ఈ నల్లని రాలలో ఏకన్నులు దాగెనో!

  • 1953 Views
  • 4Likes
  • Like
  • Article Share

    చింతలపల్లి హర్షవర్ధన్‌

  • గట్టుఇప్పలపల్లి, మహబూబ్‌నగర్‌ జిల్లా
  • 9014897030
చింతలపల్లి హర్షవర్ధన్‌

కొన్ని ప్రాంతాలు, నిర్మాణాలు అందంగా ఉంటాయి. మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తాయి. ఇంకొన్ని ఉంటాయి... అవి ఉద్విగ్నతకు గురిచేస్తాయి. మనిషి లోపలి భావోద్వేగాలను తట్టిలేపుతాయి. అవధుల్లేని ఆనందసంద్రంలో మునకలు వేయిస్తాయి. రామప్ప గుడి కూడా ఇలాంటిదే. అక్కడి మదనికలు ఒట్టి శిల్పాలంటే మనసు ఓ పట్టాన నమ్మదు. ఆ నల్లరాతి నిగారింపులను చూస్తేనే గుండెలు ఝల్లుమంటాయి. అధిష్ఠానం నుంచి గోపురం వరకూ అబ్బురపరిచే నిర్మాణకౌశలంతో అలరారే ఈ ఆలయం... కాకతీయుల శిల్పకళా ‘కళాశాల’! మన వారసత్వ సంపదకే మెరుపులద్దే మణిమాల!!
కాకతీయుల కళా విన్నాణానికి, విన్యాసానికి నిలువెత్తు నిదర్శనం రామప్ప గుడి. భారతదేశంలో ఓ శిల్పి పేరు మీదుగా ప్రసిద్ధిచెందిన గుడి బహుశా ఇదొక్కటేనేమో! అయితే, ‘రామప్ప’ పేరు చెప్పగానే చాలామందికి గుర్తొచ్చేవి నీటిలో తేలే ఇటుకలు. వీటితో పాటు ఈ ఆలయంలో ప్రతిదీ ఓ అద్భుతమే. ప్రతి శిల్పమూ ఓ కళాఖండమే.
      జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా వెంకటాపురం మండలం పాలంపేట గ్రామ సమీపంలో... కొండల పాదభూమిలో, పంటచేలు, తాటిచెట్ల (మట్టికోట ఆనవాళ్ల) మధ్య సాదాసీదాగా కనిపించే ఈ గుడిని చూస్తే ‘ఇందులో విశేషం ఏముంది?’ అనిపిస్తుంది. ఆలయంలోకి వెళ్తే అసలు విషయం తెలుస్తుంది. దీనికి రుజువుగా ‘రామప్ప’ వివరాలు, విశేషాలు విడమరిచేందుకు మార్గదర్శకుడు (గైడు) సిద్ధంగా ఉంటాడు. వారి సాయం లేకుంటే రామప్ప పర్యటన అసంపూర్ణమే!
