చైనా వస్తువులు, బొమ్మలు, ఎలక్ట్రానిక్ పరికరాలు దేశదేశాల్ని ముంచెత్తుతున్నాయి! వాటి నుంచి ఏం నేర్చుకున్నా, నేర్చుకోకపోయినా, భాషాభిమానులూ, ప్రభుత్వాలూ నేర్చుకుని తీరాల్సిన అంశం ప్రపంచాన్ని కమ్మేస్తోన్న మాండరిన్ భాష వ్యాప్తి!!
మేరునగ సమానమైన ఆత్మవిశ్వాసంతో చైనా ఆంగ్లాధిపత్యానికి సవాలు విసురుతోంది. 130 కోట్ల మంది చైనీయులతో పాటు, 3 కోట్ల మంది విదేశీయులకు ఇప్పుడు మాండరిన్ కరతలామలకం. ఏటా 4 కోట్ల మంది దాన్ని నేర్చుకుంటున్నట్లు అంచనా. దశాబ్దాలుగా ఓ క్రమపద్ధతిలో, మరీ ముఖ్యంగా గత తొమ్మిదేళ్లలో చైనా పాలకులు చేసిన కృషి, అనుసరించిన వ్యూహాల ఫలితమిది. విశ్వవ్యాప్తంగా భాషాభిమానులకు క్రాంతిదర్శిగా నిలిచే చైనా భాషోద్యమ ప్రస్థానమిది.
ఆ మూడూ
చైనాలో 92 శాతం మంది హన్ జాతీయులు. మిగిలిన 55 వర్గాల వారూ అల్ప సంఖ్యాకులే. ఇక్కడ ఉన్న మాతృభాషలు 298 (మాండరిన్, కాంటొనీస్, హొక్కైన్, షాంఘైనీస్, తదితరాలు). పద సంపద పరంగా ఒకదానికీ మరోదానికీ సంబంధం ఉండదు. ఒకరి మాట మరొకరికి అర్థం కాదు. అందుకే ఆ దేశీయుల మధ్య వారధిగా మాండరిన్ వాసికెక్కింది.
చైనీయుల భాషలకు వర్ణమాలల్లేవు. వాటిని ‘కారెక్టర్ల’ సాయంతో రాస్తారు. కారెక్టర్లంటే... లిపిలో ఒక పదం అర్థాన్ని సూచించడానికి వాడే చిత్ర, భావ, ధ్వని సంకేతాల సమ్మేళనాలు. మనిషి అని రాయాలంటే... ‘మ, న, ష’ అనే అక్షరాలను వాడతాం. కానీ చైనీయులు ఇలా ( ) బొమ్మ వేస్తారు. వీటినే కారెక్టర్లంటారు. వాటిని రాయడం చాలా కష్టం. ఉదాహరణకు, ‘బియాన్’ అంటే ‘అంచు’. దీన్ని రాయాలంటే 18 గీతలు గీయాలి. ఇదే కాదు, 40 గీతలు గీయాల్సిన కారెక్టర్లూ ఉన్నాయి. కొన్ని ఆకారాలైతే మరీ సంక్లిష్టం. దాదాపు 2 వేల కారెక్టర్లు తెలిస్తేనే చైనీస్ భాషలను రాయగలం. అందుకే సామాన్యులెవరూ ‘రాత’ జోలికి పోయేవారు కాదు.
మరో సమస్య... చైనా భాషలన్నీ స్వర ఆధారితాలే. వివిధ పదాలను పలకాలంటే వివిధ స్వర స్థాయిలను ఉపయోగించాలి. ఉదాహరణకు మాండరిన్లో నాలుగు స్థాయిలు ఉన్నాయి. కొన్ని పదాలను గట్టిగా, కొన్నింటిని నెమ్మదిగా, మరికొన్నింటిని క్రమంగా ధ్వని పెంచుతూ, ఇంకొన్నింటిని క్రమంగా తగ్గిస్తూ పలకాలి. విదేశీయులకు భాష నేర్పాలంటే ప్రథమ అడ్డంకులు ఇవే!
అయినా దేశం, సంస్కృతుల మీద ప్రేమతో చైనీయులు వాటన్నింటినీ అధిగమించారు.
