రాండ్రి! మా లెస్క మాటలీడున్నయ్‌!!

  • 1591 Views
  • 3Likes
  • Like
  • Article Share

    డా॥ నలిమెల భాస్కర్‌

  • కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత
  • కరీంనగర్‌
  • 9704374081
డా॥ నలిమెల భాస్కర్‌

కరీంనగర్‌ తెలుగు సకినాలంత రుచిగా ఉంటుంది. ఈ జిల్లా భాషలో కనిపించే గసడదవాదేశ సంధిని దృష్టిలో ఉంచుకునే భద్రిరాజు కృష్ణమూర్తి ‘‘...ప్రాచీనోచ్చారణలు ఇంకా తెలంగాణలో నిల్చి ఉన్నాయని చెప్పవచ్చు’’ అన్నారు. బూదరాజు రాధాకృష్ణ కూడా ‘‘ఇక్కడ వినిపించే ‘న్ర’ ధ్వని కావ్యభాషా రూపం కన్నా ఎంతో ప్రాచీనమైంది’’ అని చెప్పారు. పైగా సిరిసిల్ల ప్రాంతంలోని తెలుగు ఓ ప్రత్యేక స్థానిక మాండలికానికి మంచి ఉదాహరణగా నిలుస్తుందన్నారు. మట్టివాసనలద్దుకున్న ఇక్కడి మాటల ముచ్చట్లు మీకోసం!
తూర్పు ప్రాంతంలో మినహా కరీంనగర్‌ జిల్లాకు ఇతర రాష్ట్రాల సరిహద్దులు లేవు. ఆ తూర్పు ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర భాషల ప్రభావమూ ఈ జిల్లామీద చాలా తక్కువ. చాలాకాలం వరకు రవాణా సౌకర్యాలు ముఖ్యంగా రైలుమార్గం (పెద్దపల్లి మినహా) వంటివీ లేవు కాబట్టి ఇక్కడి భాష మారలేదు. విద్యావసతులు తక్కువైనప్పుడు కూడా భాషలో ఎక్కువగా మార్పులు చోటు చేసుకోేవు.
      కరీంనగర్‌ జిల్లాలోని నామవాచకాలు కొన్ని ప్రత్యేకంగా ఉన్నాయి. నేతిబీరకాయల్ని ఇక్కడ ‘అంబటి బీరకాయలు’ అంటారు.. నెయ్యిలాగే అంబలి కూడా ద్రవరూప ఆహారపదార్థం. నెయ్యి మాదిరిగానే స్నిగ్ధంగా ఉంటుంది. అందుకే అదిక్కడ నెయ్యి స్థానంలోకి వచ్చింది. అంబటాల్ల (అంబలి తాగేవేళ), నీ కడుపున అంబలివడ (నీ కడుపులో అంబలి పడనీ) మొదలైన మాటలూ ఉన్నాయి. పాడైపోయింది, పరమచెత్తగా తయారైంది, నాశనం అయిపోయిందనడానికి ‘అరువందమై పోయింది’ అంటారు. ‘ఇల్లంత అరువందమైంది’ అనేది ప్రయోగం. ఫలానావాడు ‘అత్తిరి బిత్తిరి మాటలు’ మాట్లాడుతున్నాడు అంటే అర్థంపర్థం లేని ఆత్రంతో కూడిన చంచలమైన మాటలు మాట్లాడుతున్నాడని అర్థం(అత్తరం- ఆత్రం; బిత్తరం- చంచలం). ఉత్కంఠ అనే పదానికి బదులుగా ‘ఉబ్బు’ ఉందిక్కడ. నరాలు తెగే ఉత్కంఠ, ఉత్కంఠ ఆగనే ఆగదు వంటి ప్రమాణభాషలోని వాక్యాలకు కరీంనగర్‌లో ‘వానికి ఉబ్బు ఆగనే ఆగది’ అంటారు. వూచకోతకు బదులు కత్తికోత, కూరకోతలున్నాయి.
