మన పద్మాలు

  • 1089 Views
  • 0Likes
  • Like
  • Article Share

‘ప్రపంచంలో ఎక్కడ ఉన్నా, ఏ యాసలో మాట్లాడినా తెలుగువాళ్లందరూ ఒకటే. భాష ఔన్నత్యాన్ని కాపాడేందుకు ప్రాంతాలకతీతంగా తెలుగువాళ్లంతా ఒకటిగా ఉండాలి’ అంటారు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌. ప్రపంచ తెలుగు మహాసభల నుంచి రచయితల మహాసభల వరకూ... గురజాడ ‘కన్యాశుల్కం’ మీద చర్చాగోష్ఠి నుంచి జాషువా సంస్మరణ వరకూ... ఎక్కడ ఎలాంటి సభలు జరిగినా అక్కడ యార్లగడ్డ కనిపిస్తారు. తమిళనాడులో తెలుగు విద్యార్థులకు ఎదురవుతున్న ఇబ్బందికర పరిస్థితుల నుంచి తితిదే వ్యవహారాల్లో ఆంగ్లానికి పట్టం కట్టడం వరకూ ఎక్కడ అమ్మభాషకు అన్యాయం జరుగుతున్నా అక్కడ ఆయన గళం నిరసన స్వరాన్ని వినిపిస్తుంది. ‘తెలుగులో గొప్ప సాహిత్యం ఉన్నా, అది హిందీలోకి అనువాదమైతేనే దేశవ్యాప్త గుర్తింపు వస్తుంది’ అనే యార్లగడ్డ, ప్రధాని నేతృత్వంలోని కేంద్రీయ హిందీ సలహా మండలి సభ్యుడిగా ఉన్నారు. మరోవైపు తెలుగు భాషాభివృద్ధికి మచిలీపట్నం నుంచీ నెల్లూరు వరకూ, కౌతరం నుంచీ శ్రీకాకుళం వరకూ ‘సంస్కృతి చైతన్య యాత్ర’లు నిర్వహించారు. తెలుగుకు ప్రాచీనభాష హోదా కోసం కృషి చేసేందుకు అప్పట్లో ప్రభుత్వం నియమించిన టాస్క్‌ఫోర్స్‌ సభ్యుడుగా పనిచేశారు.
యార్లగడ్డ తెలుగు, హిందీ భాషల్లో చాలా రచనలు చేశారు. అనువాదాల్లోనూ ఆయనది అందెవేసిన చెయ్యి. ఆయన రచనల్లో ‘తమస్‌’, ‘ద్రౌపది’ ప్రఖ్యాతం. ఈ రెండింటికీ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు లభించాయి. ‘ద్రౌపది’ మీద చాలా చర్చ కూడా జరిగింది. వీటితోపాటు ‘జాతి నేత జయప్రకాశ్‌’, ‘సప్త స్వరాలు’, ‘వర్తమాన రాజకీయ దుస్థితి’, ‘కెరటాలు’, ‘ఇరవై ఒకటో శతాబ్దంలోకి’, ‘వేదనా భరితం- అబల జీవితం’, ‘సత్యభామ’, ‘కథనాల వెనుక కథలు’, ‘నా దేశం- నా ప్రజలు’ తదితర గ్రంథాలు రాశారు యార్లగడ్డ. ‘డా॥ రామ్‌ మనోహర్‌ లోహియా’, ‘పుచ్చలపల్లి సుందరయ్య’, ‘అసాధారణ నేత అటల్‌ బిహారీ’, ‘అట్టడుగు నుండి అగ్రస్థానం వరకు’ (సుశీల్‌కుమార్‌ షిందే) తదితర జీవితగాథలతో పాటు ప్రసిద్ధ హిందీ కవి ‘డా॥ హరివంశరాయ్‌ బచ్చన్‌ ఆత్మకథ’ను తెలుగువాళ్లకు అందించారు. మరాఠీ ప్రసిద్ధ రచయిత విష్ణుసఖారామ్‌ ఖండేకర్‌ రాసిన ‘యయాతి’ నవల, ఎల్‌.కె.అడ్వాణీ ‘ఎ ప్రిజనర్స్‌ స్క్రాప్‌ బుక్‌’లనూ తెలుగులోకి అనువదించారు. ‘హిందీ సాహిత్య చరిత్ర’ను తెలుగులో రాశారు.
తన కలం ద్వారా ప్రముఖ తెలుగు కవులనూ హిందీ పాఠకులకు పరిచయం చేశారు యార్లగడ్డ. బైరాగి కవితా ప్రాశస్త్యాన్ని వివరిస్తూ ‘తెలుగు కే ఆధునిక్‌ కవి బైరాగి’ గ్రంథం రాశారు. దీనికి కేంద్ర విద్యాశాఖ జాతీయ పురస్కారం లభించింది. కవిరాజు త్రిపురనేని మీద రాసిన ‘కవిరాజ్‌ త్రిపురనేని కే దో పౌరాణిక్‌ నాటక్‌’కు కేంద్ర మానవ వనరుల శాఖ జాతీయ పురస్కారం ఇచ్చింది. ‘వైచారిక్‌క్రాంతికే అగ్రదూత్‌ కవిరాజ్‌ త్రిపురనేని రామస్వామి’, ‘ముక్తి సంగ్రహ్‌’, ‘హిందీ కవితా కో ఆంధ్రోం కీ దేన్‌’, ‘ఆత్మహత్య’, ‘జ్ఞానపీఠ్‌ పురస్కార్‌ విజేత డాక్టర్‌ సి.నారాయణరెడ్డి’ తదితరాలను హిందీలో సృజించారు. వందకు పైగా పరిశోధనా వ్యాసాలు, ఉపన్యాసాలతో రచయితగా, విమర్శకుడిగా ఖ్యాతి గడించారు. ఈ సాహితీ సేవలకు గుర్తింపుగా 2003లో ‘పద్మశ్రీ’ పురస్కారం అందుకున్నారు. ఇప్పుడు ‘పద్మభూషణు’డయ్యారు.
నవంబరు 24 1953న గుడివాడలో జన్మించారు యార్లగడ్డ. తల్లిదండ్రులు రంగనాయకమ్మ, అంకినీడు. ఇద్దరూ ఉపాధ్యాయులే. యార్లగడ్డ అమ్మమ్మ దుగ్గిరాల లక్ష్మమ్మ ఉపాధ్యాయిని. ఈడుపుగల్లులోని వాళ్ల ఇంట్లోనే పెరిగారు. పెద్దమ్మ కూడా హిందీ ఉపాధ్యాయిని. వీళ్లిద్దరి స్ఫూర్తే తన జీవితం అంటారాయన.
దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన సమయంలో విద్యార్థి నాయకుడిగా జైలుశిక్షను అనుభవించారు. తర్వాత తెలుగు, హిందీ భాషల్లో డాక్టరేట్‌ పట్టాలు అందుకున్నారు. కృష్ణా జిల్లా నందిగామ, విజయవాడల్లో హిందీ అధ్యాపకుడిగా పనిచేశారు. తర్వాత ఆంధ్ర విశ్వవిద్యాలయంలో హిందీ ఆచార్యుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. అక్కడ 29 మంది పరిశోధక విద్యార్థులకు మార్గదర్శకత్వం వహించారు. ఆ తర్వాత ఆరేళ్ల పాటు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. ఆ సమయంలోనే పార్లమెంటరీ అధికార భాషా సంఘం ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు. ‘లోక్‌ నాయక్‌ ట్రస్ట్‌’ స్థాపించి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నవ్య సాహితీ కృషిని ప్రోత్సహిస్తున్నారు.