మావో చూపిన బాట
రాత భాషను సామాన్యులకు చేరువ చేయాలన్న వాదం ఇరవయ్యో శతాబ్దం మొదట్లో బలం పుంజుకుంది. లిపి సంస్కరణ బాధ్యతలను మేధావులు భుజాన వేసుకున్నారు. కారెక్టర్లకు అనుగుణంగా.. జాతీయ ధ్వని ఆధారిత వర్ణమాలను 1912లో తయారు చేశారు. అది పెద్దగా ప్రాచుర్యంలోకి రాలేదు. 30వ దశకంలో కొన్ని ప్రయత్నాలు జరిగాయి. భాషావేత్తల మధ్య ఏకాభిప్రాయం లేక లిపి సంస్కరణ ముందుకు సాగలేదు. 1949లో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఏర్పాటైంది. కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చారు.
భాషను సరళీకరిస్తే అక్షరాస్యత పెరిగి ఆర్థికాభివృద్ధి జరుగుతుందని నవ చైనా నిర్మాత మావో భావించాడు. ‘మన రాత భాషలో తప్పనిసరిగా సంస్కరణ జరగాలి. ఇతర ప్రపంచ భాషల మాదిరిగా మనమూ ధ్వని ఆధారంగా రాయాలి. కారెక్టర్ల స్థానంలో వర్ణమాలను రూపొందించాల’ని ఆయన భాషావేత్తలకు దిశానిర్దేశం చేశాడు. మరోవైపు.. సంస్కరణోద్యమాన్ని ముందుకు సాగనివ్వని రాజకీయాలనూ అర్థం చేసుకున్నాడు. ‘భాషా సంస్కరణ అధికారాన్ని మేధావులకు కాక ప్రజలకు అప్పగించండ’ని ఆదేశించాడు. ఆ తర్వాతే లిపి సంస్కరణ, జాతీయ భాషా సంఘాలు ఏర్పాటయ్యాయి. పరిశోధనలు జరిగాయి. ఫలితంగా, భావం దెబ్బతినకుండా కారెక్టర్లను సరళీకరించగలిగారు. ముఖ్యంగా 15 గీతలకంటే ఎక్కువ గీయాల్సిన వాటిని సంస్కరించారు. (ఉదాహరణకు పైన చెప్పుకున్న బియాన్‌ను 18కి బదులుగా అయిదు గీతలతో రాసేలా మార్చారు) 1964లో 2235 కారెక్టర్లతో సరళీకరించిన జాబితాను విడుదల చేశారు. వాటికి కొత్త వాటిని జోడిస్తూ 1977, 86, 95ల్లో మరికొన్ని జాబితాలను విడుదల చేశారు. మొత్తం 13,500 సంప్రదాయ కారెక్టర్లను సరళీకరించి ఏడు వేలకు కుదించేశారు. ఆ తర్వాత చైనా ప్రాచీన సాహిత్యాన్ని, ప్రభుత్వ దస్త్రాలతో సహా దేశంలో రాతలో ఉన్న ప్రతి సమాచారాన్నీ సేకరించి సరళీకృత కారెక్టర్లతో కొత్తగా ముద్రించారు. ఆ తరువాత ఇకపై సరళీకృత కారెక్టర్లనే వాడాలని ప్రభుత్వం చట్టం చేసింది.
మరోవైపు, 1958లోనే ‘పిన్యిన్’ పేరిట మాండరిన్ ఉచ్చరణకు వర్ణమాలను తయారు చేశారు. ఒక పదాన్ని ఎలా రాయాలి? ఎలా పలకాలన్నవి తెలపడం దీని ఉద్దేశం. ఇది కారెక్టర్లకు ప్రత్యామ్నాయం కాదు. కారెక్టర్లను పక్కనపెట్టి వర్ణమాలను తెచ్చుకోవాలన్న మావో ఆశయం నెరవేరలేదు. అయితేనేం... లిపి సంస్కరణ వల్ల, 1949కి ముందు 20 శాతం కంటే తక్కువ ఉన్న చైనా అక్షరాస్యత ఇప్పుడు 95.1 శాతానికి చేరింది.