      తాటికాయంత అక్షరాలతో రాస్తున్నాడు అన్నదానికి సమానార్థకంగా ‘మక్కబబ్బల రాత’ ఉంది. అమహద్వాచక ఏకవచన సర్వనామాలైన ‘దాని, దీని’ తదితరాలు కరీంనగర్‌లో ‘అదాని, ఇదీని’గా ఉన్నాయి. తమిళంలోని ‘అదన్‌, ఇదన్‌’లోంచి వచ్చిన ప్రాచీన రూపాలివి. ‘వాటిని, వీటిని’ మొదలైన అమహద్వాచక బహువచన రూపాలు ‘ఇవ్వీటిని, అవ్వీటిని’గా ఉన్నాయి. ఇవీ తమిళ ‘అవట్రై, ఇవట్రై’ నుంచి వచ్చినవే. పదాది టకార రూపాలూ ఈ జిల్లాలో కనిపిస్తాయి... టొంబై (తొంభై) మొదలైనవి. ఏమీలేదనడానికి ‘గాడిదగుడ్డు, సింగినాదం జీలకర్ర’ అనే జాతీయాల వాడకం ప్రమాణభాషలో ఉండగా, కరీంనగర్‌లో ‘బుర్యలడ్డు’, ‘లొట్టపీసు మాసపత్రి’ వంటి పలుకుబళ్లు ఉన్నాయి. ‘ఆవులింతలు’ క్రమంగా ‘వాయిలింపులు’ అయ్యాయి. కష్టాలు ‘పుల్లెందలు’గా మారాయి. శాపనార్థాలు ‘సాపెన’ రూపం పొందగా, పాఠశాల ‘సోపాల’ అయ్యింది. బండబూతులు తిట్టడం అనేది ‘బండకడుగుడు’గా పరిణమించింది. ప్రమాణభాషలో ‘ముచ్చెమటలు’ పోస్తే, కరీంనగర్‌ తెలుగులో ‘సల్లజెముటలు’ పోస్తాయి. ఈ జిల్లాలో ‘నడితర్ర మనుషులు’ (మధ్యతరగతి మనుషులు) ఉంటారు.
అత్తన్న... పోతన్న
‘వస్తున్నాను’ అనే క్రియ తెలంగాణలో ‘వస్తున్న/ వస్తన్న’ అనే రెండు రూపాల్లో వినబడుతుంది. వీటినే శిష్టేతరులు ‘అస్తున్న/ అస్తన్న’ అని పదాది వకార లోపంతో పలుకుతారు. కరీంనగర్‌లో ఇదే ‘అత్తున్న/ అత్తన్న’గా మారింది. నన్నయ సైతం భారతంలో ‘వత్తు, తెత్తు, ఇత్తు’ అనే రూపాలు వాడాడు. పైగా హిందీ లేదా ఉర్దూలోని ‘ఆతా హూ’(వస్తాను)కూ, కరీంనగర్‌లోని ‘అత్త’కూ సంబంధం ఉందేమో! పూర్తిగా బోసిపోయినట్లు ఉన్నప్పుడు, జనాలు ఎవరూ లేక ఇల్లు భయం గొల్పుతున్నప్పుడు ఇక్కడ ‘ఇల్లు అంత గుడ్‌ గుప్పుమన్నట్లుంది’ అంటారు. తెలంగాణేతర ప్రాంతాల్లో ‘గిల్లికజ్జాలు పెట్టుకునే వాళ్లు’న్నట్లుగానే ఈ జిల్లాలో ‘గెలికి కయ్యం పెట్టుకుం’టారు. ప్రమాణభాషలోని ‘కొంపాగోడూ అమ్ముకోవడం’ అనే మాట ఇక్కడ ‘గూనపెంకలు అమ్ముకుంటడు’ అన్నదానికి సమానం. ఎక్కడివాళ్లు అక్కడ పలాయనం చిత్తగించడం అనే అర్థంలో ఇక్కడ ‘చెంగో బిల్ల అవుడు’ ఉంది. పానం సొల్లుడు (ఒళ్లు తూలటం), ‘చిదుమ చిదుమ బొడ్సుడు’ (చిత్రవధ చేయడం) అనే క్రియలూ వ్యవహారంలో ఉన్నాయి.