      ఎర్రరాయి ప్రాకారం మధ్యలో కొలువుదీరిన రామప్ప గుడిది 804 సంవత్సరాల చరిత్ర. దీని నిర్మాత కాకతీయ చక్రవర్తి గణపతిదేవుడి సామంతుడైన రేచర్ల రుద్రుడు. ఆయన కేవలం సామంతుడే కాదు, మహారాష్ట్రను పాలించిన యాదవ రాజుల ఖైదు నుంచి గణపతి దేవుణ్ని విముక్తుణ్ని చేసిన వీరుడు... ‘కాకతీయ రాజ్య స్థాపనాచార్యుడు’. ఆలయం ప్రాకారంలో ఈయన వేయించిన శిలాశాసనం ఉంటుంది. ఈ ‘‘శాసనం సుదీర్ఘంగా... చిన్న కావ్యం మాదిరిగా ఉంటుంది. కాకతీయ వంశం గురించి, రేచర్ల రెడ్డి వంశం గురించి వివరించే ఈ శాసనం చరిత్ర దృష్టిలో ముఖ్యమైంది’’ అంటారు పీవీ పరబ్రహ్మశాస్త్రి. తెలుగు- కన్నడ లిపిలో ఉండే ఈ శాసనం భాష మాత్రం సంస్కృతం. దీన్ని అనుసరించి గుడిని నిర్మించింది... శాలివాహన శకం 1135, శ్రీముఖ నామ సంవత్సరం, చైత్ర శుద్ధ అష్టమి, ఆదివారం. అంటే, క్రీ.శ.1213, మార్చి 31. గుడి ధూప, దీప, నైవేద్యాలకు లోటు లేకుండా ఉండేందుకు... బోర్లపల్లి, ఉప్పరపల్లి గ్రామాలను రుద్రుడు దానమిచ్చిన వివరాలు ఈ శాసనంలో కనిపిస్తాయి. ఈ ప్రాంతాన్ని ఎవరు పాలించినా... ఆలయాన్ని పోషించి, రక్షించిన వారికి చేతులెత్తి నమస్కరిస్తాననే రుద్రుడి సవినయ మనవినీ ఇందులో చూడవచ్చు. ఇక అడుగడుగునా శిల్పకళా వైభవం ఉట్టిపడే ఈ నిర్మాణానికి ప్రధానశిల్పి రామప్ప అని చెబుతారు. అలా ఆ మహాశిల్పి పేరు మీదుగా ‘రామప్ప గుడి’గా ప్రసిద్ధిలోకి వచ్చింది. శాసనంలో రుద్రేశ్వరాలయంగా, జన వ్యవహారంలో రామలింగేశ్వరాలయంగా వాసికెక్కింది. దీనికి కిలోమీటరు దూరంలో రేచర్ల రుద్రుడే తవ్వించిన ‘రామప్ప చెరువు’ ఉంటుంది. చెరువులు, గుళ్లు కాకతీయుల గ్రామ నిర్మాణంలో అతి ప్రధానాంశాలు.
ఉత్తర- దక్షిణ శైలుల మిశ్రమం
‘ఉత్తమ ప్రమాణాలు గల కాకతీయ వాస్తు నిర్మాణానికి, అత్యుత్తమ శిల్పకళకు రామప్పగుడి మచ్చుతునక’ అని వర్ణిస్తుంది 1991 కాకతీయ ఉత్సవాల ప్రత్యేక సంచిక ‘కాకతి’. ఉత్తర, దక్షిణ భారత దేవాలయ నిర్మాణ శైలులు నాగర, ద్రావిడ సమ్మిశ్రితంగా వేసర శైలిలో నిర్మితమెన ఏకకూటాలయమిది. నక్షత్రాకార ప్రణాళికలో ఆరు అడుగుల ఎత్తయిన అధిష్ఠానం మీద ఉపపీఠం ఆలంబనగా సాగిన నిర్మాణమిది. కాకతీయుల కాలపు మిగిలిన గుళ్లలాగే రామప్పనూ పునాదుల్లో ఇసుకను నింపి నిర్మించారు. శాండ్‌ బాక్స్‌ పద్ధతి అంటే ఇదే. ఇలా కట్టడం వల్ల ఏదైనా కుదుపులకు గురైనప్పుడు నిర్మాణం కిందికి దిగుతుందే, తప్ప కూలిపోదు. ఇక ఆలయ నిర్మాణంలో ఎక్కువగా ఇసుకరాయిని వినియోగించినప్పటికీ, ప్రధాన ప్రాంతాల్లో (గర్భాలయ ప్రవేశద్వారం, మదనికలు...) నల్లరాతిని వాడారు.
