భాషంటే మానవతా లక్షణం

  • 372 Views
  • 0Likes
  • Like
  • Article Share

ఈరోజును యునెస్కో పందొమ్మిదో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా జరుపుకుంటోంది. భాషల పరిరక్షణ, అభివృద్ధి పట్ల మా సంస్థకు ఉన్న నిబద్ధతను మరోసారి గుర్తుచేసుకోవడానికి ఇదో చక్కటి అవకాశం. భాష అంటే భావప్రకటనా మాధ్యమం మాత్రమే కాదు; అది మన మానవతా లక్షణం. మన విలువలు, మన నమ్మకాలు, మన అస్తిత్వం తదితరాలన్నింటినీ తనలో పొదుపుకున్నది భాష. దాని ద్వారానే మనం మన అనుభవాలను, సంప్రదాయాలను, విజ్ఞానాన్ని భావితరాలకు అందిస్తాం. భాషాపరమైన భిన్నత్వం అనేది మన ఊహలు, జీవిత విధానాలకు సంబంధించిన నిరాక్షేప సంపదను ప్రతిబింబిస్తుంది. మానవకోటికి చెందిన నిరాకార వారసత్వ సంపదలోని ఈ ముఖ్యభాగాన్ని పరిరక్షించుకోవడానికి, దాన్ని పునరుత్తేజింపజేయడానికి అనేక సంవత్సరాల నుంచి యునెస్కో చురుగ్గా పనిచేస్తోంది. భాషాపరమైన భిన్నత్వాన్ని కాపుగాస్తూ, బహుభాషా విద్యావిధానాలను ప్రోత్సహిస్తూ తనదైన పాత్ర పోషిస్తోంది. మాతృభాషల పట్ల మా ఈ నిబద్ధత కోట్లకొద్దీ యువమెదళ్లను దిద్దితీర్చుతోంది. తోటి మానవ సమాజంతో స్థానికంగా అనుసంధానమైన తర్వాతే అంతర్జాతీయ స్థాయిలో అనుసంధానమయ్యేలా ప్రేరణ కలిగిస్తోంది.
మాతృభాషలు, ప్రాదేశిక భాషలను అభివృద్ధి బాట పట్టించే భాషావిధానాలను యునెస్కో సమర్థిస్తోంది. ముఖ్యంగా బహుభాషా సమాజాలకు ఈ మద్దతును తప్పనిసరిగా అందిస్తోంది. ఈ భాషలను ప్రాథమిక విద్యలో ఉపయోగించాలని సిఫార్సు చేస్తోంది. ఎందుకంటే, చిన్నారులు తమ మాతృభాషల ద్వారానే అత్యుత్తమ స్థాయిలో విద్యానైపుణ్యాలను ఒడిసిపట్టుకోగలరు. అలాగే, అంతర్జాలం లాంటి ఉమ్మడి వేదికల మీద ఈ భాషల వినియోగాన్ని యునెస్కో ప్రోత్సహిస్తోంది. అంతర్జాలంలో బహుభాషా వినియోగం తప్పనిసరి కావాలి. భాషాభేదాలకు అతీతంగా ప్రజలందరూ అంతర్జాల వనరులను వినియోగించుకోగలగాలి, భావప్రసారాల వినిమయానికి ఆన్‌లైన్‌ సమూహాలను అభివృద్ధి చేసుకోగలగాలి. సుస్థిరాభివృద్ధికి సంబంధించి నేడు ఎదురవుతున్న ప్రధాన సవాళ్లలో ఇది ఒకటి. అంతేకాదు, ఐక్యరాజ్యసమితి 2030 అజెండాకు ఇది హృదయతుల్యమైంది.
ప్రతి రెండు వారాలకూ మన ప్రపంచ భాషల్లో ఒకటి అంతర్థానమైపోతోంది. ఆమేరకు మానవ చరిత్ర, సాంస్కృతిక వారసత్వ సంపద అంతరించిపోతోంది. బహుభాషావిధానాలను ప్రోత్సహించడం వల్ల ఈ నియోజిత వినాశనాన్ని అరికట్టవచ్చు. ‘‘ఎదుటి వ్యక్తి అర్థం చేసుకోగల భాషలో మాట్లాడితే విషయం అతని మెదడులోకి చేరుతుంది. అదే మనం అతని మాతృభాషలో చెబితే అది అతని హృదయాన్ని తాకుతుంది’’ అంటారు నెల్సన్‌ మండేలా. ప్రపంచ సజీవ సంపదలను ఇనుమడింపజేసే భాషావైవిధ్యాన్ని, బహుభాషీయతలకు సంబంధించి వివిధ విద్య, సాంస్కృతిక ఉపక్రమణాలకు చొరవ తీసుకోవడం ద్వారా ఈ అంతర్జాతీయ మాతృభాషాదినోత్సవాన్ని జరుపుకోవాలని సభ్యదేశాలకు యునెస్కో పిలుపునిస్తోంది.

 - ఆడ్రీ అజౌలి, యునెస్కో డైరెక్టర్‌ జనరల్‌

 


వెనక్కి ...

మీ అభిప్రాయం