సినిమాలకు బాటలు తోలుబొమ్మలాటలు

  • 1476 Views
  • 3Likes
  • Like
  • Article Share

    కె.నిర్మల

  • హైదరాబాదు
  • 7893042878

మట్టి మనుషుల మనోఫలకాలపై ముద్రితమైన పురాణ పాత్రలకు తొలిసారి ఆకారాన్నిచ్చి తెరపైకి తెచ్చిన ఘనతకు హక్కుదారు... లలిత కళల సమ్మేళనంగా విరాజిల్లి ఆబాలగోపాలానికి అంతులేని వినోదాన్ని అందించిన చరితకు సొంతదారు... తోలుబొమ్మలాట. నేటి చలనచిత్రాలకు అదే తాత!
ముదం దీపం... తెల్లటి పంచె... ఈ రెండింటి మధ్యలో రంగు రంగుల తోలు బొమ్మలు! పైన ఆడిస్తూ సూత్రధారి. అతనికి వంతపాడటానికి సావాసగాళ్లు. పక్క దరువేయడానికి వాద్యగాళ్లు. రామ - రావణ యుద్ధమో, భీమ - కీచక కదనమో ఏదైతేనేం.... సన్నటి చినుకులా కథ మొదలవుతుంది. దానికనుగుణంగా తెరపై బొమ్మలు కదలుతాయి, ఆడతాయి, పాడతాయి, పోరాడతాయి. మధ్యమధ్యలో సమాజంలోని చీడలపై చెణుకులూ విసురుతాయి. క్రమంగా చినుకు సంద్రమవుతుంది. సూత్రధారి గళం గట్టు తెగిన గోదారవుతుంది. కథ రసపట్టుకు చేరుకునే కొద్దీ ప్రేక్షకుల మునివేళ్లపై భారం పెరుగుతుంది. పతాకస్థాయికి చేరిన బొమ్మలాటకు కథానాయకుడి విజయంతో తెర పడుతుంది. చప్పట్లు, ఈలలతో దిక్కులు మార్మోగుతాయి. సూత్రధారి బృందంపై కానుకల వర్షం కురుస్తుంది. తర్వాత రోజు సాయంత్రం పక్క ఊళ్లో ఆముదం దీపం వెలుగుతుంది!
      తెరపై బొమ్మలను ఆడించి, వినోదాన్ని పుట్టించడం నేర్చుకున్న మనిషి తెలివికి తొలి తార్కాణం తోలుబొమ్మలాట. పుస్తకాలకు పరిమితమైన కథలకు దృశ్యరూపమిచ్చి జనం ముందుకు తెచ్చిన అలనాటి సాంకేతికత అది. పాల్కురికి సోమనాథుడి పండితారాధ్యచరిత్ర (భారతాది కథల జీరమఱుగుల - నారంగ బొమ్మల నాడించు వారు), నాచన సోముని ఉత్తర హరివంశం (యంత్రకు డాడించి యవని ద్రోచిన వ్రాలు/ బొమ్మల గతి రథపూగములను), శ్రీనాథుడి పల్నాటి వీర చరిత్ర (ప్రతిమ లాడగ బట్టిన యట్లు), భాస్కర శతకం (ఇంచుక నేర్పు చాలక విహినత జెందిన నాకవిత్వమున్‌/ మించు వహించె నీకతన మిక్కిలి; యెట్లన తోలుబొమ్మలన్‌...) తదితరాల్లో బొమ్మలాట ప్రస్తావనలు కనిపిస్తాయి. సూత్రధారి బోమలయకు భూదానమిచ్చినట్లు క్రీ.శ.1208 నాటి ముక్కామల శాసనం చెబుతోంది. అలాగే, కాకతీయుల కాలం నాటి గూడూరు (వరంగల్‌ జిల్లా) శాసనం కూడా తోలుబొమ్మలాట సమాచారాన్ని తెలియజేసింది. వీటన్నిటినీ బట్టి చూస్తే వందల ఏళ్ల కిందటే తెలుగు నేలపై తోలు బొమ్మల ప్రభలు విరాజిల్లినట్లు అర్థమవుతుంది. 