      నిఘంటువుల కాలంనాటి కన్నా, ప్రాచీనతరమైన క్రియాపదాలు కరీంనగర్‌ తెలుగులో ఉన్నాయి. ఉదాహరణకు ‘నత్కుడు’. ఈ క్రియ ప్రమాణభాషలో వర్ణ సమీకరణంతో ‘నక్కుడు’ లేదా ‘నక్కడం’ అయ్యింది (నతికి- నక్కి). ‘వాడు గోడచాటుకు నక్కి వింటున్నాడు’ అనే వాక్యంలోని నక్కి ‘నతికి’లోంచి వచ్చింది. ఆధునిక భాషలోని ‘చిర్రెత్తుకొచ్చింది’ కరీంనగర్‌లో ‘చిర్రుకచ్చింది’. ఒక విషయం అర్థం కావడాన్ని, బోధపడటాన్ని ఈ జిల్లాలో ‘మన్సున పట్టుడు’ అంటారు. చిన్నయసూరి భాషలో ‘మనంబునం బట్టి’ అంటే ఇదే. మలయాళంలో ‘మనస్సిల్‌ అక్కుక’గా ఉంది. తల ఎత్తుకొని తిరగలేకపోవడం ‘మొకం లేకుంట అవుడు’గా మారింది. మాయమాటలు చెప్పి మన కళ్లముందే ఓ వస్తువును కాజేయడాన్ని ఇక్కడ ‘మత్పరిచ్చుడు’ అంటారు. ‘వాడు మీది కుండ మీద ఉండంగనే కింది కుండ కింద ఉండంగనే నడుమల కుండ మత్పరిస్తడు’ అన్నది ప్రయోగం. ‘బొచ్చెల మెరుసుడు’ అంటే ఏదైనా ఒక విషయం చప్పున గుర్తుకొచ్చి ‘స్మృతిపథంలో తళుక్కున మెరవడం’ అన్నమాట. బాగా కోపానికి రావడమంటే ఇక్కడ ‘మండుకచ్చుడు’. కోపంతో వూగిపోతున్న వాణ్నిచూసి ‘మెండుమీద ఉన్నడు’ అంటుంటారు. మంచమ్మీంచి లేవలేని అనారోగ్యస్థితిలో ఉంటే ‘మంచంనేసుడు’, ఆకాశమంతా మేఘాలతో ఆవరించి ఉంటే ‘మొగులు మెత్తవడుడు’, ఎదుటి వ్యక్తిలోని రహస్యాల్ని రాబడితే ‘లోతులు గుంజుడు’ అంటారు. ఇది కూపీలాగడం.. ఆరా తీయడం లాంటి మాట. ప్రమాణభాషలోని గుండెలు బాదుకోవడం ఇక్కడ ‘బొచ్చెంత గుద్దుకొనుడు’గా ఉంది. అదేపనిగా పెట్టుకొని ఒక వ్యక్తిని నిందల పాలుచేస్తే ‘పేర్నాల పెట్టుడు’ అంటారు. పేర్లూ, నామాలూ పెట్టి నిందించడం అన్నమాట.
మనదైన భాష
అనేక పదాలు, పదబంధాలు అచ్చతెలుగులో ఉండటం ఈ జిల్లా తెలుగు ప్రత్యేకత. ‘ఎల్తకట్టెలు’ అనే పదమే తీసుకోండి! దీన్ని ప్రమాణభాషలో వెదురు బొంగులు లేదా వెదురు కర్రలు అంటారు. మరి ‘ఎల్తకట్టెలు’ ఏంటి? అవి వెలితి కట్టెలు. వాటి లోపల వెలితి ఉంటుంది. అవి గుల్లగా, ఖాళీగా ఉంటాయి. కాబట్టి ఎల్తకట్టెలయ్యాయి. అలాగే మరమరాలను బోలుప్యాలాలు అంటారు. గంపను ఇక్కడ ‘గుల్ల’ అనీ పిలుస్తారు. ఇల్లు గుల్లవుతుంది, నత్తగుల్ల మొదలైన వాటిలో గుల్ల అంటే బోలుతనమే కదా! గాయంతో కానివ్వండి, మరేదైనా కారణంతో కానివ్వండి గజ్జల్లో, చంకల్లో వచ్చిన వాపును కరీంనగర్‌లో ‘గగ్గోడు’ అంటారు. అది గగ్గోలు పడదగింది అంటే ఆందోళన చెందాల్సింది కాబట్టి అలా పిలుస్తున్నారు.
