సింహగిరి నరహరి నమో నమో దయానిధీ!

  • 895 Views
  • 3Likes
  • Like
  • Article Share

    దోరవేటి, (వి.చెన్నయ్య)

  • హైదరాబాదు
  • 9866251679
దోరవేటి, (వి.చెన్నయ్య)

తెలుగున తొలి వచన కావ్యకర్తయు, వచన సంకీర్తన వాఙ్మయమునకు మూలపురుషుడును, వైష్ణవభక్తాగ్రేసరుడు కృష్ణమాచార్యుడు.  - నిడుదవోలు వెంకటరావు

కృష్ణమాచార్యులతోనే గానయోగ్యమైన వైష్ణవ కవిత్వం తెలుగులో ప్రారంభమైంది. లభ్యమైన సింహగిరి వచనాల విశ్లేషణవల్ల ఎన్నో విశేషాలు తెలియవస్తాయి. కులభేదాలను పాటించక, ఒక మత విశ్వాసాలను నమ్మేవారంతా సమానులనే ఆశయం అమలుచేస్తూ తన పెళ్ళినాడే శూద్రునిలో దేవుని చూసి అతనికి తళియ వడ్డింపించి వెలి అయిన కృష్ణమాచార్యులు శ్లాఘనీయుడే! బంధువులకు వెలి అయినా ఇటువంటి ఉదారచరితులు వసుధైక కుటుంబసభ్యులై ఉన్నతాశయాలకు చేరువలోనే ఉంటారు.  - ఆరుద్ర

మతాన్ని ప్రాతిపదికగా చేసుకుని, భక్తిరస ప్రధానంగా తెలుగులో తొలి వచన రచన చేసిన భాగవతోత్తముడు కృష్ణమాచార్యుడు.
      మొదటి నుంచీ సంస్కృత సాహిత్యాన్ని ఆధారంగా చేసుకుంటూనే తెలుగు సాహిత్యం విస్తరిల్లింది. అయినా.. తొలి స్వతంత్ర పురాణ రచన చేసిన పాల్కురికి సోమనాథ కవీంద్రుడు దేశీ కవితా మార్గాన్ని అనుసరించి, ద్విపదకు కావ్య గౌరవాన్ని సంపాదించి, ఉదాహరణ కృతుల్లాంటి నూతన ప్రక్రియలకు ఆద్యుడైనాడు. నన్నయాదుల కాలం నుంచీ పద్యరచనే కవిత్వమని, సంస్కృత భాషాభూయిష్ఠమైన తెలుగే ఆదరణీయమన్న భావన వేళ్లూనుకునిపోయి ఉండింది. ఆనాటి కవులు వచన రచనను తమ తమ గ్రంథాల్లో అక్కడక్కడ ఉపయోగించినా, అచ్చంగా వచనంతో రచనలు వెలువరించే సాహసం చేసినవాళ్లు లేరు. ఆ ప్రయత్నం చేసిన మొట్టమొదటి కవి కృష్ణమాచార్యుడు.