ఎల్లలు దాటిన పల్లెతనం...

చిత్రకళా ప్రపంచంలో తనదైన రేఖతో, తన్మయపరచే రంగుల పూతతో, మాట్లాడని బొమ్మలతో కోటి భావాలు పలికించే చిత్రకారుడు కె.లక్ష్మాగౌడ్‌. ఆయన పల్లెదనాన్ని కళ్లనిండా నింపుకున్నారు. శృంగార రసాన్ని కాన్వాసుపై ఒంపుతున్నారు. సంస్కృతికి అద్దంపట్టే బొమ్మలతో తన భావాలని మేళవించి సృజించారు. ఎన్నో ఏళ్ల ప్రయాణంలో ఎన్నెన్నో కళాఖండాలు ఆవిష్కరించిన కళాశ్రామికుడాయన. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం లక్ష్మాగౌడ్‌కు ‘పద్మశ్రీ’ ప్రకటించింది. ఎన్నో మైలురాళ్లు దాటిన ఆ కుంచె ప్రయాణమిది.
      పల్లె సంస్కృతీ,స్త్రీ పురుషుల సుఖదుఃఖాలు, కోపతాపాలు ఆయన కుంచెకి వస్తువులు. తెలంగాణ జీవన చిత్రాన్ని తన చిత్రాల్లో ప్రదర్శించి అంతర్జాతీయంగా గుర్తింపుపొందారు కలాల్‌ లక్ష్మాగౌడ్‌. చిత్రకళలో ఎప్పటికప్పుడు కొత్తరీతులను అనుసరిస్తూ గీసిన నిత్యనూతన చిత్రకారుడాయన. చిత్రకళలోనే కాక ముద్రణ, డ్రాఫ్టింగ్‌లలోనూ, శిల్పకళ, గాజుపై చిత్రకళలోనూ అపార అనుభవం ఆయన సొంతం. ఆయన మెదక్‌ జిల్లా నిజాంపూర్‌లో 1940 ఆగస్టు 21న పుట్టారు. తల్లిదండ్రులు వెంకాగౌడ్‌, అంతమ్మ. చదువు మీద శ్రద్ధకన్నా బొమ్మమీద ప్రీతి ఎక్కువ. అది గుర్తించిన తండ్రే తనని చిత్రకళా కళాశాలలో చేర్పించి లక్ష్మాగౌడ్‌ని ప్రోత్సహించారు. హైదరాబాదు ఫైన్‌ ఆర్ట్స్‌ అండ్‌ లిటరేచర్‌ కళాశాలలో డ్రాయింగ్‌, పెయింటింగ్‌లలో డిప్లొమా పూర్తిచేశారు. పీజీ డిప్లొమా బరోడా మహారాజా శాయాజీరావ్‌ గాయిక్వాడ్‌ విశ్వవిద్యాలయంలో చేశారు. అక్కడ కేజీ సుబ్రమణియన్‌ నేతృత్వంలో ఇంటి పైకప్పుల లోపలి భాగాలపై వేసే మ్యూరల్‌ పెయింటింగుల అధ్యయనం సాగించారు. ఆ సమయంలోనే ముద్రణా రంగంపై కూడా ఆసక్తి మొదలైంది. దాంతో ఆ విభాగంలో కృషిచేసి నూతన ఒరవడి సృష్టించారు. చదువు పూర్తయ్యాక తిరిగి తన పల్లెకు చేరుకున్నారు. పట్నంలో నేర్చుకున్న లౌకిక దృక్కోణంనుంచి బయటపడి, పల్లె జీవన సహజత్వాన్ని తన చిత్రకళా నేపథ్యంగా చేసుకున్నారు. తర్వాత పుణెలోని ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్‌, మలేషియాలోని ఏషియా పసిఫిక్‌ టెలివిజన్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లలో పనిచేశారు. ఆ సమయంలో సరోజినీనాయుడు స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌లో పీజీ, పరిశోధన విద్య సిలబస్‌ రూపకల్పనకోసం హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆహ్వానంపై ఆ విశ్వవిద్యాలయానికి వెళ్లారు. అక్కడే అధ్యాపకుడిగా పనిచేసి 2001లో డీన్‌గా పదవీ విరమణ చేశారు. ఈ క్రమంలో ఎందరో వర్ధమాన చిత్రకారుల గీత మార్చారు.
      నిజాంపూర్‌ పేరుతో ఆయన గీసిన చిత్రాలు ఎంతో ప్రసిద్ధి చెందాయి. రాష్ట్రంలో నిర్వహించిన అనేక ప్రదర్శనల్లో అనేకసార్లు బంగారు పతకాలు సాధించారు లక్ష్మాగౌడ్‌. జీవిత సాఫల్య పురస్కారంతో పాటు తెలంగాణ రాష్ట్ర పురస్కారం కూడా అందుకున్నారు. అంతర్జాతీయంగా భారతీయ సంస్కృతిని వర్ణించే బాధ్యత తనదే అన్నట్లు, 1973లో లండన్‌లో తన చిత్రాల విదేశీ ప్రదర్శనకు శ్రీకారం చుట్టారు. ఆ పరంపరలో వార్సా, బుడాపెస్ట్‌, మ్యూనిచ్‌, టోక్యో, బ్రెజిల్‌, ఆమ్‌స్టర్‌డామ్‌ల సాక్షిగా కొనసాగుతూనే. తొలినాళ్లనుంచీ సామూహిక ప్రదర్శనలు పదుల సంఖ్యలో చేశారు.
      శృంగార భావన కలిగించే చిత్రాలు గీశారే అవి అందరికీ ఆమోదయోగ్యమేనా అనే ప్రశ్న తలెత్తినప్పుడు... ‘మన సంస్కృతిలో భాగమైన అంశాల మీద నా కుంచె స్పందన అది. వాటిని కళాదృష్టితోనే చూడాలి’ అంటారాయన. తాను పుట్టిపెరిగిన నిజాంపూర్‌ తీరుతెన్నులు, అక్కడి జనజీవనం, పనులూ, వ్యాపకాలే ఆయన్ని నిత్యం ప్రేరేపిస్తాయి. గురుతుల్యులు జగదీష్‌ మిట్టల్‌ వద్ద తనివితీరా చూసిన కళాఖండాలూ స్ఫూర్తినింపేవే. పికాసో పాల్‌ వీక్లీ చిత్రాలంటే ఇష్టపడే ఆయన వారి ప్రభావం తనమీద ఉందన్నారంటే దానికి అధివాస్తవికత గల చిత్రాలే నిదర్శనం. ఆయన గీసిన నిండైన పొదుగులతో ఉన్న మేకల చిత్రాలు గ్రామీణ భారతావనికి ప్రతీకలు. ఆయన చిత్రాలు మానవుడి చిత్తప్రవృత్తులను నిఖార్సయిన కోణంలో ఆవిష్కరిస్తాయి. యువ చిత్రకారులు ఒక దృక్పథం ఏర్పరచుకోవాలి, సృజన, కొత్తదనం, ప్రయోగాల వైపు పరుగులు తీయాలని కాంక్షించే వ్యక్తి ఆయన.


