‘అక్షరసత్యాల్లో’ ఎన్ని అబద్ధాలు?

  • 678 Views
  • 0Likes
  • Like
  • Article Share

    కొత్తూరి సతీష్‌

  • హైదరాబాదు
  • 9010639899
కొత్తూరి సతీష్‌

అబద్ధానికి ఆకృతినిస్తే అక్షరాస్యతా కార్యక్రమమవుతుంది. మోసానికి ముసుగు వేస్తే మన పాలకుల పలుకవుతుంది.  నిరక్షరాస్యుల జీవితాల్లో అక్షర క్రాంతులను నింపడానికి వేల కోట్ల రూపాయలను ఖర్చు పెడుతున్నామంటూ జనాల కంట్లో కారం కొడుతున్నారు ఏలికలు. ఒకపక్క తప్పుడు గణాంకాలతో గారడీలు చేస్తూ... మరోపక్క రాష్ట్రంలో అక్షరాస్యత పెరిగిందని తమకు తామే వీరతాళ్లు తగిలించుకుంటున్నారు.
సాక్షరభారత్‌ కింద వయోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దటంలో ఆంధ్రప్రదేశ్‌దే అగ్రస్థానమట!
కిందటేడాది జాతీయ అక్షరాస్యతా దినోత్సవ వేడుకల్లో ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా మన రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖ మంత్రి బహుమతి కూడా అందుకున్నారు.
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చాలా వినూత్నంగా అక్షరాస్యతా కార్యక్రమాలు చేపడుతోందట! ఈ విషయంలో దేశంలోనే మొదటి స్థానంలో ఉందట!
ఈ ఏడాది జూన్‌లో జరిగిన ‘సాక్షరభారత్‌’ సమీక్షా సమావేశంలో కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రశంసలతో ముంచెత్తేశారు.
      ఇవన్నీ చూసి మన రాష్ట్రంలో అక్షరాస్యతా కార్యక్రమాలు భేషుగ్గా అమలవుతున్నాయనుకుంటే  పప్పులో కాలేసినట్లే. అంబలి ఏరై వస్తోందత్తా అంటే కోలబుర్ర చేతిలో ఉంది కోడలా అన్నదట వెనకటికి ఒకావిడ. పై బహుమతులు, ప్రశంసలన్నీ కూడా ఇదే బాపతు. చేతికొచ్చిన లెక్కలతో రాష్ట్రం దస్త్రాలను నింపుతోంటే... వాటిని చూసి మహదానందపడిపోయి మెచ్చుకోళ్లు సమర్పించేసుకుంటోంది కేంద్రం!
రెండేళ్ల కిందటి జనాభా లెక్కలను బట్టి చూస్తే మన రాష్ట్ర అక్షరాస్యతా శాతం 67. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో పోల్చుకుంటే ఈ విషయంలో మనది కింద నుంచి అయిదో స్థానం. సాటి దక్షిణాది రాష్ట్రాలన్నీ మనకు అందనంత దూరంలో (కేరళ - 94%, తమిళనాడు - 80.10%, కర్ణాటక - 75.40%) నిలబడితే... బీహార్‌, జార్ఖండ్‌, రాజస్థాన్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌ మాత్రమే మనకంటే వెనుక ఉన్నాయి. రాష్ట్రంలోని 1128 మండలాల్లో ఏ ఒక్కటీ 90 శాతానికి పైబడిన అక్షరాస్యత సాధించలేదు. కేవలం 47 మండలాల్లో మాత్రమే అక్షరాస్యుల సంఖ్య నూటికి 80 - 90 మధ్య ఉంది. జిల్లాల వారీగా అక్షర వెలుగులను పరిశీలిస్తే... కర్నూలు (59.97%), విజయనగరం (58.89%), మహబూబ్‌నగర్‌ (55.04%) అట్టడుగు స్థానాల్లో ఉన్నాయి. పురుషుల(74.88%) కంటే మహిళల్లో అక్షరాస్యుల సంఖ్య (59.15%) చాలా తక్కువ. అక్షర వెలుగుల్లో దేదీప్యమానంగా వెలుగొందాల్సిన తెలుగు గడ్డ ఇంతగా అజ్ఞానాంధకారంలో కునారిల్లుతోందెందుకు? దశాబ్దాల తరబడి అక్షరాస్యతా కార్యక్రమాలను అమలు చేస్తున్నా ఫలితాలెందుకు కనిపించట్లేదు? ఈ ప్రశ్నలకు జవాబులు కావాలంటే ఆ కార్యక్రమాల అమలు తీరును పరిశీలించాలి.  ‘సాక్షరభారత్‌’ స్థితిగతులను విశ్లేషించి  చూస్తే... మొత్తం అక్షరాస్యతా కార్యక్రమాల లోగుట్టులు అవగతమవుతాయి.