      ‘చంపూ’ పద్ధతిలో విరచితమైన కావ్యాల్లో అవసరాన్ని, సందర్భాన్ని అనుసరించి, ఒకమాట మొదలుకుని పుటలకొద్దీ వచనం రాసిన కవులున్నారు. ఆ వచనానికి, కృష్ణమాచార్యుడు ఎన్నుకున్న వచన రచనకూ కొంత భేదం ఉంది. పూర్వపు/ కావ్యాల్లోని వచనాన్ని మధ్యమధ్యలో పద్యాల నడుమ సంబంధం పటిష్టం చేసేందుకు, కథన సౌలభ్యానికి, ఒక్కొక్కసారి ఛందోబంధనాలతో కట్టుబడక స్వేచ్ఛగా భావప్రకటన చేయడానికి, విస్తృత వర్ణనలకూ వాడుకున్న దాఖలాలున్నాయి. కానీ, ఆచార్యుల వచన రచనకు కొన్ని ప్రత్యేకతలున్నాయి. ఇది మతం ప్రాతిపదికన ఆవిర్భవించిన ప్రక్రియా విశేషంగా సుబోధకమవుతోంది. శ్రీమద్రామానుజులు వైష్ణవమతాన్ని సామాన్యులకు చేరువచేసిన సంఘసంస్కర్త; కులం కుడ్యాలను కూలదోసి, విష్ణుభక్తి సంపన్నులందరూ ఒకే కులమని చాటిన మహనీయుడు. (అయితే, ఈ ప్రయత్నంతో పాటు కన్నడ దేశంలో నివసించిన బసవేశ్వరుడు లింగధారులందరిదీ ఒకే మతమంటూ.. కులమతాల తెరలను చీల్చివేసిన విషయమూ మరువరానిది)
రామానుజాచార్యులు వైష్ణవ మతవ్యాప్తి కోసం సంస్కృతంలో వచన త్రయాన్ని వెలువరించినారు. అది ‘గద్యత్రయమ్‌’గా ప్రసిద్ధికెక్కింది. శ్రీరంగ గద్యమ్‌, శ్రీవైకుంఠ గద్యమ్‌, శరణాగతి గద్యమ్‌ అని వాటికి పేర్లు. ఇవి వైష్ణవ మతానుయాయులకు నిత్యపారాయణాలు. వీటి నుంచి ప్రేరేపితులైన కృష్ణమాచార్యులు తెలుగులో వచన రచనకు శ్రీకారం చుట్టినారని చెప్పవచ్చు. కన్నడంలో బసవేశ్వరుడు రచించిన వచనాలు, అక్కమహాదేవి చెప్పిన వచనాలూ అప్పటికే సుప్రసిద్ధాలైనా, వాటి ప్రభావం ఈయన మీద ఉందని చెప్పడానికి నిదర్శనాలు లేవు. కన్నడ వచనాల్లో ఆరంభ సంబోధన లేదు. కన్నడ దేశ భాషలతో ఆచార్యులకు సంబంధ బాంధవ్యాలున్న ఆధారాలూ కనిపించవు. ఒక కన్నడ వచనం పరిశీలిద్దాం- ‘‘వచనదల్లి నిమ్మ నామామృత తుంబి/ నయనదల్లి నిమ్మ మూరితి తుంబి/ కివియల్లి నిమ్మ కీరితి తుంబి/ మనదల్లి నిమ్మ నెనహు తుంబి/ నిమ్మ చరణ కమలదల్లి నాను తుంబి/ కూడల సంగమదేవా’’! మాటల్లో నీ నామామృతం నిండి ఉండాలి; కన్నుల్లో నీ మూర్తి నిండి ఉండాలి; చెవుల్లో నీ కీర్తి నిండి ఉండాలి; మనసులో నీ జ్ఞాపకాలు నిండి ఉండాలి; నీ చరణకమలాల దగ్గర నేను ఉండాలి ఓ కూడల సంగమదేవా! అని అర్థం. పదమూడో శతాబ్దిలో దక్షిణదేశంలో ప్రసిద్ధమైన ఈ వచనాలను కానీ, వీటి గురించి కానీ కృష్ణమాచార్యుడు ఒకవేళ విని ఉన్నా, వాటిని అనుసరించలేదన్న సంగతి తులనాత్మకంగా పరిశీలించినప్పుడు తెలుస్తుంది.
లభ్యమైనవి కొన్నే..
కృష్ణమాచార్యుల వచనాలు తెలుగు సాహిత్యంలో ప్రత్యేక స్థానాన్ని అలంకరించడానికి కొన్ని కారణాలున్నాయి. ఆయన నాలుగు లక్షల సంకీర్తనలు రచించినట్లు చెబుతున్నా, ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ 1980లో ప్రచురించిన ‘సింహగిరి వచనములు’ అనే గ్రంథంలో అరవై మాత్రమే ఉన్నాయి. అయితే, ఈ పుస్తకంలో వచనాలకు నిర్దేశించిన సంఖ్యల్లో 31, 32 పునరుక్తం అయినాయి. అంటే, 62 వచనాలు మాత్రమే లభ్యమయ్యాయన్న మాట. ఈ గ్రంథాన్ని మొట్టమొదట ఆంధ్ర రచయితల సంఘం ప్రచురించినా, సవివరమైన పీఠికతో డా।। ఎం.కులశేఖరరావు పరిష్కరించి తిరిగి ప్రకటించారు. ఈ వచనాలను పరిశీలించినప్పుడు కనిపించే ప్రత్యేకతలెన్నో!