మనసున్న వైద్యుడు

డా॥ గోపీచంద్‌ మన్నం ప్రపంచానికి భారత వైద్య రాయబారి. మనదేశమే కాదు... ఇథియోపియా, లిబియా లాంటి పేదదేశాల చిన్నారుల గుండె సంబంధ వ్యాధుల చికిత్సకు తనవంతు సహకారాన్ని అందిస్తూ, తెలుగువారి ఉదారత్వాన్ని ప్రపంచానికి చాటుతున్నారు. అంతేకాదు... అమ్మలాంటి అమ్మభాష అభివృద్ధికీ నేనుసైతం అంటూ ఒక సంస్థను స్థాపించి సాహితీ ప్రచారమూ చేస్తున్నారు. వైద్యరంగంలో గోపీచంద్‌ కృషికి భారత ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చి గౌరవించింది.

ఒంగోలుకు చెందిన గోపీచంద్‌ ప్రముఖ హృద్రోగ నిపుణులు. మన్నం నరసింహం, సుబ్బమ్మ దంపతులు ఆయన తల్లిదండ్రులు. గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ చదివిన గోపీచంద్‌, తర్వాత ఉన్నతవిద్యకు జమైకా వెళ్లారు. అక్కడే శస్త్రచికిత్సల్లో నైపుణ్యం సాధించిన ఆయన లండన్‌లో ఎఫ్‌ఆర్‌సీఎస్‌ పట్టా అందుకున్నారు. కొన్నేళ్లపాటు లండన్‌లోనే వైద్య సేవలందించిన ఆయన 1995లో హైదరాబాదుకు వచ్చారు. 2008లో స్టార్‌ హాస్పిటల్‌ü్సను స్థాపించారు. ఇప్పటివరకు సుమారు 25000 గుండె ఆపరేషన్లు చేశారాయన. సమాజం నుంచి తీసుకోవడమే కాదు... మనమూ ఏదైనా తిరిగి ఇవ్వాలని నమ్మిన గోపీచంద్‌ చిన్నపిల్లల గుండె సమస్యల నివారణకు ‘హృదయ ఫౌండేషన్‌’ స్థాపించారు. దాదాపు 3000 మంది పేద చిన్నారులకు ఉచితంగా చికిత్సను అందించారు. తనకు పద్మశ్రీ రావడం గురించి స్పందించమన్నప్పుడు ‘‘...ఇది నా ఒక్కడికే కాదు. నాతోటి వైద్య బృందానికి కూడా. ఇది సమాజం పట్ల నా బాధ్యతను మరింత పెంచింది. ఇకనుంచి నెలకు కనీసం 50 మంది పిల్లలకు ఉచితంగా హృద్రోగ చికిత్స చేయాలని మేము నిర్ణయించుకున్నాం’’ అని చెప్పారు గోపీచంద్‌.
వైద్యుడిగా క్షణం తీరిక లేనప్పటికీ గోపీచంద్‌కు తెలుగు భాష, సాహిత్యం అంటే ఎంతో ఇష్టం. అందుకే, తెలుగు భాషా సాహిత్యాల అభివృద్ధికి, మన సాహితీ సంపదను భవిష్యత్తు తరాలకు భద్రంగా అందించేందుకు తన సోదరుడు మన్నం వెంకటరాయుడుతో కలిసి ‘మనసు ఫౌండేషన్‌’ స్థాపించారు (తమ ఇంటిపేరు, తల్లిదండ్రుల పేర్లలో మొదటి అక్షరాల కలయిక). తెలుగు రచయితల సమగ్ర రచనల ప్రచురణ ఈ సంస్థ లక్ష్యం. ఇప్పటివరకూ రావిశాస్త్రి రచనలు, శ్రీశ్రీ రచనలు (కవిత్వం, కథలు, జీవితం) సంపుటాలు, బీనాదేవి సమగ్ర రచనలు, గురజాడ 150వ జయంతి సందర్భంగా ‘గురుజాడలు’ పుస్తకం, జాషువా సమగ్ర రచనలు, సర్‌ ఆర్థర్‌ కాటన్‌ జీవితం- కృషి, పతంజలి రచనలు తదితరాలను ప్రచురించింది ‘మనసు ఫౌండేషన్‌’. ఇంకా బుచ్చిబాబు, సభా, కలువకొలను సదానంద, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి రచనలు కూడా ప్రచురించబోతున్నారు. పుస్తకాల్ని కూడా అందరూ కొనేందుకు వీలుగా ముద్రణా వ్యయంకంటే తక్కువకే అందుబాటులో ఉంచుతున్నారు. అయితే మెడిసిన్‌, లేకపోతే ఇంజినీరింగ్‌ వైపు పరుగెత్తుతూ తెలుగు చదివితే ఎంత లేకపోతే ఎంత అనుకుంటున్నారు ఈతరం విద్యార్థులు. అలాంటిది ఎవరు ఏది చదివినాసరే అమ్మభాషను, అమ్మభాషలోని సాహితీ మధురిమల్ని ఆస్వాదించడం మరిచిపోవద్దు అంటున్న ఈ వైద్యనారాయణుడి జీవితం ఇప్పటి, భావితరాలకు ఆదర్శప్రాయం, స్ఫూర్తిదాయకం.


