భాషా శాస్త్రజ్ఞులం.... బాధ్యత తీసుకుందాం!

  • 704 Views
  • 0Likes
  • Like
  • Article Share

    - బి.ఆర్‌.బాపూజీ, 

  • హైదరాబాదు.
  • 9948283810

‘తెలుగు ప్రపంచభాష కావాలి’... ఆ మధ్య ఎవరో ఆశపడ్డారు! తప్పులేదు!! కానీ, ఇంట గెలవలేనమ్మ రచ్చ గెలుస్తుందా? మాతృభాషలో విద్యాబోధన, భాషా ప్రామాణీకరణ, ఆధునికీకరణ/నవీకరణ, పాఠ్యపుస్తకాల రూపకల్పన, శాస్త్ర గ్రంథాల అనువాదాలు, వయోజన వాచకాల తయారీ, భాషాబోధకులకు శిక్షణ, లిపి రహిత సోదర భాషల కోసం కృషి, పరభాషల్లో (ఉదా: ఇంగ్లీషు) తెలుగు విద్యార్థులకు శిక్షణ తదితరాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించుకోకుండా మనమేమి కలలు కన్నా అవి కల్లలే అవుతాయి. ఈ విషయంలో అందరి భాగస్వామ్యం అవసరమైనా, భాషా శాస్త్రజ్ఞుల పాత్రే ఎక్కువ. అమ్మభాషాభివృద్ధిలో వీరు చేయగలిగిందేంటో చర్చించే ఈ వ్యాసం.. ‘తెలుగు భాషాదినోత్సవ’ (ఆగస్టు 29) ప్రత్యేకం!
మాతృభాషలో విద్యాబోధన వల్ల (కనీసం ప్రాథమికస్థాయి వరకైనా) విద్యార్థుల్లో నైపుణ్యాలు ఇనుమడిస్తాయన్నది నిపుణుల మాట. ముందు మాతృభాష అంటే ఏంటో సరిగా అర్థం చేసుకుంటేనే (నిర్వచించుకుంటేనే), దాన్లోనే విద్యాబోధన ఎందుకు జరగాలో అర్థమవుతుంది.
      మనం మొట్టమొదట నేర్చుకునేదీ; బాగా ఎక్కువగా మాట్లాడేదీ; ఎక్కువ సందర్భాల్లో వినియోగించేదీ; భావావేశ, లేదా హృదయానుగత సంబంధం కలిగినదీ; లెక్కించడం, ఆలోచించడం, కలలు కనడం లాంటి వాటికి ఉపయోగించేదీ మాతృభాష. అయితే, బహుభాషా సమాజాల్లో/ వేర్వేరు మాతృభాషలున్న తల్లిదండ్రులున్న సందర్భాల్లో ‘అసలు మాతృభాష ఏది?’ అన్న ప్రశ్న తలెత్తుతుంది. సహజంగా పిల్లలు ఏ భాషను ముందు నేర్చుకుంటే, ఏ భాషలో ఎక్కువ సామర్థ్యం కలిగి ఉంటే అదే మొదటి మాతృభాష. లేదూ అంటే, వ్యక్తిగతంగా ‘ఇది నా భాష’ అని దేనితో మమేకమవుతారో అది! ఏ భాషవల్ల గుర్తింపూ, గౌరవం, ఇతర భౌతిక ప్రయోజనాలుంటాయో అదీ మొదటి మాతృభాష కావచ్చు. ‘ఇలా ఒక్క భాషతోనే నన్ను నేను ముడివేసుకోవడం సాధ్యంకాదు, రెండు భాషల్లోనూ నేను సమానమైన నేర్పరిని అని ఎవరైనా భావించినా, తప్పనిసరిగా జరిగేదేమిటంటే, అతను ఒకే ఒక భాషలో ఆలోచిస్తాడు. ఒకే భాషలో కలలు కంటాడు. ఏదో ఒక భాష రెండో స్థానంలో ఉంటుంది. మాతృభాషకు సంబంధించిన ఈ లక్షణాలూ, స్వభావమూ అర్థమైతే.. ‘మాతృభాషలోనే విద్యాబోధన ఎందుకు జరగాలి?’ అన్న ప్రశ్న అర్థరహితమవుతుంది. మనం ఏ భాషలో కలలు కంటామో, అది మాతృభాష అయినప్పుడు, అందులోనే విద్యాబోధన జరగాలనడం పూర్తిగా సబబు! అలా మాతృభాషలో విద్యాబోధన జరగాలంటే అవసరమైనవి ఏంటి?  