      కొన్ని కూరగాయల విత్తనాలను నేలలో పాతినప్పుడు చిన్న మొలకలు వస్తాయి. అవి కాస్త పెరిగాక చిన్నగా తీగలు బయటకొస్తాయి. ఈ తీగలు పాకడానికి మొక్కల చుట్టూ చిన్నచిన్న కర్రల్ని నాటుతారు. వీటిని కరీంనగర్‌లో పబ్బులు అంటారు. ‘ప్రబ్బు’ అంటే వ్యాపించి అని అర్థం కావ్యభాషలో. పందిరి మీదికిగానీ, పాతిన కర్రలపైకిగానీ తీగలు వ్యాపించడానికి పెట్టినవి పబ్బులు. ప్రవేశించడానికి వీలుగా లేని తుప్పలూ, పొదలూ మొదలైన ప్రాంతాన్ని ‘జిబ్బు’ అంటారు. ఇది ‘జీబు’ రూపాంతరం చెందగా ఏర్పడిన పదం. ‘మోర్దోపు మనిషి’ అనే మరో మాట ఉందిక్కడ. ‘మోరత్రోపు’ అంటే ఏ పని చెప్పినా అయిష్టాన్ని చూపుతూ మోరను అంటే ముఖాన్ని అటు తిప్పడం అని అర్థం. మొండివాణ్ని చూపడానికి దీన్ని వాడుతారు. దురుసుతనం కలిగినవాడని కూడా చెప్పుకోవచ్చు. ‘నాగజెముడు’ అనే పదంలో ‘నాగ’ తత్సమం. ఈ చెట్టుని కరీంనగర్‌లో ‘పాంపడిగె చెట్టు’ అంటారు. పాము పడగ ఆకారంలో ఉన్న చెట్టు అని. కరతలామలకం అనే దానికి బదులు ‘అరచేతుల పని’, గోధూళివేళకు ‘గోజిలు వచ్చేయాల్ల’, ఆద్యంతం అనడానికి ‘కొనెల్ల’... ఇవి కరీంనగర్‌ మాటలు. చాలా, విరివిగా, బాగుగా, పుష్కలంగా, అనేకంగా అనే మాటలకు బదులుగా ‘మాలెస్క’ వాడుకలో ఉంది. ఇది ‘మహాలెస్సగా’ నుంచి వచ్చింది. చాలా అనే అర్థంలో ‘ఒల్శెన్ని’ అనే మాట కూడా ఉంది. ఇది ‘వలసినన్ని, కావలసినన్ని’ అనే పదం నుంచి వచ్చింది. ఇదే అర్థంలో ‘పట్టేన్ని’ అనే మరో మాటా ఉంది. అంటే ‘పట్టినన్ని’ అని అర్థం. ఎవరైనా గోడచాటున ఉండి ఇతరుల మాటల్ని వింటున్నప్పుడు ‘వాడు పొంచులు వింటున్నడు’ అంటారు. పొంచులు వినుడంటే పొంచి ఉండి వినడం. ‘వాడు పిడాత చచ్చిండు’ అనే ప్రయోగమూ ఇక్కడ ఉంది. పిడాతకు పిడుగువాత అని అర్థం.
కొద్దిగా అవీ...
