ఇది విద్యా మిథ్యా?

  • 839 Views
  • 3Likes
  • Like
  • Article Share

    ఇ.నాగేశ్వరరావు

  • హైదరాబాద్‌
  • 27424192
ఇ.నాగేశ్వరరావు

ఆత్మగౌరవం కాదు. ఆత్మన్యూనతాభావం వృద్ధి చెందుతోంది. ఆత్మవిశ్వాసానికి బదులు ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. ఆత్మ సంయమనం స్థానంలో క్షణికావేశాలు పెచ్చు మీరుతున్నాయి. యుక్తాయుక్త విచక్షణా జ్ఞానం తగ్గిపోయి ఉపాధ్యాయులనే వెక్కిరించే కుసంస్కారం అలవడుతోంది. నేటి విద్యావ్యవస్థ కారణంగా ‘విద్య’ పరమోద్దేశాలన్నీ మసకబారిపోతున్నాయి.
విద్యార్థులను నైతికంగా సమున్నతులుగా తీర్చిదిద్దాల్సిన వ్యవస్థ... కేవలం భావి ఉద్యోగులను తయారు చేసే కర్మాగారంలా తయారైంది. ముఖ్యంగా గడిచిన రెండు దశాబ్దాల్లో విద్యారంగంలో నైతిక విలువలు పతనమయ్యాయి. ప్రభుత్వం, విధాన నిర్ణేతలు, విద్యాధికారులు, ఉపాధ్యాయులు... ఎవరూ ఈ విషయాన్ని పట్టించుకోవట్లేదు. వాస్తవానికి విద్యార్థుల సంపూర్ణ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడానికి నాలుగు పద్ధతులు ఉన్నాయి. అవి జ్ఞానాన్ని అందజేయడం, నైపుణ్యాలు (స్కిల్స్‌) నేర్పడం, మానవత్వ విలువలు పెంపొందించడం, శారీరక వ్యాయామం. ఒకప్పుడు విద్యాలయాల్లో మొదటి దానికి ఎక్కువ ప్రాధాన్యం ఉండేది. ఇటీవల నైపుణ్యాలకు గిరాకీ బాగా పెరిగింది. పెద్ద జీతాలు వచ్చే ఉద్యోగాలను సాధించడానికి అవసరమయ్యే నైపుణ్యాలను నేర్పడాన్నే ఇప్పటి విద్యాసంస్థలు ప్రథమ కర్తవ్యంగా భావిస్తున్నాయి. అయితే ఈ నైపుణ్యాలు కేవలం బతకడానికి, ఆర్థికాభివృద్ధికి మాత్రమే ఉపయోగపడతాయి. కానీ, మనిషి మనిషిలా బతకడమెలాగో అవి నేర్పించవు. జ్ఞానం ఆ పని చేస్తుంది. జ్ఞానాధారిత విద్య... నవతరాన్ని బాధ్యతాయుతమైన, నిజాయితీపరులైన, నిష్పాక్షిక, నిశిత దృష్టితో అన్ని విషయాలను పరిశీలించగల పౌరులుగా తయారు చేస్తుంది. సృజనాత్మకత, బుద్ధి కుశలత, ఓర్పు, స్వయంకృషి లాంటి సుగుణాలు విద్యార్థులకు అబ్బుతాయి.
      నేటి యువతరం శారీరకంగా, మానసికంగా ఎక్కువ ఒత్తిడికి గురవుతోంది. కొన్ని దశాబ్దాల కిందట ఆర్‌.కె.నారాయణ్‌ ఎంపీగా ఉన్నప్పుడు, రాజ్యసభలో మాట్లాడుతూ... బడి పిల్లలు మోసే పుస్తకాల బరువు నానాటికీ పెరిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్నేళ్లయినా పరిస్థితిలో ఏమైనా మార్పు వచ్చిందా అంటే, వచ్చిందనే చెప్పాలి! బరువు ఇంకా పెరిగింది!
వేలకు వేలు చెల్లించి పిల్లలను ఖరీదైన పాఠశాలల్లో చేర్పిస్తున్నారు తల్లిదండ్రులు. అయితే, ఆ బళ్లలో పిల్లలు సరదాగా ఆడుకోవడానికి, వినోదానికి, విశ్రాంతికి సమయముండదు. తరగతి గది నుంచి భోజనశాలకి అక్కడ నుంచి వెంటనే మళ్లీ తరగతులకి వెళ్లాలి. కొన్ని బళ్లలో భోజనశాలలో గోడల మీద వాళ్ల పేర్లూ, పరీక్షల్లో వారి స్థానాలూ, ఇతర విద్యార్థులతో పోలికలు రాసి ఉంటాయి. దాంతో చిన్నారులు మనశ్శాంతిగా భోజనం కూడా చేయలేరు. ఇలాంటి కఠినమైన, నిర్దాక్షిణ్యమైన, తెలివిమాలిన శిక్షణ పూర్తి చేసుకున్నవారు ఎలాంటి పౌరులుగా మారతారు? మనోవైకల్యాలు, ఆనందరహిత బాల్యం వారిని వేధించవా?