      ప్రతి వచనం ‘దేవా!’ అనే సంబోధనతో ప్రారంభమవుతుంది. (పునరుక్తమైన 31వ సంఖ్య కింద ప్రారంభమైన వచనంలో మాత్రం విష్ణూ, ముకుందా, అనంతా... అనే అష్టోత్తర నామాలున్నాయి. ‘దేవా’ అనే సంబోధార్థకం పొరబాటున ముద్రితం కాలేదేమో!) చాలా వచనాల్లో చివర ‘అనాథపతీ, స్వామీ, సింహగిరి నరహరీ, నమోనమో దయానిధీ’ అన్న సంబోధన కనిపిస్తుంది. ఇది శతకాల్లో మకుటాన్ని పోలి ఉంది. అయితే కొన్నిచోట్ల ఇది యథాతథంగా లేదు. మధ్యలో కొన్ని అదనపు పదాలు చేరడమో, మారడమో గమనించవచ్చు. ‘సింహగిరి నరహరీ- దయానిధీ’ అనే మాటలు మాత్రం అన్ని వచనాల్లోనూ కనిపిస్తాయి. ఇక ఇవన్నీ మౌక్తికాలు. అంటే ఏ వచనానికి ఆ వచనం స్వతంత్ర ప్రతిపత్తిని కలిగి ఉంటుంది. ఈ వచనాల్లోని ఆరు, కృష్ణమాచార్యుల జీవిత విశేషాలను ప్రకటిస్తున్నా, అన్నీ స్తుతిబద్ధాలే.
సరళ తెలుగులో..
వస్తువును అనుసరించి ఆచార్యుల వచనాలు మతసిద్ధాంత ప్రాతిపదికలు, పురాణ సంబంధాలు, వేదాంత సంబంధాలు, నీతిబోధకాలు అనే నాలుగు అంశాలుగా స్పష్టమవుతాయి. శ్రీరామానుజాచార్యులు ప్రతిపాదించిన విష్ణుభక్తి, వర్ణాశ్రమ ధర్మ రాహిత్యం, ఆచార్యుల సేవానిరతి, భాగవత కైంకర్యం వీటిలో కనిపిస్తాయి. ఈ సింహగిరి వచనాల్లో భాష సరళం; శైలి సరళం. సామాన్యజనానికి భగవద్రామానుజుల మతసిద్ధాంతాలను చేరువ చేయడమే పరమలక్ష్యంగా విరచించిన ఈ వచనాలను అందరికీ అర్థమయ్యేలా తీర్చిదిద్దడం కృష్ణమాచార్యుల ప్రత్యేకత.
      వైష్ణవ మతపరమైన ప్రత్యేక పదాలను కృష్ణమాచార్యులు ఈ వచనాల్లో ప్రయోగించినారు. వీటిలోని ‘కువ్వారు’ అనే పదానికి ‘కుమారు’ అనే అర్థాన్ని డా।। కులశేఖరరావు ఊహించినారు. కృష్ణకువ్వారు అనేది యతీంద్రుల పేరులోని భాగంగా గ్రహించడం మంచిదేమో; ‘దాతారు’ అనేది ‘దాత’ అనే మాటకు సమానార్థకం; ‘ద్వారవాకిళ్లు’లో ద్వారం, వాకిలి అనే రెండూ సమానార్థకాలే అయినప్పటికీ వైష్ణవ మతానుయాయుల్లో ఈ ప్రయోగం పరంపరగా వస్తోంది; ‘తళియ ప్రసాదం’ అంటే భోజనం. ‘కంచంలో భుజించడం’ అనే సామాన్యార్థం. ఇక ‘అడియని/ అడియేని’ అనే మాట తమిళ సంప్రదాయం నుంచి వచ్చింది. ఈ పదానికి ‘పాదసేవకుడు’ అని అర్థం. ‘తిరువడిగళ్లు’ అంటే ‘పవిత్రమైన పాదాలు’. ‘తొండడు’ అనే పదానికి ‘వైష్ణవదాసుల పాదధూళి భక్తుడు’ అని అర్థం చెప్పుకోవచ్చు. ‘పసిరిక’ అనే మాటకు పచ్చని పురుగు అనే అర్థం (విశ్వనాథ వేయిపడగల్లో ఒక పాత్రకు ఈ పేరుంది. పచ్చని పామును కూడా ఈ పేరుతో వ్యవహరించడం తెలిసిందే). ‘మోదాటు’కు ‘మృగ్యం/ శూన్యం’ అనే అర్థమున్నా, వచనాల్లో దాన్ని ‘ముక్తి’కి పర్యాయంగా ఉపయోగించారు కృష్ణమాచార్యులు. ‘అఘాయిత్యం’ అనేదానికి ‘సాహసకృత్యం’ అని వ్యవహారం. తలకుమించిన పని అనే అర్థంలో ఇందులో వాడారు.