ఒకటే చైనా... ఒకటే భాష
లిపి సంస్కరణకు బీజం వేసిన 1912 సమావేశంలోనే మాండరిన్‌కు ‘అనుసంధాన భాష’ హోదా కట్టబెట్టారు. 13వ శతాబ్దం నుంచి దేశానికి రాజధాని అయిన బీజింగ్‌లో వ్యవహారంలో ఉండటం, ఇతర ముఖ్య భాషల కన్నా స్వచ్ఛంగా ఉండటం, మరీ ముఖ్యంగా చైనీస్ రాతభాషతో దగ్గరగా ఉండటంతో దేశవ్యాప్త వాడుకకు మాండరిన్‌ను ఎంచుకున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో అది ముందుకు సాగలేదు. కమ్యూనిస్టులు వచ్చాక భాషాపరంగా దేశాన్ని అనుసంధానించే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. 1955లో మాండరిన్‌కు ‘పుటొంగ్వా’ (సాధారణ వాడుక భాష)గా నామకరణం చేసి అధికార భాషగా స్వీకరించారు. అయితే, దాన్ని దేశం మీద బలవంతంగా రుద్దలేదు. ‘ఏ జాతి వారైనా వారి మాతృభాషలో మాట్లాడుకోవచ్చు, వాటిని అభివృద్ధి చేసుకోవచ్చ’ని దేశ రాజ్యాంగంలో పొందుపరిచారు. అందుకు అనుగుణంగా పాఠశాలల్లో స్థానిక భాషల్లో బోధన చేసేవారు. రెండో భాషగా మాండరిన్‌ను నేర్పేవారు. పారిశ్రామికీకరణ ఊపందుకున్న తర్వాత కార్మికుల వలసలు పెరిగాయి. వివిధ జాతుల్ని ఐక్యం చేసి, ఒకే దేశంగా ఎదిగే క్రమంలో భాషావరోధాలు ఎదురయ్యాయి. ద్విభాషా విధానం వల్ల ఒనగూరిందీ ఏమీ లేదు.
అప్పుడే... చైనా రాజ్యాంగంలోని మరో నిబంధనను బయటకు తీశారు. ‘దేశ ఐక్యత, స్థిరత్వమే ప్రథమ లక్ష్యం. దానికి భంగం కలిగించే పౌర హక్కులు, విధానాలు రద్దవుతా’యన్నది దాని సారాంశం. దీనికి అనుగుణంగా ద్విభాషా విధానాన్ని పక్కనపెట్టారు. ‘జాతీయ పతాకాన్ని ప్రేమించండి. జాతీయ గీతాన్ని ఆలపించండి. పుటొంగ్వాలో మాట్లాడండి’ అని ప్రచారం చేశారు.
పాఠశాలల్లో మాండరిన్లో బోధనను ప్రారంభించారు. రాని ఉపాధ్యాయులందరినీ శిక్షణకు పంపారు. విశ్వవిద్యాలయాలు, కళాశాలల ఆచార్యులకు మాండరిన్ మాట్లాడటంలో పరీక్షలు పెట్టారు. ఉపాధ్యాయ సమావేశాల నుంచి విద్యార్థులతో మాట్లాడటం వరకూ అన్ని చోట్లా మాండరిన్‌ను తప్పనిసరి చేశారు. జాతీయ కళాశాలల ప్రవేశ పరీక్షను మాండరిన్లో మాత్రమే నిర్వహించడం ఆరంభించారు. ప్రభుత్వాధికారులు ప్రజలతో మాండరిన్లో మాత్రమే మాట్లాడాలన్న నియమం పెట్టారు. పట్టా పుచ్చుకున్న తర్వాత ప్రభుత్వోద్యోగం రావాలంటే మాండరిన్ వచ్చి ఉండాలన్నది స్పష్టం చేశారు. భాషాధారిత వృత్తుల్లో (ఉపాధ్యాయులు, నటీనటులు, వార్తలు చదివే వారు) ఉండేవారికి ప్రభుత్వం భాషా ప్రమాణాలను నిర్దేశించింది. వాటిని అందుకోలేని వారికి శిక్షణనిచ్చింది.