లక్ష్యం ఉన్నతం
అభివృద్ధి బాటలో సమాజం స్థిరంగా పయనించాలంటే పౌరుల అక్షరాస్యతే మూలం. ముఖ్యంగా ఇల్లాలి చదువు ఇంటితో పాటు దేశానికీ వెలుగే. ‘మన దేశంలో 20 కోట్ల మంది నిరక్షరాస్యులైన మహిళలు ఉన్నారు. అతివల్లో ఇంత తక్కువగా ఉన్న అక్షరాస్యత... వారి జీవితాలపైనే కాదు, వారి కుటుంబాలపైనా, దేశ ఆర్థికాభివృద్ధి మీద కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. అంతేకాదు, ఆ ప్రభావం వారి ఆరోగ్యం, పిల్లల శ్రేయస్సు మీద కూడా ఉంటుంద’ని రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ క్రికెట్‌ క్రీడాకారుడు సచిన్‌ టెండుల్కర్‌ ఓ సందర్భంలో చెప్పారు. ఆయన మాటలు అక్షర సత్యాలు. స్త్రీ విద్యను ప్రోత్సహించడం ద్వారా దేశాభివృద్ధిని సాధించవచ్చన్న విశ్వాసంతో నాలుగేళ్ల కిందట జాతీయ అక్షరాస్యతా కార్యక్రమాన్ని పునర్‌ వ్యవస్థీకరించింది కేంద్ర ప్రభుత్వం. 2001 జనాభా లెక్కల ప్రకారం వయోజన మహిళా అక్షరాస్యత 50 శాతం కంటే తక్కువ ఉన్న జిల్లాల్లో ‘సాక్షర భారత్‌’ను అమలు చేయడానికి నిర్ణయించింది. సెప్టెంబరు 8, 2009న దేశవ్యాప్తంగా 372 జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మన రాష్ట్రంలో హైదరాబాద్‌, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో తప్ప మిగిలిన అన్ని చోట్లా దీన్ని అమలు చేస్తున్నారు. గ్రామీణ అతివల అక్షరాస్యతను 80 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.  పదిహేనేళ్లు దాటిన నిరక్షరాస్య మహిళలందరూ ఈ పథకం ద్వారా పలక పట్టాలని, అక్షరాలు దిద్దాలన్నది మౌలిక ఉద్దేశం.
      స్థానిక సంస్థల పర్యవేక్షణలో అమలయ్యే ‘సాక్షరభారత్‌’ కింద ఈ మూడేళ్లలో రాష్ట్రంలో రూ.538 కోట్లు వెచ్చించారు. ఒక్కో జిల్లాకు సగటున రూ.28.30 కోట్లు ఇచ్చారన్న మాట. ప్రాథమిక అక్షరాస్యతా కేంద్రం, వయోజన విద్యా కేంద్రాల ఏర్పాటు, మౌలిక వసతుల కల్పనకు ఒక్కో గ్రామానికి రూ.14 వేలు అందాయి. ఈ ‘సాక్షర భారత్‌’ బాగోగులను చూడటానికి జిల్లా, మండల, గ్రామస్థాయిల్లో లోక్‌శిక్షా సమితులను ఏర్పాటు చేశారు. గ్రామస్థాయిలోని సమితులకి సర్పంచి, పంచాయతీ మహిళా సభ్యులు, విద్యా కమిటీ సభ్యులు, స్థానిక ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఇతరులు ప్రాతినిధ్యం వహిస్తారు. కేంద్రాల ద్వారా నిరక్షరాస్య మహిళల్లో అక్షర జ్ఞానం పెంపొందించడానికి ప్రతి గ్రామానికి ఒక సమన్వయకర్తను