‘‘నేటి తరానికి సాహిత్యం మీద అవగాహన ఎంతుంది? పోతన, శ్రీనాథుడు వంటి కవుల రచనలు ఈనాటి తరానికి ఎంత మేరకు తెలుసు? శ్రీకృష్ణదేవరాయలు తెలుగు భాష గొప్పదనాన్ని కాపాడటానికి నడుం కట్టాడు కాబట్టే అష్టదిగ్గజాలు వెలుగొందారు. నాటి కృష్ణదేవరాయలంటే నేటి ప్రభుత్వం. తెలుగు భాషాభివృద్ధి కోసం ప్రభుత్వం ఏం చేస్తోంది? భాషాభివృద్ధిని వ్యవస్థీకృతం చేయాలి. వ్యక్తిగతంగా ఎంత కృషిచేసినా దాని ఫలితం నామమాత్రమే. అదే ప్రభుత్వం దీనిపై చిత్తశుద్ధితో దృష్టిపెడితే ఫలితం అపారం. తెలుగులో చదివినా సరే... పోటీపరీక్షల్లో తమ పిల్లలు నెగ్గుకురాగలరనే ఆత్మవిశ్వాసాన్ని తల్లిదండ్రుల్లో పెంచాలి. భవిష్యత్తుకు ఇబ్బంది లేదనే భరోసా ఇవ్వాలి. ప్రజల్లో ఆ నమ్మకం రావాలంటే ఓ తరం పట్టొచ్చు. కానీ ఇప్పటి నుంచైనా మొదలుపెడితే వచ్చే తరం వరకైనా మార్పు రావచ్చు’’    


వైద్యానికే అంకితం

మన దేశంలో గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగంలో రోగులకు అత్యుత్తమ వైద్యసేవలు అందుతున్నాయంటే కారణం డాక్టర్‌ నాగేశ్వరరెడ్డి. కొన్నేళ్ల కిందట అమితాబ్‌ బచ్చన్‌ స్వయంగా నాగేశ్వరరెడ్డికి ఫోన్‌ చేసి, తన తండ్రికి వైద్యం చేయాలని కోరారు. అంతకు ముందు ఆయన అమెరికా వైద్యుల్ని సంప్రదించారట. అక్కడి వాళ్లు ‘మీ దేశంలోనే ప్రపంచస్థాయి వైద్య నిపుణుడు ఉన్నారు’ అంటూ నాగేశ్వరరెడ్డి గురించి చెప్పారట. గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టుగా అనేక జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలను అందుకున్న డాక్టర్‌ నాగేశ్వరరెడ్డి ఖ్యాతికి ఇదో మచ్చుతునక.
     నాగేశ్వరరెడ్డి స్వస్థలం చిత్తూరు జిల్లా వీరనత్తోడ్‌. తండ్రి భాస్కరరెడ్డి పాథాలజీ అధ్యాపకుడు. అమ్మ శారద. 1979లో కర్నూలు మెడికల్‌ కళాశాలనుంచి ఎంబీబీఎస్‌ పట్టా అందుకున్నారు. అయిదేళ్ల చదువులో అన్నిసార్లూ ఆయనదే మొదటి స్థానం. కాబట్టే పది బంగారు పతకాలు సాధించగలిగారు. ఆ తర్వాత మద్రాస్‌ విశ్వవిద్యాలయంలో ఎండీ చేశారు. అనంతరం చండీగఢ్‌ పీజీఐఎంఈఆర్‌ విశ్వవిద్యాలయంలో గ్యాస్ట్రో ఎంట్రాలజీలో డీఎం పూర్తిచేశారు. ఈ సమయంలోనే కరోల్‌ని ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. ఆ తర్వాత నుంచి ప్రజలకు వైద్యసేవలు అందివ్వడంలోనే మునిగిపోయారు. వాటికి గుర్తింపుగా ఏషియన్‌ ఎండోస్కోపిక్‌ మాస్టర్స్‌ ఫోరమ్‌ తొలి గ్రాండ్‌మాస్టర్‌గా ఎన్నికయ్యారు. ఆ పనుల్లో భాగంగా 160 దేశాల్లోని నిపుణులకు ఈ రంగంలో శిక్షణ ఇస్తున్నారు. తొలినాళ్లలో విదేశాల నుంచి అనేక అవకాశాలు వచ్చినా వెళ్లలేదు. మనదేశంలో గ్యాస్ట్రో ఎంట్రాలజీలో నిపుణులు చాలా తక్కువని, ఈ రంగాన్ని అభివృద్ధి చేయాలని ఇక్కడే ఉండిపోయారు. హైదరాబాద్‌లో ఏషియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజీని స్థాపించారు. అందులోనే ఎంతోమంది వైద్యులకు శిక్షణ ఇస్తున్నారు. శ్రీలంక, సింగపూర్‌ ప్రభుత్వాలు ఇక్కడ శిక్షణ పొందిన తర్వాతే తమ విద్యార్థుల గ్యాస్ట్రో ఎంట్రాలజీ పట్టాలకు గుర్తింపునిస్తున్నాయి. ఇంత తీరికలేని సమయంలో కూడా రోగులను తానే స్వయంగా చూస్తారు నాగేశ్వరరెడ్డి. వృత్తి పట్ల ఆ నిబద్ధతతోనే ఆయన గతంలో ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని అందుకున్నారు. ఇప్పుడు పద్మభూషణుడయ్యారు.


అలుపెరగని పరిశోధకుడు

ఔషధాల రంగంలో విశేష కృషి చేసిన ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్‌ ఆళ్ల వెంకట రామారావు. ఔషధాల్లో సహజ ఉత్పత్తుల సంశ్లేషణ, సంక్లిష్ట ఉత్పత్తుల గురించి పరిశోధనలు చేశారు. వాటికి సంబంధించి దాదాపు 30 పేటెంట్లు సాధించారు. ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ఐఐసీటీ) సంచాలకుడిగానూ సేవలందించారు. దాదాపు 50 రకాల ఔషధాల పరిశోధన, తయారీలో భాగస్వాములైన ఆయన, భారత ఔషధ పరిశ్రమకే గర్వకారణం.
      రామారావు 1935లో ఏప్రిల్‌ 2న గుంటూరులో పుట్టారు. స్థానిక ఏసీ కళాశాలలో రసాయనశాస్త్రంలో డిగ్రీ చేశారు. 1960లో బొంబాయి విశ్వవిద్యాలయంలో ఉన్నత చదువులు పూర్తిచేశారు. ఆ తర్వాత రెండేళ్లు హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలో పరిశోధనలు సాగించారు. మొక్కల నిర్మాణం మీద ఆయన చేసిన పరిశోధనలు నూతన ఆవిష్కరణలకు అవకాశం కల్పిస్తాయని సీనియర్‌ ఆచార్యులు గుర్తించారు. అనంతర కాలంలో ఆమేరకు ఫలితాలూ సాధించారు డాక్టర్‌ రామారావు. కొన్నేళ్లు నేషనల్‌ కెమికల్‌ లేబొరేటరీలో శాస్త్రవేత్తగా పనిచేశారు. 1985లో ఐఐసీటీ సంచాలకుడిగా నియమితులయ్యారు. ఈ సమయంలో ఆయన అందించిన సేవలకు గానూ ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని అందుకున్నారు. తన పరిశోధనలని మరింత విస్తృతం చేసేందుకు 1995లో హైదరాబాదులో ఏవీఆర్‌ఏ లేబొరేటరీస్‌ను స్థాపించారు. ఔషధాల రంగంలో కొత్త పరిశోధనలు చేయడమే ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం. ఎయిడ్స్‌ వ్యాధి చికిత్సకు ఉపయోగించే ఏజెడ్‌టీ ఔషధాన్ని అతి చౌకగా తయారుచేసే విధానాన్ని రామారావు ఆవిష్కరించారు. ఆయన భార్య హైమవతి. వాళ్లకు ఇద్దరు అబ్బాయిలు. వాళ్లూ ఔషధ పరిశోధనల్లో డాక్టరేట్లు చేసి, ఇప్పుడు తండ్రితో కలిసి పనిచేస్తున్నారు.
      సమాజం కోసం ఎంతో కొంత చేశానన్న సంతృప్తే చాలని చెప్పే ఆయనకు తాజాగా ప్రభుత్వం ‘పద్మభూషణ్‌’ ప్రకటించింది.


