ఆటపాటలతో అమ్మ భాష

  • 1552 Views
  • 3Likes
  • Like
  • Article Share

    కె.శోభాదేవి

  • నెల్లూరు,
  • 9441003740
కె.శోభాదేవి

తెలుగు భాషాబోధనలో మనం అనుసరిస్తున్న విధానాల్లో అత్యధికం కాలం చెల్లినవే. లేత మనసులకు విసుగు పుట్టించే బోధనా పద్ధతుల వల్ల ప్రాథమిక దశలో భాషాభ్యాసం యాంత్రికమవుతోంది. అమృతతుల్యమైన అమ్మభాషపట్ల ప్రత్యేకమైన ఎలాంటి అనురక్తినీ నవతరం పెంచుకోకపోవడానికి ఇదీ ఓ ప్రధాన కారణమే. తరాల తరబడిగా మారని ఈ బోధనా పద్ధతుల్లో విప్లవాత్మకమైన మార్పులు వస్తే తప్ప తెలుగు చిన్నారిలోకానికి తెలుగు చేరువకాలేదు. కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం కాబోతున్న తరుణంలో పిల్లలకు అమ్మభాషను సులువుగా ఎలా బోధించవచ్చో చూద్దాం!
భావ ప్రసారానికి వాహిక భాష. ఏ అంశం నేర్పడానికైనా, నేర్వడానికైనా భాషే కీలకం. తగిన భాషాసామర్థ్యం ఉంటేనే వ్యక్తి కచ్చితమైన భావావిష్కరణ చేయగలుగుతాడు. భావ వ్యక్తీకరణ నైపుణ్యం ఉన్న వ్యక్తి ఏ విషయాన్నయినా త్వరగా గ్రహిస్తాడు. మౌఖికంగానూ, రాత రూపంలోనూ సృజనాత్మకంగా వ్యక్తం చేయగలుగుతాడు. భాషలో వెనకబడటమంటే చాలా విషయాల్లో వెనకబడటమే. ఇలా వెనకబడ్డ పిల్లలు కొత్తవి నేర్చుకోవడానికి ఇష్టపడరు. అలాంటివారికి నేర్పడం ఉపాధ్యాయుడికి భారంగా మారుతుంది. పైగా పిల్లల నైపుణ్యాల్లో తేడాలు ఉంటాయి. అందుకని పిల్లలు నేర్చుకొనే వేగానికి అనుగుణంగా అధ్యాపకులు నడవాలి.
      మాంటిస్సోరీ అభిప్రాయంలో నాలుగైదు సంవత్సరాలు వచ్చేసరికి పిల్లలు అయిదారు భాషలు నేర్చుకొనే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. దీన్ని గమనింపులో ఉంచుకుంటే ఉపాధ్యాయుడికి బోధన సులువవుతుంది. దేన్నయినా ‘‘విన్నప్పుడు త్వరగా మర్చిపోతాం, చూసినప్పుడు కాస్త జ్ఞాపకం పెట్టుకుంటాం, స్వయంగా చేసినప్పుడు ఎప్పటికీ మర్చిపోము’’ అన్నది ప్రాథమిక విద్యాబోధనలో ముఖ్యసూత్రం. అమ్మభాషలో చదువు మొదలుపెట్టక ముందే ఇంటాబయటా మాతృభాషే వినిపిస్తూ ఉండటం అనుకూల అంశం. పరభాషా ప్రాంతంలో ఇంట్లో సొంతభాష మాట్లాడుతూ, బయట తాము నివసిస్తున్న ప్రాంతపు భాష వినిపించే స్థితిలో పిల్లలు రెండు భాషల్ని నేర్చుకుంటారు.
      పిల్లలకు బోధన వారికి తెలిసిన విషయంతోనే మొదలుపెట్టాలి. పిల్లల పరిసరాలు, కుటుంబ నేపథ్యం, సాంఘికస్థాయి సంస్కృతిలో భాగం. కొన్నిసార్లు తెలుగు వాచకాలు ఆయా ప్రత్యేక పరిస్థితులకు అనుగుణంగా ఉండకపోవచ్చు. అప్పుడు పాఠాలనే మార్చాల్సి ఉంటుంది. పిల్లల అనుభవాల నుంచి రూపొందే సంభాషణలు వాళ్లలో భాషాభివృద్ధికి తోడ్పడతాయి. పిల్లలతో మాట్లాడించడం, కథలు చెప్పించడం ద్వారా తరగతిగదిలో క్రమబద్ధమైన భాషా ప్రయోగాన్ని ప్రోత్సహిస్తూ ఉండాలి. రాతపనిలోకి ప్రవేశించడానికి ముందే ఇదంతా జరగాలి. మౌఖికంగా జరిగే వాటిలో ఆటలూ ఉండాలి.
