మా తెలుగు మాకు కావాలి

  • 790 Views
  • 0Likes
  • Like
  • Article Share

    టి.ప్రభాకర్‌

  • చెన్నై
  • 9121229281
టి.ప్రభాకర్‌

పక్క రాష్ట్రంలోని ఆ రెండు నియోజకవర్గాల జనాభా 4.26 లక్షలు. వీళ్లలో 2.50 లక్షల మంది తెలుగువారు. కానీ, అక్కడ ఒక్క తెలుగుబడి కూడా లేదు. పైగా ‘నిర్బంధ’ తమిళం! దాంతో అమ్మభాషతో పేగుబంధం తెగిపోయే పరిస్థితికి వచ్చింది. ఇది స్థానిక తెలుగు సంఘాలన్నింటినీ కలవరపాటుకు గురిచేసింది. సొంత పలుకును మర్చిపోతే మనదైన అస్తిత్వం అంటూ ఏదీ మిగలదనుకున్న ఆయా సంస్థల బాధ్యులందరూ చేతులు కలిపారు. ‘మా తెలుగు’ పేరిట గ్రామాల్లో తెలుగు బోధనకు శ్రీకారం చుట్టారు. ఫలితం... మూడు నెలల్లో 2200 మంది తెలుగు మాటలు, రాతలు నేర్చుకున్నారు. ఇదో విజయగాథ. అమ్మభాషను అమ్మంత అపురూపంగా భావించే తమిళనాడు తెలుగువారి స్ఫూర్తిబాట. 
పిల్లల నుంచి వయోవృద్ధుల వరకూ... వృత్తివిద్యను అభ్యసిస్తున్న యువత నుంచి వ్యాపారవేత్తల వరకూ అందరూ కనిపిస్తారు ఆ తరగతి గదిలో. తెలుగు అక్షరాలను తన్మయంగా వల్లెవేస్తుంటారు. పదాలను కూడదీసుకుని వాక్యాలను ఒంటబట్టించుకుంటూ ఉంటారు. పదిహేను రోజులు తిరిగే సరికి తెలుగును కరతలామలకం చేసేసుకుంటారు. తిరుప్పూర్‌ జిల్లాలోని ఉడుమలపేట, మడ్తకుళం నియోజకవర్గాల పరిధిలోని గ్రామాల్లో ఈ అభ్యాసం ఉద్యమస్థాయిలో జరుగుతోంది. స్థానిక పరిస్థితుల ఒత్తిడి మూలంగా అమ్మభాషకు దూరమైపోయిన వారిని తిరిగి తెలుగుతల్లి ఒడిలోకి చేర్చుతోంది.   
      స్థానికుల్లో సగానికి పైగా మనవాళ్లే అయినప్పటికీ ఉడుమలపేట, మడ్తకుళంల్లో తమిళానిదే ‘రాజ్యం’! దాంతో ఇక్కడ తెలుగు మాట్లాడేవారు రోజురోజుకూ తగ్గిపోతున్నారు. వివిధ కులసంఘాల రూపంలో ఇప్పటికే ఎవరికివారుగా సంఘటితమైన తెలుగువారిని ఈ పరిణామం ఆందోళనకు గురిచేసింది. కులాలకతీతంగా ఒకటై అమ్మభాషను బతికించుకోవాలన్న నిర్ణయానికి వచ్చేలా చేసింది. అలా విభిన్న సంఘాల ప్రాతినిధ్యంతో ‘మా తెలుగు’ సంస్థ ఏర్పాటైంది. ఇందులో 75 మంది కీలక సమితి సభ్యులతో అయిదు వందల మంది ఉన్నారు. ఎం.వసంత్‌, వి.సెంథిల్‌, ఎం.జవహర్‌, జి.వెంకటపతి, వై.జమున దీని ప్రధాన నిర్వాహకులు.  
‘తానా’ తోడ్పాటు
రెండు నియోజకవర్గాల పరిధిలోని తెలుగువాళ్లందరికీ అమ్మభాషను నేర్పించడమే లక్ష్యంగా పెట్టుకుని ‘మా తెలుగు’ సభ్యులు కార్యక్షేత్రంలోకి దిగారు. వేసవి సెలవుల్లో తెలుగు బోధన ప్రారంభించారు. దీనికి తెలుగేతర రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలకు అమ్మభాషను నేర్పడమే లక్ష్యంగా పనిచేస్తున్న ‘తెలుగువాణి’ ట్రస్టు సహకారం తీసుకున్నారు. 2016లో తొలిసారి ప్రయోగాత్మకంగా నిర్వహించిన తరగతుల్లో ఆరువందల మందికి తెలుగు మాట్లాడటం, చదవడం, రాయడం నేర్పారు. అలా నేర్చుకున్న వాళ్లలో ఓ అమ్మాయి... తొమ్మిదో తరగతి విద్యార్థిని మార్టూరి సంజనాపద్మం ఇప్పుడు కథారచయిత్రి. తను రాసిన ‘రేగడి నీడల్లా’ కథాసంపుటికి తానా పురస్కారాన్నీ అందుకుంది. ఇలా కిందటేడాది కార్యక్రమం విజయవంతం కావడంతో ఈసారి ‘మా తెలుగు’ సభ్యులు రెట్టించిన ఉత్సాహంతో పనిచేశారు. మూడు నెలల నుంచి ఉడుమలపేట పరిసర ప్రాంతాల్లోని దాదాపు యాభైకి పైగా గ్రామాల్లో తెలుగు బోధనను విస్తృతంగా చేపట్టారు. ఈ సమయంలోనే ఇక్కడికి వచ్చిన ‘తానా’ అధ్యక్షులు జంపాల చౌదరి, తమ సంస్థ తరఫున ఈ కార్యక్రమానికి రూ.10 లక్షలు విరాళమిచ్చారు.
      ఈ బోధనా తరగతుల్లో ఆరేళ్ల వయసు వారి నుంచి అరవై ఏళ్ల వారి వరకూ అందరికీ తెలుగు నేర్పుతున్నారు. రోజుకు గంట చొప్పున పదిహేను రోజుల పాటు తరగతులు నిర్వహిస్తారు. ‘తెలుగువాణి’ ట్రస్టు రూపొందించిన సులభపద్ధతిలో బోధన జరుగుతుంది. మొదట్లో తమిళ అక్షరాలను ఆధారంగా చేసుకుని విద్యార్థులు తెలుగును అభ్యసిస్తారు. తర్వాత పూర్తిగా తెలుగులోకి మారతారు. పద్నాలుగో రోజు వీళ్లందరికీ పరీక్షలు పెడతారు నిర్వాహకులు. తర్వాతి రోజు ఫలితాలు వెల్లడించి, ధ్రువపత్రాలను అందజేస్తారు. ‘మా తెలుగు’ సభ్యుల చొరవతో ఈ ఏడాది 2200 మంది తెలుగు నేర్చుకున్నారు. ఇటీవలే ఉడుమలపేటలో స్నాతకోత్సవమూ జరిగింది. దీనికి స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు హాజరవ్వడం విశేషం. 