పేదల వైద్యుడు

ప్రభుత్వాసుపత్రుల్లో రోగులను చీదరించుకుంటారన్న జనాభిప్రాయాన్ని మార్చేసిన వ్యక్తి... రెక్కాడితే కానీ డొక్కాడని పేదల పిల్లలకు ఖరీదైన శస్త్రచికిత్సలను చవగ్గా నిర్వహించిన వైద్యుడు... అన్నింటికీ మించి అవిభక్త కవలలకు పునర్జన్మ ప్రసాదించడంలో అంతర్జాతీయ ఖ్యాతి పొందిన తెలుగు బిడ్డ... యార్లగడ్డ నాయుడమ్మ. బడుగు జీవులకు అత్యుత్తమ వైద్యసేవలు అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వాసుపత్రి (గుంటూరు)లోనే పనిచేశారు నాయుడమ్మ. పదవీ విరమణ చేసిన తర్వాత కూడా ఇప్పటికీ అవిభక్త కవలలను విడదీయడానికి సంబంధించి తనను సంప్రదించిన వైద్యలకు తగిన సూచనలు, సలహాలు అందిస్తూనే ఉన్నారు.
జూన్‌ 1, 1947న ప్రకాశం జిల్లా కారంచేడులో జన్మించారు నాయుడమ్మ. తల్లిదండ్రులు రంగమ్మ, సుబ్బారావు. గుంటూరు, రోహతక్‌ (హరియాణా), దిల్లీ ఎయిమ్స్‌లో వైద్యవిద్యను అభ్యసించారు. 1979లో ఉద్యోగంలో చేరారు. గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల, గుంటూరు వైద్య కళాశాలలో చిన్న పిల్లల శస్త్రచికిత్సల వైద్యునిగా, అధ్యాపకునిగా 35 ఏళ్లు సేవలు అందించారు. రామలక్ష్మణులు, అంజలి-గీతాంజలి, రేఖ-సురేఖ తదితర అవిభక్త కవలలను విజయవంతంగా విడదీశారు. మూడున్నర దశాబ్దాల వృత్తిజీవితంలో ఎంతోమంది చిన్నారులకు శస్త్రచికిత్సలు చేశారు. వాళ్లలో ఎక్కువ శాతం పేద కుటుంబాల వాళ్లే. నిస్వార్థమైన ఈ సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం ఇప్పుడు ‘పద్మశ్రీ’ ప్రకటించింది. ఆయన భార్య డాక్టర్‌ వై.కృష్ణభారతి. వాళ్లకు ఇద్దరు పిల్లలు. ‘‘మాతృ భాషపై మమకారం, పట్టు ఉంటే వృత్తిలో బాగా రాణించగలం. నా ప్రాథమిక విద్యాభ్యాసం అంతా తెలుగు మాధ్యమంలోనే సాగింది. వైద్యం కోసం అన్ని వర్గాల వాళ్లూ వస్తారు. వాళ్లందరి సాధక బాధకాలు తెలుసుకుని, మంచిగా సేవలు అందించటానికి తెలుగుభాషతో పాటు గ్రామీణ నేపథ్యం నుంచి రావటం బాగా ఉపకరించింది. తెలుగు భాషాభివృద్ధికి నిరంతరం కృషి జరుగుతూనే ఉండాలి’’ అనే నాయుడమ్మ భాషాభిమాని కూడా.