గత దశాబ్దం మొదట్లో ప్రభుత్వం ‘జాతీయ సాధారణ వాడుక భాష, లిపి’ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం ప్రభుత్వ వ్యవహారాలు, పత్రికలు, ప్రసారమాధ్యమాలు, చలనచిత్రాలు, వ్యాపార, సేవా రంగాలతో సహా అన్ని చోట్లా రాతకు సరళీకృత కారెక్టర్లు, మాట్లాడటానికి మాండరిన్‌ను మాత్రమే వాడాలి. దీంతో మాండరిన్ పూర్తిగా వాడుకలోకి వచ్చింది. ఇప్పుడు ప్రాథమిక పాఠశాల నుంచి విశ్వవిద్యాలయం వరకూ మాండరిన్ ఒక పాఠ్యాంశం. మొత్తం తరగతి సమయంలో 30 శాతాన్ని భాషా బోధనకే కేటాయించారు. జాతులకతీతంగా మూడో తరగతికి వచ్చేసరికి పిల్లలందరూ మాండరిన్లో అనర్గళంగా మాట్లాడగలిగేలా శిక్షణ ఇస్తున్నారు. ఆంగ్లం (రెండో భాష) తప్ప మిగిలిన అన్ని పాఠ్యాంశాల బోధనా మాండరిన్లోనే. చైనాలో ఉండే విదేశీయుల పిల్లలు అక్కడి పాఠశాలల్లో చేరాలంటే మాండరిన్ మాట్లాడగలగాలి. భాష రాని వాళ్లను ఒకటో తరగతిలో వేస్తారు. భాష వచ్చిందాకా పై తరగతులకు పంపరు.
ఒక భాష ప్రజాదరణను అంచనా వేయడానికి మూడు విషయాలను పరిశీలించాలని చైనీస్ భాషావేత్తలు చెబుతారు. అవి 1) పాఠశాలల్లో దాని వాడకం ఎలా ఉంది? 2) అన్ని రంగాల్లోని అన్ని స్థాయిలకు చెందిన పని ప్రదేశాల్లో ఆ భాషనే ఉపయోగిస్తున్నారా? 3) సాంఘిక వ్యవహారాల్లో ప్రధాన స్రవంతి భాషగా మనుగడలో ఉందా? 2004 నాటికే పై మూడు విషయాల్లో మాండరిన్ ఉచ్ఛదశకు చేరింది.
ఆకాశమే హద్దు
ఇంట గెలిచిన చైనీయులు భాషా జైత్ర యాత్రకు సిద్ధమయ్యారు. విదేశాల్లో భాష, సంస్కృతి, కళలు, వైద్యం, ప్రాచీన యుద్ధ విద్యల ప్రచారంతో చైనాపై అపోహలను తొలగించుకోవాలని నిర్ణయించారు. రూ.64 వేల కోట్లతో ‘కన్ఫ్యూషియస్ సంస్థ’ (కసం)ల ప్రాజెక్టును ప్రారంభించారు. తాష్కెంట్లో 2004లో ప్రయోగాత్మకంగా ‘కసం’ను ఏర్పాటు చేశారు. ఇది మంచి ఫలితాలను ఇవ్వడంతో అదే ఏడాది విదేశాల్లో (సియోల్, దక్షిణకొరియా రాజధాని) తొలి ‘కసం’ను స్థాపించారు. తర్వాత వివిధ దేశాల్లో వారానికి రెండు చొప్పున ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వంద దేశాల్లో 400కు పైచిలుకు ‘కసం’లలో ఎనిమిది లక్షల మంది విద్యార్థులు మాండరిన్‌ను నేర్చుకుంటున్నారు.
* 12 ముఖ్య ప్రభుత్వ శాఖల (విద్య, సాంస్కృతిక, ఆర్థిక, వాణిజ్య, విదేశీ వ్యవహారాలు..) ఆధ్వర్యంలో ‘కసం’ల ప్రధాన కేంద్రంగా 2006లో ‘హన్బన్’ను స్థాపించారు. భాషా బోధనకు అవసరమైన ఉపాధ్యాయులు, వనరుల సమీకరణ, సులువైన పద్ధతుల ఆవిష్కరణ దీని బాధ్యతలు. హన్బన్ కింద 19 విశ్వవిద్యాలయాల్లో భాషా పీఠాలున్నాయి. ‘ఆన్లైన్ కసం’ పేరిట హన్బన్ 9 భాషల్లో వెబ్సైట్లను నిర్వహిస్తోంది. వీటి నిర్వహణ ఖర్చు రూ.53 కోట్లు. వీటి ద్వారా ఏడాదికి లక్ష మంది మాండరిన్‌ను నేర్చుకుంటున్నారు.