      జీవితం ఎన్నో అంశాల సమాహారం. బడిలో విడివిడిగా అధ్యయనం చేసే వివిధాంశాలు జీవితంలో కలగలపుగా ఉంటాయి. ప్రతి అంశాన్నీ కూలంకషంగా నేర్చుకొనే సౌలభ్యం కోసం వాటిని విడగొట్టారు. పై తరగతులకు వెళ్లేకొద్దీ విడివిడి అధ్యయనం అవసరమవుతుంది. ప్రారంభదశలో మాత్రం సమీకృత విద్యావిధానమే మంచిది. భాషా బోధనలోనూ విజ్ఞానశాస్త్రం, లెక్కలు, కళలు మిళితమైన రీతిలో పాఠ్య ప్రణాళిక ఏర్పరచడం అవసరమని ఆధునిక విద్యా విధానం చెబుతోంది. ఈ అవగాహనతో బోధన ఆరంభించడం ఉపాధ్యాయుని కర్తవ్యం.
విభిన్నంగా అక్షరాలు నేర్పడం...
ఇప్పుడున్న విద్యా విధానంలో మొదట అక్షరాలు, తర్వాత గుణింతాలు, పదాలు వర్ణమాల క్రమాన్ని పాటిస్తూ (అమ్మ, ఆవు, ఇల్లు) నేర్పుతున్నారు. భాషకు వర్ణమాలకు మించి సామగ్రి అవసరంలేదు కాబట్టి ఆ విధానం సరైందని చాలామంది నమ్మకం. కానీ అది కాలం చెల్లిన యాంత్రిక బోధనా విధానం. అర్థం కోసం, భావం కోసం చదవడం అర్థవంతమైన చదువుకు పునాది. అక్షరాలు పదాల్లో, పదాలు వాక్యాల్లో పొదిగినప్పుడు మాత్రమే అవి ప్రాణవంతమవుతాయి. పిల్లల దృష్టిలో విడిగా అవి పిచ్చిగీతలే. ఇటుకను గోడ నిర్మాణంలో భాగంగా చూడటం, కొమ్మను చెట్టులో భాగంగా గుర్తించడం అర్థవంతం. ఇలాంటిదే అక్షరాన్ని అది ఉన్న పదంలోంచి చూడటం. అక్షరాలనే దిద్దుతూ బట్టీపట్టడం పెద్దలకు సులువుగా కనిపించినా, పిల్లలకది శ్రమతో కూడిన, విసుగు పుట్టించే కార్యక్రమం. ఈ పద్ధతిలో నేర్పడంవల్ల పొంచి ఉన్న ప్రమాదాన్ని పెద్దలు, ఉపాధ్యాయులు గుర్తించలేకపోతున్నారు.