కరీంనగర్‌ తెలుగుపై అన్యభాషల ప్రభావమూ అంతో ఇంతో ఉంది. ఇక్కడి తత్సమ పదాలు సంస్కృత, ప్రాకృతాలకు సమాలు. ఆపాచ్చన (అపేక్ష), ఎల్లెం (వైళము అంటే తొందరగా అని), చెవులగోపెం (గోప్యం, రహస్యం), రాజపూజితంగ (రాజులతో పూజింపబడినంత గౌరవంగ), ఒల్లెక్కాలకు (హుళక్కులకు... వూరకనే), మంది దార పట్టుడు (జనం ధారాపాతంలా బారులు తీరి రావడం)... ఇలా ఎన్నో! ఆంగ్లం ప్రభావం వల్ల ఏజ్‌బార్‌ అవుడు (వయో పరిమితి మించిపోవడం), ఔటాఫ్‌ పోవుడు (విదేశాలకు వెళ్లడం), కటీఫ్‌ అవుడు (స్నేహం భంగమవడం), నంబర్‌ ఏక్‌ బియ్యం (మొదటిరకం బియ్యం), నంబర్‌ మీద తీసుకునుడు (ఎడాపెడా చెడామడా తిట్టడం), కమేటి కట్టుడు (గ్రూపులు కట్టడం), లక్కిల పడుడు (అదృష్టం కలిసిరావడం), చాక్మారు (షార్పునర్‌), పంపుచారు (పంక్చర్‌), బబ్బులింగం (బబుల్‌గమ్‌) వంటివి వ్యవహారంలోకి వచ్చాయి.
      మరాఠీ, తమిళ, కన్నడ భాషల ప్రభావమూ ఈ జిల్లా తెలుగుపై ఉంది. ముంబయి, భివండీ, షోలాపూర్‌ తదితర మరాఠీ ప్రాంతాలకు వలస వెళ్లిన పద్మశాలీ మొదలైన కుటుంబాల్లో ఈ ప్రభావం ఎక్కువ. కిటికీని ‘బారి’ అనీ, సంచిని ‘షిష్పి’ అనీ, లంగాను ‘గగ్గెర’ అనీ, కానుకను ‘బక్షీసు’ అనీ ఈ కుటుంబాలు వ్యవహరిస్తున్నాయి. బాగా అన్నం తింటున్నప్పుడు ‘వాడు అన్నం బెట్టాలకు బెట్టాలు తింటున్నడు’ అంటారు. ఈ బెట్టాలు ఏంటో కాదు కన్నడంలోని బెట్టలు. బెట్ట అంటే గుట్ట. మంచమ్మీద మేను వాల్చగానే నిద్రపడితే ‘కన్ను మలిగింది’ అంటారు కరీంనగర్‌లో. కన్నడంలో ‘మలగలు హోగువుదు’ అంటే నిద్రపోవడం. కాస్త ఆగు అనే అర్థంలో ‘లేకతాళు’; ఓపిక వహించు అనే అర్థంలో ‘సైసు సైసు’ అంటారు. ఇది కన్నడంలోని ‘సహిసు’కు రూపాంతరం. తెలుగులో సహించు. కరీంనగర్‌ ‘సైసు’కు అతి దగ్గరగా కావ్యభాషలో ‘సైచు’ అనే మాట ఉంది.