ఏనుగుల వెనక
ఉపపీఠాన్ని అనుసరించి అధిష్ఠానం మీద ప్రదక్షిణ పథం ఉంటుంది. ఉపపీఠం మీద మనకు ప్రదక్షిణ మార్గాన్ని సూచిస్తూ ఏనుగు గున్నలు బారులు తీరి ఉంటాయి. మీది వరసలో గుడి నమూనాకు ప్రతిరూపంగా ఉండే పుష్పమాలిక ఉంటుంది. ఇంకా పై వరసలో వివిధ దేవతలు, జైనసిద్ధులు, నాట్యకత్తెల శిల్పాలు ఉంటాయి. వీటిలో ఈజిప్టు ఫారోను, పర్షియా దేశీయుణ్ని పోలిన శిల్పాలు... కాకతీయులకు విదేశీయులతో ఉన్న సంబంధాలను తెలియజేస్తాయి. అలా ముందుకు వెళ్లే సరికి... మూడో వరసలో మానవుల శిల్పాలు మాయమవుతాయి. వివిధ దేవతా మూర్తులకు అభిషేకం చేస్తున్న ఏనుగుల శిల్పాలు మాత్రమే ఉంటాయి. ప్రధానాలయం (గర్భాలయం) గోడలు కాబట్టి ఆలయ పవిత్రతను చాటేందుకు ఇలా చేశారంటారు. ఇంకా, గర్భాలయం వెలుపల గోడల మీద... మూడు వైపులా ఒకదాని కింద ఒకటి తొమ్మిది గూళ్లుండే మూడు కోష్టపంజరాలు (దైవకోష్టాలు) కనిపిస్తాయి. వీటిలో విగ్రహాలు లేవు. బహుశా ఇవి నవగ్రహాలకు ఉద్దేశించినవేమో!
      ఆలయం వెనక కోష్టపంజరం కింద ఏనుగులు, వరాహాలు అర్చిస్తున్న శివుడి శిల్పం కొలువుదీరింది. దానికింది వరసలో నామాల ఆకారంలో, శివకేశవుల అభేదాన్ని చాటుతూ రుద్రాక్షమాలలు ఉంటాయి. దీనికింద నంది కనిపిస్తుంది. అలా ఏనుగులను అనుసరించి మొదటికి వస్తే... అవి లోపలికి దారి చూపుతాయి. అంతేకాదు... అన్ని ద్వారాలకూ రెండు వైపులా ఏనుగుల విగ్రహాలు దర్శనమిస్తాయి. గుడి నిర్మాణానికి రాళ్లు మోసినందుకు ఆ మూగజీవులకు ఆలయ నిర్మాతలు ఇలా కృతజ్ఞత చెప్పుకుని ఉండవచ్చు! లేదూ అంటే కాకతీయుల గజదళానికి, బలానికి ప్రతీకా కావొచ్చు.
అద్భుతం రంగమండపం
గుడిలోకి ప్రవేశించేప్పటికి మనం అర్ధమండపంలో ఉంటాం. కొద్దిగా ముందుకు వెళ్తే రంగమండపం కనిపిస్తుంది. ఇది నాట్య వేదిక. బాగా నునుపు చేసిన ఈ వేదిక మీద నర్తిస్తూ అప్పట్లో నాట్యకత్తెలు రుద్రేశ్వరుణ్ని అర్చించేవారు. దీనికి సరిహద్దుగా బాగా మెరుగు పెట్టిన నాలుగు నల్లరాతి స్తంభాలు ఉంటాయి. కోలాటం వేసే స్త్రీలు, క్షీరసాగర మథనం, గోపికా వస్త్రాపహరణం, త్రిపురాసుర సంహారం లాంటి శిల్పాలతో వేటికవే ప్రత్యేకంగా నిలుస్తాయి. ఇంకా ముగ్గురు నాట్యకత్తెలకు నాలుగు కాళ్లే చెక్కిన శిల్పం చేసే కనికట్టుకు మురిసిపోవాల్సిందే. మరో స్తంభానికి శిల్ప తోరణం మధ్యలో 13 సూక్ష్మరంధ్రాలు ఉంటాయి. ఇవి ఆలయ నిర్మాణ కాలం 13 సంవత్సరాలని చెప్పేందుకు ప్రతీకగా చెక్కి ఉండొచ్చంటారు.