      అక్షరాన్ని వర్ణమాలలో తప్ప ఇతర సందర్భాల్లో గుర్తించలేకపోవడం, వర్ణమాల మధ్యలోంచి ఏదైనా అక్షరాన్ని రాయమంటే వరసను మననం చేసుకోకుండా వెంటనే రాయలేకపోవడం పిల్లలనుంచి ఎదురయ్యే సమస్యలు. అక్షరమాలలో ‘అ’ను గుర్తించడం, అమ్మబొమ్మ కింద ఉన్న ‘అమ్మ’ మాటలోని ‘అ’ని గుర్తించడమంత తేలిక కాదు పిల్లాడికి. బొమ్మని చూసి దానికి సంబంధించిన లేఖన చిహ్నాలని చదువుతూ అందులోని అక్షరాలను మనసులో ముద్రించుకోవడం సులభం. వర్ణమాలని పలికిస్తూ దిద్దించేపని ఆ చిన్నబుర్రల్లో గందరగోళాన్ని సృష్టించి వూపిరాడకుండా చేస్తుంది. ఈ యాంత్రిక విధానాలకి ముగింపు పలకనంత వరకూ పిల్లలేమీ నేర్చుకోలేరు. వర్ణమాల అక్షరాల మధ్యగల పరస్పర సంబంధాన్ని సూచించే ఒక క్రమంతో ఏర్పడింది. ముందుముందు ఆ క్రమాన్ని వర్ణాల సమూహాలని ఒక స్థాయికి చేరుకున్న పెద్దపిల్లలు నేర్చుకుంటారు. అంతేకాని భాషను నేర్పే క్రమంలో విద్యా మానసిక శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారో పట్టించుకోకుండా, కాలం చెల్లిన విధానాలతో పిల్లల మానసిక వికాసానికి గండికొట్టడం భావ్యం కాదు. తాముగా ఏ అర్థాన్నీ ఇవ్వలేని అక్షరాలపట్ల పిల్లలకు ఎలాంటి అభిరుచీ ఏర్పడదు. పసివాళ్లు పట్టుమని పది నిమిషాలు కుదురుగా ఒకచోట కూచోలేరు. పైగా ఈ పద్ధతిలో కొత్తవి నేర్చుకొనేప్పుడు పాతవి మర్చిపోతారు. జ్ఞాపకశక్తికి భావమే ఆధారం. విద్యా మానసిక శాస్త్రమూ దీనినే సమర్థిస్తోంది.
వాక్యపద్ధతి బోధన
భాషలో కనిష్ఠ విభాగం ధ్వని. గరిష్ఠ విభాగం వాక్యం. భాష అంటేనే వాక్యాల సముదాయం. ‘‘వాక్యంతో పోల్చి చూస్తే భావపుష్టిలో శబ్దం చాలా అసమగ్రమైనది, నీరసమైనది. జీవితరంగంలో భాషను వ్యవహరించేప్పుడు అఖండ వాక్యమే ప్రాతిపదిక. దాని విశ్లేషణతో పెద్దలు సాధించినది శబ్దం. ఈ విషయాన్ని గ్రహించిన తర్వాత శబ్దపద్ధతి పోయి వాక్యపద్ధతి రూఢమైనది’’ అంటారు సత్తిరాజు కృష్ణారావు. ఈ విధానం ప్రాచీన పద్ధతిని తలకిందులు చేసింది. బాలలు భాషను నేర్చుకునేందుకు సరైన పునాదులు వేయాలంటే ఇలాంటి ఆధునిక విధానాలకు మారక తప్పదని ప్రయోగాలు రుజువు చేస్తున్నాయి. ఓ పద్ధతి శాస్త్రీయమని గ్రహించాక ప్రయోగంలో ఆయా ప్రత్యేక పరిస్థితులకు అనుగుణంగా దాన్ని మలచుకొనే స్వేచ్ఛ ఉపాధ్యాయునికి ఉంటుంది. బాలల గ్రహింపు ఫలితాల కొలమానాలతో కొత్తకొత్త విధానాలు రూపొందుతూనే ఉంటాయి. మారుతున్న సామాజిక సంక్లిష్ట విద్యా వ్యవస్థలో అది తప్పదు.
      నేర్పే అంశాన్ని చిన్నచిన్న వాక్యాల రూపంలో మొదట తలకట్టు పదాలతో రూపొందించి, తగిన బొమ్మలతో పిల్లల ముందు ప్రదర్శించాలి. బొమ్మల ద్వారా వాక్యాల్లోని పదాలను, పదాల్లోని అక్షరాలను గుర్తించేందుకు ఉపాధ్యాయులు సాయపడాలి. పిల్లలు లిపిని నేర్చుకునేందుకు బొమ్మలు వారధిలా పనిచేస్తాయి. ఇలా గుర్తించిన పదాల్లోని అక్షరాలను కొంత శిక్షణ తర్వాత బొమ్మల అవసరం లేకుండానే పిల్లలు పోల్చుకోగలుగుతారు. వర్ణమాలతో మొదలుపెట్టే విధానంలో వచ్చిన అక్షరం మళ్లీ రాదు. అదే పద, వాక్య రూపాల్లో నేర్చుకొనే ప్రక్రియలో తెలిసిన అక్షరమే మళ్లీ కనిపిస్తుంది. దాంతో కొత్తవాటితోపాటు పాతవీ మననం చేసుకోవడం సహజసిద్ధంగా జరుగుతుంది. ఇది నేర్చుకున్న దాన్ని సుస్థిరపరుస్తుంది. దీనికోసం ఉపాధ్యాయుడు ముందుగానే ఒక ప్రణాళికతో సులువైన వాక్యాలు, పదాలు బొమ్మలతో సహా తయారు చేసుకోవాలి. పిల్లలు త్వరత్వరగా నేర్చుకునే అవకాశం ఉండే వాచకాల తయారీకి కృషి జరగాలి.