      ‘పాలోనివా పంగోనివా’ అన్న కరీంనగర్‌ ప్రశ్నార్థక వాక్యంలోని ‘పంగు’ తమిళపదం. ‘పంగు’ అంటే పాలు, భాగం, వంతు అని అర్థం. పాలోడు అంటే దాయాది. పంగోడు అన్నా దాయాది, జ్ఞాతి అని అర్థం. ఇంటి నిర్మాణం, ఇంటి కొలతలకు సంబంధించి ఈ జిల్లాలో ఓ పదం వాడుకలో ఉంది. అది ‘ఉల్లోపల’. అంటే ఇంటి బయటి కొలతలు కాకుండా లోపలి కొలతలు అన్నమాట. ‘ఉల్‌’ అంటే లోపల అని అర్థం. ఇది తమిళ పదం. కొండల్లో కోనల్లో చాలా దూరంగా అనే అర్థంలో కరీంనగర్‌లో ‘కోయమ్మ కొండలల్ల’ అనే మాట ఉంది. ‘కో’ అంటే దేవుడు. ఇదీ తమిళ పదమే! కోయమ్మ అంటే దేవత అని అర్థం. దేవుళ్లూ, దేవతలూ సాధారణంగా కొండలపైనే ఉంటారు. సుదూరంగా అనే దానికి బదులు కోయమ్మ కొండలల్ల అని పలుకుతారు. ఇక మొత్తం తెలంగాణ తెలుగు మీద ఉర్దూభాషా ప్రభావం విపరీతం. వాడు కోపానికొచ్చాడుకు బదులు ‘గరం అయ్యిండు’ అంటారు. ఘెరావ్‌ చేయడం అంటే ‘చుట్టు గెరాయించుడు’; లోకం అంతా తెలిసినవాడు, చూసినవాడుకు ప్రత్యామ్నాయంగా ‘వాడు దునియ చూసిండు’, వానికి దునియ తెలుసు’ అని వాడుతారు. అంగూర్లు, సేపులు, సంత్రాలు, మోసంబీలు, చాపత్తా, బేఫికర్‌, బాజాప్తా లాంటి వేలాది పదాలు ఉర్దూ హిందీల్లోంచి వచ్చి చేరాయి.
సామెతల ఆమెతలు
ఏ భాషకైనా, జవాన్నీ, జీవాన్నీ సమకూర్చేవి; సొగసునీ, శక్తినీ కల్గించేవి సామెతలూ, జాతీయాలే! ఆధునిక ప్రమాణభాష కన్నా భిన్నంగా తెలంగాణ తెలుగులో ఇవి ఉండటం విశేషం. ‘ఆవునూరుకు ఆడిపిల్లను ఇయ్యద్దు - మల్లారెడ్డిపేటకు ఎద్దును అమ్మద్దు’ అనేది కరీంనగర్‌లో ఒక సామెత. ఆవునూరుకు ఎందుకు ఆడపిల్లను ఇవ్వద్దన్నారు? మానేరునది ఒడ్డున ఆవునూరు ఉంది. అక్కడ ఆ నది విశాలంగా ఉంటుంది. లోతుగా పారుతుంది. ఇప్పుడంటే మానేరుపైన వంతెన వచ్చింది కానీ పూర్వం అది లేదు. కాబట్టి బిడ్డను ఆవునూరు పిల్లవాడికి ఇస్తే, ఆ అమ్మాయి ఆపదకూ సంపదకూ అందుబాటులో ఉండదు. ఇక ఎద్దును మల్లారెడ్డిపేటకు ఎందుకు అమ్మకూడదు అంటే... ఆ వూరి పొలాలన్నీ రాళ్లమయం. దున్నుతుంటే ఎద్దు కాళ్లకు అడుగడుగునా అవే తగిలి గాయాలవుతాయి. ఏలు జూపితే కొండ పాకుడు (చూసి రమ్మంటే కాల్చి రావడం), తోటోడు తొడ గోసుకుంటే మనం మెడ కోసుకొనుడు (పులిని జూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు), నోరా మోరా? (నాలుకా తాటిమట్టా?), పొట్ట తిప్పలకు జేరిపోతులు ఆడిచ్చుడు (కూటికోసం కోటి విద్యలు), లచ్చిమి రాంగ తడుక అడ్డం పెట్టినట్లు (సిరి రా మోకాలొడ్డినట్లు), సందుల బొందు (సందట్లో సడేమియా), మన గంజి మనం పల్చన చేసుకునుడు (కడుపు చించుకుంటే కాళ్ల మీద పడటం), నీళ్లు పోయినంక రాళ్లు ఏసుడు (గతజల సేతుబంధనం) ఇవి కరీంనగర్‌ సామెతలు.