ప్రామాణీకరణలో పాట్లు
ఏ భాష అయినా అన్ని ప్రాంతాల్లోనూ, అన్ని సామాజిక విభాగాల్లోనూ ఒకే రకంగా ఉండదు. ఆ భేదాల్నే ప్రాంతీయ మాండలికాలనీ; సామాజిక మాండలికాలనీ అంటాం. మరి తరగతి గదిలో, పాఠ్యపుస్తకాల్లో ఏ మాండలికాన్ని వాడాలి? ఇలాంటి సందర్భాల్లోనే ప్రామాణిక మాండలికం లేదా ప్రామాణిక భాష అనే సామాజిక భాషాశాస్త్ర భావన ఎదురవుతుంది. ఈ ప్రామాణిక భాషను ఉపయోగించడం ఒక క్రమబద్ధంగా, వీలైనంత వరకూ కచ్చితమైన ప్రమాణాలతో జరగాలంటే, ముందు దాన్ని స్థిరీకరించాలి. అందుకోసం, ప్రామాణిక భాషా పదాలతో కూర్చిన నిఘంటువులూ, వ్యాకరణమూ, పాఠ్యపుస్తకాలూ, అనువాదాలూ, ప్రభుత్వ పత్రాలూ, సంప్రదింపు గ్రంథాలూ తదితరాలను తయారు చేసుకుంటూ పోవాలి. ఇదే భాషా నవీకరణ/ఆధునీకరణ.
      భాషా నవీకరణ జరిగిన కొద్దీ- సాహిత్యంలోనూ, ప్రసార సాధనాల్లోనూ, పాలనా వ్యవహారాల్లోనూ, న్యాయ ప్రక్రియలోనూ, తరగతి గదుల్లోనూ, ఇంకా అనేక కొత్త కొత్త రంగాల్లో ప్రామాణిక భాష తన విధుల్ని విస్తృత స్థాయిలో నిర్వర్తిస్తుంది. కానీ, తెలుగు భాష ప్రామాణీకరణకు సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయి. ప్రామాణిక తెలుగు మాండలికం విస్తృత స్థాయిలో తన విధుల్ని నిర్వర్తించడానికి తగినట్టు స్థిరపడలేదు. వేరే మాటల్లో చెప్పాలంటే, తెలుగు నవీకరణ అసంపూర్తిగానే ఉంది. కేజీ నుంచీ పీజీ దాకా, ఇంకా ఆపైనా విద్యా బోధన జరగడానికి కావాల్సిన విధంగా ప్రత్యేక నిఘంటువులూ, పాఠ్యపుస్తకాలూ, శాస్త్ర అనువాద రచనలు అరకొరగానే ఉన్నాయి. దాదాపు అన్ని భారతీయ భాషల్లాగే తెలుగులో కూడా నిరక్షరాస్యులూ, అర్ధ- అక్షరాస్యులూ ఎక్కువమంది ఉండటమూ; విద్యావంతుల్లో కూడా, విద్యాస్థాయుల్లోనూ, అవకాశాల్లోనూ సమానత్వం లేకపోవడమూ ఈ పరిస్థితికి ఓ కారణం. ప్రామాణికమంటూ కొన్ని వర్గాలు ముందుకు తెచ్చిన మాండలికానికి అందరి ఆమోదమూ లభించకపోవడం మరో కారణం. భావోద్రేకాలతో ముడిపడిన ఈ సమస్యకు సహేతుకమైన పరిష్కారాన్ని అన్వేషించడం భాషా శాస్త్రజ్ఞుల బాధ్యత.  