నియమించారు. చదువు చెప్పడంతో పాటు బతుకు తెరువుకు ఆసరాగా నిలిచేందుకు వృత్తిపరమైన ఉపాధి శిక్షణా కార్యక్రమాలనూ సాక్షరలో భాగం చేశారు. వయోజనుల్లో విషయ పరిజ్ఞానాన్ని పెంచాలన్న లక్ష్యంతో ప్రతి కేంద్రానికీ దిన, మాస పత్రికలు తెప్పించాలని నిబంధన పెట్టారు. దీనికి గానూ ఒక్కో గ్రామానికి ఏటా రూ.13 వేలు ఇస్తున్నారు. వైద్య, వ్యవసాయ సంబంధిత అంశాలపై మహిళలకు అవగాహన కల్పించేందుకు మరో ఏడు వేల రూపాయలను వ్యయం చేస్తున్నారు. అలాగే, వివిధ పుస్తకాల కొనుగోళ్లకూ నిధులు సమకూర్చారు. ఈ కేంద్రాల్లో చదువుకుంటున్న వారికి ఏడాదిలో రెండు సార్లు (మార్చి, ఆగస్టు) జాతీయ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహిస్తారు. ఉత్తీర్ణులైన వారికి ధ్రువపత్రాలు ఇస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 2011, 2012ల్లో జరిగిన పరీక్షలకు 54 లక్షల మంది హాజరైనట్లు రాష్ట్ర సాక్షరతా మిషన్‌ సభ్య సమన్వయకర్త, వయోజన విద్య సంచాలకులు ప్రకటించారు.
అన్నీ మాయమాటలే!
అధికారుల మాటలు, ప్రభుత్వ లెక్కలను బట్టి చూస్తే ‘సాక్షరభారత్‌’ లక్ష్యాలు సాకారమవుతున్నట్లే కనిపిస్తాయి. కానీ, లోతుగా వెళ్తే మాత్రం మేడిపండు చందమనిపిస్తాయి. ఈ పథకం అమలును పరిశీలించడానికి సమాచార హక్కు చట్టం కింద అన్ని జిల్లాల్లో దరఖాస్తులు చేస్తే విస్మయం కలిగించే అంశాలు వెలుగులోకి వచ్చాయి. విద్యా కేంద్రాల హాజరుపట్టీలను సేకరించి చూస్తే... అన్ని పట్టీల్లో 70 శాతం మంది వయోజనులు నిరవధికంగా హాజరైనట్లు రాశారు. 30 రోజులు ఉండే నెలల్లో కూడా 31 వ తేదీతో గళ్లు వేసి హాజరు చూపించారు!!! క్షేత్రస్థాయికి వెళ్లినప్పుడు పరిస్థితి తీవ్రత పూర్తిగా అర్థమైంది. కోస్తా, తెలంగాణ, రాయలసీమ... ప్రాంతాలకతీతంగా అక్షర జ్యోతులెలా కొండెక్కుతున్నాయో అవగతమైంది. గ్రామాల్లోని చాలా మంది మహిళలకు సాక్షర కేంద్రాల సంగతే తెలీదు. చుట్టుపక్కలెక్కడా శిక్షకులు కనిపించలేదు.
అన్ని చోట్లా అదే పరిస్థితి
విజయనగరం జిల్లా మొత్తం కేంద్రాల్లో ఎక్కడా సరైన హాజరు లేదని.. అయినా పట్టీల్లో 70 శాతం హాజరు నింపి అధికారులకు పంపిస్తున్నామని శిక్షకులే చెప్పారు. రాష్ట్ర మంత్రి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ నియోజకవర్గం చీపురుపల్లిలోని సాక్షర కేంద్రాలకు వేసిన తాళాలు తుప్పుపట్టిపోయి కనిపించాయి. ఇదంతా ఒక ఎత్తు... కేంద్ర ప్రభుత్వ బహుమతుల పంపకం మరో ఎత్తు. దేశం మొత్తమ్మీద విజయనగరం జిల్లాలోనే ‘సాక్షర భారత్‌’ మెరుగ్గా అమలవుతోందంటూ కిందటేడాది అక్షరాస్యతా దినోత్సవ వేడుకల్లో బహుమతినిచ్చింది. అడ్డగోలుగా నింపిన హాజరు పట్టీలనే ప్రగతికి నిదర్శనాలుగా స్వీకరిస్తున్నారనడానికి ఇంతకు మించిన సాక్ష్యం ఏం కావాలి?