      ప్రవేశ పరీక్షలు, ఉత్తీర్ణత శాతాలు, ఉన్నత స్థానాల హోరులో నిజమైన చదువులు మట్టిగొట్టుకుపోతున్నాయి. వ్యాపార దృష్టితో కూడిన ఈ విద్యావిధానం నుంచి తల్లిదండ్రులు బయటకురావాలి. తమ పిల్లల్లో కూడా చైతన్యం తీసుకురావాలి. పిల్లవాడికి ఆసక్తి ఉన్న వాటినే చదువుకునేలా ప్రోత్సాహమివ్వాలి. అప్పుడే ఆరోగ్యవంతమైన నవసమాజం రూపొందుతుంది.
      విద్యలో నైతిక విలువల ఆవశ్యకత గురించి రాధాకృష్ణన్‌ కమిషన్‌ (1948), కొఠారి కమిషన్‌ (1965) చెప్పాయి. యునెస్కో కూడా ఉన్నత విద్యలో మానవత్వ విలువలను పోషించాలంది. విద్యావ్యవస్థలో స్వేచ్ఛ, న్యాయం, సమానత్వం ఉండాలని 1998లో జరిగిన అంతర్జాతీయ సమావేశం స్పష్టం చేసింది. ఈ సమావేశానికి 180 దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. 1999 నాటి మన దేశ పార్లమెంటరీ కమిటీ తన నివేదికలో ‘వైజ్ఞానిక, శారీరక, ఆధ్యాత్మిక, నైతిక పురోగతిని దృష్టిలో పెట్టుకునే విద్య సాగాల’ని చెప్పింది. అయితే, ఏం లాభం! మన విధాన నిర్ణేతలకు ఇవన్నీ తలకెక్కట్లేదు. విద్యావ్యవస్థలో మార్పులు చేయడానికి వారికి మనస్కరించట్లేదు.
      విద్యలో నాలుగో అంశమైన శారీరక వ్యాయామం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇప్పుడు చాలా ప్రభుత్వేతర పాఠశాలలు చిన్న చిన్న ఇళ్లల్లో, వాణిజ్య సముదాయాల్లో నడుస్తున్నాయి. వాటిల్లో ఆటస్థలమన్నది మిథ్య. విద్యార్థులకు ఆటలు అనవసరమని చాలా విద్యాసంస్థలు భావిస్తుంటాయి. కానీ, శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనస్సు ఆనందంగా ఉంటుంది. అప్పుడే మెదడు కొత్త విషయాలను నేర్చుకోవడంపై దృష్టి పెడుతుంది. ఆటపాటలకు దూరమైన చిన్నారులకు ఈ అవకాశం ఉండదు కదా! ‘విద్య అంటే ప్రజలకు సరైన అవగాహన లేకపోవడమే అభివృద్ధికి నిజమైన ప్రతిబంధకం. మనం భూమి విలువని ఎలా అంచనా వేస్తామో అలాగే విద్య విలువనీ అంచనా వేస్తాం. ఎక్కువ సంపాదన తెచ్చే విద్య మాత్రమే కావాలనుకుంటాం. చదువుకునే వారి శీలం, నడవడిని మెరుగుపర్చడం గురించి మనం ఎక్కువ ఆలోచించం’... ఎనిమిది దశాబ్దాల కిందట జాతిపిత మహాత్మాగాంధీ వ్యక్తం చేసిన అభిప్రాయమిది. ఇన్నేళ్లలో మనలో ఏమైనా మార్పు వచ్చిందా? ఆత్మపరిశీలన చేసుకోవాలి.
      భారత దేశ విద్యావ్యవస్థ లోపభూయిష్టంగా మారింది. తక్షణం ప్రక్షాళన చేయాలి... 2001లో నాటి ప్రధాని వాజ్‌పేయి వ్యాఖ్య.
      దేశవ్యాప్తంగా విద్యావ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటాం... 2013లో నేటి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి పల్లంరాజు హామీ.
      ఏళ్ల తరబడి పాలకులు ఇలా మాటలు చెబుతూనే ఉన్నారు. అలా తరాలు మారిపోతున్నాయి. మరి పనులెప్పుడు చేస్తారో!?


వెనక్కి ...

మీ అభిప్రాయం