ఆధునికీకరణ అంతంత మాత్రమే
సమాజంలో ఎప్పటికప్పుడు కొత్తగా ప్రవేశించే వస్తువులనూ, వ్యవస్థలనూ, భావనలనూ వ్యక్తం చేయడానికి వీలుగా భాషని రూపొందించుకోవడమే భాషా నవీకరణ. లిపిలేని భాషలకు లిపిని రూపొందించడం, ప్రత్యేక శాస్త్రాలకు సంబంధించిన ప్రత్యేక నిఘంటువుల్ని తయారు చేయడం, తగిన శైలీ భేదాన్ని స్పృజించుకోవడం- ఇదంతా భాషా నవీకరణలో భాగమే. ఇదంతా, ఒక ప్రణాళిక ప్రకారం భాషా శాస్త్రజ్ఞులూ, ఆయా శాస్త్రాల నిపుణులూ సమన్వయంతో చేయాల్సిన పని. ఈ విషయంలో తెలుగునాట పూర్తిస్థాయిలో కృషి జరగలేదు. పెంగ్విన్‌, ఆక్స్‌ఫర్డ్‌ లాంటి ప్రచురణ సంస్థలు ఇంగ్లీషులో వెలువరించిన ప్రత్యేక నిఘంటువులు తెలుగులో ఇప్పటికీ లేవు- కేవలం సంక్షిప్త పద పట్టికలూ, అసమగ్ర పదకోశాలూ తప్ప. ఇవి లేనప్పుడు, మాతృభాషలో విద్యాబోధన సాఫీగా సాగదు.
      తెలుగులో పాఠ్యపుస్తకాల విషయం లోనూ అసందిగ్ధత రాజ్యమేలుతోంది. గతంలో తెలుగు భాషా సమితి, తెలుగు అకాడమీ, ప్రైవేటు ప్రచురణ సంస్థలూ, స్వతంత్ర రచయితలూ ఎన్నో పాఠ్యపుస్తకాలు వెలువరించినప్పటికీ, ఆచరణలో వాటి ప్రయోజనమూ, ప్రభావమూ విద్యార్థుల్లో/ ఉపాధ్యాయుల్లో ఏ మేరకు ఉందనే పరిశీలనలూ, సర్వేలూ జరిగిన దాఖలాలు లేవు. క్లుప్తత, నిర్దిష్టతా మాత్రమేకాక, స్పష్టత ఏ మేరకు ఉందీ; వాడుక భాషా సూత్రాలకు అనుగుణంగా ఉండి, చదువుతూ ఉండగానే, తేలిగ్గా అర్థమయ్యేలా ఉందా, లేదా అనే అభిప్రాయం సేకరణ జరిగినట్టు సమాచారం ఏదీ లేదు. పైగా, అవి పాషాణపాక శైలిలో ఉంటున్నాయి. వీటిని సులభశైలిలోకి తేవడానికి భాషా శాస్త్రజ్ఞులు చొరవ తీసుకోవాలి. అలాగే, వయోజన విద్యావ్యాప్తికీ పాటుపడాలి. 
      ఒక దేశంలో నిరక్షరాస్యత ఉందంటే (అది ఏ మేరకు ఉన్నాసరే) దాని అర్థం ఆ దేశ సామాజిక వ్యవస్థ అసమానతల పునాది మీద ఆధారపడిందని. భూములూ, గనులూ లాంటి భౌతిక ఉత్పత్తి సాధనాలు కొద్దిమంది ఆస్తిగా ఉన్నప్పుడు, విద్యలాంటి మేధో ఉత్పత్తి సాధనమూ అసంఖ్యాకులకి అందని ఫలంగానే ఉంటుంది. అలాంటి విద్యా అసమానతలకు ఒక రూపమే వయోజన విద్యార్థుల ఉనికి. ఆర్థిక అసమానతలు తొలగినప్పుడే, అందరికీ సమానమైన విద్యావకాశాలు వస్తాయి. అలాంటి అవకాశాల కోసం జరగాల్సిన రాజకీయ పోరాటాలు ఒకవైపు జరుగుతూ ఉండగానే; ఇంకోవైపు వయోజన విద్యా వ్యాప్తికి భాషా శాస్త్రజ్ఞులు కృషి చెయ్యాలి.
నికార్సైన అనువాదాలేవి?