      తెలుగు ప్రాంతాల్లోని తోలుబొమ్మల కళాకారుల పూర్వీకులు మహారాష్ట్ర నుంచి వలస వచ్చినట్లు తెలుస్తోంది. కానీ, వారందరూ తెలుగు సంస్కృతిలో భాగమయ్యారు. భారత రామాయణ గాథలు, లంకాదహనం, మైరావణ చరిత్ర, ఇంద్రజిత్తు వధ, యయాతి కథ, కీచక వధ, దుశ్శాసన కథ, ప్రహ్లాద చరిత్ర, రంగనాథ రామాయణం, దేశింగు రాజు కథ, పల్నాటి వీరచరిత్ర, కుమార రాముని కథలను అచ్చ తెలుగులో ప్రదర్శిస్తూ తెలుగు వారికి దగ్గరయ్యారు. యక్షగాన సాహిత్యాన్ని ఆధారంగా చేసుకుని బొమ్మలనాడిస్తూ జనానికి ఆనందం కలిగించారు. స్వాతంత్రోద్యమ కాలంలో దేశభక్తిని రగిలించే కథలనూ ప్రదర్శించారు. కుటుంబ నియంత్రణ నుంచి అనేకానేక సామాజిక అంశాలపై ప్రజల్లో అవగాహన పెంచడానికి బొమ్మలను ఆడించారు. విశాఖపట్నం, గోదావరి, నెల్లూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఒకప్పుడు ఈ కళాకారులు ఎక్కువ సంఖ్యలో ఉండే వారు. ఊరూరా తిరుగుతూ ప్రదర్శనలిచ్చే వారు. 
      తోలుతో తయారు చేసిన బొమ్మలకు దారాలు కట్టి, తాము ప్రదర్శించే సన్నివేశాలకు అనుగుణంగా ఆ బొమ్మలను కదిలించడమే తోలుబొమ్మలాట. ఈ బొమ్మలను జింక, మేక, గొర్రె చర్మాలతో తయారు చేస్తారు. శిష్ట పాత్రల బొమ్మలకు జింక చర్మాన్ని, దుష్ట పాత్రల చిత్రణకు మేక, గొర్రె చర్మాలను వినియోగిస్తారు. తోళ్లను శుభ్రపరిచి, ఎండబెట్టి పారదర్శకంగా మలుస్తారు. తర్వాత వాటిపై పాత్రలకనుగుణంగా బొమ్మలు చిత్రీకరిస్తారు. పిదప వాటిని కత్తిరించి ఒక ఆకారంలోకి తెస్తారు. పాత్రల స్వభావాలకు అనుగుణంగా సహజ రంగులతో బొమ్మలను అందంగా తీర్చిదిద్దుతారు. ప్రదర్శన సమయంలో సూత్రధారి కథ చెబుతూ బొమ్మలను ఆడిస్తాడు. సమయానుగుణంగా పద్యాలూ పాడతాడు. అతనికి వంతపాడటానికి పక్కన కొందరుంటారు. (సూత్రధారి కుటుంబ సభ్యులే). అలాగే, తెర మీది పాత్రలకు తెర వెనక నుంచి సంభాషణలు చెబుతుంటారు. కథలోని నవరసాలనూ తమ గళాల్లో అలవోకగా పలికిస్తారు వారు. సంగీతం కోసం తప్పెట తాళాలు, మద్దెల, హార్మోనియం వాయిస్తారు మరికొందరు. యుద్ధ సన్నివేశాల్లో ధ్వనుల కోసం గాత్రధారులు చెక్కలను తొక్కుతుంటారు. ఖాళీ డబ్బాలను కొడుతుంటారు. ఉరుముల మెరుపుల శబ్దాల నుంచి గుర్రపు డెక్కల చప్పుడు వరకూ అన్నింటినీ క్షణాల్లో సృష్టిస్తారు. అందుకే అంటారు... తోలుబొమ్మలాటలో లలిత కళలున్నాయి, నాటక, చలనచిత్ర సరంజామా ఉంది అని.
      తోలు బొమ్మలాటను ప్రదర్శించే వారికి సంగీతం, చిత్రలేఖనంతో బాగా పరిచయముండాలి. ముఖ్యంగా సూత్రధారి గొంతు స్పష్టంగానూ, ఉచ్చారణ గంభీరంగానూ, కఠినంగానూ, మృదువుగానూ బొమ్మలను నడిపే తీరును బట్టి, కథను బట్టీ మారుతూండాలి. బొమ్మలను తెర మీదకు ఎక్కించడంలోనూ, వాటిని కదిలించడంలోనూ, బొమ్మలను ఆ కథకు అనుగుణంగా మార్చడంలోనూ ప్రత్యేక శ్రద్ధ, శిక్షణ అవసరం. కళాకారులు అంతటి మెలకువ, నేర్పు, సామర్థ్యం ప్రదర్శిస్తారు కాబట్టే తోలుబొమ్మలాట ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. కాలక్రమంలో ఆముదం దీపాల స్థానంలో పెట్రోమాక్స్‌ దీపాలు, తర్వాత విద్యుద్దీపాలు వచ్చి చేరాయి. 


