ తరహా విద్యావిధానాన్ని ఇతర రాష్ట్రాలలో కూడా అమలుపరచాలనే వాదనలూ వినిపిస్తున్నాయి. ఇంతాచేసి ఈ హెరిటేజ్‌ ప్రాథమిక పాఠశాలలో భారీ రుసుములేవీ ఉండవు. ఈ పాఠశాలలో చదువుకునే పిల్లల ఆర్థిక నేపథ్యమూ చాలా సామాన్యంగానే ఉంటుంది. వీరిలో చాలామంది పిల్లల తల్లిదండ్రులు రోజువారీ పనులు చేసి కుటుంబాన్ని పోషించుకునేవాళ్లు. అయినా, వాళ్ల పిల్లలు ఏమైతే మనకేం అని అక్కడి ప్రభుత్వం అనుకోలేదు. మరి మన దగ్గరో!


కెనడా 150
ఒకప్పుడు వేర్వేరు ప్రాంతాలుగా ఉన్న కెనడా 1867లో ఒక సమాఖ్యగా ఏర్పడింది. 2017 నాటికి ఈ చారిత్రాత్మక సంఘటన జరిగి 150 ఏళ్లు పూర్తికావస్తున్నాయి. ఈ సందర్భంగా వేడుకలు చేసుకునేందుకు కెనడాలో అన్ని ఏర్పాట్లూ జరుగుతున్నాయి. ఏ దేశంలోనైనా ఇలాంటి వార్షికోత్సవాలు సహజమే. కానీ వార్షికోత్సవాలలో భాగంగా కెనడా తీసుకున్న ఓ నిర్ణయం ప్రపంచదేశాలకి ఆదర్శంగా నిలుస్తోంది. ఈ ఉత్సవాల సమయంలో ఆ దేశం ‘కెనడా 150’ అనే ఖతి(ఫాంట్‌)ని అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనికి రెండు విశేషాలున్నాయి. అధికారిక విధుల్లో భాగంగా ఖతులను వాడేటప్పుడు ఆ ఖతి ఈ ఖతి అని కంగారుపడకుండా కెనడా 150ని నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. ఇక మరో విశేషం ఏమిటంటే స్థానికుల్లోని కొంతమంది మాతృభాషలైన ఇనక్టిటట్‌, క్రీ, ఒజిబ్‌వే వంటి అనేక ప్రాచీన భాషలని సైతం ఈ ఖతి ద్వారా అక్షరబద్ధం చేయవచ్చు. అందుకు అనుగుణంగా ఆంగ్లం, ఫ్రెంచ్‌ భాషల్లోని అక్షరాలు మాత్రమే కాకుండా లాటిన్‌, సిరిలిక్‌ భాషల లిపిని సైతం ఈ ఖతిలో చేర్చారు. ఇలా ఒక దేశంలోని ముఖ్య భాషలన్నింటికీ కలిపి ఒక ఉమ్మడి ఖతిగా రూపొందించడం చరిత్రలో ఇదే మొదటిసారి!
      ఇలా కెనడా ప్రభుత్వం ఒక ఉమ్మడి ఖతిని రూపొందించాలని అనుకున్నప్పుడు, జపాన్‌లో స్థిరపడిన కెనడావాసి ‘రేమండ్‌ లారబీ’ గురించి తెలిసింది. రేమండ్‌కి చిన్నప్పటి నుంచీ వైవిధ్యమైన ఖతులను రూపొందించడం అంటే చాలా ఇష్టం. తన ప్రవృత్తినే ఆయన వృత్తిగా మార్చుకుని ఓ సంస్థను కూడా నెలకొల్పారు. దాంతో ఆయనకే ఖతి రూపకల్పన బాధ్యతలను అప్పగించింది ప్రభుత్వం. ఆ తర్వాత రేమండ్‌ కొన్ని నెలలపాటు ఆయా భాషలన్నింటినీ క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. కెనడాలోని ప్రాచీన భాషలకి సంబంధించి కొన్ని ఖతులు అందుబాటులో ఉన్నప్పటికీ, అవన్నీ కూడా లోపభూయిష్ఠంగా ఉన్నాయని గ్రహించారు రేమండ్‌. ఖతి ముఖ్య ఉద్దేశం ఒక భాషని అచ్చులోకి తీసుకురావడమే కాదు, దాన్ని పాఠకులకు అందంగా సౌకర్యవంతంగా చూపించడం కూడా! ఈ దిశగా రేమండ్‌ చేసిన కృషి వల్ల ‘కెనడా 150’కి ఒక రూపం వచ్చింది. ప్రజలందరూ ఈ ఖతిని ఉచితంగా పొందే సౌకర్యాన్నీ, ఏ కంప్యూటర్‌కైనా అనుగుణంగా పనిచేయగలిగే సౌలభ్యాన్నీ కల్పించింది ప్రభుత్వం.


*   *   *


వెనక్కి ...

మీ అభిప్రాయం