యూరప్‌ దేశాల్లో పెట్టుబడిదారీ విధానం వ్యాపించిన కాలంలో ఆధునిక ప్రకృతి శాస్త్రాలూ, భౌతిక శాస్త్రాలూ, సామాజిక శాస్త్రాలూ విజృంభించాయి. ఆయా దేశాల భాషల్లో అసంఖ్యాకమైన శాస్త్ర గ్రంథాలు వెలువడ్డాయి. తద్వారా ఆయా దేశాల భాషల్లోనే అక్కడ విద్యాబోధన జరిగింది. అలా ఆ దేశాల భాషలు అన్ని రంగాల్లోనూ తమ విధులను నిర్వర్తించాయి. అలా ఉపయోగించడానికి వీలుగా ఆ భాషల ‘అభివృద్ధి’ జరిగింది. పరతంత్రంలో మగ్గిపోయిన దేశాల్లో అభివృద్ధి అన్నది వలసవాద ప్రయోజనాలకు లోబడే జరుగుతుంది కాబట్టి, వలస దేశాల్లోని భాషల వినియోగం కొన్ని రంగాలకే, కొన్ని స్థాయులకే పరిమితమైంది. ఫలితంగా అవి పరిమితంగానే ‘అభివృద్ధి’ చెందాయి.
      ఏ భాషైనా సరే, అన్ని రంగాలకూ విస్తరించినప్పుడే అభివృద్ధి చెందుతుంది. అలా విస్తరించే క్రమంలో, ‘అభివృద్ధి చెందిన’ భాషల నుంచి శాస్త్ర గ్రంథాలను అనువదించుకోవడం కీలకం. నేరుగా, మన భాషలోనే పాఠ్యగ్రంథాలు తయారు చేసుకోవాలన్నా, ఇతర భాషల నుంచి చేసుకునే అనువాదాలు చాలా అక్కరకొస్తాయి. అయితే, అనువాదాలు వాడుక భాష సూత్రాలకు (పదకల్పనా, వాక్య నిర్మాణం మొదలైన వాటికి) అనుగుణంగా ఉంటేనే అనుకున్న ఫలితాలు లభిస్తాయి. తెలుగులో వచ్చిన శాస్త్ర గ్రంథాల అనువాదాల్లో అత్యధికం ఎక్కువ మందిని చదివించేలా లేవు. అలా ఉండాలంటే, అనువాదం పట్ల శాస్త్రీయ దృక్పథం ఉండాలి (యూజిన్‌నైడా లాంటి విద్వాంసుల మాదిరిగా). పీఠికలూ, పాదపీఠికలూ సమకూర్చిన అనువాదాలు, అవి లేని అనువాదాల కన్నా ఎక్కువ మంది పాఠకులకు చేరువవుతాయనే దానికి రుజువులున్నాయి. ఈ అనువాద కార్యక్రమాల కోసం ఏర్పడిన నేషనల్‌ ట్రాన్స్‌లేషన్‌ మిషన్‌ ప్రారంభించిన కృషి ఉపయోగకరమే అయినా, అనువాదకుల కొరత వల్లనో, శిక్షణారాహిత్యం వల్లనో, అది మందకొడిగా సాగుతోంది. 
భాషా బోధకులకు శిక్షణ
భాషా బోధకులంటే ఇక్కడ కేవలం మాతృభాషా బోధకులే. తెలుగు భాషని కేజీ నుంచీ పీజీ వరకూ బోధించే వారికి శిక్షణ అన్నప్పుడు ఏవో కోర్సులుండాలని కాదు. భాష పట్ల వాళ్లకి శాస్త్రీయ దృక్పథం ఏర్పరచాలని మాత్రమే. అంటే, ప్రస్తుతం ఉన్న భాషా బోధకులందరూ అజ్ఞానాంధకారంలో ఉన్నారని కాదు. కానీ, భాషాపరంగా నేడున్న అభిప్రాయాలూ, వైఖరులూ, వాదనలూ చాలా సందర్భాల్లో అశాస్త్రీయ విశ్వాసాల మీదే ఆధారపడుతున్నాయి.