      రంగమండపం పైకప్పు మధ్యలో నటరాజు శిల్పం, చుట్టూ వివిధ శిల్పాలు కనువిందు చేస్తాయి. పైకప్పు అడ్డదూలాల మీద త్రిపురాసుర వధ, క్షీరసాగర మథనం, గజాసుర సంహారం, నరకాసుర వధ వృత్తాంతాలను మలచిన శిల్పుల నైపుణ్యాన్ని వర్ణించలేం! ఈ రంగమండపంలోనే విష్ణువు, సూర్యుడు తదితర దేవతల ఉపాలయాలూ దర్శనమిస్తాయి.  
సరిగమలు పలుకుతాయి 
రంగమండపం దాటితే కనిపించేదే అంతరాళం. దీనికి రెండువైపులా ఉండే శిల్పాలు కూడా ఆకట్టుకుంటాయి. ద్వారానికి ఎడమ వైపు భక్తుల్ని లోపలికి ఆహ్వానిస్తున్నట్లు, కుడి వైపు దేవుడి దర్శనానంతరం ప్రసాదం ఇస్తున్నట్లు ఉండే శిల్పాలు ఉంటాయి. కుడి వైపునే పొగడ చెట్టు మీద వేణువు వాయిస్తున్న కృష్ణుడి శిల్పం ఉంటుంది. ఈ పొగడ మానును మీటితే సరిగమలు పలకడం అద్భుతం. ఎడమ వైపు ఒక ఖడ్గధారి, స్త్రీ నిల్చున్న శిల్పం ఉంటుంది. ఇది ఆలయ నిర్మాత రేచర్ల రుద్రుడు, ఆయన భార్య శిల్పమే అంటారు ప్రముఖ స్థపతి, పురాతత్వ పరిశోధకులు ఈమని శివనాగిరెడ్డి.
      అంతరాళానికి రెండు వైపులా గవాక్షాల్లా కనిపించే నిర్మాణాలైతే నాట్య కళాశాలలే. ఈ గవాక్షాల మీది శిల్పాలను చూసే కాకతీయుల కాలం నాటి వీరనాట్యం పేరిణికి తిరిగి ప్రాణప్రతిష్ఠ చేశారు నటరాజ రామకృష్ణ. అంతరాళానికి రెండు వైపులా వివిధ భంగిమల్లో 60 మార్దంగికురాళ్ల (మద్దెల వాయించే స్త్రీలు) శిల్పాలు ఉంటాయి. ఇవి రేచర్ల రుద్రుడి సమకాలికుడు, గణపతి దేవుడి బావమరిది, కాకతీయ గజసాహిణి జాయప సేనాని ‘నృత్తరత్నావళి’ ప్రభావంతో మలచినవి అంటారు. ఇంకా ఈ గ్రంథంలో పేర్కొన్న ప్రేంఖణం, దండరాసకం, కోలాటం, గొండ్లి... తదితర దేశి కళలకు కూడా రామప్ప శిల్పాల్లో చోటు దక్కడం దీన్ని నిర్ధరిస్తుంది. ‘‘జాయప సేనాని వర్ణించిన శివప్రియ నర్తనం, మదన బలద్యూతం, భ్రమణ నర్తనం మొదలైనవి ఇక్కడ మలచబడ్డాయి. పేరిణిలో ప్రదర్శించే పాద పద్ధతులు, ఘర్ఘర విన్యాస పద్ధతులు వీటిలో చక్కగా రూపొందించబడ్డాయి. వివిధ పద్ధతుల్లో కుతవ విన్యాసాలు, ఆ కాలంలో వాయిస్తూండిన వాయిద్యాలు కూడా వీటిలో ఉన్నాయ’’ని చెబుతారు నటరాజ రామకృష్ణ. మొత్తమ్మీద ‘రామప్ప దేవాలయ ప్రాంగణంలోని నృత్య శిల్పానికి ఆధారం జాయప రచనే’నన్నది ఆయన నిశ్చితాభిప్రాయం. 