- కాకర్ల వాసుదేవరావు, గుంటూరు


వెండితెరపై రాజమౌళి

చలనచిత్రం... ఓ మాయ! ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు కనికట్టు చేయడం. కుర్చీలో కూర్చున్న ప్రేక్షకుణ్ని, వూహల పల్లకి ఎక్కించుకొని తెర వెనక్కి తీసుకెళ్లి పాత్రల మధ్య వదిలిపెట్టడం! ఎక్కడ నేర్చుకొన్నారో... ఇవన్నీ భలేగా ఒడిసిపట్టేశారు ఎస్‌.ఎస్‌.రాజమౌళి. ‘ఈగ’ని సైతం హీమాన్‌గా చూపించడం, కథానాయకుణ్ని దేవుడికంటే బలవంతుడిగా మార్చడం... ఆయన కథల్లోనే కనిపిస్తాయి. కథ ఏదైనా, అందులో రాజమౌళి ముద్ర కనిపిస్తుంది. వెండితెర కాన్వాస్‌పై రంగు రంగుల కథల్నీ కలల్నీ కళగా రంగరించి ఆవిష్కరించడమే ఆయన విజయ రహస్యం.
ఒక మెట్టు తరవాత మరో మెట్టు ఎక్కుతారంతా. రాజమౌళి మాత్రం అలా కాదు. వరుస విజయాలతో మెట్లు వదిలి మేఘాలు దాటి ఆకాశంలో కూర్చున్నారు. నిజంగా అది మాయే... రాజమౌళి మాయ. కథానాయకుడి పాత్రని తీర్చిదిద్దడంలోనే దర్శకుడి విజయ రహస్యం దాగుంటుంది అంటుంటారు. కానీ రాజమౌళి ఈ సూత్రాన్ని తలకిందులుగా చూశారు. ప్రతినాయకుడిపై దృష్టి పెట్టారు. ఆయన చిత్రమేదైనా తీసుకోండి... ప్రతినాయకుడు అనంత శక్తిమంతుడిగా కనిపిస్తాడు. పతాక సన్నివేశాల వరకూ అతనిదే అంతులేని ఆధిపత్యం. ప్రతినాయకుడిపై నేరుగా ప్రేక్షకుడే పగ పెంచుకునేంత స్థాయిలో ఆ పాత్రతో విశ్వరూప ప్రదర్శన చేయిస్తారు రాజమౌళి. సరిగ్గా అప్పుడే కథానాయకుడి విజృంభణ మొదలవుతుంది. శత్రుసంహారాన్ని వూహకు అందని రీతితో తీర్చిదిద్దుతారు... రాజమౌళికి నూటికి నూరు మార్కులు పడిపోతాయి.
కథలో ఎక్కడ ఎలాంటి ముడి వేయాలో జక్కన్నకు బాగా తెలుసు. జాగ్రత్తగా గమనిస్తే... ‘సింహాద్రి’, ‘సై’, ‘విక్రమార్కుడు’, ‘మగధీర’, ‘మర్యాద రామన్న’... ఇలా ప్రతీ కథని ఓ చోట ఉచ్ఛదశకి తీసుకెళ్తాడు రాజమౌళి. అక్కడి వరకూ కథ ఒక ఎత్తు. ఆ ఒక్క సన్నివేశమే మరో ఎత్తన్నమాట. ‘మగధీర’లో కాలభైరవ వందమందిని తుదముట్టించే సన్నివేశం ఇందుకు మంచి ఉదాహరణ. అక్కడి నుంచే ‘మగధీర’ కథాగమనం రేసుగుర్రంలా పరుగందుకుంటుంది. అన్ని కథల్లోనూ రాజమౌళి అనుసరించే సూత్రం ఇదే. క్రికెట్‌ తప్ప మరో క్రీడ గురించి దృష్టిపెట్టమని తెలిసీ రగ్బీతో ‘సై’ కథ అల్లుకొన్నాడు. అక్కడే రాజమౌళిలో మొండితనంతో కూడిన ధైర్యం కనిపిస్తుంది.
ఓ కథని వ్యాపార సూత్రాలకు అనుగుణంగా, సామాన్య జనానికి అర్థమయ్యేలా ఆవిష్కరించడంలో రాఘవేంద్రరావు సిద్ధహస్తులు. ఆయన దగ్గర శిష్యరికం చేసిన రాజమౌళి... ఆ పట్టునీ బాగా పట్టేశారు. అయితే అక్కడితో ఆగలేదు. దానికి తనదైన శైలిలో సాంకేతిక హంగుని అద్దారు. అదే ఆయనకి ప్రత్యేక స్థానం కల్పించింది. ‘మగధీర’తో తొలిసారి రాజమౌళిలోని సిసలైన సాంకేతిక నిపుణుడు బయటకు వచ్చాడు. ఆధునిక సాంకేతికతని కథానుసారం వాడుకొంటే ఎన్ని అద్భుతాలు చేయొచ్చో నిరూపించిన చిత్రమది. ఆ తర్వాత... ‘ఈగ’! హాలీవుడ్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలుగు తెరపై ఆవిష్కరించిన తీరు అబ్బురపరిచింది. అవన్నీ ఒకెత్తు.. ‘బాహుబలి’ మరో ఎత్తు. తెలుగు సినిమా అంటే.. వందకోట్లు కొట్టడమే గగనం అనుకున్న తరుణంలో వంద రెండొందలైంది. రెండు మూడొందలైంది.. చివరికి ఆరొందల కోట్ల రూపాయలతో యావత్‌ భారతీయ చలన చిత్రపరిశ్రమని నివ్వెరపరిచింది. చాలాకాలంగా సినిమాలకు దూరమై ఇంటికే పరిమితమైన ప్రేక్షకుల్ని కూడా థియేటర్లకు రప్పించగలిగారు రాజమౌళి.. అదే అన్నింటికంటే పెద్ద మాయ!
24 విభాగాలపైనా సంపూర్ణ ఆధిపత్యం చలాయిస్తారు రాజమౌళి. మిగిలిన సాంకేతిక బృందం కూడా ఆయన ఆలోచనలకు అనుగుణంగా ఆలోచిస్తుంది. ఆయన కలల్ని నిజం చేయడం కోసం చెమటోడుస్తుంది. రాజమౌళి అప్రతిహత విజయ యాత్రకు ఇదీ ఓ కారణం. తన చుట్టూ ఉన్న ‘కుటుంబ’ వాతావరణం... రాజమౌళి అంతులేని బలం. మరోవైపు హాలీవుడ్‌ చిత్రాల ప్రభావం రాజమౌళి మీద ఉంది. ‘ఈగ’, మర్యాద రామన్న’, ‘మగధీర’లల్లోని కొన్ని సన్నివేశాలను చూసి, వీటికి ఆంగ్ల చిత్రాలే స్ఫూర్తి అన్నారు కొంతమంది. ఈ నిజాన్ని కూడా అంగీకరించడం రాజమౌళి వినమ్రతకు నిదర్శనం. ఆయన వెనుక ఉన్నవి కేవలం పదంటే పది చిత్రాలు. అయినా... పది కాలాలపాటు నిలిచే సత్తా ఉన్న కథలవి. సినిమాల్నే ప్రాణంగా భావించి.. తెలుగు సినీ పరిశ్రమ మొత్తానికే వన్నె తీసుకొచ్చిన రాజమౌళిని ‘పద్మశ్రీ’ వరించడంలో ఆశ్చర్యం ఏముంది!?

- అన్వర్‌, హైదరాబాదు


పడిలేచిన కెరటం

1999లో హైజాక్‌ అయిన కాందహార్‌ విమానంలో సానియా మీర్జా కూడా ఉందన్న సంగతి చాలామందికి తెలియకపోవచ్చు. అప్పుడు తనకు 13 ఏళ్లు. కట్‌చేస్తే.. మహిళల టెన్నిస్‌ డబుల్స్‌లో ప్రపంచ నెంబర్‌వన్‌. వరుసగా గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు. కొన్ని నెలలుగా ఓటమే ఎరుగని వైనం. ప్రపంచ టెన్నిస్‌ మీద తనదైన ముద్రవేసి, భారత్‌లో ఆ ఆటకే వన్నె తెచ్చిన ఘనత 29 ఏళ్ల సానియా సొంతం. అందుకే ఆమెను ‘పద్మభూషణ్‌’ వరించింది.
ఆరేళ్లకే టెన్నిస్‌ రాకెట్‌ పట్టిన సానియా 2003లో ప్రొఫెషనల్‌ క్రీడాకారిణి అయింది. కుజ్‌నెత్సోవా, జ్వొనరేవా, బర్తోలి, మార్టినా హింగిస్‌, సఫీనా, విక్టోరియా అజరెంకా వంటి అగ్రశ్రేణి క్రీడాకారిణులపై గెలిచింది. 2007 డబ్లూటీఏ సింగిల్స్‌లో 27వ ర్యాంకు సాధించింది. భారత్‌ తరఫున అత్యుత్తమ ర్యాంకు ఇదే. వరుస గాయాలు సానియా కెరీర్‌ను దెబ్బతీశాయి. మణికట్టు, మోకాలుకు శస్త్రచికిత్సలు జరిగాయి. ఇక ఆడటం కష్టమన్నారు వైద్యులు. రాకెట్‌ వదిలేయమన్నారు కుటుంబ సభ్యులు. సానియా మాత్రం మరింత పట్టుదలతో టెన్నిస్‌లో పునరాగమనం చేసింది. 2009లో మహేశ్‌ భూపతితో కలిసి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ విజేతగా అవతరించింది. 2012లో మళ్లీ మహేశ్‌తో కలిసే ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ గెలుచుకుంది. 2013లో సింగిల్స్‌ను పూర్తిగా వదిలిపెట్టేసింది. డబుల్స్‌లో వెస్నినా, బర్తోలి, కారా బ్లాక్‌లతో జట్టుకట్టిన సానియా ఎన్నో విజయాలు సొంతం చేసుకుంది. 2014లో బ్రూనో సోర్స్‌తో కలిసి యూఎస్‌ ఓపెన్‌లో మిక్స్‌డ్‌ డబుల్స్‌ గెలిచింది. ఆ ఏడాది చివర్లో కారా బ్లాక్‌తో కలిసి డబ్ల్యూటీఏ ఫైనల్స్‌ టైటిల్‌ చేజిక్కించుకుంది. ఇక 2015 సానియా కెరీర్‌లో చిరస్మరణీయం. డబుల్స్‌లో నెంబర్‌వన్‌ ర్యాంకు సాధించింది. మార్టినా హింగిస్‌తో కలిసి వింబుల్డన్‌, యూఎస్‌ ఓపెన్‌లలో డబుల్స్‌ టైటిళ్లు సాధించింది. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లోనూ గెలిచి 2016 ఘనంగా ఆరంభించింది.