గీతల్లో రాతలు...
బలపం, పెన్సిలు పట్టుకొని అక్షరాలు రాసేందుకు పిల్లల లేత చేతులు సిద్ధంగా ఉండవు. అందుకని వారికి తోచిన, వారి వూహలో మెదిలే బొమ్మలు గీయడానికి వారిని ప్రోత్సహించాలి. దాంతో బొమ్మలు వేయడంలో, రంగులు పూయడంలో వాళ్ల చేతులు అలవాటు పడటమేకాక ఆ పనిలో లీనమైపోతారు. సులువైన ఆకారాలతో రకరకాల వస్తువులు, పశు పక్ష్యాదులు నల్లబల్ల మీద గీసి పిల్లలని అనుకరించమనాలి. వివిధ ఆకారాల్లో గీతలు గీయడంలో వారికి శిక్షణ ఇవ్వాలి. తెలుగు అక్షరాల్లో అవసరమయ్యే అన్ని గీతలనూ నోటు పుస్తకాల్లో గీసి వాటిని కాపీ చేయించాలి. చిన్న చిన్న వాక్యాలు మాటలు వాటికి సంబంధించిన బొమ్మల ద్వారా పిల్లలకు అందించినప్పుడు, వాటి ఆధారంతో మాటలు గుర్తించి పిల్లలు రాసుకోవాలి. అక్షరాల గుర్తింపు ముందుగానే జరిగి ఉంటుంది కాబట్టి, బొమ్మలు లేకుండా కూడా అక్షరాలను పోల్చుకుంటారు. రాయడం అలవాటు చేసుకుంటారు. ఇక్కడ అక్షరాలు దిద్దడమన్న ప్రశ్న ఉదయించదు. చూసిన దాన్ని చూసినట్టుగా రాయడంలోనే మనసుకి ఆకారం పట్టుబడుతుంది. ఒకసారి స్థిరపడిన ఆకారం అంత త్వరగా వారి మనసును వీడదు.
      ప్రారంభంలో తలకట్టు అక్షరాలతో చిన్నచిన్న మాటలు, వాక్యాలు రాయడం అలవాటు చేయాలి. భావంతోపాటే అవి వారికందుతూ ఉండాలి. వాక్యాల మధ్య పరస్పర సంబంధాన్ని నెలకొల్పగలిగితే సంపూర్ణభావంతో అందే వాక్యాలు త్వరగా నేర్చుకుంటారు. రోజుకో గుణింతం చొప్పున నేర్పించాలి. మర్నాడు పాతదానితోపాటు కొత్తదాన్ని నేర్పుతూ మాటలు, వాక్యాలు నేర్పిస్తే పిల్లలకు గుణింతాల మీద పట్టు దొరుకుతుంది. ఇలా అధ్యాపకుని నైపుణ్యాన్నిబట్టి రాతనేర్పేపని రకరకాల రూపాలు తీసుకుని పిల్లల్ని ఉత్సాహపరుస్తుంది. రాసిన వాక్యాలను అభినయింపజేయడం, ఆసక్తిని కలిగించే సొంత వాక్యాల కూర్పు, అక్షరాలు, పజిళ్లు ఇవన్నీ పిల్లల్లో ఆసక్తిని రగిలించి భాష నేర్చుకొనే కార్యక్రమాన్ని సరదా ఆటగా మారుస్తాయి. కథ చెప్పాలన్నా, వాక్యం పలకాలన్నా పిల్లలు ముఖకవళికల్లో భావస్ఫోరకంగా వ్యక్తీకరిస్తారు. గుణింతాల తర్వాత ఒత్తులు ప్రారంభించాలి. వాటిలో ద్విత్వ సంయుక్తాక్షర భేదాల్ని పిల్లలకి పరిచయం చేయాలి.