కాంతి - స్థలం ప్రభావం
అంతరాళం దాటితే వచ్చేదే రుద్రేశ్వరుడి కొలువు కూటం. అదే గర్భాలయం. దీని ద్వారం విశాలంగా, ఎత్తుగా ఉంటుంది. వెలుపలి నుంచి రంగమండపంలోకి ప్రవేశించే కాంతి లోపలికి ప్రతిఫలించి, అంతరాళాన్ని దాటుకుని ఆదిదేవుణ్ని అభిషేకిస్తుంది. అందుకే పొద్దు ఏ వైపు ఉన్నా గర్భాలయంలో చీకటిగా అనిపించదు. గర్భాలయ ద్వారానికి రెండు వైపులా ఏనుగుల మీద పంజాలెత్తి నిలబడి ఉండే 12 సింహాల శిల్పాలు అబ్బురపరుస్తాయి. ద్వారం మీది గజలక్ష్మి భక్తులకు సిరిసంపదలు కలగాలని ఆశీర్వదిస్తున్నట్లు ఉంటుంది.
అందాల మదనికలు
వీటినే అలసా కన్యలు అంటారు. అన్నీ నల్లరాతివే. తూర్పు, దక్షిణ, ఉత్తర ద్వారాలకు రెండు వైపులా రెండు, రెండు చొప్పున మొత్తం 12 విగ్రహాలు ఉంటాయి. ఇవి శ్రీనాథుడి భీమఖండంలో భీమేశ్వరాలయ నర్తకి వర్ణనకు శిలారూపాలా అన్నట్లు ఉంటాయి.
      మొదటి మదనిక ఎత్తయిన పావుకోళ్లతో అలరారుతుంది. కాకతీయుల కాలంలోనూ స్త్రీలు ఎత్తు చెప్పులు ధరించేవారేమో! రెండోది నాగిని. దీనిని చూసే సినారె ‘నాగినివో భోగినివో నాట్యకళా విలాసినివో...’ అన్న గేయం రాశారట! దక్షిణ దిశలో ఉన్న మదనికల్లో ఒకటి అడవిలో వేటకు సంబంధించింది. మరోటి మృదంగం పట్టుకుని ఉంటుంది. దీనికింద గారడి విద్య ప్రదర్శన శిల్పం ‘క్రీడాభిరామం’ కావ్యంలోని గారడి సన్నివేశాన్ని గుర్తుకు తెస్తుంది. ఉత్తర ద్వారం వైపు మదనికల్లో ఒకటి మార్దంగికురాళ్ల నేపథ్యంతో అలరారుతుంది. మరో మదనిక ఇక్కడి మదనికలన్నింటిలోనూ పెద్దది. (దీనికి ఒక వైపున కొమ్ముబూర లాంటి వాయిద్యం పట్టుకున్న స్త్రీ శిల్పం కనిపిస్తుంది) ఈ మదనిక చీరను కోతి లాగుతుంటుంది. ఇది పురుష వికారానికి ప్రతీక కావచ్చు. తూర్పు ద్వారం మరో పక్కన... అడవిలో వేటకు వెళ్లిన పడతికి ముల్లు తీస్తున్న శిల్పం కనిపిస్తుంది. ఈ మదనికల ఒంపుసొంపుల్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దిన వైనం విస్తుగొల్పుతుంది. ‘‘నిను గని కొండలన్ని రమణీ కుచపాళికలై, కపోల మో/ హన ఫలకమ్ములై, భ్రుకుటులై, కుటిలాలక జాలమై, సురాం/ గనలయి రూపు దిద్దుకొనగా ఉలితో అమృతమ్ము చల్లి జీ/ వనములు పోసి పోయెదవు; బ్రహ్మవు శిల్పికులావతంసమా!’’ అన్న దాశరథి కృష్ణమాచార్య ‘అగ్నిధార’లోని పద్యం రామప్పలోని మదనికల సృష్టికర్తకు కైమోడ్పులర్పిస్తున్నట్లుగా ఉంటుంది. ఈ మదనికల కాళ్లకు మట్టెలు కనిపిస్తాయి. ఇంకా రంగ మండపం స్తంభాలు, పైకప్పుల చూరుకు అనుసంధానంగా, కాకతీయుల ‘రాయగజకేసరి’ బిరుదును తెలుపుతూ 28 ఏనుగు, సింహం, మధ్యలో వీరుల శిల్పాలు కనువిందు చేస్తాయి. 