      ఈ జిల్లా జాతీయాలూ ప్రత్యేకమే. ధరలు బాగా మండిపోవడాన్ని ఈ జిల్లాలో ‘ఏది కొందామన్నా అగ్గిల చెయ్యి పెట్టినట్లు ఉంది’ అంటారు. ఎండ నిప్పులు చెరగడం ఇక్కడ ‘ఎండ కొర్రాయోలె కొట్టుడు’ అవుతుంది. ‘చీమ చిటుక్కు మనదు’ అనే దానికి సమానార్థకంగా ‘వానికి చెవిమీద పేను పారదు’, ఇసుక వేస్తే రాలనంత జనాన్నే ‘తుపాకి ఏద్దామంటే సందులేనంత మంది’ అని అంటారు. అందరికీ తలలో నాలుకలా ఉండే మనిషిని ‘వాడు నోట్లె పండు’ అని వ్యవహరిస్తారు. కేశాకేశిగా, కచాకచిగా సిగపట్లు పట్టడం అంటే కరీంనగర్‌లో సికెల్‌ సికెల్‌ పట్టుకునుడే! మొహం వేల్లాడేసుకొని రావడం అంటే ఇక్కడ ‘జబ్బలు జారేసుడు’.
ఎన్నెన్నో అందాలు
చాలా చిత్రంగా కరీంనగర్‌ తెలుగులో ‘క’ అనే అక్షరం పదమధ్యంలో ఆగమంగా వచ్చి చేరుతుంది. నిష్ఠూరం అనే మాట ‘నిష్ఠూర్కం’ అవుతుంది. పులిచారలు పులి‘సార్కలు’ అవుతాయి. పంపకాలు ‘పంచోట్కాలు’గా పరిణమిస్తాయి. జంఝాటం ‘జంజాట్కం’ అవుతుంది. ఉద్ధరణ ‘ఉద్దార్కం’, కుళ్లుమోత్తనం ‘కువార్కం’, కొట్లాట ‘కైలాట్కం’, దోపిడి ‘దోప్కం’, నీటుతనం ‘నీట్కం’, రూపం ‘రూప్కం’, భావం ‘బావ్కం’, మూలం ‘మూలకం’గానూ మారతాయి. ఈ జిల్లాలో ఇంకా కొన్ని విశేషాలున్నాయి. గట్రా, వగైరా అనే అర్థంలో ‘గిట్ట’ ఉపయోగంలో ఉంది. ‘తానం గిట్ట చేసినవా?’ అంటే స్నానమూ గట్రా చేశావా అని అర్థం. అక్కడినుంచికి బదులు ‘ఆనంగ’ అని అంటారు. పిసరంత, ఇసుమంత, రవ్వంత, ఆవంత అనే మాటలకు ఇక్కడ ముత్తెమంత, పగుడమంత అనే పదాలున్నాయి. ‘తోసహా’ లేదా ‘తోపాటు’ అనే అర్థంలో ‘తో యుక్తంగ’ ప్రయుక్తం అవుతుంది. ఉదాహరణకు ‘పెండ్లికి మీరందరు పిల్లలతో యుక్తంగ రావాలె’ అని పిలుస్తారు. గోర్వెచ్చకు బదులు ‘ఏలెచ్చ’ అని అంటారు.
      కరీంనగర్‌ భాషలో కొన్ని విభక్తి ప్రత్యయాలు సైతం వేరుగా ఉన్నాయి. ఉదాహరణకు ‘ఉండుట్ల’.. ఇది ‘ఉండుట వలన’ నుంచి వచ్చింది. భావార్థకంలోని ‘ట’, ‘వలన’లోని ‘ల’ కలిసి ‘ట్ల’ అయింది. వలనన్‌, కంటె, పట్టి... పంచమీ విభక్తి ప్రత్యయాలు. వీటిలోని ‘పట్టి’ కరీంనగర్‌లో ‘పటికె’ అయ్యింది. ‘నువ్వు చెయ్యపటికె ఈ పెండ్లి అయింది’ అన్న వాక్యంలో ‘పటికె’ అంటే ‘వలన’ అనే! ‘కొరకు’ అనే ప్రత్యయానికి బదులు ఈ జిల్లాలో అప్పుడప్పుడు ‘కై’ వస్తుంది. ‘నేను నీకై వస్తే నువ్వు లేకపోతివి’ అనేది ఉదాహరణ. ‘కోసం’ అనే ప్రమాణభాషా ప్రత్యయం ఇక్కడ ‘కోసురం’ రూపంలో కూడా ఉంది. ఇది కన్నడ ప్రత్యయం ‘ఓస్కర’కు దగ్గర.