      ‘‘దేశ భాషలందు తెలుగు లెస్స, అన్ని భాషలకూ తల్లి సంస్కృతం, మా మాండలికమే/ భాషే పరిపుష్టి కలిగినది, ఇంటి భాషలోనే విద్యాబోధన జరగాలి, మాండలికాల్లోనే విద్యాబోధన జరగాలి, ప్రామాణిక భాషలోనే జవాబులు గానీ, పరిశోధనా పత్రాలు గానీ ఉండి తీరాలి’’... ఈ రకం అభిప్రాయాల్లోని పొరపాట్లను భాషాశాస్త్ర దృష్టితో (ప్రత్యేకించి సామాజిక భాషాశాస్త్ర దృష్టితో) వివరించి సవరించ డానికి భాషా శాస్త్రజ్ఞులు ప్రయత్నించాలి. ఉదాహరణకి, దేశ భాషల్లో ఒకటి ఎక్కువా, ఇంకోటి తక్కువా కాదు. వివిధ రంగాల్లో విస్తృతంగా వినియోగించడానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తే.. కోయ, గోండీ, సవర లాంటి భాషల్లో కూడా కంప్యూటర్‌ ప్రొగ్రాములు రాయవచ్చని శాస్త్రీయంగా చెప్పాలి. మాండలికాల్లో ఉన్నతమూ, అల్పమూ అంటూ ఏదీ ఉండదనీ; వివిధ మాండలికాలు ఉపయోగించే భాషా వ్యవహార్తల మధ్య ఉండే ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక భేదాల వల్లా, వైరుధ్యాల వల్లా భాషా వైఖరులు ఏర్పడతాయే గానీ, మాండలికాల స్వభావంలోనే అంతర్గతంగా ఔన్నత్యమూ, అల్పత్వమూ ఉండదని సోదాహరణగా వివరించాలి. ‘ఇంటి భాష’ అనేది ఏకశిలా సదృశం కాదనీ, మాండలిక ఉపమాండలిక లక్షణాలతో వివిధ రకాలుగా ఉంటుంది కాబట్టి, అందులో విద్యాబోధన అస్పష్ట సూచన అవుతుందని విడమరచాలి. అలాగే, ఒక విస్తృత ప్రాంతంలో మాట్లాడే మాండలికం ఆ ప్రాంతం అంతటా ఒకే రకంగా ఉండకపోవచ్చు. మరెన్నో ఉపమాండలికాలుగా ఉండచ్చు. ప్రాంతాల మధ్యా, ఒకే ప్రాంతంలోని ఉప ప్రాంతాల మధ్య భాషేతర అసమానతలు ఉన్నప్పుడు, మాండలికంలో విద్యాబోధన కూడా ఎలా అసాధ్యమో, అవాంఛనీయమో విశ్లేషించి చెప్పాలి.
      భాషకు సంబంధించిన వివిధ అంశాల పట్ల తమకున్న అవగాహనని బట్టి... పరీక్ష/జవాబు పత్రాల్నీ, పరిశోధనా పత్రాల్నీ, తరగతి గదిలో సంభాషణలకూ విలువ కడుతూ (మూల్యాంకనం చేయడం) ఉంటారు భాషా బోధకులు. ఉదాహరణకి, అమెరికాలో 1960ల్లో, శ్రామికవర్గ కుటుంబాల పిల్లలు తరగతి గదిలో, పరీక్షల్లో ముఖ్యంగా భాష విషయంలో ‘లోపభూయిష్టంగా’ ఉన్నారని కొందరు విద్యావేత్తలు భావించారు. అప్పుడు సామాజిక భాషా శాస్త్రవేత్తలు రంగంలోకి దిగి ఓ విషయం నిరూపించారు. అదేమిటంటే ఎగువ మధ్యతరగతి శ్వేతజాతీయులు (మేధాశ్రమలు చేసే కుటుంబాలు) మాట్లాడే సామాజిక మాండలికాన్నే ప్రామాణిక భాషగా భావించి, దాన్నే గీటురాయిగా తీసుకుని, శ్రామికవర్గ కుటుంబాల పిల్లల భాషా ప్రయోగాల్ని మూల్యాంకనం చేస్తున్నారు. ఇది అశాస్త్రీయం. మాండలిక భేదాల్ని ‘భాషాలోపం’గా భావించడం పొరపాటని వారు రుజువు చేశారు. ఈ అనుభవం మనకు ఏం చెబుతుందంటే, ఉపాధ్యాయులకు, ప్రత్యేకించి భాషా బోధకులకు భాష పట్ల శాస్త్రీయ దృక్పథాన్ని కలిగించాలని. దీనికోసం జిల్లాల విద్యాశాఖాధికారులతో మాట్లాడి తెలుగు భాషా శాస్త్రజ్ఞులు అవగాహనా తరగతులు కొన్ని నిర్వహించవచ్చు.
వాటికి అండదండగా...