నీటిలో తేలే ఇటుకలు
ఆలయ ‘విమానం’... గర్భాలయం మీద శుకనాసితో ఉన్న నిర్మాణం. గుడి మీద అధిక భారం పడొద్దని దీనిని తేలికైన ఇటుకలతో సాదాగా నిర్మించారు. ఇవి నీటిలో తేలతాయట. ‘‘బంకమట్టిలో ఊక, ఏనుగుల లద్దె, ఆకుపసర్లను కలిపి ఈ తేలికపాటి ఇటుకలను తయారుచేశార’’ని ‘ఆంధ్రదేశంలో శిల్పకళా వైభవం’ పుస్తక రచయిత డా।। ముప్పాళ్ల హనుమంతరావు అభిప్రాయపడ్డారు. ఇప్పుడు ఆ ఇటుకల మీద గచ్చు చేశారు. 
      గుడికి ఎదురుగా శిథిలమైన నంది మండపం కనిపిస్తుంది. ఇందులో నంది మాత్రం కాల ప్రభావాన్ని తట్టుకుని నిలిచింది. నల్లసరపురాయితో పట్టెలు, గంటలు, మువ్వలతో తీర్చిదిద్దిన ఈ నంది... ఒక కాలు కొంచెం ఎత్తి, తల పక్కకు తిప్పి శివుడి ఆజ్ఞ కోసం వేచి చూస్తున్నట్లు ఉంటుంది.  కాకతీయుల తర్వాత ఏడు శతాబ్దాలపాటు రామప్ప గుడికి ఆలనాపాలనా కరవైంది. అయితే 1911 నాటికి నిజాం పాలకులు దీనికి పునర్వైభవం తెచ్చే చర్యలు చేపట్టారు. ప్రస్తుతం భారతీయ పురావస్తు శాఖ పర్యవేక్షణలో ఉన్న రామప్పగుడి ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తింపు కోసం ఎదురుచూస్తోంది.
సాహిత్యంలోనూ ఘనకీర్తి
రామప్ప గుడి శిల్పకళా సౌందర్యానికి చకితులైన సి.నారాయణరెడ్డి 1960లో ‘రామప్ప’ సంగీత నృత్యరూపకాన్ని రచించారు. రామప్ప గుడి నిర్మాణ నేపథ్యంలో సాగే ఈ రచన అనేక భారతీయ భాషల్లోకి అనువాదమైంది కూడా. ప్రాచీన శిల్పసంపదను చూసినప్పుడు తెలుగువారి నోటివెంట అప్రయత్నంగా వచ్చే ‘ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగెనో’ గీతం ఈ రూపకంలోనిదే. దీన్నే ఆ తర్వాత ‘అమరశిల్పి జక్కన్న’ చిత్రం కోసం వాడుకున్నారు. 
      అడవి బాపిరాజు ‘ద్వేషము’ కథ రామప్ప గుడి నేపథ్యంలోనే సాగుతుంది. భారతీయ శిల్పసంపదను చూడటానికి వచ్చే బ్రిటిష్‌ యువతులు, విశ్వేశ్వరరావు అనే ఓ యువ దేశభక్తుడికి మధ్య నడిచే కథ ఇది. ‘‘ఆ మండపం ముందర శిల్పవైభవం చాటే స్తంభాలు! ఆ స్తంభాలకు శిఖర స్వరూపాలుగా నాట్యం చేసే నల్లరాతి శిల్పకన్యలు! - ఆ శిల్ప సుందరుల నాట్యభంగిమ రేఖావిలాసాలను చూసి నిస్తబ్ధురాలైపోయింది మేరి’’; ‘‘ఏమి అందంగా ఉందే ఈ గుడి! ఏమి అందంగా చెక్కాడు నందుల్ని. ప్రతి స్తంభంపైనా తనకున్న కళంతా ధారపోసి నాట్యంచేసే ఈ స్త్రీ విగ్రహాలను చెక్కినవాడు ఎంతటి మహాశిల్పో కదా!’’; ‘‘రాతిలో చెక్కాడా? రాతిని కరిగించి పోతపోశాడా?’’; ‘‘ఇవి రాతిబొమ్మలు కావర్రా- శాస్త్రజ్ఞానము అంతా కనబరిచి  ఇనుము కరిగించి తయారుచేసిన బొమ్మలు గాని!’’... ఇలాంటి సంభాషణలతో రామప్ప గుడి సౌందర్యాన్ని ఇందులో వర్ణించారు అడవి బాపిరాజు. ‘భారతి’ పత్రిక 1939 జూన్‌ సంచికలో ఈ కథ ప్రచురితమైంది. 