నల్లబల్ల - అభ్యాసాలు
ఎక్కువమంది బాలలున్న తరగతిలో నల్లబల్ల ఎంతో ఉపయోగం. నల్లబల్ల మీద నుడికట్లు, పదాల్లో అక్షరాలు తారుమారుచేసి సరిగా రాయమనడం, వాక్యాలను వరసక్రమంలో రాయించడం, ఒక్కో గుణింతాన్ని చెబుతూ అదే గుణింతం వచ్చే పదాలు, వాక్యాలని తయారు చేయమనడం, బొమ్మ గీసి అక్షరాల్లో రాయమనడం, బొమ్మలు వేసి కథ అల్లమనడం, జతపరిచే ఆటలు ఇలా ఉపాధ్యాయుని ప్రజ్ఞమేరకు ఎన్నో ఆటలు సృష్టించవచ్చు. అభ్యాసాలన్నీ నల్లబల్ల పైనే సాధ్యపడవు. కాబట్టి అభ్యాసపత్రాలను తయారుచేసి ఇంటిపనిగా ఇవ్వొచ్చు. అభ్యాసపత్రాలు పూరించడం, అవసరమైతే ఇంట్లో పెద్దల సాయం తీసుకోవడం పిల్లలు ఇష్టంతో చేస్తారు. అభ్యాసం ఎందుకిస్తున్నాం, దాన్నుంచి ఏం ఆశిస్తున్నాం అన్న విషయాల్లో ఉపాధ్యాయులకు స్పష్టత ఉండాలి. అప్పుడవి పిల్లలకి ఆసక్తిజనకంగా, ఆనందాన్నిచ్చేవిగా తయారవుతాయి. భావాన్ని ఆశ్రయించే ప్రతిపనీ జరగాలి కాబట్టి, ఓ తమాషా కథో, పాటో, పజిలో పిల్లల్ని ఒకచోట కూర్చోబెడు తుంది. సామెతలు, పొడుపుకథలు, పలుకుబడులు, పద్యాలు, నాటికలు భాషకు గొప్ప నిధి. పద్యాల భావం చెప్పి కంఠస్థం చేయించవచ్చు. నోరు తిరగడానికి ఇది మంచి తర్ఫీదు. నోరు తిరగని వాక్యాలను కొన్నింటిని పలికించడం గమ్మత్తుగానూ ఉంటుంది. ఉచ్చారణ స్పష్టతకి శిక్షణగానూ ఉంటుంది. ఉదాహరణకు గాదెలో కందిపప్పు గాదెకింద పందికొక్కు. వాచికం, అభినయం, కల్పన, సంభాషణా చాతుర్యం వంటి నైపుణ్యాలతో నాటికకు భాషను నేర్పడంలో ముఖ్యస్థానమే ఉంది.
ఆటపాటల చదువు
ఆటనుంచి పిల్లల్ని వేరుచేయలేం. చదువే ఆటైతే అది ఇష్టంగా కొనసాగుతుందనే ఆలోచన నుంచి పుట్టినవే ఆటలతో పాఠాలు. పూర్వ ప్రాథమిక దశలో (4- 6సం॥ దశ) పలక, బలపం, పుస్తకం కన్నా... వార్తాపత్రికలు, అట్టముక్కలు, అగ్గిపెట్టెలు, పుల్లలు, గింజలు వంటి సాధారణ సామగ్రి తెలుగు నేర్పే ఆటలకి మంచి ఉపకరణాలవుతాయి. ఒక వస్తువు పేరు రాసిన కాగితాన్ని ఓ పిల్లాడికి తగిలించి ఆ వస్తువుగా వూహించుకొని నటించమనాలి. ఇలా పిల్లలందరికీ తగిలించి రకరకాల వాక్యాల రూపంలో నిలబడమనాలి. వాళ్లమీద తిట్లు, శిక్షలు ఏమాత్రం పని చేయవు. ఇలాగే పిల్లలతో కథలూ చెప్పించాలి. ఓ చిన్నారి కథ మొదలుపెడితే... మిగతావాళ్లు ఒక్కొక్కరు దాన్ని అల్లుతూ వెళ్లాలి. చిట్టచివరి చిన్నారి దాన్ని ముగించాలి. ఇలా పదాల అంత్యాక్షరి, అభినయించిన దాన్ని కనిపెట్టడం లాంటివి ఆడించాలి. బోధన ఇలా సాగితే పిల్లలు ఆ తరగతి కోసం పరిగెత్తుకు వస్తారు. ఇంకా పండగలు, జాతరలు, వాళ్లు చూసిన ఏదైనా సంఘటన మీద నమూనా కార్యక్రమాన్ని పిల్లలతో ప్రదర్శింప చేయాలి. ఇది వారికి విషయ పరిజ్ఞానాన్ని కలిగించడమే కాక భావి జీవితానికి సంసిద్ధులను చేస్తుంది. ఇంకా వాళ్లలో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయి.