* విదేశాల్లో స్థానిక విశ్వవిద్యాలయాల సంయుక్త భాగస్వామ్యంలో ‘కసం’ను ఏర్పాటు చేస్తారు. ఏర్పాటు, నిర్వహణ ఖర్చులు, బోధకులు, బోధన వనరులను చైనా సమకూర్చుతుంది. స్థలం, మౌలిక సదుపాయాలను భాగస్వామి ఇస్తే చాలు. ప్రతి ‘కసం’ ఏర్పాటుకూ చైనా రూ.64 లక్షలనూ, 3 వేల పుస్తకాలనూ అందిస్తుంది. నిర్వహణకు ఏడాదికి రూ.1.28 కోట్ల వరకూ అందజేస్తుంది. 2004 నుంచి 2011 వరకూ ‘కసం’లపై చేసిన ఖర్చు రూ.3200 కోట్లు.
* ‘కసం’ల ఏర్పాటుకు అంగీకరించే విశ్వవిద్యాలయాల్లో విద్యా ప్రమాణాల పెంపునకూ చైనా ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. ఇలా స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయానికి రూ.25 కోట్లు ఇచ్చింది. కొలంబియా విశ్వవిద్యాలయానికి 2010 నుంచి అయిదేళ్ల పాటు పరిశోధనలకు ఏడాదికి రూ.64 కోట్లను చైనా ఇస్తోంది.
* ‘కసం’లలో చైనీస్‌ను బోధించేందుకు ఉపాధ్యాయులను, వాలంటీర్లను చైనా ప్రభుత్వమే పంపుతోంది. అన్ని ‘కసం’లలో కలిపి 4 వేల మంది ఉపాధ్యాయులు, 13 వేల మందికి పైగా వాలంటీర్లు ఉన్నారు. నెలకు రూ.76 నుంచి రూ.96 వేల వరకూ వేతనాలిచ్చి ఉపాధ్యాయులుగా నియమిస్తోంది. డిగ్రీ పూర్తి చేసిన చైనీస్ యువత, విదేశాల్లో స్థిరపడ్డ చైనీయులు, మాండరిన్ వచ్చిన విదేశీయులను వాలంటీర్లుగా తీసుకుంటోంది. వీరికి శిక్షణ అనంతరం నెలకు రూ.25 వేల నుంచి రూ.38 వేల వరకూ జీతాలిచ్చి విదేశాలకు పంపుతోంది. దాదాపు 17 వేల మంది విదేశీ స్థానిక ఉపాధ్యాయులకూ చైనీస్‌లో శిక్షణిచ్చింది. వారి చేతా తరగతులు చెప్పిస్తోంది. ఏడాదికి 1400 మంది విదేశీ విద్యార్థులను చైనీస్ భాషా పండితులుగా తీర్చిదిద్దుతోంది. తిరిగి వారితో స్థానికంగా మాండరిన్‌ను బోధింపజేస్తోంది.
* భాషాబోధన కథలు, నిత్య జీవిత ఉదాహరణలతో సరదాగా మాట్లాడుకున్నట్టే ఉంటుంది. ముందు స్థానిక భాషల ద్వారా ప్రాథమిక మాండరిన్ నేర్పుతారు. దీని కోసం 45 ప్రపంచ భాషల్లో 9 రకాల బోధనా సామాగ్రిని, మొబైల్ యాప్స్‌నూ తయారు చేశారు.
* ప్రతి ‘కసం’కూ ఒక విశ్వవిద్యాలయ ఆచార్యుణ్ని సహాయ సంచాలకునిగా నియమిస్తారు. ఆయన తన పరిధిలోని పాఠశాలల్లో మాండరిన్ బోధన జరిపించేందుకు కృషి చేస్తారు. ఇందుకు అంగీకరించే విదేశీ పాఠశాలలను ‘కన్ఫ్యూషియస్ తరగతి గదుల’ంటారు. ఇలాంటివి ప్రపంచవ్యాప్తంగా 500కు పైగా ఉన్నాయి. ఈ పాఠశాలలకు ఒక్కోదానికి చైనా రూ.6 లక్షలను అందజేస్తోంది.
* కన్ఫ్యూషియస్ కేంద్రాల్లో ఒక తరగతిని వినడానికి రావాలని పిల్లల తల్లిదండ్రులను నిర్వాహకులు కోరతారు. వచ్చిన వారికి మాండరిన్ విశిష్టతను వివరిస్తారు. నేర్చుకోవడానికి ఉత్సాహం చూపే వారికి, పిల్లలతో పాటే భాష నేర్పుతారు. రోజు వారీ తరగతులు ముగిశాక రెండున్నర గంటలు మాండరిన్ నేర్పుతారు.