      ఈ ఆలయానికి సంబంధించి ప్రచారంలో ఉన్న ఓ జానపద గాథ ఇతివృత్తంగా ‘రామప్ప గుడి’ చారిత్రక నవల రాశారు మల్లాది వసుంధర. ఇందులోని ప్రధాన పాత్ర శిల్పి రామప్ప. ఆలయాన్ని తీర్చిదిద్దే క్రమంలో అతని అనుభవాలు, భావోద్వేగాలు ఇందులో కనిపిస్తాయి. ‘కిన్నెర’ పత్రిక 1955 జనవరి సంచికలో రామ్‌చంద్‌ రాసిన ‘రామప్పగుడి’ కథ ప్రచురితమైంది. ఇది కూడా స్థానికుల విశ్వాసంలోని ఓ జానపద గాథ ఆధారంగా వచ్చిందే. ఈ ఆలయాన్ని మార్కోపోలో సందర్శించడం, తర్వాత రాణీ రుద్రమ దగ్గర తన అనుభూతిని వ్యక్తీకరించడం ఇందులో ప్రధానాంశాలు. ‘‘ముఖ్యంగా మీ రామప్పగుడి నా హృదయంలో పీఠం వేసిందంటే నమ్మండి. కళ్లు దేన్నయితే నమ్మలేవో, మనస్సు దేన్నయితే ఊహించలేదో అటువంటి ఉత్తమ, మహోత్తమ శిల్పఖండాన్ని చూచాను’’ అంటూ మార్కోపోలో పాత్రతో అనిపిస్తారు రచయిత. అలాగే, రామప్పగుడి చారిత్రక ప్రాధాన్యం, శిల్పసౌందర్యాన్ని దృశ్యమానం చేస్తూ 1983లో ‘రామప్ప టెంపుల్‌’ అనే డాక్యుమెంటరీని నిర్మించారు కృష్ణారావు కేశవ్‌. 1984కి గానూ ఇది ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రంగా బంగారు నందిని గెలుచుకుంది. ‘కళానిధి’ పేరిట ఇందిరాగాంధీ నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఆర్ట్స్‌ సేకరించి భద్రపరిచిన చిత్రాలు, వీడియోల్లో ఈ ‘రామప్ప టెంపుల్‌’ కూడా ఉంది. 
      అణువణువునా శిల్ప‘కళా’ విశేషాల్ని నింపుకున్న విశిష్ట ఆలయం ‘రామప్ప’. రేచర్ల రుద్రుడి (ఆలయ నిర్మాణ) ఆకాంక్షకు, రామప్ప అనే మహాశిల్పి తపస్సు తోడు కాగా, కైలాసనాథుడి ఆశీర్వచనంతో... జాయప్ప సేనాని నాట్యగ్రంథానికి అనుగుణంగా శిలలు కరిగి శిల్పాలుగా మారి కోవెలగా రూపుదిద్దుకుంటే అదే రామప్పగుడి.
      జయహో రేచర్ల రుద్రరెడ్డి!
      జయజయహో రామప్ప మహాశిల్పి!!


*  *   *


వెనక్కి ...

మీ అభిప్రాయం