ఇక భాషలో చివరి అంశం వ్యాకరణం. నామవాచకాలు, విశేషణాలు, క్రియల వంటివి వాక్యంలో ఎలా వస్తాయో ఆటల ద్వారా, కథల్లో వాటిని గుర్తుపట్టడం ద్వారా నేర్పించవచ్చు. నిర్వచనాల జోలికి వెళ్లకూడదు. అర్థం తెలియడమే ముఖ్యం. వ్యాకరణం చెప్పడానికి పాటలెంతో ఉపయోగపడతాయి. ఉదాహరణకు జైసీతారాం రాసిన పాట...
ఎండ ఎర్రగ కాచింది
మబ్బు నల్లగ లేచింది
గాలి చల్లగ వీచింది
ఉరుము పెద్దగ ఉరిమింది
మెరుపు తళుక్కున మెరిసింది
వాన జోరుగ కురిసింది
చెరువు నిండుగ నిండింది
పంట దండిగ పండింది

      ఈ పాటనేర్పి భాషాభాగాలను పరిచయం చేయడం ఎంతో సులభం. పాటలోని సన్నివేశాలు ఒకదాని తర్వాత ఒకటిగా జరిగేవి పిల్లల మనసులో హత్తుకుంటాయి. ఒక వూహాచిత్రం వాళ్ల మనసులో మెదులుతుంది. ఆ వూహాచిత్రాన్ని రంగుల్లో వేయమని పిల్లల్ని పురమాయించవచ్చు. ఇది చదువును ఆహ్లాదకరమైన దానిగా చేసి పిల్లల్ని ఉత్తేజపరుస్తుంది. ఈ పాటలో భాష, సైన్స్‌, కళ, భూగోళం, సామాజికాంశాలు అన్నీ కలిసిపోయి ఉన్నాయి. ఒక్కపాట సాయంతో అవన్నీ చెప్పవచ్చు. పిల్లలతో డబ్బాలు తయారుచేయించి, వాటి మీద క్రియలు, నామవాచకాల పేర్లు రాయించాలి. తర్వాత అట్టముక్కల మీద ఆయా విషయాలకు సంబంధించిన మాటలు రాసి వాటిని ఆయా పెట్టెల్లో పెట్టమనాలి. అంతేకాకుండా, వాటితో ఆటలు రూపొందించుకోవాలి. అన్నింటినీ కలబోసి వేరుచేయమని చెప్పడం కూడా ఒక ఆటే. ఒక బృందం ఒక క్రియను చూపితే, మరో బృందం అది సూచించే పనిని చేసి చూపాలి. వాటిని ఉపయోగించి వాక్యాలు తయారు చేయమనాలి. క్రియని లేదా నామవాచకాన్ని తొలగించినపుడు అసమాపక వాక్యాలు ఎలా తయారవుతాయో నేర్పించవచ్చు. ఇంకా వాక్యనిర్మాణం ఎలా జరుగుతుందో, ఎలా దెబ్బతింటుందో చేసిచూపవచ్చు. పెద్ద తరగతుల్లో సంధులు, సమాసాలు పరిచయమవుతాయి.
      భాష సంస్కృతికి మూలం. భాష ప్రపంచాన్ని ఆవిష్కరిస్తుంది. కొత్త భాష నేర్వడమంటే కొత్త ప్రపంచానికి ద్వారాలు తెరవడమే. ఎన్ని భాషలు నేరిస్తే అన్ని ప్రపంచాలు దర్శించినట్టే. అందుకు మొదటి మెట్టు అమ్మభాషలో పట్టు సాధించటం. దీనికోసం చేయాల్సిందల్లా పిల్లలకు బాల్యం నుంచే తెలుగుపట్ల ఇష్టాన్ని పెంచటం. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల కృషితోనే అది సాధ్యం.


వెనక్కి ...

మీ అభిప్రాయం