      ఈ వచనాలకు నిడివి నియమం లేదు. ఒకటి కేవలం మూడు పంక్తుల్లో ముగిస్తే... మరొకటి ఇందుకు పూర్తి భిన్నంగా రమారమి 10 పుటల నిడివితో ఉంటుంది. ఇలా అనేక విశిష్టతలను సంతరించుకున్న కృష్ణమాచార్యుల ‘సింహగిరి వచనాలు’ తెలుగు సాహితీజగత్తులో తొలి వచనాలై అలరారుతున్నాయి.
ఆదిలోనే ఫలశ్రుతి
‘‘దేవా, ఇంద్రాది దేవతలు (ధేనంబులు) నూఱును, హిరణ్య గర్భులిన్నూరును, కాశ్మీరగిరులు (కాస్మిన్న గిరులు) మున్నూఱును, తిలదాంచనగిరులు నన్నూఱును, పతివ్రత లేనూఱ్లును, అగ్రహారంబు లాఱునూర్లును, స్త్రీమూర్తు లేడు నూఱ్లును, మభయ (అభయ?) స్తోమకు లెనిమిది నూఱ్లును, హేమస్త్రీ గర్భంబులు తొమ్మిది నూఱ్లును, కపిలధేనువులు వేయిని, కాలచక్రంబులు లక్షయును, తులాపురుషంబులు కోటియును, కన్యకాదానంబులు పదికోట్లుయును, నివియన్నియుఁ గూడిన మీ దివ్యనామ సంకీర్తన వినినందులకు వేయిలో నొక్క భాగంబు (వేయిన్నొక్క భాగంబు)నకు సరిగావు.. సరిగావు. ఈ సంకీర్తన ఫలం బెవరు వ్రాసిరి, ఎవరు చదివిరి, ఎవరు వినిరి, వారి కారోగ్యైశ్వర్యంబులు కృప చేతువు. అటుమీదట నాకిచ్చిన వైకుంఠంబు కృప చేతువు. మా యతి రామానుజముని వరము దాతారు. అనాథపతీ, స్వామీ, సింహగిరి నరహరీ, నమోనమో దయానిధీ’’
      ‘సింహగిరి వచనాల్లో’ ఇది మొదటిది. సాధారణంగా కావ్యాంతాల్లో ఇలాంటి ‘ఫలశ్రుతి’ బోధాత్మక రచనలుండటం సహజం. కానీ, ప్రారంభంలోనే ఇలాంటి భావాన్ని ప్రకటించడం కృష్ణమాచార్యుల వచనాలకే ప్రత్యేకమైంది. వచన రచనను ప్రామాణికంగా ఆదరించని కాలంలో ఆవిర్భవించిన రచన ఇది. కాబట్టి ఈ గ్రంథపఠనావశ్యకతను ఆదిలోనే తెలియజేయడం సబబని ఆచార్యులు భావించి ఉండవచ్చు. ఇలాంటి వచనమే చివర కూడా ఉండేదేమో కానీ, లక్షలాది వచనాల్లో లభించినవి కొన్నే కాబట్టి రూఢిగా చెప్పలేం. ఏది ఏమైనా ఇంతటి ప్రత్యేకతలు కలిగిన రచనను అందించిన కృష్ణమాచార్యుల గురించి తెలుసుకోవడం కూడా ఎంతో అవసరం కదా!
పుట్టుకతో అంధుడు
ఆచార్యుల స్థలకాలాదుల విషయంలో స్పష్టతలేదు. అయినా పరిశోధక శిరోమణులైన డా।। ఎం.కులశేఖరరావు, డా।। వేటూరి ఆనందమూర్తి రచనలు, ప్రతాపచరిత్రం, వచనాల్లోని అంశాలను క్రోడీకరించుకొని చూస్తే ఈ కింది విషయం బోధపడుతుంది.