* ‘కసం’లలో ప్రాథమిక భాషను నేర్చుకుని, తర్వాత చైనాకు వెళ్లి మాండరిన్‌ను అభ్యసించాలనుకునే వారికి ఉపకార వేతనాల్నీ ఇస్తున్నారు. ఇందుకు ఏడాదికి రూ.206 కోట్లు వెచ్చిస్తున్నారు.
* చైనీస్‌ను నేర్చుకునే విదేశీ విద్యార్థుల భాషా సామర్థ్యాన్ని పరీక్షించడానికి ఏటా ‘చైనీస్ బ్రిడ్జి’ పేరిట పరీక్షలు పెడతారు. ప్రాథమిక పరీక్షలను ఆయా దేశాల్లో నిర్వహిస్తారు. అంతిమ పరీక్షలను చైనాలో ఏర్పాటు చేస్తారు. వీటి కోసం ఏటా 4 వేల మంది విద్యార్థులు, వారి ప్రధానోపాధ్యాయులు చైనాకు వస్తారు. వీరికి వారం పాటు ప్రభుత్వమే ఆతిథ్యమిస్తుంది. పాఠశాలల సందర్శన, విద్యావేత్తలతో సమావేశాలు ఏర్పాటు చేస్తుంది. పోటీల్లో గెలిచిన వారికి చైనాలో చదువుకునేందుకు ఉపకార వేతనాలనూ మంజూరు చేస్తుంది.
* ప్రస్తుతం 2500 విదేశీ విశ్వవిద్యాలయాల్లో చైనీస్ కోర్సులు కొనసాగుతున్నాయి.
చైనీస్ రాయబార కార్యాలయాల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా మాండరిన్ పాఠశాలలను నిర్వహిస్తారు. (మన దేశంలో కోల్‌కతా, వెల్లూరుల్లో ఉన్నాయి) 9 - 12 తరగతుల పిల్లలకు వీటిలో భాషా బోధన చేస్తారు. మొత్తం విద్యార్థుల సంఖ్యలో పది శాతం మందికి (పేద పిల్లలకు) 90 శాతం రుసుం మినహాయింపు ఇస్తారు. మన పాఠశాలల్లో ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తి 1:40 అయితే, ఈ పాఠశాలల్లో 1:15.
ఎందుకంత మోజు?
ప్రస్తుతం చైనా ఆర్థిక వ్యవస్థ వేగంగా ఎదుగుతోంది. దాంతో ప్రపంచ దేశాలతో దానికి వాణిజ్య సంబంధాలు పెరుగుతున్నాయి. వీటికోసం విదేశీయులు చైనాలో పర్యటించడం, చైనీయులు విదేశాలకు రావడం రోజురోజుకూ వృద్ధి చెందుతోంది. ఫలితంగా దుబాసీల అవసరం పెరుగుతోంది. చైనా దుబాసీకి రోజుకు రూ.3 వేల నుంచి రూ.6 వేల ఆదాయం లభిస్తోంది. విదేశీయుల్లో చాలా మంది మాండరిన్ నేర్చుకోవడానికి ఇదో కారణం. వ్యాపార విస్తరణకు ఐటీ సంస్థలు కూడా తమ ఉన్నతోద్యోగులను మాండరిన్‌ను నేర్చుకోమని ప్రోత్సహిస్తున్నాయి.
వచ్చే నాలుగేళ్లలో లక్ష మంది తమ విద్యార్థులను చైనాకు పంపాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సంస్థ సంచాలకులు కరోలా మెక్గిఫెర్డ్ ఏమంటారంటే... ‘ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలు, వృత్తులతో సంబంధం లేకుండా మాకు అన్ని స్థాయుల్లో మాండరిన్ మాట్లాడగలిగిన వారు పెద్ద సంఖ్యలో కావాలి’.
ఒక భాషా ప్రాంతం ఆర్థికాభివృద్ధి సాధిస్తుంటే... ఆ భాషను నేర్చుకోవడానికి ఇతర భాషీయులు ఎంతగా తహతహ లాడతారనడానికి ఇదే నిదర్శనం.
2020 నాటికి చైనా భాషను నేర్చుకునే వారి సంఖ్యను పది కోట్లకు పెంచాలన్నది చైనా ప్రభుత్వ లక్ష్యం. ఇందుకు ప్రపంచవ్యాప్తంగా 1000 ‘కసం’ల ఏర్పాటుకు ప్రణాళికలు రచిస్తోంది.