      ఈ జిల్లా తెలుగులో ఒత్తులు పోతాయి (బాస్కర్‌, బాద). హకారం పోతుంది (ఓటల్‌, ఓలిపండుగు), చకారం సకారంగా మారుతుంది (సదువు సంకనాకి పోతది), పదాది వకారం పోతుంది (అచ్చిండు), చశషసల భేదం ఉండదు (రాముడు శివుని విల్లు ఇరిశిండు), ద్వికంలోని ‘అ, ఇ’లు ‘గ, గి’లు అవుతాయి (గప్పుడు, గిట్ల), ‘ళ’ ‘ల’గా పలుకుతుంది (వాల్లు, వీల్లు). ప్రమాణభాషతో పోల్చి చూసినప్పుడు ఉచ్చారణలోనూ, రూప నిష్పత్తిలోనూ స్పష్టమైన భేదాలు కనిపిస్తాయి. వచ్చిండు/ అచ్చిండు కరీంనగర్‌ జిల్లాలో భూతకాలిక సమాపకక్రియ. ఇదే ప్రామాణిక భాషలో ‘వచ్చాడు’, రాయలసీమలో ‘వచ్చినాడు’.
      ఏది ఏమైనా తెలంగాణ తెలుగులో భాగమే కరీంనగర్‌ తెలుగు. అయినా ఇక్కడ కొన్ని భాషా ప్రత్యేకతలున్నాయి. కరీంనగర్‌ జిల్లా తెలుగుభాషా స్వరూప స్వభావాలు ఈ జిల్లాలోని సాహిత్య సాంస్కృతిక చారిత్రక సాంఘిక భౌగోళికాది పరిస్థితుల్ని ప్రతిఫలింపజేస్తున్నాయి. మళ్లీ ఈ పరిస్థితులు జిల్లాభాషను ప్రభావితం చేస్తున్నాయి. నిఘంటువుల కాలం నాటికన్నా ప్రాచీనమైన పదాలు నాగుంబాము, తాంబేలు మొదలైనవి ఇక్కడున్నాయి. ప్రార్థనాద్యర్థక బహువచన రూపాలు ‘రండ్రి’, ‘కూర్చోండ్రి’ ఇక్కడ వినిపిస్తాయి. ఇందులో బహువచన సూచకం ‘డ్రి’లోని రకారమే! కన్నడంలో కూడా వీటిని వరుసగా ‘బన్రి’, ‘కూత్కోళ్రి’ అంటున్నారు. మొత్తమ్మీద కరీంనగర్‌ జిల్లా తెలుగు చాలావరకు అచ్చెరువు కలిగించే అచ్చతెలుగు పదాల తోట.
మాటల ముత్యాలు
ఇచ్చులు కచ్చకాయలు- వివరాలు;
 ఎటమటం- కిందు మీద కావడం; 
అగ్గిపగ- బద్ధవైరం; 
కుచ్చులు- డబ్బులు; 
కూకేటిపాము- కొండచిలువ; 
పెబ్బె- నాయకుడు; 
ముత్తడం- మేఘాలతో ఆకాశం అంతా కమ్మడం; 
బొగుడ- మెట్ట; 
సందం- దహనాది అంతిమ సంస్కారాలు; 
సొడ్లు- చీవాట్లు, తీర్పాటం- తీరిక;
 తెగారం- తెగింపు, అగడు- అత్యాశ;
 దగడు- ఎండ వేడిమి.

*   *   *
 

 


వెనక్కి ...

మీ అభిప్రాయం