విజయాలకు పర్యాయపదం

తొమ్మిదో ఏట షటిల్‌ రాకెట్‌ పట్టింది సైనా నెహ్వాల్‌. ఉదయం నాలుగున్నర నుంచి రాత్రి 9 వరకూ అటు సాధన- ఇటు చదువు. రెండింటికీ సమ ప్రాధాన్యమిస్తూ కఠోర శ్రమ చేసింది. ఆ కష్టమే ఆ అమ్మాయిని భారత్‌లో బ్యాడ్మింటన్‌కు మారుపేరుగా నిలిపింది. ప్రపంచ బ్యాడ్మింటన్‌లో చైనా ఆధిపత్యానికి గండికొట్టిన ఆమె ప్రతిభను ‘పద్మభూషణ్‌’తో గౌరవించింది కేంద్ర ప్రభుత్వం.
‘ద్రోణాచార్య’ ఆరిఫ్‌ దగ్గర ఆటలో ఓనమాలు నేర్చుకున్న సైనా 12 ఏళ్లకే జాతీయ స్థాయిలో తిరుగులేని క్రీడాకారిణిగా ఎదిగింది. 2004లో జాతీయ బ్యాడ్మింటన్‌ ప్రధాన కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ అకాడమీలో చేరింది. 2006లో ఆసియా శాటిలైట్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో రెండుసార్లు విజేతగా నిలిచింది. అదే ఏడాది ఫిలిప్పీన్స్‌ ఓపెన్‌ టైటిల్‌ గెలిచిన తొలి భారత క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. అక్కణ్నుంచి సైనా నెగ్గిన ప్రతీ టైటిల్‌.. భారత్‌ తరఫున మొదటిసారి సాధించిన ఘనతే అయింది. 2008లో ప్రపంచ జూనియర్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ ట్రోఫీ అందుకుంది. అదే ఏడాది బీజింగ్‌ ఒలింపిక్స్‌లో క్వార్టర్‌ఫైనల్‌ చేరుకుంది. 2009లో ఇండోనేసియా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ టైటిల్‌తో చైనీయుల ఆధిపత్యానికి మొదటిసారి గండికొట్టింది. ఇద్దరు అగ్రశ్రేణి చైనా క్రీడాకారిణుల్ని అప్పుడు సైనా మట్టికరిపించింది. 2010లో సింగపూర్‌ ఓపెన్‌, ఇండోనేసియా ఓపెన్‌, హాంకాంగ్‌ ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ల్లో విజేతగా నిలిచింది. 2014లో ఇండోనేసియా ఓపెన్‌, డెన్మార్క్‌ ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌లు, స్విస్‌ ఓపెన్‌, థాయ్‌లాండ్‌ ఓపెన్‌ గ్రాండ్‌ప్రి గోల్డ్‌ టైటిళ్లు గెలిచింది. అదే ఏడాది లండన్‌ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం చేజిక్కించుకుంది. 2015 ఏప్రిల్‌లో ప్రపంచ బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌లో అగ్రస్థానం సాధించింది. అదే ఏడాది ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకం సొంతం చేసుకుంది. ఈ ఘనత సాధించిన తొలి భారత క్రీడాకారిణి కూడా సైనానే.

- వరికుప్పల రమేశ్‌, హైదరాబాద్‌


పోరాటమే  ఊపిరి

‘ప్రజ్వల’ సంస్థతో వ్యభిచారవృత్తి బాధితుల కోసం సామాన్యులుగా మనమేం చేయొచ్చో యావద్దేశానికీ నిరూపించారు సునీతాకృష్ణన్‌. అందుకే ఆమెను ‘పద్మశ్రీ’ వరించింది. సునీత కుటుంబం బెంగళూరులో స్థిరపడింది. పదకొండేళ్ల వయసులోనే మానసిక వికలాంగ చిన్నారుల కోసం ప్రత్యేక బడి మొదలుపెట్టారు సునీత. పదిహేనేళ్లప్పుడు కర్ణాటకలోని ఓ మారుమూల ప్రాంతంలో దళితుల ఆలయ ప్రవేశం కోసం పోరాడారు. వాళ్లకి చదువు చెప్పేవారు. అది నచ్చనివాళ్లు ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. ఇంటా బయటా ఆమెకు మద్దతు లభించలేదు. అయినా సునీత వెరవలేదు. వేశ్యావాటికల్లోని అమ్మాయిలకి చదువు చెప్పారు. ఆ తర్వాత హైదరాబాద్‌ వచ్చారు. మూసీ మురికివాడల వాసులకు రెండేళ్ల పాటు చదువు చెప్పారు. తర్వాత వేశ్యావృత్తి బాధితుల పిల్లలకోసం ‘ప్రజ్వల’ ప్రారంభించారు. అయిదుగురు పిల్లలతో మొదలైన ఈ సంస్థ ఇప్పుడు నగర వ్యాప్తంగా ఏడువేల మంది పిల్లల కోసం 20 పాఠశాలలుగా విస్తరించింది. మరోవైపు వేశ్యావాటికల నుంచి బాధితురాళ్లను రక్షించే బాధ్యతనూ సునీత తలకెత్తుకున్నారు. ఈ క్రమంలో భౌతికదాడులు జరిగినా వెరవలేదు. ఇప్పటిదాకా 12 వేలమందిని కాపాడారు. వీరి పునరావాసం, ఉపాధి నైపుణ్యాల కోసం ‘ఆశా నికేతన్‌’ స్థాపించారామె. కార్పొరేట్‌ సంస్థల్నీ ఒప్పించి ఉద్యోగాలూ ఇప్పిస్తున్నారు. వ్యభిచార వృత్తిని అడ్డుకోవడం, బాధితులను ఆదుకోవడం తదితరాలపై ఆమె సూచనలు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహరాష్ట్ర, పశ్చిమ బంగ, ఉత్తరప్రదేశ్‌ల్లోనూ అమలవుతున్నాయి. అమెరికా, ఐరాస కూడా ఆమె సూచనలు తీసుకుంటున్నాయి. వ్యభిచార వృత్తి వెతలకు లోకానికి చాటడానికి ‘నా బంగారు తల్లి’ తీశారు సునీత. దీనికి 3 జాతీయ అవార్డులు వచ్చాయి. ఆమె రూపొందించిన ‘అనామిక’ హైదరాబాద్‌ పోలీసు శిక్షణా కేంద్రంలో పాఠ్యాంశం. ఈ చిత్రాల దర్శకుడు రాజేశ్‌ టచ్‌రివర్‌నే పెళ్లిచేసుకున్నారు.