‘అమెరికా ఆర్థిక శక్తి కారణంగానే ఆంగ్లం విశ్వభాష అయింద’న్నది ప్రముఖ భాషావేత్త డేవిడ్ క్రిస్టల్ నిశ్చితాభిప్రాయం. భవిష్యత్తులో చైనా అమెరికాను మించిన ఆర్థిక శక్తిగా అవతరిస్తే... మాండరిన్ విశ్వభాష అవుతుందా! అవ్వాలన్నదే చైనా పాలకుల అంతిమ లక్ష్యం.
భాషా బోధనలో మేటి
ఇప్పటి వరకూ 176 దేశాలకు చెందిన లక్షన్నర మంది విద్యార్థులకు మాండరిన్ నేర్పింది బీజింగ్ భాషా విశ్వవిద్యాలయం. విదేశీయులకు మాండరిన్ బోధన లక్ష్యంగా ఇది 1962లో ఏర్పాటైంది. ఇందులో 829 మంది ఆచార్యులు, 13 వేల మంది విద్యార్థులున్నారు. సొంత ప్రచురణ సంస్థ ఉన్న ఈ విశ్వవిద్యాలయం నాలుగు జర్నళ్లనూ ప్రచురిస్తోంది. భాషా పరిశోధన సంస్థ, భాషా సమాచార విశ్లేషణ సంస్థ వంటివి దీనికి అనుబంధంగా పని చేస్తున్నాయి.
మన దేశంలో...
‘భారత్‌లో చైనీస్ భాషను వ్యాప్తిలోకి తేవడానికి 20 ఏళ్లకు పైగా పడుతుంది. మేం సహనంతో, ఆత్మవిశ్వాసంతో ఈ రెండు దశాబ్దాల పాటు కష్టపడతాం’... హన్బన్ డైరెక్టర్ జనరల్ జు లిన్ వ్యాఖ్య ఇది. మన దేశంలో... ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం, తమిళనాడులోని విట్స్లలో పైలెట్ ప్రాజెక్టులుగా ‘కసం’లు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ సీఫెల్, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం, రామకృష్ణ మిషన్, భారతీయ విద్యాభవన్ తదితరాల్లో మాండరిన్‌ను బోధిస్తున్నారు. సీబీఎస్ఈ పాఠశాలల్లోనూ మాండరిన్‌ను బోధించాలని నిర్ణయించారు. దీని కోసం చైనా నుంచి బోధకులను ప్రభుత్వం ఆహ్వానించింది. మన ప్రభుత్వ విధానాల వల్ల ఇక్కడ ‘కసం’లు పెద్దగా ఏర్పాటు కాలేదు.
తేలికైన పదసృష్టి
చైనీయులు అలవోకగా కొత్త పదాలను కనిపెట్టేస్తున్నారు. ఉదాహరణకు: సెల్‌ఫోన్‌ను ‘షౌజీ’ అంటారు. ‘షౌ’ అంటే చెయ్యి, ‘జీ’ అంటే యంత్రం. సెల్‌ఫోన్‌ను ‘హ్యాండ్సెట్’ అనీ అంటాo కదా. అందులోంచే ‘షౌజీ’ని పుట్టించారు!
స్వచ్ఛతే ముఖ్యం
పత్రికలు, పుస్తకాలు తదితరాల్లో ఆంగ్ల వాడకాన్ని నిషేధిస్తూ రెండేళ్ల క్రితం చైనా ఉత్తర్వులిచ్చింది. టీవీ యాంకర్లు కూడా ఆంగ్ల పదాలను ఉచ్చరించకూడదని చెప్పింది. . ప్రస్తుతం చైనాలో 3 లక్షల మంది విదేశీ విద్యార్థులు చదువు కుంటున్నారు. మాండరిన్ సామర్థ్యాన్ని పరీక్షించే ‘హెచ్ఎస్కే’లో (టోఫెల్ లాంటిది) ప్రతిభ చూపిన వారికే తమ దేశంలో చదువుకునే అవకాశాన్ని కల్పిస్తుంది చైనా. (వైద్య, వ్యాపార విద్యల్లో మినహా). ప్రస్తుతం చైనాలో చదువుతున్న విద్యార్థుల్లో వేలాదిమందికి ప్రభుత్వ ఆర్థిక మద్దతు అందుతోంది. వీరికి కళాశాల రుసుం నుంచి వసతి ఖర్చు దాకా అన్నీ మినహాయిస్తారు. నెలవారీ ఖర్చుల కింద రూ.14 - 20 వేల వరకూ ఇస్తారు. కాకపోతే వారు తప్పనిసరిగా ఏడాది పాటు మాండరిన్ తరగతులకు హాజరవ్వాలి. భాష నేర్చుకోవాలి.