ప్రతాపరుద్రుని పరిపాలనా కాలం- 14వ శతాబ్దానికి చెందిన కవి కృష్ణమాచార్యుడు. పుట్టుక, తల్లిదండ్రులు, వంశం తదితర వివరాలు లేకపోవడం వల్ల ఆయన ఇంటిపేరు ఏంటో తెలియదు. సొంతపేరుతోనే ప్రఖ్యాతుడయ్యాడు. సంతూరు (ప్రస్తుతం దీన్ని సంతాపూర్‌ అనే పేరుతో వ్యవహరిస్తున్నారు. ఈ గ్రామం రంగారెడ్డి జిల్లా కేశంపేట్‌ మండలంలో ఉంది. అయితే శ్రీరామచంద్రాచార్య విపులపీఠికతో సింహాచలం దేవస్థానం ప్రచురించిన ‘సింహగిరి వచనములు’ గ్రంథంలో ‘‘సింహాచలానికి రమారమి 25 మైళ్ల దూరంలో ‘సంతలూరు’ అనే ఊరుంది. ఇది ‘సంతూరు’ కావచ్చునేమో పరిశోధించాలి’’ అని పేర్కొన్నారు) అనే ఊరిలో ఓ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ఈ కవి పుట్టుకతో అంధుడు. వ్యతీపాతయోగం, దుష్టనక్షత్రంలో పుట్టిన కారణంగా తల్లిదండ్రులు ఈ బాలుణ్ని శిశువుగా ఉన్నప్పుడే ఒక పాడుబడ్డ బావిలో పారేశారు. కువ్వారు అనే యతీంద్రుడు ఇతన్ని కాపాడి, కృష్ణమాచార్యుడని నామకరణం చేసి ఒక మఠంలో పెంచాడు. తర్వాత సింహాచలానికి చేర్చినాడు. సింహాచల నారసింహుడి తీర్థమైన క్షీరాన్ని తాగి, కండ్లకు అద్దుకోవడం వల్ల అతనికి చూపు వచ్చింది. నారసింహుడి కృప నిండుగా వడిసిన కృష్ణమాచార్యుడు తన నిండు జీవితాన్ని ఆ దేవదేవునికే అంకితం చేశాడు. నరసింహస్వామి తన పేర నాలుగు లక్షల వాక్ప్రసూనాలను అర్పించమని, అందుకు అవసరమైన జ్ఞాన చక్షువులను కూడా ప్రసాదించినాడు. కృష్ణమాచార్యుడు తన 17వ ఏట ఆషాఢ శుద్ధ ద్వాదశినాడు దండెం, చిటితాళాలు పూని వచనాలు చెప్పడం ఆరంభించినాడు.
ఆ తామ్రపత్రాలు ఏమయ్యాయో!
ఆనోటా ఈనోటా కృష్ణమాచార్యుల గురించి విని, అతన్ని చేరుకుని, ఆనందపరవశులైనారు తల్లిదండ్రులు. మేనమామ శ్రీరంగాచార్యులు తన కూతురునిచ్చి వివాహం జరిపించినాడు. ఆ వివాహ సమయంలో సింహగిరి నరసింహస్వామి ఒక శూద్రుడి రూపంలో వస్తే, కృష్ణమాచార్యుడు తళియ వడ్డించాడు. అది చూసిన రంగాచార్యులు ఆక్షేపించి, అందుకు శాస్తిగా అల్లుణ్ని వెలివేసినాడు. అందుకు కృష్ణమాచార్యుడు ఏమాత్రం చలించకుండా భార్యాసమేతంగా గ్రామాంతర్గతుడైనాడు.  తర్వాత ఆ దంపతులకు ఓ కుమారుడు పుట్టి చనిపోయినాడు. కృష్ణమాచార్యుడిలో భక్తి క్రమంగా అంతరించి, శృంగార రక్తి హెచ్చింది. సింహగిరిలోనే మోహనాంగి అనే వారకాంత వలలో పడి వైష్ణవ మత విధానానికి దూరమైనాడు. ఈ సందర్భంలో కృష్ణమాచార్యుల వైష్ణవ నిరతిని, వచనగాన విఖ్యాతిని గురించి తెలిసి, అతణ్ని విష్ణుమూర్తి పదకొండో అవతారంగా భావించి వెతుక్కుంటూ వచ్చినారు పొతకనూరి భాగవతోత్తములు. వారు భక్తి పారవశ్యంతో ఆడిపాడుతూ పటము పన్నించగల ప్రతిభావంతులు. అంతటివారి ముందు అల్పుడుగా గుర్తింపు పొందడం ఇష్టంలేక, కృష్ణమాచార్యులు వాళ్లకు తిరుమాళిగ దారి చూపించి, తాను క్షురకర్మలు పూర్తి చేసుకుని, మరొక దారిగుండా వెళ్లి దర్శనమిచ్చినాడు. అయినా, వాళ్లు ఆయన్ను గుర్తించారు. మొదట తెలియక తననే వివరాలడిగిన సంగతిని గుర్తుచేసుకుని క్షమించమని వేడుకున్నారు. ఆచార్యులు కూడా తన తప్పిదాన్ని మన్నించమని ప్రార్థించినాడు.