రెండో అధికార భాషగా...
తమిళనాడులో తెలుగు భాషను కాపాడాలంటూ ఈ స్నాతకోత్సవం వేదికగా ప్రభుత్వానికి విన్నవించారు ‘మా తెలుగు’ సభ్యులు. ‘రాష్ట్రంలో తెలుగువారు ఎంతమంది ఉన్నారో చెప్పే వాస్తవ జనగణన లెక్కలను విడుదల చేయాలి, తెలుగుకు రెండో అధికారిక భాష హోదా ఇవ్వాలి, విద్యార్థులు ఇష్టపూర్వకంగా ఎంచుకోదగిన పాఠ్యాంశంగా తెలుగును ప్రకటించాలి’ తదితర తీర్మానాలను వారు ఏకగీవ్రంగా ఆమోదించారు. ‘‘నేను తమిళుణ్ని అయినప్పటికీ తెలుగువారి న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి కృషిచేస్తాను. వీటిని విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తాను’’ అని సభలో ఉన్న ఎంపీ మహేంద్రన్‌ చెప్పారు. 
      ‘తప్పనిసరిగా తమిళంలోనే చదవాలన్న నిబంధనను తీసేసి, విద్యార్థులందరూ వారి వారి మాతృభాషల్లోనే స్వేచ్ఛగా చదువుకునేలా చేయాలన్నదే మా లక్ష్యం. దీనికి ముందు ‘ఎల్లలు లేని తెలుగు’ ద్వారా మనవాళ్లందరికీ మన భాషను నేర్పించాలనుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వాలు, ప్రజలు మాకు నైతిక, వస్తుపరమైన మద్దతు ఇస్తారని ఆశిస్తున్నాం’ అంటున్నారు ‘మా తెలుగు’ సభ్యులు. పరాయిగడ్డ మీద, అదీ తమిళనాడు లాంటి స్థానిక భాషాభిమానం జాస్తిగా ఉన్న చోట తెలుగుకోసం తపిస్తున్న వారికి చేయూతనందివ్వడం తెలుగుగడ్డ మీది వారి కనీస బాధ్యత. కాదంటారా!