పొత్తాలకు ప్రాధాన్యత
చైనీస్ పుస్తకాల అనువాదానికి చైనా ప్రభుత్వం సాయం చేస్తోంది. ఇటీవలే ఒకేసారి 100 పుస్తకాలను అనువదింపజేసింది. పుస్తకాల ప్రచురణకు ‘జాతీయ ప్రచురణ సంస్థ’ను ఏర్పాటు చేసింది. గత నాలుగేళ్లలో దీనికి రూ.1100 కోట్ల మేరకు నిధులు ఇచ్చింది. రచయితలకు అంశాలు చెప్పి పుస్తకాలు రాయించడం, విశ్వవిద్యాలయల్లో పరిశోధనల ఫలితాలతో గ్రంథాలను ముద్రించడం, చిన్న రచయితల మంచి పుస్తకాలు ప్రచురించడం దీని పని.
చైనా ప్రచురణ సంస్థల సమాఖ్య 2002లో ఏర్పాటైంది. 40 ప్రభుత్వ ప్రచురణ సంస్థలు, 96 అనుబంధ సంస్థల సంఘం ఇది. ఇది ఏడాదికి 10 వేల కొత్త ప్రచురణలు తెస్తోంది. ఇలా దాదాపు 2 కోట్ల ఉత్పత్తులు పాఠకులకు చేరుతున్నాయి. ఈ సమాఖ్యకు రూ.7654 కోట్ల విలువైన ఆస్తులున్నాయి. ఏడాదికి రూ.4681 కోట్ల ఆదాయాన్నీ ఆర్జిస్తోంది.
ఇలా చేస్తున్నారు!
* కంప్యూటర్ - డియాన్నో (డియాన్ - విద్యుత్తు, నో - మెదడు)
* సాఫ్ట్వేర్ - రుయాన్జియాన్ (రుయాన్ - మెత్తని/ వంచగలిగే, జియాన్ - పదార్థం)
* యాంటీ వైరస్ సాఫ్ట్వేర్ - షాడురుయాన్జియాన్ (షా - చంపు, డు - విషం)
* బ్రౌజర్ - లియులానాక్వి (లియు - స్పష్టంగా, లాన్ - చూసి తెలుసుకునే, క్వి - పరికరం)
* ప్లగ్-ఇన్ - చాజియాన్ (చా - ఎక్కించు, జియాన్ - పదార్థం)
* గాడ్జెట్ - జియోవాన్యి (జియో - చిన్న, వాన్ - సంతోషించు, యి - భావన)
* క్రికెట్/ బేస్‌బాల్ బ్యాట్ - క్యూబ్యాంగ్ (క్యూ - బంతి, బ్యాంగ్ - కర్ర)
* రైలు - లైచే (లై - గీత, చే - వాహనం)
* వెబ్‌కెమెరా - షిజియాంగ్టౌ (షి - తీసుకునే, జియాంగ్ - చిత్రం, టౌ - తల)
* పోలీస్ - జింగ్వాంగ్ (జింగ్ - రక్షకుడు, వాంగ్ - ప్రాంతం)
* పోలీస్ స్టేషన్ - జింగ్చాషు (జింగ్ - రక్షకుడు, చా - విచారించే, షు - కార్యాలయం)
* బ్యాంకు - యిన్హాంగ్ (యిన్ - డబ్బు, హాంగ్ - ప్రయాణం)
* ఏటీఎం కార్డు - యిన్హాంగ్కా (యిన్ - డబ్బు, హాంగ్ - ప్రయాణం, కా - అట్ట)
* చెక్ - ఝిపియావో (ఝి - చెల్లించే, పియావో - కాగితం ముక్క)
* బ్రేక్‌ఫాస్ట్ - జ్యాకన్ (జ్యా - ఉదయం, కన్ - ఆహారం)
* * * *