జులై 12, బుధవారం.. రాజమహేంద్రవరం.. ఆంధ్రయువతి సంస్కృత కళాశాల ప్రాంగణం..
పక్కనే పారుతున్న గోదావరి గలగలలతో పోటీపడి ఇక్కడ ప్రవహిస్తున్న అవధాన చమక్కులు!
దత్తపదిలో పృచ్ఛకులెవరో అడిగారు అవధానిని.. ‘బాలు, కాలు, చాలు, పాలు’ పదాలతో భారత్, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్‌ను వర్ణించమని! మరుక్షణంలో సమాధానం వచ్చేసిందిలా తేటగీతిలో...
బాలువేసిన వెంటనే బ్యాటునూప
కాలు తగులునో యనుచు ప్రేక్షకులు చూడ
జయము పొందిన జనులు వాచాలులైరి
భరత మాతకు మురిపాలు సరణి మెరసె
గణపతిని స్తుతించమన్నారు మరో పృచ్ఛకుడు నిషిద్ధాక్షరిలో.. వెంటనే కందంతో వందనమన్నాడు పదహారేళ్ల ఆ అవధాని..
దేహీయంచున్ శ్రీలన్
భీహారీ ధీర కాచు వేనన్ గ్లౌభా
నీహార రదన భాసా
పాహీయని వేడుచుంటి భద్రేభముఖా
సభా ప్రాంగణమంతా ఒకటే చప్పట్లు! ఆ బాల అవధాని ప్రతిభకు ప్రశంసలు. అంతకు మించి సభాసదుల మోముల్లో ఆశ్చర్యానందాలు. తెలుగునాడు వేలమైళ్ల దూరంలో అమెరికా గడ్డ మీద పుట్టి పెరిగిన కుర్రాడు ఇంతగా చక్కగా.. అదీ ఆశువుగా పద్యాలెలా చెప్పగలుగుతున్నాడని! ఇప్పుడు మీరూ ఆశ్చర్యపోతున్నారు కదూ! అవును.. ఈ కుర్రాడు గన్నవరపు లలిత్ అమెరికాలోని కనెక్టికట్ నివాసి. అక్కడే పన్నెండో తరగతి చదువుతున్నాడు. మరి తను అవధాన ప్రక్రియను ఎలా అభ్యసించాడు, అసలు పద్యాల మీద ఎప్పుడు ఆసక్తి పెంచుకున్నాడు? ఇవే ప్రశ్నలు అతన్ని అడిగితే ఇలా చెప్పుకొచ్చాడు..
‘‘మా అమ్మ శైలజ, నాన్న మారుతి శశిధర్. పుట్టిపెరిగిన హైదరాబాదు నుంచి ఉద్యోగరీత్యా 1996లో న్యూయార్క్ వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. నేను అక్కడే సెప్టెంబరు 23, 2000న పుట్టాను. మా తాతల కాలం నుంచి సాహిత్యం మీద ఆసక్తి, ప్రవేశం కలిగిన కుటుంబం మాది. ఇంట్లో అమ్మానాన్న ఎప్పుడూ తెలుగులోనే మాట్లాడేవారు. అలా నాకు చిన్నతనం నుంచే మన భాష అలవాటైంది. అలా బడిలో ఉన్నంతసేపు ఆంగ్లం, ఇంటికి వచ్చాక తేటతెలుగు! అప్పుడప్పుడూ ఇక్కడి బంధువుల దగ్గరికి వచ్చిపోతుండటంతో భాష మీద పట్టు ఇంకా పెరిగింది. మా నాన్నకు పద్యాలంటే చాలా ఇష్టం. మూడేళ్ల వయసు నుంచే సుమతీ శతకం, వేమన పద్యాలు నేర్పించేవారు. అమ్మ ఇతిహాసాలను చెబుతుండేది.
ఎనిమిదేళ్ల వయసులో నాన్న కోసమని పద్యం రాయడానికి ప్రయత్నించా. ‘ఏనాడో మన భారతీయ’ అంటూ మొదలుపెట్టాను కానీ, పూర్తిచేయలేకపోయాను. అప్పుడే అనిపించింది ఎప్పటికైనా పద్యరచన చేయాలని. చిన్నప్పటి నుంచే ఇంట్లో ఉండే భారత రామాయణాలను చదివేవాణ్ని. సుందరకాండ చదువుతున్నపుడు కలిగే ఆనందం వర్ణనకు అందదు. భారతంలో ఆది, విరాట పర్వాలు చదివాను. పోతన పద్యాలను నేర్చుకుంటూ భాగవత మాధుర్యాన్నీ ఆస్వాదించాను. మనుచరిత్ర, మొల్ల రామయాణం, కరుణశ్రీ కవితా సంపుటాలు చదివాను. శ్రీనాథుడు నాకు చాలా ఇష్టమైన కవి. ఆయన శైలి విశ్వనాథగారి పద్యాల్లోనూ కనిపిస్తుంది. జాషువా, శ్రీశ్రీ సాహిత్యాలతోనూ పరిచయం ఉంది. పాఠశాల చదువు, సాహితీ సాధన మధ్య ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ప్రణాళిక వేసుకుని చదువుకునేవాణ్ని. పైగా ఏకాగ్రతతో చదవడం అలవాటైంది. సాహిత్యం కాకుండా వీణ నేర్చుకుంటున్నాను. టెన్నిస్ ఆడతాను. బ్యాడ్మింటన్ కూడా ఇష్టమే.
ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడు సంస్కృత వ్యాకరణం, కావ్యపాఠాలు నేర్చుకోవాలనిపించింది. గురువు కోసం ఆన్లైన్లో వెదికాను. రాజమహేంద్రవరానికి చెందిన కామేశ్వరశర్మ గారు పరిచయమయ్యారు. నా ఆసక్తిని చూసి ఆయన ఆన్లైన్లోనే పాఠాలు చెప్పడం ప్రారంభించారు. 2013లో అలా ఆయనతో ఏర్పడిన పరిచయం కుటుంబ స్నేహంగా మారింది. గురువుగారి దగ్గర రఘువంశంలో మొదటి సర్గ, లఘుసిద్ధాంతకౌముదిలో సంజ్ఞాప్రకరణాలు, పంచసంధులు నేర్చుకున్నాను. అలాగే అమెరికాలోనే మల్లాప్రగడ శ్రీనివాస్ గారి దగ్గర వేదంలో శిక్షణ తీసుకున్నాను. పంచసూక్తాలు, నమక చమకాలు, తైత్తరీయ ఉపనిషత్తు, మహానారాయణోపనిషత్తు, మహన్యాసం, అరుణం అభ్యసించాను. అలా సంస్కృతంలో పట్టు వచ్చింది. కనెక్టికట్‌లో మా ఇంటికి సమీపంలోని సరస్వతీదేవి ఆలయంలో రోజూ ఆసక్తి ఉన్నవారికి ఆ భాషని నేర్పుతున్నాను. నా దగ్గరికి వచ్చేవాళ్లంతా నలభై ఏళ్లకు పైబడిన వారే. వారంతా నన్ను తమ బిడ్డలా చూసుకుంటారు.
అంతకు ముందే నేను గరికిపాటి నరసింహారావు గారి అవధానాలు చూశాను. ఆయన చమత్కారం చాలా నచ్చింది. అలాగే, మేడసాని మోహన్ గారి పద్యధార కూడా! వాళ్ల ప్రేరణతో నేనూ అవధానం చేయాలనుకున్నా. నా విద్యార్థుల్లో ఒకరితో దీనిగురించి మాట్లాడినప్పుడు, ఆయన రాజమహేంద్రవరంలోని తన మామగారితో మాట్లాడించారు. అలా అవధాన గురువు ధూళిపాళ మహదేవమణి గారితో పరిచయం కలిగింది. ఈ ఏడాది మార్చి నుంచి ఆయన ద్వారా రోజూ వాట్సప్‌లో అవధానం నేర్చుకోవటం మొదలు పెట్టాను. వాట్సప్‌లోనే సమస్యలు ఇచ్చి పద్యం పూరించమనేవారు. నేను రాసిన వాటిని సరిదిద్దుతూ సమాధానం పంపేవారు. అలా అవధానంలో పట్టు సాధించాను.
సంస్కృత గురువు కామేశ్వరశర్మ గారింటికి గతంలో వచ్చాను. అయితే మహదేవమణి గారినెప్పుడూ నేరుగా కలవలేదు. ఎలాంటి విద్య అయినా గురుముఖంగా నేర్చుకోవటం ఉత్తమ లక్షణం. ఇటీవల అమ్మానాన్నలతో కలిసి హైదరాబాదు వచ్చినప్పుడు, ఇద్దరు గురువులతోనూ మాట్లాడి రాజమహేంద్ర వరానికి వచ్చాను. వాళ్లిద్దరినీ కలిసి, మాట్లాడి, నా సందేహాలను నివృత్తి చేసుకున్నాను. ఇప్పుడు వారి సమక్షంలో అవధానం చేయటం చాలా సంతోషాన్ని చ్చింది. పృచ్ఛకులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ వారి ప్రశంసలు పొందిన ప్రతీసారి ఉత్సాహం ఉప్పొంగింది.
ఇప్పటికి రెండు అవధానాలు చేశాను. అంతగా ఇబ్బంది అనిపించలేదు. ఒక దాంట్లో ‘వరినీటన్ తానమాడ పాపంబోవున్’ అన్న సమస్య ఇచ్చారు. ‘వరి’ని త్రోవరి చేశాను. దాంతో అది తేలికైపోయింది. ‘డీ మహనీయమూర్తి...’ అన్న సమస్యనిస్తే ‘మోడీ మహనీయమూర్తి...’ అని పూరించాను. సాధనా సమయంలో మాత్రం ఒకసారి కష్టంగా అనిపించింది. ‘పిల్లిని పెండ్లియాడి శరభీశ్వరుడంతట బ్రహ్మసాక్షిగా’ అన్నది సమస్య. దీన్ని ఎలా పూరించాలో తోచలేదు. కాసేపటికి ఆలోచన తట్టింది. ఈశ్వరుడు అమ్మవారిని పెళ్లాడినప్పుడు ఆమె ఎలా ఉందంటే.. రూపంలో మెరుపుతీగ, గమనంలో గజగమనిలా, పరిమళంలో పునుగుపిల్లిలా! అని పూరించాను. అవధానంలో దత్తపది, ఇంకేవైనా పృచ్ఛకులు ప్రశ్నించి ఊరుకుంటారు. అదే నిషిద్ధాక్షరి అయితే ముఖాముఖి స్పర్థలా ఉంటుంది. అందుకే నిషిద్ధాక్షరి అంటే నాకు చాలా సరదా!
నా పద్యధారణ చూసి స్నేహితులు ముచ్చటపడుతుంటారు. ఇంట్లోవాళ్ల మాటైతే చెప్పనక్కర్లేదు! తెలుగు, సంస్కృత సాహిత్యాలను ఇంకా అధ్యయనం చేయాలి.. ఎప్పటికైనా ఓ మంచి పుస్తకం రాయాలన్నది నా కోరిక
తెలుగు కీర్తి దేశ దేశాల చాటించి
రాణకెక్కినట్టి రస విలాసి
తెలుగు మహిమ లెల్ల తేజరిల్లగ జేయు
తెలుగుతల్లి వెలుగు తెలుగు వెలుగు’’