      ‘వేతనం తీసుకుంటున్నందుకైనా అక్షరాలు నేర్పండి. మండలంలో సాక్షరభారత్‌ సమన్వయకర్త పనితీరు దారుణంగా ఉంది. ఏ గ్రామానికి వెళ్లినా కేంద్రాలు నిర్వహిస్తున్న దాఖలాలు కనిపించట్లేదు’... మహబూబ్‌నగర్‌ జిల్లా తలకొండపల్లి ఎంపీడీవోగా అయిదేళ్ల పాటు పని చేసి, రాష్ట్రస్థాయిలో ఉత్తమ అధికారిగా  బహుమతిని అందుకున్న నాగేశ్వర్‌ బదిలీపై వెళ్తూ చేసిన వ్యాఖ్యలివి. జిల్లావ్యాప్తంగా పథకం అమలు తీరు ఇదే రీతిన ఉంది. పట్టుమని పది మంది కూడా రాని కేంద్రాల్లో కూడా సగటున 85 మంది హాజరవుతున్నట్లు చూపించారు. కల్వకుర్తి మండలంలో 21 కేంద్రాలుంటే వంద మందిని కూడా అక్షరాస్యులుగా తీర్చదిద్దలేదు. లెక్కలో మాత్రం 1782గా రాశారు. కేంద్రాల పరిస్థితిని గురించి ఓ అధికారిని అడిగితే ‘ఎక్కడా నడుస్తలేవ్‌... కానీ, అన్నీ నడుస్తున్నట్లే’నని చెప్పారు!
      కర్నూలు జిల్లాలోని చాలా గ్రామాల్లో సాక్షర భారత్‌ అంటే ఏంటో కూడా తెలియదు. అసలు ఆ ఊళ్లల్లో వయోజన విద్యా కేంద్రాలు ఎక్కడున్నాయో తెలుసుకోవడానికి చాలా సమయం పట్టింది. రూ.15 కోట్లు ఖర్చుపెట్టి జిల్లావ్యాప్తంగా లక్ష మందికి చదువు చెప్పినట్లు లెక్కలు చూపించారు. అవన్నీ బూటకమే. వేలల్లో కూడా అక్షరాస్యులు లేరని తేలింది.
      నెల్లూరు జిల్లాలో సాక్షర భారత్‌కి ఇప్పటి వరకు రూ.20 కోట్లు ఖర్చుపెట్టారు. 60 వేల మందిని అక్షరాస్యులుగా చేసినట్టు పత్రాల్లో పేర్కొన్నారు. గ్రామాల్లోకి వెళ్లిచూస్తే అక్షరాల ఆనవాళ్లేలేవు. దస్త్రాలు, హాజరుపట్టీలు అన్నీ అబద్ధమే. పుస్తకాలు, పలకలు పంచేసి నిధులను దిగమింగారు.
      వరంగల్‌లో మరీ అన్యాయం. కేంద్రాలకు ఇచ్చే కుర్చీలు, బీరువాల కొనుగోళ్లలోనే రూ.18 లక్షలు మాయం చేశారు. 2011, 12, 13ల్లో దాదాపు 4.20 లక్షల మందిని అక్షరాస్యులుగా చేయాలని లక్ష్యం పెట్టుకుంటే సగం మందికి కూడా అక్షరాలు నేర్పలేదు.
      గత రెండేళ్లలో 1.15 లక్షల మంది చేత అక్షరాలు దిద్దించాం... ఈ ఏడాదిలో మూడు లక్షల మందికి చదువు చెబుతున్నాం... నిజామాబాద్‌ జిల్లా అధికారుల మాటలివి. కానీ, ఈ ఏడాది మార్చిలో జరిగిన పరీక్షలకు కేంద్రానికి పది మంది చొప్పున కూడా హాజరు కాలేదు. చాలా చోట్ల విద్యార్థుల చేత పరీక్షలు రాయించారు. మరికొన్ని ప్రాంతాల్లో సమన్వయకర్తలే రాశారు.
      పథకం అమలవుతున్న 19 జిల్లాల్లో అన్నిచోట్లా ఇవే సన్నివేశాలు. వయోజన విద్య మొత్తం మిథ్యగా మారిపోయింది. వందల కోట్ల రూపాయల ప్రజాధనం హారతి కర్పూరమైంది. గ్రామీణ వయోజన అక్షరాస్యతను ఉద్దేశపూర్వకంగా పెంచి చూపిస్తూ పాలకులు, అధికారులు ఆత్మవంచన చేసుకుంటున్నారు. ప్రజలనూ ఏమారుస్తున్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే... రాష్ట్రం దస్త్రాల్లో మాత్రమే సంపూర్ణ అక్షరాస్యతను సాధిస్తుంది. 

*   *   *

సహకారం: ఈటీవీ2, ఈనాడు ముందడుగు యంత్రాంగాలు


వెనక్కి ...

మీ అభిప్రాయం