కొన్ని చారిత్రక కారణాల వల్ల కొన్ని భాషలు ఇంకా లిపి రహితంగానే ఉండిపోయాయి. తెలుగు చుట్టూనే ఇలాంటివి ఉన్నాయి. వాటి లిపి కోసం గతంలోనూ, ఇటీవలా కొన్ని ప్రయత్నాలు జరిగాయి. ఆ భాషల్లో కొన్ని ద్రావిడ భాషా కుటుంబానికీ (కోయా, గోండి), కొన్ని ఇతర భాషా కుటుంబాలకీ (సవర) చెందినవైనప్పటికీ, ఆయా భాషలు మాట్లాడేవారు, తెలుగుతో నిత్య సంబంధాలు కలిగి ఉన్నారు. వారి భాషల స్థానంలోకి తెలుగు చొరబడి స్థిరపడకుండా, ఆ భాషల అభివృద్ధికే తోడ్పడే ప్రయత్నాలు, ముఖ్యంగా ‘లిపి’ ఏర్పాటులో మనమూ కృషి చేయాలి.
అంతర్జాతీయ ధ్వని అక్షరమాల (ఇంటర్నేషనల్‌ ఫొనెటిక్‌ ఆల్ఫాబెట్‌- ఐపీఏ) సూత్రాలకు అనుగుణంగా, లిపిలేని భాషలకి, ఒక స్వతంత్రమైన లిపిని ఏర్పాటు చేయడానికి భాషా శాస్త్రజ్ఞులు ప్రయత్నించవచ్చు. ‘స్వతంత్ర లిపి’ అని ఎందుకు అంటున్నామంటే, లిపి లేని భాషలు రెండు భిన్నమైన లిపులున్న భాషా ప్రాంతాల మధ్య నివసించేటప్పుడు, ఒక పక్క వాళ్లు ఒక పరాయి భాష లిపినీ, ఇంకోపక్క వాళ్లు ఇంకో పరాయి భాష లిపినీ అనుసరించే పరిస్థితి కల్పించకూడదు. బస్తర్‌ వైపు ఉన్న గోండులు హిందీ లిపివేపూ; ఆదిలాబాదు వేపు ఉన్న గోండులు తెలుగు లిపివైపూ చూసే పరిస్థితి ఉండకూడదు. గోండులందరికీ, వాళ్ల భాషాధ్వనులను బట్టి, వర్ణమాలను బట్టీ ప్రత్యేకమైన అక్షరమాల (లిపి) ఉంటే, వారి భాష ఒక రకమైన ఏకత్వంతో ఉండటానికి వీలుంటుంది. ‘లిపి’ ఏర్పాటు (గ్రాఫైజేషన్‌) కూడా భాషా నవీకరణలో ఒక ముఖ్యమైన అంశమే! లిపి ఉన్న భాషల్లో, అవసరమైన చోట్ల (అక్షరాలు నేర్చుకునే పిల్లలకీ, వయోజనులకీ కూడా) సంస్కరణ జరగాలి. తేలిగ్గా నేర్చుకోవడానికి వీలయ్యేలా లిపిని సంస్కరించుకోవాలి.
పరభాషల్లో శిక్షణ
మాతృభాషలో చదవడమూ, రాయడమూ వచ్చాక, ఇంకే భాషనైనా నేర్చుకోవడం పెద్ద కష్టం కాదు. అవసరాన్నిబట్టీ, ఇష్టాన్నిబట్టీ, అవకాశాన్నిబట్టీ ఇతర భాషలు నేర్చుకుంటాం. ప్రస్తుతం (గత రెండు వందల ఏళ్లుగా) మన దేశపు విద్యావంతులకి ఇంగ్లీషు పట్ల, కూపర్‌ అనే భాషా శాస్త్రజ్ఞుడి మాటల్లో చెప్పాలంటే ‘ఆకలి’ (హంగర్‌), ‘అశ్లీలమైన వ్యామోహం’ (ఇండీసెంట్‌ హంగర్‌) పెరిగిపోయింది. ఇంగ్లీషు వస్తే చాలు పెద్దపెద్ద జీతాలతో ఉద్యోగాలు వచ్చేస్తాయనే భ్రమలూ ఉన్నాయి. ఇంగ్లీషు మాట్లాడే దేశాల్లో కూడా నిరుద్యోగం విస్తృతంగా ఉందనే నిజాన్ని గుర్తించనంత భ్రమ! నిరుద్యోగానికీ, ఆయా దేశ ప్రభుత్వాలు అనుసరించే ఆర్థిక విధానాలకీ ఉన్న సంబంధాన్ని గుర్తించలేని అమాయకత్వం! ఉద్యోగాలిచ్చే మార్కెట్టులో, కొన్ని రంగాల్లో, ప్రాంతీయ భాషలతో పోలిస్తే, ఇంగ్లీషుకి ప్రాధాన్యమున్నా, ఆ భాష చదివిన వాళ్లందరికీ ఒకే ప్రాధాన్యం ఉండదు.