మేటి ‘ఆటగాళ్లు’
చెన్నైలోని కేంద్ర తోళ్ల పరిశోధన సంస్థలో ఆచార్యులుగా పని చేసిన ఎం.వి.రమణమూర్తి (స్వస్థలం కాకినాడ) తోలుబొమ్మలాటకు ఆధునిక సొబగులు అద్దడానికి ఎనలేని కృషి చేశారు. జాతీయ నాయకులు, విదేశీ రాయబారుల సమక్షంలో ప్రదర్శనలిచ్చారు. పంచతంత్ర కథలను తోలుబొమ్మలాటలోకి తెచ్చారు. నెల్లూరు జిల్లా ధర్మారావు చెరువుపల్లికి చెందిన కుమార రాజారావు బృందం దేశ విదేశాల్లో ప్రదర్శనలిచ్చింది. అనంతపురం జిల్లా నిమ్మలకుంటకు (తోలుబొమ్మల తయారీలో ఈ ఊరు రాష్ట్రవ్యాప్తంగా ప్రసిద్ధం) చెందిన నిమ్మల గోవిందు సూత్రధారిగా మంచి పేరు తెచ్చుకున్నారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన అనపర్తి చిన్నకృష్ణ, తోట పవన్‌కుమార్‌, రంగారావు, వెంకటరావు, బాలకృష్ణ, ధవనేశ్వరరావు, త్రినాథ్‌, నాగభూషణం, సింహాచలం మావుళ్లు తదితరులందరూ తోలుబొమ్మలతో ప్రేక్షకులను మదిని రంజింపజేయగల సమర్థులు. ఈ కళాకారుల సేవలను ‘జానపద కళా రూపాలు’లో మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి అక్షరీకరించారు.


      ప్రదర్శనలో మొట్టమొదటగా విఘ్నేశ్వర పూజను తోడిరాగంలో ఆరంభిస్తారు. రామాయణం, భారతం, భాగవతంలోని ముఖ్య ఘట్టాలను తెరకెక్కిస్తారు. పాత్రల స్వభావాన్ని బట్టి నవరసాలనూ కంఠాల్లో పలికిస్తూ ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తారు. ప్రదర్శన మధ్యమధ్యలో జుట్టుపోలిగాడు, కేతిగాడు, బంగారక్క పాత్రల ద్వారా హాస్యాన్ని రంగరిస్తారు. సంఘంలోని దురాచారాలపై చెణుకులు విసరడానికి ఈ పాత్రలను ఉపయోగించుకుంటారు. ప్రస్తుతం బొమ్మలాటలు తగ్గిపోయినా ఈ పాత్రల పేర్లను మాత్రం తెలుగు వారు మర్చిపోలేదు. 
      పండిత పామర భేదం లేకుండా అందరినీ అలరించిన తోలు బొమ్మలు ఇప్పుడు అటక మీదకు చేరాయి. నాటకాలు, చలనచిత్రాలు ప్రాచుర్యంలోకి వచ్చాక తోలుబొమ్మలాట వేగంగా కనుమరుగైంది. ఇప్పుడు ఎక్కడో ఏ కొద్ది మందో ఈ కళను ప్రదర్శిస్తున్నారు. శతాబ్దాల వారసత్వాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. కానీ, వారి శక్తి సరిపోవట్లేదు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లోని కళాకారులు ఆర్థిక ఇబ్బందులతో భిక్షగాళ్లయ్యారు. దుర్భర దారిద్య్రంతో బాధపడుతున్న వారికి కనీసం రేషను కార్డులు కూడా లేవు. వృద్ధ కళాకారులకు పింఛన్లు ఇవ్వాలని, ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని వారు కోరుతున్నారు. సంక్షేమ పథకాల పేరిట వేల కోట్ల రూపాయలను వ్యయం చేసే పాలకులు.... మనదైన జానపద సంపదకు కాపలాదారులైన ఈ కళాకారులను ఆ మాత్రం ఆదుకోలేరా? 


వెనక్కి ...

మీ అభిప్రాయం