పటము పన్నించి భాగవతులు ఆడిపాడగా, కృష్ణమాచార్యుడూ తన వచన గానంతో సమ్మోహన పరచినాడు. ఆ గానామృతపానం కోసం నరహరి బాలుని వేషంలో అక్కడికి వచ్చాడు. ఆ విషయాన్ని తర్వాత గ్రహించిన భాగవతులు అద్భుతానందాశ్చర్యాలకులోనై భగవంతుడి లీలను, ఆచార్యుల భక్తి గరిమను వేనోళ్ల చాటినారు. అప్పటి నుంచి మిగిలిన లక్షాయాభై వేల వచనాలను పూరించే కార్యక్రమంలో నిమగ్నమైనాడు కృష్ణమాచార్యులు. తర్వాత సంతూరులో ఉన్నకాలంలో ఈయన చూపిన మహిమలు ప్రతాపరుద్ర మహారాజుకు తెలిశాయి. దాంతో ఆచార్యులను పిలిపించి, పూజించి, యాభై ఊళ్ల అధికారంతోపాటు ఒక అగ్రహారం కూడా ఇచ్చినాడు. కృష్ణమాచార్యులు మూడు సంవత్సరాల తర్వాత ఆ రాబడితో తామ్రపత్రాలు తెప్పించి వాటి మీద నాలుగు లక్షల వచనాలు రాయించి, శ్రీరంగానికి తీసుకునిపోయినాడు. తర్వాత కథ పరిశోధకులకు అందలేదు.
మొత్తం మీద శ్రీరామానుజుల మతవ్యాప్తి కోసం, ప్రజానురంజకమైన వచన రచనను సరళ భాషలో మొట్టమొదటగా అందించిన సాహితీమూర్తి కృష్ణమాచార్యుడు. ఈయన జన్మస్థలం విషయంలో సందేహాలుండవచ్చుగానీ, సాహితీ సృజన విషయంలో భేదాభిప్రాయాలు లేవు. పైపెచ్చు ఆ కాలంలో కనిపించిన శైవ వైష్ణవ మత విద్వేషాలను సింహగిరి వచనాల్లో కృష్ణమాచార్యులు ఎక్కడా పొడసూపనీయకపోవడం ఆయన పరిణతికి అద్దంపడుతోంది.కృష్ణమాచార్యుల వచనాలు తర్వాతి కాలపు కవులను... ముఖ్యంగా వైష్ణవ భక్తి తత్వాన్ని ప్రబోధించిన వారిని ప్రభావితం చేశాయి. తెలుస్తున్నంత వరకు సింహగిరి వచనాలతో ప్రభావితమైన మొదటి కవి బమ్మెర పోతన. కృష్ణమాచార్యులు ఓరుగంటికి వచ్చి, కాకతీయ ప్రతాపరుద్రుడి ఆస్థానాన్ని సందర్శించినట్లు ‘ప్రతాపచరిత్ర’ నుంచి తెలుస్తోంది. ఇక్కడ ఆయన తన మహిమను చూపినట్లు కూడా ఇందులోనే ఉంది. అలా స్థానిక ప్రజల నోళ్లలో కృష్ణమాచార్యుల జీవితం, వచనాలు నానుతూ ఉండి ఉంటాయి. ఆచార్యులకు కొంచెం తర్వాతి కాలపువాడైన పోతనది ఓరుగల్లుకు సమీపంలోని బమ్మెర గ్రామమే. కనుక ఈయనకూ వచనాల పరిచయం ఉండి ఉంటుంది.