      సమాజంలో ఎన్ని ఆర్థిక అంతరాలు ఉన్నాయో, అన్ని రకాల ఆంగ్ల మాధ్యమ పాఠశాలలూ ఉన్నాయి. వాటిలో బోధించే ఇంగ్లీషుకీ ‘విలువ’ల్లో చాలా తేడాలున్నాయి. ఈ విలువల అంచనాలను బట్టే ఉద్యోగాల మార్కెట్‌లో అవకాశాలుంటాయి. మాతృభాషలో విద్యాబోధనకున్న శాస్త్రీయతనీ; ఉద్యోగ- నిరుద్యోగాలకూ అమలులో ఉన్న పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థకూ ఉన్న బలమైన లంకెనూ అర్థం చేసుకుని, ఎలాంటి భ్రమలూ కల్పించుకోకుండా, ఇంగ్లీషులో కనీస ప్రావీణ్యాన్ని విద్యార్థులు పొందగలిగేలా, 4, 5 తరగతుల నుంచీ ప్రారంభించి, ఇంగ్లీషును ఒక భాషగా (మాధ్యమంగా కాదు) నేర్పవచ్చు. ఈ క్రమంలో దాన్ని మాతృభాష స్వరూప స్వభావాలతో పోలుస్తూ; పోలికల్నీ, తేడాల్నీ వివరిస్తూ; ‘క్రియ’ అనేదాన్ని కీలకమైన అంశంగా గుర్తిస్తూ నేర్పాలి. ఈ పద్ధతిలో, 20 ఏళ్ల కిందట, హైదరాబాద్‌ విశ్వవిద్యాలయంలో కొన్ని సెమిస్టర్ల పాటు ఇంగ్లీషు చెప్పినప్పుడు విద్యార్థులు చాలా ఉత్సాహంగా నేర్చుకున్నారు. అలా ఓ భాషగా ఇంగ్లీషును చక్కగా నేర్పగలిగితే చాలు- మాతృభాషలో బోధన ద్వారా అలవడ్డ నైపుణ్యాలతో మనవాళ్లు కొత్త అవకాశాలను అందిపుచ్చుకోగలరు. 
ఎన్ని చేసినా సరే... 
మాతృభాషలో విద్యాబోధనతో సహా ఏ రకం భాషా సమస్యనైనా పరిష్కరించుకోవడానికి, భాషా శాస్త్రవేత్తలు తమ పరిశోధనల ద్వారా చేసే సూచనలు మాత్రమే సరిపోవు. ఈ క్రమంలో ప్రభుత్వాలు అనుసరించాల్సిన విధానాల రూపకల్పనకూ, అమలుకూ ఒత్తిడి తెచ్చే ప్రజా ఉద్యమాల్లో పాల్గొనాలి.
      అన్ని స్థాయిల్లోని విద్యార్థులూ, వారి తల్లిదండ్రులూ; ఉపాధ్యాయులూ, వారి సంఘాలూ; భాషోద్యమకారులూ అందరూ కలిసినదే ప్రజాఉద్యమం. భాష పట్లా, భాషా బోధనల పట్లా, భాషా సమస్యల పట్ల శాస్త్రీయ దృష్టి కలిగిన భాషాశాస్త్రజ్ఞులు అలాంటి ప్రజా ఉద్యమాలకు ఒక శాస్త్రీయ ప్రాతిపదికను సమకూర్చవచ్చు. ఆ ప్రజా ఉద్యమాలే లేకపోతే, ఎన్ని నినాదాలు ఇచ్చినా, ఎన్ని పత్రాలు సమర్పించినా పెద్దగా ప్రయోజనం ఉండదు.

*  *  *


వెనక్కి ...

మీ అభిప్రాయం