- జె.రాజు, హైదరాబాదు


నిత్యవిద్యార్థి
డాక్టర్‌ టీవీ నారాయణ... తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో విద్య, సామాజిక రంగాల్లో ఈ పేరు తెలియని వారు ఉండరు. అందుకే ఆయనకు ఈ ఏడాది పద్మశ్రీ పురస్కారం లభించింది. 1925 జులై 26న జన్మించారు. ఆయనది సామాజికంగా వెనకబడిన వర్గం కావడంతో చదువుకోవడానికి ఎంతో శ్రమించాల్సి వచ్చింది. నిజాం కళాశాలలో బీఏ గణితం చదివిన ఆయన, బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ ఆంగ్లం పూర్తిచేశారు. పాఠశాల ఉపాధ్యాయుడుగా జీవితం ఆరంభించిన ఆయన పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సభ్యుడి స్థాయికి ఎదిగారు. వృత్తి కొనసాగిస్తూనే న్యాయశాస్త్రం చదివారు. 71వ ఏట కర్ణాటక విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ అందుకున్నారు. ఆయన నిత్యవిద్యార్థి. తెలంగాణ స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న ఆయన జైలు శిక్షనూ అనుభవించారు. ఆ తర్వాత కూడా వివిధ సామాజిక కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. వెనకబడిన వర్గాల అభివృద్ధికి ‘బంధు సేవా మండలి’ని స్థాపించారు. ఉపనిషత్తులు, వేదాలను అధ్యయనం చేసిన నారాయణ భారత మాజీ రాష్ట్రపతి శంకర్‌ దయాళ్‌శర్మ చేతుల మీదుగా ‘వేద పండిత్‌’ పురస్కారం అందుకున్నారు. ఇంకా తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ‘ధర్మరత్న’, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి ‘దళితరత్న’ పురస్కారాలూ పొందారు. కాకతీయ, తెలుగు, ఇఫ్లూ విశ్వవిద్యాలయాల కార్యనిర్వాహక మండలి సభ్యులుగా పనిచేశారు. ప్రస్తుతం నల్గొండ మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం కార్యనిర్వాహక మండలి సభ్యులు. ‘ఆర్య ప్రతినిధి సభ’ రాష్ట్ర అధ్యక్షులు, ‘భాగ్యనగర్‌ ఖాదీ కమిటీ’ ఉపాధ్యక్షులు. శాండ్స్‌ ఆఫ్‌ టైమ్‌’, ‘వాక్సుధా స్రవంతి’ కావ్యాలతో పాటు మరో 20 పుస్తకాల రచనతో సాహితీ రంగంలోనూ తనదైన ముద్రవేశారు. ఈయన భార్య మాజీ మంత్రి, తెలంగాణ ఉద్యమనేత సదాలక్ష్మి.


గుండెకు భరోసా

డాక్టర్‌ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే... తెలుగునాట పేరెన్నికగల కార్డియో థోరాసిక్‌ వైద్య చికిత్స నిపుణుడు. తెలుగురాష్ట్రాల్లో గుండె మార్పిడి శస్త్రచికిత్సలు చేసిన తొలి వైద్యుడు. ప్రస్తుతం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ‘సహృదయ ట్రస్టు’ ద్వారా గుండె శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నారు. తన ఆధ్వర్యంలో అక్కడ 125 శస్త్రచికిత్సలు చేశారు. 2014లో తొలిసారిగా ఓ యువకుడికి గుండెమార్పిడి చేశారు. అప్పటినుంచి ఇప్పటికి 14మందికి అలాంటి శస్త్రచికిత్సలు నిర్వహించారు. 2012లో వూపిరితిత్తుల మార్పిడికి కూడా శ్రీకారం చుట్టారు. ఇప్పటికి ముగ్గురికి ఆ చికిత్సలు చేశారు.
డాక్టర్‌ గోఖలే కృష్ణాజిల్లా నందివాడ మండలం ‘తరిమిశ’ గ్రామంలో 1959 అక్టోబర్‌ 2న జన్మించారు. తల్లిదండ్రులు ఆళ్ల వెంకటేశ్వర రావు, ఝాన్సీబాయ్‌. గుంటూరు వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌, ఎమ్మెస్‌ అభ్యసించారు. తర్వాత వెల్లూరు క్రిస్టియన్‌ వైద్య కళాశాల కార్డియో థోరాసిక్‌ విభాగంలో చదువుకున్నారు. అదే ఏడాది డీఎన్‌బీ విభాగంలో కూడా పట్టా అందుకున్నారు. అనంతరం నిమ్స్‌లో సహాయ అధ్యాపకుడిగా ఉద్యోగజీవితం ప్రారంభించారు. అమెరికా, ఆస్ట్రేలియాల్లో సైతం చికిత్సలు నిర్వహించారు. వూపిరితిత్తుల చికిత్సలకు సంబంధించి న్యూయార్క్‌లోని కొలంబియా ఆసుపత్రి, బర్నెస్‌ జూయిస్‌, సెయింట్‌ లూయిస్‌ ఆసుపత్రుల్లో జరిగిన చర్చల్లో పాల్గొన్నారు. ఆధునిక వైద్యం మీద వివిధ సదస్సుల్లో అనేక పత్రాలు సమర్పించారు. ఆయన భార్య వెంకటలక్ష్మి కూడా వైద్యురాలే. వీళ్లకు ఇద్దరమ్మాయిలు. వాళ్లూ వైద్యవృత్తినే ఎంచుకున్నారు. పేదలకు మెరుగైన వైద్యం అందాలనే ఉద్దేశంతో ‘సహృదయ హెల్త్‌ అండ్‌ మెడికల్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్టు’ని స్థాపించారు గోఖలే. హార్ట్‌ ఫెయిల్యూర్‌ సొసైటీకి కార్యదర్శిగా ఉంటూ గుండె సమస్యలు ఉన్నవాళ్లకు అవగాహన కల్పిస్తున్నారు. ఆయన సేవలకుగాను కేంద్రం ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని ప్రకటించింది.*   *   *  

 

పద్మ పురస్కారాలు అందుకున్న ఇంకొందరు...

 * తెలుగుకి వెలుగు రామోజీరావు (పద్మవిభూషణ్‌)

 * కళ అంటే కాలక్షేపం కాదు! - యామిని కృష్ణమూర్తి (ముఖాముఖి) (పద్మవిభూషణ్‌)


వెనక్కి ...

మీ అభిప్రాయం