తెలుగు వేద‌క‌ర్త‌
కృష్ణమాచార్యుల వచనాలు ‘‘దేవా!’’ అని మొదలవుతాయి. అలాగే పోతన భాగవతం దశమ స్కంధం వచన భాగంలో కూడా ఎన్నోమార్లు  మాటలు ‘‘దేవా!’’ అన్న సంబోధనతోనే మొదలవుతాయి. 
ఆచార్యుల వచనాల్లానే దేవుడికి నమస్సులతో అంతమవుతాయి.
ఆ తర్వాత కాలంలో తాళ్లపాక చిన్నన్న ‘పరమయోగి విలాసం’లో ‘‘శఠ(త)మత రాద్ధాంత సంహారియైన/ శఠకోప మునిబోలు శఠకోపమౌని/ వేదంబు తెనుగు గావించి, సంసార/ ఖేదంబు మాన్చిన కృష్ణమాచార్యు’’ అని కీర్తించాడు. ఇక అన్నమయ్య కీర్తనల్లో కొన్ని సింహగిరి వచనాల మార్గంలో నడుస్తాయి ‘‘శ్రీవైష్ణవులే పరమసాధకులు, శ్రీవైష్ణవులే బ్రాహ్మణులు, హరిభక్తి లేని విద్వాంసు కంటెను, హరికీర్తన సేయునతడు కులజుండు, శ్వపచుండైన నేమి ఏ వర్ణంబైన నేమి, ద్విజునికంటే నాతడు కులజుండు’’ అన్నది కృష్ణమాచార్యుల వచనం. దీని ప్రభావం ‘‘ఏ కులజుడైన నేమి యెవ్వడైన నేమి/ ఆ కడనాతడే హరినెరిగిన వాడు’’, ‘‘మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమియొక్కటె/ చండాలుడుండేటి సరి భూమి యొక్కటె’’, ‘‘అణురేణు పరిపూర్ణుడైన శ్రీవల్లభుని/ ప్రణుతింతు వారువో బ్రాహ్మణులు’’ లాంటి అన్నమయ్య కీర్తనల్లో ద్యోతకమ వుతుంది. మరో వచనంలోని ‘‘దేవా మీరు శబరి యెంగిలి దిన్నది చెప్పుదునా’’కు సమానంగా ‘‘... నీవు బోయదాని యెంగిలి దిన్నది చెప్పుదునా’’ అంటాడు అన్నమయ్య. సంకీర్తనలతో పాటు వచనాలూ రాసిన పెద తిరుమలయ్య మీదా కృష్ణమాచార్యుల ప్రభావం ఉంది. తిరు వెంగళనాథుడు కృష్ణమాచార్యులను ‘తెలుగు వేదకర్త’గా పేర్కొన్నాడు. దీనికి నిదర్శనంగా చిన్నన్న తన ‘అష్టమహిషీ కల్యాణం’లో కృష్ణమాచార్యులు, అన్న మయ్య, పెద తిరుమలయ్యలను ‘ఆంధ్ర వేదాంతకర్తలు, పంచమాగమ సార్వ భౌములు, పంచమాగమ చక్రవర్తులు’గా పేర్కొన్నాడు. కృష్ణమాచార్యులను విష్ణు మూర్తి పదకొండో అవతారంగా చెబు తారు. అన్నమయ్యనూ ‘‘హరి యవతార మీతడన్నమయ్య’’ అని కీర్తించారు. చిన తిరుమలయ్య తన ‘సంకీర్తన లక్షణం’లో కృష్ణమాచార్యులను పదకర్తగా ప్రశంసిం చాడు. అయితే ఆ తర్వాతి కవుల్లో ‘వేంకటాచల విహార’ శతక కర్త మినహా మిగిలిన వారెవ్వరూ కృష్ణమాచార్యుల గురించి పేర్కొనలేదు.  

- హర్ష


 


వెనక్కి ...

మీ అభిప్రాయం