పరాయి రాష్ట్రంలో ఉన్నప్పటికీ అమ్మభాషా రుచులను అందరికీ పంచాలని అనుకున్నాను. అందుకే తెలుగు భాషను నేర్పించే ఈ కార్యక్రమంలో భాగస్వామినయ్యాను. మేమందరం తెలుగులోనే మాట్లాడుకుంటుండటం మాకు గర్వకారణం.  

- వి.సెంథిల్‌, వ్యాపారవేత్త


మాది ఉడుమలపేటలోని ఐశ్వర్యనగర్‌. పదిహేను రోజుల శిక్షణ తర్వాత తెలుగులో స్పష్టంగా మాట్లాడుతున్నాను. అమ్మభాషను నేర్చుకున్నందుకు చాలా గర్వపడుతున్నాను.  

 - హరణి, విద్యార్థిని


మా పంచాయతీ పరిధిలో ఉన్న గ్రామాల్లోని తెలుగువాళ్లందరికీ అమ్మభాషను నేర్పించే కార్యక్రమం చేపట్టాను. వచ్చినవాళ్లందరూ ఆసక్తిగా నేర్చుకుంటున్నారు. ఇప్పుడు మేమందరం తెలుగు రాష్ట్రంలోనే ఉన్నట్లు అనిపిస్తోంది. సరైన వసతులు లేక తెలుగు నేర్చుకోలేకపోయిన వాళ్లందరికీ ఈ కార్యక్రమం బాగా ఉపయోగపడుతోంది. 

- ఎం.జవహర్‌, బేలూరు పంచాయతీ అధ్యక్షుడు


చెన్నై, కోయంబత్తూరుల్లో సాఫ్ట్‌వేర్‌ సంస్థలను నిర్వహిస్తున్నాను. తెలుగు భాష మీద ఇక్కడివారిలో చైతన్యం తీసుకురావడంలో భాగస్వామిని అయినందుకు సంతోషిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని పూర్తిస్థాయి ఉద్యమంగా మార్చి.. స్థానిక తెలుగువాళ్లందరికీ తెలుగును మళ్లీ చేరువ చేస్తాం.  

- జి.వెంకటపతి


శ్రీజీవీజీ విశాలాక్షి కళాశాలలో బీఎస్‌సీ మూడో సంవత్సరం చదువుతున్నాను. ‘మా తెలుగు’ సాయంతో మన భాషలో రాయడం, చదవడం నేర్చుకున్నాను. ఇప్పుడు మా కళాశాలలో తెలుగువారితో తెలుగులోనే మాట్లాడుతుంటే ఆనందంగా ఉంది.    

- ఎన్‌.అర్చిత 


శ్రీనివాస విద్యాలయ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాను. తెలుగు నేర్చుకోవాలని అనుకున్నప్పటికీ మా బడిలో నేర్పలేదు. ఇప్పుడు తరగతులకు హాజరయ్యాను. ఇక్కడ చాలా తక్కువ సమయంలో చక్కగా తెలుగు నేర్పించారు.  

- ఎన్‌.అవిల 


వస్త్రాలు, ఇటుకలు, కొబ్బరి తదితర వ్యాపారాల్లో ఉన్నాను. తెలుగువారికి ఏదైనా చేయాలన్న ఉద్దేశంతో ఇదివరకు ఒక కుల సంఘాన్ని ఏర్పాటు చేసి, పలు కార్యక్రమాలు నిర్వహించాను. ఇప్పుడు ‘మా తెలుగు’కు కన్వీనర్‌గా ఉన్నాను. తెలుగు భాషాభివృద్ధినే ఆశిస్తున్న మా కృషి నిరంతరం కొనసాగుతుంది.  

- ఎం.వసంత్‌, వ్యాపారవేత్త


ఇంతకు ముందు తెలుగులో మాట్లాడటం వచ్చేది కాదు. ఈ తరగతులు ప్రారంభమయ్యాకే ఇలా మాట్లాడగలుగుతున్నాను. ఇప్పుడు నా వంతుగా దీపాలపల్లి గ్రామం చుట్టుపక్కల ప్రాంతాల్లోని తెలుగువారికి మాతృభాషను నేర్పించే బాధ్యతను తీసుకున్నాను. 

- వై.జమున, ఎంబీఏ విద్యార్థిని


*   *   *

 


వెనక్కి ...

మీ అభిప్రాయం